సిరచెల్మ జాతర

ఏ దేశ చరిత్రకైనా ప్రాంతీయ చరిత్రలే వెన్నుముక లాంటివి ప్రాంతీయ చరిత్రలు సాధారణంగా దేశసంస్కృతికి ప్రతి రూపాలుగా చెప్పవచ్చు వైవిద్య భరితమైన భారతదేశ చరిత్రను సమగ్రంగా అధ్యయనం చేయాలంటే ప్రాంతీయ చరిత్రలను సమగ్రంగా పరిశోధించవలసిన అవసరం ఎంతైనా ఉందని అనేకమంది చరిత్రకారులు గుర్తించడమైనది. భారతీయ సంస్కృతి సంప్రదాయంలో దేవిదేవతలు, పుణ్యస్త్రీలను, మహిమగల పురుషులను, ప్రకృతి శక్తులను పూజించి పర్యావరణంను కాపాడి భవిష్యత్తు తరాలకు సందేశం ఇచ్చె పండగలు అనేకం జరుపుకుంటున్నాము. అదేవిధంగా గ్రామీణ సంస్కృతిలో మానవ జీవన విధానంలో అనేక పండగలు జరుపుకోవడం, జీవనవిధానంలో అంతర్భాగమైన జాతరలు గ్రామదేవతలను పూజించడం ఆనవాయితీ. ఇందులో భాగంగానే ప్రస్తుతం తెలంగాణాలోని ఆదిలాబాద్‌ జిల్లా ఇచ్చోడా మండలం సిరిచెల్మ గ్రామములో జరుపుకనే జాతర. గ్రామంలో కొలువైన మల్లన్న జాతర గురించి పరిశోధనాత్మకంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
పరిశోధన ఉద్దేశం మరియు లక్ష్యాలు : ప్రాచీన కాలం నుండి నేటివరకు మానవ జీవన విధానంలో ప్రకృతి, దాని అనుబంధం అయిన మతానికి ఉన్న ప్రాధాన్యతను వివరిస్తూ ప్రకృతి ఆరాధన మతంతో అంతర్భాగమైన పండగలు, మానసిక ఉల్లాసం కొరకు జరుపుకోను జాతరలు ఆనవాయితీగా వస్తున్నది. జాతర ఆవిర్భావానికి ప్రేరేపించిన కారణాలను భారతదేశ చారిత్రక నేపథ్యం నుండి సమీక్షించడం. పై లక్ష్యాలే కాకుండా ఆధునిక కాలంలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ రోజులలో కూడా జాతరలు గ్రామీణ ప్రాంత ప్రజల జీవనవిధానంపై ఎంతో ప్రభావాన్ని కలిగి ఉండడానికి గల కారణాలను క్షేత్ర పర్యటన ద్వారా వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా వివరాలను సేకరించి వివరించడం నా పరిశోధన ప్రధాన ఉద్దేశం. ప్రస్తుతం పరిశోధనలకు ఉపయోగపడే ఆధారాలను ప్రాథమిక మాధ్యమిక ఆధారాలు రెండు రకాలుగా విభజించవచ్చును. ప్రాథమిక ఆధారాలు మౌఖికంగా సేకరించడం మరియు గుడి నిర్మాణం ఆలయ వాస్తు శైలి నిర్మాణ క్రమం శిలలు, స్తంబాలు, ఆలయ పరిసరాలలో ఉన్న శిలాకృతులను పరిశీలన చేయడం ద్వారా గ్రామస్థుల నుండి సమాచారం సేకరించిన మౌఖిక ఆధారాలు. స్థానిక స్థల పురాణాలు, స్థానిక చరిత్ర, ఇతిహాస పురాణాలను ఆధారంగా చేసుకుని కొంతమేరకు పరిశోధనకు అనువుగా ఉన్న విషయాలను స్వీకరించి పొందుపరిచే ప్రయత్నం చేశాను. అదేవిధంగా సమకాలిన సాహిత్య ఆధారాలు ప్రస్తుత పరిశోధనకు ఎంతో ఉపయుక్తం. నా పరిశోధనకు ఆధారంగా గ్రంథాలు, క్షేత్ర పర్యటన ద్వారా మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా సేకరించిన మౌఖిక సమాచారం.
చాళుక్యుల కాలంలో తవ్వబడిన చెరువు మధ్యన నిర్మితమై భక్తుల కొంగు బంగారంగా వెలుగొందుతున్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇది పురాతనమైన ఆలయం. ఇలాంటి పురాతన దేవాలయం ఆదిలాబాద్‌ జిల్లాలో సిరిచెల్మ గ్రామంలో ఉంది. తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న సిరిచెల్మ అనే చిన్న గ్రామంలో శివుడు లోకకళ్యాణం కోసం సాధారణ కార్మికుడి వలే మట్టితట్టలను మోసాడు. పార్వతీ సమేతంగా ఇక్కడ స్వయంభువుగా వెలిసాడు. విశాలమైన ప్రాంతంలో చుట్టూ నీటితో నిండి ఉండి నీటి మధ్యలో దేవాలయం ఉండటం అద్భుతమని చరిత్ర పరిశోధకులు బి. ఎన్‌. శాస్త్రి, దుర్గం రవీందర్‌ పేర్కొన్నారు. కోరిన కోర్కెలు తీర్చే ఈ దేవాలయమునకు గొప్ప చరిత్ర కలిగి ఉంది.
శివరాత్రి రోజున ఇక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి శివరాత్రి మొదలు కాముని పూర్ణిమ వరకు జాతర ఉత్సవాలు జరుగుతాయి. ప్రస్తుతం ఈ క్షేత్రం ప్రముఖ పుణ్యక్షేత్రంగా స్థానికంగా వెలుగొందుతున్నది. శివరాత్రి రోజున ఆ నీలకంఠుడు పార్వతీ సమేతంగా ఇక్కడకు వచ్చి పూజలందుకొంటాడని ప్రతీతి. చాలా కాలం క్రితం ప్రస్తుత సిరిచల్మ అనే గ్రామం ఉన్న ప్రాంతంలో పిట్టయ్య, నుమ్మవ్వ అనే దంపతులు ఉండేవారు. వారి గ్రామానికి ఒక పిల్లవాడు పశువుల కాపరిగా వస్తాడు. పిల్లలు లేని ఆ దంపతులు ఆ బాలుడు అనాథ అని తెలుసుకొని అతనికి మల్లన్న అని పేరుపెట్టి పెంచుతారు. ఆ మల్లన్న వయస్సులో చిన్నవాడైనా సాయంలో మిన్న. కష్టాల్లో ఉన్నవారికి ఎప్పుడూ సాయం చేస్తూ అందరితో మంచి బాలుడు అనిపించుకొంటూ ఉండేవాడు. ఒకసారి ఆ గ్రామంలో తీవ్ర వర్షాభావం ఏర్పడిరది. ప్రజలకు తాగడానికి నీరు కూడా దొరకని పరిస్థితి ఏర్పడిరది. దీంతో మల్లన్న ఒక రోజు లోపల చెరువును తవ్వడమే కాకుండా వర్షం వచ్చేలా చేస్తానని గ్రామ ప్రజలతో చెబుతాడు. అంతేకాకుండా చెరువును తవ్వడం ప్రారంభిస్తాడు. అయితే ఒక రోజు లోపల చెరువును తవ్వడం సాధ్యం కాదని చెబుతూ ఎవరూ మల్లన్నకు సాయం చేయడానికి ముందుకు రారు. అయినా వెనుదిరగకుండా మల్లన్న చెరువు తవ్వడంలో నిమగ్నమవుతాడు. రాత్రి చీకటి పడినా ఈ బాలుడు చెరువు తవ్వడం మాత్రం మానలేదు. ఇక మరుసటి రోజు ఉదయం గ్రామస్తులు ఆ చెరువు దగ్గరకు వచ్చి చూస్తారు. చెరువు తవ్వడం పూర్తి అయినది కాని బాలుడు మాత్రం కనిపించడు.
అదే సమయంలో చెరువు మధ్య భాగంలో ఒక లింగం దర్శనమిస్తుంది. ఆ శివలింగం పై భాగంలో కొంత లోనికి వెళ్లినట్లు సొట్ట కనిపిస్తుంది. దీంతో ఆ బాలుడు ఎవరో కాదు శివుడే అని నమ్ముతారు. అంతేకాకుండా ఆ శివుడు తాను వెళుతూ తన ప్రతిరూపమైన శివలింగాన్ని ఇక్కడ వదిలి వెళ్ళాడని భావిస్తారు. అంతేకాకుండా రాత్రి మొత్తం ఆ బాలుడు మట్టితట్టలను మోయడం వల్ల ఇలా (గుంట) సొట్ట ఏర్పడి ఉండవచ్చునని అనుకొంటారు. అదే రోజు రాత్రి పిట్టయ్య దంపతుల కలలో మల్లన్న కనిపించి తనకు అక్కడ ఓ దేవాలయం నిర్మించాల్సిందిగా సూచిస్తాడు. అదే మల్లికార్జున దేవాలయంగా ప్రసిద్ధి చెందింది. ఈ పుణ్యక్షేత్రంలో రెండు నందులు ఉంటాయి. ఒకటి గర్భగుడిలో ఉంటే మరొకటి దేవాలయానికి 25 అడుగుల దూరంలో ఉంటుంది. సూర్యకిరణాలు ఈ నంది విగ్రహం పై మొదట పడి అటు పై గర్భగుడిలోని శివలింగంపై ప్రకాశిస్తాయి. ఆ సుందరదృశ్యాన్ని ప్రత్యక్షంగా చూడాల్సిందే కాని మాటల్లో వర్ణించడానికి వీలుకాదు.
ఇక ప్రతి శివరాత్రి రోజున అక్కడ ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఆ సమయంలో పార్వతీ సమేతంగా శివుడు ఇక్కడకు వస్తాడని చెబుతారు. అందువల్లే స్థానికులే కాకుండా చుట్టు పక్కల ఉన్న రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ సంఖ్యలో భక్తులు ఇక్కడకు వస్తారు. ఈ దేవాలయంలో భారతీయ శిల్పసంపద చాళుక్యుల శిల్ప కళకు అద్దం పట్టే అద్భుత శిల్పసంపదను చూడవచ్చు. ఇక్కడ హిందూ ధర్మానికి చెందిన శిల్పాలతో పాటు జైన, బౌద్ధ, శిల్పాలను కూడా మనం చూడవచ్చు. ఈ దేవాలయానికి సమీపంలో అనేక జలపాతాలు ఉన్నాయి. తెలంగాణాలోనే కాకుండా దక్షిణ భారతదేశంలోనే అందమైన జలపాతంగా పేరుగాంచిన కుంతల జలపాతం ఈ దేవాలయానికి 38 కిలోమీటర్ల దూరంలో అదేవిధంగా గాయత్రి జలపాతం కూడా సుమారు 15 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అందమైన ప్రకృతి ఈ గ్రామ సొంతం గ్రామ పరిసరాలు కొండ కొనలు లోయలు ప్రకృతి అందాలు ఇక్కడ చూడముచ్చటగా కనులకు నయనానందాన్ని ఇస్తుంది. ఈ గ్రామానికి చేరుకోవడానికి బస్సు సౌకర్యం ఉంది. హైదరాబాద్‌ నుంచి ఆదిలాబాద్‌కు అనేక బస్సులు ఉన్నాయి. ఆదిలాబాద్‌ నుంచి ఇచ్చోడకు సుమారు 32 కిలోమీటర్ల దూరం. ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల దూరంలో సిరిచెల్మ గ్రామం ఉంటుంది. ఇక నిర్మల్‌ నుంచి సిరిచెల్మకు సుమారు 52 కిలోమీటర్ల దూరం లో ఉంది.
సిరిచెల్మ దేవాలయ ప్రత్యేకతలు
ఇది పురాతన ఆలయం. శివాలయం చెరువు మధ్యలో నిర్మించారు నాటి నిర్మాణం. నిర్మాణ కౌశల్యాన్ని పరిశీలిచ్చినట్లు అయితే ఇది చాళుక్య రాజులు నాటి స్థానిక పాలకులు నిర్మించినట్లు నాటి నిర్మాణ వాస్తుశైలిని, శిలలను, రాజలాంఛనమును, ద్వారం పైన చెక్కిన జైన శిల్పాలను ఆదారంగా చేసుకొని చెప్పవచ్చును. ఇది మొదట జైన ఆలయం అయివుంటుందని బి. ఎన్‌. శాస్త్రి గారు తెలిపారు పాలకులు మారినప్పుడు పాలకుల మత ఆచారాలు మారినట్లే ఈ ఆలయంకూడా ఆలయంలో ఉన్న దేవుడు కూడ మారడం సహజంగా జరిగి ఉంటుందని అనేక మంది చరిత్రకారులు భావిస్తున్నారు. ఈ ఆలయం మొదటగా జైన ఆలయం తరువాత శైవ ఆలయంగా మారినట్లు ఇక్కడి పరిసరాలలో ఉన్న విగ్రహల ద్వారా విశదం అవుతున్నది. ఏది ఏమైనా శివలింగానికి ఎదురుగా రెండు నందులు దర్శనం ఇస్తాయి. ఇక్కడ రెండు నంది విగ్రహాలు ఒకటి గర్భగుడిలో ఉంటే, ఆలయం వెలుపల 25 అడుగుల దూరంలో మరో నంది ఉంటుంది. సూర్యుడు ఉత్తరాయణం నుంచి దక్షిణాయనానికి ప్రయాణిస్తున్న సమయంలో బయట నంది మీద పడిన సూర్యకిరణాలు నేరుగా గర్భగుడిలో ఉన్న శివునిపై ప్రతిబింబిస్తాయంటారు.
శ్రీకాళహస్తి ఆలయంలో ఉన్నట్టే ఇక్కడ కూడా ఏడుతలల నాగుపాము దర్శనమిస్తుంది. శనిప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వారు, రాహుకేతు దోషాలు ఉన్నవారు, ఇక్కడ పూజలు చేస్తే మంచిదని చెబుతారు. సప్తఋషుల తలపై నాగశేషుడితో ఉన్న శివుడి ప్రతిమ అలనాటి కళా ప్రతిభకు నిదర్శనం. ఆలయంలో ఉన్న మొద్దు గన్నేరు చెట్టు పురాణకాలం నాటిదని చెబుతారు. సాధారణంగా శివాలయాల్లో అగ్నిగుండాలు నిర్వహించరు. ఇక్కడ మాత్రం భక్తులు నడిచే అగ్నిగుండం గుండ నడిచే క్రతువు ఘనంగా జరుగుతుంది.
గుడి ఎదురుగా వీరాంజనేయ స్వామి విగ్రహం శని దేవున్ని తన కాలి క్రింద తొక్కబడినట్లుగా ఉంటుంది. ఇది ఇక్కడి ప్రత్యేకత. సిరిచల్మ ఆలయం త్రికుటాలయం. మూల దేవాలయానికి దక్షిణం వైపు బాలాజీ గుడి ఉంటుంది. బాలాజీ చేతుకు అల్లు ఉంటుంది. బాలాజీ చేతిలో నాణెం అతుక్కుంటే కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. మూలగుడికి ఉత్తరం వైపు అష్టదిక్పాలకులు బ్రహ్మ విగ్రహం ఉంటుంది. ఇది నల్లటి రాతితో కట్టబడ్డ అపురూప శిల్పాలు కొలువైన కట్టడం. నాటి కళాచాతుర్యానికి వాస్తు శిల్పకళకు కాణాచి అయినటువంటి ఈ దేవాలయం చాళుక్యుల కాలం నాటిదిగా ఇక్కడి శిల్పకళను బట్టి వాస్తు శైలిని బట్టి పరిశోధకులు నిర్ధారించారు. గుడి ప్రాంగణంలో జైన, బౌద్ధ మతాలకు చెందిన విగ్రహాలు అద్భుత శిల్పసంపదతో కూడుకున్నటువంటి స్తంభాలు నాగబంధంతో కూడిన నాగులు లతల ద్వారా పాలకులు నవగ్రహ విగ్రహాలు, ప్రవేశ ద్వారం పై ఉన్నటువంటి శిల్పసంపద అయినా వాస్తు శిల్ప సంపదగా, దొడ్డు గన్నేరు చెట్టు కింద ఉన్నటువంటి శిల్పాలు బౌద్ధ జైన మతాలకు సంబంధించినటువంటివిగా పరిశోధకులు, చరిత్రకారులు భావిస్తున్నారు. చరిత్రకారులు, పరిశోధకుల ప్రకారంగా ఈ గుడి మొదటగా జైన ఆలయంగా ఉండి కాలక్రమంలో వీరశైవ మత ప్రచారంలో భాగంగా శైవాలయంగా మార్చబడిరదని చరిత్రకారులు ఇక్కడ శిల్ప సంపద శాసనాల వల్ల అవగతం అవుతున్నట్లు పేర్కొన్నారు. ఆలయ ప్రవేశ ద్వారాలకు ఇరుపక్కల జైన సాంప్రదాయం ద్వారా పాలకులు, గుడి వెనకాల ఉన్న స్త్రీ దేవత జైన స్త్రీ దేవతగా శాసనాల ద్వారా శిల్ప శైలి ద్వారా అవగతం అవుతుంది. గుడికి ఉత్తరంగా ఉన్న బౌద్ధ విగ్రహాలు అనేకం మొద్దు గన్నేరు చెట్టు క్రింద కనిపిస్తాయి. ఏది ఏమైనప్పటికీ ఈ సిరిచల్మ దేవాలయం అద్భుత శిల్ప సంపదకు తార్కాణం. వీటిని రక్షించుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇలాంటి అరుదైన శిల్ప సంపద కలిగినటువంటి ఆలయం ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఉండటం ఆదిలాబాద్‌ జిల్లా వాసుల పూర్వజన్మ సుకృతం. ఆలయ వారసత్వ సంపదను సంరక్షించుకోవలసిన బాధ్యత ఆదిలాబాద్‌ ప్రజలది, అదేవిధంగా ప్రభుత్వానిది.
రిఫరెన్స్‌ :
1) Nageshwara Rao, K. Raju, Ch. : the role of pilgrimage Tourism in Adilabad Disctrict A Study of Gnana Saraswathi Temple, Kakatiya University, Warangal.
2) Nageshwara Rao, K. Raju, Ch. : Pilgrimage Tourism in Adilabad Disctrict of Andhra Pradesh, South Indian History Congress, Thirtieth Annual Session Proceedings 6th – 8th February 2010 Kanur.
3) Parthasarathy, R. : Places of Interest in Andhra Pradesh (A Monograph ) Published by the Government of Andhra Pradesh, Printed by the Nagambika Press, Kothagudem, VOL-I (1984).
4) Vijay Kumar, D. : Pracheena Devalayala Charitra, Adilabad -Karimnagar Zillalu (T). Vipanchi Offsets Printers, Asifabad, Adilabad. (2006)
5) Andhra Pradesh District Gazetteers, Adilabad (1976) Painted by The Government of Telangana at the Government Central Press, Telangana Hyderabad.
6) Kamalakara Sharma : alokanam Telugu Zillala Sahitya Charitra Samshkrithi Samaharam, Prapancha Telugu Mahasabhalu, Musi Patrika Hyderabad (2019).
7) Shivanagi Reddy, E. : Andhra Pradesh Tourism, Vanarulu – Avakaashalu (1998).
8) Narayana Udari. : Adilabad Zilla Sahitya Charitra, Savera Graphics Hyderabad (2019).
9) Bhadraiah Madipalli : Mana Adilabad Suhrudbhava Yatra – Anubhavalu – Anubhutulu, Kala Printers Gandhi Nagar, Hyderabad (2008).
10) Ravindar Durgam. :Adilabad Darshini, Varalaxmi Printers Hyderabad (1987)
11) Shatri B. N. : Adilabad Zilla Sarvaswam, Veeranjaneya Printing Press, Sucundaraba (1990)

చంద్రకాంత్‌ మునేశ్వర్‌
చరిత్ర అధ్యాపకులు, కామారెడ్డి.
ఫోన్‌ : 998 953 8243

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *