సామాన్యుని హృదయ వేదన ‘కన్నీటి సీమ’

సాహితీ సమరాంగణ సార్వభౌముడు శ్రీకృష్ణదేవరాయలు ఏలిన ప్రాంతంగా దీనిని రాయలసీమ అన్నారు. ఇక్కడ వజ్రాలు రాసులుగా పోసి అమ్మేవారట. అటువంటి ఈ రాయలసీమ కాలక్రమంలో కరువు ప్రాంతంగా మారిపోయింది. ఇప్పటికీ ఈ ప్రాంతం కరువు కోరల్లో చిక్కుకుని విలవిల్లాడుతున్నది. దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లా అనంతపురం ఈ ప్రాంతంలోనే ఉన్నది. ఈ కరువు ప్రాంతంలోని ప్రజల సమస్యల్ని కవిత్వీకరిస్తూ రాయబడినదే ఈ ‘కన్నీటిసీమ’. డాక్టర్‌ ఈశ్వరరెడ్డి గారు వివిధ సందర్భాలలో రాసిన కవితలన్నిటినీ కలిపి ‘కన్నీటిసీమ’ అనే పేరుతో గ్రంథాన్ని ప్రచురించారు. ఇందులో సామాన్యుని సమస్యలు, కష్టాలు, ఇబ్బందులు, ప్రేమాభిమానాలు, ఆప్యాయతలు వంటి అంశాలు కేందంగా చేసుకొని రాసిన కవితలు ప్రధానంగా ఉన్నాయి. ‘కన్నీటిసీమ’ కవితా సంపుటి 2003లో ప్రథమ ముద్రణ పొందింది. 2007లో తిరిగి ముద్రించబడిరది. ఇందులో మొత్తం 28 కవితా ఖండికలున్నాయి. ఇవన్నీ కూడా విభిన్నాంశాలకు చెందినవి. ఇందులోని చాలా కవితా ఖండికలు రచయిత స్వయంగా చూసినవి, అనుభవించినవి. అందుకే ఇందులోని కవిత్వం అంత అద్భుతంగా ఉంటుంది. రచయితకు గ్రామసీమలంటే ఎంతో మక్కువ. అందుకే ఈ ‘కన్నీటీసీమ’లో గ్రామాల అవసరాన్ని, పల్లె ప్రజల నిష్కల్మషమైన ప్రేమానురాగాలను, వారి నమ్మకాలను, చక్కగా కవిత్వీకరించారు. అనేక రుగ్మతలకు నిలయమైన నగర జీవితాన్ని ‘నాకొక పల్లె కావాలి’ కవితలో వ్యతిరేకించి పల్లె కావాలంటూ గ్రామీణ జీవితం పట్ల తన అనురక్తిని చాటుకున్నాడు. పల్లెలో ఉండే ప్రేమలు, ఆప్యాయతలు, అనుబంధాలు, పట్టణాలలో కనిపించవు. పల్లెలో ఒకరికి కష్టం వస్తే మిగతా వారు వారిని ఓదార్చుతారు, వీలైనంత సహాయపడుతారు. అదే పట్టణంలో ఎవరు బ్రతుకు వారిదే, ఎవడి కష్టం వాడిదే. పక్కింటి వారికి కష్టం వచ్చినా పట్టించుకొనే నాథుడు ఉండడు. పల్లె జీవితం, పట్టణ జీవితం రెండిరటినీ రుచి చూసిన రచయిత ‘నాకొక పల్లె కావాలి’ అనే కవిత రాశారు. ఇక్కడ పల్లె కావాలి అంటే రచయిత ఉద్దేశం ఆ పల్లెలోని ప్రజల మధ్యన ఉండే ఆప్యాయతలు, అనురాగాలు, అభిమానాలు, ప్రేమలు, కష్టాల్లో అండగా నిలబడడం వంటివి కావాలనే భావనతో ఈ కవిత రాశాడు. పల్లెటూరులో నిద్ర లేవగానే ఇంటి కల్లాపి చల్లి ముగ్గులు పెట్టడడం, సంక్రాంతి పండుగకి బొబ్బమ్మ ముద్దలు పెట్టడం వంటివి పట్టణాలలో కనిపించవు. గ్రామీణ భోజనమైన రాగి సంగటి, చింతకాయ ఊరుబిండి, ఒట్టి మిరకాయ కూరలు పట్టణంలో పెద్దగా వినియోగించరు. గ్రామీణ ప్రాంతాలలో పిల్లలు ఆడుకొనే కోత్తి కొమ్మచ్చి, తొక్కుడు బిల్ల, ఎన్నో కుప్పలాటలు పట్టణాలలో మచ్చుకైన కనిపించవు. రచ్చబండ దగ్గర వీథినాటకాల వద్దికలు, భజన మందిరాల దగ్గర పండరి భజనలు వంటి విషయాలు పల్లెలకే ప్రత్యేకం. అసలు ‘అతిథి దేవో భవ’ అనే మాట పుట్టిందే పల్లె సీమలో. పచ్చని పొలాలు, రంగురంగుల పక్షులు, నీటితో నిండిన బావులు, పశువులు వంటి వాటితో సందడిగా ఉండే నా పల్లె టీ.వీ.లు, కేబుల్‌ కనెక్షన్‌ రాకతో స్వరూపమే మారిపోయింది. నాగరికత పేరుతో రోజురోజుకి పల్లె జీవితం ఎటువంటి కల్మషం, నాగరికతల అంటు జాడ్యంలేని స్వచ్ఛమైన పల్లె కావాలంటూ రచయిత ఈ కవితలో ఆకాంక్షించారు. ‘‘కాఫీ నీళ్ళ అవకాశవాద అనుబంధాల్ని కళ్ళను ఏమార్చే కాగితప్పూల మాయావలయాన్ని అమ్మస్థానాన్ని ఆయాకు బదలీచేసిన విషసంస్కృతిని ముక్కలు చేసి వెళ్ళడానికి నాకొక పల్లె కావాలి’’ ‘‘ఆకాశాన్ని గడియారంగా ధరించిన కోడిపుంజు నక్షత్రాల కదలికను జాముల్లోకి అనువదించి వేకువ గొంతుతో ఊరిని నిద్రలేపేది’’ ఇటీవలి కాలంలో కరువు అత్యంత సాధారణ సమస్యగా మారిపోయింది. రాయలసీమకు కరువుకు మధ్య విడదీయరాని అనుబంధం ఉంది. స్వాతంత్య్రం వచ్చి ఎన్నో ఏళ్ళైనా తాగునీటి కోసం అల్లాడుతున్న పల్లెలు ఇంకా ఉన్నాయి. పాతిక సంవత్సరాలకు పూర్వం వచ్చిన ఏడేళ్ళ కరువు ఈ ప్రాంతాన్ని అతలాకుతలం చేసింది. అప్పుడు అడవుల్లో దొరికే దేవదారాకును తిని ప్రాణాలు కాపాడుకు న్నారని ‘గుండె కరువు’ కవితలో విశదీకరించాడు. రాయలసీమ ప్రజలకు కరువు అలవాటే. కరువులో తినడానికి తిండిలేక ప్రాణాలను కాపాడుకోవడానికి అడవికి ఆకో, ఆలుము తిని బ్రతికేవారంట. అయితే ఇప్పుడు ప్రపంచీకరణ నేపథ్యంలో అభివృద్ధి పేరిట అడవులను నరికేస్తున్నారు. మట్టిని త్రవ్వేస్తున్నారు. అందువలన వర్షాలు కూడా సరిగా కురవడంలేదు. ఈ రకంగా మానవుడు అడవుల్ని నాశనం చేసి దిష్టి బొమ్మలుగా మార్చేస్తుంటే వ్యవసాయం పై ఆధారపడి జీవించే పల్లె ప్రజలు ఏమైపోవాలి. ఎలా బ్రతకాలి. అందుకే ఎందరో పల్లె ప్రజలు బ్రతుకు తెరువు కోసం గుండెలు నిండా బాధతో వలస పోతున్నారని రచయిత ఎంతో ఆవేదనతో ఈ ‘గుండె కరువు’ కవిత రాశారు. ‘‘ఏడేళ్ళ కరువు బుసకొట్టినప్పుడు అన్నం మెతుకు అదృశ్యమైపోతే దేవదారాకు ఉడకబెట్టి ప్రాణాలకు ఉట్టికట్టుకున్నారట ఇప్పుడు వొట్టిపోయిన అడవులు దిష్టిబొమ్మలై వెక్కిరిస్తుంటే మనసు కాలిన పల్లె వలసబోయింది’’ కరువు నిత్యకృత్యంగా మారిన రాయలసీమ దుస్థితిని గురించి ‘కన్నీటిసీమ’ కవితలో రచయిత చెప్పిన విషయాలు మనసుతో చదివితే గుండె బరువెక్కి కళ్ళు కన్నీటి జలపాతాలవుతాయంటే అతిశయోక్తి కాదేమో! వర్షాలులేక నీటి వసతిలేక రాయలసీమలో కరువు నిత్యం కరాళ నృత్యం చేస్తుంటుంది. నీటి వసతిలేక పంటలు పండిరచక పోవడంతో ఇక్కడి భూములు పగ్గులతో నిండి ఉంటాయి. ‘‘నా నేల తల్లిని / ఏ నిప్పుల బైరాగి శపించాడో! మంట ఉలితో మట్టి దేహాన్ని / నెర్రెలు నెర్రెలుగా చెక్కుకొని పైరు బిడ్డను నిమరలేని / మొండి చెయ్యిగా మిగిలిపోయింది’’ ఒకప్పుడు రాయలసీమ రతనాల సీమగా ప్రసిద్ధి. ఇప్పుడు రాయలసీమ రాళ్ళ సీమగా మారిపోయింది. వ్యవసాయం తప్ప మరో పని తెలియని రైతన్నలు ఎందరికో అన్నం పెట్టి ఉపాధి కల్పించిన రైతన్నలు నేడు కూలీలుగా మారిపోయారు. వర్షాలు లేక బావులు నిండిపోయి వ్యవసాయం చేయలేక, బ్రతుకు సాగించలేక, ఆత్మాభిమానం చంపుకోలేక రైతుల జీవితాలు దుర్భరంగా తయారైనాయి. వ్యవసాయంపై ఆశ చావని కొందరి రైతులు అప్పో చప్పో చేసి బోరులు వేసి వాటిల్లో నీరు పడక, అప్పులకు వడ్డీ కట్టలేక మరియు అప్పులు తీర్చలేక అవమాన భారంతో బక్కచిక్కిన రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. పురుగుల మందు రైతులకు పెరుగన్నమైనది. రచయిత స్వయంగా రైతుబిడ్డ. ఇవన్నీ స్వయంగా చూసిన రచయిత బరువెక్కిన హృదయంతో ఈ ‘కన్నీటిసీమ’ కవితలో రైతుల కష్టాలను లోకానికి తెలియజెప్పాడు. సమాజంలో ‘రైతు’ అందరికీ సానుభూతి తెలపడానికి ఒక సాధనంగా మిగిలిపోయాడే తప్ప అతని బాధను తీర్చేవారెవరూ ఈ లోకంలో లేరేమోననిపిస్తుంది. ‘‘మా కళ్ళలో వుబికే అన్ని నీళ్ళు / మా వూరి బావుల్లో ఊరితే ఆశలొదిలేసిన ఎముకల గూళ్ళలో/ మృత్యువు సాలెగూళ్ళు కట్టేది కాదు’’ ఒకవేళ ప్రకృతి కరుణించి పంటలు పండినా సరైన గిట్టుబాటు ధరలు లభించక దళారులు రైతులను దోచుకోవడాన్ని ‘కరువుపాము’ కవితలో తీవ్రంగా నిరసించాడు. అన్ని కష్టాలను ఎదురొడ్డి ఎప్పుడో ఒకసారి ఏ కాస్త పంటో పండిస్తే వాటిని అమ్ముకొనే అవకాశం కూడా లేదు రైతన్నకి. ఈ దేశంలో పంట పండిరచే రైతుకి తన పంటకు ధర నిర్ణయించే అధికారం లేదు. అదే కార్పొరేట్‌ కంపెనీ వాడు మాత్రం తాను తయారు చేసే వస్తువులకు ధర నిర్ణయిస్తాడు. రైతు పంటలకు ధరలు నిర్ణయించేది దళారులే. దళారులందరూ ఒక గ్రూపుగా తయారై పంటలకు తక్కువ ధరలు నిర్ణయించి రైతుల జీవితాలను చిదిమేస్తున్నారు. పంటకు తగిన గిట్టుబాటు ధరలు లేక, తాను పంట కోసం పెడుతున్న ఖర్చుకూడా రాక రైతుల జీవితాలు అన్యాయమైపోతున్నాయి. ఆవేదన చెందిన రైతన్నలు ఆత్మహత్యల పాలవుతున్నారు. ప్రజలు కూడా కార్పొరేటు కంపెనీల తయారు చేసే వస్తువులను ఏ మాత్రం బేరం ఆడకుండా కొంటారు కానీ రైతుల దగ్గర మాత్రం బేరాలాడుతూ ఇంతకిస్తావా, అంతకిస్తావా అని అడుగుతుంటారు. ఇది సరికాదు. ఈ పరిస్థితి మారాలి. పంట పండిరచిన రైతు తన పంటకు తానే ధర నిర్ణయించుకొనే అవకాశం ఉండాలి. అప్పుడే రైతు కాస్త నిలదొక్కుకోగలడు. అంతేకాదు రైతు స్వయంగా దళారుల ప్రమేయం లేకుండా పంటను అమ్ముకొనే అవకాశం రావాలి. ఇలా పంటలు పండిరచిన రైతుల కష్టాలు, పంటలు పండక అన్యాయమైపోతున్న రైతుల కష్టాలు గురించి ఆవేదనభరిత హృదయంతో రచయిత ‘కరువు పాము’ కవితలో తెలియజేశాడు. ‘‘పంట పండితే దళారి గద్దలు / పండకుంటే శవాలపై గద్దలు వాలడానికి సిద్ధంగా /రైతుల ఇళ్ళపైనే గిరికీలు కొడుతుంటాయి’’. సృష్టిలో ప్రతి మనిషికీ అమ్మంటే ఇష్టం. ఆ అమ్మే లేకుంటే ఈ భూమిపై మనిషే ఉండడు. అటువంటి అమ్మ గొప్పదనాన్ని వేనోళ్ళ కీర్తిస్తూ డాక్టర్‌ ఈశ్వరరెడ్డి రాసిన ‘అమ్మ’ కవి అపురూపం. తాను ముళ్ళబాటలో నడుస్తూ బిడ్డ కాళ్ళకింద గుండెను పూల తివాచీ చేస్తుందని చెప్పిన మాటలతో హృదయం ఉన్న ప్రతి ఒక్కరి గుండె బరువెక్కుతుంది. అమ్మ గొప్పదనాన్ని వర్షించడానికి ఇంతకంటే గొప్పమాటలు లేవంటే అతిశయోక్తి కాదేమో! ‘‘నాకంటిలో నలుసుపడితే అమ్మ గుండెలో / గునపం దిగినంత బాధపడుతుంది’’. ‘‘అమ్మ ముళ్ళబాటలో నడుస్తున్నా నా కాళ్ళ కింద అమ్మ గుండెను పూల తివాసీ చేసి పరుస్తుంది’’. ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే కష్టాలను గురించి వివరిస్తూ రాసిన కవిత ‘మార్చురీ మైదానం’. భూకంపాలు, తుఫానులకు జనజీవనం స్తంభించిపోతుంది. కోట్లాది ప్రజలు అనాథలై నిరాశ్రయు లవుతున్నారు. ఆ సమయంలో జరిగే ప్రాణనష్టాన్ని వివరిస్తూ భూమి మార్చురీ మైదానమై విలపిస్తోందని రాసిన ఆవేదనాభరితమైన కవిత ఇది. మానవుడు చేసిన ప్రకృతి విధ్వంసం కారణంగానే ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తున్నాయి. సాంకేతికత సహాయంతో ప్రకృతిని జయించాలనుకోవడం మానవుని భ్రమ. మానవుడు ప్రకృతిపై ఆరాధన భావంతో జీవించాలి. కానీ మానవుడు ఆ విషయం మరచి ప్రకృతి విద్వంసక చర్యలు చేపడుతున్న కారణంగా భూకంపాలు, తుఫానులు, సునామీలు వచ్చి జనజీవనం అల్లాడిపోతున్నది. లక్షలాదిగా మనుషులు, అనేక జీవరాశులు మృత్యువాత పడుతున్నాయి. సాధారణంగా సముద్ర తీరమంటే అందరికీ ఇష్టం. మరీ ముఖ్యంగా కొందరు కవులు, రచయితలు సముద్ర తీరాన కూర్చొని రచనలు చేయడానికి ఇష్టపడుతారు. సినిమా రచయితలు కూడా కొందరు సినిమాలకు కథలు రాసుకోవడానికి సముద్ర తీరానే ఎంచుకొంటారు. అయితే 1995లో కోస్తాలో వచ్చిన భయంకర తుఫానుకు నదీ తీరాలు, సముద్ర తీరాలంతా శవాలతో నిండిపోయాయి. ఈ హృదయ విదారక దృశ్యాన్ని చూసి తల్లడిల్లిన రచయిత ‘మార్చురీ మైదానం’ పేరుతో రాసిన కవిత ఇది. ఇదే విధంగా 2004లో వచ్చిన సునామీ కారణంగా సముద్ర తీరాలన్నీ శవాలతో నిండిపోయి ‘మార్చురీ’ని తలపించాయి. ఇప్పటికైనా మానవునిలో మార్పు రావాల్సి ఉంది. మానవుడు ప్రకృతితో కలిసి జీవించడాన్ని అలవాటు చేసుకోవాలి గానీ ప్రకృతిని జయించాలనే ఉద్దేశాన్ని వదులుకోవాలి. ప్రకృతిని జయించాలని భావిస్తే నాశనం అయిపోయేది మానవుడే. ఆ విషయాన్ని గుర్తుంచుకొని మసలుకొంటే అందరికీ మంచిది. ‘‘భూమి కడుపున కలుక్కుమంటే / భూకంపమై వొణికిపోతుంది సముద్రానికి రెక్కలు మొలిస్తే / తుఫానై విరుచుకుపడుతుంది. కవులను రవులను / తన కనుసన్నలతో కట్టి పడేసిన మనోహరతీరం పచ్చి శవాలనుకుంటూ / మార్చురీ మైదానమై విలపిస్తోంది’’. దేశ రక్షణ కోసం సరిహద్దుల్లో పోరాడుతున్న వీరసైనికుల త్యాగాలు అజరామరం. జిహాదీ పేరిట పేట్రేగిపోతున్న ఉగ్రవాదుల దుశ్చర్యలను అడ్డుకుని దేశాన్ని కాపాడుతున్న భారతసైనికులకు ఈ దేశ ప్రజానీకం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుంది. తల్లిదండ్రులు, భార్యా పిల్లలు, బంధువులందరినీ వదిలిపెట్టి దేశరక్షణే ఏకైక ధ్యేయంగా దేశ సరిహద్దులలో అనేక ప్రతిబంధకాలకు ఎదురొడ్డి పోరాడుతున్న వీరులు మన సైనికులు. కొన్ని సందర్భాలలో ప్రాణాలను పోతాయని తెలిసి కూడా ముందుకు సాగడంలో దేశం కోసం వారి చేసే త్యాగం కనిపిస్తుంది. వారి దేశభక్తికి అవధులు లేవు. సరిహద్దు దేశమైన పాకిస్థాన్‌ దుశ్చర్యలను ఎదుర్కొంటూ, ఉగ్రవాదులను మత్తుపెడుతూ కొన్ని సందర్భాలలో మన సైనికులు కూడా ప్రాణాలు కొల్పోతున్నారు. 1999లో పాకిస్థాన్‌తో జరిగిన కార్గిల్‌ యుద్ధ సందర్భంలో నిర్వహించిన ‘అపరేషన్‌ విజయ్‌’లో భాగంగా మంచు చర్యలు మీద పడుతున్న లెక్కచేయక మన సైనికులు శత్రువు దేశంపై విజయాన్ని సాధించారు. ఆ విషయాలను వివరిస్తూ రాసిన కవిత ఈ ‘ఆపరేషన్‌ విజయ్‌’మ్‌. ఈ కవితలో ‘కాళ్లను ఉక్కు గోడాలుగా’, ‘నెత్తుటి సెగను భోగి మంటగా’, ‘కార్గిల్‌ కొండలు తలలు వంచి సలాం చేస్తాయి’ వంటి పదాలు రచయిత ఉపయోగించిన తీరు అద్భుతం. ఆపరేషన్‌ విజయ్‌ లో నెత్తురోడ్చిన అటువంటి సైనికుల కష్టాలను, త్యాగాలను కీర్తిస్తూ రాసిన కవిత ‘ఆపరేషన్‌ విజయ్‌’మ్‌. భారత ప్రజానీకం నీ వెంటే ఉందంటూ సైనికుల్లో స్ఫూర్తి నింపే ఈ కవిత రచయిత దేశభక్తిని, సైనికుల త్యాగాలపై గల గౌరవాన్ని తెలుపుతోంది. ‘‘ఓ వీరపుత్రుడా! ఉగ్రవాదం మళ్ళీ నోరు తెరిస్తే ఒక్కసారి మీసం మెలేసి గాండ్రిరచు నీ వొంటి మీద నిక్కబొడుచుకున్న వెంట్రుకలు వారిపాలిట శతఘ్నులౌతాయి. భరత రక్షకా / విజృంభించు వందకోట్ల గొంతుల్లో / నీ విజయగీతిక మ్రోగుతోంది’’. తల్లిదండ్రుల తర్వాత, భగవంతుని కంటే ముందుగా పూజించాల్సిన వ్యక్తిగా ‘గురువు’ను నిర్ణయించారు మన పెద్దలు. సమాజంలో గురువు పాత్ర ఉదాత్తమైనది, బాధ్యతాయుతమైనది కూడా! గురువు లేకుంటే సమాజం ఏమైఉండేదో తలచుకుంటే మాటలు రావు. నేటి సమాజంలో అంతో ఇంతో సక్రమ మార్గంలో నడుస్తోందంటే అందులో ప్రధానపాత్ర గురువులదే. ‘అజ్ఞానం అనే చీకటిని పారద్రోలి విజ్ఞానం అనే వెలుగును నింపువారు గురువులు’. విద్యార్థి దశలో పిల్లలు తల్లిదండ్రల కంటే గురువులు చెంతనే ఎక్కువగా గడుపుతారు. విద్యార్థులు గురుల్ని ఆదర్శంగా భావించారు. కనుక గురువు ఎంతో నియమబద్ధంగా జీవించి నలుగురికి మార్గదర్శకంగా నిలవాలి. అందుకే అంటారు గురువుని ‘ఆచరించి చూపువారు ఆచార్యుడని’ ‘కృష్ణం వందే జద్గురుం’. అంటే శ్రీకృష్ణుడు ఈ జగత్తుకు అంతా గురువు అని అర్థం. అటువంటి శ్రీకృష్ణుడే తన అన్న బలరామునితో కలిసి ‘సాందీపని’ అనే గురువు దగ్గర విద్య నేర్చుకున్నారంటే గురువు యొక్క ప్రాధాన్యత తెలిసిపోతుంది. ఎందరో విద్యార్థుల ఆశయాల సాధనలో తోడ్పాటును అందించే గొప్ప సాధనం గురువు. అటువంటి గురువు గొప్పదనాన్ని కీర్తిస్తూ రాసిన కవిత ‘అక్షర బ్రహ్మ’ ఏ పదాన్నీ విడిచిపెట్టలేనంతగా గొప్పగా రాసిన కవిత ఇది. ‘‘గురువంటే / అజ్ఞానుల్ని అమరజ్యోతులుగా తీర్చి ఆశల్ని ప్రగతిబాసలుగా నిలబెట్టగల / విచిత్ర మంత్రదండం గురువంటే / శిష్యులప్రజ్ఞపై విజయాల వర్షం కురిపించి /కళ్ళకొసల్లో వేలాడే ఆనంద బాష్పాల్ని వరాల మూటలుగా స్వీకరించగల ఉదాత్తుడు’’ సమాజంలో స్నేహానికి గొప్ప ప్రాధాన్యత ఉంది. స్నేహితులు లేని మనిషంటూ ఈ లోకంలో ఉండరంటే అతిశయోక్తి కాదు. స్నేహం కోసం ప్రాణాల్ని సైతం త్యాగం చేసే మిత్రులను మనం పురాణ కాలం నుంచే చూస్తున్నాం. ఇప్పటికి అటువంటి ప్రాణ స్నేహితులు ఉన్నారు. అయితే చాలా తక్కువ సంఖ్యలో మాత్రం అటువంటి వారు అరుదుగా కనిపిస్తారు. మానవ సంబంధాలన్నీ ‘మనీ’ సంబంధాలుగా మారుతున్న నేటి కాలంలో స్నేహానికి ప్రాధాన్యత తగ్గిపోతున్నది. నేటి కాలపు స్నేహాల్లో చాలా వరకు అవసరార్థపు స్నేహాలుగా ఉంటున్నాయి. కాలక్రమేణ స్నేహాల్లో మోసం పెరిగిపోతున్నది. నమ్మించి మోసం చేయడం నేటి కాలపు స్నేహం యొక్క ప్రాధాన్యత. ఇటీవలి కాలంలో స్నేహం వలన మోసంపోయిన వారే ఎక్కువగా కనిపిస్తున్నారు. స్నేహం పేరుతో ద్రోహం చేసే మిత్ర ద్రోహుల పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. తప్పులు చేసిన వారిని క్షమించవచ్చు కానీ మోసం చేసేవారిని ఎట్టి పరిస్థితి లోనూ క్షమించరాదు. మిత్ర ద్రోహాన్ని గురించి తెలియజేస్తూ రాసిన కవిత ‘కల్తీ నెత్తురు’. ఇందులో రచయిత మిత్ర ద్రోహం చేసే వారిని విశ్వాసంలేని ‘వీధి కుక్కలతో’ పోల్చాడు. మిత్ర ద్రోహం నేరమని, మిత్రద్రోహానికి పాల్పడే వారెవరూ క్షమించమని అడగొద్దని సూటిగా స్పష్టం చేస్తాడు రచయిత. నీలాంటి మిత్రద్రోహిని క్షమిస్తే మానవత్వం నన్ను బహిష్కరిస్తుందంటాడు. ‘‘ఇంకా నటించకు మిత్రమా / నీ దొంగ జపం వెండి జీవితం చేప నీ నోట్లో పడిరదిగా అసత్యాలన్నీ విత్తనాలు చల్లడంలో నీకు నువ్వే సాటి / నీ కల్తీ నెత్తుటి చౌడుగుండెలో మంచి పెరగడం అసంభవం ఇంకెప్పుడూ క్షమించమని అడగద్దు నిన్న క్షమిస్తే / మానవత నన్ను బహిష్కరిస్తుంది’’. భారతదేశంలో క్రికెట్‌ క్రీడకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ఇక్కడి ప్రజలు క్రికెట్‌ను, ఆటగాళ్ళను విపరీతంగా ఆరాధిస్తారు. దేశంలో ఎన్నో క్రీడలు ఉన్నా వీరికి క్రికెట్‌ అంటేనే పిచ్చి. తమదేశపు ఆటగాళ్ళు ఆటలో అద్భుతంగా రాణించి దేశ కీర్తిపతాకను రెపరెపలాడిస్తారని ఆశపడతారు. భారతదేశంలో క్రికెట్‌ను ఓ మతంలాగా ఆరాధిస్తారు. అటువంటి క్రికెట్‌ ఆటలో కొందరు ఆటగాళ్ళు ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ పేరిట కాసులకు కక్కుర్తిపడి అభిమానుల నమ్మకాల్ని వమ్ముచేస్తూ దేశ పరువు ప్రతిష్టలని బజారున పడేస్తున్నారు. 1999-2000లో జరిగిన ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’ లో భారత్‌ ` పాకిస్థాన్‌, దక్షిణాఫ్రికా ఆటగాళ్ళు ఉన్నట్లు వార్తలు రావడంతో క్రికెట్‌ అభిమానులు తీవ్ర విచారంలో మునిగిపోయారు. అప్పటి నుండి ‘మ్యాచ్‌ ఫిక్సింగ్‌’కు సంబంధించి ఎన్నో వార్తలు వస్తూనే ఉన్నాయి. తమ దేశపు జట్టు గెలిస్తే నిజాయితీగా గెలిచిందా లేక ‘ఫిక్సింగ్‌’ వల్ల వచ్చిన గెలుపా? ఒకవేళ ఓడితే నిజాయితీగా పోరాడి ఓడిపోయారా లేక కావాలనే ఓడారా? అనే అనుమానాలు క్రికెట్‌ అభిమానుల మనసుల్ని నిత్యం వేదనకు గురిచేస్తున్నాయి. తమ జట్టు, అభిమాన ఆటగాళ్ళు సాధించిన రికార్డును వాస్తవమైనవా లేక ‘ఫిక్సింగ్‌’ ద్వారా వచ్చినవా అనే ఆలోచనలతో సాధారణ క్రికెట్‌ ప్రేమికులు కుమిలిపోతున్నారు. నిజానికి క్రికెటర్లకు లక్షలాది రూపాయలు ఆదాయం వస్తుంది. ఇవన్నీ ప్రేక్షకులు చెల్లించే డబ్బులే. అయినా ధనం దాహం తీరక ‘పిక్సింగ్‌’కు పాల్పడుతున్నారు. దేశపు జట్టు గెలిస్తే జాతీయ జెండాలు చేతపట్టి కెరింతలు కొడుతూ, నృత్యం చేస్తూ తాను విజయం సాధించినంతగా క్రికెట్‌ అభిమానులు ఉప్పొంగిపోతారు. అదే జట్టు ఓటమి పాలైతే తీవ్ర దు:ఖంలో మునిగి పోతారు. అటువంటి అమాయకపు క్రీడాభిమానులను ‘ఫిక్సింగ్‌’ పేరిట మోసం చేయడం అత్యంత దారుణమైన విషయం, క్షమించరాని నేరం. ఇక్కడ క్రికెట్‌ అభిమానులను మోసం చేయడమే కాదు యావత్తు దేశాన్ని మోసం చేయడమే కాక దేశ పరువు ప్రతిష్టల్ని తాకట్టు పెట్టడం క్షమించరాని నేరం.రచయిత కూడా క్రికెట్‌ అభిమానే. ఈ ‘ఫిక్సింగ్‌’ సంఘటల్ని చూసిన రచయిత క్రికెట్‌ను పిచ్చిగా ఆరాధించి మోసపోవద్దంటూ అభిమానులకు చూసిస్తూ రాసిన కవిత ఈ ‘డోంట్‌ ఈట్‌ క్రికెట్‌’.
‘‘దేశ గౌరవాన్ని చొక్కాగా తొడిగి పంపిస్తే
ఆటగాళ్ళు పందేల బురదగుంటల్లో దొర్లొస్తారు
జాతి జాతంతా మరకల పాలౌతుంది’’.
ఇలా విభిన్నాంశాలకు చెందిన విషయాలలో సామాన్యుల గుండె చప్పుళ్ళను కవితల రూపంలో మనముందుకు తెచ్చిన అక్షరశిల్పి డాక్టర్‌ ఈశ్వరరెడ్డి. వీరు మరింత సాహితీసృజన చేయాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.

ఆధారగ్రంథాలు

  1. కన్నీటిసీమ (కవితా సంపుటి) ` డాక్టర్‌ ఎన్‌.ఈశ్వర్‌రెడ్డి.

డా. కలువకుంట ఈశ్వర బాబు
తెలుగు అధ్యాపకులు,
ప్రభుత్వ డిగ్రీ కళాశాల, పాకాల.
ఫోన్‌: 94416 44462

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *