ఆధునిక తెలుగు సాహిత్యం – మానవతా విలువలు

‘‘హితేన సహితం సాహిత్యం’’ అని అన్నారు. అంటే హితాన్ని తెలియజేసేది, మేలు చేకూర్చేది సాహిత్యంగా చెప్పబడుతుంది. ఎవరికి, దేనికి హితం అనేది మాత్రం ఆయా కాలాన్ని, సంస్కృతిని, సమాజంలో మార్పులను బట్టి ఉంటుంది. ఏదైతేనేమి సమాజానికి, మానవులకు హితాన్ని చేకూర్చేదే సాహిత్యంగా, అదే ఉత్తమ సాహిత్యంగా భావించవచ్చు. ‘‘విశ్వ శ్రేయః కావ్యమ్‌’’ అని ఆంధ్ర శబ్ద చింతామణిలో నన్నయ్య గారు తెలిపారు. మన తెలుగు సాహిత్య భారతానువాదంలో ఆద్యంతము మానవతా విలువలను తెలుపుతూ ముందుకు సాగిందని చెప్పవచ్చు. దీనిని బట్టి సాహిత్యం మనకు మేలును కలిగిస్తూ సామాజిక, మానవతా విలువలను తెలియజేస్తూ తద్వారా ప్రపంచ శాంతిని, శ్రేయస్సును కలిగిస్తుందని చెప్పవచ్చు. ఉత్తమ సాహిత్యం మన సంస్కృతి,నాగరికతలను తరువాత తరాల వారికి అందించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ‘‘సమాజ హితస్య సాహిత్యం’’ అంటే సమాజం మేలుని కోరేది సాహిత్యం. సమాజానికి, సాహిత్యానికి అవినాభావ సంబంధం ఉందని, సాహిత్యం అనేది సమాజానికి అద్దం పడుతుందని భావించ వచ్చు.పాఠకులు సాహిత్యం ద్వారా వివిధ రకాల అనుభూతులను, మానసిక ఆనందాన్ని పొందుతారు. సమాజం పట్ల సాహిత్యం వహించే పాత్ర అత్యంత ముఖ్యమైనది. అలాగే సాహిత్యం కూడా సమాజంపై ఆధారపడుతుంది. కవులు, రచయితలు సమాజంలోని వ్యక్తులే కాబట్టి ఉత్తమ రచయితలు బాధ్యతాయుతంగా సామాజిక సమస్యలపై దృష్టి సారిస్తూ రచనలు చేయడం మంచిదని భావించాలి. మానవతా విలువలు పరిరక్షణకు సరైన సాధనం సాహిత్యం మాత్రమే. నాటి నుండి నేటి వరకు కూడా అనేకమంది కవులు మానవతా విలువలు జోడిరచి తమ రచనలను కొనసాగిస్తున్నారు. వారు సమాజ శ్రేయస్సును కోరారు. రచయితల్లో కూడా మానవతా దృక్పథం
ఉన్న వాళ్ళు, లేని వాళ్ళు ఉంటారు. ఉత్తమ సాహిత్యం ఎల్లప్పుడూ మానవులు, వాళ్ళ సమస్యలు, సంఘర్షణలను వెలికి తీసి చూపెడుతుంది. ‘‘మానవుడు తనను తాను తెలుసుకొని, ఆత్మవిశ్వాసం పెంచుకొని, సత్యం కోసం, న్యాయం కోసం పోరాడేలా చేసి, మానవుడిలోని నైచ్యతను నిర్మూలింప చేయటానికి ఉత్తమ గుణాల్ని ఉత్తేజితం చేస్తూ అధర్మం మీద క్రోధం, దౌర్జన్యానికి సిగ్గుపడటం, న్యాయ రక్షణకు ధైర్యం, సౌందర్యం పట్ల ప్రేమ పెంచగలిగేదే ఉత్తమ సాహిత్యం’’ అని మాక్సిమ్‌ గోర్కీ అన్నారు. సంఘర్షణాభరితమైన సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో, రచయితల, కవుల, కళాకారుల పాత్ర ఎంతైనా ఉంది. వీరు ఎల్లప్పుడూ సమాజాన్ని పరిశీలిస్తూ తమ కర్తవ్యాన్ని గుర్తు చేసుకుంటూ, విలువలను కాపాడుకుంటూ తద్వారా నవ సమాజ నిర్మాతలుగా మారతారు. తమ భావాలను వ్యక్తపరచడానికి వారు సాహిత్య రచనను ఎన్నుకుంటారు. అదే సరైనది. తగినది కూడా. ఉత్తమ సాహిత్యం ద్వారా మానవత్వకాంక్ష, సమతా భావన పెంపొందించబడుతుంది. అలాగే మానవుని ఆలోచన శక్తిని పెంచి, సంస్కారాన్ని, మానసిక పరివర్తనను కలిగిస్తుంది. మానవతా విలువల్ని గ్రహించేలా చేసి సన్మార్గంలో జీవించేలా చేస్తుంది.వేమన లాంటి శతక కవులు ఎందరో సమాజంలో ఉండే లోటుపాట్లని ఎత్తి చూపించి కనువిప్పు చేశారు.
‘‘లోకాః సమస్తాః సుఖినోభవంతు’’, ప్రపంచంలో అన్ని జీవులు సంతోషంగా ఉండాలని ఈ శాంతి మంత్రం అర్థం. నేడు మానవ సంబంధాలు కనుమరుగవుతున్నాయి. ఎవరికి వారు వారి స్వార్థం కోసం జీవిస్తూ దూరం అవుతున్న సమయంలో ఇవే సమకాలీన అంశాలుగా స్వీకరించి అందమైన కవితలలో కవులు సాహిత్య సేవను అందిస్తున్నారు. రాను రాను సాంకేతికత పెరగడం వల్ల మనుషులు కూడా యంత్రాల మాదిరిగా మారిపోతున్నారు. నైతిక విలువలకు, మానవ సంబంధాలకు దూరమవుతున్నారు. శారీరిక శ్రమ కూడా తగ్గిపోతుంది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్లు కొన్ని వృద్ధి చెందడం వల్ల కొన్నిటిని కోల్పోవాల్సి వస్తుంది. మనుషులలో కనీసం ఉండవలసిన మానవత్వం కూడా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది. స్వార్థం పెరిగిపోతుంది. ఇది గమనించిన మన తెలుగు కవులు నాటి నుండి నేటి వరకు ఆ అంశాలనే దృష్టిలో పెట్టుకుని తమ రచనలలో ప్రతిబింబింప చేశారు. కాకపోతే అలాంటి కవులు చాలా అరుదుగా ఉన్నారు. నేటి కాలంలో వారి సంఖ్య ఇంకా తగ్గిపోతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. సమాజానికి, సాహిత్యానికి ఏమైనా మేలు చేయాలి అని తపన పడేవారు చాలా అరుదుగా ఉన్నారు. స్వలాభం, కీర్తి ప్రతిష్టలకు ప్రాకులాడకుండా తమ రచనల ద్వారా సామాజిక అభివృద్ధికి తోడ్పడితే ఎంతో బాగుంటుంది. మన ఆధునిక తెలుగు సాహిత్యంలో కొందరు కవుల గురించి తెలుసుకుందాము.
నవయుగ వైతాళికుడు ఆధునికాంధ్ర సాహిత్య యుగకర్త అయిన గురజాడ అప్పారావుగారు తన భావుకతకు సామాజిక దృక్పథాన్ని చేర్చి జాతిని జాగృతపరిచారు.
‘సొంత లాభం కొంత మానుకు
పొరుగు వారికి తోడుపడవోయ్‌’
‘దేశమంటే మట్టి కాదోయ్‌
దేశమంటే మనుషులోయ్‌’
‘మతం వేరైతేను యేమోయ్‌?
మనసులోకటై మనుషులుంటే’
అని తన ‘దేశభక్తి గేయం’ ద్వారా సామాజిక దృష్టిని, సమతా భావనను తెలియజేశాడు..
ఈ సృష్టిలో మానవత్వాన్ని మించిన కులం,మతం లేదంటూ ..
‘మతములన్నియు మాసిపోవును
జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’
‘మంచి చెడ్డలు మనుజులందున
యెంచి చూడగా రెండె కులములు
మంచియన్నది మాలjైుతే
మాలనే అగుదున్‌’
అని వర్ణవ్యవస్థను నిరసించాడు.కన్యాశుల్కం నాటకంలో మధురవాణి గిరీశంతో ‘సానిదానికి నీతి ఉండదా ఏమిటి?’ అని పలుకుతుంది. అంటే మానవత్వం అనేది ఏ కులానికో, మతానికో, జాతికో పరిమితం కాదు.అని గురజాడ వారు మధురవాణి ద్వారా పలికించారు.
‘మనిషి చేసిన రాయిరప్పకి
మహిమ కలదని సాగి మొక్కుతు
మనుషులంటే రాయిరప్పల కన్న కనిష్టం
గాను చూస్తావేల బేలా’
గురజాడ నాస్తికుడు కాడు. గొప్ప మానవతావాది. దేవుడున్నాడు కానీ మనిషి కన్నా అతీతుడుకాడని, మనిషే దేవుడని ‘మనిషి’ అనే చిన్నగేయం ద్వారా ప్రబోధించాడు.మంచితనమే దైవమని,మంచిని ప్రేమించడం దైవారాధన అని భావించాడు. గురజాడ గొప్ప తత్వవేత్త, కాంత దర్శి. అందుకే శ్రీశ్రీ గారు గురజాడని గురించి ఇలా అన్నారు
‘‘అడుగుజాడ గురజాడ
అది భావికి బాట’’-శ్రీ శ్రీ( సిప్రాలి)
ఏదేమైనా మానవత్వపు పునాదులపైనే మన సమాజభవిత నిర్మించబడుతుంది.
గురజాడ రాసిన ‘మనిషి’గేయానికి రవీంద్రుని గీతాంజలి రచనకి దగ్గర సంబంధం ఉందని చాలామంది అభిప్రాయపడతారు. కానీ వారు ఒకరికొకరు తెలియకుండానే ఆ రచనలు రాశారని కొందరు భావిస్తారు. గురజాడ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ ఇద్దరూ ఒకే సంవత్సరంలో జన్మించారు. ఇద్దరూ ప్రకృతి ప్రియులు, మానవతా వాదులు. ఇద్దరిని మానవతోద్యమం బాగా ఆకర్షించింది. గురజాడ అప్పుడప్పుడు రవీంద్రున్నికలుస్తూ ఉండేవారు. రవీంద్రుని ‘దిక్కులేని దీనురాలు’ కథ హృదయ విధారకమైన కథ. ఈ కథ చదువుతూ ఉంటే ఎంతటి కఠిన హృదయం కలిగిన వారి మనసునైనా ద్రవింప చేసి స్పందించేలా చేస్తుంది.. ఇలా వీరు ఇరువురి రచనలలో అనేకం సామాజిక మానవతా దృక్పథంతో కూడినవి ఉన్నాయి.
జాషువా గారు సమాజంలో దళితులపై జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను, అవమానాలను, అంటరానితనాన్ని ప్రశ్నిస్తూ వాటిని వ్యతిరేకిస్తూ కవిత్వం రాశారు. జాషువా రాసిన ‘గబ్బిలం’ కావ్యం అద్భుతమైన సందేశాత్మక కావ్యంగా నేటికీ ప్రశంసించబడుతుంది. ఇది కల్పిత కావ్యమైనప్పటికీ వాస్తవానికి దగ్గరనిపిస్తుంది. సాహిత్యం అనేది ప్రజలకు ఆనందాన్ని,చైతన్యాన్ని కూడా కలిగించగలగాలి.బాల్యం నుండి అట్టడుగు వర్గాలపై చూపే నిరాధారణ, అస్పృశ్యతను జాషువా సొంతంగా అనుభవించడం వల్ల తన మనసులో చెరగని ముద్రపడిరది.కాబట్టే తన రచనల్లో వాటిని దుయ్యబట్టాడు. అందరికీ తెలిసేలా చేసి, ఆలోచింపజేశాడు. జాషువా ‘గబ్బిలం’ కావ్యం ద్వారా సమాజంలోని అసమానతలు తెలిపి మానవతావిలువలను పెంపొందింపజేశాడు.
‘వాని రెక్కల కష్టంబు లేనినాడు
సస్యరమ పండి పులకింప సంశయించు
వాడు చెమ్మటలోడ్చి ప్రపంచమునకు
భోజనము బెట్టు వానికి భుక్తి లేదు’
అంటూ తన ‘గబ్బిలం’ కావ్యం లో కష్టపడి శ్రమించి భోజనం పెడుతున్న శ్రామికులకు మాత్రం తినడానికి తిండి లేదని వాపోయాడు.
‘నరుని కష్టపెట్టి నారాయణుని గొల్చు
ధర్మశీలురున్న ధరణి మీద …’ -జాషువా( గబ్బిలం)
జాషువా ‘కొత్త లోకం’ కావ్యంలో జాతిని జాగ్రత్తపరిచాడు. సమాజాన్ని ఒక కొత్త లోకం వైపు నడిపించాడు. రాజుకి కవికి మధ్యగల భేదాన్ని తెలియజేశాడు. ఇందులో కవికి గల ప్రాధాన్యతను అలాగే కవి బాధ్యతలను తెలియజెప్పాడు. ‘‘సుకవి జీవించు ప్రజల నాలుకల యందు’’ అంటూ ఉత్తమ కవులను ప్రజలు ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటారని తెలిపాడు. అందుకే సుకవి అయిన జాషువాను ఇప్పటికీ మనం తలుచుకుంటూనే ఉంటాము.
పీడిత ప్రజల పక్షాన నిలబడి శ్రామిక లోకపు సౌభాగ్యానికి, కార్మికలోకపు కల్యాణానికి మానవతా హృదయంతో తన కవిత్వాన్ని ధారబోసిన గొప్ప అభ్యుదయకవి శ్రీశ్రీ. మహాప్రస్థానం, ఖడ్గ సృష్టి, మరో ప్రస్థానం లాంటి రచనల ద్వారా ప్రజాపోరాట కవిగా ప్రసిద్ధికెక్కారు. శ్రీశ్రీ తన రచనల ద్వారా సమాజాన్ని, యువతను అభ్యుదయం వైపు నడిపించారు. శ్రీశ్రీ తన కవిత్వం ద్వారా సమాజంలోని మలినాలను కడిగేయదలుచుకున్నాడు. శ్రీశ్రీ తన మహాప్రస్థానంలో జయభేరి కవితలో …
‘‘నేను సైతం / ప్రపంచాగ్నికి
సమిధనొక్కటి ఆహుతిచ్చాను’’
ఈ కవితలో ‘నేను సైతం’అనే మాటలు పునరుక్తి కావడంతో పాఠకునిలో భావావేశం కలుగుతుంది.ఇందులో ‘నేను’ అనే పదం వైయక్తికం కాదని, సామాజికత కలిగిన పదమని తెలుస్తుంది. అందుకే శ్రీశ్రీని ఒక సామూహిక చైతన్యానికి ప్రతీకగా చెబుతూ ఉంటారు. ఇక్కడ సమిధ,ఆహుతి అనే పదాలకు అర్థం స్వార్థం లేకుండా తనను తాను సమర్పించుకోవడంగా భావించాలి. శ్రీశ్రీకి మనిషి మీద మానవత్వం మీద ఎంతో నమ్మకం అందుకే ఆయన ‘ఉగాది’ కవితలో ఇలా అన్నారు.
‘అణుశక్తి మీద అధికారం / మానవ శక్తిదే
అందుకే మానవత్వాన్ని మించిన / మతం నాకు లేదు
మానవ శక్తినే విశ్వసిస్తాను’.
శ్రీశ్రీ ఆణిముత్యాలు లాంటి పాటలెన్నో రాశారు. ఆయన రాసిన ‘‘తెలుగువీర లేవరా దీక్షబూని సాగరా’’ అనే పాటకు జాతీయ ఉత్తమ గేయ రచయితగా అవార్డును పొందాడు. శ్రీశ్రీని ఒక వ్యక్తిగా కాక ఒక శక్తిగా భావిస్తారు.
పైన తెలిపిన కవులే కాకుండా సి.నారాయణరెడ్డి గారు, కాళోజి, కుందుర్తి మొదలైన అనేకమంది కవులు ఎన్నో గొప్ప రచనలు చేశారు. నేను మచ్చుకకు కొందరిని గురించి మాత్రమే తెలిపాను.
ముగింపు : బాల్య దశ నుండే చిన్నారులకు నీతి కథలు బోధించాలి మహనీయుల జీవిత చరిత్రలను చదివేలా ప్రోత్సహిం చాలి. భగవద్గీతను చదివింప చేయాలి. గొప్ప వీరుల త్యాగాలను, సాహసాలను వారు తెలుసుకునేలా చేయాలి. వారిలో దేశభక్తిని పెంపొందింప చేయాలి. సమాజంలో వాళ్లు ఏ విధంగా మెలగాలో తెలియజెప్పాలి. ఈ విధంగా వారిలో నైతిక, సామాజిక, మానవ విలువలు పెంపొందించబడతాయి.
ఆధార గ్రంధాలు:
1) కళారవీ! కవీ! -డా. వి. వీరాచారి, ప్రజాహిత ప్రచురణలు, వరంగల్‌. (2011)
2) మహాకవి శ్రీశ్రీ భారతీయ సాహిత్య నిర్మాతలు- బూదరాజు రాధాకృష్ణ – సాహిత్య అకాడమీ (1999)
3) సాహితీమూర్తులు-స్ఫూర్తులు- డా. దార్ల వెంకటేశ్వరరావు, సొసైటీ అండ్‌ ఎడ్యుకేషన్‌ ట్రస్టు ప్రచురణ, హైదరాబాద్‌. (2015)

ఎం. అనంత లక్ష్మి
అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, తెలుగు, సెయింట్‌ జోసెఫ్‌ కళాశాల,
హైదరాబాద్‌.
ఫోన్‌ : 8978432973

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *