శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయం నిర్వహణలో ప్రముఖుల కృషి

రావిచెట్టు రంగారావు
శ్రీకృష్ణ దేవరాయాంద్ర భాషానిలయం స్థాపనలో ప్రథమ స్మరణీయులు రావిచెట్టు రంగారావు గారు. నల్లగొండ జిల్లా దండంపల్లి గ్రామంలోని మాతామహుల ఇంట్లో 1877 డిసెంబర్‌లో జన్మినారు. రంగారావు తల్లి దండ్రులు వెంకటమ్మ, నరసింహారావు (భూస్వామి,మున్సబ్‌ దార్‌). ఈయన చిన్నతనంలో తల్లిదండ్రులు గతించటం వల్ల స్వయంకృషితో పైకి వచ్చారు.
రంగారావు గారు దేశంలో స్వదేశీ ఉద్యమం రాకముందే స్వదేశీ వస్తువుల విక్రయశాలలు స్థాపించి, ఆ ఉద్యమానికి నాంది పలికారు. 1908 లో మూసీనది వరదల సమయంలో ధన, ప్రాణ నష్టం జరిగింది. ఆ విపత్కర సమయంలో నిరాశ్రయులైన ప్రజలకు వసతి కల్పించి ఆదుకొన్నారు. ఎందరో పేద విద్యార్థులను తన ఇంట్లో ఉంచుకొని ఉన్నత చదువులు చెప్పించిన విశాల హృదయులు. ఆదిరాజు వీరభద్రరావు రంగారావు సహాయం పొందిన వారిలో ఒకరు.
రంగారావు భాహుభాషావేత్త, సాహిత్యంపట్ల ఆసక్తితో వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు కావ్యాలు, నాటకాలు, శాస్త్రాలు మున్నగు గ్రంథాలు తెప్పించి పఠించేవారు. ఎంతో విలువైన సంస్కృతాంధ్ర గ్రంథాలతో కూడిన తన స్వంత గ్రంథాలయాన్ని భాషనిలయంలో విలీనం చేసినారు. రంగారావు గారు ఉదార హృదయులు, స్వస్థాన వేష భాషాభిమాని కావడం చేతనే మాతృభాషాభివృద్ధి కొరకు చారిత్రకమైన గొప్ప ముందడుగు వేసి శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషా నిలయాన్ని స్థాపించి తన సొంత బంగ్లాలోనే నిర్వహించి భాషా నిలయం అభివృద్ధికొరకు ఎంతో సేవ చేసినాడు. ఇంతటి మహోన్నత వ్యక్తి 33 సంవత్సరముల వయసులోనే పరమపదించారు.

రాజా పార్థసారథి అప్పారావు
1901 లో భాషానిలయం స్థాపన గురించి ఏర్పాటైన సమావేశానికి అధ్యక్షత వహించిన ప్రముఖ వ్యక్తి పాల్వంచ సంస్థానం రాజా పార్థసారథి అప్పారావు గారు. దామోదర శాయన్న, సతీమణి, రాణీ లక్ష్మీ నరసాయమ్మ గార్లు, తమ ఇద్దరి పుత్రుల మరణంవల్ల, నూజివీడు అప్పారాయ కుటుంబీకుడైన దౌహిత్రుడు పార్థసారధి అప్పారావును దత్తత చేసుకోగా అతడు పాల్వంచ సంస్థానాధిపతి అయినాడు.
సంస్కృతాంధ్ర భాషాకోవిదుడైన అప్పారావు ఫారసీ, ఉర్దూ, ఆంగ్ల భాషలు కూడా నేర్చుకొని వ్యవహారదక్షునిగా పేరు తెచ్చుకొన్నాడు. భాషా నిలయం పోషకులుగానే కాక సంస్థలకు పండితులకు ఆర్ధిక సహకారం అందించిన వదాన్యులు. శ్రీపాదకృష్ణముర్తి శాస్త్రి, మహాభారతానువాద ప్రచురణకు తోడ్పడి పచ్చల ఉంగరం బహూకరించారు. నాటి నిజాం మీర్‌ మహాబూబ్‌ అలీఖాన్‌ బిరుదులతో వీరిని సత్కరించారట. ఈయన ఆశ్రితుడు పాల్వంచ సంస్థాన విద్యాశాఖాధికారి, ఆంధ్రవాఙ్మయ సేవా సమితి కార్యదర్శి అయిన కొత్తపల్లి వేంకట రామ లక్ష్మీనారాయణ శర్మ రాసిన ‘‘పాల్వంచ సంస్థాన చరిత్ర’’ ద్వారా ఈయన జీవిత విశేషాలు తెలుస్తున్నాయి.

నాయని వెంకట రంగారావు
వరంగల్‌ జిల్లా తొర్రూరులో జన్మించిన నాయని వెంకట రంగారావు బహదూర్‌ మునగాల సంస్థానాధీశ్వర రాణి లచ్చమ్మరావుకు దత్తపుత్రుడై కోర్టు వ్యాజ్యములలో గెలిచి సంస్థాన పాలకుడైనాడు. సంస్థాన దివానుగా ఉండిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు సాహచర్యంతో తెలుగు సాహితీ సంస్కృతులకు ఎనలేని సేవచేశారు. రావిచెట్టు రంగారావుతో కలిసి 1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయాన్ని స్థాపించి, నాలుగు దశాబ్ధాలు వ్యవస్థాపక అధ్యక్షులుగా, పోషకులుగా దాని పురోభివృద్ధికి పాటుపడ్డారు. మందిర నిర్మాణానికి, భవన విస్తరణకు భూరి విరాళాలు ఇచ్చినారు. భాషానిలయ రజతోత్సవాలకు ఆహ్వాన సంఘాధ్యక్షుడుగా ఉండటమేకాక, స్వర్ణోత్సవ సదస్సులకు కూడా స్వాగతమిచ్చెడి భాగ్యం కలిగినందుకు ఎంతో ఉప్పొంగి ఆయన తన ఆనందాన్నీ ప్రకటించారు.
ఆంధ్రదేశంలోని పెక్కు సంస్థలకు పునాదులు వేసి ఆర్థిక సహకారం అందించిన గొప్ప వ్యక్తి నాయని రంగారావు. కొమర్రాజు వారి విజ్ఞాన చంద్రికాగ్రంథ మండలికి స్థాపకాధ్యక్షులుగా ఉండి, ఆయన ప్రారంభించిన విజ్ఞాన సర్వస్వాల ప్రచురణకు దోహదం చేశారు. గుంటూరులోని శారదానికేతనమునకు భూదానము, నారాయణగూడ బాలికోన్నత పాఠశాల, ఆంధ్రవిశ్వకళా పరిషత్తులకు విరాళములు ఆయన వితరణశీలానికి కొన్ని నిదర్శనాలు మాత్రమే. కట్టమంచి రామలింగారెడ్డి ‘‘నవయామిని’’, ఆదిపూడి సోమనాథ రావు ‘‘శ్రీకృష్ణ దేవరాయ చరిత్ర’’ గ్రంథాలు అంకితం పొందినాడు. రాజా నాయని రంగారావు 1958 లో దివంగతులైనారు.

కొమర్రాజు వెంకట లక్ష్మణరావు
కృష్ణాజిల్లా పెనుగంచిప్రోలులో 1876 మే నెల 18వ తేదీన జన్మించిన కొమర్రాజు వెంకట లక్ష్మణరావు బాల్యం నల్లగొండ జిల్లా భువనగిరి, దేవరకొండలలో గడిచింది. నాగపూరులో బి.ఏ. పట్టా పొందినారు. 1900 ప్రాతంలో హైదరాబాదుకు వచ్చి, ప్రైవేటుగా చదిని కలకత్తా విశ్వవిద్యాలయం నుండి 1902లో ఏం.ఏ. డిగ్రీని పొందారు. తెలంగాణలో సాంస్కృతిక చైతన్యానికి, ఆంధ్రోద్యమానికి దోహదం చేసిన వ్యక్తి ఆయన.
1901 లో హైదరాబాదులో శ్రీ కృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపనను ప్రోత్సహించారు. అంతేకాకుండా భాషానిలయం కేంద్రంగా 1905 లో ఆయన నెల కొల్పిన ‘‘విజ్ఞాన చంద్రికామండలి’’ చరిత్ర పరిశోధనా రంగానికి సంబంధించిన అమూల్య గ్రంథాలు పెక్కింటిని ప్రచురించారు. లక్ష్మణరావు గారు స్వయంగా బహు గ్రంథకర్త, ఆయన రచించిన ‘‘హిందు మహాయుగము ‘‘ తెలుగులో వెలువడి మొదటి ప్రామాణిక దేశ చరిత్రగా పేరు గడిరచింది. ఆ తర్వాత భాగమైన ‘‘మహ్మదీయ మహాయుగము’’లో అక్కన్న, మాదన్నల చరిత్ర సవిస్తారంగా ఉంది.
తెలుగులో విజ్ఞాన సర్వస్వ ప్రచురణకు ఆయన శ్రీకారం చుట్టారు. 1915-18 మధ్య కాలంలో ఆయన సంపాదకత్వంలో ఆంధ్ర విజ్ఞాన సర్వస్వం మూడు సంపుటాలు వెలువడ్డాయి. ఈ సంపుటాలలో లక్ష్మణరావు రచించిన వ్యాసాలు, సమకాలీన పత్రికల్లో వెలువరించిన పరిశోధనాత్మక వ్యాసాలు కలిపి ‘‘లక్ష్మణరాయ వ్యాసావళి’’ పేరుతో రెండు భాగాలుగా వెలువడ్డాయి.

అదిరాజు వీరభద్రరావు
తెలంగాణా ప్రాంతంలో చరిత్రగర్భంలో మరుగున పడిన ఆనేక అంశాలను వెలికితీసి తెలుగు జాతి చరిత్రకు మహోపకారం చేసిన మహనీయుడు ఆదిరాజు వీరభద్రరావు. 1890 సంవత్సరంలో ఖమ్మం జిల్లా మదిర తాలూకా దెందులూరు గ్రామంలో లింగయ్య, వెంకమాంబ, దంపతులకు జన్మించారు. హైదరాబాదులోని రావిచెట్టు రంగారావు ఇంట్లో ఉండి చాదర్‌ఘాట్‌ హైస్కూలులో విద్యాభ్యాసం చేసినారు. 1914 నుండి 1948 వరకు మహబూబ్‌కాలేజిలో, చాదర్‌ ఘాట్‌ ఉన్నత పాఠశాలలో ఆ తర్వాత మాడపాటి హనుమంతరావు బాలికోన్నత పాఠశాలలో తెలుగు భాషా పండితునిగా పని చేసినారు.
1901లో శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయం స్థాపన సభలో పిన్న వయస్కుడుగా అతిథులకు తాంబూలాలు పంచిపెట్టిన ఆదిరాజు వీరభద్రరావు గారు అనంతర కాలంలో భాషానిలయం కార్యవర్గ సభ్యుడుగా, కార్యదర్శిగా వ్యవహరించి ఆ సంస్థ అభివృద్ధికి ఎంతో పాటు పడ్డారు. నాడు దక్కన్‌ రేడియో కేంద్రం నుంచి తొలి తెలుగు ప్రసంగం చేసిన కీర్తి వీరభద్రరావు గారికే దక్కింది. ఆయనవి 150 ప్రసంగాలు ఆకాశవాణి నుంచి ప్రసారమైనాయి.
వీరభద్రరావు గారు విశిష్ట రచయిత, గొప్ప చరిత్ర పరిశోధకుడు ‘‘ప్రాచీనాంధ్ర నగరములు’’ ‘‘మన తెలంగాణము’’ ‘‘తెలంగాణ శాసనములు’’ ‘‘షితాబ్‌ ఖాన్‌ శాసనము’’ మొ॥న గ్రంథములు వారి పరిశోధన ప్రతిభకు నిదర్శనాలు. నవ్వుల పువ్వులు ఆయన హాస్య ప్రియతకు తార్కాణంగా చెప్పవచ్చు. వీరు 1973 సం.లో పరమపదించారు.

మాడపాటి హనుమంతరావు
నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమ నిర్మాణానికి, గ్రంథాలయోద్యమ వ్యాప్తికి, తెలంగాణాలో సాంస్కృతిక పునరుజ్జీవనానికీ జీవితాన్నే అంకితం చేసి ‘ఆంధ్రపితామహ’ బిరుదును సొంతం చేసుకొన్న మహావ్యక్తి మాడపాటి హనుమంతరావు. ఆంధ్రజన సంఘము (1921) ఆంధ్రమహాసభ (1930) మొదలైన సంస్థలను స్థాపించి వార్షిక మహాసభలు – మహిళాసభలు నిర్వహించి తెలంగాణలో జాగృతిని, రాజకీయ చైతన్యాన్ని కలిగించిన ఖ్యాతి ఆయనకు లభించింది.
కృష్ణాజిల్లా నందిగామ తాలూకాలోని కొక్కునూరులో వెంకటప్పయ్య, వెంకట సుబ్బమ్మ దంపతులకు 1885 జనవరి 22వ తేదీన హనుమంతరావు జన్మించారు. ఆయన విద్యాభ్యాసం సూర్యాపేట, హనుమకొండలలో కొనసాగింది. 1917లో లా పరీక్షలో ఉత్తీర్ణులై న్యాయవాదవృత్తిని చేబట్టి మంచిపేరుగడిరచి షష్టిపూర్తి వరకూ ఆ వృత్తిలో కొనసాగారు. 1904లో హనుమకొండలో రాజరాజనరేంద్ర ఆంధ్రగ్రంథాలయస్థాపనకు కారకులైన ఆయన హైదరాబాదు శ్రీకృష్ణ దేవరాయాంధ్ర భాషానిలయానికి కార్యదర్శిగా (1914-15), ఉపాధ్యక్షులుగా (1957-58) కొనసాగటమేకాక ఆ సంస్థ ప్రగతిలో ముఖ్యపాత్ర వహించారు. నారాయణగూడలోని బాలికోన్నత పాఠశాల ఆయన కృషిమూలంగానే స్థాపితమై ఆయన స్మృతిచిహ్నంగా ఈనాటివరకూ స్త్రీవిద్యా ప్రోత్సాహకంగా కొనసాగుతున్నది.
మాడపాటివారు సంఘసేవా పరాయణులేకాక గొప్పరచయిత. ఉర్దూ, హిందీ, ఆంగ్లం మున్నగు భాషలలో ప్రవీణులు. గురజాడకు సమకాలికంగా కథారచనచేసి తొలితరం కథకులుగా ప్రశస్తి గడిరచారు. మల్లికాగుచ్ఛము ఆయన కథాసంపుటం. బంకించంద్రుని ‘ఆనందమఠ్‌’ నవలను, ప్రేంచంద్‌ కథలను తెలుగులోకి అనువదిం చారు. చింతామణివైద్య ఆంగ్లవ్యాసాలను కూడా (క్షాత్రకాలపు హింద్వార్యులు, మహాభారత సమీక్షణం) ఆంధ్రీకరించి అనువాద రచనలో సిద్ధహస్తులనిపించుకొన్నారు. ఇటలీదేశభక్తుడు గేరీబాల్డీ జీవితకథను, రోమన్‌ సామ్రాజ్య చరిత్రను వెలువరించారు. రాజకీయ, సాంఘిక చరిత్రల అవగాహనతో ఆయన రచించిన ‘తెలంగాణా ఆంధ్రోద్యమం’ ఆంధ్రోద్యమ నిర్మాతగానే కాక చరిత్రనిర్మాతగా కూడ ఆయనకు ప్రామాణికతను ఆర్జించింది. ‘తెలంగాణ’ పత్రికకు, ‘ముషీరె దక్కన్‌’ ఉర్దూపత్రికకు ఆయన సంపాదకీయాలు వ్రాసి పత్రికారచయితగా కూడ కీర్తి గడిరచారు.

బూర్గుల రామకృష్ణా రావు
బూర్గుల రామకృష్ణారావు యావదాంధ్రమునేకాక భారతావనిని సైతం తేజోవంతం చేసిన జ్యోతిర్మయుడు. ఆయన రాజనీతి ధురంధరుడు, బహుభాషాకోవిదుడు, ఉత్తమ సాహితీవేత్త, సంస్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి. మహబూబ్‌ నగర్‌ జిల్లా బూర్గుల వాస్తవ్యులైన రామకృష్ణారావు 1899 మార్చి 13న పడకల్లు గ్రామంలోని మాతామహుల ఇంట్లో జన్మించారు. బొంబాయి విశ్వవిద్యాలయం నుండి లా డిగ్రీపొంది సమర్థుడైన న్యాయవాదిగా పేరు గడిరచారు. స్వాతంత్య్రపోరాటంలోనూ, నిజాం రాష్ట్ర ఆంధ్రోద్యమంలోనూ, తెలంగాణా విమోచన పోరాటంలోనూ అత్యంత ప్రముఖ పాత్ర వహించిన దేశభక్తుడు ఆయన.
తెలంగాణలో రాజకీయ చైతన్యానికి, సాంస్కృతిక వికాసానికి అవిరళ కృషి సల్పిన మహనీయుడు. దేవరకొండలో జరిగిన రెండవ ఆంధ్రమహాసభకు (1931) అధ్యక్షత వహించారు. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానిలయానికి కార్యదర్శిగా, మూడు పర్యాయాలు అధ్యక్షులుగా ఉండి ఆ సంస్థ రజతోత్సవాలను, స్వర్ణోత్సవాలను వైభవంగా నిర్వహించారు. వక్రోత్సవాలలో కూడా ముఖ్యపాత్ర వహించారు. పోలీసుచర్య తర్వాత జరిగిన శాసన సభ ఎన్నికల్లో గెలుపొంది హైదరాబాదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా కౌలుదారీ చట్టం మున్నగు సంస్కరణలు ప్రవేశపెట్టారు. విశాలాంధ్ర అవతరణకు సహాయపడిన బూర్గుల కేరళ, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాల గవర్నరుగా, రాజ్యసభ సభ్యులుగా విశిష్టసేవలు అందించారు.
ఉర్దూ, పర్షియన్‌, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతభాషల్లో విద్వాంసు లైన బూర్గులకు కన్నడ, మరాఠీ భాషలతో కూడా పరిచయం ఉంది. ఆయన ఎంత రాజనీతికోవిదుడో అంత సాహితీవేత్త. సంస్కృతాంధ్ర ఆంగ్లభాషల్లో కావ్యాలు రచించటమేకాక వివిధ భాషాకవుల కృతులను ఆంధ్రీకరించారు. కృష్ణశతకము, తొలిచుక్క, నివేదన, కవితామంజరీ (సంస్కృతం) ఆయన ముద్రిత కృతులు. ఉమరఖయ్యాం రుబాయీలను, సూఫీకవి సర్మద్‌ కవితలను అనువదించారు.
విమర్శకులుగా కూడ ఆయనకు విశిష్టస్థానం ఉంది. పెక్కు అంశాలపై వెలువరించిన పరిశోధనాత్మకవ్యాసాలు ‘సారస్వత వ్యాసముక్తావళి’ పేరుతో ప్రసిద్ధి గడిరచాయి. దుందుభి, గాలిబ్‌గీతాలు మున్నగు కావ్యాలకు రచించిన పీఠికలుకూడా ప్రశస్తమైనవి. శ్రీసత్యసాయిబాబా భక్తులుగా ప్రశాంతమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడిపిన రామకృష్ణారావు 1967 సెప్టెంబర్‌ 10వ తేదీన పరమపదించారు.

వడ్లకొండ నరసింహారావు
తెలంగాణాలో ఆంధ్రోద్యమానికి మూలస్తంభాలుగా నిలచిన మహనీయుల్లో వడ్లకొండ నరసింహారావుకు ప్రత్యేకపాత్ర ఉంది. 1893 జనవరి 20వ తేదీన హనుమకొండలో శివరామయ్య, రత్నమ్మ దంపతులకు జన్మించిన వడ్లకొండ మెట్రిక్యులేషన్‌ పూర్తిచేసి ఉపాధ్యాయులుగా పనిచేశారు. 1910లో నిజాంరాష్ట్ర వ్యవసాయశాఖలో ఉద్యోగం లభించటంతో హైదరాబాదుకు వచ్చి 30 సంవత్సరాలు పనిచేసి రిజిస్ట్రార్‌గా పదవీ విరమణచేశారు. నిజాంప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నా స్వీయసంస్కృతిపట్ల అభిమానంతో మహిళాభ్యుదయానికీ, గ్రంథాలయోద్యమానికీ ఎనలేని సేవచేశారు.
1921-24 మధ్యకాలంలో ఆంధ్రజన కేంద్రసంఘం సభల నిర్వహణలో ముఖ్య బాధ్యత వహించారు. నారాయణగూడ బాలికోన్నత పాఠశాల స్థాపనకు ఎంతో కృషిచేసి కార్యవర్గ సభ్యులుగా దాని అభ్యున్నతికి పాటుపడ్డారు. త్రూప్‌ బజారులోని పరోపకారిణీ బాలికాపాఠశాల ఏర్పాటులోకూడా ఆయన సహకారం ఎంతోఉంది. నిజాం ఆయుర్వేద దవాఖానా, ఆయుర్వేద కళాశాలల నిర్వహణలో గణనీయమైన పాత్రవహించి ‘‘ప్రజాసేవాసక్త’’ బిరుదుపొందారు. నరసింహారావు భాషానిలయం కార్యవర్గసభ్యులుగా దాని అభివృద్ధి, మందిర విస్తరణ కార్యక్రమాల్లో పాలుపంచుకొన్నారు రెండు పర్యాయాలు కార్యదర్శిగా (1922-23, 1951-52), 1949`50 – ఉపాధ్యక్షులుగా, 1953-55 లో అధ్యక్షులుగా ఉండి రజతోత్సవ, స్వర్ణోత్సవాల విజయానికి బాధ్యత వహించారు.
మానవతావాదిjైున వడ్లకొండ అన్నివర్గాల ప్రజలకు, ముఖ్యంగా బలహీనవర్గాల అభ్యున్నతికి ఇతోధికమైన సేవచేశారు. ఆంధ్రోద్యమము – ఆయుర్వేదం, నిజాం రాష్ట్రాంధ్రుల అభివృద్ధి మార్గములు, వెట్టిచాకిరీ, ది ఆదిహిందూస్‌ ఇన్‌ హైదరాబాద్‌ మొదలైన గ్రంథాలు రచించి భాషావేత్తగా అనువాదకులుగా కూడా గుర్తింపు పొందారు. విశాలమైన దృక్పథం, మానవతావాదం మూర్తీభవించిన నిస్వార్థజీవి వడ్లకొండ నరసింహారావు.

కొండా వెంకటరంగారెడ్డి
నిజాంరాష్ట్ర ఆంధ్రోద్యమంలోనూ, హైదరాబాద్‌ సంస్థాన విముక్తి పోరాటంలోనూ క్రియాశీలక పాత్ర వహించిన జాతీయవాది కొండా వెంకటరంగారెడ్డి. హైదరాబాద్‌ సమీపంలోని మంగళారం గ్రామంలో చెన్నారెడ్డి, బుచ్చమ్మ దంపతులకు 1890 డిసెంబర్‌ 12న జన్మించిన రంగారెడ్డి లాపరీక్షలో ఉత్తీర్ణులై (1909) న్యాయవాద వృత్తిని చేబట్టారు. కుశాగ్రబుద్ధి అయిన ఆయన సూక్ష్మగ్రహణశక్తితోనూ, వాదనాపటిమతోనూ ఆ వృత్తిలో పేరుగడిరచారు. స్వయంగా ‘లా ఇన్స్టిట్యూట్‌’ నిర్వహించి (1911-23) లా విద్యార్థులకు న్యాయశాస్త్ర విషయాలు బోధించేవారు. జిల్లాకోర్టులోనూ, హైకోర్టులోనూ తన ఉర్దూ భాషా ప్రావీణ్యంచేత వకీలుగా రాణించటమేకాక చిన్నరైతులు, కౌలుదారుల పక్షాన వాదించి ప్రజాభిమానాన్ని చూరగొన్నారు.
మాడపాటి, బూర్గుల ప్రభృతులతో కలసి ఆంధ్రోద్యమంలోనూ, గ్రంథాలయోద్యమంలోనూ కె.వి. రంగారెడ్డి ముఖ్యపాత్ర వహించారు. ఆంధ్రజనసంఘం స్థాపనకు తోడ్పడి (1921) షాద్నగర్లో ఐదవ ఆంధ్రమహాసభకు (1936), తర్వాత హైదరాబాద్లో పదవ మహాసభకు అధ్యక్షత వహించారు. మాడపాటి సలహాతో 1918లో శ్రీకృష్ణదేవరాయ ఆంధ్రభాషానిలయంలో జీవిత సభ్యులుగా చేరి, ఉపాధ్యక్ష బాధ్యతను చేబట్టి (1922-27) అభిమానంతో ఆ సంస్థ అభ్యుదయానికి పాటుపడ్డారు. నగరంలోని బాలసరస్వతీ గ్రంథాలయానికికూడా చిరకాలం అధ్యక్షలుగా ఉండి దాని అభివృద్ధికి తోడ్పడ్డారు. రెడ్డిహాస్టలు అభివృద్ధిలో ముఖ్యపాత్ర వహించి దశాబ్దంపాటు దాని గౌరవకార్యదర్శిగా కొనసాగి దానిని పటిష్ఠం చేశారు.
రంగారెడ్డి సంస్కరణభావాలుగల విశాలహృదయులు నిజాం ప్రభుత్వం నెలకొల్పిన శాసన పరిషత్తుకు న్యాయవాదుల పక్షాన ఎన్నికై బాల్యవివాహ నిషేధం, అస్పృశ్యతానివారణ, వితంతువివాహం చట్టాలకు సంబంధించిన బిల్లులు ప్రవేశపెట్టటం మున్నగు ప్రజాహిత కార్యక్రమాలకు చేయూత నందించారు. స్టేట్‌ కాంగ్రెసు నిర్మాణంలో పాత్రవహించి మూడునెలలపాటు కారాగార వాసంలో ఉన్నారు.

ఎం.ఎల్‌. నరసింహారావు
హైదరాబాదు సంస్థాన స్వాతంత్రోద్యమంలో పాల్గొన్న దేశభక్తుడు, గాంధీయవాది, సంస్థానిర్వహణాదక్షుడు అయిన మాదిరాజు లక్ష్మీనరసింహారావు భాషానిలయం కార్యదర్శిగా దాని విస్తరణ వికాసాలకు అవిశ్రాంతంగా పాటుపడుతున్న సేవానిరతుడు. ప ఖమ్మంజిల్లా పండితాపురం గ్రామంలో నవంబర్‌ 5,1929న జన్మించిన నరసింహారావు ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి ఎం.ఏ. పట్టభద్రులై కళాశాల అధ్యాపకులుగా, తెలుగు అకాడమీ ఉపసంచాలకులుగా పనిచేశారు.
జాతిపిత గాంధీ సిద్ధాంతాలపట్ల ఆకర్షితులైన ఆయన భారత జాతీయ కాంగ్రెసు సభ్యులుగా దశాబ్దంపాటు (1948-58) కొనసాగారు. గాంధీ శాంతిప్రతిష్టాన్‌ కార్యదర్శిగా, తత్సంబంధమైన సర్వోదయ, భూదానోద్యమ సంస్థలకు నిర్వాహకులుగా ఉన్నారు. గాంధీతత్త్వ ప్రచారం గురించిన సభలు, గోష్ఠులు నిర్వహించారు. కాకతీయ విజ్ఞానసమితిని స్థాపించారు.
ఎం.ఎల్‌.గారు బహుగ్రంథరచయిత. దేశ-రాష్ట్ర చరిత్రల గురించి సమ్యగవగాహనతో వందేమాతర ఉద్యమం, స్వాతంత్రోద్యమం, ఆంధ్రోద్యమ చరిత్రలను రచించారు. జీవిత చరిత్ర రచనా ప్రక్రియలో ఆయన సిద్ధహస్తులుగా వాసికెక్కారు. పలువురు జాతీయనాయకులు, తెలుగు ప్రముఖులు, ఆంధ్రోద్యమనేతల జీవితచరిత్రలు రచించారు. లోక్‌ నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌, భూదానోద్యమనిర్మాత వినోబాభావే, హైదరాబాద్‌ స్టేట్‌ కాంగ్రెస్‌ స్థాపకులు స్వామీ రామానందతీర్థ, భారత ప్రధానమంత్రి పి.వి. నరసింహారావు జీవితచరిత్రలు వానిలో ఎన్నదగినవి. మాడపాటి, బూర్గుల, కె.వి. రంగారెడ్డి మున్నగు తెలంగాణా ప్రముఖుల సంక్షిప్త చరిత్రలు కూడా ఆయన కలంనుంచి వెలువడ్డాయి.
సాహిత్యరంగంలో ఆయన కృషికి గుర్తింపుగా రాష్ట్రసాహిత్య అకాడమీ బహుమతి, తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ (డి.లిట్‌) పొందారు. 1960 నుంచి కార్యవర్గసభ్యులుగా చేరి 1965 నుంచి భాషానిలయం కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఎం.ఎల్‌. నరసింహారావు ఆ సంస్థ గత అర్థశతాబ్ది చరిత్రలో ముఖ్యపాత్ర వహించి దాని అభ్యుదయానికే అంకితమైన ఉదార హృదయులు.

కె.వి. రమణాచారి
పండితకుటుంబంలో మెదక్లో జన్మించిన (8-2-1952) కె. వెంకటరమణాచారి పూర్వుల వైదుష్యాన్ని, సంప్రదాయవైశిష్ట్యాన్ని వారసత్వంగా అందుకొని సహృదయ వతంసులుగా, సంస్కార వంతులుగా రూపొందారు. ఉభయవేదాంత, భాషా ప్రవీణ అయిన ఆయన పితరులు కె.వి. రాఘవాచార్యులు జగమెరిగిన విద్వాంసులు. రమణగారు ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎం.ఎస్‌సి., (రసాయనశాస్త్రం)లో ప్రప్రథములుగా ఉత్తీర్ణులై ఆ సంస్థలోనే అధ్యాపకులుగా పనిచేశారు. తర్వాత ఐ.ఏ.ఎస్‌.లో విజయం పొంది ప్రభుత్వరంగంలో ఎన్నో ఉన్నత పదవులు, బాధ్యతలు నిర్వహించారు.
1977లో మహబూబ్‌ నగర్‌ జిల్లాలో డిప్యూటీకలెక్టర్‌ పదవిలోచేరి అంచెలంచెలుగా ఎదిగి కలెక్టర్‌, కులీకుతుబ్షా నగరాభివృద్ధిసంస్థ (కుడా) చైర్మన్‌, సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌, యువజన – స్పోర్ట్స్‌ శాఖల కమీషనర్‌, ఖాదీ పరిశ్రమశాఖ అధ్యక్షులు మున్నగు పదవులు పరిపాలనా సామర్థ్యంతో నిర్వహించారు. గృహనిర్మాణ సంస్థ, సమాచారశాఖ, టి.టి.డి. మున్నగు సంస్థలకు కూడా విశిష్టసేవలు అందించినారు. ఏ సంస్థలో ఉన్నా స్వీయ ప్రతిభను ప్రదర్శిస్తూ, ప్రజాసేవకే అంకితమై ప్రజాభిమానాలను పరిపూర్ణంగా చూరగొన్న పరోపకార హృదయులు రమణాచారి.
సాంస్కృతిక – సాహిత్యరంగాలకు ఆయన చేసిన సేవలు నిరుపమానమైనవి. రసరంజని, సురభినాట్యమండలి మున్నగు నాటకసంస్థలకు ప్రోత్సాహకులుగా ఉన్నారు. కళాకారులకు పెన్షన్లు మొదలగు ఆర్థిక సహాయం ఏర్పాటుకు పరిశ్రమించారు. ఘంటశాల స్మారకోత్సవ సంగీత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ఆంధ్రసారస్వత పరిషత్తు సొంతస్థలాన్ని పొందటంలో, శ్రీకృష్ణదేవరాయ భాషానిలయం నూత్న భవన నిర్మాణంలో రమణాచారి నిర్వహించిన పాత్ర చరిత్రలో నిలచిపోతుంది. భాషానిలయం శతజయంతి సందర్భంలో ఉపాధ్యక్ష బాధ్యతను స్వీకరించి సుమారు కోటిరూపాయలనిధి సేకరణతో నాలుగంతస్థుల ఆధునిక భవన నిర్మాణానికి ఎంతోకృషి సల్పారు. ప్రస్తుతం నిలయ గౌరవాధ్యక్షులుగా, పరిషత్తు ఉపాధ్యక్షులుగా వాటి అభ్యుదయానికి పాటుపడుతున్నారు.

బి. లింగరాజు
తెలుగు పరిశోధక విద్యార్థి, తెలంగాణ విశ్వవిద్యాలయం,
ఫోన్‌ : 9640 346 316

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *