ప్రాచీన తెలుగు కావ్యాలు – గిరిజనుల సాంస్కృతిక జీవనం

పరిచయం :
ప్రాచీన కావ్యాల మీద గౌరవం తగ్గింది. ఆధునిక రచనలమీద మోజు పెరిగింది.మంచిదేకాని పరిశోధనకు ఒక సామాజిక ప్రయోజనం ఉండాలి. ప్రాచీన కవుల రచనలలోని అనేక కోణాల మీద కొంత పరిశోధన జరిగింది. అయితే తెలుగు కావ్యాల్లో గిరిజన సంస్కృతి వంటి అంశాల మీద తీక్షణమైన పరిశోధన జరగవలసి ఉంది. అలాంటి ఉద్దేశంతోనే, ప్రాచీన తెలుగు కావ్యాల్లో ఉన్న గిరిజనుల జీవనాన్ని పరిశీలించదలచాను. ఇది గిరిజనుల సంస్కృతిని పరిరక్షించి తర్వాత తరం వారికి అందించడానికి తోడ్పడుతుందని భావించవచ్చు. గిరిజనుల జీవనపరంగా, సంస్కృతికపరంగా సాగే గిరిజనుల పరిశోధనద్వారా తెలుగువారి జీవన విధానంలో గిరిజనుల మూలవాసులుసామాజిక జీవితంఏవిధంగా ఉందో ప్రాచీన కావ్యాల ద్వారా తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. నన్నెచోడుడు కుమార సంభవం, పోతన-ఆంధ్రమహాభాగవతం, శ్రీనాథుడు-శివరాత్రి మాహాత్మ్యం, పిల్లలమర్రి పినవీరభద్రుడు శృంగార శాకుంతలం, కొరవి గోపరాజు సింహాసన ద్వాత్రింశిక, అల్లసాని పెద్దన మనుచరిత్ర, శ్రీకృష్ణదేయరాయలు ఆముక్తమాల్యద మొదలైన ప్రాచీన కవుల కావ్యాల్లో ఉన్న గిరిజన సాంఘిక జీవనాన్ని లోతుగా గిరిజనులు ఆదిమూలవాసులైన సాంస్కృతిక చారిత్రక అధ్యయనం ద్వారా భవిష్యత్తు తరాలలోని భాషలు ఎలా అభివృద్ధి చెందాయో అనేది మూలవాసుల ద్వారా లోతుగా అధ్యయనం చేయడానికి పరిశోధన ఉపయోగపడుతుంది. ఈ కింది విధంగా గిరిజనుల సాంఘిక జీవనం తెలుగు ప్రాచీన సాహిత్యానికి ఎంతగానో తోడ్పడుతుంది.గిరిజనుల సాంఘిక జీవన విధానంలోని వేషధారణ, వేట, వ్యవసాయం, రాజ్యపాలనం, వస్తుసేకరణ, ఆహారం, వైద్యం మొదలైన అంశాలు తెలుగు ప్రాచీన కావ్యాల్లో ప్రస్తావించబడ్డాయి. ఈ పరిశోధన ద్వారా గిరిజనుల సాంఘిక జీవనాన్ని వివరిండం నా ఉద్దేశం. 1.వేషధారణ : గిరిజనుల జీవన విధానాన్ని వర్ణించే సందర్భంలో కవులు వాళ్ల వేషధారణలోని తీరు తెన్నుల్ని ప్రస్తావించారు. స్త్రీల, పురుషులు, పిల్లల వేషధారణ కావ్యాల్లో ప్రధానంగా కన్పిస్తుంది. స్త్రీల వేషధారణ ఇలావుంది. స్త్రీలవేషధారణ : ఆంధ్రమహాభారతంలో గిరిజనుల ప్రస్తావన ఉన్నా, వాళ్ల వేషధారణ ప్రస్తావన కన్పించదు. నన్నెచోడుడు, ధూర్జటి, రఘునాథ నాయకుడు మొదలైన వాళ్ళు గిరిజనుల వేషధారణను వర్ణించారు. నన్నెచోడుడు ‘కుమారసంభవం’లో తపోవనానికి వెళ్ళుతున్న పార్వతి ఎదుకు స్త్రీలను చూసిందని వర్ణిస్తూ వాళ్ల వేషధారణ ఎలావుందో క్రింది పద్యంలో చెప్పబడిరది. ‘‘హరినీల రాణులకు నాయువు వచ్చెనా గమనీయమగు తనుకాంతులెసగ మెఱుగుదీగలు గండుమీలపై నెలసెనా దృగాసుర ద్యుతుల్‌ దేజరిల్ల జమరను కేశపాశముల దుమ్మెద పిండు దగిలెనా గుఱిల కుంతలముల మర..... శైలేంద్ర తనయ’’ .... (పుట. 133) గిరిజన స్త్రీల రూపురేఖల్ని రమణీయంగా వర్ణించబడ్డ పద్యమిది. కొఱవి గోపరాజు : సంహాసన ద్వాత్రింశిక’లో చెంచు స్త్రీల వేషధారణ ప్రస్తావన ఉంది. విక్రమార్కుడు మారువేషాన్ని ధరించి దేశ సంచారానికై వెళ్లుతుండగా ఒకచోట చెంచు స్త్రీలు కన్పించారని వర్ణిస్తూ వారు ధరించిన వేషాన్ని ఇలా పేర్కొనడం జరిగింది... ‘‘గురిజ పేరులఱుత గొమరార ధరియించి యడవి మొల్లల గురులందు జెరివి పాఱుటాకులు మొలబాగుగా గట్టియే తెంచు చెంచు సతులగాంచి’’....... (11-6) గిరిజన స్త్రీలు పాఱుటాకుల్ని వస్త్రాలుగా, గురువిందపూసల దండల్ని ధరించారట, కొప్పులో కొండమల్లెల్నిపెట్టుకున్నారని పై పద్యం వర్ణిస్తుంది. ధూర్జటి : ‘శ్రీకాళహస్తిమాహాత్మ్యం’లో చెంచు స్త్రీల వేషధారణ వర్ణించబడిరది. ఉడుమూరిలో చెంచు స్త్రీలుఎంత భాగ్యవంతులైనా తమ కులాచారాన్ని అనుసరించి పాటుటాకుల్ని వస్త్రాలుగా, గురివింద పూసల దండల్ని ధరించారని వర్ణించబడిరది. ‘పట్టు చీరలు గట్ట భాగ్యంబు గల్గియు బాఱుటాకుల గట్ట భారమనరుల ‘మాణిక్య భూషా సమాజంబు గల్గియు నెఱ్ఱని గురివిందలేటి కనరు’ .......(3-6) కులాచారాన్ని అనుసరించి వేషధారణ చేయడం ఈనాటికీ గిరిజన సంప్రదాయంలోవుంది. మరో సందర్భంలో భిల్లాంగనలు తమ భర్తలు సంచరిస్తున్నారని చెబుతూ వాళ్లు తమ తలలపై నెమలి పింఛాన్ని, నుదుట జేగురు రంగుబొట్టును. మెడలో గురువింద పూసల దండల్ని, వస్త్రాలుగా పాఱటాకుల్ని, నడుముకు జమిలి ఒడ్డాణాన్ని ధరించారని వర్ణించిన పద్యం ఇలావుంది. కఱకు జుంజుఱు వెంట్రుకల కొప్పుగాఢత రంబుగా నెమలి పింఛంబు జుట్టి తట్టుపునున వన్నె పెట్టునట్టు లలాట పట్టిక జేగుఱుబొట్టు పెట్టి..... (3-15) పండుగ సమయాల్లో ధరించే విశేష వేషధారణ గురించి ధూర్జటి ప్రస్తావించారు.కాటిఱేని జాతరకు పోతున్న చెంచుస్త్రీలు ఇలా ఉన్నారని ధూర్జటి వర్ణించారు. కుటిల కుంతల జాలఫాల పట్టికలు జేగురు... కాండమండిత దోర్పండంబుల నెమలి పురిదండలు బులనవతం భూత మయూర వర్ణంబులు....(3-36) రఘునాథనాయకుడు : ‘వాల్మీకి చరిత్రం’లో రెండు సందర్భాల్లో స్త్రీల వేషధారణను ప్రస్తావించడం జరిగింది. కిరాతుని భార్యను ఇలా వర్ణించారు. ‘‘కుదురుగ జంగసాని చనుగుబ్బల మీదుగా బాబుటాకు బయ్యెదపాదలంగ.....’’ అని అంటాడు. (2-15) తపోనిష్ఠలో ఉన్న కిరాతుని తపస్సును మాన్పించడానికై వచ్చిన కిరాతుని భార్య గురువింద పేరుల్ని, దంతపు కమ్మల్ని, పగడాలు, రతనాలు, పికిలి పూలదండల్ని కొప్పులో మల్లెమొగ్గల్ని ధరించిందని వర్ణించినపద్యం ఇలావుంది. కుఱుకు గుబ్బలతోనే గురువింద పేరులు గునియుచు బెనగొన గొండ్లి చూప.... చెక్కుటద్దంబు సేయు...... (2-140) గడియారం వేంకటశేషశాస్త్రి : ‘శివభారతం’లో గిరిజనులైన మాపళా స్త్రీల వేషధారణ వర్ణించబడిరది. శివాజీ చుట్టూ చేరిన మావళా స్త్రీలు ఏనుగుదంతపు గాజుల్ని, గవ్వల దండల్ని, గురువింద పూసల దండల్ని, మాసిన అల్లికల బొంత పావడల్ని ధరించారని తెసియజేసే పద్యం ఇలా ఉంది. ఏనుగు దంతపుం జికిలి యెత్తిన గాజులు గువ్వగత్తులన్‌ దూనిగలైన పెన్‌ జడలు తోరుములే గురువెంద దండలున్‌ మానితశీలరక్షక మాసిన యల్లిక బొంతపావడల్‌ పూనిన మావలే సతులు పొడమియూరి శివాజి కన్నులన్‌.(250)
కవులు వర్ణించిన పై పద్యాల్ని పరిశీలిస్తే గిరిజన స్త్రీలు పాఱుటాకుల్ని చీరలుగా, గురువింద పూసలదండల్ని, గవ్వ దండల్ని హారాలుగా, నెమలి ఈకల ఆభరణాన్ని అలంకారంగా నుదుట జేగురు రంగుబొట్టును, ఏనుగు దంతాల గాజుల్ని ధరిస్తారని, కఱకు జంజురు వెంట్రుకలపై నెమలి పింఛాన్ని ధరిస్తారనితెలుస్తుంది. నేటి గిరిజనుల వేషధారణకు పై పద్యాలు దగ్గరగా ఉన్నాయి.
పురుషుల వేషధారణ : పిల్లలమర్రి పినవీరభద్రుడు ‘శృంగార శాకుంతలం’లో పుళిందులు ధరించిన వేషధారణను వర్ణించాడు. దుష్యంతునికి కానుకలు సమర్పించడానికై వచ్చిన పుళిందుల వేషధారణను ఈకింది పద్యంలోఎలా వర్ణించారు.
జుంజురు పల్ల వెండ్రుకల జొంపములుందగల మస్తకంబులుం.
గెంజికురాకు గెంపుదులంకించెడు వట్రువ కన్నులు జర
త్కుంజర చర్మ పట్టములకున్‌ సరివచ్చు బెరళ్లుమేసులున్‌
ముంజులుగొల్వ గొందఱు సముద్ధతి వచ్చి పుళింద వల్లభుల్‌(1-97)
ఎరుపురంగు గల జుంజురు వెంట్రుకల సమూహం, లేత ఎరుపు రంగుతో సమానమైన పట్రువ కన్నులు, ఏనుగు చర్మాలతో సమాన మైన చెట్టు బెరడుల వస్త్రాలతో పుళిందులు వచ్చారని కవి వర్ణించారు.
కొఱవి గోపరాజు : గోపరాజు ‘సింహాసనద్వాత్రింశిక’లో చెంచుల వేషధారణను ప్రస్తావించారు. విక్రమార్కునిసభలోకి ఒక చెంచు వచ్చాడట. అతడు పచ్చని నీలివస్త్రాల్ని, పూసల దండల్ని ధరించాడట. నుదుట ఎర్రనిబొట్టును పెట్టుకొన్నాడట. పిడికత్తి, విల్లు సమ్ముల్ని ధరించాడని వర్ణించిన పద్యం ఇది.
నెమ్మిబచ్చని కుప్పనంటును మీరి తీరములీలియుం
దమ్మిపీసల పేర్లు వెఱ్ఱని ధాతు గొట్టును జూడనం
గమ్ముమై గదు సొమ్ముగా పిరివత్తి కాసిన మర్చి పా
అమ్ములన్విలుగేలు బొక్కానియంత జెంచరుదెంచుచున్‌’..(8-9)
అల్లసాని పెద్దన : పెద్దన ‘మనచరిత్రలో’లో ఎఱుకుల వేష ధారణను గూర్చి ప్రస్తావించారు. వేటకై స్వరోచి వెంట బయలుదేరిన ఎఱుకుల వేషధారణను ఇలా వర్ణించారు.
‘‘కట్టిన నీలిదిండ్లు సెలకట్టియు విండ్లును విండ్లగేసెనల్‌
చుట్టి నొసళ్ళపై నిడిన జుంజురుబల్లసిగల్‌ కటితటిం
బెట్టిన మాట కత్తులును మేనులగార్కొను కప్పులేర్పిచే
బట్టినయమ్ములును…….. (4-33).
నుదుట వ్రేలాడుతున్న ఎరవ్రి చింపిరి జుట్టుతో రకరకాల విల్లుల్ని, అమ్ముల్ని, మోటకతుల్ని ధరించి వేటకు బయలుదేరారట.
తరిగొప్పుల మల్లన : మల్లన ‘చంద్రభానుచరితం’లో ఎరుక పాళెగాని వేషధారణను వర్ణించారని సురవరం ప్రతాపరెడ్డి గారు తమ ‘ఆంధ్రుల సాఘిక చరిత్ర’లో పేర్కొన్నారు. అంపపొదికి నెమలి పురిచుట్టి, నెలను అను కట్టెతో చేసిన విల్లును బూని మొలకు పులితోలు చుట్టి నడుము దట్టీతో కురుచవిడెముడోసి, పికిలి పూలదండలు చేసుకొని, కుడిచేతి నందిపై గురిగింజల దండలు పెట్టుకొన్నారని వర్ణించారు. (ఆంధ్రుల సాంఘిక చరిత్ర. పుట. 321)
రఘునాథ నాయకుడు : రఘునాథ నాయకుడు తన ‘వాల్మీకి చరిత్రం’లో బోయవాని వేషధారణను గూర్చిప్రస్తావించాడు. ఋషులు బోయపల్లెను దాటిపోతుండగా వారిని ఒక బోయవాడు అడ్డగించాడని, అతడునడుముకు నల్లని వస్త్రాన్ని ధరించాడని, నల్లని శరీరం కలవాడనీ, అటూ ఇటూ బాణాల్ని ప్రయోగిస్తూసమీపించాడని వర్ణించిన పద్యం ఇలా ఉంది.
కటినటియించు నీలిబలుకాసెయు నల్లని మేను జిమ్మ చీ
కటి ఘటియింపజేత విలుగైకొని మేఘము పిల్లవోలెన
ట్టిటు శరపంక్తులడ్డముగ చేయుచునాయుడు వచ్చి…. (2-98)
మునుల హితోపదేశాన్ని విన్న కిరాతుడు తన సహజ వేషాన్ని వీడి మునివేషాన్ని ధరించాడని వర్ణించేసందర్భంలో కిరాతుడు ధరించే సహజ వేషధారణ ప్రస్తావించబడిరది. నుదుట జేగురు రంగుబొట్టు పెట్టుకోవడంమానేశాడనీ, విల్లుధరించడం, సిగను ధరియించడం, నీలివస్త్రాన్ని ధరించడం మానేశాడని ఈ కింది పద్యం తెలియజేస్తుంది.
‘నుదుట జేగురు బొట్టు పదనింక గాదని.
తులసి మృత్తిక నూర్వ తిలకమిడియో
సెలను విల్లు వహించు కెలసంబుగాదని.
వేణుకుండిక యొందు పాణిబూనె
సొగసు నున్నని కోరసిగ సూటిగాదని
నిడుద పన్నెఱులెట్ల జడలుదార్చి
నిండుగాటంపు నీలిదిండుగాదని కోటి
బఱచని నార చీరలు ధరించె……(2-127)
జేగురు రంగుబొట్టు, కోరనిగ, నీలివస్త్రం కిరాతుల వేషధారణలో సహజంగా కన్పిస్తాయి. కిరాతుడు నెమలిపింఛాన్ని ధరించాడని మరోచోట చెప్పబడిరది. నెమ్మిపించెపు దండు గ్రమ్మి చుట్టెడికొప్పు (2-132)
ముద్దుపళని : ‘రాధికాస్వాంతనం’లో ఎఱుకుల వాని వేషధారణ ప్రస్తావించబడిరది. నడుముకు దట్టిని చుట్టుకున్నాడని, దట్టీలో కొడవలిని చెక్కుకున్నాడని, మెడలో పూసల దండల్ని, చెవులకు పీలిబెండ్లను, తలలో కొంగ ఈకల్ని, గవ్వల దండ్లని, సెలసువింటిని, అల్లికబుట్టను ధరించి పక్షుల్ని వేటాడడానికి బయలుదేరాడని వర్ణించిన పద్యం ఇలా ఉంది..
‘కుఱుచగా జుట్టిన కుఱుమాపుదట్టిపై
గోడవలి లోదోటి కూడ జెరివి
కొడిది పూసల పేరు మెడనంటగా గట్టి
బిగి యొక్క జెవి చీలిబెండ్లు వెట్టి
కొంగ యీకలు గొన్ని యంగుగా దలజుట్టి
గట్టి యల్లిక తట్టబుట్ట చంకన మర్చి……
గొక్కెరను బట్టుచును వచ్చెనొక యెఱుకు’…. (1-105)
గడియారం వేంకటశేషశాస్త్రి : వీరు తమ ‘శివభారతం’లో మావకావీరుల్ని గిరిజనులుగా పేర్కొన్నారు. గిరిజనులైన మావళా వీరులు శరీర సౌష్టవం కలవాళ్లని, కౌపీనం ధరించారని మెలికలు తిరిగిన కొరకుచ్చు మీసాలు కలవారని వర్ణించిన పద్యం ఇలా ఉంది.
‘కరిగిపోసిన యుక్కుగంటమ్ములను బలి
ష్ఠములైన శ్యామలాంగములు మెఱయ
జలిగాలి నెండకాకలుదరి బలుపారు
మాయ మర్మములేని మనసునకద్దమౌ……
జవకోరకుచ్చు మీనములు వెలయు’ (2-249)
పై ఉదాహరణల్ని పరిశీలించినచో గిరిజనులు సాధారణంగా బలిష్ఠమైన నల్లటి శరీరం కలవాళ్లని, జింకచర్మాన్ని లేదా పాఱుటాకుల్ని వస్త్రాలుగా ధరిస్తారని, చింపిరిజుట్టు, సుదుట జేగురురంగు బొట్టు, తలపైనెమలిపింఛం లేదా పక్షుల ఈకలు ధరిస్తారని విల్లమ్ములు, కత్తిలాంటి ఆయుధాన్ని కలిగి ఉంటారని చెప్పవచ్చు.

 1. పిల్లల వేషధారణ : గిరిజన పిల్లలకు సంబంధించిన వేషధారణ ప్రస్తావన కేవలం ధూర్జటి రాసిన శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో మాత్రమే కన్పిస్తుంది. చెంచు కుమారుడైన తిన్నని తల్లి స్నానం చేయించి అలంకరించిందని వర్ణించిన పద్యం ఇలా ఉంది.
  జలకంబార్చి విభూతిబెట్టి కటిగుంజాబీజ సంకీర్ణ మే
  ఖల బంధించి మయూర పక్షలతికా కాండంబులజేసి సం
  దిలి దండల్స వరించి కన్నుగవ గాంతి గాటుక దీర్చిమం
  దులతాయెత్తులు గట్టినన్‌ శబర పుత్రుల్‌ గూడియాడంబురిన్‌(3-32)
  స్నానం చేశాక విభూతి రేఖల్ని తీర్చి, నడుముకు గురువిందె పూసల మొలత్రాడు జుట్టి, నెమలి ఈకల్నితలపై పెట్టి, సందిటిలో పూసల దండల్ని కట్టి, కన్నులలో కాటుకను తీర్చి, మందుల తాయెత్తును కట్టి తిన్ననికి అలంకారం చేశారట. ఇది సాధారణమైన వేషధారణ.
  మరో సందర్భంలో అడవిలో జరిగే కాట్రేని జాతరకు పోతున్న సమయంలో చేసిన ప్రత్యేక వేషధారణ ప్రస్తావన ఉంది. జాతరకు పోయేటప్పుడు తల్లిదండ్రులు తిన్ననికి స్నానం చేయించి విభూతి పెట్టి, రక్షమూలికల మాలల్ని మెడలోవేసి, తలపై లేతతీగల్ని జుట్టి, విల్లునమ్ముల్ని ధరింపజేశారని ధూర్జటి ఇలా వర్ణించారు.
  జలకంబాడి విభూతి పెట్టుకొని రక్షామూళికామాలికా
  వలయంబుల్‌ తొడి దట్టిగట్టుక శిరోవర్దిష్ణు నీలాలకం
  బులలేదీగను జుట్టికేల విలునమ్ముల్‌ పూని కాట్రేని పూ
  జలు సేయన్‌ వెడలెంగుమారుడు…….(3-38)
  పూజ సమయంలో ప్రత్యేక వేషధారణ కలిగి ఉంటారని ధూర్జటి వర్ణించారు. పై విధంగా పురుషుల, స్త్రీల, పిల్లల వేషధారణ ప్రాచీన తెలుగు సాహిత్యంలో ప్రస్తావించబడిరది.
  ముగింపు : గిరిజనుల సాంఘిక జీవనాన్ని చిత్రిస్తూ స్త్రీ, పురుషులు, పిల్లల వేషధారణ, వారి ధైర్యం సాహసాలు, కపటంలేని నిర్మల హృదయం, దైవభక్తి, ధర్మానురక్తి, ధర్మరక్షణ మొదలైనవి ప్రాచీన సాహిత్యంలో పేర్కొనబడ్డాయి. గిరిజనుల ప్రధానవృత్తి వేటయని కొందరు కులాచారాన్ని యధావిధిగా అనుసరించే వాళ్ళనీ, మరికొందరు వ్యవసాయం, అటవీ వస్తువుల సేకరణ, మరికొందరు రాజ్యపాలన చేసేవాళ్ళని వర్ణించబడ్డారు, రాజ్యపాలనను ప్రస్తావిస్తూ రాష్ట్రం, దేశంలాంటి శబ్దాల్ని కొందరు కవులు ప్రయోగించారు. కొన్నింటిలో గిరిజనుల ఆహారం, వైద్య విధానం మొదలైన అంశాలు తెలుగు ప్రాచీన కావ్యాల్లో చర్చింబడ్డాయి. ప్రాచీన సాహిత్యంలో ఉన్న గిరిజనుల గురించి లోతుగా పరిశోధన జరగవలసిన అవసరం ఎంతైనావుంది. అలాంటా పరిశోధనలు రావడం వల్ల భవిష్యత్తు తరాలవారికి గిరిజనుల ప్రాచీన సాహిత్యాన్ని తద్వారా తెలుగు ప్రాచీన సాహిత్యానికి పరిపుష్టి చేయడానికి గిరిజనులు ప్రాచీన అధ్యయనం కూడా ఎంతో అవసరమని నా అభిప్రాయం.
  ఉపయుక్త గ్రంథసూచి :
  1. గోనానాయక్‌, ఎం. గిరిజన సాహిత్యం, హైదరాబాదు: తెలుగు అకాడమి, 2012.
  2. చినవెంకటేశ్వర్లు,భూక్యా, ట్రైబల్‌ లైఫ్‌ (ఆదిమతెగల, గిరిజనుల సమగ్ర జీవిత చిత్రణ), గుంటూరుయోజిత్బుక్‌ లింక్స్‌, 1994.
 2. నరసింహారెడ్డి, పి, ప్రాచీన తెలుగు కావ్యాల్లో తెలుగునాడు. తిరుపతి : శ్రీనివాస మురళీ పబ్లికేషన్స్‌, 1984,
 3. రామరాజు, బి. తెలుగు జానపద గేయసాహిత్యం, హైదరాబాదు ఆంధ్ర రచయితల సంఘం, 1958.
 4. రామాచార్యులు, బి, తెలుగు కావ్యాల్లో గిరిజన సంస్కృతి, హైదరాబాదు : ఓంసాయి గ్రాఫిక్స్‌, 2001,
 5. బాలగంగాధరరావు, యార్లగడ్డ. శ్రీమహాభారతము (ఆది, సభాపర్వాలు) విజయవాడ : నిర్మలా పబ్లికేషన్స్‌, 2006. 7. బాలగంగాధరరావు, యార్లగడ్డ, శ్రీమహాభారతము (ఆరణ్యపర్వము -వచనము విశేషవ్యాఖ్య) విజయవాడ :నిర్మలా పబ్లికేషన్స్‌, 2011.
 6. వెంకటరెడ్డి, కసిరెడ్డి, జానపద గిరిజన సాహిత్యం. హైదరాబాదు : తెలుగు భారతి సాహిత్య పత్రిక, 2010.
 7. సూర్యాధనంజయ్‌. రామాయణ అరణ్యకాండలోని ఆశ్రమాలు – శ్రీరాముని దర్శనాలు. హైదరాబాదు : శీతల్‌ పబ్లికేషన్స్‌, 2009.

డా. నూనావత్‌ రాంబాబు
సీనియర్‌ ప్రాజెక్టు ఫెలో,
ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయనం కేంద్రం, నెల్లూరు,
ఫోన్‌ : 9652009764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *