విమర్శకునిగా దేవులపల్లి రామానుజరావు

సాహిత్య విమర్శ అంటే మౌలికంగా ఒక అభిప్రాయమే. సాహిత్య విమర్శకులు మొదట పాఠకులై ఉండాల్సిందే.
పాఠకులు విమర్శకులుగా రూపొందడానికి వారు నాలుగు రకాల లక్షణాలు కలిగి ఉండాలి. ఒకటి సహృదయత్వం,
రెండు ఆలోచనాపరులై ఉండటం, మూడు సామాజిక బాధ్యత కలిగి ఉండటం, నాలుగు సాహిత్య బాధ్యత కలిగి
ఉండటం. ఈ నాలుగు లక్షణాలు ఉన్నప్పుడు వారు విమర్శకులుగా రూపొందుతారు. తెలంగాణ సాహిత్య విమర్శ
వికాసంలో, మొత్తంగా తెలుగు సాహిత్య విమర్శ వికాసంలో పై లక్షణాలు కలిగిన విమర్శకులు చాలామంది ఉన్నారు.
అందులో దేవులపల్లి రామానుజరావు ఒకరు.
మనిషి సంఘజీవి. సంఘంలోని ప్రతీ చలనం ఎంతో కొంత స్థాయిలో మనుషులపై ప్రభావం చూపుతుంది.
ప్రతీ వ్యక్తి ప్రత్యక్షంగానో, పరోక్షంగానో తన చుట్టూ ఉండే కుటుంబం, రాజకీయ పరిస్థితుల ప్రభావానికి లోనవుతాడు.
తండ్రి వేంకట చలపతిరావు పట్టణ ప్రముఖులుగా ఉండటంతో తమ ఇంటిలో సాహిత్య, రాజకీయాలకు సంబంధించిన
చర్చలు ఎక్కువగా జరిగేవి. ఇవన్నీ దేవులపల్లి రామానుజ రావులో సాహిత్య జిజ్ఞాస కలగడానికి కారణం అయ్యాయి.
వరంగల్‌లో విద్యాభ్యాసం పూర్తయిన తర్వాత తెలుగుపై మక్కువతో నిజాం కళాశాలలో బి. ఎ. చదివారు. 1938 నాటి
ఓయూ విద్యార్థుల చారిత్రాత్మక వందేమాతరం ఉద్యమంలో కూడా పాల్గొన్నారు. బహిష్కృతులయ్యారు. నాగపూర్ వెళ్లి
అక్కడ న్యాయ శాస్త్రాన్ని చదివారు. అక్కడి జాతీయోద్యమంతో ప్రభావితం అయ్యారు. 1939 – 1940ల నాటికి
గోలకొండ పత్రికల్లో రచయితగా గుర్తింపు తెచ్చుకున్నారు. మాడపాటి హనుమంతరావు, సురవరం ప్రతాపరెడ్డి,
మందుముల నరసింగరావు, బుక్కపట్నం రామానుజరావు వార్ల ప్రోత్సాహం లభించింది.
దేవులపల్లి రామానుజ రావుకు విస్తృత అధ్యయనం ఉంది. చారిత్రక దృష్టితో వర్తమాన అంశాలపై అనేక
రచనలు చేశారు. సహృదయ పాఠకునిగా, సాంస్కృతికోద్యమ కార్యకర్తగా, వివిధ సంస్థలకు బాధ్యుడిగా విస్తృతంగా
పనిచేశారు. తన విమర్శ రచనా వ్యాసంగాన్ని ప్రధానంగా రెండు మార్గాలలో చేశారు. అందులో మొదటిది వ్యాసం,
రెండోది ప్రసంగం. సాహిత్య విమర్శకుడిగా సారస్వత నవనీతం, వ్యాస మంజూష, తెనుగు సాహితీ, నా రేడియో
ప్రసంగాలు, నా సాహిత్యోపన్యాసాలు, వేగుజుక్కలు, తెనుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం వంటి గ్రంథాలను
రచించారు. దేవులపల్లి రామానుజరావు గారు సాహిత్య విమర్శ చరిత్రలో గుర్తించదగ్గ ప్రతిపాదనలు చేశారు. ఈయన
సాహిత్య విమర్శను ప్రధానంగా మూడు కోణాలలో అధ్యయనం చేయవచ్చు. ఒకటి ప్రాచీన సాహిత్యం, రెండు ఆధునిక
సాహిత్యం, మూడు తెలంగాణ ప్రాంతీయ తెలుగు సాహిత్యం. వీరు తెలంగాణ సాహిత్యం, నవ్య కవిత వికాసానికి
సంబంధించిన విషయాలను చారిత్రక దృష్టితో వివేచించారు. ప్రతీ వ్యాసం భిన్నమైన ఆలోచనలను కల్పించింది.

1

దేవులపల్లి రామానుజరావు గారు ప్రాచీన సాహిత్య విమర్శ అధ్యయనానికి “చరిత్ర”ను ఒక ముఖ్య సాధనంగా
గుర్తించారు. తెలుగులో కన్నా ముందే కన్నడ భాషలోనే ముందుగా లిఖిత సాహిత్యం వచ్చిందనే అభిప్రాయానికి
శాస్త్రీయమైన నిరూపణలు చేశారు. “క్రీ. శ. 7వ శతాబ్దమున దక్షిణాపథమునా తొలుత కర్ణాట ప్రాంతమును, తరువాత
తెలుగు దేశమును చాళుక్యుల వశమైనది. ఈ చాళుక్యులు దేశీయులతో కలిసిపోయి వ్యవహరించడానికి భాషలను
ప్రోత్సహించి, పరిపోషించిరి. వారి కృషి వలన తొలుత లాభపడిన భాష కన్నడము. అందువలన ఆంధ్ర భూమిని
పాలించిన చాళుక్యులు సైతం మొదట కన్నడమునే ప్రోత్సహించిరి. కావునే పంపడు, పొన్నడు మొదలైనవారు జన్మతః
తెలుగుదేశపు వారే అయినను కన్నడమున రచనలు సాగించి, ప్రభువుల ఆదరణను ఆర్జించిరి.” (రామానుజరావు,
దేవులపల్లి. తెనుగు సాహితీ. 1991: 02) పంపడు, పొన్నడు లాంటి తెలుగు రచయితలే రాజాశ్రయం కోసం
కన్నడంలో రచనలు చేయడాన్ని ఆనాటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో వివరించారు. భాష, సంస్కృతుల వికాసానికి
రాజ్య సహకారం అనేది చాలా ముఖ్యమైనది అని చరిత్ర నిరూపిస్తూనే ఉన్నది.
తెలుగు సాహిత్య చరిత్రలో 12వ శతాబ్దికి భిన్నమైన స్థానం ఉంది. ఈ కాలం నాటికి సాహిత్యం
రాజావసరంగా ఉన్న స్థితి నుండి మత అవసరాలను తీర్చే స్థితికి వచ్చింది. వీరశైవాన్ని ప్రచారం చేయడానికి, అది
సామాన్య ప్రజలకు అర్థం చేయించడానికి, సంస్కృతం అవసరం రాదని భావించారు. తెలుగులో సాహిత్య సృష్టికి,
దేశీయ మార్గాలను అన్వేషించారు. నన్నయ కాలపు సాహిత్య భాష వారికి అవసరం రాలేదు. అందుకే శివ కవులు మణి
ప్రవాళ శైలిలోకి మొదటి అడుగులు వేశారు. ఈ స్థితిని వివరిస్తూ రామానుజరావు ఇలా ప్రతిపాదించాడు. “బహుశః
మణిప్రవాళ శైలిలో అనగా సంస్కృత విభక్తులలో సంస్కృత పదములను, తెలుగు విభక్తులతో తెలుగు విభక్తులను
కలగాపులగం చేసి రూపొందించి వాక్యములు కల రచనా రీతిలో కూడా పద్యములు రచించబడేననుట వృషాధిప
శతకమునందలి ఒక పద్యం వల్ల తెలియ వచ్చుచున్నది. ఈ వివిధ సమస్యలకు పరిష్కార మార్గమును చూపినవారు
13వ శతాబ్ది నాటి తిక్కన సోమయాజి” (రామానుజరావు, దేవులపల్లి. తెనుగు సాహితి. 1991: 03) శివ కవులు
చేసిన ప్రయత్నాన్ని తెలుగులో సుస్థిరం చేసిన వాడిగా తిక్కనను గుర్తించారు. సాహిత్యాన్ని కేవల సాహిత్యంగా చదవడం
కాకుండా లోతైన పరిశోధన, పరిశీలన చేయడం రామానుజరావు గారి విమర్శనా దృక్పథం.
రామానుజరావు గారికి కవిత్రయం అంటే తిక్కన, పోతన, వేమనలు. తిక్కనపై ఎనలేని గౌరవం. ఆంధ్ర మహా
భారతాన్ని పూర్తి చేసిన తిక్కన గ్రంథాన్ని ఆనాటి సామాజికార్థిక, రాజకీయ పరిస్థితుల్లోంచి అధ్యయనం చేశాడు. “ఆ
కాలమున తమిళనాడు నుంచి వైష్ణవము, కర్ణాటము నుండి వచ్చిన శైవము ఆంధ్రులయందు ధార్మికముగ చీలికలను
కలిగించి కల్లోలమునకు కారణుమలైనవి. ఈ పరిస్థితి నుండి దేశమును వెలికితీయు తన కృషిని ఆయన హరిహర
మూర్తికి అంకితము చేసి ధార్మికంగా ఒక వెలుగు బాటను చూపించగలిగినాడు.” ఆనాడు వైష్ణవ, శైవ మతాలు ప్రజల్లో,
సాహిత్యంలో అల్లకల్లోలం సృష్టించాయని రామానుజ రావు గారి అభిమతం. ఈ పరిస్థితిని తిక్కన మధ్యేమార్గంగా హరి,

హరులను కలుపుతూ తన గ్రంథాన్ని హరిహర మూర్తికి అంకితం ఇవ్వడం ద్వారా ప్రజల్లో సమన్వయాన్ని తీసుకొచ్చే
ప్రయత్నాన్ని చేశారని ప్రతిపాదించారు.

2

ఆధునిక సాహిత్యానికి మానవ జీవితమే గీటు రాయి. ఇది సాహిత్య విమర్శలో నూతన విమర్శా పరికరాలను
ప్రవేశపెట్టింది. సాహిత్యానికి, సమాజానికి మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. “సంఘ జీవితమునకు
సాహిత్యమునకు విడదీయరాని బంధము కలదు. ఒక కాలమునందలి నాగరికత ప్రత్యేక స్వరూపమును దాల్చుటకు
కారణాలు. ఆ నాగరికతపైన గల యితర ప్రభావములు, ఆ జాతి సాహిత్యమునందు స్పష్టముగా గన్పట్టును. అసాధారణ
ప్రతిభాశాలియగు రచయిత స్వీయ వాఙ్మయమునందు నూత్న శకమారంభించి సమకాలిక సాహిత్యమునకు క్రొత్త
రుచులు గల్పించుటయు కలదు. కాని యెంతటి శేముషీ సింధువైనను సమకాలిక సంస్కృతి విజ్ఞానము ఆదర్శములు,
నైతిక మానసిక విప్లవ శక్తులు మున్నగు వాని ప్రభావము నుండి తప్పించుకొన జాలదు.” (రామానుజరావు, దేవులపల్లి.
తెనుగు సాహితి. 1991: 122) పై ప్రతిపాదన ఆధునిక విమర్శా సూత్రం. ఇదే ఆధునికమైన దృష్టి కూడా. “నవ్య కవిత
నీరాజనం” అనే అంశానికి సంబంధించి కవి స్రష్ట, నవ యుగోదయం, ఖండ కావ్యములు, అభ్యుదయ యుగము అనే
నాలుగు శీర్షికలతో నవ్య కవిత్వ పరిణామ, చారిత్రక క్రమాన్ని అంచనా వేశారు. సాహిత్య చరిత్ర రచనల్లో ఆధునిక
కవిత్వ వికాసాన్ని ఎవరు వికాస దృష్టితో అంచనా వేయలేదు. ఈ లోటును ఈ వ్యాసాలను తీర్చాయి.
తెలుగులో ఆధునిక సాహిత్య ప్రారంభంలో వేంకట పార్వతీశ కవుల రచనలు చాలా ప్రసిద్ధమైనవి. “ఈ వంగ
వైష్ణవ గీతమునందలి రక్తి, ప్రేమ ప్రకృతి పురుషుల లీలా విలాస వర్ణనము వేంకట పార్వతీశ కవుల ఏకాంత సేవయందు
గోచరము” అని ప్రతిపాదిస్తాడు. ఈ వ్యాసాల్లో దేవులపల్లి వారి సూక్ష్మ పరిశీలన, అధ్యయన విస్తృతి వ్యక్తం అవుతుంది.
అలాగే “పరాసు విప్లవమునకు ఆంగ్ల వాఙ్మయమునకు గల సంబంధము వంటిదే గాంధీ తత్త్వమునకు, మన నవ్య కవి
కుమారులు స్వాతంత్ర్య భావములకు గల సంబంధము. ప్లేటో తత్త్వము ఆంగ్ల బావ కవి కుమారుల నే విధంగా
నాకర్షించి వారి ప్రతిభకు దోహద మెనరించినదో అదే విధంగా వైష్ణవ గీతముల భక్తి ప్రేమలు మన కవుల భావనా శక్తిని
విజృంభింపజేసినవి.” (రామానుజరావు, దేవులపల్లి. తెనుగు సాహితి. 1991: 131) తెలుగు సాహిత్యంలో వివిధ వాదాల
నేపథ్యంలో వచ్చిన సాహిత్యానికి తాత్విక ప్రభావం ఉంటుంది. నవ్య కవిత్వం కూడా అలానే ప్రారంభమైంది. ఒక
ప్రాంతంలో ఉండే రాజకీయ భావజాలం ఆ ప్రాంత సాహిత్యంపై పడుతుంది. ఈ ప్రభావమే ప్లేటో తత్త్వం ఆంగ్ల
కవులను ఏ విధంగా ఆకర్షించిందో, తెలుగు ప్రాంతంలోని వైష్ణవ భక్తి గీతాలు ఇక్కడి బావ కవుల ఆలోచనలపై ప్రభావం
వేసినట్లు తులనాత్మక అధ్యయనం ద్వారా విశ్లేషించారు.
ఆధునిక కవిత్వం జీవితం తాలూకు వాస్తవికతను అందిస్తుంది. ప్రజల ఆకాంక్షలు, సంస్కృతులు మొదలైనవి
అన్ని ఆధునిక కవితలో ప్రతిబింబిస్తాయి. “ఆధునిక కవితయందు కవి హృదయము ప్రతిబింబించును. కవి

ఆశయములే, సామాజికములకు పలు విషయములను గురించిన యాతని భావములే నవ్య కవిత యందు
గోచరించును” (రామానుజరావు, దేవులపల్లి. తెనుగు సాహితి. 1991 :131) ఆధునిక కవిత్వ లక్షణాలను విశ్లేషించాడు.
దేవులపల్లి రామానుజరావు గారు నవ్య కవితకు మూడు లక్షణాలు చెప్పారు. 1. ఉత్సాహము. 2 . ఆవేశము, 3.
ఉద్రేకము. భావకవి గురించి చెప్తూ ఒక చమత్కారవంతమైన ప్రతిపాదనను చేశారు. “ఆవేశ సాగరమును నిగ్రహ
సహయమున నీదువాడు కావ్య కర్త. ఏ సహాయము లేక ఆవేశ మే వైపున నీడ్చిన ఆ వైపునకు దిరుగువాడు బావ కవి.”
ఇందులో నవ్య కవిత్వంలోని స్వేచ్ఛా ప్రియత్వాన్ని దర్శించవచ్చు. “రసానుభవమున నార్ధ్ర హృదయుడైన కవి కుమారుని
లేఖిని విన్యాసమే నవ్య కవిత విలాసము” అని నవ్య కవిత వికాసాన్ని ప్రతిపాదించాడు.

3

దేవులపల్లి రామానుజరావు గారికి తాను పుట్టిన తెలంగాణ ప్రాంతం అంటే విపరీతమైన అభిమానం.
తెలంగాణ ప్రాంతాన్ని భాషాపరంగా చూసినప్పుడు తెలంగాణ నేలకు ఉన్న ప్రాంతీయ సాహిత్య ప్రత్యేకతలను సందర్భం
వచ్చినప్పుడల్లా చాటి చెప్పారు. 1978 ఫిబ్రవరి నెల్లూరులో ఎర్రన జయంతి ఉత్సవాలలో చేసిన “తెలంగాణ సాహితీ
వికాసం” అనే ప్రసంగం ద్వారా తెలంగాణ సాహిత్య వివేచనకు సంబంధించి, అందునా ప్రాంతీయ భాష సాహిత్యాల
వికాసంపై నిర్దిష్టమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారని అర్థమవుతుంది. ఈ ప్రసంగంలో తెలంగాణ ప్రాంతంలో వచ్చిన
రచనలను, వాటి వికాస క్రమాన్ని చెప్పారు.
“తెలంగాణ ప్రాంతంలో తెలుగు దీపాలు ఎన్నడూ ఆరిపోలేదు. అప్పటి ప్రభుత్వ విధానాల వలన యీ దీపాలు
దేదీప్యమానముగా ప్రకాశించక పోవచ్చును. కానీ మిణుకు మిణుకుమని వెలుగుచూనే యుండెను.” అనే అభిప్రాయాన్ని
నిర్మొహమాటంగా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ నేల మీద జరిగిన చారిత్రక, వర్తమాన రాజకీయ, సాహిత్యాలను
చారిత్రక దృష్టితో రికార్డు చేశారు. అలాగే తెలంగాణపై ఎంత ప్రేమాభిమానాలు ఉన్నప్పటికి ఈయన విశాలాంధ్ర
వాదిగానే ఉన్నారు. “ఈ కలయిక సహజమైనది, సముచితమైనది” అనే అభిప్రాయంతో ఉన్నారు. అలాగే
“తెలంగాణము – ఆంధ్ర సారస్వత వికాసం” అనే వ్యాసంలో ఇక్కడి సాహిత్య ప్రత్యేకతలను చెప్పారు. “ఆంధ్ర
సాహిత్యము – తెలంగాణము” అనే వ్యాసం కూడా ఇదే కోవకే చెందుతుంది. ఈ విధంగా ఆంధ్ర సాహిత్య చరిత్రలో
తెలంగాణ స్థానాన్ని నిరూపించారు. తిక్కన భారతం, పోతన భాగవతం, భాస్కర రామాయణం ఈ మూడు ప్రధాన
ఇతిహాసాలు ఇక్కడి నేల నుంచే పురుడు పోసుకున్నాయని ప్రతిపాదించారు.
దేవులపల్లి రామానుజరావు విస్తృతమైన అధ్యయన శీలి. సాహిత్య చరిత్రకు ఎంతో రచనా సంపదను
అందించిన వ్యక్తి. ఎంతో మంది తెలుగు సాహిత్య సారస్వత మూర్తులపై వ్యాసాలు రాశారు. కందుకూరి వీరేశలింగం,

కొమర్రాజు, చిలకమర్తి లక్ష్మీ నరసింహం, గురజాడ అప్పారావు, చెళ్లపిళ్ల వేంకటశాస్త్రి, కాశీనాథుని నాగేశ్వరరావు,
ముట్నూరి కృష్ణారావు, కట్టమంచి రామలింగారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, జార్జ్ బెర్నాడ్ షా, బాపిరాజు, విశ్వనాథ,
చలం, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ, నన్నయ, అలాగే ప్రాచీన సాహిత్యం, జానపద సాహిత్యం, ఆధునిక సాహిత్యం,
ప్రాంతీయ ప్రత్యేక సాహిత్యం, ఉర్దూ భాషపై ప్రత్యేక అధ్యయనం తెలుగు సాహిత్యానికి ముస్లింలు చేసిన సేవ వంటి
విలువైన అంశాలపై వ్యాసాలు రచించారు.
ఆధార గ్రంథాలు:

 1. చెన్నయ్య, జె. (సంపా) డా. దేవులపల్లి రామానుజరావు గ్రంథావళి. హైదరాబాద్: తెలంగాణ
  సారస్వత పరిషత్తు, 2017.
 2. రామానుజరావు, దేవులపల్లి. నా సాహిత్యోపన్యాసాలు. హైదరాబాద్: స్వీయ ముద్రణ, 1978.
 3. రామానుజరావు, దేవులపల్లి. తెలుగు సీమలో సాంస్కృతిక పునరుజ్జీవనం. హైదరాబాద్: శ్రీ దేవీ
  పబ్లికేషన్స్, 1983. ఆరవ కూర్పు.
 4. రామానుజరావు, దేవులపల్లి. తెనుగు సాహితీ. హైదరాబాద్: స్వీయ ముద్రణ, 1991.
 5. రామానుజరావు, దేవులపల్లి. యాభై సంవత్సరాల జ్ఞాపకాలు. హైదరాబాద్: ఆంధ్ర సారస్వత
  పరిషత్తు, 2015. ద్వితీయ ముద్రణ.

ఇమ్మిడి మహేందర్
తెలుగు పరిశోధక విద్యార్థి,
ఉస్మానియా విశ్వవిద్యాలయం.
ఫోన్: 9505645706

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *