అతడు వీరుడు
అతణ్ని బతికించండి
చీకటిని చీలుస్తూ
వెలుగును వెదజల్లినవాడు
ఇప్పుడు కాలాన్ని చీల్చుకుంటూ
త్వరగా వెళ్ళండి
ఎవరిదైనా ప్రాణమే
కానీ అతడు మరీ అపురూపం
పలు ప్రజా ఉద్యమాలకు
ప్రాణం పోసినవాడు
గుండె దిటవు గలవాడు
ఇప్పుడతని గుండె
బలహీనంగా కొట్టుకుంటుంది
చేతులడ్డం పెట్టి
దీపాన్ని కాపాడండి
ఎందరికో దారి చూపినవాడు
ఇప్పుడతని కనులు
మూతపడనీయకండి
ఎందరో నమ్ముకున్నారతణ్ని
ఆ నమ్మకాన్ని వమ్ము కానీయకండి
చూశారా!
అతని పెదవుల పైన చిరునవ్వు
మెల్లమెల్లగా తొణికిపోతున్నది
ఓ నా ట్రాఫిక్ దేవతా!
ఈ మహానుభావునికి కాస్త దారినివ్వు
పడుతున్నది వర్షం కాదు
బంధుమిత్రుల కన్నీళ్లు
హాస్పిటల్ సంజీవనీ వృక్షంలా కనిపిస్తున్నది.
ఏం కాదు సార్!
మేమున్నాం కద
ఆకాంక్షల కవచం అల్లిపెట్టాం
వీరుడా! వెళ్లేటప్పుడు పడుకున్నావు
వచ్చేట్పుడు నడిచొస్తావు చూడు
ఆల్ ది బెస్ట్!
డా. ఎన్. గోపి
ఫోన్ : 939 102 8496