ఉపోద్ఘాతం :
ప్రతి మనిషి జీవిక కోసం ఏదో ఒక వృత్తి చేయవలసిందే! వృత్తులలో 1. ప్రాథమిక, 2. ద్వితీయ, 3. తృతీయ స్థాయిలు ఉన్నాయి. ప్రాథమిక వృత్తులు పంట సాగు, పశుపోషణ వంటి ఉత్పత్తి ప్రధానమయినవి. ద్వితీయ స్థాయి వృత్తులు ప్రాథమిక వృత్తుల మీద అధారపడి ఏర్పడిన చేతి పనులు, పరిశ్రమలు, వర్తకం తదితర వృత్తులు. తృతీయ శ్రేణి వృత్తులు పూర్తిగా మేధోపరమైనవి. అధ్యాపక, వైద్య, న్యాయవాద, రాజకీయ ఇత్యాది వృత్తులు తృతీయ శ్రేణి వృత్తులు. వృత్తిని ఇంగ్లిష్‌లో ఆక్యుపేషన్ అంటరు. అయితే తృతీయ శ్రేణి వృత్తిని ప్రత్యేకంగా ప్రొఫెషన్ అంటరు. తెలుగులో ఆక్యుపేషన్, ప్రొఫెషన్ రెండిరటికి వృత్తి అనే పదాన్నే వాడుతము.
వైద్యవృత్తి పై మూడవ కోవలోనిది. సేవల విభజన వలన, ప్రత్యేక నైపుణ్యాల వలన, వినూత్న ఆవిష్కరణల వలన వైద్య వృత్తిలో కూడా పలు విభాగాలు ఏర్పడ్డయి. ఔషధ కల్పన, ఔషధ ప్రయోగంలో నిపుణులయిన వారిది భైషజిక వృత్తి. భైషజిక పదం కఠినంగా
ఉందనుకొంటె సరళంగ ఔషధ ప్రయోక్త అనవచ్చు. ఔషధ ప్రయోక్తను ఇంగ్లీష్‌లో ఫార్మసిస్ట్ అంటరు. మన దేశంలో ఫార్మసిస్ట్‌ల విద్యను, వృత్తిని భారతీయ భేషజీ పరిషత్ (ూష్ట్రaతీఎaషవ జశీబఅషఱశ్రీ శీట Iఅసఱa) నియంత్రణ చేస్తది.
హాస్పిటల్ ఫార్మసిస్ట్స్ ` సాహిత్యం : వైద్య వృత్తిలోని ఫిసిషియన్, సర్జన్, నర్స్ వంటి వృత్తుల మీద సాహిత్యం విస్తారంగనే వచ్చినప్పటికి, ఫార్మసిస్ట్ జీవితంపై పూర్తి స్థాయి రచనలు లేవు. అగాథా క్రిస్టీ వంటి ఫార్మసిస్ట్‌లు సాహితీవేత్తలుగా రాణించినా, తమ వృత్తి జీవితంపై వారేమి వ్రాయలేదు. మన దేశంలో పరిస్థితి కూడా అందుకు భిన్నంగా లేదు. ఫార్మసిస్ట్‌ల జీవితం మీద తెలుగులో, బహుశా భారతీయ భాషలలో, వచ్చిన ఒకే ఒక సాహిత్య రూపం వూళ్ల విశ్వనాథ స్వామి రచించిన ‘‘పేరులో పెన్నిధి’’ నవల. ఫార్మసిస్ట్ ల వృత్తి జీవితం మీద ఇంగ్లిష్‌లో వచ్చిన మరొక రచన ‘‘స్ట్రెస్ అండ్ క్వాలిటీ ఆఫ్ వర్క్ లైఫ్ అమాంగ్ హాస్పిటల్ ఫార్మసిస్ట్స్ ఇన్ ఇండియా’’.
ఇది రాపోలు సత్యనారాయణ పరిశోధన గ్రంథం, 2007లో అచ్చు అయింది. పేరులో పెన్నిధి – నవల వ్రాసినది 1990లో అయినప్పటికి 1998లో ముద్రణ పొందింది. మరిన్ని తాజా మార్పులతో 2008లో ద్వితీయ ముద్రణ వెలువడిరది. వూళ్ల విశ్వనాథ స్వామి స్వయానా ఫార్మసిస్ట్! తన జీవిత అనుభవాలే నవలగ మార్చినందున విషయంలో వాస్తవికత, సాధికారత కనిపిస్తది. మొత్తం ఐదు నవలలు వ్రాసిన స్వామికి ఇది రచయితగ తొలి కృతి! పేరులో పెన్నిధి నవల అనుశీలన అర్థం కావాలంటె వైద్య వృత్తిలోని కొన్ని పదాలు, భావనలు అర్థం కావాలె. అందు కోసం, క్రింద ఇచ్చిన అంశాలు అవగతం చేసికొని ముందుకు పోదాం.
ఫార్మసిస్ట్ వృత్తి – పూర్వాపరాలు : మనిషి మనుగడ సాగించిన నాటి నుండే ఫార్మసి చరిత్ర మొదలైంది. అనారోగ్యానికి ఏ ఆకు అలమో తిని బాగుపడిన అనుభవమే ఫార్మసీకి మూలం. మన సంప్రదాయ వైద్యాలలో వ్యాధి నిదానం, ఔషధ ప్రయోగం చేసేది ఒకే వ్యక్తి. ఒక్క మాటలో ఆ వ్యక్తిని వైద్యుడు అన్నా సాంకేతికంగా భిషక్ (ూష్ట్రవంఱషఱaఅ), భైషజిక్ (ూష్ట్రaతీఎaషఱర్) అనే ఇద్దరు వృత్తిదారులు కలగలసి ఉన్నట్టు అర్థం చేసికోవాలె. ఫార్మసీ 9వ శతాబ్దిలోనే బాగ్దాద్ నగరంలో ప్రత్యేక వృత్తిగ రాణించింది. కాని, ఆ పరిణామం ప్రపంచ వ్యాప్తంగా ఒకే విధంగా జరుగలేదు. మనకు ఐరోపియన్ వలసదారులతో అలోపతి వైద్యం పరిచయం జరిగింది. తొలుత సర్జన్లు, బార్బర్లు రాంగ తరువాత ఫిసిషియన్లు, అపోతెకరీలు వచ్చిండ్రు. అలనాటి ఔషధ ప్రయోక్త వృత్తి నామం అపోతెకరీ. అప్పటికి అక్కడ కూడా వైద్యరంగంలో రకరకాల సంస్కరణలు జరుగుతున్న తరుణం. ఔషధాలకు సంబంధించి వృత్తుల పరంగ ఏకస్వామ్యం లేదు. గ్రోసర్స్, స్పైసర్స్, అపోతెకరీస్, డిస్పెన్సర్స్, కెమిస్ట్స్, డ్రగిస్ట్స్, ఫార్మస్యూటిస్ట్స్ ఇట్లా రకరకాలు. పంతొమ్మిదవ శతాబ్ది పూర్వార్ధంలో రాయల్ ఫార్మస్యూటికల్ సొసైటి ఏర్పడిరది. అప్పటి నుంచి క్రమంగా ఫార్మసిస్ట్ పదం స్థిర పడిరది. కాని, ఇండియా పరిస్థితి మరో రకం. వచ్చిన అపోతెకరీలు మెడికల్ ఆఫీసర్స్‌గా కొనసాగగా, ఔషధ వితరణ కోసం స్థానిక సహాయకులను తీసికొని వారిని కంపౌండర్ అనే వారు. బ్రిటన్‌లో వచ్చిన మార్పులకు అనుగుణంగా స్వాతంత్య్రానికి పూర్వమే అర్హులైన ఫార్మసిస్ట్‌లు సేవలు అందిస్తున్నా, స్వాతంత్య్రానంతరం 1948లో ఫార్మసీ చట్టం వచ్చినా కంపౌండర్ పదం బహుళ ప్రచారం పొందింది. మెడికల్ ప్రాక్టీషనర్ లకు సహాయకులు అనే భావంతో ఇంకా వాడుకలో ఉంది. ఇప్పటికీ కమ్యూనిటీ ఫార్మసిస్ట్లను కెమిస్ట్ లని, హాస్పిటల్ ఫార్మసిస్ట్లను కంపౌండర్ లని సంబోధిస్తున్న తీరు ఫార్మసిస్ట్లను మానసికంగా ఇబ్బంది పెడుతున్నది. ఫార్మసిస్ట్‌లు డిప్లొమా, బాచెలర్, మాస్టర్, డాక్టర్ పట్టాలు పొంది కూడా సామాజిక గౌరవం దక్కక బాధ పడుతున్నరు. అదే అమెరికాలో ఫార్మసిస్ట్‌లు ఫిసిషియన్తో సమానంగ డాక్టర్ అని గౌరవాన్ని అందుకొంటున్నరు. ఔషధం ఉత్పత్తి మొదలుకొని వినియోగం వరకు అన్ని విషయాలలో నిష్ణాతులు ఫార్మసిస్ట్‌లు. మెడికల్ డివైసెస్, బ్లడ్ బాంక్ ప్రమాణాలు పరిరక్షించేది ఫార్మసిస్ట్‌లు.
డాక్టర్ పదం – అర్థ వివరణ : డాక్టర్ లాటిన్ పదం. డాక్టర్ అంటె పండితుడు, గురువు అని అర్థం. ఐరోపియన్ దేశాలలో మత ప్రబోధకులను, విశ్వవిద్యాలయ ఆచార్యులను డాక్టర్ అని సంబోధించే వారు. కాల క్రమంలో విశ్వవిద్యాలయాలు స్నాతకులకు పట్టాలు ప్రదానం చేసే సంప్రదాయం వచ్చింది. వైద్యశాస్త్రం చదివిన వారికి ‘ఫిసిక్ డాక్టర్’ లేదా ‘మెడిసినే డాక్టర్’ (ఎం.డి.) పట్టా లభించేది. క్రమంగ ఫిసిషియన్కు డాక్టర్ పర్యాయ పదమై స్థిరపడి పోయింది. సర్జన్లను మాస్టర్ అనేవారు. విద్యారంగ సంస్కరణల వలన మెడిసిన్‌లో కూడా బాచెలర్ డిగ్రీ వచ్చింది. ఎం.డి. స్నాతకోత్తర విద్య అయింది. అమెరికన్ విద్యా వ్యవస్థలో ఫిసిషియన్, ఫార్మసిస్ట్, డెంటిస్ట్, వెటరినేరియన్ లకు మౌలికంగా డాక్టర్ డిగ్రీ ప్రదానం చేస్తరు. అమెరికా సంయుక్త రాష్ట్రాలు అధికారింగ ప్రచురించిన ‘డిక్షనరీ ఆఫ్ ఆక్యుపేషనల్ టైటిల్స్’ లో ఎక్కడా డాక్టర్ అనే వృత్తి లేదు. విశ్వవిద్యాలయం నుంచి డాక్టర్ పట్టా పొందిన వారిని మాత్రమే డాక్టర్ అని సంబోధించాలె. కాని, ఇప్పుడు మెడికల్ ప్రాక్టీషనర్స్ అందరు డాక్టర్ డిగ్రీ లేకున్నా పేరు ముందు డాక్టర్ అని వ్రాసి కొంటున్నరు.
ఆర్.ఎం.పి. నిర్వచనం : ఆర్.ఎం.పి. కి పూర్తి రూపం రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. ఇందులో పదాలను మార్చి వేరే చెప్పకూడదు. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ చట్టం 1940 అనుబంధంగా ఉన్న డ్రగ్ రూల్స్ 1945లోని నియమం 2 ప్రకారం ఆర్.ఎం.పి. అనగా ఇండియన్ మెడికల్ డిగ్రీస్ ఆక్ట్ 1916 సెక్షన్ 3 క్రింద ప్రకటించిన, కాని ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆక్ట్ 1933లోని షెడ్యూల్లలో పేర్కొన్న వైద్య విద్య అర్హత లేదా రాష్ట్ర అలోపతి మెడికల్ కౌన్సిల్లో పేరు నమోదు అయిన లేదా నమోదుకు అర్హత సాధించిన లేదా అలోపతి వైద్యం చేస్తూ సబ్ క్లాజ్ లేదా సబ్ క్లాజ్ వర్తించక రాష్ట్ర ప్రభుత్వం అజ్ఞ మేరకు మెడికల్ రిజిస్టర్లో పేరు నమోదు పొందిన వ్యక్తి అని నిర్వచనం. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ 1956 సవరణ ప్రకారం ఆర్.ఎం.పి. గ నమోదు చేసికొనటానికి బాచిలర్ ఆఫ్ మెడిసిన్ అండ్ బాచిలర్ ఆఫ్ సర్జరీ (ఎం.బి.బి.ఎస్.) కనీస అర్హతగ నిర్ణయమైంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల ప్రకారం ప్రభుత్వ గుర్తింపు పొందిన, విశ్వవిద్యాలయానికి అనుబంధమైన, భారతీయ ఆయుర్విజ్ఞాన్ పరిషద్ (వీవసఱషaశ్రీ జశీబఅషఱశ్రీ శీట Iఅసఱa) ఆమోదం పొందిన వైద్యకళాశాలలో ఎం.బి.బి.ఎస్. పట్టా పొంది బోధనా వైద్యశాలలో అభ్యాస శిక్షణ పూర్తి చేసికొని స్టేట్ మెడికల్ కౌన్సిల్లో పేరు నమోదు చేయించు కొనిన వ్యక్తిని రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ (ఆర్.ఎం.పి.) అంటరు. కాని, ఆర్.ఎం.పి. కాని వారు, అర్హతలు లేని వారు ఆర్.ఎం.పి., పి.ఎం.పి. అక్షరాలను తమ పేర్ల చివర తగిలించుకొంటున్నరు.
పేరులో పెన్నిధి నవల – అనుశీలన : హాస్పిటల్ ఫార్మసిస్ట్‌ల మీద వచ్చిన ఒకే ఒక నవల ‘పేరులో పెన్నిధి’. వూళ్ల విశ్వనాథ స్వామి కి ఇది తొలి రచన అయినప్పటికి ఎక్కడా పాఠకుడు పసి కట్టలేడు. ఫార్మసిస్ట్గ జీవిత అనుభవాలు, ఘటనలను పాఠకునికి ఉద్వేగాన్ని, సహానుభూతిని, అవగాహనను కలిగించే విధంగ వ్రాస్తడు. ఇందులో కథానాయకుడు విజయ్‌కుమార్ ఫార్మసీ డిప్లమా చదువుకొంటడు. విజయ్ కుమార్ పాఠశాల సహాధ్యాయి గీత. వీరిద్దరి నడుమ ప్రేమను రమ్యంగా రచించి కథను నడిపిస్తడు, పాఠకుని మురిపిస్తడు.
లాభాల బాటలో నడుస్తున్న గీతా ఫార్మస్యూటికల్ ఇండస్ట్రీస్ యజమాని ‘విజయ్‌కుమార్ తన ఆఫీస్ గదిలో కూర్చొని అకౌంట్స్ చూసుకొంటున్నాడు’ వాక్యంతో నవల మొదలు పెట్టి మొదటి అంకాన్ని ఒక్క పుటలో క్లుప్తంగా ఆపేస్తడు. రెండవ అంకంలో విజయ కుమార్ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న నాటి నుంచి ఒక్కొక్కసారి బాల్యంలోనికి తొంగి చూస్తూ కథ అంకాల వారిగ ఒక వరుసలో సాగుతది.
కథా నాయకునికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఫార్మసిస్ట్ ఉద్యోగం వస్తది. దూర రాష్ట్రంలో ఉండే తండ్రికి ఉత్తరం వ్రాసి పోస్ట్ చేసి తిరిగి వస్తున్నడు. అప్పుడు ఊరి సర్పంచ్ ఎదురై ‘‘ఏం ఓయ్! కంపౌండర్ ఉద్యోగం వచ్చిందట’’ అని పలుకరిస్తడు. తనకు తల దించినట్లు అయితది. అప్పుడు అక్కడ మొదలైన సంఘర్షణ చివరి దాక అడుగడుగున కొనసాగుతనే ఉంటది. తనను ఇలాగున పిలుస్తరని తెలిసి ఉంటే తను ఈ డిప్లొమా చదివి ఉండేవాడు కాదు. ఫార్మసీ చదువుకొన్నప్పుడు గొప్ప అభిప్రాయంతోనే ఉన్నడు. దేశంలో విద్యావంతుల శాతం పెరుగుతున్నదే కాని, ఆ విద్యావంతులు ఎలా పిలువాలో తెలిసి కూడా తెలియనట్లు పిలుస్తున్నరు. కొందరికి తెలియక, మరికొందరికి తెలిసి అలా పిలుస్తున్నరు. తను పాసైన సర్టిఫికెట్లో కంపౌండర్ అని లేదు. తనకిచ్చిన పోస్టింగ్ ఆర్డర్లో కంపౌండర్ అని లేదు. ఐనా వీల్లంతా ఎందుకలా పిలుస్తున్నరు? అని మథన పడుతడు.
ఉద్యోగంలో చేరటానికి పోతే అక్కడ ప్యూన్‌తో ‘‘నాకిక్కడ ఫార్మసిస్ట్‌గా వేశారు’’ అని చెప్పినప్పుడు ‘‘ఫార్మసిస్ట్ అంటె కంపౌండర్ అన్న మాట! కంపౌండర్ లేక మేం ఇక్కడ చస్తున్నం అనుకోండి’’ అంటడు. మెడికల్ ఆఫీసర్ కూడా తోటి మెడికల్ ఆఫీసర్‌కు తనను పరిచయం చేస్తూ ‘ఈయన మన కొత్త కంపౌండరు’ అని చెప్పుతడు. నమస్తే అని రెండు చేతులు జోడిరచిన కథా నాయకుడు ‘సార్ మీరేమీ అనుకోకపోతె ఒక విషయం చెప్పాలనుకొంటున్నాను. ‘నన్ను కంపౌండర్ అని పిలువవద్దు. నా పోస్టింగ్ ఆర్డర్లో ఫార్మసిస్ట్ అని ఇచ్చారు. నేను చదువుకొన్నది ఫార్మసీ డిప్లొమా’ అని మెల్లగా అంటిస్తడు. అట్లా మొదలైంది అతని పోరాటం. అక్కడ పని పరిస్థితులు చూసి శిక్షణ కాలంలో ‘ఎందుకు వచ్చావయ్యా ఈ ప్రొఫెషన్‌కి’ అన్న హెడ్ ఫార్మసిస్ట్ మాటలు పదే పదే గుర్తుకు వస్తుంటయి. రాజకీయ పదవిలో ఉన్న ఒక వ్యక్తి దురుసుతనం నచ్చక, అధికారుల నైతిక మద్దతు లేక ఉద్యోగానికి రాజీనామా చేస్తడు.
రెండు నెలలలో రైల్వే ఫార్మసిస్ట్ ఉద్యోగం వస్తది. చేరుతడు. అక్కడ కూడా కంపౌండర్ అని పిలుస్తున్నరు. వార్డ్‌బాయ్‌లను కూడా కంపౌండర్ అని పేషంట్లు పిలుస్తున్నరు. హాస్పిటల్లో పనిచేసే మగ వాల్లందరిని కంపౌండర్, తెల్ల చీర కట్టుకొన్న ఆడ వాల్లందరిని సిస్టర్, స్టెతస్కోప్ పట్టుకొని తిరిగే వాల్లను డాక్టర్ అంటున్నట్టు అర్థం అయింది. పని భారం ఎక్కువగా ఉంటున్నది. రోజు రెండు మూడు వందల మందికి మందులు ఈయవలసి వస్తున్నది. కొందరు మెడికల్ ఆఫీసర్ల వ్రాత అర్థం కాదు. ఒక మందుకు మరొక మందుకు పొసగని ప్రిస్క్రిప్షన్ వస్తది. మందులు వాడే విధానం చెప్పినప్పుడు మనసు పెట్టక తరువాత కొత్తగ మల్ల అడుగుతరు. మూత్రం గోలి రాత్రి వేసికొన్నా, నిద్ర మాత్ర పగలు వేసికొన్నా సమస్య. ఈ మందులు ఎందుకు పని చేస్తయి అని అడుగుతరు, వీల్లకు ఏ పాటి తెలుసో పరీక్ష చేద్దామని. పాత ప్రిస్క్రిప్షన్ తెచ్చి మందు ఈయమంటరు. ప్రిస్క్రిప్షన్ లేకుండ మందులు అడుగుతరు. మెడికల్ ఆఫీసర్లు స్టోర్స్ ఇన్చార్జ్గ ఉంటరు. అధికారం వాల్లది. ఫార్మసిస్ట్ జవాబుదారు. బి.ఫార్మ్., ఎం.ఫార్మ్. చదివినా కంపౌండర్ అనే అంటున్నరు. బయట ఆర్.ఎం.పి.లు నయం. అందరు డాక్టర్ అని పిలుస్తరు. ఎదుగుదల లేని ఉద్యోగం. రైల్వేలో ఇంజనీరింగ్ డిప్లొమా వాల్లకు ఉన్నట్టు ఫార్మసీ డిప్లొమా వాల్లకు పదోన్నతులు లేవు. ప్యూన్గ జాయిన్ అయి ఉన్నతాధికారులుగ ప్రమోషన్ పొందినవాళ్ళు
ఉన్నరు. మనశ్శాంతి లేదు. ఒకరోజు పని ఉండి మెడికల్ ఆఫీసర్ గదికి పోతడు. అక్కడ ఆయన ఒక వ్యక్తికి మందులు వ్రాసి ‘కంపౌండర్ దగ్గరికెల్లి మందులు తీసికొని నన్ను కలువు’ అని చెప్తడు. కోపం వచ్చిన విజయ కుమార్ ‘ఫార్మసిస్ట్ అనలేరా సార్’ అంటె చిన్న నవ్వు సమాధానంగ వచ్చింది. ‘మరెప్పుడు మమ్మల్ని అట్లా పిలువకండి’, అని బయటికి వస్తడు.
బి.కాం. చదివిన తమ్మునికి బాంక్ ఉద్యోగం వచ్చింది. చెల్లె పెండ్లి కుదిరింది. చెల్లె పెండ్లికి పోతె, బాంక్ ఉద్యోగం అని తమ్మునికి పెండ్లి సంబంధాలు వస్తున్నయి. నీకు కూడ సంబంధం చూసి పెండ్లి చేద్దాం అని బలవంత పెట్టుతరు తల్లి తండ్రులు. మధ్యవర్తి ద్వార ఒక సంబంధం చూడటానికి పోతరు. ఆ ఇంటి ముందు డాక్టర్ లక్ష్మీరావు ఆర్.ఎం.పి. అని పెద్ద బోర్డ్ ఉంటది. ఏ నర్సింగ్ హోం లోనో చేరి కొంత పని నేర్చుకొని సొంత ప్రాక్టీస్ పెట్టుకొని డాక్టర్ అని బోర్డ్ పెట్టుకొంటున్నరు. పిల్ల అన్న విజయ్ను ఏం చేస్తావని అడుగుతడు. ఫార్మసిస్ట్ అని చెప్పుతడు. అర్థం కాక పోతె వివరిస్తడు. కాని ఆయన ‘ఒహో కంపౌండర్ అన్న మాట’ అంటడు. ‘కాదు, ఫార్మసిస్ట్’, అని ఎంత చెప్పినా తన తండ్రి దగ్గర పని చేసే సహాయకునితో పోల్చుతడు. అవమానంతో లేచి రావలసి వస్తుంది. తన ఫార్మసీ క్లాస్ మేట్స్ కొందరు ఇతర కోర్స్‌లు చదివి గౌరవం లభించే వేరే వృత్తి లోనికి మారే ప్రయత్నం చేస్తున్నరు.
చిన్ననాటి స్నేహితురాలు గీత వాల్ల నాన్న ఉపాధ్యాయుడు. బదిలీపై వేరే దూర ప్రాంతం పోయినందున వాల్ల ఆనుపానులు తెలువ లేదు. ఒక మిత్రుని ద్వార తెలిసికొని కలుసుకొంటడు. గీత తండ్రి గుండెపోటుతో మరణించినట్టు తెలిసి బాధ పడుతడు. గీత నర్సింగ్ కోర్స్ పూర్తి చేసింది. రెండు మూడేండ్లు విదేశాలకు పోయి డబ్బు సంపాదించుకొని రావాలని ఆమె ఆలోచన. అవకాశం కలిసి వచ్చి దుబాయి పోతది.
విజయ్ కుమార్ ఫార్మసిస్ట్ సంఘాలలో చురుకుగ పాల్గొంటడు. దిల్లీ పోతడు. ప్రయాణంలో రకరకాల వ్యక్తుల పరిచయాలు. వాల్లు ఫార్మసిస్ట్ అంటె కంపౌండర్ అంటరు. దేశం పలు ప్రాంతాలు, పలు సంస్థలలో చేస్తున్న ఫార్మసిస్ట్‌ల పరిచయాలు కలుగుతయి. దిల్లీలో ఉద్యమం చేస్తరు. చూసే ప్రజలు వీల్లకు కూడ కోర్కెలు ఉంటయా అనుకొంటరు. సినిమాలు, టీవిలలో కంపౌండర్ పాత్రలు పెట్టి హేళనగ చూపెడుతున్న దర్శకులకు, నిర్మాతలకు ఉత్తరాలు వ్రాస్తడు. ఒక తెల్లవారి గట్ల విజయ్ ు కల పడుతది. ఆ కలలో ఫార్మసిస్ట్ లందరు వరుసగ నిలబడి మేము కంపౌండర్లము కాదు ఫార్మసిస్ట్లం! అనే బోర్డ్‌లు మెడలో వేలాడుతుంటయి.
ఊరిలో ఇంజెక్షన్ వికటించి తల్లి మరణం. ఆ మెడికల్ ప్రాక్టీషనర్కు ప్రత్యామ్నాయ వైద్యంలో ఏదో సర్టిఫికెట్ ఉన్నదట. చేసేది అలోపతి వైద్యమే! తమ్ముడు పోలీస్ కేస్ పెట్టుదామంటె వద్దంటడు. అర్హులైన వారు అందుబాటులో లేనప్పుడు ఉన్నవారిని బెదరగొట్టి గ్రామస్తులకు ఆ మాత్రం సేవలను దూరం చేయొద్దు అంటడు.
డిపార్ట్మెంటల్ టెస్ట్ లు ఉత్తీర్ణుడైనందుకు తమ్మునికి పదోన్నతి లభిస్తది. ముందుగ ఉద్యోగంలో చేరినా తనకు అటువంటి అవకాశం లేనందుకు బాధ కలుగుతది.
గీత విదేశం నుంచి వచ్చి వాల్ల పట్టణంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ఉద్యోగం చూసుకొంటది. విజయ్ కూడా ఉద్యోగానికి రాజీనామా చేసి వచ్చి ఇక్కడి హాస్పిటల్లో ఉద్యోగం పొందుతడు. ఆడంబరాలు లేకుండా పెండ్లి చేసికొంటరు. కాని, ఇక్కడా ఉద్యోగంలో ఇదే అవమాన పరంపర. గీత తెచ్చిన డబ్బులు ఇచ్చి ఫార్మసీ పరిశ్రమ పెట్టుమని ప్రోత్సహిస్తది. పరిశ్రమ మంచిగ నడుస్తున్నది. కొందరికి ఉపాధి కల్పించగలుగుతున్నడు. అయినా, విజయ్ కుమార్ హాస్పిటల్ ఫార్మసిస్ట్‌ల సమస్యలపై నిరంతరం పోరాడుతూనే ఉన్నడు. ఇట్లా నవలకు శుభం పలుకుతడు రచయిత.
ఫార్మసిస్ట్ ఒక ప్రొఫెషనల్. కాని, బయట సమాజం మరియు వైద్య వ్యవస్థలోనూ ఫార్మసిస్ట్‌ను ఒక సహాయకుడుగ చూస్తున్నరు. ఒక వృత్తి పట్ల సమాజ దృష్టి కోణం, వృత్తిదారులు భావించే సమాజ ప్రతిరూపం పొసగక పోవచ్చు. అప్పుడు వృత్తిదారులలోని స్వీయబింబం నకు సమాజ ప్రతిరూపం తో ఘర్షణ జరుగుతది. సమాజ ప్రతిరూపంను స్వీయ బింబంనకు దగ్గరగా మార్చాలనే తపనయే ఆ ఘర్షణ. ఈ నవలలో అంతటా ఆ ఘర్షణ కనిపిస్తది. ఈ నవల పాఠకులకు ఫార్మసిస్ట్‌లు అంటె ఏమిటో తెలిపి ఫార్మసిస్ట్‌ల గౌరవాన్ని పెంపొందించటానికి తప్పకుండా తోడ్పడగలదు.
డాక్టర్ రాపోలు సత్యనారాయణ
ఫోన్ : 94401 63211