తెలంగాణ నాటక సాహిత్యం – ఒక విహంగ వీక్షణం

‘కావ్యేషు నాటకం రమ్యం’ అన్నారు అలంకారికులు. నాటకం వినోదంతో పాటు విజ్ఞానాన్ని అందిస్తుంది. సామాజిక స్పృహను కలుగజేస్తుంది. జనులను చైతన్యవంతం చేస్తుంది. తెలంగాణలో వచ్చిన అనేక ఉద్యమాలపై నాటకం ప్రభావం ఎంతో ఉంది. ఆనాటి ప్రాచీన సాహిత్యం నుంచి నేటి ఆధునిక కాలం వరకు ఎన్నో నాటకాలు తెలంగాణాలో ఆవిర్భవించాయి. మొదట పౌరాణిక, చారిత్రక నాటకాలు వచ్చాయి. ఆనంతరం ఉద్యమ స్వభావంతో కూడిన నాటకాలు వచ్చాయి. తర్వాత సాంఘిక నాటకాలు వచ్చాయి.
సామాజిక, రాజకీయ, జాతీయ, సాహిత్య, సాంస్కృతికోద్యమాల్లో క్రియాశీలమైన పాత్రను పోషించిన తెలంగాణ నాటక సాహిత్యం విశేషమైన కృషి సల్పింది. నాటకం దృశ్యకావ్యం, ప్రదర్శన యోగ్యమైనది. అన్ని రసాలను పలికించగల ఏకైక సాహిత్య ప్రక్రియ నాటకం. తెలంగాణలో నాటక రచన సంస్థానాల కాలం నుంచి పురుడుపోసుకున్నది. పండిత పామరజనకంగా అందరికీ అందుబాటులో ఉండి ప్రదర్శించే కళ నాటకం. నాటకం పురాణాల నుంచి సామాజికం వైపు నడిచి అనేక రూపాల్లో అభివ్యక్తమైంది. నాటిక, రూపకం, భువనవిజయం వంటి రూపాల్లో నాటకం రంజింపజేసింది. దశ రూపకాల్లో నాటకం సర్వసమగ్రమైన కళారూపం. నాటకం ప్రారంభం నుంచి నేటివరకూ అనేక మార్పులకు లోనై సమగ్రతను పొంది తన స్థానాన్ని భద్రపరచుకుంది. తెలంగాణలో సమకాలీన సమస్యలను పట్టి చూపించే సాంఘిక నాటకాలు అనేకం వచ్చాయి. జనజీవన పరిస్థితులను, సమస్యలను తెలుపుతూ రాయబడ్డ నాటకాలు తెలంగాణాలో విరివిగా వచ్చాయి.
కాకతీయ సామ్రాజ్యాన్ని క్రీ.శ. 1289 – 1323 మధ్యకాలంలో పాలించిన ప్రతాపరుద్రుడు ‘యయాతి చరిత్ర, ఉషారాగోదయం’ అనే సంస్కృత నాటకాలను రచించాడు. రెండవ ప్రతాపరుద్రుడి కాలంలో ఉన్న విశ్వనాథుడు తాను రాసిన ‘ప్రతాపరుద్ర యశోభూషణం’ అనే లక్షణ గ్రంథానికి అనుగుణంగా ఆయన ‘‘ప్రతాప కల్యాణము’’ అనే నాటకాన్ని రచించాడు. అలాగే ఇదే కాలంలో జీవించిన నరసింహుడు (1289-1323) అనే కవి ‘‘కాదంబరీ కల్యాణం’’ అనే నాటకాన్ని రచించినట్లు సాహిత్య పరిశోధకుల అభిప్రాయం. రాచకొండ రాజ్యాన్ని పరిపాలించిన అనపోతనాయకుడు (1360-1385) రాజు ‘అభినవ రాఘవము’ అనే నాటకాన్ని రచించాడు. సర్వజ్ఞ సింగభూపాలుడు సంస్కృత నాటక రచయిత. కాకతీయుల సామ్రాజ్య పతనం అనంతరం రాచకొండ రాజధానిగా రేచర్ల వెలమరాజులు తెలంగాణను పాలించారు. 1381-1405 ప్రాంతంలో పాలించిన ఈ రేచర్ల వెలమరాజు ‘‘రత్నపాంచాలిక లేదా కువలయావళి’’ అనే నాటికను రచించాడు. కువలయావళిగా అవతరించిన భూదేవిని శ్రీకృష్ణుడు వివాహం చేసుకోవడం ఇందులోని ఇతివృత్తం. ఇది స్వతంత్ర రచన.
తెలంగాణలో వెలిసిన సంస్థానాలలో తెలుగు, సంస్కృత నాటకాలు విరివిగా వచ్చాయి. సంస్థానాల ఖిల్లాగా పేరుగాంచిన ఉమ్మడి పాలమూరు జిల్లా నుంచే అనేక నాటకాలు వచ్చాయి. గద్వాల, జటప్రోలు, వనపర్తి, ఆత్మకూరు, అలంపురం, గోపాలపేట తదితర సంస్థానాల నుంచి అనేక నాటకాలు వెలుగుచూశాయి. ప్రాచీన కళారూపమైన యక్షగానం నాటకానికి పూర్వరూపమని చెప్పవచ్చు. ఈ సంస్థానాలలోనే అనేక యక్షగానాలు వచ్చాయి. ఆయా సంస్థానాలలో నిర్వహించే జాతర్లలో, బ్రహ్మోత్సవాలలో ఈ యక్షగానం ఆడేవారు. సంస్థానాల కాలం నుంచే యక్షగానం పురుడు పోసుకుని తదనంతర కాలంలో నాటకంగా ఊపిరిపోసుకుంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలోని జటప్రోలు సంస్థానాధిపతి సురభి మాధవరాయలు ఆస్థాన కవి అయిన ఎలకూచి బాలసరస్వతి ‘రంగకౌముది’ అనే నాటకాన్ని రచించాడు. 1570-1650 మధ్యకాలానికి చెందిన ఆయన అసలు పేరు వెంకటకృష్ణయ్య. 1730 సంవత్సరంలో జన్మించిన తిరుమల బుక్కపట్నం కిరీటి వెంకటాచార్యులు ‘ఉషాపరిణయం’ అనే నాటకాన్ని రచించాడు. ఆయన తమ్ముడు తిరుమల బుక్కపట్నం బుచ్చి వెంకటాచార్యులు ‘‘కల్యాణ పురంజనం’’ అనే నాటకాన్ని రాశాడు.
వనపర్తి సంస్థానాధీశుడు ‘‘అష్టబహిరీ’’ గోపాలరావు ‘‘శృంగారమంజరీ భాణము, రామచంద్రోదయము’’ అనే సంస్కృత నాటకాలను రాశాడు. ఇతడు 17 వ శతాబ్దానికి చెందినవాడు. ఇదే సంస్థానానికి చెందిన హొసదుర్గము కృష్ణమాచార్యులు అనేక సంస్కృత నాటకాలు రాశాడు. ఇందులోని కొన్ని సంస్కృత నాటకాలను మాదిరాజు విశ్వనాథరావు తెలుగులోకి అనువాదం చేశాడు. అలాగే కాళిదాసు ‘‘అభిజ్ఞాన శాకుంతలం’’ ను అనువదించాడు. ప్రసిద్ధ సంస్కృత పండితుడు కప్పగంతుల లక్ష్మణశాస్త్రితో కలిసి బిల్హణుడి ప్రఖ్యాత నాటకం ‘‘కర్ణసుందరి’’ ని అనువదించాడు. ఆత్మకూరు సంస్థానంలోని బాలసరస్వతి బుక్కపట్నం శ్రీనివాసాచార్యులు (1862 – 1920) అనేక సంస్కృత నాటకాలను రచించాడు. ‘‘కిరీటి వెంకటాచార్య విజయ వైజయన్తి’’ అనే సంస్కృత నాటకాన్ని రచించాడు.
నల్లగొండ జిల్లా నారాయణపుర సంస్థానంలో జన్మించిన రామకవచం కృష్ణయ్య (క్రీ.శ.1863 – 1926) ‘‘హరిప్రియ’’ అనే నాటకాన్ని రచించాడు. మెదక్‌ జిల్లా మద్దికుంటకు చెందిన కందాళ సుందరాచార్యులు ‘‘రాజసూయం, పుష్పవేణి విలాసం, సంపూర్ణ రామాయణం, తిరుమంగయాళ్వారు చరిత్రం’’ అనే నాటకాలను రచించాడు. మామిడిపల్లి సాంబశివశర్మ (క్రీ.శ.1870 లో జననం) ‘‘మంగళ హారతులు, కీర్తనలు, భద్రావతి, త్యాగయ్య’’ అనే నాటకాలను రచించాడు. మెదక్‌ జిల్లా సిద్దిపేటలో జన్మించిన గడ్డం రామదాసు ‘ఋతుధ్వజ’ అనే నాటకాన్ని రచించాడు. 19వ శతాబ్దానికే చెందిన ప్రబంధం అనంతయ్య ‘‘హరిశ్చంద్ర, బిల్హణీయం’’ అనే నాటకాలను రాశాడు. అలాగే మహబూబ్‌నగర్‌ జిల్లా గొరిటకు చెందిన చెన్నకృష్ణమరాజు ‘‘ఋతుధ్వజ’’ నాటకాన్ని రాశాడు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ కు చెందిన చందాల కేశవదాసు ‘బలిబంధనం, కనకతార’ అనే నాటకాలను రచించాడు. వరంగల్‌ జిల్లాకు చెందిన ఒద్దిరాజు సోదరులు బహుముఖ ప్రజ్ఞాశాలురు. ఒద్దిరాజు సీతారామచంద్రరావు ‘మోహినీ విలాసం, ప్రేమవివాహం, నవనాగరిక భార్య, మైత్రీపరిణతి, ఎరువు సొమ్ము, జమీందారి తీరు, మేనరికము, మేనత్త, మగసంసారం, ఆడపెత్తనం’ వంటి నాటికలను రచించాడు. నల్లగొండ జిల్లా హుజూర్‌నగర్‌ తాలూకా రేపాలకు చెందిన కె.ఎల్‌. నరసింహారావు దాదాపు 25 నాటికలు, నాటకాలు రచించాడు. ‘‘ఆదర్శ లోకాలు, గెలుపు నీదే, గొడిగంటలు, అడుగుజాడలు (1956), కొత్తగుడి, క్రీనీడలు’’ వంటి నాటకాలను రచించాడు. నల్లగొండ జిల్లాకు చెందిన గవ్వా జానకిరామిరెడ్డి ‘‘దేశబంధు’’ అనే మూడంకాల నాటకాన్ని రాశాడు.
ఇంకా భాగి నారాయణమూర్తి ‘పరీక్ష చదువు’ నాటకాన్ని, శేషుబాబు ‘అశోక రాజ్యం’ నాటకాన్ని రచించారు. మెదక్‌ జిల్లాకు చెందిన వెల్దుర్తి మాణిక్యరావు ‘దయ్యాల పన్గడ’ అనే నాటకాన్ని ఆ జిల్లా మాండలికంలో రాశాడు. హైదరాబాద్‌ కు చెందిన ఎస్‌.కె. ఆంజనేయులు ‘‘రాధికా స్వాంతనం, స్మృతి ప్రతీక, శిరోమణి, వలయం, ఆత్మీయులు, రాగరాగిణి, పవిత్రులు, చావకూడదు, నీడలు – నిందలు’’ వంటి పలు నాటికానాటకాలను రచించాడు. ఆర్‌.వి.ఎస్‌. రామస్వామి ‘‘చీకటి కోణాలు, వలయం, సుడిగాలి, గాలివాన, కెరటాలు, వెల్లువ, శ్రీమాన్‌ శ్రీపతి, వర్ధంతి, గాలిపటం’’ వంటి నాటకాలను రచించాడు.
ప్రసిద్ధ సంపాదకులు, చరిత్రకారుడు సురవరం ప్రతాపరెడ్డి ‘‘భక్త తుకారం, ఉచ్ఛల విషాదము’’ అనే నాటకాలను రచించాడు. శేషాద్రి రమణ కవులు ‘విచిత్ర వివాహం, సుశీల, చంద్రరేఖ’ వంటి సామాజిక నాటకాలను రచించాడు. సందేశాత్మక రచనగా ‘విచిత్ర వివాహం’ నాటకం రచించబడిరది. ‘చంద్రరేఖ’ నాటకంలో అస్పృశ్యత, నిరుద్యోగం, బాలవితంతువు, రైతుల శ్రమ వంటివి పేర్కొనబడ్డాయి. తెలంగాణా నాటకరంగంలో తొలి ప్రయోగాత్మక నాటకమైన ‘భిషగ్విజయం’ ను డాక్టర్‌ చొల్లేటి నృసింహ్మ రామశర్మ రచించాడు. ఈ నాటకం ఆయుర్వేద వేదవిజ్ఞానానికి సంబంధించినది. ప్రఖ్యాత నాటక కర్త, నాటక సాహిత్య పరిశోధకుడు డాక్టర్‌ పి.వి.రమణ ‘ఆకు రాలిన వసంతం, వెంటాడే నీడలు, దేవతలెత్తిన పడగ, చలిచీమలు, మహావీర కర్ణ, ప్రతాపరుద్ర, మహస్సు, మానవతకూ నిండాయి నూరేళ్లు, లోలకం, మృత్యునీడ, కళ్యాణమే ఒక కానుక, ప్రేమ పోరాటం, గురువుగారూ మన్నించండి’ వంటి నాటికా నాటకాలను రచించాడు. ఇవన్నీ బహుళ ప్రాచుర్యం పొందాయి. ఇంకా వానమామలై వరదాచార్యులు ‘రాజ్యశ్రీ’, దాశరథి ‘వాసనలేని పూలు’, పాములపర్తి సదాశివరావు ‘ఆత్మగౌరవం, కర్తవ్యం, పోరాటం’ నాటకాలను రచించాడు. ఎం.మధుసూదనరావు ‘సార్థకజీవి’, వల్లంపట్ల నాగేశ్వరరావు ‘మాయాజూదం, రాతిబొమ్మ, కళకారులారా కళ్ళు తెరవండి, మహిమా నీ చోటెక్కడ, ఎలచ్చన్లచ్చినయ్‌’ వంటి నాటకాలు వివిధ సామాజిక రుగ్మతలపై మార్కెట్‌ మాయాజాలంపై రచించబడ్డ నాటకాలు. నల్గొండకు చెందిన ప్రముఖ కవి, విమర్శకులు, ప్రొఫెసర్‌ దేవరాజు మహారాజు ‘దయ్యాల సందడి’ అనే నాటకాన్ని తెలంగాణా భాషలో మొదటిసారిగా రచించాడు. కోదాటి లక్ష్మీనరసింహరావు ‘‘గెలుపు నీదే, ఆదర్శలోకాలు, అభాగ్యులు, స్వార్ధం, అడుగుజాడలు, కొత్తగుడి, అగ్ని పరీక్ష, వసంత భారతి, కొడిగట్టిన దీపాలు, కల్పతరువు, ప్రజాదేవత, పుట్టినరోజు పండుగ, మతిలేని మహారాజు, ముచ్చట్లు, అందరికీ చదువు’’ వంటివి రచించాడు. వరంగల్లుకు చెందిన తూము రామదాసు (1856 – 1904) ‘కాళిదాసు’ అనే నాటకం రాశాడు.
ఎ.ఆర్‌.కృష్ణగా ప్రసిద్ధిపొందిన అడుసుమిల్లి రాధాకృష్ణ ప్రముఖ నాటక రచయిత. ఆంగ్ల నాటకాలను అనేకం తెలుగులోకి అనువాదం చేశాడు. ఆస్కార్‌ వైల్డ్‌ ‘ఐడియల్‌ హజ్బెండ్‌’ ను ‘ఆదర్శమూర్తి’ (1967) పేరుతో, హెరాల్డ్‌ పింటర్‌ రచించిన ‘కేర్‌ టేకర్‌’ నాటకాన్ని ‘సంరక్షకుడు’ (1968) పేరుతో, ‘హ్యూయర్స్‌ ఆఫ్‌ కోల్‌’ నాటికను ‘చీకటివెలుగులు’ (1962) పేరుతో అనువదించాడు. ‘‘అరగంటలో అదృష్టం’’ వంటి స్వతంత్ర నాటక రచనలు కూడా చేశాడు. హైదరాబాద్‌కు చెందిన జమ్మలమడక శశిమోహన్‌ ‘‘కోహినూర్‌ ఫర్‌ సేల్‌, మాకు శాంతి కావాలి, మంచితనం మరోసారి చచ్చింది, మాకో నియంత కావాలి’’ నాటికలను, ‘‘కాగితం పులి, అశ్వత్థామా హతః, సిరికిన్‌ చెప్పడు’’ వంటి నాటకాలను రచించాడు.
తెలంగాణ సాయుధ పోరాటకాలంలో నాటికలు, నాటకాలు చాలా వచ్చాయి. ‘‘న్యాయం, సరబరాహి, పగ, వీరకుంకుమ, కాంగ్రెసా – అంగ్రేజా, శాంతిరక్షణ కోసం, రిపబ్లిక్‌ వెలిసింది, వీరనారి’’ వంటి నాటకాలు ఆవిర్భవించాయి. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకుని సుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కరరావులు కలిసి ‘మా భూమి’ నాటకాన్ని రాశారు. వీరిద్దరూ తెలంగాణకు చెందినవారు కాకపోయినా నల్లగొండ జిల్లాలో జరిగిన ప్రజాపోరాటాన్ని ఇతివృత్తంగా తీసుకుని వారు దీన్ని రాశారు. ఆ తర్వాత తెలంగాణ సాయుధ పోరాటం ఇతివృత్తంగానే వాసిరెడ్డి భాస్కరరావు ‘‘పోతుగడ్డ’’ అనే నాటికను రచించాడు. తెలంగాణ పోరాట చరిత్ర మలిదశను చిత్రించిన నాటకం ‘గెరిల్లా’. దీనిని సుంకర, భాస్కరరావులు రాశారు. ఈ నాటకానికి కూడా నల్లగొండ జిల్లాలో జరిగిన సాయుధ పోరాటమే ఇతివృత్తం కావడం విశేషం. ఈ గెరిల్లా నాటకాన్ని ఆరు రంగాలుగా రచించారు. శ్రీకాకుళ పోరాటం ప్రేరణతో తెలంగాణ నక్సలైట్‌ ఉద్యమానికి ఊపిరి పోసేందుకు సుంకర సత్యనారాయణ ‘‘వీరకుంకుమ’’, డాక్టర్‌ రాజారావు ‘‘వీరనారి’’ నాటికలను రాశారు. వీరిద్దరు కూడా తెలంగాణేతర రచయితలే కావడం గమనార్హం. తెలంగాణ సాయుధ పోరాటంలో మహిళల పాత్రను వీరనారి తెలియజేస్తుంది.
మహబూబ్‌ నగర్‌ జిల్లా నవాబ్‌ పేట్‌ మండలం ఇప్పటూర్‌ గ్రామానికి చెందిన కొత్లాపూర్‌ మఠం రాచయ్య గాంధీజీ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని ‘శ్రీ మహాత్మాగాంధీజీ జీవిత చరిత్ర’ అనే పేరుతో బృహత్‌ నాటకాన్ని రచించాడు. ఇది వందసార్లకు పైగా ప్రదర్శించబడిరది. ఇది సరళ గ్రాంథికంలో రచించబడ్డ నాటకం, గాంధీజీ జీవితంలోని ప్రధాన ఘట్టాలను ఈ నాటకం ఆవిష్కరిం చింది. నవాబ్‌పేట్‌ మండలానికి చెందిన దాయపంతులపల్లి చెన్నదాసు ‘మాయానాటకం, అశ్వత్థామ, బంగారు లేడి’ అనే నాటికలను రచించాడు. వనపర్తి జిల్లాకు చెందిన ఉమ్మెత్తల యజ్ఞరామయ్య ‘‘ధర్మచక్రం’’ పేరుతో నాటకాల సంపుటిని వెలువరించాడు. ఇందులో ధర్మచక్రం, అంగుళీమాల, వేనుడు, మహాకవి భారవి వంటి నాటకాలున్నాయి. ఇందులో ఒక పౌరాణికం, మూడు చారిత్రక నాటకాలున్నాయి. ఇందులోని ‘ధర్మచక్రం’ ఆకాశవాణిలో ప్రసారమైంది. గంధం కుప్పదాసు ‘‘యయాతి చరిత్ర’’ పేరుతో ఒక నాటకాన్ని రచించాడు. కవిగా, గేయకవిగా, నాటక కర్తగా పేర్గాంచిన టి. రామకృష్ణారెడ్డి ‘‘స్వప్నబాల, ఊర్వశి, ఉలూచి, ఉమర్‌ ఖయూమ్‌, కలువరాణి, ఏకాదశి, రాసలీల’’ వంటి సంగీత నృత్య నాటికలను రచించాడు. మహబూబ్‌ నగర్‌ పట్టణ కేంద్రానికి చెందిన గాధిరాజు సత్యనారాయణ రాజు ‘హనుమ సాక్షాత్కారం’ పేరుతో ఒక సాంఘిక నాటకాన్ని రచించాడు. ఇది అభయవీర హనుమాన్‌ క్షేత్ర మహిమను తెలిపే నాటకం.
ప్రముఖ నాటకకర్త బి.ఎల్‌.నరసింహారావు ‘కులం’ మొదలైన నాటకాలను రచించాడు. ‘కులం’ నాటకాన్ని తెలంగాణ మాండలికంలో రచించాడు. ఇందులో ప్రాంతీయ భాషాచైతన్యాన్ని ఆవిష్కరించాడు. మానవ పురోభివృద్ధికి, ప్రగతికి కులం అనేది ఎంత అవరోధంగా ఉంటుందో ఈ నాటకంలో తెలియజెప్పాడు. అనేక నాటక రచనల్లో తెలంగాణ భాషా మాండలికాలను ప్రవేశపెట్టి భాషాపరమైన ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. కరీంనగర్‌ జిల్లా నుంచి సురమౌళి గొప్ప నాటక సాహిత్యాన్ని ఆవిష్కరించాడు. ఆవిష్కరించడమే కాదు ‘‘ఎథియిస్ట్‌ బాయిస్‌ క్లబ్‌’’ అనే నాటక సమాజాన్ని స్థాపించి నాటకాలను వేయించాడు. సురమౌళి, రెడ్డి చినవెంకటరెడ్డిలు కలిసి అనేక నాటికలు రాశారు. వీరిద్దరూ కలిసి రాసిన నాటకం ‘కీలుబొమ్మలు’. ఈ కీలుబొమ్మలు నాటకం సమకాలీన గ్రామ పంచాయితీ వ్యవస్థ తీరుతెన్నులను కళ్ళకు కడుతుంది. పంచాయితీ వ్యవస్థ ద్వారా లబ్ధిపొందే అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు చేరనీయకుండా అడ్డుపడి సామాజికాభివృద్ధికి నిరోధకులుగా మారిన సజీవ దృశ్యాలను కీలుబొమ్మలు నాటికలో రచయిత సురమౌళి చక్కగా చిత్రించాడు. వరంగల్‌ జిల్లాకు చెందిన పొట్లపల్లి రామారావు ‘‘పగ, సరబరాహి, న్యాయం’’ వంటి నాటికలను రచించాడు.
నల్లగొండ జిల్లాకు చెందిన తిరునగరి రామాంజనేయులు పలు నాటకాలు, నాటికలు రాశారు. ‘‘వెట్టిచాకిరి’’ వంటి నాటికలను ‘‘తెలంగాణ, వీర తెలంగాణ’’ వంటి నాటకాలను రచించాడు. ఆనాటి తెలంగాణ ప్రజల జీవితాన్ని, పోరాటాన్ని ఇవి ప్రతిబింబించాయి. కవిగా, నవలారచయితగా ప్రసిద్ధుడైన చెరబండరాజు ‘‘గంజినీళ్లు, గ్రామాలు మేల్కొంటున్నాయి’’ అనే నాటకాలను, ‘‘టెంపరరీ లేబర్‌, పల్లె పిలుస్తోంది, వెన్నెల్లో మంటలు, సంఘర్షణ’’ అనే నాటికలను రచించాడు. తెలంగాణలో నక్సలైట్‌ ఉద్యమం నేపథ్యంగా ప్రసిద్ధ రచయిత అల్లం రాజయ్య ‘‘నాగేటి చాళ్లల్లో’’ అనే నాటకాన్ని రచించాడు. అలాగే ప్రసిద్ధ రచయిత తుమ్మేటి రఘోత్తమరెడ్డితో ‘‘బొగ్గు పొరల్లో’’ నాటకాన్ని రచించాడు.
సాహిత్య ప్రక్రియలన్నింటిలో హాస్యరసానికి పెద్దపీట వేసింది మాత్రం నాటకరంగమేనని చెప్పవచ్చు. డాక్టర్‌ పల్లా దుర్గయ్య ‘మాయరోగం’ అనే హాస్యనాటికను చక్కగా రచించాడు. ప్రేమించిన అమ్మాయినే పెళ్లి చేసుకోవడానికి ఒక కొడుకు తండ్రి ముందు నటించిన నటనే ‘మాయరోగం’ నాటిక. గీట్ల రాంరెడ్డి ‘‘మధ్యతరగతి మానవుడు, ఈ బ్రతుకు మాకొద్దు’’ వంటి నాటికలను రచించాడు. నంది రాజారెడ్డి ‘‘సబల, మా మతం మానవత్వం’’ వంటి నాటికలను రచించాడు. గంటి వెంకటరెడ్డి ‘‘కనువిప్పు, స్వార్థానికి సంకెళ్లు’’ నాటికలను రచించాడు. ఆనంద్‌ కుమార్‌ ‘‘పూలపల్లకి, సఖరాం బిందర్‌’’ వంటి నాటికలను రాశాడు. అబ్దుల్‌ కరీం ‘గగనంలో గడ్డిపూవు’ నాటికను రచించాడు. వరంగల్‌ కు చెందిన నాటక రచయిత, పరిశోధకుడైన డాక్టర్‌ వనం మధుసూదన్‌ ‘‘నాటకం, అమ్మయ్యో గాంధీ బ్రతికాడు, ఋణం తీరిపోయింది, భారతి కళ్లు తెరిచింది, అంటరాని వాళ్లు’’ వంటి నాటికలను రచించాడు. రంగస్థల నటుడు, రచయిత అయిన రొట్టె విశ్వనాథశాస్త్రి ‘‘చైనాతో యుద్ధం’’ (1962) సందర్భంగా ‘జయం మనదే’ నాటకాన్ని రాశాడు.
తెలంగాణ మాండలిక రచయిత్రి పరిశోధకురాలు, కథా రచయిత్రి అయిన ఆచార్య పాకాల యశోదారెడ్డి పలు నాటకాలను రచించింది. ‘నందుని ధర్మదీక్ష, జీవన యాత్ర, ప్రహసనం’ వంటి నాటకాలను రచించి ప్రదర్శింపజేసింది. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత ఆచార్య సి.నారాయణరెడ్డి పలు గేయ, వచన నాటికలు రాశాడు. ఆయన రచించిన వచన నాటికలు ‘నారాయణరెడ్డి నాటికలు’ పేరుతో సంపుటిగా వచ్చాయి. అవి ఊర్మిళ, వరూధిని, మేఘమాధురి, దీపలీల, నాగార్జున సాగరం, కర్పూర వసంతరాయలు, విజయ సంక్రాంతి, రఘుపతి రాఘవరాజారాం, కాళిదాసు పునరాగమనం, హరిచరణ దాసి మొదలైనవి. ‘‘వలపునాడు, దగ్ధశాంతి, భిన్నస్వరాలు, అజంతా సుందరి, సుగాత్రి, ఋతువుల రాణి, వెన్నెలవాడ, దివ్వెల సంగీతం, సంక్రాంతి, గోకుల విహారం, మనిషి-యంత్రం’’ వంటి గేయనాటికలను రచించాడు. ఇవేకాక ‘‘వసంతలక్ష్మి, బలే లక్ష్మి, శిథిలశీల, సినీకవి’’ వంటి నాటికలు రాశాడు సినారె. తెలంగాణ గేయనాటికను ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్ళిన మహాకవి డాక్టర్‌ సినారె. యువకళావాహిని ఆధ్వర్యంలో పి.వి.కృష్ణమూర్తి ‘‘స్వామి వివేకానంద, నేతాజి, సమ్రాట్‌ అశోక’’ తదితర చారిత్రక నాటకాలను రాసి ప్రదర్శించాడు. మామునూరు రామదాసు ‘రంగుటద్దాలు’ నాటకాన్ని రచించాడు.
నల్లగొండకు చెందిన పెరిక రాజారత్నం ‘ఇష్టంలేని పెళ్ళి, నూతన కాంతులు, ఎవరు బాధ్యులు’ వంటి సామాజిక నాటకాలను రచించాడు. చిల్లర భావనారాయణ ‘కళాభిమాని, దేశద్రోహం, ఉప్పెన, కామందు, పరిణామం, కొత్త మనిషి, పదవులుపెదవులు’ నాటకాలను, ఎ.ఆర్‌.కృష్ణ ‘అరగంటలో అదృష్టం, కల్లోలం ఎక్కడికి, దేశంకోసం చేసిన నేరం’ నాటకాలను రచించారు. ఇంకా గుండాల నరసింహరావు ‘మరుగుతున్న తరం, ఎర్రబస్సు’ లను, అంకం లింగమూర్తి ‘జలతారు, చక్రశీల, అగ్నిదీపం, పితృదేవోభవ’ నాటకాలను, ఎం.వి.సుబ్రహ్మణ్యం ‘చదరంగం, జెండాపై కపిరాజు, మీరు మారాలి’ నాటకాలను, డాక్టర్‌ నాంపల్లి మధుబాబు ‘మేడిపండు, దూరపుకొండలు’ నాటకాలను, తక్కెళ్ల బాలరాజు ‘నవతరానికి నాంది, చైతన్యపథంలో, మరో పొద్దు పొడుపు’ నాటకాలను డాక్టర్‌ పెద్ది వెంకటయ్య ‘చైతన్యరథం, అంబేద్కర్‌ మళ్ళీ పుట్టాడు, మేలుకొలుపు, చెమట బిందువులు, నేను సైతం’ వంటి నాటకాలను రచించారు. ఎ.వి.నరసింహరావు ‘అభయపదం, మలయ సమీరం, నీలిరాగం, జీవనసమరం’ నాటకాలను, వల్స పైడి ‘ఆచార్య దేవోభవ’ వంటి నాటకాలను రచించాడు. జాజాల వెంకటశేషయ్య ‘‘వసంతవన విహారం’’ అనే నాటక రచన చేశాడు. గద్వాలకు చెందిన విశ్రాంత ఉపాధ్యాయుడు ప్రభాకరవర్ధన్‌ ‘‘ప్లాను సాగింది, విద్వత్‌ గద్వాల, భూదాన్‌, ప్రమీలార్జునీయం’’ అనే నాటికలను రచించాడు. ప్రసిద్ధ పరిశోధకులు డాక్టర్‌ కపిలవాయి లింగమూర్తి ‘రాజరథం’ అనే భువన విజయ నాటకంను, ఇతర సాంఘిక నాటకాలను రచించాడు. ప్రసిద్ధ రచయిత డాక్టర్‌ అమ్మంగి వేణుగోపాల్‌ అనేక నాటికలు రాశాడు. ‘‘వికృత శిశువు, ఆపరేషన్‌ వంకాయ, పూలమ్మిన చోట – ప్లాట్లు అమ్మబడును, జంతువు’’ వంటి నాటికలను రచించాడు. అలంపురం కు చెందిన డా.వి.వీరాచారి అనేక నాటకాలు రచించాడు. ‘‘వర్ణమాల’’ నాటిక సంపుటిని వెలువరించాడు. ఇందులో 15 నాటికలు, 3 ఏకపాత్రాభినయాలు ఉన్నాయి. హాస్య, చారిత్రక, రేడియో, స్త్రీపాత్ర లేని నాటికలు ఇందులో కనిపిస్తాయి. టి.వి.రంగయ్య ‘‘అందరూ అందరే, డాక్టర్‌ తికమక, మాకు స్వతంత్య్రం కావాలి, అక్షరజ్ఞానం, ఔన్నత్యం, గురువును కొట్టిన శిష్యుడు, అక్షరమే ఆయుధం, చదువు విలువ’’ వంటి నాటకాలను రచించాడు. అంపయ్య ‘‘తుఫాను గాలి, నారూ పోయా పోతావుంటే’’ వంటి నాటికలను రచించాడు. విశ్రాంత ఆంగ్ల ఉపాన్యాసకుడు రాజేంద్రబాబు ‘నడుం బిగించుదాం’ అనే నాటికను రచించాడు. ఖమ్మం జిల్లాకు చెందిన దెంచనాల శ్రీనివాస్‌ ‘దొంగ సత్తయ్య’ అనే నాటకాన్ని, ‘‘ఆదిశక్తి, మా ఊళ్లో మా రాజ్యం, ఒక్క నువ్వు నాకు కోటి నేనులు నీకు’’ వంటి నాటికలను రచించాడు. కల్వకుర్తికి చెందిన బాల సాహిత్య రచయిత గుర్రాల లక్ష్మారెడ్డి రచించాడు. ‘‘ముల్కీరి, యమలోకం’’ అనే నాటికలను రచించాడు.
షాద్‌నగర్‌ తాలూకా వెలికట్టె గ్రామానికి చెందిన వంగీపురం నరసింహచార్యులు ‘అభినవ శశిరేఖ’ అనే నాటకాన్ని రచించాడు. పాలమూరు జిల్లాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడు, నటుడు అయిన దుప్పల్లి శ్రీరాములు పలు భక్తి, చారిత్రక, సాంఘిక, ఏకపాత్రాభినయా లతో ‘బాల నాటికలు’ అనే పుస్తకాన్ని రచించాడు. గుహునిభక్తి, దానవీరం, కుంతీకర్ణ సంవాదం, అహంకారం, క్రమశిక్షణ, మాతృదేవోభవ, జ్ఞానోదయం, విజయరహస్యం వంటి నాటికలను రచించాడు. స్వామి వివేకానంద, రaాన్సీ లక్ష్మీబాయి, వీరపాండ్య కట్టబ్రహ్మన, చంద్రశేఖర ఆజాద్‌, జిజియాబాయి, కైక, భీముడు వంటి ఏకపాత్రాభినయాలను రచించాడు. పాలమూరు పట్టణానికి చెందిన ప్రముఖ కవి కమలేకర్‌ డాగోజిరావు ‘దేశంకోసం, చెప్పినట్టు చేస్తారా’ వంటి బాల నాటికలను రచించాడు. బిజినేపల్లి మండలం గంగారం గ్రామానికి చెందిన గంగారం నరసింహాచార్యులు ‘సప్తాహా మహాత్మ్యం’ అనే నాటకాన్ని రచించాడు. షాద్‌నగర్‌కు చెందిన డాక్టర్‌ టి.వి.భాస్కరాచార్య దూరదర్శన్‌ కోసం 15 దాకా బాల నాటికలను రచించాడు. అలాగే రేడియో నాటకాలను కూడా రచించాడు. విశ్రాంత తెలుగు పండితుడైన మఠం అల్లమాప్రభు ‘విద్యార్థి జీవితం, చీకటిపల్లె, జన్మభూమి’ వంటి నాటికలను రచించాడు. జిల్లాలో ప్రసిద్ధకవిగా పేర్గాంచిన వల్లభాపురం జనార్దన మొట్టమొదటిసారిగా ‘‘విజయక్రాంతి’’ అనే సంగీతరూపకాన్ని రచించాడు. ఇది గేయ రూపకం. నారాయణపేట జిల్లా మరికల్‌ మండల కేంద్రానికి చెందిన కడదాసు వెంకటయ్య ‘భక్త శిరియాల చరిత్ర, దత్తాత్రేయ చరిత్ర, భక్త మార్కండేయ చరిత్ర, శ్రీ అయ్యప్ప విజయం’ వంటి నాటకాలను రచించాడు. ఇటిక్యాల మండలం వేముల గ్రామానికి చెందిన వేముల కృష్ణమూర్తి ‘శమంతకమణి, వయోజన విద్య’ అనే నాటకాన్ని రచించాడు. శమంతకమణి ప్రాచీన నాటకం. శ్రీకృష్ణుడి చుట్టూ అల్లిన నాటకం.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని తెలుగు శాఖ అధ్యక్షుడిగా పనిచేసిన ఆచార్య మసన చెన్నప్ప బహుముఖ ప్రజ్ఞాశాలి ‘వీర సావర్కర్‌’ అనే పేరుతో ఒక దృశ్యనాటికను రచించాడు. దేవరకద్ర మండలం డోకూరులో జన్మించిన వరకవుల నరహరిరాజు ‘భువన విజయం, శ్రీశ్రీ విరాట్‌ వీరబ్రహ్మంగారి పద్యనాటకం, కలినిగ్రహం, వివేకానంద, శివపార్వతుల కళ్యాణం, అభినవ పడక దృశ్యం’ వంటి నాటకాలను రచించాడు. బల్మూరు మండలానికి చెందిన తిరుమల కృష్ణదేశికాచార్యులు ప్రముఖ పద్య, నాటక కవి. అనేక రచనలు చేశాడు. పిల్లలమర్రి పినవీరభద్రుడు రచించిన నాటకం ‘వాణి నారాణి’, రెండవది ‘బిల్హణీయం’ లను పద్యనాటకాలుగా రచించాడు. గద్వాలకు చెందిన తిరుమల వెంకటస్వామి ‘ఈ భక్తులు మాకొద్దు’ అనే పేరుతో నాటకాన్ని రచించాడు. దురాశతో దేవుళ్ళను వాడుకునే దొంగ భక్తుల నేపథ్యంలో దేవతలే ఈ భక్తులు మాకొద్దు అనే నాటకాన్ని రాయబడిరది. కోస్గికి చెందిన ఆర్‌.ఎం.ప్రభులింగశాస్త్రి ‘‘బెజ్జమహాదేవి’’ అనే నాటకాన్ని రచించాడు. ఖిల్లాగణపురం మండలం మామిడిమాడకు చెందిన ఛందోజిరావు ‘అభినవ సావిత్రి’ పేరుతో ఒక చిన్న హాస్య నాటికను రచించాడు. మహబూబ్‌నగర్‌ జిల్లాకు చెందిన మాలెల అంజిలయ్య గౌడ్‌ ‘బలి, తాగితే వొట్టు, పాఠశాలోపాఖ్యానం’ తదితర నాటకాలను రచించాడు. ఉపాధ్యాయ ఉద్యమకర్తగా పేర్గాంచిన జి.అంపయ్య ‘‘తుఫాను గాలి, నారూ పోయా పోతావుంటే’’ వంటి నాటికలను రచించాడు. మహబూబ్‌ నగర్‌ జిల్లాకు చెందిన పల్లెర్ల రామ్మోహన్‌ రావు ‘‘గద్వాల వైభవం, శ్రీవినాయక వైభవం’’ అనే సాహిత్య రూపకాలను రచించాడు. మద్దూర్‌ మండలం చింతలదిన్నె గ్రామానికి చెందిన పోతుల హన్మంత్‌ రెడ్డి ‘భీమార్జున విజయాలు, భక్త తుకారం, భక్త మార్కండేయ’ వంటి నాటకాలను రచించాడు. పాలమూరు పట్టణానికి చెందిన యువకవి డాక్టర్‌ భీంపల్లి శ్రీకాంత్‌ ‘‘స్వాతంత్ర దినోత్సవం’’ అనే నాటికను రచించాడు. స్వాతంత్ర దినోత్సవం ప్రాముఖ్యత గూర్చి నేటి తరానికి చెప్పాలనే ఉద్దేశ్యంతో దీనిని రచించాడు. పెబ్బేరుకు చెందిన ఎడవల్లి నాగరాజు ‘‘కాకి-కోకిల’’ అనే చిన్న నాటికను రచించాడు. ప్రముఖ కవి, ఆధ్యాత్మిక వక్త అయిన డాక్టర్‌ పి. భాస్కరయోగి ‘స్వామి వివేకానంద’ అనే ఏకపాత్రాభినయం అనే పుస్తకాన్ని రచించాడు. తాండూరుకు చెందిన చెందిన రచయిత రుద్రారం శ్రీనివాస్‌ రెడ్డి ‘కుచేల సంసారం, అపూర్వసంపద, భారతనారి, క్రమశిక్షణ’ వంటి నాటికలను రచించాడు. అచ్చంపేటకు చెందిన ప్రసిద్ధ వైద్యుడు డాక్టర్‌ బి. బాలనారాయణ ‘ఔట్‌ పేషెంట్‌’ అనే నాటికను రచించాడు. గద్వాలకు చెందిన ప్రముఖ కవి తిరుమల వెంకటస్వామి ‘‘వినాయక చవితి’’ అనే హాస్యనాటికను రచించాడు.
ఇంకా ఎందరెందరో తెలంగాణ నాటకరంగానికి ఊపిరి పోశారు. శక్తివంతమైన మాధ్యమంగా ప్రజల్లోకి చొచ్చుకెళ్ళ గల ఏకైక సాహిత్య ప్రక్రియ నాటకం. ఒకప్పటి రాజసాన్ని పొందిన నాటకానికి ఊపిరిపోయడానికి ప్రభుత్వం, సంస్థలు, కంకణం కట్టుకున్నప్పుడే అది సజీవమై నిలుస్తుంది. ‘నాటకాంతం హి సాహిత్యం’ అన్న ఆర్యోక్తికి దర్పణంగా నిలుస్తుంది.
ఆధార గ్రంథాలు :

  1. నారాయణ రెడ్డి. సి, ప్ర.సంపా. చెన్నయ్య. జె, సంపా. తెలంగాణలో తెలుగు సాహిత్య వికాసం, 2013. హైదరాబాద్‌. ప్రచురణ : తెలంగాణ సారస్వత పరిషత్తు
  2. గౌరీశంకర్‌, జూలూరి ప్ర. సంపా. తెలంగాణ సమగ్ర సాహిత్య చరిత్ర, 2022. హైదరాబాద్‌. ప్రచురణ : తెలంగాణ సాహిత్య అకాడమీ
  3. శ్రీహరి, రవ్వా, సంపా. తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర, 2016. హైదరాబాద్‌. ప్రచురణ : తెలుగు అకాడమీ
  4. శ్రీకాంత్‌, భీంపల్లి. మహబూబ్‌ నగర్‌ జిల్లా తెలుగు సాహిత్య వికాసం, (పిహెచ్‌.డి సిద్ధాంత గ్రంథం)

డా. భీంపల్లి శ్రీకాంత్‌
ఫోన్‌ : 903 284 4017

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *