కె.కె. వెంకటశర్మకు

సౌందర్య హృదయం
ఏమయ్య ! నీవయ్య! యెచ్చోట కెళ్ళావు?
విద్యార్థి లోకమున్‌ వీడినావె!
ఎన్ని విద్యలు నేర్చి యెంత యాలోచించి
సాధన విడువక సాగినావె !
శాస్త్ర సాంకేతిక సరిగమల్‌ మీటుచున్‌
రాగముల్పలికించి యేగినావె!
ఉత్కృష్ట బోధన నోర్పుగ జేయుచున్‌
ఉచ్ఛ్వాస నిశ్వాస లొదిలినావె!
నీదు తపన జూసి విధాత నిన్నెఱింగి
మురిసి పోయి తానిప్పుడే ముచ్చటాడ
నిన్ను పిలిపించుకొనెనేమొ నేస్తమోలె
మరొక సేవలో పంపగన్‌ మదిని దలచి!
ఆత్మీయ పిలుపుతో నందరిని పిలిచి
యానంద వశుడవై యరిగి నావె!
చిరునవ్వు చెదరని చిన్మయ ముద్రతో
హృదయాల నిలుచుచు నొదిగి నావె!
సునిశిత శోధనల్‌ శుద్ధమౌ వ్రాతలున్‌
నిష్కర్ష నేర్పుతో నిల్చినావె !
పదుగురు మెచ్చిన పాటవము పరుల
కుపకారివై నిల్చు తపన నీవె !
ఎవరినీ చిన్న బుచ్చని యెడద నీది
సాధుమతివి ! నీవు గురువు ! చారు శీలు !
మార్గదర్శివి నీవు! సమాజ హితము
కై తపించు వేంకటశర్మకై నుతులివె !
కందాడై వాడివి నీ
యందమినుమడిరచె సుందరానందమదిన్‌
గంధ కుసుమాక్షతలివియె
అందుకొనుము సాంజలులిట నందించితిమో!


సున్నితమైన మనసు, అందరితో తలలో నాలుకలాగా మెలగడం, బోధనలో నూతనత్వం శోధించడం, భాషా సాహిత్య సేవలకై తపించడం, ప్రత్యేకించి ద్వితీయ భాష తెలుగు విద్యార్థులకై పరితపించుట, గణిత, భౌతిక, రసాయన, సాంకేతిక శాస్త్రాలు, తెలుగు భాషా సాహిత్యాలపై పట్టు, బాధ్యత నిర్వహణలో మేటి, మొదలైన అనేక సుగుణాల కలయికనే కోవెల్‌ కందాడై కళ్యాణ వెంకట శర్మ. పరోపకారి. తోటి ఉపాధ్యాయులకు శాస్త్ర సాంకేతిక విషయాలను తెలుగు బోధనకు అనుసంధానించే విధానాన్ని ప్రత్యేక సమయాన్ని కేటాయించుకుని అందించినవాడు. వివిధ పత్రికలలో భాషా వ్యాసాలను అందించినవాడు.
‘మూసీ’ పత్రికా కుటుంబంలోని వాడు. ఎప్పుడూ చేదోడు వాదోడుగా నిలిచి చేపట్టిన కార్యాన్ని శ్రద్ధతో సఫలీకృతం చేసేవాడు.
పండితకుటుంబంలో జన్మించినవాడు. మెదక్‌ జిల్లా గుమ్మడిదల వాస్తవ్యుడు. ప్రస్తుతం హైదరాబాద్‌ పాతబస్తీలో స్థిరపడినవాడు. ప్రముఖ పండితులు డా. కె.వి. సుందరాచార్యుల వారి చిన్న కుమారుడు. ఒకవైపు తెలుగు మరోవైపు గణితం వైపు బాగా కృషి చేసి విద్యార్థులకు అన్ని రకాల మెలకువలు నేర్పిన వాడు.
తెలంగాణ రాష్ట్ర పాఠశాల తెలుగు పాఠ్య పుస్తక రచయిత, తెలుగు ఉపాధ్యాయ శిక్షకుడు, తెలంగాణ ఉపాధ్యాయుల శిక్షణా కరదీపికల రచనా భాగస్వామిగా, కరోనా సమయంలో హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ లోనూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విద్యాశాఖలోనూ టీ.వీ. (సైట్‌)ల ద్వారా విద్యా బోధకుడిగా, రాష్ట్ర ఎస్‌.సి.ఇ.ఆర్‌.టి. ద్వారా సేవలందించారు.
అలాంటి వెంకటశర్మ చైత్ర శుద్ధ ఏకాదశి 19.4.2024 రోజున విధి వశాత్తు వ్యాధిబారిన పడి వైకుంఠ ప్రాప్తిని పొందినారు. వెంకటశర్మ లేకపోవడం అటు ఉపాధ్యాయ లోకానికి, విద్యార్థి లోకానికి, భాషా సాహిత్య ప్రేమికులకు తీరని లోటు.
‘మూసీ’ కుటుంబానికి అత్యంత మిత్రులైన కె.కె.వేంకటశర్మ కుటుంబానికి శ్రద్ధాంజలులు సమర్పిస్తూ…
వారి కుటుంబానికి ధైర్య స్థైర్యాలను అందించాలని ప్రార్థిస్తూ…

డా. ఒజ్జల శరత్‌ బాబు
ఫోన్‌ : 99635 33937

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *