వ్యాస సంగ్రహం
కథా రచయితగా ఎంతో ప్రసిద్ధి, ఎందరో ప్రముఖ సాహితీకారుల మన్ననలు, అశేష పాఠక లోకం అభిమానం చూరగొన్న కే.వి.నరేందర్ గారు, తన మిత్రుడైన సంగెవేని రవీంద్ర గారితో కలిసి తెలంగాణ వ్యాప్తంగా మూడు వేల కిలోమీటర్ల పైగా ప్రయాణించి తెలంగాణ గత వైభవానికి, అలాగే చీకటి చరిత్రకు సజీవ సాక్ష్యాలుగా ఉన్న గడీల నిర్మాణ విశేషాలు, సామాజిక, సాంస్కృతిక విశేషాలను తెలియచేస్తూ ‘‘తెలంగాణ గడీలు’’ అనే చారిత్రక పరిశోధన గ్రంథాన్ని రాసి వెలువరించారు. ఇందులో 30కి పైగా గడీల నిర్మాణాలను, వాస్తు, శిల్ప శైలులను ఎంతో లోతుగా వివరించారు. గడీల గురించి, వాటి నిర్మాణం గురించి మనకు తెలియని అనేక విషయాలను తమ పరిశోధనలో వెలికితీశారు. గడీలలో జరిగిన అనేక చరిత్రకెక్కని సంఘటనలను పొందుపరిచారు. ఇంత గొప్ప పరిశోధనను, అందుకు వారు ఎదుర్కున్న వ్యయ ప్రయాసలను, గడీల వెనుక ఉన్న అసలు చరిత్రను నేటి, రేపటి తరాలకు తెలియచేస్తూ తమ గత చరిత్ర స్పృహను కలిగించడం ఈ వ్యాసం ప్రధాన ఉద్దేశం.
ముఖ్య పదాలు : చారిత్రక పరిశోధన, డంగు సున్నం, హర్రాజ్, దొరలు, కమ్యూనిస్టులు, విప్లవోద్యమం, నిజాం పాలన, పి.వి నరసింహా రావు, సాహిత్యం, చిత్ర లేఖనం.
ఉపోద్ఘాతం
తెలుగు సాహిత్య ప్రస్థానాన్ని పరిశీలిస్తే చారిత్రకంగా అనేక నాటకాలు, చారిత్రక నవలలు, చారిత్రక నేపథ్యంలో కథలు, కవిత్వ సృజన జరిగింది. అయితే ఇవన్నీ సాహితీ సృష్టి, వర్ణనలు, భాషా సాహిత్యాల మేళవింపు. సాహితీ ప్రక్రియలకు లోబడి రచయిత లేదా కవి ప్రతిభ, కళాత్మక దృష్టి, రచనా నైపుణ్యాన్ని బట్టి వెలువడి పాఠకుడికి రసానందాన్ని కలిగించినవే. అయితే ఒక చారిత్రక ప్రదేశాన్ని సందర్శించి, దానికి సంబంధించిన నిర్మాణ, ఆర్థిక, సామాజిక విశేషాంశాలను వెలికితీసి రాస్తే అది సాహిత్యం అనడం కన్నా చరిత్ర రచన అనడం సబబు. తెలుగులో కొమర్రాజు లక్ష్మణరావు, బి.ఎన్. శాస్త్రి, మల్లంపల్లి సోమశేఖర శర్మ, నేలటూరి వెంకటరమణయ్య, మారేమండ రామారావు ప్రభృతులు గ్రామాలు, దేవాలయాలు, శాసనాలు, నాణేలు, తాళపత్ర గ్రంథాల పైన పరిశోధనలు చేసి ఎంతో విలువైన సమాచారాన్ని మన తరానికి, భవిష్యత్ తరాలకు కానుకగా అందించారు. వారి మార్గంలోనే కె.వి. నరేందర్, సంగెవేని రవీంద్రతో కలిసి ఈ చారిత్రక పరిశోధనకు పూనుకున్నారు.
చారిత్రక అధ్యయనం, పరిశోధన లేకుండా ఏ సందర్భాన్ని కూడా కవితగా, కథగా, నవలగా, వ్యాసంగా మార్చడం సాధ్యపడదు. అలాగే తెలంగాణ గడీల గురించి ఇన్ని వందల సంవత్సరాలైనప్పటికీ వాటి నిర్మాణం, నేపథ్యం, ఆ కాలపు పరిస్థితులు అందరూ చూస్తున్నవే అయినప్పటికీ… వాటిని వెలికితీసి, రికార్డు చేసి భవిష్యత్తరాలకు అందించాలనీ, ఇప్పటికే సాహిత్యరంగంలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న వీరు సంకల్పించడం నిజంగా ఒక చారిత్రక ఘట్టం.
దొరల ప్రస్తావన లేకుండా తెలంగాణ చరిత్ర లేదు. ఇప్పటి వరకు దొరల పాలన, అరాచకాలు, దౌర్జన్యాలు, వారిపై తిరుగుబాట్లు, విప్లవోద్యమాలు, కమ్యూనిస్టులు, నక్సలైట్లు, తదితర అంశాలపై ఎంతో సాహిత్యం వచ్చింది. కానీ, వీటన్నింటికీ కేంద్రమైన దొరల నివాస స్థానాల చరిత్ర గురించి ఈ రచయిత పూనుకోవడం చాలా గొప్ప విషయం. తెలంగాణలో ఇలాంటి మరుగునపడిన చరిత్ర ఎంతో ఉన్నది. వాటిని ఇప్పుడు రికార్డు చేయడం తెలంగాణ అస్తిత్వానికి అనివార్యమైన అంశం. ఈ విషయంలో వీరి కృషి ప్రశంసించదగినది.
పరిశోధన -ప్రయాసలు
ఈ గడీల చరిత్రను వెలికితీయడానికి వీరు ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి, ఆరు నెలలు శ్రమించారు. శారీరకంగా, ఆర్థికంగా, మానసికంగా ఒత్తిడికి గురయ్యారు. వీరి స్వస్థలం జగిత్యాల నుండి బయలు నేటి దాదాపు మూడు వేల కిలోమీటర్ల పైనే తిరిగారు. ఒక గడీ దగ్గర సెల్ టవర్ ఎక్కి ఫోటోలు తీస్తుంటే వీరి బృందంలోని ఒక మిత్రుడు వేణు కిందపడితే చేయి విరిగింది. కొన్నిసార్లు కొందరు చెప్పిన ఆచూకీ ప్రకారం వెళ్లినా కూడా అక్కడ గడీ లేని పరిస్థితులు, వృథా ప్రయాణాలు, ఖర్చులూ ఎదురయ్యాయి.
దాచారంలో చిన్నగడీ ఫోటో తీస్తూ, వెనక్కు వెళ్ళిన రవీంద్ర అక్కడ మొక్కలు, చెట్లతో పూర్తిగ కప్పబడిపోయిన పెద్దబావిని గమనించలేదు. మరో రెండు అడుగులు వెనక్కు వేస్తే పెద్ద ప్రమాదం జరిగేది. అక్కడే ఉన్న ఊరి వ్యక్తి అరిచి చెప్పడం వల్ల అది తప్పింది. పాములు, గబ్బిలాలు ఇలా ఎన్నో ప్రమాదాలను దాటుకుంటూ వీరు పరిశోధన గావించారు. ఆరు నెలల కాలం. మూడు వేల కిలోమీటర్ల ప్రయాణం, వందల గడీలు వెరసి ఈ అద్భుతమైన చారిత్రక గ్రంథం పురుడు పోసుకుంది. ఈ పుస్తకంలో 30 గడీలు, వాటి నిర్మాణం, చరిత్ర, సామాజిక నేపథ్యాన్ని ‘‘తెలంగాణ గడీలు -1’’ పేరుతో ప్రచురించడం జరిగింది. ఈ గ్రంథం ఇంగ్లీషు, మరాఠీ, హిందీ, కన్నడ భాషలలోనికి అనువదించబడిరది.
గడీల నిర్మాణం- ప్రాముఖ్యత
దాశరథి రంగాచార్య ‘చిల్లర దేవుళ్ళు, మోదుగుపూలు, జనపథం, జీవన యానం’, వట్టికోట ఆళ్వారు స్వామి ‘గంగు’, లక్ష్మీకాంత మోహన్ ‘సింహగర్జన’, ఇలా చాలా మంది రచయితల వివిధ సాహిత్య ప్రక్రియల్లో గడీల ప్రస్తావన ఉన్నప్పటికీ కేవలం గడీలకు సంబంధించిన సామాజిక, చారిత్రక అధ్యయనం కనిపించలేదు. అంటే గడీల నిర్మాణ పనుల గురించి, వాటి ఆర్కిటెక్ట్ గురించి, ఒక్కో గడి నిర్మించడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది, ఎక్కడి వాస్తు శిల్పులు, కూలీలు పనిచేశారు అనే విషయాలు ఇప్పటికీ తెలియకుండా పోయాయి. 1962లో జర్మనీ పరిశోధకుడు’ దాగ్మర్ బెర్నెస్టాల్ఫ్’ తెలంగాణపై చేసిన పరిశోధనలో కూడా దొరల పాత్ర, దొరల అధికారం, వారి జీవనశైలి గురించి రాశారు తప్పితే, వారు నివసిస్తున్న అతి పెద్ద గడీలు ఎలా నిర్మించారన్న విషయాలు ఎక్కడ రాయలేదు.
‘‘గతమెప్పుడూ దుఃఖభరితమే అయినప్పుడు దాన్ని తలుచుకోవడం ఆనందమేమీ కాదు. తెలంగాణ పల్లెల్ని ఆ గతం ఇంకా వెంటాడు తూనే ఉంటుంది. ఆ జ్ఞాపకాలు మనసుల్ని అతలాకుతలం చేస్తూనే ఉంటాయి. గాయం మీది మచ్చలా గడిలో ఒక భయానక విషాదానికి, కల్లోల జ్ఞాపకాలకి గుర్తుగా మిగిలిపోయాయి’’ అని అంటారు నరేందర్ గారు. అలా మిగిలి పోయిన జ్ఞాపకాలను ఒకసారి స్పృశిస్తున్నాను.
సిర్నాపల్లి గడీ : తెలంగాణ గడీల్లో అతి పురాతన చరిత్ర గల ఈ గడీ నిజామాబాద్ జిల్లాలో ఉంది. ఇది మొదట కాకతీయులు, తరువాత కుతుబ్‌షాహీలు, చివరకు నిజాం పాలనలోకొచ్చింది. నిజాం రాజు దగ్గర పనిచేసే ఓ అధికారి వేటకు వచ్చి అడవిలో తప్పిపోతే, అతడిని కాపాడిన ఒక పన్నెండేళ్ళ అమ్మాయి ధైర్యానికి మెచ్చి ఈ గడీని ఆమెకు అప్పగించారు. ఆమె శీలం జానకీబాయి. తన పరిపాలన ద్వారా నిజాంతో సహా ఎందరి మెప్పునో పొందిన ఈమెను ‘పగటి మషాల్ దొరసాని’ గా అభివర్ణిస్తారు. ఎందుకంటే ఈమె పల్లకీలో వెళుతుంటే పగలు కూడా దివిటీలు పట్టుకొని నడిచేవారట. ఇందూరును నిజామాబాద్‌గా మార్చింది ఈమే.
బండలింగాపూర్ గడీ : కరీంనగర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఉంది ఈ గడీ. ఇది అతి పెద్ద విస్తీర్ణంతో 14 ఎకరాలలో విస్తరించి ఉంది. ఈ గడీ నిర్మాణ శైలి మైసూరు ప్యాలెస్‌తో పోలికలను కలిగి ఉంటుంది. ప్రముఖ సినిమా నటుడు శివాజీ గణేశన్ తరచుగా ఇక్కడికి వచ్చేవాడు. అంతే కాకుండా ఈ గడీ పాలకుడు రాజా అనంత కిషన్ రావుతో కలిసి వేటకు వెళ్ళినాడట. ఈ గడీలో దౌర్జన్యాలు, అరాచకాలు ఏమీ జరగలేదు. కానీ దాసీ వ్యవస్థ మాత్రం ఎక్కువగా ఉండేది. ఈ దొరలు గొప్ప దాతలు, ఓ రోజు టానిక్ అనుకొని తేజాబ్ తాగడంతో రాజావారు మరణించారు.
దోమకొండ గడీ : నిజామాబాద్ జిల్లా కామారెడ్డి సమీపంలో ఉంది ఈ గడీ. నలభై ఎకరాల విస్తీర్ణం ఉన్న కోట చుట్టూ అతి పెద్ద నీటి కందకం ఉంది. తెలంగాణలో ఏ ఒక్క గడీకి కూడా ఇలాంటి నీటి కందకం లేదు. గంగిరెద్దు ఉమ్మి తన చేతులపై పడిరదని, ఆ కోపంతో గంగిరెద్దులవాన్ని కొట్టి చంపడం వలన చివరివాడైన సోమేశ్వర్రావుకు ఆరు సంవత్సరాల జైలు శిక్ష పడిరది. ఈ గడీకి తిరుపతి వేంకట కవులు కూడా వచ్చేవారు. ఈ గడీ మనవరాలు ‘ఉపాసన’ ప్రముఖ చలనచిత్ర నటుడు చిరంజీవి ఇంటి కోడలయ్యింది.
సంజీవన్ రావు పేట : మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం సంజీవన్ రావుపేట గ్రామంలో ఉంది. నిజాం ప్రధాన మంత్రి కిషన్ ప్రసాద్ తరచుగా ఈ గడీకి వచ్చేవారు. అత్యంత ఆకర్షణీయంగా గడీ గోడలు, స్వాగత తోరణాలు ఉండడంతో మోహన్ ఖోడా దర్శకత్వంలో షేక్స్పియర్ నవల ఆధారంగా ఎల్లమ్మకథ చలన చిత్రాన్ని ఇక్కడ చిత్రీకరించారు.
తపాల్ పూర్ గడీ : మొదటిసారిగా నక్సలైట్లు దాడి చేసిన గడీగా తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్త సంచలనానికి మూల కారణమయిన గడీ ఇది. 1976 సంవత్సం నవంబర్ 7న ఈ గడీపై నక్సలైట్లు దాడి చేశారు. ఈ సంఘటన చాలామంది దొరలకు నిద్ర లేకుండా చేసింది. దొరతనపు వ్యవస్థను అప్రమత్తం చేసి, గడీల్ని ఖాళీ చేసి, దొరల్ని వెళ్ళిపోయేలా చేసింది. రాచరిక వ్యవస్థ పునాదుల్ని కదిలించింది. ఈ దాడి గురించి బి.బి.సి రేడియోలో ప్రసారం అయింది.
గట్ల మల్యాల గడీ : విశ్వబ్రాహ్మణ దొరలు పరిపాలించిన ఏకైక గడీ ఇది. అధికారం, ఆరాచకం మచ్చుకైనా వినిపించని ఊరు ఇది. కులవృత్తిలోనే కాదు పరిపాలనా రంగంలో కూడా సాటి లేనివారు ఈ దొరలు. మెదక్ జిల్లా సిద్ధిపేట నుండి హుస్నాబాద్ వెళ్ళే దారిలో ఈ గడీ ఉంది. ఈ గడీ దొరలు స్వర్ణకారులు. అందుకే ఈ గడీని ‘‘అవుసులోల్ల గడీ’’ అని కూడా పిలుస్తారు. తెలంగాణలో వృత్తిపని వారు దొరలుగా చెలామణి కావడం ఈ గడీకి మాత్రమే సొంతమయ్యింది. తెలంగాణలో బి.సి.లకు చెందిన ఏకైక గడి ఇదే.
విసునూర్ గడీ : ఇది తెలంగాణలో కత్తుల పునాది మీద నెత్తుటి సాక్ష్యం అంటారు రచయిత. వరంగల్ జిల్లా పాలకుర్తి మండలం విసుసూర్ గ్రామంలో ఉంది ఈ గడీ. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి తెర లేపినదీ గడి. ఈ గడీకి చెందిన జానకమ్మ దొరసానికి మంచి పరిపాలనాదక్షురాలిగా పేరుంది. ఈమె ఒక్కగానొక్క కొడుకు వెంకట రామచంద్రారెడ్డి. ఈయన చేసిన అరాచకాలకు లెక్క లేదు. అందుకే ఇతనికి కలియుగ రావణాసురుడని పేరు. ప్రపంచంలో వుండే ఆధునిక సౌకర్యాలు అన్ని గడీలో ఏర్పరుచుకునేవాడు. ఇతని బండి నడుస్తుంటే ఎనిమిది కిలోమీటర్ల వేగంతో చాకలి ఎడ్లబండి ముందు పరుగెత్తాలి. బండికిరువైపుల కత్తులు, తుపాకులు ధరించిన నలభై మంది పరుగెత్తాలి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం మీద వచ్చిన ఏ పుస్తకం తెరచినా, ఏ సాహిత్యం చదివినా ఈ దొర అరాచకాలు ప్రముఖంగా కనిపిస్తాయి.
సిరికొండ : ఇది కోమటోల్ల (వైశ్యుల) గడీ, కరీంనగర్ జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో ఉంది. వీరు కూడా గట్ల మల్యాల దొరల్లాగే హర్రాజాదారులు. దొర బట్టు లచ్చయ్య మీద ఒకసారి నిజామొద్దీన్ అనుచరులు కాల్పులు జరపగా తూటా దూసుకుపోయి తీవ్రంగా గాయపడినా, బతికి బయటపడ్డాడు
ఇందారం గడి : ఇది గృహప్రవేశానికి కూడా నోచుకోని గడి. ఆదిలాబాద్ జిల్లా, జైపూర్ మండలం ఇందారంలో ఉంది. అన్ని గడీలు ఊరు మధ్యలో ఉంటే ఈ గడీ మాత్రం ఇందారం గ్రామానికి కొంత దూరంలో, గోదావరి నదికి మూడు కిలోమీటర్ల చేరువలో ఉంటుంది. చార్మినార్‌ను పోలిన రెండు బురుజులున్నాయి దీనికి. ఈ గడీని ఎక్కి చూస్తే గోదావరి అందాలు, ఎన్టీపీసి వెలుగులు అద్భుతంగా కనిపిస్తాయి. ఈ గడీ దొర భార్య నూజివీడు సంస్థానపు ఆడపడచు ఆమె గడీని పరిశీలించి, ఈ గడీ కన్నా తమ గుర్రాల భవంతి చాలా అందంగా ఉంటుందని నిరుత్సాహంగా పెదవి విరిచిందట. ఆ రోజు నుండి దొర మళ్ళీ ఆ గడీ వైపు చూడలేదట. ఇక్కడి దొర ముత్యంరావుకి ‘బారా ఖూన్ మాఫీ వతన్దార్’’ హక్కు నిజాం రాజు కల్పించాడని అంటారు. అంటే రోజుకు పన్నెండు మందిని చంపే అధికారం గలవాడని అర్థం.
గద్వాల గడీ : తెలంగాణలోని అతిపెద్ద సంస్థానాలలో ఇది ఒకటి. సోమ భూపాలుడు పదిహేడవ శతాబ్దంలో పూడూరు కోటను మరమ్మత్తు చేసిన సమయంలో నిధి దొరుకుతుంది. ఆ నిధితో గద్వాల కోటను నిర్మించాడు. సోమభూపాలుడుగా పేరుగాంచిన రామన్న అధికార అరాచకాలను భరించలేక అతని సైనికులే నిండు దర్బారులో అతన్ని కాల్చి చంపారు.
కల్లెడ గడీ : గడీలు అనే పేరుకే పూర్తి విరుద్ధంగా శాంతివనంగా, విద్యాసుగంధాల క్షేత్రంగా విలసిల్లింది ఈ కల్లెడ గడి . ఇది వరంగల్ జిల్లా, పర్వతగిరి మండలంలో ఉంది. ఈ దొరల వంశానికి ఆద్యుడు ఎర్రబెల్లి వీరరాఘవరావు. ఈ పాలకులు విద్యావ్యాప్తికి బహుముఖంగా కృషి చేశారు. 76 గదులతో విద్యార్థులకు చదువుతో పాటు భోజన వసతి కూడా కల్పించారు. అంతే కాకుండా ఉచిత దుస్తులు, పాఠ్యపుస్తకాలు, నోటు బుక్కులు అందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోనే ఆర్చరీకి చిరునామాగా కల్లెడను చెప్పుకుంటారు. ప్రముఖ ఒలింపిక్ ఆర్చరీ క్రీడాకారిణి ఈ కల్లెడ గడీ పాఠశాల విద్యార్థినే. వాషింగ్టన్ యూనివర్సిటీకి చెందిన వాలంటీర్లు, ప్రొఫెసర్లు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చి విద్యార్థులకు వివిధ అంశాల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతర్జాతీయ మీడియా సంస్థ బిబిసిలో రికార్డు చేసిన ఏకైక రూరల్ బడి ఇదొక్కటే కావడం విశేషం. ఈ గడీలో ఎన్నో సినిమాల షూటింగ్‌లు జరిగాయి. ఇన్ని ప్రత్యేకతలున్న ఈ బడిలో జాతీయ పతాకావిష్కరణలో ప్రత్యేకతే కనిపిస్తుంది. 15వ ఆగష్టు నాడు ఆదర్శ రైతు చేత, 26 జనవరి నాడు ఎవరైనా చేతివృత్తుల వారి చేతుల మీదుగా పతాకావిష్కరణ జరిగుతుంది.
బొల్లారం గడీ : నిజామాబాద్ జిల్లా నాగిరెడ్డిపేట మండలంలోని బొల్లారం గ్రామంలో ఉంది. ఈ గడీకి చెందిన మండ రామచంద్రారెడ్డి దొర తన సాహసాలతో ఆ ప్రాంతంలో పేరు గాంచాడు. ఈయన అడవికి వేటకు వెళ్ళినపుడు తనపై దాడి చేసిన పెద్దపులితో పోరాడి, తన భుజబలంతో దాన్ని చంపాడట. గడీ లోపలికి అడుగుపెట్టలేనంత శిథిలమైపోయి ఉన్నప్పటికీ, గడీ అందాలు, అద్భుతంగా, హుందాగా ఉన్నాయి.
చల్ గల్ గడీ : జగిత్యాల పట్టణానికి సమీప గ్రామమైన చలగల్లో ఈ గడీ ఉంది. ఈ ‘చల్ గల్’ కు ‘సలిగంటి’ అనే పేరు కూడా ఉంది. ఈ గడీ దొర జువ్వాడి ధర్మ జలపతిరావు. బండలింగాపూర్ గడీ ఆడపడచుని వివాహం చేసుకున్నాడు. ఈ గడీ ప్రవేశద్వారాలు రాజస్థాన్ కోట ద్వారాలను పోలి ఉంటాయి. డంగు సున్నంతో అద్భుతమైన, గుండ్రని కమాన్లను నిర్మించిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. పుట్టపర్తి సాయిబాబా ఈ గడీకి ఎక్కువసార్లు వచ్చేవాడు.
మద్దునూరు గడీ : కరీంనగర్ జిల్లా ధర్మపురి మండలంలో ఈ గడీ ఉంది. ఈ గడీ దొరసాని జువ్వాడి లక్ష్మీకాంతమ్మ ధర్మాత్మురాలుగా పేరు గాంచింది. ఈమె ఎవరింట్లో వివాహం జరిగినా పుస్తెలు, మట్టెలు పంపించేదట. జిల్లాలో మొదటి ట్రాక్టర్‌ను కొన్నది ఈ గడీకి చెందిన రాజేశ్వరరావు గారే. ఈ గడీపై నక్సలైట్ల దాడి జరిగింది. హైదరాబాదుకు వెళ్ళిన రాజేశ్వరరావుని కలువడానికి వెళ్ళిన సన్నిహితులతో ‘‘నక్సలైట్లు దేవుళ్ళురా వాళ్ళు మరో పదేండ్లు ముందు వచ్చి వుంటే నేను మరింత కోటీశ్వరున్ని అయ్యేవాన్ని, హైదరాబాద్ సిటీలోని సగం కొనేవాన్ని. అక్కడుంటే అదే గడీలో ఉండేవాన్ని కదా’’ అని అనేవారని జనం ఇప్పటికీ చెప్పుకుంటారు.
నడి గూడెం గడీ : నల్లగొండ జిల్లాలోని మండల కేంద్రం. మన జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య ఈ సంస్థానంలోనే దివాన్ గా పనిచేసేవారు. అందుకే ఈ గడీని జాతీయ జెండాకు పురుడుపోసిన గడీ అని అంటారు. ఆంగ్లేయులు బహుమతిగా పరిటాల పరగణాను ఇవ్వమని అడిగినప్పుడు, నిజాం నవాబు అందుకు ఇష్టపడక, దానికి బదులు మునగాల పరగణాను ఇవ్వడం జరిగింది. 1900లో జమీందారు అయిన నాయిని వెంకటరంగారావు పాలనా కాలం నుండి ఈ సంస్థానం ఎక్కువగా ఖ్యాతినొందింది. జాతీయ పతాక రూపకకర్త పింగళి వెంకయ్య మాత్రమే కాదు. ప్రఖ్యాత చరిత్రకారుడు, గ్రంథాలయోద్యమ కర్త కొమర్రాజు లక్ష్మణరావు కూడా ఇదే సంస్థానంలో దివాన్‌గా పనిచేశాడు. ఎన్నో సంస్థలకు, గ్రంథాలయాలకు, పాఠశాలలకు నిధులు, విరాళాలు ఇచ్చారు.
ఇటిక్యాల గడీ : కరీంనగర్ జిల్లా రాయికల్ మండలంలోని ఇటిక్యాల గ్రామంలో ఉంది. చెన్నమనేని వెంకట నర్సింహారావుకు చెందినది. మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు ఈ గడీకి తరచుగా వచ్చేవారు. వెంకట నర్సింహారావు రెండవ కొడుకు కృష్ణారావు, ప్రముఖ ఏ.ఎన్.ఎల్ కొరియర్ సంస్థ అధినేత. ప్రస్తుతం ఇందులో సాయిబాబా గుడిని నిర్మించి, ఆధ్యాత్మిక వాతావరణాన్ని కల్పించారు.
వంగర గడీ : కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం, వంగర గ్రామంలో ఉంది. దేశ రాజకీయాల్లో అపర చాణుక్యుడిగా పేరుగాంచి, ప్రధానమంత్రి పదవి చేపట్టిన ఒకే ఒక తెలుగు వ్యక్తి పి.వి.నరసింహారావు, ఈ గడీ దొర. రెండు వేల ఎకరాలకు యజమాని అయిన కరణం దొర పి.వి. నరసింహారావు. పి.వి.కి పుట్టుకతోనే సమానత్వం పట్ల అవగాహన ఉంది. సవారి కచ్చురంలో ప్రయాణించేటప్పుడు దానికి ముందు, వెనుక చాకలివాళ్ళు పరుగెత్తడాన్ని ఆయన అమానుషమని భావించేవాడు. అలా పరిగెత్తే చాకలి వాళ్ళని తనతో పాటు బండిలోనే కూర్చోబెట్టుకొని సంచలనం సృష్టించాడు.
వనపర్తి గడీ : మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈ గడీ ఉంది. దీనిని ‘‘రాంసాగర్ బంగ్లా’’ అని కూడా పిలుస్తారు. దీని పాలన కింద నూట ఇరవై గ్రామాలుండేవి. ఈ రెడ్డి దొరల ఇంటి పేరు ‘‘జనుంపల్లి’’. ఈ సంస్థానాధీశులు మొదట విజయనగర సామ్రాజ్యపు సామంతులుగా పని చేశారు. ఈ వంశానికి చెందిన వెంకటరెడ్డి మహాపరాక్రమశాలిగా ప్రసిద్ధుడు. వెంకటరెడ్డి కుమారుడు గోపాల రాయలు. ఎనిమిది భాషల్లో నిష్ణాతుడైన ఇతనిని అష్టభాషా గోపాలరాయలుగా పిలిచే వారట. గోపాలరాయని దత్తపుత్రుడు వెంకటరెడ్డి నిజాంకు కప్పం కట్టం లేక యుద్ధం చేయాల్సి వస్తుంది. ఆ యుద్ధంలో ఓడిపోయి వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. మొదటి రామేశ్వర్రావు సంస్థానంలో మొదటిసారి శాశ్వత పన్ను విధానాన్ని ప్రవేశపెట్టాడు. వనపర్తి సంస్థానం పండితులు, సాహిత్యంతో అలరారింది. మానవల్లి రామకృష్ణ కవి, నెదులూరి వెంకటశాస్త్రి, సన్నిధానం సూర్యనారాయణ శాస్త్రి, చలమచర్ల రంగాచార్యులు ఈ సంస్థానానికి చెందిన పండితులలో ముఖ్యులు. ఈ సంస్థానానికి చెందిన రెండవ కోడలు రాణి కుముదినీ హైదరాబాద్ నగరానికి మొదటి మేయర్‌గా పనిచేశారు.
పెద్ద శంకరం పేట గడీ : మెదక్ జిల్లాలో ఈ గడీ ఉంది. ఈ గడీ పాపన్నపేట సంస్థానానికి కేంద్రం. 1924 నుండి 1948 వరకు ఈ సంస్థానాన్ని 9 మంది పాలించారు. రాణి శంకరమ్మ ఈ గడీని నిర్మించారు. ఈమెకే రాంబాగిన్ (ఆడ సింహం) అనే బిరుదునిచ్చి సత్కరించారు ఏడవ నిజాం. శంకరమ్మ ధైర్యసాహసాలు కలిగిన స్త్రీ. తన పేరుతో శంకరంపేట, తన తండ్రి పేర సంగారెడ్డి, తల్లి పేర రాజం పేటలను నిర్మించింది.ఈ గడీ నేటికీ చెక్కు చెదరలేదు. గడీ లోపల విశాలమైన స్థలంలో గుర్రాలు, ఒంటెలు ఉండేవి. మధ్యలో నీటి కొలను, రెండు సొరంగ మార్గాలు ఉండేవి. ఈ గడీ లోపల ఢంకాతో నగారా మోగించేవారు.
మదన పల్లి గడీ : వరంగల్ జిల్లా ములుగు మండలానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ గడీ. ఈ గడీ మిగతా గడీలన్నింటికి భిన్నంగా ఉంటుంది. గిరిజన బిడ్డలైన లంబాడా దొరలు పాలించిన గడీ ఇది. ఈ గడీలో వెట్టిచాకిరీ లేదు, దౌర్జన్యాలు లేవు, దాసీలు లేరు, తిరుగుబాట్లు లేవు, గడీ ప్రధాన ద్వారం ముందు ప్రజలు కూర్చోవడానికి రెండు అరుగులు నిర్మించారు. నిజాం ప్రభుత్వానికి కునుకు లేకుండా చేసిన బడితెగాడు అనే గజదొంగను పట్టించిన నాయక్ కుటుంబానికి కొన్ని గ్రామాల భూములను ఇనాంగా ఇచ్చి, పాలించే అధికారాన్ని ఇచ్చాడు నిజాం. అందుకే వీరిని దొంగను పట్టించి దొరలయ్యారు అని అంటారు. పోరిక నాయక్ దొర తీర్పులు చెప్పే సమయంలో వెండి నాణేల గొడుగు కింద కూర్చొని తీర్పు చెప్పే వాడట. వీరు శ్రీరాముణ్ణి ఎక్కువగా కొలిచేవారు.
ముగింపు : ఈ విధంగా తెలంగాణ గడీలు పుస్తకం ద్వారా గొప్ప చారిత్రక నిర్మాణాలు, వాటి నేపథ్యం, అప్పటి ఆర్థిక, సామాజిక,సాంస్కృతిక విశేషాలను వెలికి తీసి, ఒకచోట కూర్చి మనకు అందించారు. ఇప్పటికే చాలా వరకు శిథిలావస్థకు చేరిన ఈ గడీలు, భవిష్యత్తులో కనుమరుగై పోయే ప్రమాదం ఉంది. ఈ సమయంలో వీరు చేసిన ప్రయత్నంతో భవిష్యత్ తరాలకు ఒక గొప్ప చారిత్రక నిధిని అందించినారు.
డా. తాడూరి రవీందర్,
తెలుగు అధ్యాపకులు,
ఫోన్ : 994 994 6607