శబ్దం ఒక హృదయ విస్ఫోటనం. కొంత చెవులకే పరిమితం
కొంత ఇంద్రియాలను తాకుతుంది. కొంత మనసును కదిలిస్తుంది.
శబ్దం ఒక మౌన తపోభంగం. సంసార సాగరంలోకి ఆకర్షిస్తుంది.
అలల సవ్వడిలో కలిసిపోతుంది. నుదురు గట్టుతో కొట్టుకుంటుంది.
శబ్దం ఒక సంఘర్షణ రవం. శిఖరాలు దొర్లుకుంటూ పడిపోతాయి.
గులకరాళ్ళు ఎగసిపడతాయి. గాలి ఊపిరి బిగబట్టి నిలిచిపోతుంది.
శబ్దం ఒక ప్రకృతి సంవాదం. పచ్చనాకులు ముచ్చటాడుకుంటాయి.
పండుటాకులు తొడిమ ఊడి రాలిపడతాయి. చెట్టు మొద్దుబారి నిలబడిపోతుంది.
శబ్దం ఒక ఉదయరాగం. కోడై కూస్తుంది. పూవై పూస్తుంది.
పయనించి పయనించి తలుపులు మూస్తుంది. కాలం చీకట్లో రేపటి కల కంటుంది.
శబ్దం ఒక శిశుజననం. ఆకలితో మొదలయిన దుఃఖరాగం
అనురాగం, అందం, ఆరాటం, పోరాటం వాయిద్యాలపై వినిపిస్తూనే ఉంటుంది.
చితిమంటల్లో చితికి పోతుంది.
శబ్దం సాప్తపదీనం. స నుండి ని వరకు హెచ్చు తగ్గులతో బ్రతుకు పాట పాడుతూనే ఉంటుంది.
హార్మోనియం తిత్తిలో గాలి ఆగిపోగానే స్వరం మౌనం పాటిస్తుంది.
(డా. గండ్ర లక్ష్మణ రావు ‘శతద్రు’ (వచన పద్యాలు) నుండి)