నిత్య అధ్యయన శీలి ‘నిత్యానందరావు’

సమీక్షల్లో, పీఠికల్లో ఆయా రచయితల శ్రమను, వస్తు రచనలను ప్రశంసించడానికి ఎక్కడా లోభపడలేదు. దానికి సంబంధించిన మరికొన్ని విశేషాలను చెప్పడానికి ఎప్పుడూ వెనుకంజ వేయలేదు. ఏది చేసినా నిర్మలమైన మనసుతో చేశాను. ఎత్తుగడలో కాస్త కవితాత్మకత చోటు చేసుకుంటుంది. తరువాత విషయం ప్రాధాన్యం వహిస్తుంది. – ఆచార్య వెలుదండ నిత్యానందరావు.
పరిశోధకుడిగా, పర్యవేక్షకుడిగా, విమర్శకుడిగా, వ్యాసకర్తగా రచయితగా, సంపాదకుడుగా, సమీక్షకుడుగా, పీఠికారచయితగా, సహృదయుడుగా, స్నేహశీలిగా, నిత్య అధ్యయనశీలిగా, వినయ సంపన్నుడిగా, ఆచార్యుడుగా ఎనలేని కీర్తిప్రతిష్ఠలు పొందారు ఆచార్య వెలుదండ నిత్యానందరావు. ఎన్నో అవార్డులు, పురస్కారాలు, సన్మానాలు అందుకున్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా ఉంటూ షష్టిపూర్తి పండుగ సందర్భంగా ఇలా సమగ్ర రచనల సంపుటాలు వెలువరించడం సంతోషకరమైన విషయం. ఇలా ముందుచూపుతో ముందుకు వెళుతున్నారు. అందుకు అభినందనలు. నిత్యానందరావు ఏ గ్రంథాన్ని సమీక్షకు స్వీకరించినా దాని పూర్వాపరాలను చక్కగా విశ్లేషిస్తారు. ఒక గ్రంథాన్ని బాగా చదివి లోతుగా అధ్యయనం చేయడం వారికి వెన్నతో పెట్టిన విద్య. గ్రంథ సమీక్షల్లోనూ, పీఠికా రచనల్లోనూ ముందు వరుసలో ఉంటారు.
‘‘ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్ర సాహిత్యం’’ మొదటి సంపుటి ‘‘అనుభూతి ` అన్వేషణ’’ . ఇందులో రెండు భాగాలున్నాయి. ఒకటి సమీక్షలు. రెండు పీఠికలు. 147 సమీక్షలు, 82 పీఠికలు. మొత్తం 229. పేజీలు 547. ఈ గ్రంథాన్ని తల్లిదండ్రులకు అంకితం ఇచ్చారు. వీరు రాసిన సమీక్షలు కొన్ని విశ్లేషణాత్మకంగా ఉన్నాయి. కొన్ని విమర్శనాత్మకంగా ఉన్నాయి. కొన్ని సాదాసీదాగా ఉన్నాయి. కొన్ని సమీక్షలు, పీఠికలు ఇంకా నిశితంగా, విమర్శనాత్మకంగా
ఉంటే బాగుండేదనిపిస్తాయి. సమీక్ష, పీఠిక రెండు విమర్శలో భాగమే. ఆ దృష్టితో సమీక్షలు, పీఠికలు రాశారు. అసలు విషయం ఏమంటే సమీక్ష చదివినా, పీఠిక చదివినా మూలగ్రంథాన్ని చదవాలనిపించే విధంగా ఉండాలి. అదే పని వెలుదండ వారు చేశారు. రావు గారు కొన్ని సందర్భాల్లో గ్రంథకర్తలకు సూచనలు, సలహాలు ఇచ్చారు. రెండవ ముద్రణలో సరి చేసుకుంటే బాగుంటుందని సున్నితంగా చెప్పారు. ఒక పుస్తకాన్ని సమీక్షించినప్పుడు పరిశోధకుడిగా విమర్శకుడిగా అనేక విషయాలను పరిగణనలోకి తీసుకున్నారు. గ్రంథ సమీక్షల్లో నిత్యానందరావుగారి లోని ప్రత్యేకత ఏమంటే గుణదోష విచారణ చేయడం. గ్రంథకర్త ఏమనుకుంటారో అనేది ఆయన లెక్కలోకి తీసుకోరు. తన ధోరణిలో ముందుకు సాగుతారు. అక్కడక్కడ చురకలు వగైరాలు కూడా ఉన్నాయి. కొన్ని సమీక్షల్లో భాషా తీవ్రత కనిపిస్తుంది. ఒకటి రెండు సందర్భాల్లో దూకుడు కనిపించింది. గ్రంథసమీక్షల్లోను, పీఠికల్లోను రావుగారి ప్రతిభా పాటవాలు వెల్లివిరిశాయి. దగ్గరివారైనా, దూరంవారైనా, మహా మహాపండితులైనా ఎవరైనా ఒకే విధంగా ముక్కుసూటిగా వివేచన చేయడం వెలుదండవారి ధోరణి. అదే వారి విశిష్టత, ప్రత్యేకత కూడా. వీరు రాసిన మొట్టమొదటి సమీక్ష గ్రంథం ‘‘అన్వేషణ -అనుభూతి’’. దీన్ని మోపిదేవి కృష్ణస్వామి రాశారు. వీరు మాస్టర్‌ ఎక్కిరాల కృష్ణమాచార్యుల శిష్యులు. గురువుగారితో శిష్యరికం చేసిన జీవిత ప్రస్థానమే ఈ గ్రంథం . ఈ గ్రంథాన్ని సమీక్షిస్తూ ‘‘కృష్ణ స్వామి గారిని ఆత్మహత్యాప్రయత్నం నుండి మరలించిన మాస్టర్‌ ఎక్కిరాల వారి సందేశం నేటి యువతరానికి వెలుగుబాట లాంటిది. ఈ సందేశాన్ని అందుకొని ముందుకు వెళితే యువతరానికే కాదు, దేశానికి ప్రపంచానికి అభ్యుదయం, ఆత్మతృప్తి లభిస్తాయని’’ నిత్యానందరావు తెలియజేశారు. ఈ సూచన బావుంది.
ఎన్‌. గోపి గారి ‘‘వ్యాసనవమి’’ వ్యాసాల్లో సున్నితత్వం, ఆవేశరాహిత్యం అడుగడుగునా ప్రదర్శితమైంది అని అన్నారు. మలయవాసిని గారు ఆంధ్ర జానపద సాహిత్యం రామాయణం రాశారు ఈ గ్రంథంలో జానపదుల హృదయావిష్కరణను చక్కగా చేశారని ప్రశంసించారు. రామాయణాన్ని విషవృక్షంగా తలపోసి కలవరపడిన వారంతా వాల్మీకి కంటే విజ్ఞానవంతులని అనిపించుకున్న వారేమో కానీ రామాయణ వైశిష్ట్యాన్ని జనుల మనసుల్లో దానికున్న స్థానాన్ని తగ్గించలేకపోయారని రావుగారు అధిక్షేపించారు.
అంధత్వం హేతువుగా తాను స్వయంగా చదువుకోలేని స్థితిలో ఉండి ఇతరుల మీద ఆధారపడి ఎన్నో కష్టనష్టాల కోర్చి మన్నవ సత్యనారాయణ గారు ఎంతో చక్కని సిద్ధాంత గ్రంథాన్ని రాశారు అని రావు గారు మనసారా అభినందించారు. ఈ సిద్ధాంత గ్రంథానికి ఎక్కువ మందితో పీఠికలు రాయించడం గ్రంథానికి భారం అయిందని కూడా సున్నితంగా విమర్శించారు. కథానిక స్వరూప స్వభావాలు గ్రంథాన్ని పోరంకి దక్షిణామూర్తి గారు రాశారు. ఇలాంటి గ్రంథం ఇంతవరకు తెలుగులో రాలేదు. ఇకముందు కథానికను గూర్చి ఈ గ్రంథాన్ని సంప్రదించకుండా మాట్లాడే వీల్లేని పరిస్థితి కల్పించారు అని మెచ్చుకున్నారు. వెలమల సిమ్మన్న దర్శిని అనే వ్యాస సంపుటిని రాశారు ఈ వ్యాసాల్లో ఆవేశం ఎక్కువగా ఉందని విమర్శించారు. సిమ్మన్న ప్రవాహంలో అందరిలాగే కొట్టుకపోతూ ఆవేశాలకులోను కాకుండా సామరస్య పూర్వకంగా నిత్య సాహిత్య అధ్యయనంతో ఆలోచనలతో ఎన్నో మంచి గ్రంథాలు రాయాలని ఆకాంక్షిస్తున్నాను అని అన్నారు. ప్రాచీన కావ్యాలను నేటి సిద్ధాంతాలతో విమర్శించడం మంచిది కాదన్నారు. సి.నారాయణరెడ్డి గారి ఆరనిజ్వాల కవితా సంకలనాన్ని సమీక్షిస్తూ ఈ కవితా సంకలనంలో కవిత్వంకన్నా వచనమే ఎక్కువయ్యాయని చెప్పడాని కేమాత్రం సంకోచింపలేదు.
ఆచార్య కొర్లపాటి శ్రీరామమూర్తి గారి అభినందన సంచిక ‘ప్రతిభా వైజయంతి’కి సంపాదకులు అక్కిరాజు రామాపతిరావు. అప్పాజోస్యుల విష్ణుభొట్ల సంస్థ వారి సారథ్యంలో ఈ సంచిక వచ్చింది. కొర్లపాటి వారు సాహిత్యరంగంలో చూపిన విశేష ప్రతిభాపాటవాలను కొనియాడుతూ రాసిన వ్యాసాలు ఇందులో చోటు చేసుకున్నాయి. రమాపతిరావు గారి పనితనం ఈ సంచికలో కొట్టొచ్చినట్లు కనిపించిందని రావుగారు ప్రశంసించారు. రెంటాల శ్రీ వేంకటేశ్వర రావు గారు అవగాహన వ్యాస సంపుటిని సమీక్షిస్తూ ‘‘వీరి విశ్లేషణలు పరిశీలనలతో కూడి ఉండి, రచయితకు వస్తువుకు మధ్య ఉన్న సంబంధబాంధవ్యాలను ఆత్మీయంగా వ్యక్తీకరిస్తాయి’’ అని అని నిత్యానందరావు గారు అన్నారు. తెలుగు సాహిత్య విమర్శ అవతరణ వికాసములు గ్రంథాన్ని సమీక్షిస్తూ వివేచనాశీలం, స్పష్టత, సంయమనంతో సమన్వయపూర్వకంగా సాగిన ఎస్‌.వి.రామారావు గ్రంథాన్ని ఎందరో రిఫరెన్స్‌ గ్రంథంగా ఉపయోగించుకోవడం, దీనిలో ప్రస్తావితమైన అంశాల మీద తర్వాత కాలంలో డాక్టరేట్లు రావడం గమనిస్తే ఈ పుస్తకం ఎంత గొప్పదో తెలుస్తుందని అన్నారు నిత్యానందరావు.
ఆత్మకథల్లో ఆనాటి తెలంగాణ అనే గ్రంథాన్ని గుమ్మన్న గారి బాల శ్రీనివాస మూర్తి రాశారు. తెలంగాణ ప్రాంత చరిత్ర సాహిత్యం సాంస్కృతిక సామాజిక అంశాలు వినూత్న ఆవిష్కరణతో ఉద్వేగాలకు ఆరోపణలకు అసత్య ప్రతిపాదనలకు తావు లేకుండా సత్యమే ప్రాణవాయువుగా ఉండాలని భావిస్తూ సంయమన శీలంతో సముచిత సమాచార సంపదతో వెలువరించిన గ్రంథం అని వెలుదండ వారు అన్నారు. కందుకూరి వీరేశలింగం అనే గ్రంథాన్ని ఆచార్య వకుళాభరణం రామకృష్ణ రాశారు. రాజకీయ సాంఘిక ఆధ్యాత్మిక లౌకిక వైజ్ఞానిక రంగాలన్నింటిలో తెలుగువారి పురోగమనానికి బాటలు వేసిన మహనీయుడు కందుకూరి. కందుకూరి మీద విలువైన విషయ నిర్భరమైన గ్రంథాన్ని వకుళాభరణం వెలువరించా రని రావు గారు అన్నారు.
పద్యకవిత్వం వస్తు వైవిధ్యం గ్రంథాన్ని కెవి రమణాచారి రాశారు. వీరు ఆధ్యాత్మిక, పౌరాణిక , చారిత్రక, సామాజిక విభాగాల కింద వర్గీకరించి చక్కగా విశ్లేషించారు. ‘‘పద్యరచనకు చాలినంత నైపుణ్యం, ఏకాగ్రచిత్తం లేని పద్యకవుల వల్లనే పద్యప్రక్రియ కొన్నిసార్లు నిందలకు గురి అవుతుందని చెప్పడానికి ఏమాత్రం రమణాచారి సంశయించలేదని’’ నిత్యానందరావు తెలియజేశారు. రావి రంగారావు కుంకుమకాయ అనే కవిత సంకలనాన్ని సమీక్షిస్తూ ఆ కుంకుడుకాయ తలమీద మాలిన్యాన్ని కడిగేస్తుంది ఈ కుంకుడుకాయ తలలోని మాలిన్యాన్ని కడిగేస్తుంది అని చమత్కరించారు.
వై. కామేశ్వరి గారు ఏకవీర విశ్వనాథ కథన కౌశలం గ్రంథాన్ని రాశారు. వీరు విశ్వనాథ వారి కథన కౌశలం విధానాన్ని ప్రతిభా వంతంగా ఆలోచనాత్మకంగా విశ్లేషించారు. ఏకవీర గురించి ఎవరు మాట్లాడాలన్నా వ్రాయాలన్నా ఈ గ్రంథం చదవవలసిందే అంత బాగా రాశారు అని కామేశ్వరి గారిని ప్రశంసించారు రావు గారు.
కాలువ మల్లయ్య కథలు తెలంగాణ జన జీవితం గ్రంథాన్ని బన్న ఐలయ్య గారు రాశారు. కాలువ మల్లయ్య రాసిన కథల్లోని వస్తు విస్తృతిని అంచనా వేయడానికి ఈ గ్రంథం ఎంతగానో
ఉపకరిస్తుంది ఈ కథల్లోని తెలంగాణ సామాజిక చారిత్రక రాజకీయ ఆర్థిక కులపరమైన వికాస విశేషాలను ఇంకా పరిశీలించవలసిన అవసరం ఉంది అని నిత్యానందరావు గారు అభిప్రాయపడ్డారు. శ్రీశ్రీ అనంతం పేరుతో స్వీయ చరిత్ర రాశారు. శ్రీశ్రీ గారు ఈ గ్రంథం గురించి నేను ఆషామాషీగా కానీ, ఊసుపోకకు కానీ రాయలేదు. నా జీవన వాస్తవికతను సందర్శించే ఉద్దేశంతో రాశాను. నాది సత్యాన్ని పరిశీలించే ప్రయత్నం అని అన్నారు. ఈ స్వీయ చరిత్రపై ఎన్నో చర్చలు జరిగాయి. ఇందులో ఎన్నో విశేషాలు ఉన్నాయి. అయితే వీటిని ఒక క్రమపద్ధతిలో రాయకపోవడం శ్రీశ్రీ యొక్క విశేషం అని రావు గారు అన్నారు. ఔన్సు తృప్తిని, టన్ను అసంతృప్తిని నిలిపినా సరే శ్రీశ్రీ అంటే అభిమానం ఆరాధన కే.వి.రమణారెడ్డి గారిలాంటి పెద్దలన్నది వాస్తవ మన్నారు. ఆచార్య వెలమలసిమ్మన్న తెలుగు సాహిత్య చరిత్ర గ్రంథంలో ప్రాచీనానికి ఆధునికానికి సమప్రాధాన్యం లభించింది. ప్రధానంగా గురువుగారైన కొర్లపాటి శ్రీరామమూర్తి మార్గాన్ని అనుసరించినా, నన్నెచోడుని విషయంలో విభేదించడం గమనార్హం. పోటీ పరీక్షలు రాసే విద్యార్థులకు ఈ గ్రంథం ఎంతో ప్రయోజనకారి అని నిత్యానందరావు వ్యాఖ్యానించారు.
తెలంగాణ సాహిత్యరత్నాల వీణ పేరుతో ద్వానాశాస్త్రి గ్రంథం రాశారు. కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కత్తి పద్మారావు తెలుగు సాహిత్య చరిత్ర భాషా సామాజికత కులాధిపత్యం రాశారు ఇది గ్రంథంలా కాకుండా వ్యాస సంకలనంగా ఉందని తీవ్రంగా విమర్శించారు. ఈ గ్రంథానికి తెలుగు సాహిత్య చరిత్ర అని శీర్షిక పెట్టడం సమర్థనీయంగా లేదన్నారు.
విప్లవం నుంచి వేదం దాకా డాక్టర్‌ దాశరథి రంగాచార్య సాహిత్య జీవిత ప్రస్థానం అనే గ్రంథాన్ని వి.జయప్రకాష్‌ గారు రాశారు ఈ గ్రంథాన్ని సమీక్షిస్తూ విప్లవవాదిగా, మార్క్సిస్టుగా ఉంటూనే వేదవాదిగా సంప్రదాయకునిగా రెండు భిన్నమైన పాత్రల్లో ఏకకాలంలో దర్శనం ఇవ్వడం దాశరథి రంగాచార్యలోనే చూస్తాం. ఆయన ఇరువర్గాలకు ప్రీతిపాత్రుడు కావడం మరింత విశేషం. ఇది దాశరథి రంగాచార్యలోని లౌక్యమా? వామపక్షులలో పెరిగిన ఉదారవాదమా? అన్వయించడానికి మరొక ప్రమాణ సూత్రాన్ని ఏర్పరచుకోవలసిన ఆవశ్యకతకు సూచననా? లేక సహజ పరిణామమేనా? అని ఈ గ్రంథం చదివినప్పుడు మనకు ఈ భావాలు మెదులుతాయని నిత్యానందరావు అభిప్రాయపడ్డారు. రంగాచార్య గారు సాయుధ పోరాట కాలంలో జైలుకు వెళ్లారు. యవ్వనంలో కమ్యూనిజాన్ని ఆరాధించారు. చాటుమాటుగా పూజలూ, పునస్కారాలు చేయడం, ముహూర్తాలు చూడడం కాకుండా బాహాటంగా వాటిని విశ్వసించారని నిత్యానందరావు అన్నారు
భారతంలో బంధాలు గ్రంథాన్ని కడియాల జగన్నాథశర్మగారు రాశారు. శర్మగారు కౌరవులు అనే పాండవులు అనార్యులనీ, బహుభర్తృత్వం వారి సాధారణ ఆచారమని వ్యాఖ్యానించడాన్ని తీవ్రంగా ఖండిరచారు. మహాభారతాన్ని ముఖ్యంగా అందులోని వివాహ వ్యవస్థ గురించి సమాజ శాస్త్ర మానవ శాస్త్ర చారిత్రకాంశా లతో విశ్లేషించారు శర్మగారు అన్నారు. పై గ్రంథాలనే కాక ఇంకా ఎన్నో సమీక్షలు రావు గారు రాశారు
కొలకలూరి ఇనాక్‌, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, పి. సుమతీ నరేంద్ర, జి చెన్నకేశవరెడ్డి, పైడిపాల సత్యనారాయణ, షేక్‌ మస్తాన్‌, గరికిపాటి నరసింహారావు, అమ్మంగి వేణుగోపాల్‌, వై. రెడ్డిశ్యామల, సముద్రాల కృష్ణమాచార్య, అప్పం పాండయ్య, వారణాసి వెంకటేశ్వర్లు, టి.శ్రీరంగ స్వామి, ఎం.వి ఆర్‌ శాస్త్రి… మొదలైన లబ్దప్రతిష్ఠుల సమీక్షలు ఎన్నో ఈ గ్రంథంలో చోటుచేసుకున్నాయి.
II
ఆచార్య జి.వి సుబ్రహ్మణ్యం గారి నవయుగ రత్నాలు వ్యాససంకలనానికి నిత్యానందరావు తొలి పీఠిక రాశారు. అసలు గురువుగారి గ్రంథానికి శిష్యుడు పీఠిక రాయడం ఎంత అదృష్టం. ఆ అరుదైన అవకాశం నిత్యానందరావుకు దక్కింది. ఎనలేని ఆనందాన్ని కలిగిస్తుంది. అంత గొప్ప విమర్శకుడు శిష్యుడితో పీఠిక రాయించడం చరిత్రలో ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ విషయం. శిష్యుడు ప్రతిభావంతుడు అనే విషయం ఇక్కడ చెప్పకనే చెప్పినట్లయింది. (మానసిక అనుబంధమే తప్ప, తరగతి గదిలో కూర్చొని చదువుకొన్న శిష్యుడు కూడా కాదు). ‘‘ప్రక్రియ స్వరూప స్వభావాలను విశ్లేషించడం, గుర్తించడం, క్లాసిజం ప్రమాణాలు అన్వేషించడం, వివేచించడం ఈ 18 వ్యాసాల్లో ఆచార్య జీవీఎస్‌ చేసిన పని అని నేను తలపోస్తున్నాను…. అందరూ అన్నింటితో ఏకీభవిస్తారని అనుకోలేం. ఏకీభవించాలనుకోవడం అత్యాశ. అందరినీ సంతృప్తి పరచడం సాధ్యమయ్యేది కూడా కాదు. వారు చేసే కొన్ని వ్యాఖ్యలు వ్యక్తిగత అభిరుచికి ప్రతిబింబాలుగా కనిపించవచ్చు. కొన్ని ఔత్సాహిక ప్రతిపాదనలుగా మిగిలిపోవచ్చు. విశ్వనాథ పట్ల అతిగా స్పందిస్తారని విమర్శకులోను కావచ్చు. ఇష్టానిష్టాలు అభిరుచులు ఉండడం మానవ సహజం. మనం ఏకీభవించడం ప్రమాణమూ కాదు, ఏకీభవించక పోతే న్యూనతా కాదు’’ అని మొదటి ముందుమాటలోనే నిత్యానంద రావు ఇంత సత్యసమ్మతంగా, స్పష్టంగా మొహమాటం లేకుండా రాయడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
సబ్బని లక్ష్మీనారాయణ మన ప్రస్థానం రాశారు. దాని ముందుమాటలో ఒకే అంశాన్ని పలుమార్లు చెప్పి బలమైన ముద్ర వేయవచ్చు అనుకోవడం రచయితపరంగా ఎంత సహజమో, పునరుక్తే కదా ఏదో ఒకటి చదివితే సరిపోదా అని తక్కిన వాటిని వదిలివేసే ప్రమాదం పాఠకుని పరంగా అంతే సహజం. ఈ కవితల్లోని పునరుక్తి పునరాలోచనీయమే. దీని ప్రయోజనం ప్రశ్నార్థకమే అయినా ప్రయోగం విలక్షణమైనది భావించవచ్చు. ఒక్కో కవితలో ఒక్కో వస్తువును ప్రవేశపెట్టి పేరడీలు రాసి ఉంటే వస్తు విస్తృతి పెరిగి రచయితకు కీర్తి కారకం పాఠకునికి మరింత ఆహ్లాద కార్యక్రమం అయ్యేది. ఇందులో సున్నితగా సలహా, విశ్లేషణ, చురక, ప్రశంస చోటుచేసుకోవడం గమనించవచ్చు.
నోరి నరసింహశాస్త్రి సమీక్షాసంకలనాన్ని సమీక్షిస్తూ నోరివారు ఏ గ్రంథాన్ని సమీక్షించినా లోతుగా విషయ వివేచన చేయడం, లోపాలను నిష్కర్షగా చెప్పడం, అభినందించే అంశాలను దాచుకోకుండా చెప్పి అభినందించడం, రచయితకు పాఠకుడికి మధ్య వారధిగా నిలిచి ఉండి పుస్తకాన్ని గురించి అవగాహన పాఠకుడికి రచనల్లోని మంచిచెడ్డలు అవగాహన రచయితకు కలిగేలా వ్యవహరిస్తారు. నోరి నరసింహ శాస్త్రి సమీక్షలన్నీ ఉదాత్తతకు, నిగ్రహానికి, శ్రద్ధకు, విచక్షణకు దృష్టాంతాలు. విజ్ఞాన పరిధిని పెంచుకోదలచిన పాఠకులు ఈ గ్రంథాన్ని చదవవలసిందని అని నిత్యానందరావు సూచిస్తారు.
ఆధునికాంధ్ర భావ కవిత్వం అనే గ్రంథాన్ని పాటిబండ మాధవ శర్మగారు రాశారు. ఈ పీఠిక చాలా పెద్దది. 20 పేజీలు ఉన్నాయి. ఇందులో గ్రంథానికి సంబంధించినవే కాక శర్మ గారి జీవితవివరాలు, ఇతర విషయాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి. ఇది బిఏ (ఆనర్స్‌) పరిశోధన గ్రంథం. మొత్తం పాటిబండవారు భావకవిత్వ విశ్లేషణకు పరిశీలించిన భావకవులుగా ఉదాహరించిన దాదాపు 50 మంది కవులను పరిశీలిస్తే రాయలసీమ ప్రాంతీయులకు, తెలంగాణ ప్రాంతీయులకు దానితో సంబంధం ఉన్నట్లే తోచదు. ఇంకా చెప్పాలంటే మద్రాస్‌ విశ్వవిద్యాలయం, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో బిఏ, ఎంఏలు చదివిన విద్యార్థుల కవితా కోలాహలం అని నిత్యానందరావు వ్యాఖ్యానించారు. కానీ పాటిబండవారు అప్పటికి ఒక డిగ్రీ విద్యార్థి మాత్రమే. ఆ కాలంలో రాయలసీమ తెలంగాణలోని భావకవులను తెలుసుకొని రాయడం కష్టం. తనకు అందుబాటులో ఉన్న సమాచారంతో బాగా రాశారు. దానికి మనం సంతోషించాలి. ఆంధ్ర విశ్వవిద్యాలయం మొదటి బ్యాచ్‌ విద్యార్థి (1933) ఆయన.
తెలంగాణ సాహిత్యం-ప్రాంతీయ అస్తిత్వం గ్రంథాన్ని వి. శ్రీదేవి గారు రాశారు. ఆమె ఒక వ్యాసంలో తెలంగాణ మండలికపదాల పట్టిక ఇచ్చారు. ఈ పట్టిక ఇలా కాకుండా భిన్న రంగాలకు చెందిన పది పదిహేను పదాలను ఎన్నుకొని వాటి రూపాలను జిల్లాలవారీగా ప్రదర్శించి ఉంటే మరింత బాగుండేదేమో అని నిత్యానందరావు సూచించారు. మాండలికాలను భద్రపరచి భావితరాలకు అందజేయాలని శ్రీదేవి గారు ఆశించడంలో తప్పేమీ లేదు కానీ తాతమ్మ వేసుకున్న నగలను అలాగే మనుమరాలు ధరించాలనడం తగదు. ఆ పసిడిని తన కాలానికి అనుగుణమైన నగలరూపంలోకి మార్చుకొని వాడుకుంటేనే అది విజ్ఞత అవుతుంది- అంటూ వెలుదండవారు కాలానుగుణంగా భాషలో వచ్చే ధ్వని, అర్థవిపరిణామాలను, ఇతరమార్పులను దృష్టిలో పెట్టుకోక తప్పదంటారు. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా స్పష్టంగా, డొంక తిరుగుడు లేకుండా చెప్పడం నిత్యానందరావు పీఠికల్లో గమనించే అంశం.
ఆధునిక తెలుగు విమర్శకులు విమర్శనా పద్ధతులు అనే గ్రంథాన్ని శరత్‌ జ్యోత్న్సారాణి రాశారు. దాన్ని సమీక్షిస్తూ ఈ గ్రంథంలోని 18 మంది విమర్శకులు ఒక్క కుదురున ఇమిడిన వారు కారు. ఒక్కో భావ ధోరణికి అంకితమైన వారు కాదు. ఒక్క కాలానికి సంబంధించిన వారు కాదు. తెలుగు నాట ఆధునికతను గుర్తించి, దర్శించి, వ్యాఖ్యానించి తమదైన రీతిలో సామాజిక పురోగమనానికి దోహదం చేసినవారే. కొందరు ఇందులో చేరి ఉంటే బాగుండేదని మరికొందరు లేకపోయినా సరే సరిపోయేది అన్న తలంపులకు మూలం మన అభిరుచులకు తలుపులు తీయడమే. దానికి అంతు ఉండదు. ఈ 18 మంది విమర్శకశ్రేష్ఠులు వ్యక్తీకరించిన భావాలను గుర్తిస్తే ఆధునిక విమర్శకు ప్రాతిపదికలు గుర్తించినట్లే అని చాలా చక్కగా అంచనా వేశారు నిత్యానందరావు.
చెన్నకేశవరెడ్డి గారి కరోనాకాపురం కవితాసంకలనాన్ని సమీక్షిస్తూ ప్రజలకు భౌతిక దూరాలను ప్రబోధిస్తూ నైతిక భారాలకు దూరం అవుతున్న పాలక వ్యాపార వ్యవస్థలను గమనిస్తూ, ఏమీ అనలేక ఎదిరించలేక ఉడికిపోయే మరోస్థితిని దృశ్యమానం చేశారు. ఇది ఈ కావ్యకర్త అయిన చెన్నకేశవరెడ్డి ఒక్కరి అంతరంగం మాత్రమే కాదు ఏడు పదులు దాటిన ఆలోచనాపరులు అందరిదీ అని రావుగారు వ్యాఖ్యానించారు. కాసుల నాగభూషణం (నవీన సుమతీ శతకం), కె.వి.యన్‌.డి. వరప్రసాద్‌ (మునిపల్లె రాజు సాహిత్యం ) దేవారెడ్డి విజయలక్ష్మి (రాయలసీమ వాడుక మాటలు), ఎస్‌.యాదగిరి (ఆచార్య రవ్వా శ్రీహరి జీవితం- సాహిత్యం) జంగా హనుమయ్య చౌదరి (సత్యా వివాహం), గుమ్మన్న గారి వేణుమాధవ శర్మ (మహాభారతం) మొదలైన గ్రంథాలకు నిత్యానందరావు నిత్యానందరావు చక్కని ముందుమాటలు రాశారు.
మొత్తం మీద ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమీక్షలు, పీఠికలు వారి లోతైన అధ్యయనానికీ, పరిశోధన ప్రవృత్తికీ, మృదుమధురమైన విశ్లేషణకు వేదికగా నిలుస్తాయి. ఈ గ్రంథం పరిశోధకులకు, అధ్యాపకులకు ఆచార్యులకు ఎంతగానో ఉపయోగ పడుతుంది. ముఖ్యంగా పరిశోధకవిద్యార్థుల భావవిస్తృతికి, వ్యక్తీకరణ నైశిత్యానికి నిత్యానందరావు రచనలు మార్గదర్శనం చేస్తాయి. శ్రద్ధగా మంచి సాహిత్య విమర్శ వస్తున్నపుడే మంచి సాహిత్యం వస్తుంది. నిత్యానందనరావుతో ముప్పయేళ్ళ స్నేహం నాది. ఆయురారోగ్యాలను ఆకాంక్షిస్తూ అభినందనలు తెలుపుతున్నాను.
(తెలుగువిశ్వవిద్యాలయం వారు సాహిత్యవిమర్శప్రక్రియలో 2022సంవత్సరానికిగాను ఉత్తమ సాహితీపురస్కారం ప్రకటించిన సందర్భంగా అభినందిస్తూ……….)

ఆచార్య వెలమల సిమ్మన్న
విశ్రాంతాచార్యులు, విశాఖపట్నం.
ఫోన్‌ : 9440 641617

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *