తెలంగాణ సాయుధ పోరాటం – జనగామ పాట

వ్యాస సంగ్రహం
తెలంగాణ ప్రాంతం అణువణువున సాహిత్యసంపద కలిగిన ప్రాంతం. కవులు, కళాకారులు నడయాడిన ప్రాంతం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పరిపాలన సౌలభ్యం కొరకు 31 జిల్లాలను ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఏర్పడిన జనగామ జిల్లా ఎంతో మంది కవులు నడయాడిన ప్రాంతం. ఆదికవి పాల్కురికి సోమనాథుడు, తెలుగు ప్రజలకి శ్రీమత్‌ మహాభాగవత మాధుర్యాన్ని అందించిన పోతన పుట్టినగడ్డ, కాకతీయుల పరిపాలనలో శిల్పకళా సాహిత్య వైభవాన్ని నిలుపుకున్న ప్రాంతం. తమ రక్తార్పణ తోటి దొరల గడీలకి బీటలు పారించి సామాన్యులను సమరయోధులుగా మార్చి తెలంగాణ బానిస సంకెళ్ళు తెంచిన షేక్‌ బందగి, దొడ్డి కొమురయ్య పుట్టిన వీరగడ్డ. ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు, పీడిత ప్రజల విముక్తి కొరకు ఎర్రజెండా నీడలో ప్రజాయుద్ధంలో తనదైన ముద్ర వేసుకున్న పోరుగడ్డ. నిజాం పాలకుల అణచివేతను తరిమికొట్టడానికి ఉవ్వెత్తున లేచిన తెలంగాణ సాయుధ పోరాటంలో తమ ఆత్మార్పణతో ఉద్యమ కాగడాను వెలిగించిన వీరయోధులు పుట్టిన ఉద్యమ గడ్డ. ఇంతటి ఘనచరిత్ర కలిగిన జనగామ జిల్లా సాహిత్యంపై పరిశోధన చేయడం చాలా అవసరం. జనగామ ప్రాంతం గేయసాహిత్యంలో పేరొందిన ప్రాంతం కనుక ‘‘తెలంగాణ సాయుధ పోరాటంలో ‘జన’గామ పాట’’ అనే అంశంపై పరిశోధన వ్యాసాన్ని గుణాత్మక పరిశోధన పద్ధతి (ూబaశ్రీఱ్‌a్‌ఱఙవ Rవంaతీషష్ట్ర వీవ్‌ష్ట్రశీస) లో వివరిస్తాను. దీనికోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట నేపథ్యంలో వచ్చిన జీవిత చరిత్రలు, కథలు, నాటకాలు, పాటలు, వ్యాస సంకలనాలు. విశ్వవిద్యాలయాల స్థాయిలో వచ్చిన పరిశోధనలు, విమర్శకుల, పరిశోధకుల అభిప్రాయాలను సందర్భోచితంగా విశ్లేషణకు ఉపయోగించుకుంటూ విశ్లేషణాత్మక పద్ధతిలో ఈ వ్యాసాన్ని వివరిస్తాను. జనగామ ప్రాంతంలో నుండి వచ్చిన అనేక ఉద్యమ పాటలు నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో తిరుగులేని ఆయుధంగా పని చేశాయి. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో సుపరిచితమైన వ్యక్తి సుద్దాల హనుమంతు గారు కానీ అతనితో పాటు సమానంగా పాటలు రాసి పాడిన వాగ్గేయకారుడు వయ్య రాజారాం అతని పాటల గురించి ఈ వ్యాసంలో కొంత పరిచయం చేయడం జరుగుతుంది.
కీలక పదాలు : తెలంగాణ సాయుధ పోరాటం, గేయాలు, సుద్దాల హనుమంతు, వయ్యా రాజారం, మౌఖిక సాహిత్యం.
ఉపోద్ఘాతం
గేయ ప్రక్రియ అనేది అతి ప్రాచీన ప్రక్రియ. మానవుడు భాషా జ్ఞానాన్ని పొందక ముందు నుంచే కొన్ని ధ్వనులను చేస్తూ తన భావాలను ఇతరులతో పంచుకోవడం జరిగింది. ప్రాచీన కాలం నుంచి నేటి వరకు పాట అనేది మనిషి జీవితంలో ఒక ప్రత్యేకమైన విషయంగా కలిసిపోయింది. అంతేకాకుండా పాట కాలానుగుణంగా తన స్వరూప స్వభావాలను మార్చుకుంటూ వస్తూ ఉంది. ఒకానొక సందర్భంలో శ్రమశక్తిని మర్చిపోవడం కోసం పాట పని చేసింది. మరొక సందర్భంలో పాట మానసిక ఆనందాన్ని అందించడం కోసం ఉపయోగపడిరది. కొన్ని సందర్భాల్లో పాట మనిషిలోని ఉద్వేగాలను ప్రేరేపించడం కోసం పని చేసింది. అయితే ఆధునిక కాలంలో పాటను ఒక చైతన్య సాధనంగా గుర్తించవచ్చు. ప్రత్యేకించి తెలంగాణ ప్రాంతం ఉద్యమాల ప్రాంతం కనుక ఈ నేల మీద జరిగిన అనేక ఉద్యమాలలో పాట క్రియాశీలకమైన పాత్రను పోషించింది. అందులో భాగంగా ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి వేదిక అయిన జనగామ ప్రాంతం నుండి వచ్చిన పాటలను పరిశీలించడం మన బాధ్యత. కొంతమంది తమ జీవితంలో జరిగిన అనేక సంఘటనలో క్రియాశీలకమైన పాత్రను పోషించి ప్రజా రంజక విధానాలతో ప్రజలను చైతన్య పరుస్తారు. కానీ కాలక్రమంలో వారి సేవలను, గొప్పతనాన్ని ప్రజలు మర్చిపోవడానికి అవకాశాలున్నాయి. దానికి కారణాలు అనేక రకాలుగా ఉంటాయి. అయితే అలాంటి వారి యొక్క గొప్పతనాన్ని సమాజానికి అందించడం పరిశోధకులకు ఉన్న ఉత్తమ లక్షణం. జనగామ ప్రాంతంలో పేరుపొందిన కవి వయ్యా రాజారాం ఇలాంటి వారి పాటలను ఆధారంగా చేసుకుంటూ ఈ పరిశోధన వ్యాసం రాయడం జరిగింది.
విషయం
భూమి మీద నివసించే ప్రతి మనిషి స్వేచ్ఛను కోరుకుంటాడు. తన స్వేచ్ఛను ఎవరైనా దోపిడీ చేస్తే వారిపై తిరగబడతాడు. అలా తిరగబడడమే మార్పుకు సంకేతం. మార్పు అంటే విప్లవం. ప్రపంచ చరిత్రలో ఎన్నో మరుపురాని విప్లవోద్యమాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రముఖంగా చెప్పుకోవాల్సినవి అమెరికా స్వాతంత్రోద్యమం, ఫ్రెంచ్‌ విప్లవం, రష్యా విప్లవం, భారత స్వాతంత్య్రోద్యమం. అయితే ఇందులో ఒక్కొక్క ఉద్యమానికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. వీటన్నింటికి భిన్నంగా ఏర్పడ్డ విప్లవం తెలంగాణ సాయుధ పోరాటం. ఈ పోరాటంలో ప్రజలు తమ కడుపులో రగులుతున్న మంటను హోమ జ్వాలగా బయటకు తీసుకువచ్చి, అగ్నిశిఖల్లా భూస్వామి పెత్తందారి వ్యవస్థలపై కురిపించారు. భూమి కోసం, భుక్తి కోసం, పీడత ప్రజల విముక్తి కోసం జరిపిన తెలంగాణ సాయుధ పోరాటంలో ఎంతో మంది తమ సర్వస్వం కోల్పోయారు. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి ఉద్యమానికి మొదటగా రక్తార్పణ చేసి, ఎంతోమంది ఉద్యమకారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపిన ఘనత మాత్రం జనగామ ప్రాంతానికి చెందుతుంది. 4000 మందికి పైగా ప్రాణార్పణ చేసిన తెలంగాణ సాయుధ పోరాటంలో జనగామ ప్రాంత ప్రజలు తమ రక్తంతో ఉద్యమానికి నెత్తురు తిలకం దిద్దారు. ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్న అనేకమంది ఉద్యమ నాయకులను కన్నగడ్డ జనగామ ప్రాంతం. గన్నులతో రాజ్యంపై తిరుగుబాటు చేసిన వీరయోధులతో పాటు, కలం ద్వారా వారి గళం ద్వారా పోరాటానికి ఒక ఊతాన్ని ఇచ్చిన కళాకారుల గురించి కూడా చెప్పుకోక తప్పదు. జనగామ ప్రాంతంలో ప్రజలని సాయుధ పోరాటంలో భాగస్వాములుగా చేయడానికి పాట ఒక తిరుగులేని ఆయుధంగా మారింది. సుద్దాల హనుమంతు, వయ్యా రాజారాం, బండి యాదగిరి వంటి కరుడుగట్టిన ఉద్యమకారులను ఆదరించింది జనగామ ప్రాంతం. తెలంగాణ ప్రాంతంలోనే అతి క్రూరుడిగా పేరుగాంచిన విసునూరు దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డి దౌర్జన్యాలను ప్రపంచానికి అర్థం అయ్యేలా వివరించారు నాటి కవులు. విసునూరు దేశ్‌ముఖ్‌ రాపాక రామచంద్రారెడ్డి కబంధహస్తాల్లో నలిగిపోతున్న జనగామ ప్రాంతానికి తెలంగాణలో అప్పుడప్పుడే మొలకెత్తుతున్న ఉద్యమాలు ఒక కొత్త ఊపిరిని ఇచ్చాయని చెప్పొచ్చు. గ్రంథాలయోద్యమం నుండి ఆంధ్ర మహాసభ వరకు వచ్చిన ఉద్యమాలు ప్రజల కష్టాలను, కడగండ్లను అర్థం చేసుకున్నాయి. సమర సంకేతాలను ప్రజా పోరాట ప్రతికలుగా గుర్తించాయి.
షేక్‌ బందగి – దొడ్డి కొముయ్య మరణం- పాటల ఉధృతి
అన్నదమ్ముల ఆస్తి తగాదాలలో అన్న పక్షాన బందగీ అనే ముస్లిం యువకుడు భూ పోరాటాన్ని ప్రారంభించి విసునూరు దొరపై విజయం సాధించడాన్ని తెలంగాణ ప్రజలు ఒక పెను మార్పుగా భావించారు. కానీ ప్రత్యర్థులను నామరూపాలు లేకుండా చేయడం నాటి ప్రభువులకి అలవాటే. ఆ కోణంలోనే షేక్‌ బందగిని దారి కాచి దారుణంగా హత్య చేశారు. ఈ పచ్చి ఘాతుకానికి ప్రజలు నా నా రకాలుగా స్పందించారు. బందగి వీర మరణం తర్వాత తెలుగు సాహిత్యంలో పాటకి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కలిగేలా చేశారు నాటి ఉద్యమ నాయకులు. బందగి పోరాట తత్వాన్ని అనేక రకాలుగా పాటల రూపంలో రచించారు నాటి తెలంగాణ కవులు.
‘‘బందగి రక్తంబు చింది జ్వాలై
లేచి జాగీరుదారులను ఊగించి వేసింది’’
బందగి వీరమరణం తర్వాత ఎంతోమంది వారి ప్రాణాలను అర్పించారు. వీర కరుణ రసాలలో వారి గాథలను కట్టుకొని జనం అమరవీరులను నిత్యం స్మరిస్తూ ఉన్నారు. బందగి మరణం తర్వాత జనగామ ప్రాంతంలో ప్రజా చైతన్యం పెల్లుబికింది అని చెప్పవచ్చు. లేవి విధాన్యానికి వ్యతిరేకంగా కడవెండి గ్రామంలో నిరసనగా చేపట్టిన ర్యాలీలో విసునూరు దేశ్‌ముఖ్‌ గుండాలు తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి దొడ్డి కొమరయ్య అనే యువకుణ్ణి హత్య చేశారు. భూమి కోసం, భుక్తి కోసం లేవీ నుండి విముక్తి కోసం జరుగుతున్న పోరాటంలో నేలకొరిగిన తొలి వీరుడు దొడ్డి కొమరయ్య. అతని మరణం ప్రజలను మరింతగా కార్యోన్ముఖులను చేసింది. 1949 జూలై 4వ తేదీ నాడు మొదలైన ఈ పోరాటంలో ఎంతోమంది వీరులు ఉద్భవించారు.
దొడ్డి కొమరయ్య వీరమరణాన్ని నాటి కవులు తమ యొక్క కలం ద్వారా తెలంగాణ ప్రపంచానికి అందించడంలో సఫలీకృతులయ్యారు.
‘‘అమరజీవి నీవు కొమరయ్య / అందుకో జోహార్లు కొమరయ్య
న్యాయమన్నది లేని నైజాము రాజ్యాన /
విశ్వరాక్షసుడైన విసునూరు దేశ్ముఖ్‌
పాలించుచున్నయా పల్లె కడవెండిలో
ప్రజల హక్కుల కొరకు కొమరయ్య /
ప్రాణాలనిచ్చావు కొమరయ్య’’ (జయధీర్‌ తిరుమల రావు, తెలంగాణ పోరాట పాటలు, పుట-212 )
అంటూ నాటి కవులు దేశ్ముఖ్‌ దౌర్జన్యాలను, అతని చేతిలో చనిపోయిన దొడ్డి కొమరయ్య పోరాట స్ఫూర్తిని తెలియజేస్తూ పాటలు పాడారు. ఈ పాటల యొక్క స్వభావాన్ని పరిశీలిస్తే మొదట అమరవీరుల కీర్తిని మరియు వారి త్యాగాలను ప్రజానీకానికి తెలియజేస్తూ, పాట చివరలో ప్రజల యొక్క కర్తవ్యాన్ని నిర్దేశించడం జరుగుతుంది.
‘‘నిన్ను బలిగొన్నటి నీచులను దునుమాడి /
నిన్ను గన్నట్టి తెలుగు గడ్డకి మేము
స్వాతంత్రముగా చేసి శాంతి చేదముగాక
నీ పేరు నిలపకనే కొమురయ్య /
మేము నిదురైన బోమోయి కొమురయ్య’’
అంటూ తెలంగాణ ప్రజలు వారి బానిస సంకెళ్ళ నుంచి విముక్తి పొందే విధంగా పోరాటం చేస్తామని దొడ్డి కొమరయ్య పేరు శాశ్వతంగా నిలిచిపోయే విధంగా కీర్తిస్తామని పాట చివరిలో కవులు తెలియజేసేవారు. అయితే జనగామలో జరిగిన పోరాటలను నేపథ్యంగా తీసుకుని తెలంగాణలో ఉన్న కవులు అనేక సాహితీ ప్రక్రియలలో రచించేవారు. కానీ జనగామ ప్రాంతంలో పుట్టినటువంటి వయ్యా రాజారాం, సుద్దాల హనుమంతు గారు స్వయంగా వారు అనుభవిస్తున్నటువంటి అనేక సమస్యలను పాటల ద్వారా వివరించారు. ఉద్యమం తర్వాత సుద్దాల హనుమంతు గారి పేరు తెలంగాణ మొత్తం సుపరిచితమైనప్పటికీ తొలితరం ప్రజాకవిగా పేరుపొందిన వయ్యా రాజారాం గారి ఘన చరిత్ర మరుగున పడిపోయింది.
వయ్యా రాజారం
బుర్ర కథల రాజన్నగా ప్రజల్లో నిలిచిన వయ్యా రాజారం తెలంగాణ సాయుధ పోరాటంలో ఒక పాటల ప్రవాహం. ఆశువుగా పాటను కైకట్టడం ఈయన ప్రత్యేకత. ఆంధ్ర మహాసభను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో రాజారం పాత్ర అనితర సాధ్యం. ఆంధ్ర మహాసభలో సభ్యత్వం తీసుకున్న ప్రజలకు దొరలు, దేశ్ముఖ్‌ ల యొక్క వేధింపులు ఎక్కువైనాయి. ఆ సమయంలో దొరల గుండాల నుండి కాపాడటానికి ‘‘గ్రామ రక్షక దళాల’’ ను ఏర్పాటు చేయడం తప్పనిసరి అయింది. గ్రామ రక్షక దళాల్లో స్వచ్చందంగా చేరడానికి ప్రజలు యువకులు ఉత్సాహం చూపించారు. వాలంటీర్లను కూడా నియమించడం జరిగింది. రాజారం వాలంటీర్ల చేరిక కోసం
‘‘వాలంటీల్లారా మీరందరూ వినండి
ప్రాణాముల నర్పించి పైకి నడువండి
దేశ సేవ కొరకు దీక్ష బూనండి
దాసులై ఉండండి దేశంబు కెల్లా’’ అంటూ ప్రజలను చైతన్యపరిచే పాటలు ఎక్కువగా రాజారం కలం నుండే వెలుపడ్డాయి. వాలంటీర్లుగా ప్రజలను సంఘంలో క్రియాశీల సభ్యులుగా చేర్చడానికి ఇలాంటి పాటలను ప్రతి గ్రామంలో పాడుతూ ఉండేవారు.
‘‘మీ పల్లె రక్షణ మీపై కలదు / మీ ఇంటి రక్షణ మీదేను సుమ్మి’’
అంటూ ప్రజల యొక్క కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ
‘‘ప్రజల రాజ్యము కొరకు పోరాడండి /
దెబ్బలకు జైలుకు భయపడకండి’’
అంటూ వాలంటీర్లపైన, గ్రామ రక్షక దళాల పైన అక్రమ కేసులు పెట్టిన భయపడకుండా ఎదుర్కోమని చెబుతూ
‘‘నాజీ నైజాం రాజు నరహంతకున్ని /
పడగొట్టి తొడగొట్టి పైకి నడవండి
కదలండి కదలండి కదన భూమికి /
ఎత్తండి ఎత్తండి ఎర్రజెండా ఎగురాలి
బాలచంద్రులై బయలుదేరండి /
వీరాభిమన్యుల్లాగా పోరాడండి’’(జయధీర్‌ తిరుమల రావు, తెలంగాణ పోరాట పాటలు, పుట-34)
ఈ విధంగా ప్రజలను నిజాంపై దండెత్తే లాగా చేయడంలో జనగామ ప్రాంత కవులు ముందు వరుసలో ఉన్నారు. ఇలా గ్రామ రక్షక దళాల సభ్యులుగా చేరిన వారి ఆచూకీ చెప్పండి అంటూ అనేకమంది సామాన్య ప్రజలను చిత్రహింసలకు గురిచేసి గడ్డివాముల్లో వేసి కాల్చి చంపేసేవారు. అనేక మందిని జైల్లో వేసేవారు. ఊర్లను ఊర్లనే క్యాంపులుగా మార్చేసారు. ఇలాంటి సంఘటనలు అనేకం జరిగేవి వాటిని కూడా పాటలుగా మార్చారు.
‘‘విసునూరి దేశంబు దొరోడు తలుసుకుంటే
దోపిడీకి బహు దొంగలే అన్నన్న / దొరల వేషము గట్టిరి
గబ్బేట గ్రామాన జూడు
కామ్రేడ్‌ తిరుమల రెడ్డిని / క్యాంపు లల్లా పెట్టి
కనికరము లేకుండా / కాళ్లు చేతులు చెట్టుకు కట్టి కాల్చి చంపించినారన్నా’’ (తెలంగాణ పోరాట పాటలు, పుట-123)
పోరాటంలో స్త్రీల పాత్ర కూడా చాలా ఎక్కువ అని చెప్పవచ్చు. గ్రామ రక్షక దళాల్లో పాల్గొన్న యువకులని పోలీసు వారు అరెస్టు చేసి క్యాంపులలో పెట్టినప్పుడు ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడానికి మహిళలు ఎంతగానో కృషి చేశారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వీరోచిత పటిమను చూపించిన మల్లు స్వరాజ్యం గారికి కూడా జనగామ ప్రాంతంతో అనుబంధం ఉంది. కామారెడ్డి గూడెంలో ఉన్నటువంటి తమ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి తరచూ వస్తూ, ఉద్యమ కార్యక్రమాలు ఇక్కడి నుంచే నిర్వహించేది. రామచంద్రారెడ్డి అఘాయిత్యాలను, నిజాం రాజు దౌర్జన్యాలను ఆడవారు పాడుకునే బతుకమ్మ పాటల రూపంలో కైగడుతూ గ్రామ గ్రామాన రాత్రి సమయాలలో చుట్టుకాముల రూపంలో, బతుకమ్మ పాటల రూపంలో ప్రజలకు వివరించేవారు. భారతి భారతి ఉయ్యాలో అంటూ సాగే బతుకమ్మ పాటల బాణి దొరల, దౌర్జన్యాలను వివరిస్తూ సాగుతూ ఉండేవి. ఉయ్యాల పాటలు ఎక్కువగా స్త్రీలు నాట్లు, కలుపు, కోతల పని చేస్తూ మరియు రాత్రులు వినోదం కోసం చుట్టూ కాముడు వేస్తూ పాడుకుంటారు. ఉయ్యాల పాటల పల్లవికి భారతి, చెల్లెలా మొదలైన పదాలని ప్రతి చరణం చివర పాడుకుంటారు. ఈ పాటలల్లో ప్రజా కంటకుల గురించి ప్రజావీరుల గురించి పాడుకుంటారు.
‘‘ఇస్నూరి గ్రామాన ఉయ్యాలో….
ఏసుమంటి సంగతి ఉయ్యాలో…ఏ తీరుగున్నది ఉయ్యాలో…
ఇస్నూరి దోరోడు ఉయ్యాలో…ఎంత పాపిస్టోడు ఉయ్యాలో…
అప్పుడు దోరోడు ఉయ్యాలో… ఏమేమి చేసిండు ఉయ్యాలో…
ప్రజల నోరు గట్టి ఉయ్యాలో… బంగాళా గట్టి ఉయ్యాలో…
అప్పుడు దొరోడు ఉయ్యాలో … ఏమేమి చేశాను ఉయ్యాలో…
12 మందిని ఉయ్యాలో … జీతగాళ్ళను పిలిచి ఉయ్యాలో’’ …
అంటూ సాగే ఈ పాటలో దొర గడి నిర్మాణం కోసం ముసునూరు గ్రామంలో ప్రజలను కట్టుబట్టలతో ఇండ్లను విడిచి వెళ్లగొట్టి వారి ఇంటి స్థలాలను ఆక్రమించుకొని ఆ స్థలంలో గడిని నిర్మాణం చేయించినటువంటి ఒక సంఘటనను వివరించారు ఇలాంటి అనేక దౌర్జన్యాలని వివిధ రూపాలలో వివిధ బాణీల్లో పాటలు కడుతూ వివరించేవారు.
భూపోరాటం- భూ పంపకం
ఈ విధంగా పాటల ద్వారా ప్రేరేపితులైన తెలంగాణ ప్రజలు వారు సాధించిన ప్రతి విజయం మీద ఒరిగిన ప్రతి వీరుని మీద ఆనాడు పాటలు రాసుకునేవారు, పాడుకునేవారు. చదువు సంధ్యలు లేకపోవచ్చు గాని బతుకు తెరువులో గుండె బరువును తగ్గించుకోవడానికి తమ బాధలు, వీరగాథలు పదం కట్టుకొని పాడుకోవాలన్న ఇంగితం ప్రతి కాలంలోని పేదవారికి ఉంటుంది. సామాన్యులు ఈ విధంగా సామాజిక సాహిత్యాన్ని సృష్టించుకుంటూ ఉంటే విద్యావంతులైన కవుల ప్రక్షణ నిలబడి వాళ్ళ కష్టాలను కన్నీళ్లను తొలగించే సాహిత్యాన్ని నిర్మించారు. సంఘం యొక్క కార్యక్రమాలు తెలంగాణ మారుమూల గ్రామాలలోకి కొద్దికొద్దిగా విస్తరిస్తున్న సందర్భంలో తరతరాలుగా అడవులు నరికి, బావుల్ని తొవ్వుకొని వ్యవసాయం చేసే గిరిజనుల భూములను కబ్జా చేసుకోవడం కోసం నాటి దొరలు ప్రయత్నాలు చేశారు. కానీ అప్పటికే పోరాట తత్త్వాన్ని పుణికి పుచ్చుకున్న ప్రజలు ఒడిసెలతో, రోకళ్ళతో, కారంపొడులతో దొరలను ఎదుర్కొన్నారు. ధర్మాపురం మైదం చెరువు కింద 30 ఎకరాల భూమిని లంబాడాల నుండి దోచుకోవడానికి ప్రయత్నం చేసి ఎనిమిది మందిని సజీవ దహనం చేసి భూమిని లాక్కున్నారు. ఆ సమయంలో కూడా మహిళలు, పిల్లలు, వృద్ధులు అనేక రకాలుగా పాటలు పాడుకుంటూ దొరలను ఎదిరించారు. రాత్రిపూట భూములలో కాపలా ఉండేవారు.
‘‘చేను కాపల మనం ఉంటే /
చేలో పందులు పడవు పశువులు ఎన్నడు రావు
వేగంబున మీరు రండి /
వెనుకబడి ఉన్న స్త్రీలను వెంటేసుకొని రండి’’
అంటూ ప్రతి ఒక్కరిని పోరాటంలో భాగస్వాములుగా చేస్తూ వారి భూమిని కాపాడుకోవడం కోసం అనేక రకాలుగా ప్రయత్నిం చారు. ఇలా ప్రజలు ప్రజా పోరాటాన్ని అందులో అసువులు బాసిన వీరులను తలుచుకుంటూ జనగామ ప్రాంతం నుంచి పాటలు వెలుబడ్డాయి.
‘‘మొండ్రాయి గ్రామాన చూడు
జారాతు ఠాను బట్టి / వందలాది ప్రజలు
వలవలగా ఎడవంగా / నిలబెట్టి కాల్చీరన్నో’’
అంటూ తమ భూమిని రక్షించుకోవడం కోసం ప్రజలు చేసిన ఉద్యమాల్ని సహించని నాటి దొరలు ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్నటువంటి ఠాను నాయక్‌ను అందరూ చూస్తుండగానే చెట్టుకు కట్టేసి కాల్చి చంపిన సంఘటనను ఉద్యమంలో ఒక ప్రార్థన గీతంగా మలుచుకుని పాడేవారు నాటి జనగామ ప్రాంత కవులు.
దొరలకు, భూస్వాములకు, రజాకార్లకు వ్యతిరేకంగా దళాల నిర్మాణం చేపట్టిన తర్వాత సంఘానికి సంకేతంగా ఎర్రజెండా ఎగిరింది. సంఘం పేరు మీద వచ్చిన పాటలన్నీ కూడా ఎర్రజెండా తన ఖాతాలో వేసుకుంది. కొన్ని వందల పాటలు ఎర్రజెండా పేరు మీద వచ్చాయి. ఎర్రజెండా ఎగిరిన చోట భూస్వామ్య పెత్తనం లేదన్న విషయం తేలిపోయింది. పోలీసు దాడులను తిప్పి కొట్టడానికి దళాలు ముందుకు వచ్చాయి. దొరల, భూస్వాముల అదనపు భూములను పంచే కార్యక్రమాన్ని చేపట్టాయి. రైతులు సాగు చేసుకుంటున్న భూముల నుండి భూస్వాములు భేదకలు చేయడం ఆపు చేసిన తర్వాత మళ్లీ ఆ భూములను రైతులను ఆక్రమించుకున్నారు.
‘‘రైఫిల్లు చేతబట్టి రణమందు దూకి బల్‌ దండిగా పోరి
రైతు రాజ్యము కోరి పోరాడే వీరు వీరాదీ వీరులు
……………………………………………..
రైతు కూలీ కల్సిమెల్సి రాజ్యాలు ఏలే రోజులు వచ్చే’’
(వయ్యా రాజారం, తెలంగాణ పోరాట పాటలు, పుట- 117)
దొరల ఆధీనంలో ఉన్న బీడుపడిన భూమిని చూసి రైతు ఎంతో బాధపడేవాడు అతని కళ్ళ ముందున్న భూమి తనది కాదని. అలాంటి పరిస్థితి మారి రైతు చాలా ఏళ్ల తర్వాత సగర్వంగా తన భూమిలో నూతన పంటలు పండిరచుకోగలిగాడు. వెనకబడిన తెలంగాణలోని భూమి పచ్చ పచ్చని పైరుతో నిండిపోతుంది అని భావించారు. ఇలాంటి చారిత్రాత్మక సంఘటనలకి సజీవ సాక్ష్యాలుగా నాటి పాటలు మన కళ్ళముందు కనిపిస్తాయి.
సైనిక చర్య ప్రభావం
సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ నేతృత్వంలో జరిపిన సైనిక చర్య ఫలితంగా 1948 సెప్టెంబర్‌ 17న ఇండియన్‌ యూనియన్‌ సైన్యాలు నిజాం సైన్యంపై సంపూర్ణంగా పట్టు సాధించాయి. నిజాం రాజు తను లొంగిపోతున్నట్లు అంగీకరించి ఇండియన్‌ యూనియన్‌లో నిజాం రాజ్యాన్ని విలీనం చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇదిలా ఉండగా సాయుధ దళాల ప్రతిఘటనకు భయపడి నగరాలకు పారిపోయిన దొరలు, భూస్వాములు ఖద్దరు బట్టలతో, గాంధీ టోపీలతో రాజకీయ నాయకులుగా మారారు. భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా చేసిన పోరాటాల ద్వారా సాధించుకున్న విజయాలను, గ్రామ కమిటీలను కాపాడుకోవాలని ప్రచారం ప్రారంభమైంది. ఈ దశలో జనగామ తాలూకాలో ఒక పాట బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది.
‘‘మనకొద్దు దోపిడి రాజ్యం / మళ్లీ మనకొద్దు దొరల రాజ్యం
వద్దు మనకు వద్దు బానిస రాజ్యం / తినగ తిండి కట్టు
కొన గుడ్డలు అడిగితే / కనులెర్ర చేస్తుంది రాజ్యం
అల్లరి అని నిందవేస్తుంది రాజ్యం/శాంతి అని గొంతులను గోయూ రాజ్యం
రక్షణయని ప్రజల భక్షించు రాజ్యం/అన్నమన్న మన్ను చూపే రాజ్యం
అన్నమన్న ప్రజల నణిచివేస్తుంది రాజ్యం ’’ (తెలంగాణ పోరాట పాటలు, పుట- 118)
అంటూ ఇండియన్‌ యూనియన్‌లో కలిసినప్పటికీ రాజకీయంగా దొరల ఆధిపత్యం ఎక్కువగా ఉన్నటువంటి సందర్భాన్ని గమనించిన ప్రజలు వివిధ పాటల రూపంలో వాళ్ళ నిరసనను తెలియజేశారు. కొత్త రాజకీయాల దుష్ట పోరాటాన్ని ప్రచారం చేయవలసినటువంటి అవసరం ఏర్పడిరది. అందువల్ల ప్రచార సాధనాలు మార్పు చెందాయి. సైనిక చర్య తర్వాత పోరాటం కొనసాగింపు కోసం మౌలిక రూపాలతో గ్రామాల్లో ప్రచారాన్ని ఎక్కువగా చేయవలసి వచ్చింది.
‘‘ఓరి! మూట ముల్లే నెత్తిన బెట్టుక
ఏ ఊరెలెతావు ఏడ నువ్వుంటావు
ఎక్కడ బోయిన ఇదే విప్లవం
మూట ముల్లె కాలిపోతుంది
నైజాం మోడు నలిగిపోతాడు
మధ్యనే నువ్వు మాడిపోతావురో నెహ్రూగా ’’ (వయ్యా రాజారం, తెలంగాణ రైతాంగ పోరాట పాటలు, పుట-130 )
పోలీసు చర్య ద్వారా దళాలను, విప్లవాన్ని అణచాలని ఆలోచన చేసిన జవహర్‌ లాల్‌ నెహ్రూకి పాటల ద్వారా విప్లవం అనేది ఉదయిస్తున్న సూర్యునిలా నిరంతరం మానవాళితోనే ఉంటుందని కవులు ముందే హెచ్చరించారు.
దళ సభ్యులు ఇక్కడ ఒకరికొకరు ప్రభావితం చేసుకునేవారు. తమ ప్రచారాన్ని కొనసాగించేవారు ఇక్కడి పాటలల్లో వారి అవసరాలను, ప్రయోజనాలను మరియు యూనియన్‌ సైన్యానికి వ్యతిరేకంగా పాటల నిర్మాణం జరిగింది. దళాల మీద నిర్బంధం ఎక్కువైనకొలది కార్యకర్తలతో పాటు కవులు, గాయకులు, కళాకారులు కూడా గ్రామాలలో ప్రజలు పగలు తిరగలేక పోయారు. కొంతమంది అడవుల్లోకి వెళ్లిపోయారు. ఈ పరిస్థితిని గుర్తించిన స్త్రీలు ప్రజలలో చైతన్యం కలిగించడానికి వారు పొలాలలో చేసే పని పాటల సమయంలో పాటలను కట్టుకొని పాడేవారు. ఈ పాటలు ఇప్పటికీ శ్రమ చేసే సమయంలో పాడుకుంటున్నారు.
సువ్వీ సువ్వన్నాల్లారా అంటూ సాగే రోకటి పాటను వయ్య రాజారామ్‌ కైకట్టి స్త్రీల ద్వారా ప్రచారం చేయించాడు.
‘‘సువ్వి సువ్వన్నల్లారా మాయన్నల్లారా
సువ్వి అని పోటు వేసి పాటా పాడంగా నేను ఒడ్లు దంచంగ
అట్లట్ల పోయేటి వారాలెవ్వరు ఆ ధీరులెవ్వారు
అడవుల్లా దిరిగేటి ఆంధ్ర బిడ్డలు
మన కన్నా బిడ్డలు / చిన్ని మన తమ్ముళ్లు చీకాటి దొరలు
వారు చీకటి దొరలు’ (జయధీర్‌ తిరుమల రావు, తెలంగాణ పోరాట పాటలు, పుట. 117)
ఈ విధంగా స్త్రీలు పొలం పనులకు పోయినట్లుగా సైన్యాలను నమ్మించి గెరిల్లా యోధులకు సద్దిమూటలు పట్టుకుపోయేవారు. వారు పాడుకునేటటువంటి పాటలు దళాల వారికి చెప్పి సంతోషపడేవారు. అలా పోయినటువంటి స్త్రీలు తమ పాటలను దళ సభ్యులకు, దళ సభ్యులు రాసిన పాటలను స్త్రీలకు వినిపించేవారు. ఈ విధంగా పాటల్ని ప్రచారం చేసేవారు. కానీ తర్వాత గుట్టలల్లో, ఊరి పొలిమేరల అడవులలో దాక్కున్న దళాలు సైన్యంచేపట్టే వలయాకారపు దాడులవల్ల చెల్లాచెదురైపోయాయి. సామాన్య ప్రజానీకానికి దళాలవారు క్రమక్రమంగా దూరమయ్యారు. కానీ ఏదో ఒక విధంగా దళ సభ్యుల పాటలు మౌఖికరూపంలోకి మారి ఊర్లలోకి ప్రవేశించేవి. ఆ వీరుల వీరోచిత కార్యాలు ప్రజల పాటల్లో వినిపిస్తూ ఉండేవి. ఇలా అజ్ఞాతంలో ఉన్న వీరులు అమర జీవులైనటువంటి యోధుల గాధలు ప్రజల జీవితాలలో గుండెల్లో జీవంగా పాటల రూపంలో నిలిచిపోయాయి. ఆ తరువాత దళాలన్నీ కూడా ఏటూరునాగారం, ములుగు వంటి ప్రాంతాలకు వెళ్లడంతో జనగామ ప్రాంతంలో తెలంగాణ రైతంగ సాయుధ పోరాటం ఉద్యమానికి సంబంధించిన పాటల ప్రభావం కొంతమేర తగ్గిందనుకోవచ్చు.
ముగింపు
తెలంగాణ సాయుధ పోరాటానికి జనగామ ప్రాంతం ఒక దిక్సూచి ఈ ప్రాంతంలో జరిగిన ప్రతి ఒక్క సంఘటన తెలంగాణ ప్రజలను స్వేచ్ఛా వాయువులుగా పీల్చుకునే విధంగా చేసింది. దానిలో పాట పాత్ర చాలా గొప్పది. ఉద్యమకారులుగా అనేక పాటలు రాసిన కవులు తర్వాత రాజకీయ పరిణామాల వల్ల పోరాట పాటలను రాయడం తగ్గించారు. కానీ వారి స్ఫూర్తితో తెలంగాణ ప్రాంతంలో జరిగిన అనేక ఉద్యమాలలో సామాజిక చైతన్యంలో తమ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం జనగామ ప్రాంత కవులు తమ కలాన్ని గళాన్ని ప్రజా శ్రేయస్సు కోసమే వాడుతున్నారు. నాటి నుండి నేటి వరకు జనగామ ప్రాంతం ఉద్యమ సాహిత్యంలో పాటను శిఖరాగ్రాన నిలబెట్టిందని చెప్పవచ్చు. జనగామ ప్రాంతం కవుల కాణాచి అలాంటి ప్రాంతంలో నుండి వెలుగులోకి వచ్చిన అనేక మంది కవులు గురించి తెలుసుకోవడం మన బాధ్యత ఈ పరిశోధన వ్యాసం ద్వారా వివరించిన పాటలలో ఈ ప్రాంతానికి చెందిన కవుల గొప్పతనం తెలంగాణ సమాజానికి పరిచయం అవుతుందని ఆశిస్తున్నాను.
ఉపయుక్త గ్రంథాలు

  1. తిరుమల రావు జయధీర్‌, 1990 జనవరి, తెలంగాణ పోరాట పాటలు, ప్రథమ ముద్రణ , పద్మావతి ప్రింటర్స్‌, హైదరాబాద్‌.
  2. నారాయణరెడ్డి రావి, 2015, వీర తెలంగాణ నా అనుభవాలు-జ్ఞాపకాలు, నవచేతన పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌.
  3. రమేష్‌ పన్నీరు, 2021, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కడవెండి ప్రజల వీరోచిత పోరాటం, నవతెలంగాణ పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌.
  4. వెంకటేశ్వర్లు దేవులపల్లి. 2015, జనగామ ప్రాంత ప్రజల వీరోచిత పోరాటం, రెండవ ముద్రణ, పోరునేల పబ్లిషింగ్‌ హౌస్‌, హైద్రాబాద్‌.
  5. శంకర్‌ రావ్‌ ఎలికట్టె, 2016 జూలై, ద్వితీయ ముద్రణ, తెలంగాణ రైతాంగ పోరాట భూమిక చాకలి ఐలమ్మ, నవ చేతన పబ్లిషింగ్‌ హౌస్‌, హైదరాబాద్‌.

రేశపల్లి భానుచందర్‌
పరిశోధక విద్యార్థి,
డా.బి.ఆర్‌.అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం.
ఫోన్‌ : 9160381693

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *