సాక్ష్యాన్ని కౌగిలించుకోండి

అమ్మను పిలవడానికీ, పాలు తాగడానికీ
పెదవులు లేవు
నవ్వులనూ లాలిపాటలనూ వినడానికి
చెవులు లేవు
కాసింత ప్రేమగాలిని పీల్చడానికి
దేహంలో జీవం లేదు
బాంబు పొగలో చర్మం ఆవిరై
దేహం ఛిన్నాభిన్నమై నేను దొరికితే..
మా అమ్మ పెట్టిన ముద్దుల ఆనవాళ్లు
కనిపించడం లేదని గుర్తు చేయకండి.
అమ్మ వొడిలో తలవాల్చిన తల
ఇప్పుడు నా దేహానికి లేదని
గుర్తు చేయకండి.
మా అమ్మింకా బతికే ఉందని గుర్తు చేయకండి
చూడ్డానికి కళ్ళు లేవు
స్పర్శించడానికి చేతుల్లేవు
ఆమె పాదముద్రల్లో పాదాలేసి నడవటానికి
కాళ్ళు లేవు
మా అమ్మింకా బతికే ఉందని గుర్తు చేయకండి
నాకోసం పరిగెత్తుకుంటూ వస్తుందని నాతో చెప్పకండి
దొగ్గాడుతూ ఎదురెల్లటానికి
నేనిప్పుడు పసిపాపను కాదు
మాంసం ముద్దనూ కాదు
ఒట్టి బొక్కల చూరను.
మా అమ్మింకా బతికే ఉందని గుర్తు చేయకండి
మళ్ళీ నా పేరును నాకే గుర్తు చేయకండి
చనిపోయిన నాతోటి పసిపిల్లల పేర్లను గుర్తు చేయకండి
ఇది బాల్యానికి చోటులేని దేశమని గుర్తు చేయకండి
రొట్టె ముక్కలను బాంబులు లాక్కుంటాయని
గుర్తు చేయకండి
అస్థిపంజరం అనే పేరు గాంచిన
బొక్కలగూడు మాత్రమే నేను.
కూల్చబడ్డ ఆసుపత్రి గోడల కింద
నేను అస్థిపంజరమై దొరికితే
నన్ను కౌగిలించుకోడానికి నిరాకరించకండి
చచ్చిన మానవీయతకు
బాల్యాన్ని రుచి చూడని
ఈ అస్థిపంజరాలే సాక్ష్యం.
సాక్ష్యాన్ని కౌగిలించుకోండి!
మనసారా సాక్ష్యాన్ని కౌగిలించుకోండి!!

దొంతం చరణ్‌
ఫోన్‌ : 90002 15466

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *