అడవి అమ్మలగన్న అమ్మలా ఉన్నప్పుడు
నీడలు కాపాడేవి భూమిని
ఊటలు ఉవ్విళ్లూరి వాగులయ్యేవి
పండ్లు, ఫలాలు, దుంపలు, కాయలు ఆదుకునేవి జీవులను
గాలి ప్రాణవాయువై పంచేది ఆరోగ్యాలను
గాలి వేళ్లకు మలినం ఉంగరాలు ధరించగానే
మెడలో కాలుష్య హారాలు వేసుకోగానే
మొదలయ్యాయి పిచ్చెక్కినట్లు ప్రవర్తనలు
సూర్య రశ్మి కన్నతండ్రి లాగున్నప్పుడు
పంటలు వెలుతురు వేలు పట్టుకొని నడిచేవి
మలినాల వ్యాధి తగులగానే
వెలుతురుకు అమ్మోరు సోకినట్లు బొబ్బలు
నాలుక లెండిపోయిన దాహంతో భూమి
ఉక్కపోత ఊర్లోకి వచ్చి వేసింది తిష్ట
మట్టి తల్లి ప్రేమలు పంచినంత కాలం
మట్టి నానితే ఉండేది పెరుగన్నంలా
ప్రతి విత్తును చేసేది చల్లని చెట్టులా
మట్టిలో పొర్లి వచ్చినా
ఆరోగ్యాలు అమృతం తాగినట్లుండేవి
ఒల్లంతహూనం చేసినట్లు రంధ్రాలు పొడిచి
కాలుష్య పరిశ్రమలు పంపారు భూమిలోకి
ఇప్పుడు మట్టంటితే మలినాలంటిన భయం
వేలెత్తి ఎటువైపు చూపినా
మనసులు మలినాలు కానంత కాలం
సోదరులకు సోదరి రాఖీ కట్టినట్లుండేది
మమతలు వేలువిడిచిన మేనమామలయ్యేవి
ఎవరినైనా పలకరిస్తే ఆత్మీయత ఆదుకునేది
ఆలింగనం చేసుకుంటే ఆత్మలు ఒక్కటయ్యేవి
చేతులు కలిపితే ఊబిలోంచి పైకి లాగే చేయూత
కొమరవెల్లి అంజయ్య
సిద్ధి పేట, ఫోన్ : 98480 05676