పాల్కురికి సోమనాథుని కృతులు – పరిశీలన

ఆదికవి నన్నయభట్టు శ్రీకారం చుట్టిన మార్గకవితా సంప్రదాయానికి భావము, వస్తువు, రచనారీతుల్లో భిన్నమైన, విలక్షణమైన, వైవిధ్యభరితమైన దేశికవితా సంప్రదాయానికి పునాది వేసిన పుణ్యశ్లోకులు శివకవులు. నన్నెచోడుడు, మల్లికార్జున పండితారాధ్యుడు, యథావాక్కుల అన్నమయ్య, పాలకురికి సోమనాథుడు ఈ కొత్త బాట వేసి తలెత్తి నడిచిన సాహితీ తపోధనులే. వీళ్లందరి పైకి పాలకురికి సోమనాథుడు తలమానికం లాంటివాడు. దేశికవితకు రూపురేఖలు దిద్ది, ఇంపు సొంపులు సంతరించి పెట్టినది ఈ మహాభాగుడే. ఈ మహనీయుని ప్రతిభాసంపత్తిని వేనోళ్ల చాటిన పండితాగ్రణులు వేటూరి ప్రభాకరశాస్త్రి, డా. చిలుకూరి నారాయణ రావు, శివశ్రీ బండారు తమ్మయ్య, నిడుదవోలు వెంకటరావు మొదలైనవాళ్లు.
ప్రాచీన తెలుగు కావ్యనిధిని శ్రీమంతం చేసిన శివకవుల గూర్చి మన విశ్వవిద్యాలయాల్లో పరిశోధన చేసిన విద్వాంసుల్లో పేర్కొనదగిన వారు డా. జీరెడ్డి చెన్నారెడ్డి, డా. తిమ్మావజ్జల కోదండరామయ్య ప్రభృతులు. వీళ్ళ ప్రబుద్ధ పరిశోధనా గ్రంథాల్ని చదివి, అవగతం చేసుకొని ముందడుగు వేసిన పరిశోధకులు ఏ కొందరో. శివకవుల గురించి జరిగిన పరిశోధనలు ఎన్నో యం.లిట్‌, యం.ఫిల్‌, పిహెచ్‌.డి., డి.లిట్‌ పట్టాలు పొందాయే కాని, వెలుగు చూసినవి కొన్ని మాత్రమే. దీని వల్ల తెలుగు పరిశోధనకు జరిగిన నష్టాలు రెండు. పసగలిగిన పరిశోధన గ్రంథాలు అముద్రితంగానే వుండిపోయినందువల్ల, వాటి సుప్రయోజనాలకు భావి పరిశోధకులు దూరమవడం మొదటిది. ఆ ముద్రిత గ్రంథాలే కొంతవరకు ఇతర ఉపపరిశోధకుల వల్ల పునరావృతం కావటం రెండోది. ముద్రిత సిద్ధాంత గ్రంథాల్ని కూడా మక్కీకి మక్కీగా రాసి పిహెచ్‌.డి., డిగ్రీలు పొందిన ప్రబుద్ధులు కూడా లేకపోలేదు.
ఈ సందర్భంగా ‘పాలకురికి సోమనాథుని కృతులు- పరిశీలన’ అనే సిద్ధాంత గ్రంథం రాసి, ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 1973లో మరణోత్తర పిహెచ్‌.డి., పట్టా పొందిన డా. వేణుముద్దల నరసింహారెడ్డి గారిని స్మరించడం అవసరం. డా. రెడ్డిగారి ఈ పరిశోధనా గ్రంథంలోని తొలిభాగం 1993 లో హైదరాబాద్‌ లోని జాతీయ సాహిత్య పరిషత్తు ప్రచురించింది. కాగా వరంగల్లు లోని సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 2021లో ప్రకటించి తెలుగు విద్వాంసుల, పరిశోధకుల మన్ననకు పాత్రమయింది. ఈ పుస్తకం ఇప్పుడిప్పుడే సాహితీ ప్రియుల చేతుల్లోకి వస్తూండటం విశేషం.
డా. వేణుముద్దల నరసింహారెడ్డి గారి పరిశోధనా గ్రంథం – ‘పాలకురికి సోమనాథుని కృతులు- పరిశీలన’ లో 43 అంశాల గురించి వివరణ, చర్చలు పాఠకులకు అందుతాయి ‘అనుబంధములు’ శీర్షిక కింద శాసనాలు, బాణగద్యాదులు, చతుర్వేదసారము – అధిక పద్యములు, సామెతలు- జాతీయములు వగైరా విషయాలు చూడగలం.
డా. వే. నరసింహారెడ్డి గారి గ్రంథ ప్రారంభమే ‘యుగకర్త పాల్కురికి సోమనాథుడు’ అనే అంశం. కొందరు విద్వాంసులు తెలుగు సాహిత్య చరిత్రలో ‘శివకవి యుగము’ ను ప్రత్యేకంగా పేర్కొన్నటాన్ని గ్రంథకర్త ఆక్షేపించారు. ‘వీరశైవ కవి యుగ’ మంటే నన్నెచోడుడు, యథావాక్కుల అన్నమయ్యలు ఆ పరిధిలోకి రారని భావించారు.‘తాత్త్విక సిద్ధాంతము ననుసరించి విభజించిన వారిని శివాద్వైత కవులనవలెను. (పేజి: 4) అన్నమాట కూడా చర్చనీయాంశమే. ‘అనువాద యుగమున నవతరించి తెనుగు సాహిత్యమున స్వతంత్ర కావ్య నిర్మాణ యుగమునకు శ్రీకారము చుట్టినవాడు యుగకర్త పాల్కురికి సోమనాథుడు. (పై పేజీనే) రెడ్డిగారి ఈ అభిప్రాయం అందరూ అంగీకరించినదే.
నరసింహారెడ్డి పాలకురికి సోమన కాలం గురించి రెండు వాదాలున్నాయన్నారు. సోమనాథుడు 1160-70 ప్రాంతంలో పుట్టి 1230-40 అవధిలో శివైక్యం చెందాడన్నది మొదటి వాదం. ఇక రెండవ వాదం ఏమిటంటే ఆయన 1260-70 మధ్యలో జన్మించి 1330-40 దాకా జీవించి వున్నాడన్నది (పేజి: 6) రెడ్డిగారు సోమన్న కావ్యంలోని దేశీపదాల్ని పరిశీలించి ఆ మహనీయుడు 1160-1240 నాటి వాడిగా భావించారు. (పేజి : 61) సోమన జన్మస్థానం గురించి విద్వాంసుల మధ్య జరిగిన వాదవివాదాల్ని ఆవేశరహితంగా, నిష్పక్షపాతంగా అతను వరంగల్లు జిల్లా లోని జనగామ తాలూకాకు చెందిన పాలకుర్తి వాడేయని నిర్ధారించారు. సోమనాథుడు శివైక్యం పొందిన స్థలం కర్నాటకలోని తుమకూరు జిల్లా లోని కల్య అనే పల్లె. దీన్ని డా. నరసింహారెడ్డి బెంగళూరు జిల్లాలోని గ్రామంగా పేర్కొనడం పొరపాటు (పేజి: 90)
డా. వేణుముద్దల నరసింహారెడ్డి పాలకురికి వారి జీవితము -సాహిత్యము కృతులకు సంబంధించిన సామగ్రిని విపులంగా సేకరించి, పరిశీలించారనటంలో అనుమానం లేదు. కాని సోమన కావ్య సౌందర్యాన్ని విశ్లేషించడం పట్ల చాలినంత శ్రద్ధ కనపరచక పోవడం విచారకరం వి. నరసింహారెడ్డి ‘వృషాధిపశతకము’ గురించి 16 పేజీల (పేజి :129-143) రాసినారే కాని పాల్కురికి భక్తి తీవ్రతను, సంబోధనా వైవిధ్య వైశిష్ట్యాన్ని, దేశిపద సౌందర్యాన్ని వివరించే ప్రయత్నం చేయకపోవడం ఆశ్చర్యకరం. అయితే ‘పదకవిత’ (పేజి: 150-170) లో పర్వత పదములు, వెన్నెల పదములు, సంజవర్ణన పదములు ఇత్యాదిని ఉటంకించి, వివరించిన డా. వేణుముద్దల వారిని ప్రశంసించాల్సింది. వీరి ‘ద్విపద’ అంశం (పేజి:171-191) ఛందస్సంబంధమైన విషయాన్ని అందించి నంతగా ద్విపద రామణీయకాన్ని, ఇంపు సొంపుల్ని ప్రకటించక పోవడం చూస్తే పరిశోధకులకు కావ్య సౌందర్యంపట్ల అంత ఆసక్తి వున్నట్లు కనబడదు.
డా. నరసింహారెడ్డి ‘బసవపురాణము’ గూర్చి చేసిన 23 పేజీల (పే.192-214) వివేచన లో బసవన జీవితం, ఉద్యోగం, సమకాలికుల వృత్తాంతాలు తెలియజేయబడ్డాయే కాని ‘బసవపురాణము’ లోని రసచర్చకాని, వస్తు వైశిష్ట్యం కాని, దేశిపదాల సొబగు కాని గ్రంథకర్త దృష్టికి ఆనలేదనే చెప్పాల్సి వుంటుంది. సోమన ‘పండితారాధ్య చరిత్ర’ పరిశీలన ‘బసవపురాణము’ పరామర్శ కంటే కొంత లోతైనదిగా కనబడుతుంది. ‘సోమనకు గల లాక్షణిక దృష్టి’ అనే వివేచనలో గ్రంథకర్త సోమనను ‘రసప్రాధాన్యవాది’ గానూ, కొంతవరకు ధ్వనివాది గాను పేర్కొన్నా, ఆ కవీశ్వరుని రస, ధ్వని దృక్పథాల్ని సోదాహరణ పూర్వకంగా చర్చించక పోవడం గమనించాల్సిందే.
పాలకురికి సోమన జూదము, వేటల్ని వర్ణించిన మొదటి తెలుగు కవి అన్న డా. రెడ్డిగారి మాట మెచ్చదగిందే. కవి మురుఘ నయనారు – అరవై ముగ్గురు శివభక్తుల్లో ఒకరు – జూదమాడి, ప్రతిపక్షిని ఓడిరచి, అతను ద్రవ్య మివ్వక పోతే తీవ్రంగా బాధించి, అతనూ శివభక్తుడని తెలిసి కొని పశ్చాత్తాప పడతాడు. జూదంలో గెల్చిన ధనాన్ని శివభక్తులైన జంగమదేవర్లకే అతను అర్పించి వుండవచ్చు గాక
‘‘జూదంబు నింద్యమే సూచింప శివ వి
నోదంబు గాగ నివేదింప గనిన’’ (పేజి: 381) అన్న సోమనాథుని తీరు సమర్ధింపతగిందా?
‘‘ఆర్మిలి వ్యసనార్థమై జూదమాడి
ధర్మజు ముఖ్యులు నిర్మూలమైరి
ఆదట భక్తి హితార్థంబు గాగ
జూదమాడిన మూరు శూలి గూడండె’’ (పం. పురాతన 413-414 పేజీలు)
కాని డా. వే. నరసింహారెడ్డి ‘‘వ్యసన మయిన జూదము నిట్టి మహోన్నత భక్తి తత్వముతో సమన్వయించి వర్ణించుట నా భక్తు లాదృష్టితో చేసిరో లేదో తెలియదు కాని సోమన సమన్వయించిన తీరు మాత్ర మద్భుతముగా నున్నది. కావ్యగతమైన వర్ణనలకు కావ్యము నందలి కథకు పొత్తుండ వలయునను నౌచిత్యమును సోమన బాగుగా పాటించినాడు. (పేజి: 381) గ్రంథకర్త పైవిధంగా కవికి నివాళులర్పిస్తూ, అంతటితో ‘‘ఔచితీ పరిపోషణ చేసినవాడు’’ (పేజి: 382) అని కీర్తించడం ఔచితీశోభితం కాదు డా. నరసింహారెడ్డి శిశు. మాతృ మనస్తత్వ వర్ణనల్లో అందెవేసిన చెయ్యి అని పాలకురికి కవీశ్వరుని సోదాహరణంగా ప్రస్తావించడం (పే. 383-386) శ్లాఘనీయం.
పరసతితో రతిక్రీడ చేస్తూ పరమానందాన్ని పొందిన ఒడయనంబి కథను శాంత రసాభి ముఖంగా మలిచిన సోమనాథుని ప్రతిభ అనితర సాధ్యమని భావించడం (పే: 428-429) విచిత్రంగా వుంది.
బసవపురాణము, పండితారాధ్య చరిత్ర కావ్యాల్లో పరిశోధకులు నిరూపించిన శాంతరస ప్రాధాన్యం మరికొంత విపులంగా, లోతుగా విశ్లేషింపబడాల్సి వుండిరది.
గ్రంథకర్త సోమన నిరూపించిన వీరశైవమత స్వరూపాన్ని విశదంగా వివరించడం మెచ్చదగింది. సోమనాథుని కాలంనాటి సాంఘిక పరిస్థితుల్ని, ప్రజా జీవితంలోని నానా విధానాల్ని డా. నరసింహారెడ్డి కవి రచనల నుంచి చక్కగా పోగుచేశారు.
కొలతలు- మానములు, నాణ్యాలు, వాటి విలువలు పండుగలు- పబ్బాలు, జాతర్లు, బలులు, ఆత్మబలులు యాత్రికుల వేషభూషణాలు, మూఢవిశ్వాసాలు వగైరా విషయాల్ని, వివిధ జాతుల వారిని, సాధుసంతుల వివరాల్ని క్రోడీకరించిన వైనం ప్రశంసనీయం ఇంకా ఆనాటి ప్రజల వినోదాలు- వ్యసనాలు, దొంగతనము, ఆట పాటలు ఇత్యాదిని డా. వేణుముద్దల నరసింహారెడ్డి సోమన రచనల నుంచి చక్కగా గుదిగుచ్చటం మెచ్చదగింది. ఆకాలంనాటి సంగీత సంప్రదాయం, వాద్య విశేషాలు, గాయకుల గురించి సాధ్యమైనంత విషయ సామగ్రిని వివరించిన కృషి ఆధారంగా ఈ పరిశోధనా గ్రంథాన్ని పాలకురికి సోమనాథుని విజ్ఞాన సర్వస్వంగా భావిస్తే తప్పు కాదనుకొంటాను. పరిశోధకులు పాలకురికి కావ్య గుణాలతో పాటు దోషాల్ని కూడా చర్చిచడం ఆయన సమతౌల్యాన్ని ప్రదర్శిస్తుంది.
పాలకురికి సోమన్న కవితా ప్రభావం తర్వాతి కవులపై ప్రసరించిన వైనాన్ని గ్రంథకర్త స్థూలంగా చెప్పి, తర్వాతి పరిశోధకులకు ప్రేరణ కల్పించడం ముదావహం. ‘అనుబంధము’ లో గ్రంథకర్త క్రోడీకరించిన శాసనాలు, బాణగద్యాదులు, సామెతలు -జాతీయాలు నరసింహారెడ్డి పరిశోధనా ప్రీతిని, చిత్తశుద్ధిని ప్రకటిస్తాయి.
వేణుముద్దల నరసింహారెడ్డి గారి సిద్ధాంత గ్రంథం విపులమైనదీ, విషయ సంపన్నమైనదీనూ, కాని ఆయన రూపొందించిన ‘విషయ సూచిక’ అస్తవ్యస్తంగా వుండటం మాత్రం చింతాజనకం. పాల్కురికి సోమనకు ముందున్నట్టి తెలుగు కవితా సంప్రదాయం, సోమన జీవితం, రచనలు, వాటి వర్గీకరణ, విశ్లేషణను వివిధ శీర్షికల కింద పరిశీలించి వుంటే సిద్ధాంత గ్రంథానికొక సౌష్ఠవం రూపొంది వుండేది. పర్యవేక్షులు, సలహాదారులైన విద్వాంసులు పరిశోధకునికి సముచితమైన మార్గదర్శనం కలిగించి వుంటే ఈ థీసిస్సుకు మరింత సొబగు, పటిష్ఠతలు లభించివుండేవి.
(పాలకురికి సోమనాథుని కృతులు – పరిశీలన. గ్రంథకర్త : డా. వేణుముద్దల నరసింహారెడ్డి, పేజీలు : 789. వెల : 1000/- ప్రతులకు: సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ 1-7-1047. హంటర్‌ రోడ్‌ హనుమకొండ వరంగల్లు – 506001.

ఘట్టమరాజు
ఫోన్‌ : 99640 82076

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *