ఒకే తల్లిగర్భంలోనుండి, ఒకే స్థలంలో, ఒకే సమయంలో పుట్టిన ఇద్దరు పిల్లలు పుట్టారు. వారు పెరగడానికి వినియోగించుకుంటున్న పాలు, నీళ్ళు, గాలి, ఆహారం మొదలైనవన్ని ఒకటే. విద్యాబుద్ధులు నేర్పించిన వారు ఒకరే. అయినప్పటికీ వారికి భవిషత్తులో కష్టసుఖాలు, లాభనష్టాలు, జ్ఞానవిజ్ఞానాలు వేరువేరు ఉంటాయి. వారు పుట్టడం, పెరగడం ఒక్కటే అయినపుడు జీవితం మాత్రం వేరుగా ఎందుకు అవుతుంది? జీవితంలో ఈ కష్టసుఖాలను, కలిమిలేములను, మరణాలను నిర్ణయించేది ఏమిటి? అని ఆలోచిస్తే అది అర్థంకాని, అంతుచిక్కని, అయోమయమైన ప్రశ్నగా మారుతుంది. కాని వీటన్నిటిని తారుమారు చేసేది వారివారి ‘కర్మ’ అని పెద్దలంటారు. ఈ కర్మను గురించి ధర్మరాజు భీష్ముడిని ఇలా అడిగాడు.
ప్రశ్న : యుద్ధంలో పట్టుబట్టి అందరిని చంపుకున్నాను. కారణం నేనేనని మనసు వేధిస్తుంది. పశ్చాత్తాపాన్ని త్రోసివేసే మార్గం చెప్పరా అని అడుగుతాడు. (అనుశాసనిక.1.4)
దీనికి సమాధానంగా భీష్ముడు ఒక్కవాక్యంలో ‘మనిషి దేనికి కర్తకాడు’ అని బోధించి, ఒక కథ చెప్పాడు. ఒక బ్రాహ్మణ స్త్రీ ఉండేది. ఆమె పేరు గౌతమి. శాంతిస్వభావురాలు. ఆమె కొడుకు పాముకరిచి చనిపోయాడు. బాధతో ఏడుస్తుంది. ఒక వేటగాడు కరిచిన పామును తాడుతో పట్టుకుని ఆమె దగ్గరకు తీసుకువచ్చాడు. అతడు ఆమెతో అమ్మా దీని తల పగలగొడుతా లేదా కత్తితో దీనిని నరికివేస్తా. ఏం చేయాలో చెప్పండి. ఇది చాలా చెడ్డపాము అన్నాడు.
ఆమె దానిని వదిలిపెట్టండని చెప్పింది.
‘‘ఇది మీ బాబును చంపింది. నేను దీనిని చంపుతాను’’ అన్నాడు.
అతని వైపు జాలిగ చూసింది. ‘‘దీనిని చంపితే నా బిడ్డ బ్రతుకుతాడా? వదిలిపెట్టు. ఆపదలు విధివశాన వస్తాయి. ఇది తెలుసుకోలేక ఆధములు పాపభారం పైన వేసుకుంటారు. చివరకు దుఃఖసముద్రంలో మునిగిపోతారు. ధర్మం తెలిసిన ఉత్తములు మాత్రం ఆ భారం మీద వేసుకోరు. ప్రశాంతంగా భవసముద్రాన్ని దాటిపోతారు’’ అంటుంది.
‘‘అర్థం లేకుండా మాట్లాడుతున్నావు. కోపంతో ఉన్న నాకు నీ మాటలు నచ్చడం లేదు. నేను ఈ పామును చంపకుండా వదలను’’ అన్నాడు అర్జునకుడు.
‘‘హింస నాకు నచ్చదు’’ అన్నది గౌతమి.
‘‘జనులకు బాధ కలిగించే జంతువులను చంపటంలో పాపంలేద’’న్నాడు వేటకాడు.
‘‘శత్రువైనాసరే మన చేత చిక్కినపుడు చంపరాదు’’ అన్నది.
‘‘నేను అంగీకరించను. పూర్వం దేవేంద్రుడు వృత్రాసురుడిని చంపలేదా? శివుడు దక్షుడి యజ్ఞాన్ని నాశనం చేయలేదా? ఈ హింసలు ధర్మమే కదా!’’ అన్నాడు.
‘‘ఇదంతా వింటున్న పాము, బోయవాడితో నేనేం తప్పుచేసాను? అసలు విషయం తెలుసుకోకుండా నన్ను చంపుతా అంటున్నావు? మృత్యువు ఆజ్ఞమేరకు ఈ బాలుడిని కరిచాను. నాకు ఈ బాలునిమీద కోపం గాని, కోరిక గాని ఏమిలేవు’’ అని పలికింది.
‘‘మృత్యువుకి సాధనమయ్యావు కనుక నిన్ను చంపితీరుతాను’’ అంటాడు వేటకాడు.
‘‘కుమ్మరివాడు కోలను ఎట్లతిప్పితే అట్ల తిరుగుతుంది సారె. తిరిగే సారెది దోషమా? కర్రతో తిప్పిన కుమ్మరిది దోషమా? అట్లాగే నేను మృత్యువు ఎట్ల చేయిస్తే అట్ల చేస్తాను. చంపే శక్తి నాకెక్కడిది?’’ అంది పాము.
‘‘వేసేవాడు విలుకాడు, బాణం ఏం చేస్తుంది? అని ఊరుకుంటారా ఎవరైనా? దాన్ని ముక్కలు చెయ్యకుండా చేతులు ముడుచుకుంటారా? ఎవరు పంపితేనేం, కాటువేసిన దానివి నువ్వుకదా! క్రూరజంతువ్వి నువ్వు. నిన్ను చంపితే పాపంరాదు. అంతేకాదు, మృత్యువుకి బుద్ధికల సాధనాలు మీరు. అందుచేత మిమ్మల్ని బతకనివ్వకూడదు. చంపెయ్యాలి’’ అంటాడు.
‘‘యజ్ఞంలో బుద్ధిగల సాధనాలుగా ఉండి హవిస్సు వేలుస్తారు ఋత్వికులు. అపుడు యజ్ఞఫలం యజమానిదా? రుత్వికులదా? యజమానిదే కదా? అందువల్ల తప్పేమైనావుంటే అది మృత్యువుదే. నాదేమిలేదు’’ అంటుంది పాము.
అప్పుడే అక్కడ మృత్యువు ప్రత్యక్షమయ్యింది. ‘‘నిన్ను నేను పంపినట్లే నన్ను యముడు పంపాడు. కాబట్టి ఈ బాలుడి చావుకి కారణం నువ్వూ కాదు, నేను కాదు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని, నేల, ఆకాశం, నీరు, గాలి మొదలైన వస్తువుల కదలికలన్నీ కాలస్వరూపుడైన యముని చేతిలోని పనులు’’ అంటుంది మృత్యువు.
పాము బోయవాడి మొహంచూసి, ‘‘మృత్యువు మాటలు విన్నావు కదా! నామీద తప్పు అంటగట్టడం ధర్మమా?’’ అంటుంది.
బోయవాడు నవ్వి, ‘‘మీరిద్దరు పాపాత్ములు. మీరీమాటలు చెపితే నేనేమి భయపడను’’ అంటాడు.
‘‘అంతా యముడిదే మాదేముంది అని పాము, మృత్యువు’’ అంటారు.
అంతలోనే యముడు ప్రత్యక్షమయ్యాడు.
‘‘ఈ పసివాడి చావుకు నేనూ, పాము, మృత్యువు కారణం కాము. అతడు చేసుకున్న కర్మనే అతడి చావుకు కారణమౌతుంది.’’
‘‘విను కర్మం బొనరించును
జననము, మరణంబు, నదియ సౌఖ్యము, దుఃఖం
బును గావించుం, దనచే
సిన దానిం బడకపోవ శివునకు వశమే?’’ (ఆనుశాసనిక. 1. 34) (వినుము. జీవుడు తాను చేసిన కర్మవల్లనే పుట్టుక చావులూ అనుభవిస్తాడు. అదే సుఖదుఃఖాలకూ కారణమౌతుంది. తాను చేసిన కర్మను తప్పించుకోవటం శివుడికి కూడా సాధ్యం కాదు) కాబట్టి మీరంత ఈ చర్చను ఆపేయండి అంటాడు.
అదంత విన్న గౌతమి, బోయవాడితో ‘‘పుత్రశోకం అనుభవించవలసినంతటి పాపం చేసుకున్న నాలాంటి వారికి ఇట్లాగే జరుగుతుంది. పిల్లల కర్మానుసారంగా వారికి ఇట్లాంటి చావు వస్తుంది. ‘‘సకల జనంబులు గర్మమునకు ననుగుణమైన తెరువునంబోదురు…’’ (ఆనుశాసనిక.1.39) కావున ఏడ్వడం, కోపపడడం రెండూ వద్దు. శాంతి పొంది పామును వదిలిపెట్టు అంటుంది.
ఇదంతా విన్న తరువాత జ్ఞానోదయమైన కిరాతుడు పామును వదిలిపెట్టాడు. మృత్యువూ, కాలుడూ సంతోషంతో వెళ్లిపోయారు. కాబట్టి ధర్మరాజా! నీవు దుఃఖాన్ని విడిచిపెట్టు. యుద్ధంలో చుట్టాలంతా మరణించటానికి కారణం వారి కర్మలే. నీవు కానీ, ధుర్యోధనుడు కానీ కారణం కారు అంటాడు భీష్ముడు.
ఇంతటి మహత్తరమైన కర్మ అర్థాలు, రకాలు, ఆలోచనల గురించి చూసినపుడు… కర్మ అనే పదం ‘కృ’ అనే ధాతువునుంచి పుట్టింది. కర్మ అనే పదానికి నిఘంటు పరంగా ‘చేయుట’ (ఆంధ్రవాచస్పత్యము. ప్ర.సంపు.పుట.304). ‘పని, కార్యము’ (శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు.రెం.సంపు.పుట.134) అనే అర్థాలు తెలుస్తున్నాయి. ఈ పదం ఆధ్యాత్మికంగా పూర్వకర్మల ఫలితమని అర్థమౌతుంది. ‘‘ఏక ద్రవ్యమగుణం సంయోగవిభాగేష్యనపేక్ష కారణమ్ ఇతి కర్మ లక్షణమ్…’’ (సత్యార్థ ప్రకాశము.పు.52) ఒక ద్రవ్యమునాశ్రయించి యుండి, గుణములు లేనిదై సంయోగ విభాగములను కలిగించడంలో నపేక్షారహిత కారణము క్రియ ‘కర్మ’మనబడుతుందని పై వాక్యార్థం.
సహజంగా కూడా సర్వ వ్యాపారాలు కర్మలే అని తెలుస్తుంది. ఈ విషయాన్ని భగవద్గీతలో ‘‘న హి కశ్చిత్ క్షణమపి జాతు తిష్ఠత్యకర్మకృత్ । కార్యతే హ్యవశః కర్మ సర్వః ప్రకృతి జైర్గుణైః ॥’’ (భగవద్గీత.3..5) ప్రకృతి గుణాలతో కూడిన ప్రతి ఒకరు కర్మ చేయకుండా ఒక్క క్షణం కూడా ఉండలేరని పై శ్లోకం తెలుపుతుంది. బలవంతంగా కర్మలు మానినట్లయితే తన ఉనికిని ఆత్మరూపస్థితిని తెలుసుకోలేక పోతారనే విషయాన్ని ‘‘న కర్మణా మనారమ్భాన్నైష్కర్మ్యం పురుషోక శ్నుతే…’’ (భగవద్గీత.3.4) అనే ఈ శ్లోక పాదం వ్యక్తపరుస్తుంది. ఈ వాక్యాల ఆధారంగా మనుషులు ప్రకృతిలో ఉండి, ప్రకృతితో మమేకమై, ప్రకృతిని ఆస్వాదిస్తూ కర్మచేస్తూనే ఉంటారు. కర్మచేయడానికి మార్గాలు మూడు రకాలు. అవి మనసు, వాక్కు, కాయము. కాళ్లు, చేతులు, ముక్కు, కన్ను, చెవి మొదలగు శరీరావయవాలతో చేసే పనులు కాయిక కర్మలు. వాక్ (మాటలు)తో చేసేవి వాచిక కర్మలు. మనసుతో అనుభవించు వికారాలన్నీ మానసిక కర్మలు. కాబట్టి మానవుని శరీరంలో ఏ భాగం కొంత పనిచేసిన అది కర్మగానే భావించాలి. అందువల్ల కర్మచేయని వారుండరు. సంచిత, ఆగామి, ప్రారబ్దం అనే మరో మూడు రకాల కర్మలుంటాయి. ఈ కర్మలను మరో రెండు రకాలుగా చెప్తుంటారు. అవి లౌకిక కర్మలు, వైదిక కర్మలని. లౌకిక కర్మలనేవి జీవనోపాధి కోసం చేసే వ్యాపారాది పనులు. వైదిక కర్మలనేవి వారు ఏర్పాటు చేసుకున్న మతం, కులం ఆధారంగా చేసే ఆధ్యాత్మిక కార్యక్రమాలు. వీటితో పాటు మరో రెండు రకాల కర్మలుగా చూడవచ్చు. అవి ఫలాపేక్ష కర్మలు, నిష్కామ కర్మలు. ఫలాన్ని ఆశించి చేసేవి కొన్నైతే ఫలాన్ని ఆశించకుండా చేసేవి మరికొన్ని. ఈ కర్మలను గురించి భారతంలో ఇంచుమించు సందర్భాను గుణంగా ఐదు అర్థాలలో వాడినట్లు కనిపిస్తుంది. 1. పని, కార్యము (విరా.4.122), 2. పుణ్య పాపకర్మము, సంచితము (భీష్మ.2.353), 3. లౌకిక వైదిక క్రియానుష్ఠానము నిత్య నైమిత్తికాది (శాంతి. 1.149), 4. విధ్యుక్త ధర్మము, కులాచారము (శాంతి. 1.279), 5. పాపము (1.304) వంటివి. కర్మను గురించి శ్రీభాష్యం విజయసారథి ‘‘పదార్థ గతికి కర్మయని పేరు. భిన్నము ద్రవ్యసమవేతమై సంయోగవిభాగ కారణమైనది కర్మ’’ యనబడును. ‘ఏకద్రవ్యమగుణం సంయోగ విభాగేష్వనపేక్షా కారణమితి కర్మ లక్షణమ్’ అని వైశేషిక దర్శనం తెలుపుచున్నది. ఉత్క్షేపణ, అవక్షేపణ, ఆకుంచన, ప్రసారణ, గమన భేదమున కర్మ ఐదు విధముల (న్యాయ వైశేషికములు సాంఖ్యయోగములు.పు.48) ఉంటుందని నిర్ధారించారు. కర్మలో గల భేదాల జోలికి పోకుండా అన్నిటికి కర్మనే కారణమని నిశ్చయించుకోవచ్చు. భాగవతంలో కర్మను గురించి
‘‘కర్మమున బుట్టు జంతువు
కర్మమునను వృద్ధిపొందు కర్మమున జెడున్
కర్మమె జనులకు దేవత
కర్మమె సుఖదుఃఖములకు కారణ మధిపా.’’ (భాగవతం.10.884) పుట్టుకకు, వృద్ధిపొందుటకు, చెడుటకు సుఖదుఃఖాలకు కర్మనే కారణం అంటుంది. అంతటితో వదిలివేయకుండా జనులకు కర్మనే దేవత అని తెలుపుతుంది. భీష్ముడు సమాధానం కోసం చెప్పిన కథలో సారం కూడా ఇదే. ఈ కథ ఆపద కోణాన్నే ఆవిష్కరించింది. కాని సుఖకరమైన, సంతోషకరమైన విషయాలు కూడా కొన్ని సార్లు మన ప్రమేయం లేకుండానే మనకు అందుతాయి. వాటి వెనక కారణం కూడా తాను చేసుకున్న కర్మని భావించవచ్చు. ఈ కథలో ఇచ్చిన కుమ్మరి చేతికర్ర ఉదాహరణ చాలా గొప్పగా ఉంది. కుమ్మరివాని చేతిలో ఉన్న కట్టెను నిందిస్తూ కూర్చోకూడదు. అది ఎవరి చేతిలో ఉందో వారిని గురించి ఆలోచన చేయాలి. వారిదగ్గర మనకు సంబంధించిన ఒక లెక్క ఉంటుంది. నీవుచేసిన పనుల వల్ల లెక్కల మార్పులు జరుగుతాయి. అదే కర్మ. ఇంతటి తాత్వికమైన కర్మను సులభమైన కథరూపంలో తెలియజేసిన తీరు అభినందనీయం.
….. ….. ….. ….. ….. ….. ….. …..
ధర్మరాజు భీష్ముడిని కర్మకు సంబంధించిన మరో ప్రశ్న ‘‘సంకల్పయోగాన్ని బట్టి కర్మలు శుభాన్ని, అశుభాన్ని కలిగిస్తాయి. వాటికి కర్త పురుషుడా, కాదా’’ (శాంతి.4.369) అని అడిగాడు. ఈ ప్రశ్నకు సమాధానంగా భీష్ముడు ‘ఇంద్ర ప్రహ్లాద సంవాదం’ తెలియ జేసాడు. ప్రహ్లాదుడు సత్వగుణసంపన్నుడు. ఇంద్రియాలు గెలిచినవాడు. అహంకారం, సంతోషం, క్రోధం లేనివాడు. అతనికి నిందా, స్తుతీ రెండూ సమానం. మన్ను, బంగారం రెండూ కూడా ఒకటే. అతని ధ్యానం విష్ణుపాదాల వ్రతం. అట్లాంటి ప్రహ్లాదుడిని పరీక్షించడం కోసం ఒకసారి దేవేంద్రుడు వెళ్ళి..
‘‘సంపద లేమికి మది శో
కింపవు; శత్రువుల చేతికిని లోనగు టూ
హింపవు; నీ కుమారునికి
పెంపని పాటించె; దిట్టి బేలవు గదవే !’’ (శాంతి.4.370) సంపదలు లేవని దుఃఖించవు. శత్రువుల చేతిలో లొంగిపోతానని ఆలోచించవు. ఉపేక్షాభావంతో ఊరక ఉండటమే నీకు మేలని గ్రహిస్తావు. ఇంతటి బేలవా? అంటాడు. దానికి సమాధానంగా ప్రహ్లాదుడు దేనికైన తాను కర్తను అనుకోవడం అజ్ఞానం. ఏ లాభం ఆశించకుండా అన్ని పనులు చేస్తున్నదంతా విధాతే కాబట్టి అతడే కర్త. నరుడు కానేరడు అంటాడు. మన ప్రయత్నం వల్లనే కలిమిలేములు సిద్ధిస్తాయి అనుకోవడానికి వీలులేదు. అంతేకాదు ‘‘తేరక యుండఁగఁ జేరుందేరంగాఁ బొలియు విధి యధీనంబులుగా కారయ విత్తంబులు పురుషారంభాయత్తములె?…’’ (శాంతి.4.373) మానవ ప్రయత్నం మాత్రమే సంపద సాధన ఆధారం కావు అవన్నీ విధి అధీనంలో ఉన్నాయనే విషయాలను తెలియజేస్తాడు. శత్రుమిత్రులు, కష్టసుఖాలు కూడా మనకు తెలియకుండా, కొన్నిసార్లు మన ప్రమేయం లేకుండా సంభవిస్తాయి. కాబట్టి విధి చేసే కర్మలను ఉపేక్షాభావంతో ఊరకనే చూస్తూ ఉండాలి. మానవుడు చేయవల్సిందల్లా సుఖాన్ని, దుఃఖాన్ని సమానంగా స్వీకరించగల ఉపాయం నేర్చుకోవాలి. నరుడు దాంతి, శాంతి, ప్రజ్ఞ కలిగినవాడై నపుడు అతడి చిత్తం ఏ విధంగానూ ఆయాసంతో అలసిపోదు అనే విషయాలను ప్రహ్లాదుడు ఇంద్రునికి చెప్తాడు. ప్రహ్లాదుడు కూడా అలాంటివాడనే విషయాన్ని తెలియజేస్తాడు. అప్పుడు ఇంద్రుడు ‘‘యే యనువున నీశాంతి నీకు నగపడియె మహా జనపూజ్య! చెప్పవే?..’’ అని అడుగుతాడు. ప్రహ్లాదుడు ఇంద్రుడితో…
‘‘ఆర్జవంబు ప్రసన్నత యాత్మవత్త్వ
మప్రమాదంబు వృద్ధసేవాభినిరతి
మేలుసేయుఁ బ్రజ్ఞాశాంతిశాలి యగుట
కాలపాకంబుతోఁ దాన కలుగు ననఘ!’’ (శాంతి.4.383) నిష్కపటమైన ప్రవృత్తి దయాగుణం, తాను శరీరంగాదు ఆత్మను అనే భావం పరాకులేకుండా జాగరూకతతో వ్యవహరించడం, పెద్దల పరిచర్యలలో నిజమైన ఆసక్తి ` ఈ సద్గుణాలు నరుడికి శుభాన్ని కలిగిస్తాయి. ఇక జ్ఞాన, శాంతి అనేవి, కాలపరిపాకంతో క్రమంగా తమంత తామే నరుడిలో చోటుచేసికొంటాయి అనే విషయాలు ప్రహ్లాదుడు ఎరుక పరిచినట్లు పై పద్యభావం ఆధారంగా తెలుస్తుంది.
ఈ కర్మ విషయం ‘మను బృహస్పతి సంవాదం’లో…
‘‘…అనిష్టంబు ద్రోవను నిష్టంబు దేరను
నరుఁడు కర్మాచరణం బొనర్చు
నెయ్యవి సుఖము లొక్కింత కాలమునకు
నవియు దుఃఖంబులై యావహిల్లు;
నింత యెఱిఁగి ఫలమునెడ నిరపేక్షుఁదౌ
నతడు సౌఖ్యదుఃఖ యమముఁద్రోచి
కామముఖ్య విపదకంపిత జ్ఞాన వి
శేషబుద్ధిఁ బరమసిద్ధి బొందు.’’ (శాంతి.4.172)
పై పద్యంద్వారా అనిష్టాన్ని తొలగించుకోవడానికి, ఇష్టాన్ని అందుకోవడానికి మానవుడు కర్మ చేస్తాడు. ఏవి సుఖాలుగా అందుతాయో, అవే అనంతరకాలాల్లో దుఃఖాలుగా పరిణమిస్తాయి. ఈ మాత్రం తెలిసికొని ఏ నరుడు తాను చేసే కర్మను ఫలం ఆశించకుండా తన విధిగా మాత్రమే చేస్తాడో అతడు సుఖదుఃఖ ద్వంద్వాన్ని త్రోసేసి కామక్రోధాది అరిషడ్వర్గాలనుంచి వాటిల్లే విపత్తులనుంచి చెదరని గొప్ప జ్ఞానంద్వారా గొప్ప సిద్ధిని ముక్తిని పొందుతాడని తెలుపుతుంది. కర్మ విషయంలో చాలా మంది బుద్ధిమంతులు కూడా కర్మ, అకర్మల వాస్తవిక రహస్యాన్ని గుర్తించడంలో పొరపాటు పడుతారు. ఈ విషయాన్ని భగవద్గీత (4.16) కూడా తెలుపుతుంది. ఈ కారణం చేతనే కర్మ రహస్యంలో అనభిజ్ఞులైన జ్ఞానాభిమానులు బ్రహ్మజ్ఞానం ద్వారా కర్మను ప్రతిబంధకంగా తలుస్తారు. అందువల్ల వారు వారివారి వర్ణాశ్రమోచితంగా చేయాల్సిన కర్తవ్య కర్మలను త్యజిస్తారు. కాని ఈ విధమైన త్యాగం వల్ల వారికి యథార్థఫలమైన కర్మబంధన విముక్తి కలుగదు. ఈ విషయాన్ని కూడా భగవద్గీత (18.8) తెలుపుతుంది. అందుకే చాలా మంది కర్మను భారంగా భావించి ఇచ్ఛానుసారంగా కర్మాచరణలో ప్రవర్తిస్తున్నారు. కాబట్టి జ్ఞాన, కర్మల రహస్యాలను ఏకకాలంలో వెంట వెంట తెలుసుకొని వాటిని సరైన పద్ధతిలో ఆచరించి ఈ రెండిరటి అనర్థాలనుంచి రక్షించుకోవాలి.
ఆధార గ్రంథాలు :
- అప్పలస్వామి, పురిపండా. ‘వ్యావహారికాంధ్ర మహాభారతం’ (శాంతి పర్వము). 1976. రాజమండ్రి: ప్రాచీన గ్రంథావళి.
- నిర్వికల్పానంద, ‘శ్రీమద్భగవద్గీత’ (పదచ్ఛేద టీకాతాత్పర్య సహితం). 2010. హైదరాబాద్ : రామకృష్ణమఠం.
- రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. శ్రీనివాసులు, సూరం. సంపా. ‘శ్రీమహాభారతము’ (అన్ని పర్వాలు, 7 సంపుటాలు). 2018. గోరఖ్పూర్: గీతాప్రెస్.
- లక్ష్మీనారాయణ, గంగిశెట్టి. ‘భీష్ముడు చెప్పిన రాజనీతి కథలు’ 1986. హైదరాబాద్: తెలుగు విశ్వవిద్యాలయం.
- విశ్వేశ్వర శాస్త్రి, జన్నాభట్ల. సంపా. ‘మహాభారత వైజయంతి’ (తొమ్మిది సంపుటాలు). 2006. గుంటూరు : భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్.
- సుబ్రహ్మణ్యం, జి.వి. సంపా. ‘కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము’ (అన్ని పర్వాలు, 15 సంపుటాలు). 2014. తిరుపతి: తి.తి.దే.
- హనుమంతరాయ శర్మ, బలభద్రపాత్రుని. ‘మహాభారత విమర్శనము’ (రెండు సంపుటాలు). 1996. గుంటూరు: భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్.
డా. అట్టెం దత్తయ్య
సహాయాచార్యులు, ఎస్వీ కళాశాల,
ఢిల్లీ విశ్వవిద్యాలయం.
ఫోన్ : 9494715445