తెలంగాణ జాగ మీద పానం

ప్రజాకవి కాళోజీ నారాయణరావు, మహాకవి దాశరథి కృష్ణమాచార్యలాగా తనువంతా నోరుజేసుకొని తెలంగాణ కోసం మాట్లాడిన, కొట్లాడిన అచ్చమైన తెలంగాణ గొంతుక డా. నందిని సిధారెడ్డి. కలం పట్టిన తొలినాళ్ల నుంచి ఇవాళటిదాకా ఆయన ప్రతి అక్షరం తెలంగాణ జీవితాన్ని ప్రతిబింబించేదే. పాట, కవిత్వం, కథ, వ్యాసం.. ప్రక్రియ ఏదైనా అందులో తెలంగాణతనం తొంగి చూస్తుంది. తెలంగాణ మట్టిపరిమళం, తెలంగాణ పల్లె జీవితం, తెలంగాణ దుఃఖపు తీగ ఆయన ప్రతి రచనలో నేపథ్యంగా అల్లుకుంటుంది.
‘‘జాగ మీద పానం / పానమిడిసినా జాగిడువం
ఈ జాగ తీరే అట్ల / ఈడ పుట్టి పెరిగిన మనిషి తీరే గట్ల
ఈ జాగల బర్వుబర్వుగ తిరిగే
పూర్వీకుల ఆత్మలుంటయి’’ అంటాడు. తెలంగాణ ప్రజలకు సహజంగా ఉండే రేషం, జిద్దు, కుటిలత్వంలేనితనం, కుండబద్దలు కొట్టినట్టు కడిగేసే మనస్తత్వం, ఇరాం లేకుంట తిరిగేతనం, ఎదుటి మనిషి ఎతలకైనా కరిగిపోయే మనిషితనం, పానాపానంగా తెలంగాణ కోసం తన్లాడేతనం మొదలైన జీవధాతువులెన్నో సిధారెడ్డి కవిత్వం నిండా పరుచుకుని ఉంటాయి. తెలంగాణ అసలైన ప్రాంతీయకవి డా. నందిని సిధారెడ్డి.
నిరంతరం ప్రజా జీవితంతో మమేకమయ్యే వాళ్లు, ప్రతి ఆలోచన కష్టజీవుల కోసం ధారపోసే వాళ్లు మాత్రమే ఇలా రాయగలరేమో. ఇలాంటి స్పష్టమైన దృక్పథం లేకపోతే యాబై ఏళ్లుగా సాహిత్య రంగంలో కొనసాగలేరు. రచయితగా మనలేరు. ‘భూమి స్వప్నం’ నుంచి ‘అనిమేష’ దాకా ప్రతి రచన నందిని సిధారెడ్డి రచనా దృక్పథాన్ని పట్టి చూపేదే. ఈ ప్రయాణంలో 2007లో వెలువడిన ‘నదిపుట్టువడి’ కవితా సంపుటి కూడా ప్రత్యేక తెలంగాణ ఉద్యమ కాలపు వేడిని, తెలంగాణ మట్టిమనుషుల తడిని ఎంతో గాఢంగా వ్యక్తీకరించింది.
అనుభవించిన జీవితాన్నంతా అక్షరాల్లోకి అనువాదం చేయలేనట్లే గడిరచిన పాండిత్యాన్నంతా రచనల్లోకి ఒంపలేము. ‘నీరు కొలది తామర సుమ్మీ’ అన్నట్లు వస్తువునుబట్టి, ప్రక్రియను బట్టి ఎంత అవసరమో అంత వాడాలి. ఇది కూడా ఒక కవిత్వ ఔచిత్యమే. ఈ విషయం బాగా తెలిసిన కవి డా. నందిని సిధారెడ్డి. ఈయన కవిత్వమంతా వెదికినా ఒక్కటంటే ఒక్కటి కూడా పాండిత్య ప్రకర్ష కోసం వాడిన పదం కనిపించదు. గాఢమైన జీవితాన్ని చాలా సరళమైన భాషలో కవిత్వీకరించడం ఆయన కలానికి మాత్రమే తెలిసిన రసవిద్య. కవితా శిల్పంలో ఇది అదృశ్యంగా కలిసి ఉంటుంది. దీనికి నిదర్శనంగా ఎన్నో కవితల్ని ఎత్తి చూపవచ్చు.
‘నదిపుట్టువడి’ కవితా సంపుటిలోని చాలా కవితలు 2001 నుండి 2007 మధ్య రాయబడిన కవితలు. అంటే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ఒక ఉధృత దశకు చేరుకున్న సందర్భం. తెల్లవారి లేచింది మొదలు రాత్రిదాకా రోడ్డెక్కితే చాలు ఎన్నో ఉద్యమ స్వరూపాలు కళ్లకు కనబడుతున్న కాలం అది. అందుకే అప్పుడు కలం పట్టిన ప్రతి కవి ఉద్యమ జీవితాన్ని కవిత్వం చేయకుండా ఉండలేకపోయాడు. ఇలాంటి సన్నివేశంలో సిధారెడ్డిలాంటి కవి గుండెల్లో ఉద్యమ మంటలు వేసుకొని మరీ కవిత్వం రాస్తాడు. అలాంటి కాగడాల్లాంటి కవితలే ఈ కవితా సంపుటిలోని సగం పేజీల్లో ఉద్యమసెగను పంచుతాయి.
‘‘తెలంగాణ అంటేనే
తెలుగుతల్లి ముక్కలయ్యేదుంటే
ఆ బంధమే వద్దు
సేపయి తల్లి మాకొద్దు
తెలంగాణే మా రక్తం పంచిన తల్లి’’
ఉద్యమ కాలంలో తెలంగాణకు, సీమాంధ్రకు మధ్య ఎన్నో వాదోపవాదాలు జరిగాయి. తెలుగుతల్లిని ముక్కలు చేయవద్దని, ఆంధ్రప్రదేశ్‌ అనే మధుకలశాన్ని పగలకొట్టొద్దని రకరకాల వాదాలు ముందుకు వచ్చాయి. ప్రతి వాదనను తెలంగాణ కవులు, రచయితలు ఎంతో హేతుబద్దంగా తిప్పికొట్టారు. తెలంగాణ సమాజానికి స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని అందించని ఉమ్మడి రాష్ట్రం మనకు వద్దేవద్దని తెగేసి చెప్పిన కాలం అది.
తెలంగాణ ఉద్యమమే నీళ్లు, నిధులు, నియామకాల చుట్టూ జరిగింది. అందుకే ఈ కవితా సంపుటిలో నీళ్ల మీద చాలా కవితలున్నాయి. ‘మనది మనకు’, ‘కార్తె’, ‘బోరుదుఃఖం’ ‘నీళ్ల కోసం’ కవితలు తెలంగాణ ప్రజల నీటి అవసరాలను, నీటిని ముట్టడిరచిన రాజకీయాన్ని మన గుండెల్లోకి పారిస్తాయి. ‘మనది మనకు’ కవిత పటేలు దగ్గర జీతమున్న జీతగాళ్ల కోణంలో నడుస్తూనే తెలంగాణ డెభ్బై ఏళ్ల చరిత్రను మన ముందుంచుతుంది. తెలంగాణలో మొదటి నుంచి నీళ్ల కోసం కొట్లాటనే. ‘నీళ్లకాడ నిత్తె పంచాయతే. నీళ్లకాడ నీళ్లకంటె అన్యాలంగా నెత్తురు పారిచ్చిరి’. కరువు రాజ్యమేలినపుడు నీటి చుక్క కోసం కోసులు నడిచిపోయిన రోజులున్నాయి. నీళ్లు లేక బతుకు ఎండిన చెట్టులాగా మారుతుంటే మన నీళ్లను ఆంధ్రోళ్లు మలుపుక పోవుటానికి కుట్రలు చేసిన రోజుల్ని గురించి రాస్తూ ‘నీళ్ల చాలాకి ఏరే ఉంటది. నీళ్ల తెలివి ఏరే ఉంటది. మనండ్ల మనం కొట్టుకునుడు గాదు. మనుసుల అర్తం జేసుకోవాలె. దునియ అర్తం జేసుకోవాలె. మనండ్ల మనం కొట్లాడుకునుడుగాదు. మనది మనకయెతందుకు కొట్లాడాలె’ అని తెలంగాణ ప్రజలందరూ ఉద్యమంలో భాగస్వాములు కావాలని పిలుపునిస్తాడు ఈ కవితలో. నీటి కరువు దృశ్యాలనే కొనసాగిస్తూ ‘వెదుక్కుంటూ వాన వొచ్చేసరికి చెరువు మిగల్లేదు’ అంటాడు ‘కార్తె’ కవితలో. సమైక్య పాలనలో కావాలని తెలంగాణ ప్రాంతంలోని చెరువులను నిర్లక్ష్యం చేయడాన్ని ప్రజలు జీర్ణం చేసుకోలేకపోయారు. కరువు వెంటాడినంత కాలం వెంటాడిరది. చివరాఖరికి ప్రకృతి కరుణించి వాన కొడితే నీటిని నిల్వ చేసుకోవడానికి ఇక్కడ చెరువులే లేవు. అయితే అన్యాక్రాంతం అయ్యాయి. లేదంటే చెరువులో పూటిక తీయకుండా నీటి నిల్వకు అక్కరకు రాకుండా పోయాయి.

డా. వెల్దండి శ్రీధర్‌
సహాయాచార్యులు, ఎన్‌.జి. కళాశాల,
నల్గొండ.
ఫోన్‌ : 98669 77741

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *