బెంగాలీ కృత్తివాస రామాయణం – భగీరథుని జన్మ వృత్తాంతం

బెంగాలీ కృత్తివాస రామాయణాన్ని శ్రీ దినేష్‌ చంద్రసేన్‌ మహాశయుడు గంగానది లోయ ప్రాంతపు బైబిల్‌ అని పేర్కొన్నాడు. ఆధునిక బెంగాలి సాహిత్యపు పూర్వయగానికి చెందిన అతి ప్రచారం పొందిన కావ్యంగా కృత్తివాస రామాయణాన్ని విమర్శకులు పరిగణిస్తారు. ఇది ఈనాటికి ఏమాత్రం వన్నె తరగని అత్యుత్తమ బెంగాలీ కావ్యం. శ్రీరామ పాచాలి (పాకాలి) పేరుతో కూడా ఈ కావ్యాన్ని బెంగాలీలు పిలుస్తారు. కృత్తివాస ఓరaూ (1381`1461) 15వ శతాబ్దానికి చెందిన కవి పండితుడు.

రామాయణం, కారణజన్ముడైన రాముడి కథతో సంబంధం

ఉన్న కావ్యం. కృత్తివాస రామాయణం ప్రకారం వైకుంఠంలో దివ్య వస్త్రాలతో శోభిల్లుతున్న నారాయణుడి మనస్సున ఒక అంశం నుండి నాలుగు అంశాలుగా ప్రకటిల్లాలన్న కోరిక ఉద్భవించింది. అంతే నారాయణుడు రాముడుగా, భరతుడిగా, లక్ష్మణుడిగా, శత్రుఘ్నుడిగా మారిపోయాడు. లక్ష్మీదేవి నారాయణుడికి ఎడమవైపు సీతగా ప్రత్యక్షమైంది. అప్పుడు నారాయణ నామాన్ని జపిస్తూ దేవ ముని నారదుడు అటు రావడం జరిగింది. వైకుంఠంలో కనుల పండుగగా కనిపిస్తున్న ఆ అద్భుత దృశ్యాన్ని చూసి నారదుడు పరమానంద భరితుడు అయ్యాడు. నారాయణుడి ప్రతి లీల వెనుక ఒక రహస్యం దాగుంటుందన్న సత్యం నారదుడికి తట్టలేదు. నాకు తెలియకపోతే ఏమి? ఆ ముక్కంటికి తప్పక తెలిసి ఉంటుందని నారదుడు నేరుగా కైలాసం చేరుకున్నాడు. ఎందుకైన మంచిదని తనతో కూడా తన తండ్రి బ్రహ్మను కూడా తీసుకువెళ్ళాడు. తండ్రి కొడుకులను చూసి పరమశివుడు ప్రసన్నచిత్తుడయ్యాడు. కుశల ప్రశ్నల తరువాత మీ రాకకు కారణం ఏమని శివుడడిగాడు. నారదుడు వైకుంఠంలో తాను కనులారా చూసిన దృశ్యాన్ని సవిస్తారంగా తెలియజేసాడు. ఒక అంశం నాలుగు అంశాలుగా ఎందుకు మారిందో తెలియజేయ మన్నాడు. శంకరుడు చిరునవ్వును చిందిస్తూ 60వేల సంవత్సరాల తరువాత త్రేతాయుగంలో నారాయణుడు దుష్టశిక్షణ, శిష్టరక్షణ కోసం రఘువంశంలో దశరథుని పెద్ద కొడుకుగా జన్మిస్తాడు. రావణాది రాక్షసులను సంహరించించేదుకు అవతరించమన్నాడు. ఆ దృశ్యాన్నే మీరు ముందుకు చూసారు. సగరుడి ముని మనుమడు దిలీపుడు సంతానహీనుడిగా దివికేగడం జరుగుతుంది. భగీరథుడి జననం శంకరుడి భవిష్యవాణితో ముడిపడి ఉంది.

అయోధ్యకు రాజు అయిన రఘువంశపు సగరుడు ఒకసారి అశ్వమేధ యాగాన్ని చేయ సంకల్పించాడు. యజ్ఞాశ్వాన్ని ఇంద్రుడు తరలించుకొని పోయి పాతాళంలో ఉన్న కపిల మహర్షి ఆశ్రమంలో కట్టిపడేశాడు. తండ్రి ఆదేశంతో 60వేలమంది యజ్ఞాశ్వాన్ని వెదుకుతూ వెదుకుతూ భూమిని త్రవ్వుతూ పాతాళం చేరుకుంటారు. కపిల మహర్షి ఆశ్రమంలో కట్టబడి ఉన్న యజ్ఞాశ్వాన్ని చూసి కొడుకుల జాడతో పాటు యజ్ఞాశ్వానికి సంబంధించిన విషయాలను సేకరించమని సగరుడు తన పెద్ద కొడుకైన అసమంజుడుని పురమాయిస్తాడు. తండ్రి కోరిక తీర్చడానికి కటిబద్ధుడైన అసమంజుడు పాతాళం చేరుకుంటాడు. కపిల మహర్షి ఆశ్రమంలో యజ్ఞాశ్వాన్ని చూసి కపిలుడే దొంగలించాడనుకుంటారు. వారందరూ కపిలుడి కోపం కారణంగా భస్మం అవుతారు. తన కొడుకుల జాడతో పాటు యజ్ఞాశ్వాసానికి సంబంధించిన విషయాలను సేకరించమని సగరుడు తన పెద్ద కొడుకైన అసమంజుడుని పురమాయిస్తాడు. తండ్రి కోరిక తీర్చడానికి కటిబద్ధుడైన అసమంజుడు పాతాళం చేరుకుంటాడు. కపిల మహర్షి ఆశ్రమంలో యజ్ఞాశ్వాన్ని చూసి కపిలుడి ద్వారా జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు. తన సోదులకు పుణ్యగతులు ఎలా ప్రాప్తిస్తాయో తెలపమని కపిలుడిని వేడుకుంటాడు. అసమంజుడిపై దయతలచి దివిలో ప్రవహించే గంగానది 60వేల మంది సగరపుత్రుల భస్మంపై ప్రవహిస్తే వారికి పుణ్యగతులు ప్రాప్తిస్తాయని కపిలుడు నుడువుతాడు. గంగను కిందికి తీసుకొని వచ్చే ప్రయత్నంలో అసమంజుడు, అతడి పుత్రుడు అంశుమనుడు, అంశుమనుడి కొడుకు దిలీపుడు అసువులు బాసారు. దిలీపుడు సంతానహీనుడిగా మరణించడం జరిగింది.

దిలీపుడి మరణంతో రఘువంశానికి వారసుడు కరువు అవుతాడు. కొన్నివేల సంవత్సరాల క్రిందటే తాను రఘువంశంలో దశరథుని కొడుకుగా భూమి భారాన్ని తగ్గిస్తాను అని దేవతలకు నారాయణుడు మాట ఇవ్వడం జరిగింది. వారసుడు లేకపోతే నారాయణుడి మాట అనృతం అవుతుంది. ఇది ఇలా జరిగితే భూమి నాస్తికులమయం అవుతుంది. సనాతనధర్మం పట్ల ప్రజల మనసులో విశ్వాసం తగ్గిపోవడం జరుగుతుంది. తరుణోపాయం తెలపమని బ్రహ్మాది దేవతలు దేవుళ్ళకే దేవుడైన పరమశివుడిని వేడుకుంటారు. శంకరుడు ఆలోచించి ఒక నిర్ణయానికొస్తాడు.

శివుడు తన ప్రణాళిక ప్రకారం అయోధ్య చేరుకుంటాడు. శివుడి రాక తెలిసిన దిలీపుడి యిద్దరు విధవలు చంద్ర, మాలా ఎదురేగి శివుడిని స్వాగతిస్తారు. సకల పరిచర్యలు ఎంతో భక్తి శ్రద్ధలతో చేస్తారు. సంతృప్తుడైన పరమశివుడు మీలో ఒకరు అతి త్వరలో గర్భం దాల్చి పండంటి కొడుకుకు జన్మనిస్తారు అని ఆశీర్వదిస్తాడు. శివుడి ఆశీస్సు విని వారు విస్తుపోతారు. స్వామీ ఇది ఎలా సంభవం అని వారు వినయంతో అడుగుతారు. ఇది దైవ సంకల్పం. మీ యిద్దరి మధ్య జరిగే రతి కారణంగా పుత్రుడు జన్మిస్తాడు అని సెలవిచ్చి శంకరుడు కైలాసం చేరుకుంటాడు.

ఈశ్వరుడి ఆశీస్సు కారణంగా ఋతుస్రావం ఆగిపోయిన మాల రజస్వల అవుతుంది. చంద్ర మాలల సంభోగం జరుగుతుంది. సంభోగం కారణంగా మాల గర్భం దాలుస్తుంది. 10 నెలల తరువాత ఎముకలు లేని పిండాన్ని కంటుంది. ఎముకలు లేనందువల్ల ఆ పిండం నడవలేకపోతుంది. ఆ మాంసపు ముద్దను చూసి ఆ యిద్దరూ బావురుమని ఏడ్చారు. శివుడు వారికి వరమిచ్చాడా లేక శాపమిచ్చాడా అని వారు తేల్చుకోలేకపోయారు. పిండం పెరిగి పెద్దదైతే అభాసుపాలవుతామని భయపడి వారిద్దరు కొంగుచాటులో పిండాన్ని దాచుకొని సరయూ నది తీరాన్ని చేరుతారు. ఆ మాంసపు ముద్దను సరయూలో పారవేయాలని నిర్ణయించుకొంటారు. నది ఒడ్డున

ఉన్న చంద్రమాలలను వశిష్ఠుడు చూడడం జరుగుతుంది. తన దివ్యదృష్టితో అంతా తెలుసుకుంటాడు. ఆ పిండం రఘువంశ వారసుడని అతడు అర్థం చేసుకుంటాడు. రఘువంశ పురోహితుడిగా రఘువంశం వారసుడిని కాపాడడం తన విధ్యుక్త ధర్మంగా భావించి వారిద్దరితో, మీరు ఆ పిండాన్ని నదిలో పారవేయకుండా ఒడ్డున వదలిపెట్టండి. దారిన పోయే ఎవరైనా దాన్ని కాపాడగలరు అని చెప్పి తన దారిన తాను వెళ్ళిపోతాడు.

‘‘కాగల కార్యాన్ని గంధర్వులే తీరుస్తారు’’ అన్న సామెత ప్రకారం అప్పుడు సరయూనదిలో స్నానం చేయడానికని అష్టావక్ర మహర్షి రావడం తటస్థించుతుంది. శరీరంలోని ఎనిమిది వంకరల కారణంగా అష్టావక్రుడు వంకర టింకరగా నడుస్తుంటాడు. ఎముకలు లేని కారణంగా ఆ పిండం కూడా అలానే నడుస్తుంటుంది. ఆ పిండం నడక తనను అనుకరిస్తుందన్న అనుమానం అష్టావక్రుడికి కలుగు తుంది. వెంటనే ఒకవేళ ఆ పిండం నన్ను వెక్కిరిస్తుంటే అది భస్మం కాగలదు. అటుకాకుండా జన్మతః ఇది ఇలా ఉంటే నా తపోబలం వల్ల సుందర రూపం దాలుస్తుంది అని అనుకుంటాడు. జన్మతః ఎముకలు లేని కారణంగా అష్టావక్రుడి తపోబలం వల్ల ఆ పిండం సుందరుడైన బాలుడిగా మారుతుంది. తన ఇద్దరు తల్లులకు జరిగిన విషయం తెలియజేస్తాడు.

అయిదు సంవత్సరాల బాలుడిని విద్యార్జన కోసం వశిష్ఠ ముని ఆశ్రమంలో ఇద్దరు తల్లులు చేరుస్తారు. ఆశ్రమంలో కొందరు బాలురు అతని ఉత్పత్తిని గురించి ఎగతాళి చేస్తారు. కోపం గృహం చేరిన తన కుమారుడి ద్వారా ఆశ్రమ వృత్తాంతం తెలుసుకొని అతని జన్మ వృత్తాంతాన్ని తెలియజేస్తారు. రెండు భగాల రతి కారణంగా జన్మించినందుకు అతడు భగీరథుడయ్యాడు.

భగీరథుడు ద్వియోనిజుడు అన్న అంశాన్ని కృత్తివాసుడు బెంగాలి లిపిలో వ్రాయబడిన పద్మపురాణం నుండీ గ్రహించాడు. రెండు భగాల రతి సంభవం అన్న విషయాన్ని గురించి ముఖ్యంగా యిద్దరు రుత్‌ వనితా, సలీం కిద్వాయి లోతుగా పరిశోధన చేసారు. 14వ శతాబ్దానికి చెందిన బెంగాలీ ధార్మిక గ్రంథాలలో ఇద్దరు స్త్రీల మధ్య రతి సంభవం అని సూచించే గ్రంథాలున్నాయని అమెరికా మొన్‌టానా విశ్వ విద్యాలయపు ప్రొఫెసర్‌ ‘‘సేమ్‌ సెక్స్‌ మ్యారేజ్‌ అండ్‌ హిందూ ట్రెడిషన్స్‌’’లో వివరించారు. ఆమె ప్రకారం కృత్తివాసుడు (జననం 11.02.1433) పద్మపురాణం నుండి గ్రహించాడు. సుశ్రుత సంహితలో ఇద్దరి స్త్రీల మధ్య జరిగే రతి కారణంగా ఫలదీకరణ ఒకరిలో జరుగుతుందని రాసి ఉందని తమ ఆంగ్లవ్యాసంలో ఇలా రాసారు.

The Sushruta Samhita, states that a boneless child (interpreted by commentators as havig cartilagious bones) is the result of sexual intercourse between two women, in which their sukra or sexual fluids unite in the womb of one of them (Kaviraj Kunjalal Bishagratna, An English Translation of the Sushruta Samhita, Chowkambha Sanskrit Series 30, Varanasi, 1991, P.135). ద్వియోని సంభవుడైన భగీరథ వృత్తాంతాన్ని చర్చిస్తున్న సందర్భంలో మరో విషయాన్ని గురించి కూడా రుత్‌ వనిత రాసారు. మేము విధవలం, మాకు సంతానం ఎలా కలుగుతుందని శివుడిని ప్రశ్నించినట్లుగానే మేరీమాత కూడా దేవదూతను ప్రశ్నించిందట… “How shall this be since i do not know a man?” and the angel answered and said to her, “The Holy Spirit will come upon you and the power of the Highest will over shadow you. (Bible, Luke 1: 34 -35, NKJV) భగీరథుడు ద్వియోని సంభవుడు అన్న వృత్తాంతం నాకు తెలిసినంతవరకు ఏ భారతీయ రామాయణంలోనూ లేదు. అవధి భాషలో రామాయణాన్ని రామచరిత మానస్‌ అన్న పేరుతో రచించిన తులసీదాసు బెంగాలీ కృత్తివాస రామాయణం నుండి కొంతవరకు ప్రభావితుడయ్యాడని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. అందుకు ఉదాహరణంగా లంకా కాండలో మండోదరి ద్వారా లక్ష్మణరేఖను ఇలా చెప్పించారు. ‘‘రామానుజ లఘు రేఖా రచాయి, సోవూ నహీ నాఘేవు సి మనుసాయి’’ (లక్ష్మణుడి ద్వారా గీయబడిన చిన్నరేఖను నీవు దాటలేకపోయావు రావణా) అరణ్యకాండంలో తులసీ ` ‘‘మరమ వచన జబ్‌ సీతా బోలా’’ అని మాత్రమే రాసారు. రంగనాథ రామాయణకారుడైన గోన బుద్ధారెడ్డియే (14వ శతాబ్దం) లక్ష్మణరేఖను ప్రవేశపెట్టిన తొలి రామాయణకారుడు.

ఆధారం: కృత్తివాస రామాయణం ఆదికాండం, హిందీ అనువాదం.

అనువాదకులు : 1. యోగేశ్వర త్రిపాఠి, యోగి 2. ప్రబంధ్‌ కుమార్‌ మజుందార్‌ 3. నవారుణ వర్మ.

ప్రకాశకులు : భువనవాణి ట్రస్ట్‌, లక్నో. మూడవ ముద్రణ2023.

డా. ఎ.బి. సాయిప్రసాద్‌,
బెంగుళూరు.
ఫోన్‌ : 9980 567 541

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *