ప్రయాణం


‘అయ గమనే’ అనే ధాతువు నుండి ‘అయనం’ అనే శబ్దం ఏర్పడుతుంది. అయనం అంటే గమనం. కదలిక. ఉత్తరాయణం, దక్షిణాయనం, రామాయణం వంటి పదాలు అయన శబ్దం నుండే ఏర్పడుతాయి. అయన శబ్దం యానంగా మారుతుంది. ప్రకృష్టమైన యానమే ప్రయాణం. కదలడానికి వినియోగపడే వస్తువులన్నీ ‘యాన’ శబ్దంలోకి వస్తాయి.
ప్రయాణం విషయంలో వాహనం, డ్రైవర్‌ చాలా ముఖ్యమైన అంశాలు. వాహనం జాగ్రత్తగా నడిపే వాడు అవసరం. నడిపేవాడు చాకచక్యంగా నడపకపోతే చేరవలసిన గమ్యం సమయానికి చేరుకోలేము. అదేవిధంగా వాహనాన్ని పాడుచేయకుండా నడపాలంటే మంచి చోదకుడూ అవసరమే. గమ్యం చేరుకోవడానికి ప్రయాణం చేస్తూనే ఉండాలి. శక్తి కోల్పోకుండా ప్రయాణం చేయాలి. శక్తి తగ్గిపోతే చేరవలసిన గమ్యం పూర్తిగా చేరుకోలేము. అందుకే నిరంతరం శక్తిని పెంచుకునే మార్గం తెలుసుకుంటే త్వరగా గమ్యం చేరుకుంటాం. డ్రైవర్‌కు ఎక్కువ అవకాశం ఇచ్చి అతని ఇష్టం ప్రకారమే ముందుకు వెళ్ళే వాహనం పాడు అవుతుంది, గమ్యం చేరడానికి సమయం చాలా పడుతుంది. అన్ని ఇబ్బందులూ ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ప్రయాణం చేస్తుంటే కొన్ని వాహనాలను అధిగమిస్తాం. మరికొన్ని మనను అధిగమిస్తాయి. వెంటబడేవి కొన్ని, హార్న్‌తో ఇబ్బంది పెట్టేవి కొన్ని, ట్రాఫిక్‌ నియమాలను పాటించనివి ఇంకొన్ని. మార్గ మధ్యంలో ఎన్నో స్పీడ్‌ బ్రేకర్‌లు, ఎన్నో ట్రాఫిక్‌ గుర్తులు. అన్నింటినీ గమనిస్తూ మన శక్తిని పెంచుకుంటూ, రోడ్డు ఎలా ఉన్నా చేరాల్సిన గమ్యానికి చేరుకోవడమే ప్రయాణం. వాహన లోపం రాకుండా, అవసరమైన ఇంధనం నింపుకుంటూ ప్రయాణం కొనసాగించాలి.
ప్రయాణం మధ్యలో ఉద్యానవనాలు, సరోవరాలూ వస్తాయి. స్మశానాలు, శవాలూ ఎదురు అవుతుంటాయి. ఎన్నో ప్రమాదాలు కూడా కనిపిస్తూనే ఉంటాయి. ఎన్నో మంచి మంచి ఆహారం దొరికే ప్రదేశాలు (దాబాలు), ఆహ్లాదం కలిగే ప్రదేశాలు కూడా కనిపిస్తుంటాయి. అన్నింటినీ చూస్తూ కూడా ఎక్కడా ఒక దానికి ప్రాధాన్యం ఇవ్వడం, రెండవదానిని పూర్తిగా వదిలివేయడం కూడదు. ప్రయాణం ద్వారా చేరవలసిన గమ్యమే ముఖ్యం. ప్రయాణ మార్గంలో ఎన్నో ఆకర్షణలు కనిపిస్తూ ఉంటాయి. అన్నింటినీ గుర్తు పెట్టుకోలేము. కాని అత్యవసరమైన వానిని మాత్రమే గుర్తు పెట్టుకుంటాం. అవి మన అవసరాలు మాత్రమే. గమ్యం మాత్రమే గమనించేవాడే ఉన్నతుడు.
ప్రయాణం చేస్తున్న సందర్భంలో డ్రైవర్‌కు, ఓనర్‌ యొక్క వేగం అర్థం కావాలి, వాహనాన్నీ పాడు చేయకుండా నడపాలి. అవసరమైన ఇంధనం, గాలి, నీళ్ళు వాహనంలో నింపుకోవాలి. తగిన విశ్రాంతి మాత్రం ఇస్తూ, ప్రయాణం కొనసాగిస్తుండాలి. డ్రైవర్‌ నడపడంలో అత్యద్భుతమైన చాకచక్యం చూపించాలి. ఓనర్‌ మాటకు పూర్తిగా విలువను ఇవ్వాలి. అప్పుడే మార్గం సుగమం.
జీవితం అనే ప్రయాణంలోనూ నడిపేవాడు (మనస్సు) చాలా ముఖ్యమైనవాడు. నడిపేవానిపైననే వాహనం (దేహం) యొక్క స్థితి ఆధారపడుతుంది. నడిపేవాడు ఇబ్బంది పెడితే వాహనం ముందుకు వెళ్ళదు, అదేవిధంగా ఓనర్‌ (ఆత్మ) ప్రయాణం ఆగిపోతుంది. ఒడిదొడుకులకు తట్టుకునే శక్తి వచ్చి సరిjైున విధంగా ప్రయాణం చేస్తుంటే జీవిత విధానమూ అర్థం అవుతుంది. సాఫల్యమూ సిద్ధిస్తుంది. ప్రయాణం ఎన్నో జీవిత సత్యాలను నేర్పిస్తుంది. అడుగడుగున ప్రయాణం చేస్తున్న విధానాన్ని దర్శిస్తూ, ఇంతకు ముందుకన్నా ఇంకా ఉన్నతంగా ఉత్తమంగా ప్రయాణం సాగుతూనే ఉండాలి. లోకం ఆనందమయం కావాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *