జీవన సత్యాలను ఆవిష్కరించిన ‘పాల కంకుల కల’

సగటు మనిషి ఆవేదనలు, ఆక్రందనలు సమాజం నిండా చిక్కగా పరచుకున్నప్పుడు సహృదయుడైన కవి వాటిని తన అంతర్నేత్రంతో దర్శిస్తాడు. దాన్ని కవితా వస్తువుగా మలుచుకుంటాడు. ఆ వస్తువును ఉదాత్తమైన భావనగా మార్చి తన హృదయం నుండి చైతన్యాన్విత కవిత్వాన్ని వ్యక్తీకరిస్తాడు.
వరaల శివ కుమార్‌ సమాజాన్ని నిశితంగా పరిశీలించిన కవి. సగటు మనిషి ఎదుర్కొంటున్న అనేకానేక సంఘర్షణలు, రుగ్మతలు ఆయన అంతర్నేత్రానికి గోచరమయ్యాయి. అది ఆయన హృదయం. ఆయనలో తాత్వికత కూడ ఉంది. బ్రతుకు సమరంలో అలసి పోతున్న శ్రమజీవుల చెమట చుక్కల తాత్వికత అది! దేశానికి అన్నం పెట్టే హాలికుడు ఆత్మహత్య చేసుకోవడానికి ఉసిగొలిపే కార్పోరేట్‌ వ్యవస్థను ప్రశ్నించే తాత్వికత అది! పురుషుని బాహువుల కింద నలిగిపోయే స్త్రీ హృదయాన్ని ఆవిష్కరించే తాత్వికత అది!
కరీంనగర్‌ కు చెందిన ‘సాహితీ గౌతమి’ ప్రతిష్టాత్మకంగా అందించే రాష్ట్రస్థాయి సినారె పురస్కారానికి 2001వ సంవత్సరంలో ఎంపికైన కవిత్వ సంపుటి ‘‘పాల కంకుల కల’’. వరaల శివకుమార్‌ గారు1994-1999 మధ్యకాలంలో రచించిన మొత్తం 42 కవితలతో కూడిన సంపుటి ఇది. 90వ దశకం నాటి సామాజిక చిత్రణ, ప్రజల ముఖ్యంగా కర్షకుల జీవన సంఘర్షణలు… అభ్యుదయ కవిత్వంగా మారి ఆయన హృదయం నుండి జీవిత సత్యాలుగా వెలువడ్డాయి.
‘‘సారవంతమైన జ్ఞాపకం నించి / బీడు పడుతున్న అనుభవం లోకి జారుతూ….’’ అంటూ పాలకంకుల కలను కలగా కాకుండా జీవిత సత్యంగా శివకుమార్‌ ఆవిష్కరించారు. ఏ కల అయినా పరిపక్వం చెందితేనే జీవితానికి సంతోషదాయకం. అయితే లేత దశలోనే స్వప్నం ఛిద్రమైతే అదొక విషాదం. లేలేత స్వప్నాన్నే కవి ‘పాలకంకుల కల’గా ప్రతీకాత్మకం చేసారు. రైతు కల కంటాడు. విత్తనం నాటిన నాటి నుండి పంట చేతికి వచ్చేదాకా ప్రతి క్షణం కల కంటాడు. కానీ అతని కల పక్వం చెందక మునుపే పాలకంకుల దశలోనే ఛిద్రమైపోతున్నది. నిజానికి కృషీవలుని జ్ఞాపకాలు సారవంతమైనవి. గతం వైభవోపేతమైనది. పుష్కలంగా పంటలు పండిరచి దేశానికి అన్నం పెట్టాడు. కానీ వర్తమానం ఆ విధంగా లేదు. ప్రపంచీకరణ రైతు జీవితాన్ని నాశనం చేసింది. విత్తనం నాటిన దశ నుండి ధాన్యం అమ్మే దశ వరకూ దోపిడీకి గురై, మోసం చేయబడుతున్నాడు. రైతు యొక్క సారవంతమైన జ్ఞాపకాలను ఈ సమాజం, బహుళజాతి కంపెనీలు, విత్తన కంపెనీలు ఛిద్రం చేసాయి. రైతు దీన్ని తట్టుకోలేక భూములను, వ్యవసాయాన్నీ, పంటనూ వదిలేసి ‘‘బీడువారుతున్న అనుభవంలోకి జారిపోయాడు.’’ అంటే రైతు యొక్క వర్తమానం బీడువారిపోయింది.
‘‘ఛిద్రమవుతున్న స్వప్నావశేషాలు / నిస్తేజ నిశోదయాలకి /వేలాడ దీసుకుంటున్న దిష్టిపూసలు’’ (పాలకంకుల కల) వ్యవసాయదారుని స్వప్నం ఛిద్రమైన తర్వాత అతని నాగలి మూలవడ్డది, మోటబావి పాడువడ్డది, ఎడ్ల డొక్కలు ఎండిపోయి కళేబరాలకు తరలించబడ్డాయి. అతని కలలన్నీ ఛిద్రమైన అవశేషాలుగా మారిపోయాయి. అయితే ఇప్పుడు అందరూ రైతు గురించి మాట్లాడేవారే, రైతు పట్ల సానుభూతి ప్రకటించేవారే! అందుకే ఇప్పుడా రైతు దిష్టిపూసలాగా మిగిలి పోయాడు.
‘‘ఎక్కడికక్కడ తెగిపడుతున్న/ఒకే దేహంలోని /అపరిచిత శకలాలు.’’ ఈ సమాజం ఒక దేహం లాంటిది. ఆ దేహంలో భాగంగా ఉండాల్సిన రైతు మాత్రం ఎవరికీ పట్టకుండా పోయాడు. వివక్షను ఎదుర్కొంటున్నాడు. ఈ సమాజంలో రైతు ఒక అంగమే అన్న సంగతిన ఈ కఠిన వ్యవస్థకు పట్టడం లేదు. ఈ వ్యవస్థ రైతునొక అపరిచిత శకలంగా మార్చేసింది.
ఈ కవితా సంపుటి మొత్తానికి పాల కంకుల కల ఆత్మవలె దర్శనమిస్తుంది. శివ కుమార్‌ ఈ కవిత రచించి రెండు దశాబ్దాలు గడిచినా నాటి నుంచి నేటికీ రైతు స్థితి మారలేదు. ఈ సంపుటిలో రైతు కవితలే అధికంగా ఉన్నాయి. రైతుల కష్టాలను, కన్నీళ్లను కవి అక్షరీకరించారు.
‘‘పిడికెడు విశ్వాసం’’ కవితలో ఆత్మహత్య చేసుకున్న రైతు గురించి అతని కొడుకు పడే ఆవేదన చదివితే హృదయం చెమ్మగిల్లుతుంది. తండ్రి ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో కొడుకుకు అర్థం కాదు.
‘‘బాపూ! / నా అడుగులింకా నడకవ్వకముందే / దారి ఎగుడూదిగుడూ తెలియకముందే/ ఈ గజిబిజి దార్లో నన్నొదిలేసి ఎలా వెళ్లావ్‌’’ అని రైతు కొడుకు దుఃఖంతో ప్రశ్నిస్తాడు.
‘‘పురుగు చెట్టుకే కాదు/ మొత్తం మార్కెట్టుకు పట్టుకుంది’’ మగ్గాలు విరిగినై, మిల్లులు మూతబడ్డయి, నకిలీ విత్తనాలు పత్తి చేనును పాడు చేసాయి. ఆర్థికంగా నిండా మునిగిపోయి, ఈ వ్యవస్థతో పోరాడే శక్తి లేని రైతు ఆత్మహత్య చేసుకొని తనువు చాలించాడు. అయితే పురుగు పట్టింది కేవలం పత్తి చెట్టుకు మాత్రమే కాదు, మొత్తం వ్యవస్థకే పట్టుకుందని, దాన్ని సరిచేయకుండా తన తండ్రి అసమర్థ మరణాన్ని పొందాడని కొడుకు భావించడం రైతును మోసం చేసేవారికి సూటి ప్రశ్నలాంటిది.
‘‘బాపూ! ఇంక నువ్వు/ అసమర్థ మరణాలకి చివరి చరణానివి / నేను ఆశావహమైన బతుక్కి తొలికిరణాన్ని…’’ అనే ఆకాంక్షను ప్రకటించడం ద్వారా రైతుల ఆత్మహత్యలు ఆగాలని, సమస్యలకు చావు పరిష్కారం కాదని కవి ప్రకటించాడు.
పురుషుడు తనకు నచ్చినట్టు జీవిస్తాడు. ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు. విలాసాలు అనుభవిస్తాడు. స్త్రీని మాత్రం ఒక యంత్రంలాగా చూస్తాడు. ఆమెను తన సుఖాలకు వాడుకుంటాడు. ఆమెతో కలిసి ఉంటూనే మనసులో మరో మహిళను ఊహించు కుంటూ దాంపత్య జీవిత విలువలకున్న వలువల్ని నిస్సిగ్గుగా విప్పేస్తాడు.
‘‘బుసకొట్టే కోరికల దాహంగా తప్ప వేరుగా తాకిందెన్నడని’’ (నీ నీడలో) స్త్రీని కామపరమైన వస్తువుగా భావించి మోజు తీర్చుకోవడమే తప్ప పురుషుడు ఆమె హృదయంలోకి తొంగి చూడడు. ఆమె పట్ల కామభావనే తప్ప ప్రేమ భావన లేదు.
వరకట్నపు హత్యల్నీ ఈ కవి ప్రస్తావించాడు. ‘‘ఎవరిని పలకరిస్తాం / పలకడానికేం మిగిలిందక్కడ / పగడాల పెదవులనించీ పాదాల దాకా …’’ (మూడుముళ్ళ చితిమీద) అనే కవితా పాదాలలో పురుషుని ఆధిపత్యం కింద నలిగి కాలి బూడిదయ్యే నవవధువుల ఆర్తనాదాలను శివకుమార్‌ తన ఆవేదనగా మలుచుకున్నాడు.
కార్పొరేట్‌ వైద్యంలోని డొల్లతనాన్ని కవి ప్రశ్నిస్తున్నారు. యంత్రాలు, కంప్యూటర్లు, ఆకర్షణీయమైన గాజు అద్దాల తలుపులు తప్ప రోగుల మానసిక స్థితికి కార్పోరేట్‌ వైద్యశాలల్లో స్థానం లేదని, వైద్యం ఖరీదైన వ్యాపారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘వైద్యం కంప్యూటర్ల ఆధీనంలో / వ్యక్తిత్వాన్ని కోల్పోవడం మొదలయ్యాక/ రోగి, రోగి మానసిక స్థితి అప్రస్తుతాంశాలౌతాయి….’’ (కార్పొ‘రేటు’ చికిత్స) కవిలోని మానవీయ కోణానికి తార్కాణమీ కవిత!
రోడ్ల పక్కన డేరాలు వేసుకొని నిప్పుల కొలిమిలో పనిముట్లను కాలుస్తూ, వాటిపై సమ్మెట పోటు వేసే శ్రామికులను చూస్తుంటాం. కానీ వాళ్ళ కష్టాలను, వాళ్ళ జీవితాల్లోని అపసవ్య స్థితిగతులను పట్టించుకునేదెవరు!? శివకుమార్‌ సామాజిక పరిశీలనలో ఈ శ్రమజీవుల చెమట చుక్కలు అక్షరాలయ్యాయి.
‘‘గాజులచేతులయితేనేం/ గాల్లోకి సమ్మెటెత్తి కొట్టాల్సిందే/ నిప్పుల మీద కాలి ఎరుపెక్కిన కొడవలికొన పదునెక్కాల్సిందే/ తుప్పొదిలించుకొన్న నాగటి కర్రు…’’ (కొలిమి) సమాజంలో తన తోటి మానవులు కష్టాల కడలిలో చిక్కుకొని జీవన పోరాటం చేస్తున్నప్పుడు సమాజంలో తానూ ఒక భాగంగా ఉన్న వ్యక్తి స్పందించకుండా ఉండలేడు. శివకుమార్‌ స్పందించారు. పనిముట్లు ఆత్మల్ని శుద్ధి చేసుకున్నట్టు ఆయన కవిత్వంతో శ్రామికుల కష్టాలను శుద్ధి చేసే ప్రయత్నం చేసారు.
ఒక్కొక్కసారి కవిత్వంలో కవి యొక్క వైయక్తిక అనుభూతులు అనుభవాలను ఆధారం చేసుకుని ప్రకటితమవుతాయి. శివకుమార్‌ సింగరేణి ప్రాంతంలోని ఎన్టీపీసీ కేంద్రీయ విద్యాలయంలో పని చేసారు కాబట్టి సింగరేణి కార్మికుల గురించి రాయకుండా ఆయన కవిత్వం ఉండదని చెప్పవచ్చు. ‘‘వెలుగులు ఏతానికెత్తుతూ…’’, ‘‘నల్లకలువలు’’ అటువంటి కవితలే!
‘‘వాళ్లు కడుపును తవ్వుకుంటూ పోతున్నారు / వల్లకాడెదురు పడిరది / ఆకలి జాడ తప్పింది.’’, ‘‘ఫ్యాక్టరీల కాలనీలు వైట్‌ కాలర్‌ సర్దుకున్నాయి/ మా రెక్కలే అన్నాయి ఊళ్ళు / మా ఊపిరులే అన్నాయి బీళ్ళు’’ (నల్లకలువలు) జీవిత సత్యాన్ని ఇంతకన్నా తాత్వికంగా కవి కాక ఇంకెవరు చెప్పగలరు!? కవిలోని మానవీయత, ఆవేశస్ఫూర్తి అక్షరాలుగా మారి పాఠకుని హృదయంలోకి చొచ్చుకుని పోతాయి. సింగరేణి కార్మికుల జీవితాలతో ముడిపడిన భిన్న సామాజిక అంశాలను కవి ప్రస్తావించడంలోను ఆ మానవీయత, ఆ ఆవేశస్ఫూర్తి ప్రస్ఫుటమవుతున్నాయి.
శివ కుమార్‌ సమతావాది. ఇందులో వర్ణవివక్షను నిరసించారు. సమాజాన్ని నాలుగు వర్ణాలుగా విభజించి దళితులను పంచమ జాతిగా అభివర్ణించి వెలి వేయడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల భూముల్లో కర్మాగారాలు నిర్మించి ఆ తర్వాత నష్టం పేరుతో మూసివేసే ప్రభుత్వరంగ సంస్థల తీరును కవి ఎండగట్టారు.
పాలకంకుల కల కవిత్వంలో కర్షకుల కన్నీటి సాగు, మానవత్వం, సామాజిక చింతన, స్త్రీవాదం, దళితవాదం, అభ్యుదయం, శ్రామికుల పట్ల పక్షపాతం…. అన్నీ ఉన్నాయి. ఆయన కవిత్వం సగటు మనిషి పక్షాన నిలబడిరది. ఒక చోట జీవితంలోని భిన్నమైన పార్శ్వాలను స్పృశించారు. మరొక చోట స్త్రీ హృదయాన్ని తన హృదయంగా ప్రకటించించారు. వేరొక చోట ఆవేశస్ఫూర్తితో రగిలిపోయారు. ఇంకొక చోట ఆనందానుభూతులను పంచారు. శిల్పసోయగంతో, రసస్ఫోరకంగా తన హృదయతత్వాన్ని ప్రకటించారు. అంతకు మించి ఆయన కవిత్వంలో స్వచ్ఛత ఉంది. ‘‘తొక్క బడిన స్వప్నాల సమిష్టి వ్యవస్థనే పాలకంకుల కల!’’

స్తంభంకాడి గంగాధర్‌
కరీంనగర్‌.
ఫోన్‌ : 7386200610

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *