కాలమెంత కరుణ కాంచుచున్న దిలను
సమరవర్తియై తాను సాగుచుండు
ఏ విరామము నింత నెపుడైన గోరక
నెవరితో సంబంధ మెరుగకుండు
తా బుట్టిన దెపుడొ తా నాగున దెపుడొ
తా జీవకోట్లలో దనరుచుండు
తత్పరతను గాంచ తన సాటి యెటలేరు
వేగమందు దనకు వేఱు లేరు
నిష్ఠ దప్పక నీల్గక నియమ విధిని
వెలితి జూపక పరుగున వెళ్ళుచుండి
సాక్షియై నిల్చి యందరి చరిత దెలిసి
తాను గాదిjైు పుట్టును తప్పకుండ
వేప పూతల కాలమేదిల? వేళ మార్పుకు సూచ్చమై
కాపు గాసెడి కాలమేదిల? కమ్మ మామిడి తీపికై
తాపమార్పెడి చింత పుల్పుల తల్చు కాలమదేదియో
రూపమే కనరాని వత్సర రూపమౌను యుగాదిగన్
ముదమగును సమయము గనక
ఎద యెదను సుమధుర స్మృతుల యెరుకకు నిధిjైు
మది నిలుచును పికపు సుధలు
వదలని గురుతుల వలపుల వనితగ నెపుడున్
కాల వృక్షమునందు గనపట్టు నెప్పుడూ
బ్రభవ విభవలాది పత్రములుగ
శాఖోపశాఖలై షష్ట్యబ్ది చక్రము
ఆయువీయగ నిల్చు ననవరతము
యుగయుగంబుల బల యుతపు గాదులు
కాండమై యలరును గట్టి పడుచు
సూర్యచంద్రుల దీప్తి శుద్ధోదకము కాగ
విలసత్ ధృతియు కల్గి పెరుగుచుండు
శీత వర్షాతపములను పూత లిడుచు
కష్టసుఖ ఫలములొసగి కడకు తాను
లయమొనర్చు నీ గతిన లీలా వశమున
నేడు క్రోధి తాను చిగురై నిలువజేరె
మా నవ వాంఛలన్నిటికి మంగళరూపము గల్గజేయుమా
మానని గాయమేడ్పులను మాన్పుచు జల్లగ మమ్ము గాచుమా
తేనెల నింపు శుద్ధమగు దీప్తిగ భాసిలు వాక్కు నీయుమా
మా నవ వర్ష క్రోధివిక మమ్ముల జేరెడి క్రోధమార్పుమా!
మా ‘రామ’ణీయమౌ మందిర ప్రభ జూపి
శోభకృత్తెల్లెడన్ శుభము పలికె
కాశ్మీరవాణి నీ కన్నుల నిల్పెను
శోభకృత్తీవిధి సుందరాంగి
కాశీశు చరితపు కామ్యపథము నిచ్చి
శోభకృత్తీరీతి శోభగూర్చె
సర్వ మంగళ రూప ముర్వి కామాఖ్యగా
శోభకృత్తిట పున: సొబగు గూర్చె
క్రోధి స్వాగతమిక నీకు! గుండె నిండి
యున్న మంగళ క్రియలను మిన్న జేయ
బూని కీర్తి నిల్వవలెనో భువిని రామ్మ!
స్వాగతమ్ము సహృదయ సంతసంబు తోడ
డా. వొజ్జల శరత్ కుమార్
ఫోన్ : 996 353 3937