మహాభారతం: ‘ధర్మ’ ప్రశ్నలు – ‘భీష్మ’ సమాధానాలు – 2

చాలామంది కొన్ని సార్లు ఊహించని సమస్యల్లో ఇరుకుంటారు. వారిని చుట్టూ శత్రువులు కమ్ముకుని భయానికి గురిచేస్తారు. అప్పుడు రక్షించే వారు కనిపించకుంటే ఉన్న శత్రువులలోనే ఒకరిని హితునిగా మలచుకుని సహాయం పొందాల్సి వస్తుంది. సహకరించడానికి అంగీకరించాలంటే ఎదుటి వారికి కూడా వీరితో ఏదో అవసరం ఉండాలి. అంటే వారుకూడా ఏదో సమస్యల్లో ఉన్నవారై ఉండాలి. అయితేనే వారు ఇంకొకరికి సహకరించడానికి, స్నేహానికి అంగీకరిస్తారు. ఇదంత అవసరానుకూల స్వార్థపూరిత స్నేహసహకారాలే కాని నిజమైనవి కావు. కాబట్టి అటువంటి వారిని ఎంత వరకు నమ్మాలి, వారితో ఎంత జాగ్రత వుండాలి అనేది బాగా ఆలోచించాల్సిన విషయం. ఇలాంటి విషయాన్ని ధర్మరాజు భీష్ముడిని ప్రశ్నగ అడిగాడు.

ప్రశ్న  ‘‘బలవంతులైన శత్రువులు ఎక్కువ సంఖ్యలో మీదికి వస్తే బలహీనుడు తనను తాను ఎలా రక్షించుకోవాలి’’ (శాంతి.3.202)

ఈ ప్రశ్నకు భీష్ముడు ‘మూషిక మార్జాలంబుల సంవాదం’ వినిపిస్తాడు. ఈ సంవాదం పశుపక్ష్యాదుల సంభాషణాత్మక కథ అయినప్పటికి చక్కని నీతిని అందిస్తుంది.
అడవిలో ఒక మర్రిచెట్టుకింద వేటగాడు ఉచ్చుపెట్టిపోయాడు. అతడి పేరు పరిఘుడు. ఆ చెట్టు ప్రాంతంలో ఉన్న పిల్లి ఉచ్చులో పడిరది. దాని పేరు పలితుడు. అది చూసి కలుగులో నుంచి ఎలుక మేతకోసం స్వేచ్చగా బయటకు వచ్చింది. ఎలుక పేరు రోమశుడు. అంతలోనే అక్కడ చంద్రకుడు అనే గుడ్లగూబ, హలికుడు అనే ముంగీసలను ఆ ఎలుక చూసింది. అవి ఎలుకను చూసాయి. వాటినుంచి రక్షించుకోవడానికి ఎలుక పిల్లిని సమీపించింది. అది చూసి ముంగీస, గుడ్లగూబలు వెనుదిరిగి పోయాయి. ఇప్పుడు ఉచ్చులో ఉన్న పిల్లి, పిల్లిని ఆశ్రయించిన ఎలుక ఒకటికి ఒకటి అత్యంత తెలివితో రక్షించుకోవల్సి వచ్చింది.
ఎలుక, పిల్లి, గుడ్లగూబ, ముంగీస ఒకరికొకరు శత్రువులు. ఇక్కడ ఎలుకకు మాత్రం ముగ్గురు శత్రువులు. ఈ ముగ్గురి నుండి రక్షించాలంటే వారిలో ఒకరే రక్షించాలి. కాని వేరే అవకాశం లేదు. అందుకని శత్రువులలో కూడా ఆపదలలో ఉన్న వారిని ఆశ్రయించాలని నిర్ణయించుకుంది. పిల్లిదగ్గరకు వెళ్లింది. అది చిక్కుకున్న ఉరులను తెగకొరికి, విముక్తుడిని చేస్తా అని పలికింది. ఎలుకకు ముంగిసా గుడ్లగూబా వల్ల ఉన్న అపాయాన్ని, భయాన్ని కూడా చెప్పింది. పిల్లి అంగీకరించింది. తనను చూస్తే ముంగిసా, గుడ్లగూబ భయపడి తనదగ్గరకు కూడా రావు అని చెప్పింది. రెండిరటి మధ్య సంధి కుదిరింది. రెండిరటి ప్రాణహాని తీరిందని అనుకున్నాయి. వెంటనే ఏమి ఆలోచించకుండా ఎలుక వచ్చి పిల్లి పొదిగిట్లో కూర్చుంది. అది  చూసిన ముంగిసా గుడ్లగూబలు వాటి తోవన అవే వెళ్ళిపోయాయి. అవి పోవగానే ఎలుక సంతోషించింది. వల(ఉచ్చు)ను వెంటనే గబగబ కొరకకుండా జాప్యం చేస్తూ మెళ్ళిగా కొరకడం మొదలు పెట్టింది. ఈ విషయాన్ని గమనించిన పిల్లి ఎలుకను  ‘‘నా వలన ప్రయోజనం పొందిన నీవు ఉరులను తెగ కొరకకుండా జాప్యం చేయడం తగుతుందా?’’ అని ప్రశ్నించింది. దానికి ఎలుక ‘‘నీకు ఆపదను కలిగిస్తానా? కీడు తలపెట్టడం మంచిపని కాదు. నా భయం కొద్దీ నిన్ను నేను నమ్మలేక ఉరులను తెంపలేక పోతున్నాను. మనస్సులో తప్పుపట్టవద్దు. వేటగాడిని చూడగానే ఉరులను తెగకొరుకుతాను.’’ అని సమాధానం ఇచ్చింది.  అంతేకాదు ‘‘ప్రబలుఁడైన యతనితో వెరవున సంధి యొనర్చియుఁ గరంబు నమ్మమియ నీతిగాఁగొండ్రు బుధుల్‌’’ (శాంతి.3.214) బలవంతుడైన వాడితో ఉపాయంగా పొత్తుపొట్టుకున్నప్పటికీ, అతడిమీద ఎక్కువ నమ్మకం ఉంచుకొనడటం నీతికాదంటారు తెలిసినవాళ్ళు అంటూ గొప్ప నీతి వాక్యం కూడా చెప్పింది. వేటకాడిని చూడగానే తెగ కొరుకుతాను. అప్పుడు నీవు చెట్టుమీదకు, నేను కలుగులోకి వెళ్దాము. ఇదే చేయవలసిన పని అంటూ ‘‘…ముచితకాలభావ్యమైన యత్నవిధి గదా సమగ్ర ఫలత్వంబు నొందు…’’ (శాంతి.3.217) అని ఎలుక తెలుపుతుంది. అంతలో వేటకాడు వచ్చాడు. అతడు రావడం చూసి ఎలుక వేగంగా ఉచ్చును గబగబ కొరికివేసింది. పిల్లి చెట్టుమీదికి, ఎలుక కలుగులోనికి పరుగెత్తి పోయాయి. తదనంతరం చక్కని ఆపద్ధర్మ వాక్యాలతో పిల్లి ఎలుకల మధ్య సందేశాత్మక సంభాషణ జరుగుతుంది.
‘‘మేలు చేసి, తగిన స్నేహితుడిని సంపాదించుకున్నాక, వారి మంచిగుణాల సుఖం అనుభవించకుండా విడిగా ఉండడం నీతిమంతుల లక్షణం కాదు. నన్ను నమ్మావు. నాకు మేలు చేసావు. ఇప్పుడు భయపడడం, నమ్మకపోవడం మంచిది కాదు. నాతో కలిసి ఉండు. బలవంతులైన నా చుట్టాలూ, నేను నీకు సాయం చేస్తాం. కలిసి మెలిసి వుందాం.’’ అని పిల్లి అంటుంది. పిల్లిని నమ్మలేని ఎలుక ఇలా అంటుంది.  ‘‘బలవద్రిపులు ప్రయోజనములకై లోఁబడుట గల్గు…’’ (శాంతి.3.229) బలవంతులైన పగవాళ్లు వారి స్వార్థం కొద్ది లోబడుతారు. కాబట్టి తనకన్న బలవంతులైన పగవారిని అంత తొందరగా నమ్మి మోసపోగూడదు. ఇక్కడ ‘బలవంతులు’ అనేది శరీర బలం మాత్రమే కాదు. ధన బలం, అధికార బలం, కొన్ని సార్లు కులబలం కూడా కావచ్చు. వీరు వారి స్వార్థం కోసం కిందివారితో స్నేహం చేస్తారు. వారి ప్రయోజనం నెరవేరగానే మూర్ఖంగా ప్రవర్థిస్తారు అనేది చాలా వరకు నిజం.
‘‘అరియెడ మిత్త్రభావ మొక యప్పుడు కార్యము పొంటెఁగల్గిన
న్వెరవునఁబాముఁ బట్టునెడ నిక్కము నమ్మక దాని వాతికిం
గరము దొలంగఁజేయునరు…’’
(శాంతి.3.230)
శత్రువు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియదు. అవసరాన్ని బట్టి మిత్రునిగా కనిపిస్తాడు. కాని నమ్మడం మంచిది కాదు అంటూ చక్కని ఉదాహరణ ఇస్తాడు. పాములను పట్టేవాడు దానిని పట్టిన వెంటనే దానిని నమ్మక నోటిలో చేయిపెట్టి దాని విషపు కోరలను తొలగించే వాడి వలే ఉండాలి అనేది ప్రత్యేకాంశం. ఈ విషయాన్ని చిలకమర్తి గయోపాఖ్యానంలో గమనించవచ్చు.
‘‘ఆత్మలాభ పరాయణులగుచు నరులు
ప్రాణమిత్రులవలెనె గన్పట్టుచుందు
రవసరము దీఱ నందరు నడగుచుండ్రు
నిజహితుఁడు లేఁడవనిలో నిశ్చితంబు.’’ 
(మరువరాని మాటలు. పు.392)
వీరు ఏకంగా నిజమైన స్నేహితులే ఈ లోకంలో లేరని నిశ్చయిస్తున్నారు. అలాంటప్పుడు ఆపద సమయంలో కొంతసేపు ఆత్మీయంగా అనిపించగానే మిత్రుడనుకొని నమ్మడం మూర్ఖత్వమే అవుతుంది.
‘‘విను ! నీ కామిష మేను; నీ యెడఁ గడున్‌ విశ్వాసముం బూని చే
రిన నీ చిత్త మొకప్పుడుద్గతవికారీభూతమై దుర్వినో
దనహింసారుచి నొందు; నీ సుతసుహృద్బంధుప్రజంబేని మున్‌
ననుఁగన్నన్‌సహియింప దాత్మఁగరుణ;న్మన్నింపుమిట్లుండెదన్‌.’’
  (శాంతి.3.231)
ఇక్కడ ఎలుక తెలవితేటలవల్ల ఆపద్ధర్మంగా పాటించవల్సిన అంశాలు కనిపిస్తాయి.  ఎలుక పిల్లికి మాంసాహారం. పిల్లిని అంతగా నమ్ముకుంటే మనసు ఎప్పుడైనా మారవచ్చు. తినాలనే కోరిక ఎప్పుడైనా కలుగవచ్చు. అందుకే ఉచ్చు తెంచిన తదనంతరం కూడా ఎలుక పిల్లితో స్నేహానికి అంగీకరించదు.
‘బలవంతుఁడైన శత్రుని
వలనఁ బ్రయోజనము గలిగి వలను కలిమిఁదాఁ
గలిసియు నది గడచనఁగాఁ
దొలఁగ వలయు; నమ్మెనేనిఁదుదిఁ గీడొలయున్‌.’’
(శాంతి.3.238)
బలవంతుడైన శత్రువుతో అవసరం కొద్దీ స్నేహం చేసినా ఆ అవసరం తీరగానే అతడి స్నేహాన్ని వదలుకోవాలి. ఒకవేళ నమ్మితే చివరకు ఆపద కొనితెచ్చుకోక తప్పదు. అనే శుక్రవాక్యాలును తెలియజేస్తుంది.
‘‘నమ్మఁదగనివారి నమ్మక యున్నది
తగిన వారినైనఁ దద్ద నమ్మి
యుండఁ దగదు; తన్ను నొరులు నమ్మెడు నట్ల
యుండి యొరుల నమ్మకునికి నీతి.’’
(శాంతి.3.239)
నమ్మని వాళ్ళను నమ్మనేకూడదు. నమ్మినవాళ్ళను కూడా ఎంత వరకు నమ్మాలో అంతే నమ్మాలి. ఇతరులు తనను నమ్మేటట్లు నడుచుకుంటూనే తాను వాళ్ళను నమ్మకపోవడం నీతి అంటారు అంటుంది.
ఏప్రయత్నమైనా సరైన సమయంలోనే చేయాలి. అప్పుడే అది సత్ఫలితానిస్తుంది. ఎంతటి ఆపద సమయం సంభవించినప్పటికీ ఎదుటి వారిని చూసి ముందడుగు వేయాలి. శత్రువులు చుట్టు పొంచి ఉన్నప్పుడు వారిలోనే మన అవసరం ఉన్నవారితో స్నేహం ఏర్పరచుకోవాలి. ఆ ఒక్కరితో లొంగిపోవాలి. కాని ఆ స్నేహాన్ని కొంతకాలం వరకే నమ్మాలి. ఎంతటి వారిలోనైనా వంచన గుణాలుంటాయి. వాటిని పసిగట్టి తగినరీతిలో ఉండడం ప్రధానం. ముఖ్యంగా తనకంటే బలవంతునితో తగు జాగ్రత్తగా మెదలడం ఉచితం. బలవంతులు ఆపదలో ఉన్నపుడు తనకంటే బలహీనుల సహాయ సహకారాలు తీసుకోవడానికి వెనుకకురారు. అంతమాత్రాన బలహీనులు దానికి పొంగిపోయి, అది గొప్పగా భావించి వారిని పూర్తి స్థాయిలో నమ్మకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి చక్కని సందేశాలను ఈ సమాధానం అందిస్తుంది.
మూలభారతం ఈ ఘట్టంలో ఇంకా కొన్ని నీతి వాక్యాలు అదనంగా కనిపిస్తాయి. ప్రత్యేకించి మిత్ర శత్రులకు సంబంధించినవి. ‘‘అర్థయుక్త్యా హి జాయంతే పితా మాతా సుతస్తథా…’’ (శ్రీమహాభారతము, శాంతిపర్వము, అధ్యా`138.శ్లో`143) తల్లి, తండ్రి, కొడుకు మొదలుకొని ఎవరైన ప్రయోజనాన్ని బట్టె సన్నిహితులవుతారు.  శత్రువని ఎవరూ ఉండరు. అట్లాగే మిత్రువులూ అని ఉండరు. అందరు అవసర నిమిత్తమే ఏర్పడతారు అని తేల్చి చెప్పి శ్లోకాలను కూడా మూలంలో దర్శనమిస్తాయి. ‘‘నాస్తి జాతు రిపుర్నామ మిత్రం నామ న విద్యతే । /  సామర్థ్య యోగాజ్జాయంతే మిత్రాణి రిపవస్తథా ॥’’ (శ్రీమహాభారతము, శాంతిపర్వము, అధ్యా`138.శ్లో`138). మిత్రులను తెలుసుకోవాలి. శత్రువులను కనిపెట్టాలి. శత్రురూపంలో మిత్రులుంటారు. మిత్రరూపంలో శత్రువులుంటారు. కొంత కాలం అయ్యేసరికీ మిత్రువులు శత్రువుల కావచ్చు, శత్రువులు మిత్రులు కావచ్చు. వంటి విలువైన వాక్యాలను మూలంలో గమనించవచ్చు.

++++ ++++ +++++

ఎవరికైనా, ఎప్పుడైనా అధికబలం కలిగినవారు శత్రువుంటే ఆ సమయంలో కొంత అణిగి మణిగి ఉండాలి. ఏ బలం అయినా, ఎవరికీ శాశ్వతం కాదు. ఏదైనా కొంతకాలమే. బలహీనులు వారి బలాన్ని ఎదుటి వారి బలాన్ని అంచన వేసుకుని కూడా విర్రవీగడం మూర్ఖత్వం. ఎక్కడ తగ్గాలో తెలియని వారు సమస్యల పాలవుతారు. ఇలాంటి అంశానికి సంబంధించినదే ఒకటి ధర్మరాజు ప్రశ్న ఉంది.

ప్రశ్న 2 ‘‘శత్రురాజు అధికబలం గలవాడైతే, అల్పబలంగల రాజు ఆపదల నుండి ఎట్లా గట్టెక్కగలుగుతాడు?’’ (శాంతి.3.85).

దానికి సమాధానంగా భీష్ముడు  ‘సముద్ర సరిత్సంవాదం’ను చెప్తాడు. నదులకు సముద్రానికి మధ్య ఈ సంవాదం  జరుగుతుంది. ఇందులో సముద్రం ‘‘మీరు మంచి ఉరవడితో పొంగిపొర్లి పారేటప్పుడు మీ గట్లమీది చెట్లు కూలిపడిపోతుంటాయి కదా! మరి నదుల మధ్యలో ఉండే ప్రబ్బలిచెట్లు పడిపోవేమిటి? అవి మిమ్మల్ని ఏమైనా సంతృప్తి పరిచాయా ఏమి?’’ అని నదులను సరదాగా ప్రశ్నిస్తుంది. ఈ ప్రశ్నకు గంగానది సమాధానం తెలుపుతుంది.
నది గట్లమీద ఉన్న చెట్లు నది ప్రవహిస్తున్నపుడు వాటి బింకం సడలనీయకుండ నిలబడుతాయి. అందువల్ల అవి నీటి వేగాన్ని తట్టుకోక నిట్ట నిలువున వేర్లతో పాటు పెకిలించబడి కూలిపోతాయి. అదే ప్రబ్బలి చెట్లు నది మధ్యలో ఉన్నప్పటికి నదుల వేగాన్ని బట్టి వంగి ఉంటాయి. ఉధృతి తగ్గగానే తిరిగి నిలబడుతాయని నది తెలుపుతుంది. అదేవిధంగా…
‘‘అరి నృపాలు పెంపు నాత్మీయ శక్తియు
నెఱిఁగి మూర్ఖవృత్తి నెదురుపడక
యుచిత వృత్తి నతని యుద్ధతి మేవడి
గడపి హీన బలుఁడు సెడక నిలుచు.’’
(శాంతి.3.90)

ఆపద సమయంలో బలహీనుడైన రాజు తన బలాన్నీ, ఎదుటివాడి బలాన్నీ అంచనా వేసుకోవాలి. పగవాడి మిడిసిపాటును యుక్తిగా దాటవేయాలి. అపుడే ఆ రాజు ఎలాంటి చెరుపూ లేకుండా నిలబడగలుగుతాడు అనే విషయం పై పద్యం వల్ల తెలుస్తుంది. ఈ విషయాన్ని భగవద్గీతలో గమనించవచ్చు. ‘‘యావదేతాన్నిరీక్షేకహం యోద్ధు కామానవస్థి తాన్‌…’’ (భగవద్గీత.1.22) శత్రువులతో తలపడుటకు ముందు వారి బలాబలాలను గమనించుకోవాలి. ఇలా గమనించుకోవడం ఉత్తముల లక్షణం. అందుకే అర్జునుడు రెండు సేనల మధ్య రథాన్ని నిలుపు మంటాడు. మన బలాన్ని ఎదుటి వారి బలాన్ని అంచన వేసుకున్న తర్వాతే మనం దేనికైన సిద్ధం కావాలి. ఈ విషయం లోక వ్యవహారంలో కూడా ‘కయ్యము, వియ్యము, నెయ్యము సమానులతోనే చేయాలి’ అనే మాట ప్రచారంలో ఉంది. అంటే ఇక్కడ మనకంటే అధికులతో ఏ విషయంలోను తలపడడం మంచిది కాదని గమనించాలి. అదే ఆపత్కాల ఆలోచన ధర్మం. ఆపద సంభవించిన సమయంలో అణిగి, మణిగి ఉండడమే ధర్మంగా కనిపిస్తుంది. అందరికీ తెలిసిన వేమన పద్యం ‘‘అనువుగాని చోట నధికుల మనరాదు…’’ అన్నట్లు సమయానుకూలంగా మసలుకోవడం మానవ కర్తవ్యంగా గమనించవచ్చు. అట్లాగే భర్తృహరి నీతి శతక అనువాద పద్యం ‘‘ఒకచో నేలను పవ్వళించు…’’ వాక్యంతో ప్రారంభమయ్యే పద్యం లక్ష్య సాధనకోసం తనను తాను మలచుకున్న విషయం గుర్తుకు వస్తుంది. ఈ విషయం అప్పుడు, ఇప్పుడు, ఎప్పటికి; రాజులకు, సామాన్యమానవులకు అందరికి ఉపయోగకర అంశం.
ఎదుటివారి సమర్థ్యాన్ని అంచన వేసి తనకంటే బలవంతుల ముందు తలవంచుకోవడం మంచింది. దీనికి పై కథలో వంగిన తుంగ గడ్డి ఆదర్శం. నిండుగా పారినపుడు ఎంతగా వంగుతుందో నీరు తగ్గిన కొలది తల ఎత్తుకు నిలబడతుంది. చివరకు ఆ నీరు ప్రవాహం (బలం) తగ్గిన తర్వాత తన వేర్లను అడ్డంగా ఉంచి పారకుండా కూడా చేస్తుంది. సామర్థ్యం తెలుసుకుని తగ్గుతున్నారంటే అవకాశం వెతుకుంటున్నారని అర్థం. ‘‘సారాసారం బలం వీర్యమ్‌ ఆత్మనో ద్విషతశ్చ యః । / జానన్విచరతి ప్రాజ్ఞః న స యాతి పరాభవమ్‌ ॥’’ (శ్రీమహాభారతము, శాంతిపర్వము, అధ్య`113, శ్లో`13) అనే శ్లోకంలో తెలియజేసినట్లు శత్రువు, తన సారాన్ని ` అసారాన్ని, బలాన్ని ` పరాక్రమాన్ని గుర్తించి నడుచుకునే ప్రాజ్ఞుడు పరాభవాన్ని పొందడు.

ఆధార గ్రంథాలు :
1. సుబ్రహ్మణ్యం, జి.వి. సంపా. ‘కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము’ (అన్ని పర్వాలు, 15 సంపుటాలు). 2014. తిరుపతి: తి.తి.దే.
2. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. శ్రీనివాసులు, సూరం. సంపా.  ‘శ్రీమహాభారతము’ (అన్ని పర్వాలు, 7 సంపుటాలు). 2018. గోరఖ్‌పూర్‌: గీతాప్రెస్‌.
3. హనుమంతరాయ శర్మ, బలభద్రపాత్రుని. ‘మహాభారత విమర్శనము’ (రెండు సంపుటాలు). 1996. గుంటూరు: భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌.
4. అప్పలస్వామి, పురిపండా. ‘వ్యావహారికాంధ్ర మహాభారతం’ (శాంతి పర్వము). 1976. రాజమండ్రి: ప్రాచీన గ్రంథావళి.
5. లక్ష్మీనారాయణ, గంగిశెట్టి. ‘భీష్ముడు చెప్పిన రాజనీతి కథలు’ 1986. హైదరాబాద్‌: తెలుగు విశ్వవిద్యాలయం.

డా. అట్టెం దత్తయ్య
సహాయాచార్యులు, ఎస్‌.వి.కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
ఫోన్: 9494715445

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *