ఒంటికాలుతపము ఓర్పు తోడ బకము
తలపు మనమునొకటి తంతువేరు
మౌనరీతి చూడ మర్మము బోలెడు
నమ్మబోకు కొంగ నటన లన్ని!
నక్క జిత్తులన్ని నయవంచనను జేయు
ఎత్తులెన్నొవేసి చిత్తుజేయు
మొసలి దాగి చంపి ముంచితినను జూడ
మూర్ఖజాతి నెపుడ నమ్మరాదు!
ఎలుక తెలివి భంగి ఏకదంతుని మోసి
పుణ్యఫలము తాను పొందె చూడ
ఇంటిలోన దూరి యిబ్బంది కల్గించు
బొరియలన్నిబెట్టు మురిపముగను!
మ్యావుమ్యావుమని మనయింటి పిల్లియు
బుద్ధిగాను తిరుగు ముద్దుగాను
సరగుచూసి తాను సంతసంబొందియు
ఉన్న పెరుగుపాలు వూడ్చిత్రాగు!
ఎలుకలనిల జంప యేతెంచు పిల్లియు
కలుగులోన దూరి కదల దెలుక
మాటుగాయు పిల్లి మర్మము దెల్సియు
తెలివి తేటలున్న తెరువరలు!
అల్పస్వార్థశీలి నాదరించదు చూడ
ముక్క తినెడి కుక్క మూర్ఖముగను
తోటి శునకమునిల తోడుగా రానీదు
కుక్క బుద్ధిరీతి కూడదెపుడు!
పాము పాలు త్రాగి పరగ విషమె జిమ్మి
ఇచ్చి జంపు గాని యిడదు సుధలు
చెడ్డ జీవుల కడ చేరకుయెప్పుడు
భక్తియేమొ గాని ముక్తి లేదు!
చెడ్డజీవి తోడ చేయకు చెలిమిని
చెరపు వాటి వల్ల చేయివదలు
మంచి జంతుజాతి మైత్రిని వీడకు
మేలు చేయవిలను మేదినందు!
డాక్టర్ గన్నోజు శ్రీనివాసాచార్య
మహబూబ్‌నగర్,
ఫోన్ : 85558 99493