మహాభారతం: ‘ధర్మ’ ప్రశ్నలు ‘భీష్మ’ సమాధానాలు – 4

‘ఆశ’ ప్రతిమనిషికి జీవగుణంగా వచ్చే లక్షణం. దీని గురించి ఆధ్యాత్మిక వేత్తలు ఒక విధంగా, వ్యక్తిత్వ వికాస ఉపన్యాసకులు మరో విధంగా వివరిస్తారు. ‘‘ఆశ విషముకన్న దహనముకన్న దారుణమైనది’’ అని చిలకమర్తి ‘కర్పూరమంజరి’లో అంటే, ‘‘జీవితానికీ పునాదే ఆశ. జీవించడం అంటేనే ఆశపడటం’’ అని గోపీచంద్‌ ‘ఆశాజ్యోతి’లో అంటాడు. ఇలా రెండు వ్యతిరేక కోణాలలో ‘ఆశ’ను వాడుతారు. ఆశకు ఉన్న పరిమాణం చాలా పెద్దది. పేరాశ, దురాశ, అత్యాశ, అడియాశ, నిరాశ వంటి పదాలను చూసినపుడు ఆశను అంచన వేయడం కష్టమని అనిపిస్తుంది. అంతుచిక్కని ఆశను వదిలివేయుమని ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పి అలసిపోయాయి. వశిష్ఠ గీత ‘‘యత్పృధివ్యాం వ్రీహి యవః హిరణ్యం పశవస్త్రియః / ఏకస్యాపి న పర్యాప్తం తస్మాత్తృష్ణాం పరిత్యజేత్‌’’ ప్రపంచంలో ఉండే వడ్లు, యవలు, బంగారం, పశువులు, స్తీలు ఇవన్నీ ఒకనికైనను తృప్తి కలిగించజాలవు. కాబట్టి ఆశను వదలవలెను అంటుంది. ఇట్లాంటి మహత్తరమైన ఆశను గురించి ధర్మరాజు భీష్ముడిని ఒక ప్రశ్న అడిగాడు.
ప్రశ్న: ఆశ వల్లనే ఏ దురాగతానికైనా సిద్ధపడుతున్నారు. ఈ ఆశ ఎలా తొలిగిపోతుందో వివరించండి. (శాంతి.5.372)
దీనికి సమాధానంగా ఒకప్పుడు జనకుడు – మాండవ్యముని ఇద్దరి మధ్య జరిగిన సంభాషణను భీష్ముడు తెలియజేశాడు. మాండవ్యముని జనకుడి దగ్గరకు వచ్చి ఆశ లేకుండా ఉండడం కోసం శిక్షణ ఇవ్వని అర్థించాడు.
జనకుడు ఆ మునితో ‘సంపదలు దుఃఖనిలయాలు. కామసుఖం, దివ్వసుఖం కూడా ఆశలేమివల్ల వచ్చే సుఖానికి సరికావు. ధనం అనాయాసంగా లభించగానే గోవుతోపాటు దానికొమ్ములు పెరిగినట్లే ఆశ కూడా పెరిగుతుంది. ఆశ వల్ల మమకారం పెరుగుతుంది. వారు మా చుట్టాలు, ఆవి మా సంపదలు, అవి మా నెలవులు అనే మమకారం తొలగిపోతే ఆశ నశిస్తుంది. దొరికిన దానిని అనుభవిస్తూ, దొరకనిదానికి చింతపడి దుఃఖించకుండా పరిపూర్ణుడై ఎవరుంటారో వారి మనసులోకి ఆశ ప్రవేశించదు.
దుర్బుద్ధులైనవారు ఆశను విడువలేరు. శరీరం ముసలితనం పొందినా ఆశమాత్రం ముసలితనం పొందదు. అది ప్రాణాలు తీసే రోగం. ఆశను వదిలేసిన వారే అత్యధిక సుఖాన్ని పొందుతారు. సుఖదుఃఖాది ద్వంద్వాలకు వ్యాకులత చెందవద్దు. నిగ్రహంతో మనోబుద్ధ్యాదులతో కూడిన అంతఃకరణసంపదను కాపాడుకోవాలి. ఇట్లా చేసిన వారికి ఆశలేమి వల్ల నిత్యసుఖం కలుగుతుంది’ అని బోధించాడు.
పైన జనకుడు తెలిపిన విషయాలలో ఆశ ఎలా పుడుతుంది. ఎలా పెరుగుతుంది. ఎలా వదులుకోవచ్చు. దానివల్ల వచ్చే నష్టాలు, దాన్ని వదులుకుంటే వచ్చె సుఖాలను గురించిన వివరాలున్నాయి. దీనిలో ఆశ పుట్టుక, వికాసం, స్వరూపం, స్వభావం అన్నిటిని తెలుసుకోవచ్చు.
‘ఆశ ప్రాణాలు తీసే రోగం’ అంటాడు. రోగం ఒకసారి వచ్చింది అంటే అది పెరుగుతూనే ఉంటుంది. దానిని పసిగట్టి తగినమందులు వాడకపోతే కృశింపచేసి చివరకు ప్రాణాలను తీస్తుంది. పరుగెత్తినంత దూరం భూమిని నీకే పట్టాచేసి ఇస్తాను అంటే ప్రాణం పోయేంత వరకు పరుగెత్తిన కథ చిన్నపుడు చదువుకున్నాం. అంటే ఆశ ప్రాణం తీస్తుంది.
‘అనాయాసంగా ధనం వస్తే ఆశ పెరుగుతుంది’ అనేది ధనంమీద ఆశ పెరగడానికి కారణాన్ని తెలియజేస్తుంది. చాలా కష్టపడితే వచ్చిన ధనాన్ని చూసి మరింత ధనం కావాలి అనుకోరు. అది కావాలంటే ఎంత కష్టపడాలో తెలిసింది కాబట్టి. కష్టపడకుండా ధనం పొందిన వారికి ఆ ధనం మీద ఆశ మరింతగా పెరుగుతుంది. కష్టం కలుగలేదు కాబట్టి. ఆవు పుట్టినపుడు కొమ్ములు పుట్టవు. పుట్టినవంటే ఆగకుండా పెరుగుతూనే ఉంటాయి. కొన్ని ఆవులకు ఆ కొమ్ములు తలకుమించిన భారమౌతాయి కూడా.
‘మమకారం తొలగిపోతె ఆశ నశిస్తుంది.’ అని ఆశకు విరుగుడు చెప్పాడు. మా అనేది ఏది లేదు అనుకున్నపుడు ఆశే లేదు. ఉన్నప్పటికి వాటిని అంటుకోకుండా ఉన్నపుడు ఆశ తొలిగిపోతుంది. చుట్టాలు, సంపదలు, నెలవులు ఏవి ఎవరివెంట వచ్చేవి కావు. కాని అందరు వాటిని సుఖపెట్టడం కోసం, పెంచడం కోసం, కాపాడు కోవడం కోసం నిరంతరం ఆలోచిస్తారు. ఆశలో పడుతారు. ఈ మూడిరటిమీద మమకారం వదులుకోవడమే ఆశను తొలగించు కోవడం. ఆశను వదులుకున్న వారు అనంత సుఖాన్ని పొందుతారు.
‘కామం వల్ల కలిగే సుఖం, దేవలోకం వల్ల కలిగే సుఖం కంటే ఆశవదులుకోవడం వల్ల కలిగే సుఖం గొప్పది’ అని జనకుడంటాడు. ఎంతటి సుఖాన్ని పొందుతాడో తెలుసుకోవడానికి రెండు ఉపమానాలను ఇచ్చాడు. బ్రతికున్నంత కాలం కామసుఖాన్ని మించిన సుఖం లేదనుకుంటారు. మరణించాక మాత్రం స్వర్గ సుఖం కావాలను కుంటారు. కాని ఇక్కడ ఆశను వదులుకుంటే ఇహ, పరలోక సుఖాలను మించిన సుఖం పొందవచ్చు అంటాడు. అది అనుభవైక్యవేద్యం.
‘‘దొరకొన్న ననుభవించుచు
దొరకొనమికిఁ జింతనొంది దురపిల్లక ని
ర్భరుఁడై యునన్ననుఁదృష్ణకుఁ
జొరవచ్చునె యతని మనసు సువ్రతశీలా!
’’ (శాంతి.5.376)
అనే పద్యభావం ప్రకారం ‘దొరికినదానిని అనుభవిస్తూ, దొరకనిదానికి చింతపడి దుఃఖించకుండా పరిపూర్ణుడై ఉన్నవారి మనస్సులోకి ఆశ ప్రవేశించదు’ అని తెలుస్తుంది. ఆశను మనసులోకి రాకుండా చేసుకున్నవారు పూజ్యనీయులు. ఆశను ఎవరు వదులుకోరో కూడా ఈ భీష్మ సమాధానం తెలియ జేసింది. వదులుకొని వారు దుర్భుద్ధులు అంటారు. మనుషులు ముసలి వారైనా ఆశ మాత్రం వయసులోనే ఉంటుంది అంటారు. ఇందులో తేల్చిన అంశం ఏమిటంటే వ్యామోహ రహితులు, సుఖదుఃఖాది ద్వంద్వాతీతులు మాత్రమే ఆశను వదులుకోగలరు. ఆశను వదులుకున్న వారే నిత్యం ఇహపరలోక సుఖాలను మించిన సుఖాన్ని పొందుతారు అని.
*****
ధర్మరాజు అడిగిన ప్రశ్నలలో ఆశకు సంబంధించినది మరొకటి కనిపిస్తుంది.(శాంతి.3.150) దానికి సమాధానంగా భీష్ముడు ఒక కథ చెప్పాడు.
సుమిత్రుడు అనేరాజు ఒకనాడు వేటకు పోయాడు. ఒక జంతువును కొట్టాడు. అది బాణంతోపాటు పారిపోతుంది. రాజు దాని వెంటపడ్డాడు. అది దొరికినట్లే అనిపిస్తూ చాలా దూరం పోయింది. దానితోపాటు కారడవిలో కలిసిపోయాడు. ఆలసి పోయాడు. దగ్గరలో ఉన్న ఒక ముని పల్లెకు చేరుకున్నాడు.
అక్కడ ఋషభుడనే ముని ఆ రాజుతో ‘నీవు ఒంటరిగా అరణ్యంలోకి ఎందుకు వచ్చావు? బాగా దిగులుగా కినిపిస్తున్నావు ఏమిటి?’ అని అన్నాడు. అప్పుడు రాజు ‘ఒక జంతువు నేను కొట్టిన బాణంతోపాటు పారిపోగా దానివెంట ఎంతో ఆశగా వచ్చాను. అది నన్ను చాలా తిప్పలు పెట్టింది. ఆశ ఇంత తప్పించుకోలేనిదా?’ అని అడిగాడు. అపుడు ఋషి ‘నేను పూర్వ ఒకపుడు తీర్థయాత్రలు చేస్తూ బదరికాశ్రమంలో తనుడనే పేరుగల ఒక తాపసిని కలిసాను. అతని బోధలు వింటూ అక్కడే ఉన్నాను. అంతలో వారి దగ్గరికి ఒక రాజు వచ్చాడు. ఆ రాజుకున్న ఒక్క కొడుకు సరదాకు అడవిలోకి వెళ్ళి తిరిగిరాలేడు. ఎంత వెదికిన దొరకడం లేదని ఆ మునిని అడిగాడు. ముని మౌనంగానే ఉన్నాడు. ‘బాగా ఆశపడ్డప్పుడు ఆ ఆశ ఆడియాస అయితే మనసు ఇంత తట్టుకోలేనిదవుతుందా!’ అని ఆ మునిని మళ్ళీ ప్రశ్నించాడు.
అప్పుడు ముని ‘ఎవరైనా, ఎక్కడ్కెనా, ఏ విషయంగానైనా మనసును దిటపు పరచుకొని తగిన రీతిలో నడుచుకొంటే అతడికి లభ్యం కానిది ఉండదు’ అంటాడు. అట్లాగే ‘ఇస్తానని ఇవ్వనివారిమీద, కృతఘ్నులైన దుష్టులమీద, మనసు పడ్డ స్త్రీలపట్ల ఆశ నిరంతంరం కొనసాగుతూనే ఉంటుంది. ఇంకా ఇట్లాంటి ఎన్నో విషయాల కోసం పరుగులుపెట్టె ఆశను వదలుకొమ్ము. అప్పుడు సుఖపడుతావు’ అని బోధించాడు.
ఇందులో ఆశ ఎంతగా పరిగెత్తిస్తుందో తెలుసుకోవచ్చు. అందినట్టే అనిపిస్తూ అందకుండా పోయే దానికోసమే వేటగాడిలా అడవుల వెంట పరుగులు పెడతారు. ఈ కథలో వేటగాడు అంటే అజ్ఞానం. ముని అంటే విజ్ఞానం. అడవులు అంటే కష్టాలు. విజ్ఞానం అందేవరకు అజ్ఞానులు ఆశాలోలురై పరుగులు పెడుతూ కష్టాల పాలవుతారు. అట్లాగే ఎవరి విషయంలో బాధకు గురిచేసే ఆశతో ఉంటారు అనే విషయాన్ని కూడా ఈ కథ తేల్చిచెప్పింది. మనది కాకుండా పోయినా దానిపై ఆశతో వెదికినపుడు అది దొరకకుంటే కూడా తట్టుకోలేని బాధకలుగుతుంది. ఇస్తానని ఇవ్వని వారి పట్ల ఎందుకు ఆశతో ఉండాల్సి వస్తుంది అంటే వారు ఇస్తాను అనడంతో దానికి తగిన ఆలోచనను పెంచుకుని ఉంటాడు. ఒకరికి మేలు చేసేటప్పుడు కూడా చాలా మందికి మనకు వారు ఎక్కడో ఉపయోగ పడుతారు అనే చిన్న ఆశాభావం ఉంటుంది. స్త్రీ పురుషుల విషయంలో కూడా.
*****
ధర్మరాజు అడుగుతున్న ప్రశ్నల పరంపరలోనే ఒకసారి ‘ఏది సర్వోత్తమమైన ధర్మం’ (శాంతి.4.3) తెలుసుకోవాలని ఉంది అన్నాడు. దానికి భీష్ముడు చక్కని సమాధానం చెప్పాడు. అందులో ప్రధాన భాగంగా ఆశను గురించి వివరించాడు. దీనిని పింగళ అనే ఒక వేశ్య కథ ఆధారంగా చెప్పాడు. పింగళ అనే వశ్య తన ప్రియుడి కొరకు ఎదురుచూస్తూ ఉంటుంది. అయినా అతడు రాలేడు. అప్పుడు ఆ వేశ్య ఇలా అనుకుంది. ‘‘నేను నా ప్రియుడి కోసం పిచ్చిదాన్ని అయ్యాను. అయితే నాకు పట్టిన ఈ పిచ్చి నా ప్రియుడికి కూడా పట్టే వీలుందా! లేదు. కాబట్టి ఈ భ్రమను వదులుకొని, శీరీరానికి ఉన్న అన్ని మార్గాలను బంద్ధించుకుని నిద్రపోతాను. నా దగ్గరకు వచ్చినవాడే నా ప్రియుడు అనికొనింది. ఇతరులపై కోరికమాని, తృప్తితో మనస్సును ఏ దిగులూ లేకుండా ఉంటే సుఖాలు నన్ను చేరుకొంటాయి. ఆలోచించి చూస్తే ఆశే ఇంద్రియలోలుని చేసి మనిషిని క్రుంగదీస్తుంది. మనిషి ఓటమి పాలు కావడానికి, వినాశనానికి ఆశ ఒకటే కారణం. కాబట్టి నేను ఆశను వదులుకొని ఇంద్రియాలను జయించి, వినాశానికి దూరంగా సుఖంగా జీవిస్తాను. నిరాశయే సుఖప్రదమైనది అని పలికి మనః ప్రవృత్తితో పింగళ శాంతంగా నిద్రించింది.
ఇక్కడ పింగళ వృత్తి రీత్యా వేశ్య. అయినప్పటికీ ఒకడి మీద మనసుపడి వాడి కోసం ఎదురు చూస్తుంది. ఆమెకు ఉన్న ప్రేమ ఎదుటి వాడికి లేదని గమనించింది. ఇది ప్రకృతి జన్యమయితే ఇరువైపుల ఉండాలి. అట్లా లేదు కదా అయితే ఆశపడ్డవారే భ్రమలో ఉన్నట్లు తెలుసుకుంది. తెలియజేసింది. ఆ భ్రమకు కూడా కారణం ఇంద్రియాలే అని తెలియపరుస్తుంది. ఇంద్రియ నిగ్రహం ఉన్నవారు ఎటువంటి ఆశ వలలో చిక్కుకోకుండా ఉంటారనే విషయాన్ని కూడా ఈ కథ ద్వారా తెలుసుకోవచ్చు. అంతే కాకుండా అన్ని విషయాలలో ఆశ పరులౌతారు. అన్ని రకాల వారు కూడా ఆశాపరులుగా ఉంటారు అనే విషయాన్ని తెలియజేస్తూ, ఆశను అధిగమించాలి అంటే ఇంద్రియ నిగ్రహం అనేది కూడా చాలా అవసరం అని పై విషయాలు తెలియజేస్తున్నాయి.


ఆధార గ్రంథాలు:

  1. సుబ్రహ్మణ్యం, జి.వి. సంపా. ‘కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము’ (అన్ని పర్వాలు, 15 సంపుటాలు). 2014. తిరుపతి: తి.తి.దే.
  2. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. శ్రీనివాసులు, సూరం. సంపా. ‘శ్రీమహాభారతము’ (అన్ని పర్వాలు, 7 సంపుటాలు). 2018. గోరఖ్‌పూర్‌: గీతాప్రెస్‌.
  3. హనుమంతరాయ శర్మ, బలభద్రపాత్రుని. ‘మహాభారత విమర్శనము’ (రెండు సంపుటాలు). 1996. గుంటూరు: భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌.
  4. అప్పలస్వామి, పురిపండా. ‘వ్యావహారికాంధ్ర మహాభారతం’ (శాంతి పర్వము). 1976. రాజమండ్రి: ప్రాచీన గ్రంథావళి.
  5. లక్ష్మీనారాయణ, గంగిశెట్టి. ‘భీష్ముడు చెప్పిన రాజనీతి కథలు’ 1986. హైదరాబాద్‌: తెలుగు విశ్వవిద్యాలయం.
  6. వెంకటరత్నం, గుంజి. ‘మహాభారత విజ్ఞాన సర్వస్వం’ 2021. హైదరాబాద్‌: ఎమెస్కో.

డా. అట్టెం దత్తయ్య
సహాయాచార్యులు, ఎస్వీ కళాశాల,
ఢిల్లీ విశ్వవిద్యాలయం.
ఫోన్‌ : 9494715445

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *