మట్టినుండే ఎదిగిన ఆకులన్నీ
రాలుతున్న చుక్కలై
ఒదిగిపోతున్నాయి భూమిలోకి
గాలి సావాస సంబరాలకు వీడ్కోలిచ్చి
అలసి సొలసిన దేహాలతో
తల్లి ఒడిలోకి జారుకుంటున్నాయి
గున్న మావిళ్లు గుబురుగా పాకి
పసందైన కాయల పరువాలను బిగిస్తూ
ఆకృతులను అలంకరించుకుంటున్నాయి
దర్పాలను ఒలకబోస్తూ….
మత్తు వదిలిన కాకలీరవములు
నవ వసంతాన్ని చుంబించి
చిగురు గొంతుకలతో
పచ్చదనాన్ని నింపుకున్న
పడతి ఎదను మీటి
రాగ తోరణాలను కడుతున్నాయి
తన వైపు ఎప్పుడూ
ఎవరి కన్నూ సోకని మాను
అరమరికలు లేక
ఒళ్ళంతా తెల్లని
పూలపానుపు పరచి
విసురుతోంది ఆనందాన్ని విరివిగా
దెబ్బల గాయాల నుండి విడివడి
రెక్కలు విప్పుకొని
పులుపు వలపుల చింత
జిహ్వాగ్రానికి రుచులనిస్తూ
మైమరిపిస్తోంది కొత్తగా
ఎప్పటిలాగే
శిశిరపు వలువను వీడిన ప్రకృతి
కాలానికి దాసోహమై
మరో వసంతాన్ని కప్పుకుంటోంది
జీవిత వాస్తవాన్ని మనిషికి
ఎరుకపరుస్తూ…!!
ధూళిపాళ అరుణ
ఫోన్ : 8712342323