కుచేలుని కథ మానవతా విలువలు

భగవంతుడు భక్తి బంధానికొకదానికి తప్ప దేనికీ వశపడడు. భక్తి లేకుండా కోట్లను ఖర్చుచేసి ఆరాధించినా ఆయన అందనే అందడు. ఆయనకు ఏమీ ఇవ్వలేకపోయినా భక్తితో చేతనైనదాన్ని సమర్పించినా తప్పక పరిగ్రహిస్తాడు. అనుగ్రహిస్తాడు కూడా. ‘నేను నీవాడను’ అనే భావాన్ని మనం ప్రకటిస్తే చాలు ఆయన మనల్ని ఏ పరిస్థితిలోను వదలడు. ఆయన భక్తుల సేవలనందుకోవటమే కాదు, భక్తులకు సకల సేవలూ చేస్తాడు. ఎవరైనా అలా భగవంతుడిచేత సేవలు చేయించుకున్న వారున్నారా? లేకేం? మన ఇతిహాసంలో ఉన్నాడలాంటి మహాభక్తుడు. ఆయనెవరో తెలుసా? కుచేలుడు. కుచేలుడు అంటే పాతవి, చినిగినవి అయిన గుడ్డలు ధరించే వాడని అర్థం అతని అసలు పేరు సుధాముడు. బాల్యస్నేహం : కుచేలుడు కృష్ణుని చిన్ననాటి స్నేహితుడు. వారిద్దరు చిన్నప్పుడు కలిసి చదువుకున్నారు. వారి గురువు గారు సాందీపని మహర్షి. అప్పటి శిష్యవర్గంలో కుచేలుడు చాలా గుణవంతుడు. కృష్ణుడు సావాస గాడుగా ఉండటానికి కావాలసిన సద్గుణాలన్నీ అతని దగ్గర ఉన్నాయి. కుచేలుని మనస్సు అద్దంలాగా నిర్మలమైనది. అతనికి దేనిమీద కోరికలుగాని, రాగద్వేషాలు గాని లేవు. బుద్ధిమంతుడై క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేసేవాడు. చక్కని బ్రహ్మచర్యవ్రతంతో మనస్సును ఇంద్రియాల్ని వశం చేసుకున్నాడు. సహజంగా బ్రహ్మజ్ఞానం కలవాడు అతనిదొక ఉత్తమమైన జన్మ. సుధాముడు కుచేలుడయ్యాడు : ఇన్ని ఉండి కూడ దరిద్రబాధ తప్పలేదు. ఎంతో అభిమానం కలవాడు కనుక ఎన్ని బాధలలో ఉన్నా ఎవరిని ఏమీ అడిగేవాడు కాడు. శ్రీకృష్ణుడు అతని పరిస్థితిని గమనించికపోలేదు. కాని అతని పూర్వజన్మ కర్మ ప్రబలంగా ఉండటం చేత సమయం కోసం వేచి ఉన్నాడు. కుచేలుడు విద్య పూర్తి చేసి గురుకులాన్ని వదలి పెరిగి పెద్దవాడై పెండ్లిచేసుకున్నాడు. పిల్లలు కూడా పుట్టారు అందులో చాలమంది పిల్లలు. ‘దరిద్రుడికి సంతతి ఎక్కువ’ అనే సామెత ఉండనే ఉంది. ఇంట్లో తాను పోషించవలసిన వారి సంఖ్య పెరిగినకొద్దీ దరిద్రం కూడా పెరిగింది. తన దారిద్య్రాన్ని గురించి ఎన్నడూ దుఃఖపడలేదు. తనని అందరూ కుచేలుడు అని పిలుస్తూ ఉన్నా బాధపడలేదు. కుచేలుని భార్య పేరు వామాక్షి. ఆమె మహాపతివ్రత. సద్గుణాలలో అన్ని విధాల అతనికి తగిన భార్య. కుచేలుని దరిద్రబాధని కూడా సంతోషంతోనే పంచుకునేది. ఏ బాధైనా మితిమీరితే బాధగానే ఉంటుంది. భరింపరాని దారిద్య్రం అనుభవిస్తున్నా భర్తను బిడ్డల్ని చూచి ఆమె చాలా నొచ్చుకునేది. బిడ్డలు రోజుల తరబడి అన్నం లేక ఆకలి బాధతో మలమల మాడుతూ ఉండేవారు. కడుపులో మంట భరించలేనపుడల్లా మంచి నీళ్ళతో పెదవులు తడుపుకునేవారు. ఒక్కొక్క వేళ అగ్నిహోత్రంలాంటి ఆకలికి తాళలేక వాళ్ళకి మనస్సు సొమ్మసిల్లి పోయేది. భయంతో ఏమీతోచక తలా ఒక విస్తరాకు తెచ్చుకొని తల్లిచుట్టూ చేరేవారు. ‘‘అమ్మా మాకు పట్టెడన్నం పెట్టు చాలు’’ అని దీనులై వేడుకొనే వారు. ఆమెకు కడుపు తరుక్కుపోయేది. ఒకనాడు ఆమె తన భర్త వద్దకు వచ్చి ‘‘మా అందరి జీవితాలు మీ ఆధీనంలో ఉన్నాయి. నేనేమీ చెప్పనక్కరలేదు. పేదరికం చూస్తే ఇల్లు నలు మూలలా ముంచెత్తుతున్నది. దీనికేదైనా ఉపాయం ఆలోచించరైతిరి కదా? వామాక్షి సలహా : ఆ మాటలు విని కుచేలుడు ఆలోచనలో పడ్డాడు. పరిష్కారమార్గం ఏమీ మనస్సుకు తట్టలేదు. ఆమె మళ్ళా కలుగచేసుకొని యిలా అంది. ‘‘శ్రీకృష్ణుడు మీకు బాల్యసఖుడు కదా? అతడు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు. ఒక మాట పోయి అతని దర్శనం చేసి రారాదా. అంటూ ఈ విధంగా అంటుంది… బాల సఖుడైన యప్పద్మ పత్రనేత్రుఁ గాన నేగి దారిద్య్రాంధకార మగ్ను లైన మమునుద్దరింపుము హరికృపాక టాక్షి రవిదీప్తి పడుసి మహాత్మ నీవు! శ్రీకృష్ణుడు కోరినవాళ్ళకి వరాలు ప్రసాదిస్తాడు. సాధు స్వభావం గల భక్తిజనాన్ని చూస్తే అతనికి ప్రీతిఎక్కువ. వారు దేనినీ కోరరుకదా! అని జాలిపడతాడు. ఏబాధలలో ఉన్నవాళ్ళకైనా అతడే దిక్కు. ఆమె పలికిన మాటలు వినేసరికి అతనికి సమంజసమే అనిపించింది. భార్య సద్బుద్ధికి మనస్సులో మనసులో సంతోషం కలిగింది. ‘‘నీవు చెప్పినట్లు కృష్ణమూర్తి చరణకమలాలను ఆశ్రయించడానికి వెళ్ళడంలో చాలా శోభున్నది. దర్శనానికి వట్టి చేతులతో ఎలా వెళ్ళటం? కానుకగా కొనిపోవటానికి మనదగ్గర ఏదైనా ఉన్నదా?’’ ఆమాటలు విని ఆమె ఇంట్లో ఉన్న కాసిన అటుకులు తెచ్చి తన భర్త కట్టుకున్న చినిగిన వస్త్రానికి చోటు చూసి కొగున పోసి ముడేసింది. కుచేలుడు వెంటనే బయలుదేరి వెళ్ళాడు. నేనెక్కడ? కృష్ణుడెక్కడ?: బయలుదేరిన కుచేలుడికి దారిలో అనేక సందేహాలు. దారిద్రంతో ఉన్నవానికి ధైర్యం సడలుతుంది. సందేహాలు కలిగి తీరుతాయి. ‘‘నేను ద్వారకానగరంలో ప్రవేశించడటం ఎలా సాధ్యం. శ్రీకృష్ణుడు ఎక్కడో అంతఃపురాలలో మహాభవనాలలో నివాసం చేస్తూ ఉంటాడు. అతడు అందరికి ఈశ్వరుడే. అబ్బో! అతని కోసం పడికాపులుండి వేచి ఉండెవాళ్ళెందరో! అలాంటి వాణ్ణి దర్శించటం మనతరమా! తీరా అతనికోసం పడికాపులుండి వేచి ఉండేవాళ్ళెందరో! అలాంటి వాణ్ణి దర్శించటం మన తరమా! ఇట్లా పరి పరి విధాల భావిస్తూనే కుచేలుడు ద్వారకానగరంలో ప్రవేశించాడు. రాచబాటల వెంట చాలా దూరం నడిచాడు. అనేక ప్రాకారాలు దాటిపోయాడు. కొంతదూరం సాగిపోయేసరికి ఎదురుగుండా ఒక సుందర మహాభవనం కనుపించింది. అది శ్రీకృష్ణుని నివాసమని గ్రహించాడు. కుచేలుడు మనస్సుకి బ్రహ్మానందమైంది. సంతోషం పట్టలేక కన్నులవెంట ఆనందభాష్పాలు ధారలు కట్టినాయి. అది శ్రీకృష్ణుని అష్టభార్యలలో ఒకరియిల్లై ఉండచ్చును. కుచేలుడు సూటిగా ప్రవేశించాడు. ఎదురుగా శ్రీకృష్ణుడు సాక్షాత్కరించాడు. కుచేలుడు దర్శనానికి మైమరచి మెచ్చుకుంటూ కొంత సమీపానికి పోయాడు. దూరం నుండి కృష్ణుడు తేరిపారజూచాడు. తన బాల్యసఖుడైన కుచేలుని క్షణాలతో పోల్చుకుని గుర్తించాడు. కుచేలుడు చినగిన వస్త్రాలతో పేలికలవుతూ ఉత్తరీయంతో వేషం, రూపం హాస్యాస్పదంగా ఉన్నాగాని కుచేలుడుని చూసిన మరుక్షణమే తొట్రుపాటుతో తన తల్పందిగి ఎంతో అపేక్షతో ఎదురుగా వచ్చి గట్టిగా కౌగిలించున్నాడు. ఎంత బాంధవ్యం! ఎంత ప్రేమ! ఆ కుచేలుణ్ణి సూటిగా తెచ్చి తన తల్పం మీద కూర్చుండ బెట్టాడు. ఎంతో చనువుతో, ఎంతో గౌరవంతో బంగారు చెంబులో నీళ్ళు తెచ్చి బ్రాహ్మణునికి పాదప్రక్షాళనం చేశాడు. పాదతీర్థం భక్తితో నెత్తిన చల్లుకున్నాడు. కస్తూరి, పచ్చకర్పూరం కలిపిన మంచిగంధం కుచేలుని దేహానికి పూసి గౌరవించాడు. విసనకఱ్ఱ తీసుకొని విసురుతూ నిలబడ్డాడు. ఘుమఘుమలాడే సుగంధధూపం తెచ్చి ఉపచారం చేశాడు. పరిమళం వెదజల్లుతూ ఉన్న పువ్వులు అలంకరించాడు. కర్పూర తాంబూలం చేతికిచ్చి ఒక చక్కని గోవును దూడతో సహా దానం చేశాడు. ఆహా! ఎంత అదృష్ణం! మిత్రమా! స్వాగతమా! అని అదరంతో ప్రశ్నించాడు. కుచేలునికి ఒళ్ళు తెలియదు. దేహం మీద పులకరింతలు అంకురించాయి. ఆనందబాష్పాలు ధారలుగా ప్రవహించాయి. శ్రీకృష్ణుని ప్రేమాదరాలు చూరగొన్న రుక్మిణీదేవి కూడా స్వయంగా చామరం వీవన సమర్పించింది. ఆమె గాజుల శబ్దాలు ఘల్లుమని మనోహరంగా విన్పించాయి. ఆమె వీచిన వీవనతో అలసిఉన్న కుచేలుని దేహం మీద చెమట బిందువులు ఆరిపోయి దేహం శాపం శమించింది. అంతఃపుర స్త్రీలందరు నిర్ఘాంతపోయారు. శ్రీకృష్ణుడు తన సఖుని చేయిపట్టుకొని ఆపేక్షితో చనువుతో ఇలా ప్రసంగించాడు ‘‘మన చిన్నతనంలో గురువుల యింట గడిపిన రోజులు, జరిగిన సంఘటనలు నీకు జ్ఞప్తి ఉన్నాయా? అప్పటికీ ఇప్పటికీ మనం ఒకలాగే ఉండిపోయాం. ఇల్లని, పొలాలని, ధనాలనీ, భార్యా పుత్రులని తాపత్రయం నీ మనస్సుకి కొంచెం కూడా అంటినట్లు లేదు. నేను చేస్తూ ఉన్నట్లె నీవు కూడా లోక శ్రేయస్సు కోసం నీ పనులు నిర్వరిస్తూ ఉన్నట్లు కనిపిస్తుంది. ఔనులే! నీ బోటి మహానుభావులకి కోరకలు, మోహాలు అంటవు’’ అంటూ శ్రీకృష్ణుడు కుచేలునితో తన అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఈ విధంగా తమ బాల్య జీవితాన్ని గురించి కృష్ణుడు చేసిన మధురమైన సంభాషణలు విని సంతోషంతో తబ్బిబ్బుగా కుచేలుడు ఇలా అన్నాడు. కృష్ణా! మనం గురువుగారి ఇంట్లో నివాసం చేస్తూ ఉన్న రోజుల్లో నీవు చేయని పనులేమున్నాయ్‌. ఇదంతా నీకొక క్రీడ. అంటూ ఈవిధంగా అంటాడు… గురుమతిఁ దలఁ పగఁ ద్రిజగ ద్గురుఁడవనందగిన నీకు గురుఁవనఁగా నొం డొరుఁ డెవ్వఁ డిరతయును నీ కరయంగ విడంబనంబయగుఁగాదె హరీ! భక్తితో ఏదిచ్చినా తీసుకుంటాను : కుచేలుని మాటలు విని చిరునవ్వుతో కృష్ణుడు ఇలా అన్నాడు. ‘‘నీకు నా మీద ఎంతో భక్తి ఉన్నది కదా మరి ఇక్కడికని బయలుదేరే టప్పుడు నాకోసం కానుకగా ఏం పట్టుకొచ్చావు? ఏమి తెచ్చినా పరవాలేదు. కొంచెం తెచ్చినా కూడా పదివేలుగా సంతోషిస్తాను. నాయందు భక్తిలేనివాడు ఎంత విలువైన వస్తువు తెచ్చినా అంగీకరించలేను. నీ బోటి నిశ్చలమైన భక్తిగలవాళ్ళు పండుతెచ్చినా పువ్వుతెచ్చినా చాలు, తులసిదళం తెచ్చినా చాలు. ఏమీ లేకపోతే వారి చేతితో మంచి నీళ్ళిచ్చినా నేను పరమాన్నంగా భావించి స్వీకరిస్తాను’’. కృష్ణుడు పలికిన పలుకుతో వినయానికి, సత్యవాక్కుకి విప్రుడు చాలా సంతోషించాడు. తెచ్చిన అటుకులు సమర్పిద్దామా అనిపించింది. ఇంతలో అంత చిన్న కానుక తెచ్చానని సిగ్గు కలిగింది. తన దారిద్య్రం జ్ఞప్తికి వచ్చి మొగం దించుకొని, తలవంచు కొని ఏమీ మాట్లాడకుండా నిలబడ్డాడు కుచేలుడు. శ్రీ కృష్ణుడు అదేమిటి? అని ప్రశ్నించి తానే మూట పుచ్చుకున్నాడు. తన చేతితో ముడివిప్పి ఒక గుప్పెడు అటుకులు తీసి ఆరగించాడు. ఆరగిస్తూ ఇట్లా సంకల్పించాడు. ‘‘ఇవి సకల లోకాన్ని, నన్ను కూడా తృప్తి పరచటానికి చాలు’’ అనుకొని కుచేలునికి సకల సంపదలు భవనాలను ప్రసాదించాడు. శ్రీకృష్ణ కుచేలుల స్నేహబంధం అపూర్వమైనది. తన బాల్య స్నేహితుడైన కుచేలుడు తన దర్శనానికి వస్తే శ్రీకృష్ణుడు ఆదరాభిమానాలను చూపాడు. తన భక్తుడు అయిన కుచేలుడు ప్రేమతో తెచ్చిన అటుకులను స్వీకరించి తన స్నేహితుడు కష్టాలను తొలగించాడు. దయాగుణం, నిర్మలమైన మనస్సు, రాగద్వేషాలు లేకుండా వుండటం మొదలైన సత్త్వగుణాలు ఉన్నవారికి భగవంతుడు బానిస అవుతాడు అనేది కుచేలుడు పాత్ర ద్వారా మనకు తెలుస్తుంది.
ఆధార గ్రంథాలు :
1) కుచేలుడు డాక్టర్‌ ఎక్కిరాల కృష్ణమాచార్య
2) శ్రీమద్భాగవతం ` పోతన (మూల గ్రంథము)

తోట రామకృష్ణ
తెలుగు పరిశోధక విద్యార్థి, ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం,
రాజమహేంద్రవరం.
ఫోన్‌ : 7995504687

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *