మహాభారతం: ‘ధర్మ’రాజు ప్రశ్నలు – ‘భీష్మ’ సమాధానాలు -1

ఉపోద్ఘాతం: మహాభారతం వివిధ రకాల ఆలోచనలు గల వ్యక్తులకు వివిధ రకాలుగా కనిపిస్తుంది. భారతం ఒక గ్రంథమే అయినప్పటికి అది అనేక శాస్త్రాల సమ్మేళనం. అందుకేనేమో నన్నయ ‘‘ధర్మతత్త్వజ్ఞులు ధర్మశాస్త్రంబని, యధ్యాత్మవిధులు వేదాంతమనియు, నీతి విచక్షణుల్‌ నీతి శాస్త్రంబని…’’ (శ్రీమదాంధ్ర మహాభారతము, ఆది.1.32) అనే పద్యంలో ధర్మతత్త్వజ్ఞులు, ఆధ్యాత్మికవేత్తలు, నీతివిచక్షణులు, కవులు, లాక్షణికులు, ఐతిహాసికులు, పౌరాణికులు మొదలైన వర్గీయులందరికి మహాభారతం వారికి కావల్సిన రీతిలో ధర్మశాస్త్రంగా, ఆధ్యాత్మికశాస్త్రంగా, నీతిశాస్త్రంగా, మహాకావ్యంగా, లక్షణశాస్త్రంగా, ఇతిహాసంగా, పురాణంగా గోచరిస్తూ సమాధానాన్ని ఇస్తుందని తెలియజేసాడు. ఇందులో అనేక ఆఖ్యానాలు, ఉపాఖ్యానాలు, సంవాదాలు ఉన్నాయి. వాటితో పాటు ప్రశ్నల పేరుతో యక్షప్రశ్నలు, నహుష ప్రశ్నలు, ధర్మరాజు ప్రశ్నలు కూడా కనిపిస్తాయి.
తెలుగు వాఙ్మయంలో ప్రామాణిక మహాగ్రంథాలు చాలా వరకు కొందరి ప్రశ్నల వల్లనే ఉద్భవించాయి. మహారచయితలు సామాన్యులకు సైతం చేరువ కావాలనే ఉద్దేశంతో పాఠకులకు వచ్చే సంశయాన్ని వారే ప్రశ్నలుగా మలచి సమాధానాలు అందించిన గ్రంథాలను కూడా మనం గమనించవచ్చు. ప్రత్యేక ప్రశ్నోత్తర గ్రంథాలు మాత్రమే కాకుండా వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు వంటివాటిలో భాగంగా కూడా ప్రశ్నోత్తరాలు దర్శనమిస్తాయి. ఇలాంటివాటిలో భారతం ప్రత్యేకం. భారతంలో ముఖ్యంగా జనులందరికీ చేరువైనవి యక్షప్రశ్నలు. అట్లాగే మూలభారతం ఆధారంగా నహుష ప్రశ్నలు కూడా కొంత వెలుగులోకి వచ్చాయి. కాని అదే భారతం, శాంతి పర్వంలో గల ధర్మరాజు ప్రశ్నల మీద కావాల్సినంత పరిశీలన జరగలేదని నా భావన.
ధర్మరాజు ప్రశ్నల నేపథ్యం: ఏ కారణం లేకుండా పశ్నాలేదు. సమాధానం లేదు. అన్నట్లుగా ఈ ధర్మరాజు ప్రశ్నలకు కారణం కూడా ఉంది. అదేమిటంటే  కురుక్షేత్రయుద్ధం అనంతరం ధర్మరాజు చింతాక్రాంతుడైనాడు. పశ్చాత్తాపం పొందాడు. జరిగిన సర్వనాశనానికి అతడే కారణమనుకున్నాడు. అందుకే తనకు రాజ్యపాలన అర్హత లేదని, తాను మహా పాతకుడినని బాధపడ్డాడు. ఆ పాప నివారణ జరగాలంటే తాను అరణ్యవాసానికి వెళ్ళి, భిక్షాటనచేస్తూ తపమాచరించాలని నిర్ణయించుకున్నాడు. ఆ సమయంలో తమ్ములు, ద్రౌపదీ, శ్రీకృష్ణుడు ధర్మరాజును పట్టాభిషేకానికి రకరకాల మాటలతో ప్రేరేపించాల్సి వచ్చింది. వేదవ్యాసుడు కూడా బోధించాడు. చివరకు షోడశమహారాజు వృత్తాంతం చెప్పిన తర్వాత రాజ్య పట్టాభిషేకానికి అంగీకరించాడు. పట్టాభిషేకం అనంతరం కూడా ధర్మరాజు మనస్సు సంతోషంగాలేదు. ఆ రాజు మనశ్శల్యాన్ని సరిచేయడానికి భీష్ముడే సరైనవాడని వ్యాసుడు, కృష్ణుడు కలిసి నిర్ణంయించారు. భీష్ముడు ఆ సమయంలో అంపశయ్యమీద పడుకుని ఉత్తరాయణం కోసం ఎదురుచూస్తున్నాడు. స్వయంగా కృష్ణుడు పాండవులను వెంటపెట్టుకుని అతని దగ్గరు వెళ్ళాడు.
భీష్ముడిని కుశల ప్రశ్నలు అడిగిన తర్వాత శ్రీకృష్ణుడు ‘‘ఈ ధర్మరాజు మిత్రులు, బంధువులు అందరు మరణించగా దుఃఖంతో బాధాతప్తుడై ఉన్నాడు. నీ ఉత్తమమైన మాటల పోహళింపుచేత ధర్మరాజు బాధను తొలగించవసిందని కోరుతున్నాను.’’ (శాంతి.2.109) అని అన్నాడు. కృష్ణుడి రాకకు భీష్ముడు సంతోషించాడు. ఆయనకు కుచ్చుకుని ఉన్న బాణాలతో శరీరంతో పాటు, మనస్సుకూడా వశవర్తి కానివ్వడం లేదు. కృష్ణుడితో సంభాషించే సామర్థ్యం కూడా లేదు. కంఠధ్వని, నాలుక స్పష్టతను కోల్పోయాయి. ప్రత్యుత్తరం ఇవ్వలేను క్షమించండని భీష్ముడు అంటాడు. ఆ బాధలు తొలగిపోవడానికి కృష్ణుడు భీష్ముడికి మూడు వరాలు ఇచ్చాడు. బాణాల వల్ల ఎలాంటి నొప్పి కలుగకుండా సుఖంగ ఉండుట మొదటిది. ఆకలి దప్పుల పీడ లేకుండా ఉండుట రెండవది. అతని మనసు దేనికి అంటకుండా అతిశయజ్ఞానాన్ని పొందుట మూడవది. అప్పుడు భీష్ముడు ఏ బాధ లేకుండా ఉన్నతమైన విజ్ఞానాన్ని పొందినట్లు కూడా గ్రహించాడు. అయినప్పటికీ కృష్ణుడినీ ‘‘పాండవులకు ఇవన్నీ నీవెందుకు చెప్పవు’’ అని అడుగుతాడు. ‘‘అత్యుత్తమ కీర్తిని నీకు కూడా ప్రసాదించాలని తదనుగుణంగా నా జ్ఞానాన్ని నీ మనస్సులో ప్రవేశపెట్టాను’’ (శాంతి.2.147) ‘‘నీవు సెప్పెడి సువాక్యములును వేదతుల్యంబులై వెలయుచుండు…’’ (శాంతి.2.148) అని భీష్ముడు చెప్పే మంచి మాటలన్నీ వేదాలతో సమానమైనవని శ్రీకృష్ణుడు పలికాడు. ఈ మాటల ఆధారంగా భీష్ముడు చెప్పబోయె సమాధానాలు అన్నీ కృష్ణుడు చెప్తున్నట్లుగానే భావించాలి. ఇందులో ధర్మరాజు ఇంచుమించు 205 ప్రశ్నలు అడిగాడు. ధర్మరాజుకి భీష్ముడు స్వధర్మాచరణ గురించే బోధించాడు. భగవద్గీతలో కూడా అర్జునుడికి శ్రీకృష్ణుడు అదే బోధించాడు. ఈ భీష్మబోధ కూడా ఒక భగవద్గీత వంటింది. భగవద్గీత ప్రభుసమ్మితము. అందులో ఉపాఖ్యానాలు లేవు. కాని భీష్మబోధ సుహృత్సమ్మితము. ఇది అనేక ఉపాఖ్యానాల సమ్మేళనం కూడా. కొన్ని సమాధానాలను భీష్ముడు కాంతా సమ్మితంగా కూడా తెలియజేసినట్లు కనిపిస్తాయి.
భీష్ముడు`ధర్మరాజు: ప్రశ్న ఒక మెట్టు అయితే సమాధానం మరొక మెట్టు. అంటే ప్రశ్నించే వారి స్థాయి కూడా ఒక ప్రత్యేకమైనదే. ఉత్తరం అందించే వారిస్థాయికి తగ్గట్టుగా ఉండాలి. లేకుంటే ప్రశ్నోత్తరాలలో పస ఉండదు. ఇక్కడ భీష్ముడు, ధర్మరాజు ఇద్దరు మహానుభావులే. భీష్ముని గురించి ఈ సందర్భంలో కృష్ణుడు
‘‘రాజటె! రాగహీనుఁడటె! రాజిత సుందరమూర్తి యట్టె! వి
భ్రాజిత సంపదున్నతి విభాసిత వర్తనుడట్టె! కామినీ
రాజి మనోజ్ఞభంగి చతురత్వ ధనుండటె! బ్రహ్మచర్య దీ
క్షా జిత మన్మథుండు నటె! జన్మము లిట్టివి యెందు గల్గునే?’’
(శాంతి.2.103)
అనే పద్యంలో క్షత్రియుడిగా జిన్మించాడు. విరాగియై మహర్షిగా జీవించాడు. ఎంతటి ప్రకాశ సుందరమూర్తియో అంతేకంటే అత్యున్నత ప్రకాశంగా వెలుగొందే నడవడిక కలవాడు. స్త్రీ సమూహానికి మనోహరమైన నైపుణ్య సంపద కలవాడు. కాని బ్రహ్మచర్యదీక్షచేత మన్మథుడిని జయించినవాడు. ఇట్లాంటి జన్మలు మరెక్కడైనా సంభవిస్తాయా? అంటాడు. అంతేకాదు ‘‘చతుర్వర్ణాల ప్రజలు, చతురాశ్రమాలలో ఆయా ప్రజలు చేయవలసిన అర్హమైన కార్యకలాపాలు, చతుర్వేదాలలో చెప్పబడిన అన్ని ధర్మాలు నీకు తెలుసు. ప్రవృత్తినివృత్తి మార్గాలు, సాంఖ్యయోగాలు, పురాణేతిహాసాలు, ధర్మశాస్త్రాలు నీకు తెలుసు. ప్రవృత్తినివృత్తి మార్గాలు, సాంఖ్యయోగాలు, పురాణేతిహాసాలు, ధర్మశాస్త్రాలు నీకు కరతలామలకాలే. నీవు సర్వసంశయాలను నివృత్తి చేయగల సమర్థుడవు. మీవంటి వారి సర్వసమర్థతకు, బుద్ధివిస్తారతకు, శోకమోహాలతో బాధా సంతుప్తులైన ప్రజలను తరింపచేయటమే ప్రయోజనం కదా!’’ (శాంతి.2.110) అనే కృష్ణుడి మాటలు భీష్మునియొక్క అనుభవత్వాన్ని, విజ్ఞానాన్ని, సామర్థ్యాన్ని తెలియజేస్తాయి. ఇంతటి మహోన్నత వ్యక్తిని ప్రశ్నలు అడగాలి అంటే అన్ని రకాల విషయ విజ్ఞానం అవసరం. అట్లాంటి వారు భారతంలో ధర్మరాజు ఒకరే కనిపిస్తారు. ఆ ధర్మరాజును గురించి ఈ సందర్భంలో స్వయంగా భీష్ముడే ‘‘ఎవ్వఁడు పుట్టిన నెల్ల మునీంద్రులు…’’ (శాంతి.2.151) అనే పద్యంలో ఎవ్వడి జన్మకారణంగా సమస్త మునీంద్రులు సంతోషాంతరంగులయ్యారో, పరమాధార్మికులని పేరు పొందిన భరత వంశీయులు కూడా ఎవ్వడితో సాటిరారో, సత్యం, శౌచం, శాంతి దాంతులు ఎవ్వడియందు ప్రకాశిస్తూ ఉంటాయో, పాత్రులైన వారికే దానం చేయటం, యజ్ఞాలనూ, బంధువులను, రక్షించటం మొదలైన ఉత్తమ ధర్మాలన్నీ ఎవడికి సంతోషాన్ని కలిగిస్తుంటాయో, కామంవలన కాని, భయం వలన కాని, అవినీతి మార్గంలో ఎవడయితే ప్రవేశించడో అటువంటి ఉత్తమగుణగణుడైన వాడు ధర్మరాజు అంటాడు. భారతంలో ధర్మరాజు బహుముఖీనంగా దర్శనమిస్తాడు. ఎంతటి వీరుడో అంతటి శాంతిమంతుడు. ధర్మాధర్మాలు తెలిసివాడు. కుటుంబ నిర్వహణలో, రాజ్య పాలనలో తనకుతానేసాటి. ఆయన స్వయంగా రాజు అయినప్పటికి ధర్మగామి, మోక్షగామి. బాల్యంనుడి అనేక సమస్యలను ఎదుర్కొన్నవాడు కావడంతో అన్ని రకాల ప్రశ్నలను అడిగాడు. 
ప్రశ్నలు – సమాధానాలు: మనిషి పరిణామ రహస్యం ప్రశ్నించడం అనే సులభమైన ప్రక్రియతో ప్రారంభమౌతుంది.  ఏదైనా తెలుసుకోవాలంటే ఎరుకతో ప్రశ్నించడమే ఏకైకమార్గం. ప్రశ్నించడం అనేది తనను తాను అభివృద్ధి పరచుకోవడానికి ఓ మంచి పరికరం. ప్రశ్నలే ఉన్నత లక్ష్యాలవైపు నడవడానికి సహాయం చేస్తాయి. ప్రశ్నించడం ఒక కళ. ప్రశ్నించడం ఒక బాధ్యత. ప్రశ్నించడం ఒక తెలివిడి కోసం చేసే యత్నం. ప్రశ్నలు పలురకాలు. మానసిక సంబంధమైనవి. శారీరక సంబంధమైనవి. ఆధ్యాత్మిక సంబంధమైనవి. సమాజ సంబంధమైనవి. ప్రశ్నలు అడగడంలో కూడా తేడాలుంటాయి. తెలుసుకోవాలనే జిజ్ఞాసతో అడగడం. ఎదుటివాడికి తెలుసాలేదా పరీక్షకోసం అడగడం. నాకు ఆ రంగంలో విజ్ఞానం ఉందని చూపించుకోవడం కోసం అడగడం. అడిగిన ప్రశ్న ఆధారంగా వారి స్థాయిని నిర్ణయించవచ్చు. మనస్తత్వాన్ని గమనించవచ్చు. అడిగే ప్రశ్నలు వారి అస్తిత్వాన్ని కూడా పట్టిస్తాయి.
అసలైన ప్రశ్నలు సమాధానాలు అంతంకాని గొలుసువంటివి. సమాధానం కూడా మరొక ప్రశ్నకు దారితీసినప్పుడే మనిషి ఎదుగుదల నిరంతరం పరివ్యాప్తంమవుతూ ఉంటుంది. చాలామంది ఈ ప్రయాణంలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. లభించిన సమాధానంతోనే సంతృప్తిచెందే వారు ముందుకు వెళ్ళలేరు. ప్రశ్నను సమీకరించి సరైన మార్గంలో సంధిస్తే సమాధానం కనుగొనడం అసాధ్యం కాదు. ప్రశ్నను అడగడం అంటే మనల్ని మనమే సమాధానాలను అందుకునే ప్రథంలో నియమించుకోవడం అని అర్థం. ప్రశ్నను కలిగి ఉన్నప్పుడే సమాధానాలను ఆకర్షించగల శక్తిని కలిగి ఉంటారు. ప్రశ్నించిన వ్యక్తికి సమాధానం తెలుసుకోవడంలో ఉత్సాహం లేనప్పుడు అక్కడ సమాధానం ఉండదు. ప్రశ్నించడం అనేది విత్తునాటడం వంటిది. ఏ విత్తును నాటుతున్నారో ఆ వృక్షఫలాలను పొందుతారు.
ధర్మరాజు ఎలాంటి ప్రశ్నలు అడిగాడు: మొదట రాజధర్మాలను, తరువాత ఆపద్ధర్మాలను, అనంతరం మోక్షధర్మాలకు సంబంధించిన ప్రశ్నలు కనిపిస్తాయి.
రాజధర్మాలు: ‘రాజధర్మము’ అనే పదానికి శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు ‘రాజు చేయవలసిన పని, రాజుకు సంబంధించు ధర్మము’ (శ్రీసూర్యరాయాంధ్ర నిఘంటువు. సం.5.పుట.969) అర్థాలను అనే తెలుపుతుంది.
‘‘సర్వే ధర్మాః రాజ ధర్మ ప్రధానాః 
సర్వే త్యాగః రాజధర్మేషు దృష్టాః
సర్వా దీక్షా రాజ ధర్మేషు చోక్తాః
సర్వా విద్యా రాజధర్మేషు యుక్తాః
సర్వే లోకాః రాజధర్మే ప్రవిష్టాః.’
’ (సం.భారతం. శాంతి.63అధ్యా.27శ్లో) అనే మూల భారత శ్లోకాల ప్రకారం అన్ని ధర్మాలలో రాజధర్మమే ప్రధానమని తెలుస్తుంది. రాజధర్మాలోనే అన్ని త్యాగాలు కనిపిస్తున్నాయి. సమస్త దీక్షలు రాజధర్మాలోనే చెప్పబడ్డాయి. సర్వ విద్యలు రాజధర్మాలోనే ఇమిడి ఉన్నాయి. సర్వలోకాలు రాజధర్మంలోనే ప్రవేశించాయి అని తెలియపరుస్తున్నాయి. మరో శ్లోకం రాజు మాహాత్మ్యాన్ని తెలియజేస్తుంది.
‘‘మాతా పితా గురుర్గోప్తా వహ్నిర్వైశ్రవణో యమః
సప్తరాజ్ఞో గుణానేతాన్‌ మనురాహ ప్రజాపతిః.’’
(భారతం శాంతి 139అధ్యా.104శ్లో) రాజు ప్రజలయెడ కృపకలిగి రక్షించును ` కాబట్టి తండ్రి. దీనులను దుఃఖితులను ` భాగ్యవంతులను అందరిని సమానదృష్టితో చూసే వాడు కాబట్టి తల్లి. ప్రజలలో ` అప్రియులైన వారిని దహించును గనుక అగ్ని దుష్టుల దమనమతని విధి కనుక యముడు, ప్రియ జనులకు రెండు చేతుల దానమొసంగును గనుక కుబేరుడు. ధర్మోపదేశము గావించును గనుక రాజే గురువు. సర్వుల రక్షించువాడు గనుక రక్షకుడతడు అంటూ పై శ్లోకం రాజునే సర్వస్వుడిగా ప్రకటించింది. వివిధ సందర్భాలలో రాజులు పాటించిన, పాటించాల్సిన అనేక అంశాలను భీష్ముడు ధర్మరాజుకు తెలియజేసాడు.
ఆపద్ధర్మాలు: ‘ఆపద్ధర్మం’ అంటే నిఘంటువు ప్రకారం ‘ఆపదయందు అనుష్ఠింపదగిన ధర్మము’ (శ్రీ సూర్యరాయాంధ్ర నిఘంటువు. సంపు.1.పు.391) అని తెలుస్తుంది. ప్రాణాపాయ స్థితిలో కాని, మార్గాంతరం లేనపుడు గాని అనుసరించవలసిన విధానమే ఆపద్ధర్మం. ఆపద్ధర్మాలనేవి ఆపద తీరిన తరువాత విడువవల్సినవే తప్ప అవి సదాచారాలు కావు. తాత్కాలికంగా గండం గడిచిన తర్వాత సామాన్య జీవితానికి రావాలి. ఈ ఆపద్ధర్మాలు ఒక్కొక్కపుడు ధర్మాన్ని అధర్మంగాను, అధర్మాన్ని ధర్మంగాను మారుస్తాయి.
ఆపదలు పలురకాలుగా కనిపిస్తాయి. అవన్ని రెండు విధాలుగా సంభవిస్తాయి. మనుషుల వల్ల, దైవం వల్ల. మనుషులవల్ల సంభవించే వాటిని ఐదు రకాలుగా చూడవచ్చు. 1. అధికారుల వల్ల 2. దొంగల వల్ల 3. పాలకుల సన్నిహితుల వల్ల 4. విరోధుల వల్ల 5. దురాశల వల్ల. దైవికంగా సంభవించే ఆపదలునూ ఐదురకాలు. 1. దుర్భిక్షం 2. వరదలు 3. వ్యాధులు 4. అగ్ని 5. మరణం.
ఈ ‘ఆపద’ను గురించి భారతంలో ‘ఆపత్తు, కష్టము’ అనే అర్థంలో కొన్నిచోట్ల వాడినట్లు కనిపిస్తుంది.
‘‘ఒక నాఁడేమును నాపదలకు విడుమరఁగాంచి…’’ (విరా.1.49)
‘‘శిఖిచోరాది ముఖ్య విషయాపదకున్‌…’’ (శాంతి.4.34)
‘‘కోపంబును లోభంబును, నేపారి మనంబు గలఁప నెప్పుడుఁజింతాతాపంబు నొందు సధనుండాపదగా…’’ (శాంతి.4.35)  అనే పై మూడు ఉదాహరణల్లో ‘విపత్తు, కష్టము’ అనే అర్థాల్లోనే వాడారు. ముఖ్యంగా భీష్ముడు బోధించిన ఆపద్ధర్మాల గురించి ‘ఆపదలయందు అవలంబించదగిన ధర్మం’ గా కనిపిస్తాయి.
‘‘గాయంబు వికృతులఁగాల పర్యయముల వచ్చు
నాపద్ధర్మ వర్తనములు…’’
(ఆను.5.216)  శరీర, కాల మార్పుల వల్ల వచ్చేవి ఆపద్ధర్మాలుగా చెప్పాడు. ఇక్కడ శరీరానికి ఆపద కలిగిన సమయంలో ఆపద్ధర్మంగా కొన్నింటిని అధిగమించవచ్చు అని తోస్తుంది. శాస్త్రాలు ‘శరీరం ఖలు ధర్మ సాధనం’ అంటూ శరీరాన్ని కాపాడుకున్నపుడు ధర్మాన్ని సాధించవచ్చు, నిలబెట్టవచ్చు. ప్రతిసామాన్యుడికి అవసరమయే ఈ ఆపధర్మాలను భీష్ముడి మాటల్లో చాలా తెలుసుకునే అవకాశం ఉంది.
మోక్షధర్మాలు: సామాన్యంగా మనిషికి కలిగే ఆత్మవిషయపరంగా చిన్నా పెద్దా సంశయాలన్నిటిని తీర్చి మానవుడు తనను తాను తీర్చిదిద్దుకునే మార్గాన్ని నిపుణతతో బోధించిన విషయాలన్ని మోక్షధర్మాలు.
‘‘భారతీయ తత్త్వశాస్త్రంలో మోక్షము పరమపురుషార్థము. జనన మరణ రూపమైన భవబంధము నుండి విడివడి శాశ్వతానందము పొందుట మోక్షమనబడుతుంది. సకల క్లేశములు తొలగినపుడు సంసార బంధముక్తి కలుగుతుంది. కర్మలు స్వఫలోపభోగం దాకా నిలిచి, క్షీణించి పోవును. కర్మలకు మూలం అజ్ఞానం. అజ్ఞానమే అవిద్య. తత్త్వజ్ఞానం వలన అజ్ఞానం నశిస్తున్నది. కర్మజనితమైన బంధము, తజ్జన్యమైన జననమరణాది రూప దుఃఖము సమూలముగా నశించిపోవుచున్నది. అందువలన దర్శన కర్తలెల్లరు ‘తత్త్వజ్ఞానాన్‌ మోక్షః’. న్యాయవైశేషిక దర్శనాలు చరమ దుఃఖ ధ్వంసంగా అనగా అత్యంతిక దుఃఖ నివృత్తిగా నిరూపించినారు…’’ (శ్రీభాష్యం విజయసారథి, న్యాయ వైశేషికములు సాంఖ్యయోగములు.పు.61) అంటారు.
మరో గ్రంథంలో మోక్షం గురించి ‘‘మోక్ష మనగా విడుదల. బంధమునుండి విడుదల. దుఃఖ భూయిష్టమగు సంసార బంధమునుండి విముక్తి నొందుటయే మోక్షము. పుట్టుక చావులనుండి తప్పించుకొనుటయే మోక్షము. అవిచ్ఛిన్న ఆత్మానందానుభూతిని బడయుటమే మోక్షము. స్వస్వరూపమగు దైవమందు నిలుకడ కలిగియుండుటయే మోక్షము. దేహభారమును, మనోభారమును, జీవభారమును వదిలించుకొనుటయే మోక్షము. భారరహితమగు ఆత్మయందు నిలుకడ కలిగియుండుటయే మోక్షము…’’ (విద్యాప్రకాశనందగిరి, ‘మోక్షసాధన రహస్యము.పు.1) ఇలా సెలవిచ్చారు. ‘‘మోక్షస్థితియందు జీవుడు శివుడుగా మారును. నరుడు నారాయణుడై విలసిల్లును. భక్తుడు భగవంతుడై భాసించును. మానవుడు మాధవుడుగా పరిణమించును. అది ఒక అపూర్వ ఆనందస్థితి. దుఃఖము లవలేశమైనను అచ్చోట గాన్పించకుండును. ఈ ప్రపంచములో అన్ని లాభములకంటెను, గొప్ప లాభకరమైన స్థితియని’’ దానిని గీతాచార్యుడు పేర్కొనెను.
‘‘యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తతః ।
యస్మిన్‌ స్థితో న దుఃఖేన గురుణాకపి విచాల్యతే ॥’’
(భగవద్గీత.6.22)
పై శ్లోకంలో ‘దేనిని పొందిన తర్వాత పొందదగనిది మరొకటి లేదని అనుకుంటాడో, దేనియందు నిలిచి ఎంత గొప్ప దుఃఖంలో కూడా చలించడో’ అచ్చోట జీవునకు కలుగు ఆనందము అవర్ణనీయము…’’ (విద్యాప్రకాశనందగిరి, ‘మోక్షసాధన రహస్యము.పు.28). మోక్షాన్ని కొనియాడారు. ఇంతటి మహోన్నతమైన మోక్షాన్ని గురించి ధర్మరాజు అనేక ప్రశ్నలను అడిగాడు. మూడు రకాల ధార్మిక ప్రశ్నలన్నింటికి శరశయ్యమీద ఉన్న భీష్ముడు ఇతిహాసదృష్టాంత పూర్వంగా, శాస్త్రసమ్మతంగా సమాధానాలు చెప్పాడు.
‘‘ధర్మజునకు నీ చెప్పెడు
ధర్మస్థితి వాక్యసమితి తాత్పర్యముతో
నిర్మలులై కొనియాడెడు
ధార్మికులకు నుభయజగదుదాత్తత కలుగున్‌.’’
(శాంతి.2.149) అంటూ కృష్ణుడు అభయాన్ని కూడా ఇచ్చాడు. (సశేషం)

ఆధార గ్రంథాలు:
1. సుబ్రహ్మణ్యం, జి.వి. సంపా. ‘కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము’ (అన్ని పర్వాలు, పదిహేను సంపుటాలు). 2014. తిరుపతి: తి.తి.దే.
2. హనుమంతరాయ శర్మ, బలభద్రపాత్రుని. ‘మహాభారత విమర్శనము’ (రెండు సంపుటాలు). 1996. గుంటూరు: భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌.
3. భూమయ్య, అనుమాండ్ల. సంపా. ‘ఆంధ్రమహాభారత పీఠికలు’. 2010. హైదరాబాదు: పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం.
4. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. శ్రీనివాసులు, సూరం. సంపా.  ‘శ్రీమహాభారతము’ (అన్ని పర్వాలు, ఏడు సంపుటాలు). 2018. గోరఖ్‌పూర్‌: గీతాప్రెస్‌.
5. శివారెడ్డి, ఎల్లూరి. సంపా. ‘ఆంధ్ర మహాభారతోపన్యాసములు’ (ఉపన్యాస సంకలనం). 2007. హైదరాబాదు: ఆంధ్రసారస్వత పరిషత్తు.

డా. అట్టెం దత్తయ్య
సహాయాచార్యులు, ఎస్‌.వి.కళాశాల, ఢిల్లీ విశ్వవిద్యాలయం.
ఫోన్: 9494715445

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *