కాలము – మానము

కలయతి ఆయుః కాలయతి, సర్వాణి భూతాని ఆయువును లెక్కించునది, ప్రాణులన్నింటికిని కారణమైనది, నలుపు, లోహము, యముడు, శివుడు, ఘడియ మొదలగు కాల పరిణామములు. కాల శబ్దానికి అర్థం ఇది. భూమి తనచుట్టూ తాను తిరగడం వల్ల కాలం ఏర్పడుతుంది. భూమి శివునికి సంకేతం కావడం వల్ల కాలం కూడా శివునికి సంకేతమే. కాలం తీరితే ఈ భూమిలో అంతా కలిసి పోవలసిందే. ఒక నియమం ప్రకారం నడిచేది ఈ భూమి, కాలం మాత్రమే.
మీయతే అనేన మాన. దీనితో కొలుతురు, జోకుదురు, తరాజు, బాట్లు, పరిణామము, కొలబద్ద అని అర్థాలు. కొలతకు ప్రమాణం మానం. ప్రమాణ, ఉపమాన, సమాన, విమాన, అనుమాన, అవమాన మొదలైన శబ్దాలు దీనికి అనుగుణంగా కనిపిస్తున్నాయి. కాలాన్ని కొలవడానికి కూడా ఒక మానం కావాలి. ఆకాశంలోని మూన్‌ (చంద్ర) శబ్దం కూడా ‘మాన’కు సంబంధించినదే. మాస అనే అర్థంలో ఒక మూన్‌(థ్‌).. మంత్‌గా గుర్తింపబడిరది. చంద్రుడే ఒకనొక రోజుల్లో మనిషి జ్ఞానవికాసానికి, కాలగణనకు కారణమైనవాడు కావడం వల్ల ‘మాన’ శబ్దంతో ఉపయోగిస్తారు. అదేవిధంగా చంద్రమస్‌ నుండి ‘మాస’, వెన్నెల నుండి ‘నెల’ శబ్దాలు మనం వినియోగించుకోవడానికి ఉపయోగపడుతున్నాయి. మానం కొలత అయితే బ్రహ్మ, పితృ, చాంద్ర, సౌర, బార్హస్పత్య, పైతామహ మొదలైన మానాలు కాలాన్ని గణించడానికి తోడ్పడుతున్నాయి. ఈ నాటి కాలంలో ‘మాన’ శబ్దం అర్థ సంకోచంతో కేవలం స్త్రీల సౌశీల్యానికి సంబంధించిన కొలతగా వినియోగిస్తున్నారు.
ఉగాది సమయంలోనైనా కాలాన్ని అర్థం చేసుకోవాలి. కాలమానాలను తెలుసుకునే ప్రయత్నమూ చేయాలి. కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నంలో పడాలి. నిత్యం, నిరంతరం కాలాన్ని సద్వినియోగం చేసుకునే ప్రయత్నం చేయాలి. ఈ లోకంలో, ఇంత మంచి జన్మలోకి పుట్టిన వారంతా ఇంతకన్నా ఉత్తమమైన, ఉన్నతమైన కార్యక్రమాలు ‘సకాలం’లో నిర్వర్తించే ప్రయత్నం చేస్తూ ఉండాలి. కాలాన్ని వ్యర్థం చేయనే కూడదు. ఉన్నంతవరకు కాలాన్ని పూర్ణంగా వినియోగించు కోవాలి. ప్రతి నిమిషం మనస్సును, పూర్ణశక్తితో అనుబంధం పెంచుకునే మార్గంలో ఉండాలి. వ్యర్థమైన, అనవసరమైన ఆలోచనలు ఏవీ ఏ కాలంలోనూ చేయకూడదు. ఏ రూపంలోనైనా వేరు వేరు ఆలోచనలు వస్తుంటే మన శక్తి తగ్గుతుంది కానీ, పెరిగే అవకాశం లేదు. ఆలోచనలను అధిగమించి శక్తిని పెంచుకునే మార్గం చూడాలి. ఉండేది కొద్ది కాలమేనని గుర్తించాలి. ఈ కొలత గలిగిన కాలాన్ని ప్రతి క్షణం మనకన్నా ఉన్నత శక్తితో అనుసంధానం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉండాలి. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ.. ఒక్క క్షణం కూడా ఆగకుండా ఉన్నట్లు, మన మనస్సు కూడా మరో ఉన్నత శక్తి వైపు కేంద్రీకరించి, జ్ఞానాన్ని పెంచుకుంటూ ప్రశాంతంగా గడపాలి. శక్తివంతులైన వారు మాత్రమే ఈ లోకంలో గొప్ప కార్యక్రమాలు నిర్వహించగలుగుతూ ఉంటారు. శక్తి హీనులైన వారు ఏ కార్యక్రమాలు కూడా నిర్వహించలేరు. తమను తాము కూడా రక్షించుకోలేరు. అందుకే కొలవగలిగిన ఈ కాలంలో ప్రతి క్షణాన్ని శక్తిని గూర్చి ఆలోచించడం కోసం కాక మరోవైపు కేంద్రీకరించనే కూడదు. దానివల్లనే ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.
ఉగాది, ఇటువంటి నిర్ణయాలు తీసుకోవలసిన సమయం. శక్తివంతులైన వారు సృజించిన కావ్యాలు, విమర్శలు ఉత్తమోత్తమమైన ప్రభావాన్ని తెలియజేస్తాయి. శక్తిహీనులైన వారి సృజన ఏ రూపంలోనూ సమాజాన్ని ప్రభావితం చేయలేదు. వ్యక్తి తనను తాను సంస్కరించుకునే క్రమంలో భాగంగా ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ… ఉగాది శుభాకాంక్షలు.

సంపాదకులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *