తెలుగు సినిమా ప్రయాణంలో జానపద గీతాల పాత్ర

తెలుగు భాష ఎంతో ప్రభావ వంతమైంది. తెలుగు సినిమా తెలుగువారి సంస్కృతిలో
భాగమైంది. ఏ ఇద్దరు కలుసుకున్నా, ఏ సోషల్‌ మీడియా గూపుల్లో చూసిన తెలుగు వారు
సినిమా గురించి మాట్లాడుకోకుండా ఉండలేరు. అందుకే తెలుగు వారికి ఇతర సైటుల
కన్నా సినిమా సైటులే అంతర్జాలంలో ఎక్కువగా ఉన్నాయి. మొత్తం భారతీయ
సినిమాను చూసుకుంటే సంఖ్యాపరంగానూ, వాణిజ్య పరంగానూ తెలుగు సినిమానే
అగ్రస్థానంలో ఉంది. ఇది వరకు వాణిజ్య పరంగా బాలివుడ్‌, ఆ తరువాత తమిళ
సినిమాలు ఉండేవి. ఇప్పుడు ఆ పరిస్థితి మారింది. ఇటీవల కాలంలో తెలుగులో వచ్చిన
బాహుబలి1 , బాహబలి కన్‌క్లూజన్‌, ఆర్‌.ఆర్‌.ఆర్‌., అఖండ, పుష్ప సినిమాలు
మొత్తం భారతదేశంలో అనూహ్య కలెక్షన్లను సాధించి తెలుగు సినిమా సత్తను
చాటాయి. ఇప్పుడు తెలుగు సినిమా భారతీయ సినిమాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది.
ఇందులో జానపద గీతాల పాత్ర అమోఘమైంది. జానపదంలోని సొగసు, పద సహజత్వం
ప్రేక్షకు లను మధురానుభూతిలో ఓలలాడిస్తాయి అనడంలో అతిశయోక్తి లేదు.
తెలుగు సినిమా సాహిత్యానికి, తెలుగు సినిమా చరిత్రకి పెద్ద ఆంతర్యం లేదు.
సినిమా ఎప్పుడు మొదలైందో దాదాపు సినీ సాహిత్యం సినిమా పాటల ద్వారా
అప్పుడే మొదలైంది. 1921లో రఘుపతి వెంకయ్య నాయుడు తీసిన ‘భీష్మ ప్రతిజ్ఞ’
మూకి సినిమా, 1931లో విడుదలైన భక్త ప్రహ్లాద తొలి తెలుగు టాకీ సినిమా. అది
మొదలు నేటి వరకు తెలుగు సినిమా ప్రయాణం దినదిన వృద్ధి చెందుతూ సాగుతూనే ఉంది.
సినిమా రంగంలో 24 శాఖలుంటాయి. అందులో పాటల రచయితలు ఒక ప్రత్యేక శాఖ. వీరు
ప్రజాజీవనాన్ని సాహిత్యంలోకి పాటలుగా కూర్చినారు. అలా సినిమాని జనాన్ని
కలిపిన సృజనాత్మక వారధులు సినీ కవులు. నాటి నుండి నేటికి గల కొందరు ప్రముఖ సినీ
కవులు సముద్రాల పింగళి నాగేంద్రరావు, ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు, రసరాజు,
శ్రీశ్రీ, వేటూరి సుందర రామ్మూర్తి, డా. సి. నారాయణ రెడ్డి, సిరివెన్నెల
సీతారామ శాస్త్రి, సామవేదం షణ్ముఖశర్మ, భువనచంద్ర, చంద్రబోస్‌, సుద్దాల
అశోక్‌ తేజ, దాసరి నారాయణరావు, అనిసెట్టి, దేవులపల్లి కృష్ణశాస్త్రి,
మల్లాది రామకృష్ణ, రాజశ్రీ, దాశరథి, మల్లెమాల, వెన్నెల కంటి, వనమాలి,
భాస్కరభట్ల, కులశేఖర్‌, అనంత శ్రీరామ్‌, బండి సత్యం, కందికొండ, బోలేషావళి,
కాసర్ల శ్యామ్‌ మొదలైన కవులెందరో తెలుగు సినిమాల్లో జానపద గీతాలు రాసి
తెలుగు సినీ జనాన్ని ఉర్రూత లూగించారు. ఇంకా ఊగిస్తూనే ఉన్నారు.
ఆధునిక కాలంలో మానవుడిపై అత్యంత ప్రభావాన్ని చూపుతున్న అద్భుతశక్తి
‘‘సినిమా’’. శ్రీమంతుడి నుండి అతి సామాన్యుడి దాకా అందరికీ అందుబాటులో ఉన్న
వినోద సాధనం సినిమా ఒక్కటే. సినిమా అనే పదం ‘కినెమా’ అనే గ్రీకు భాషా పదం నుండి
పుట్టింది. కినెమా అంటే ‘పురోగమించడం’ అని అర్థం. తెలుగు సినిమాల్లో భక్తి,
ప్రబోధం, వినోదం, ప్రణయం మొ॥ అంశాల దృష్ట్యా ఎన్నో పాటలు వచ్చినా
జానపద గీతాలకున్న బలమైన ముద్ర మరే ఇతర ప్రక్రియకూ లేదనే చెప్పాలి. అలాగే
యథాతథంగానో, పాక్షికంగానో సినిమాల్లో జానపదులంత విరివిగా ఉపయోగించిన ఇతర
ప్రక్రియలు లేవు. కీర్తి ప్రతిష్ఠల కోసం ఆశించని జానపదకవుల గీతాలు కొన్ని
సినిమాల్లో కవుల సొంతమైతే కొన్నింటిలో మాత్రం నిజాయితీగా ‘‘పాత
జానపదగీతాలు’’ అని స్పష్టంగా పేర్కొన్నారు.
సినిమాపాట సంగీత, సాహిత్య సమ్మేళనం. కొన్ని సందర్భాల్లో సన్నివేశం కూడా
ప్రాణం పోస్తుంది. మనిషి జీవన నడవడిలో, అతడు దిద్దుకున్న సంస్కృతి
సంప్రదాయాల ఒరవడిలో సమాజ హితాన్ని ఆశిస్తూ మనకు సినిమా పాటలు కన్పిస్తాయి. సినిమా పాటల్లో భక్తి, ప్రణయం, ప్రబోధం, వినోదం, విషాద
గీతాలెన్నో ఉన్నప్పటికీ జానపద గీతాలనగానే మనసెందుకో ఆనందంతో పరవళ్ళు
తొక్కుతుంది. అందులోని పద సౌందర్యం. పోహళింపే బహుశా అందుకు కారణమై
ఉండవచ్చు. అయితే సందర్భాన్ని బట్టి భక్తి ప్రబోధం, విషాదం, ప్రణయం,
వ్యంగ్యం వంటి అంశాల దృష్ట్యా రచించబడిన జానపద గీతాలను కూడా మనం వింటూ
ఉంటాం. అంశం ఏదైనా జానపద గీతమనగానే పల్లె సౌందర్యం, యాస, నుడి మనల్ని
ఇట్టే ఆకట్టు కుంటుంది. అలాంటి గీతాలెన్నో మన వెండితెరపై గజ్జెకట్టి
నాట్యమాడాయి. జనుల హృదయవేదికలపై చిందులేశాయి. ఇంచుమించుగా
సినిమాపాటల్లో ఎక్కువ గీతాల పైన జానపద ముద్ర ఉంది. ఈ వ్యాసంలోని వస్తువు
ఎంతో విస్తృతమైనది. కానీ వ్యాస పరిమితి దృష్ట్యా కొన్ని జానపదగీతాల్ని
గూర్చి ఇక్కడ వివరణ చేస్తున్నాను.
తెలుగు సినిమాల్లో టాకీ సినిమాలు 1931లో ప్రారంభమైనప్పటి నుండి వెండితెర
మీద జానపదగీతాలు పరిమళాలు వెదజల్లుతూనే ఉన్నాయి. ఇలాంటి పాటలు రాసిన
కవుల్లో తొలిదశకం నుంచి 1980 దశకం వరకు ఎక్కువగా జానపదగీతాలు రాసిన సినీగేయ
రచయితగా కొసరాజు రాఘవయ్య చౌదరి పేరు చెప్పకోవచ్చు, సినీకవుల్లో ‘‘జానపద
కవి సార్వభౌముడు’’ అన్న బిరుదును సార్థకం చేసుకున్నాడు ఆయన.
1939 సం॥లో ‘‘రైతుబిడ్డ’’ సినిమా కోసం కొసరాజు రాసిన ‘‘సై సై చెన్నాపరెడ్డి నీ
పేరే బంగారపు కడ్డి’’ లాంటి వీరరసాన్ని ప్రబోధించిన జానపద గేయాలునప్పటకీ అవి
జానపదముద్ర నుంచి పూర్తిగా మారి వచ్చినవిగా చెప్పుకోవచ్చు. ‘చిల్లరదేవుళ్లు’
(1977) సినిమాలో తెలంగాణ ప్రాంతానికి చెందిన ‘‘శ్రీ లక్ష్మీ నీ మహిమలూ
గౌరమ్మా చిత్రమై తోచునమ్మా’’ అనే భక్తిగీతం జానపదుల నోట
నాట్యమాడినదే. నాటి నుండి నేటిదాకా స్త్రీలు పాడుకునే ప్రత్యేకమైన గీతంగా
దీనిని గమనించవచ్చు. లక్ష్మీ పార్వతి సరస్వతులకభేదం చెప్పడం ఈ పాటలోని
విశేషం.
ఇంకా ఈ చిత్రంలోనే ‘‘ఏటికేతాంబట్టి ఎయిపుట్లు పండిరచి ఎన్నడూ
మెతుకెరగనన్నా!’’ అనే శ్రామికగేయం ఏడాది పొడవునా ఏటికేతమేసి నీరు తోడి
పండిరచిన పంట తనదాకా రాకుండా భూస్వామి పట్టుకుపోతే నిలువెల్ల కుంగిపోయి.
నీరసించి నిస్సహాయుడై ఈ బ్రతుకు గట్టుకోవడం మొ॥వన్ని ఏరువాక సాగుతున్న
రైతును కళ్లముందుంచుతున్నాయి. జానపద స్పర్శ సుమనోహరంగా ప్రతిఫలిస్తున్న
గీతంగా దీన్ని చెప్పుకోవచ్చు. సినీ జానపద గీతాల్లో ఈ పాట పదిలంగా
చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇంకా ‘‘అమ్మమాట’’ (1970) సినిమాలో
సి.నారాయణరెడ్డి రాసిన జానపద గీతాన్ని కూడా విశేషంగా చెప్పుకోవచ్చు.
బ్రతకడం కంటే పుట్టినప్పుడు చస్తే బాగుండునని కుమిలిపోతున్న రైతు కూలీని ….
అనే పాట మన కళ్లముందుంచుతుంది. శ్రామికగేయాల జాబితాలోను, ముఖ్యంగా జానపద
గీతాల వరుసలోను అగ్రేసర స్థానంలో నిలిచిన పాట ఇది. ఈ జానపద గీతాలన్ని
యథాతథంగా సినిమాల్లోకి వచ్చినవే. ఇవి అత్యంత ప్రజాదరణ పొందిన
జానపదగేయాలు కావడంతో యథాతథంగా వీటిని సినిమాల్లో వాడుకోవడం జరిగింది.
ఆ తరువాతి దశకంలో స్వల్ప మార్పులతో రాసిన జానపద గీతాలెన్నో సినిమాల్లో
చోటు చేసుకున్నాయి. మచ్చుకు ‘‘దొంగ రాముడు’’ సినిమా కోసం కొసరాజు రాసిన
‘‘రావోయి మా ఇంటికి మామా మాటున్నది మంచి మాటున్నది’’ అనే పాట
స్వల్పమార్పులతో ప్రయోగించిన జానపదగీతంగా చెప్పుకోవచ్చు,
జానపదగేయాల్లోని పల్లవులందుకుని ప్రాణం పోసుకున్న సినిమా పాటలనేకం
ఉన్నాయి. అందులో ముఖ్యంగా సి. నారాయణ రెడ్డి రాసిన ముత్యాలముగ్గు (1975)
సినిమాలోని ‘‘గోగులుపూచే గోగులుపూచె ఓ లచ్చగుమ్మడి గోగులు దులిపే
వారెవరమ్మా ఓ లచ్చగుమ్మడి’’ పల్లవితో ప్రారంభించి ‘‘పొద్దుపొడిచే
పొద్దుపొడిచే ఓ లచ్చగుమ్మడి పుత్తడి వెలుగులు కొత్తగ మెరిసే ఓ లచ్చగుమ్మడి’’ అనే తన స్వతంత్ర పదబంధాల్ని జానపద పల్లవికి అద్ది పద
సౌందర్యం పెంచాడు.
‘‘రోజులు మారాయి’’ (1955) సినిమాలో కొసరాజు రాసిన జానపదగీతం నేటికీ ఏనాటికీ
అజరామరమై అలరారుతుంది. ‘‘ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంత
తీరునోరో రన్నో చిన్నన్న… నవధాన్యాలను గంపకెత్తుకొని చద్దియన్నమును
మూటగట్టుకొని…’’
‘‘మాయాదారి సిన్నోడు – నా మనసేలాగేసిండు నా మనసేలాగేసిండు.. లగ్గమెప్పుడురా
మావా అంటే మాగమాసం యెల్లేదాకా మంచిరోజు లేదన్నాడే’’ తెలంగాణ
మాండలికంలో రాయబడిన ఈ పాట తెలుగుదేశమంతటా మారుమ్రోగింది. భాష, భావం,
సంగీతం మూడిరటితో అల్లుకుపోయి, మన హృదయాలను పెనువేసుకుందీ పాట. లగ్గం,
పానాలు వంటి తెలంగాణ మాండలిక పదసౌందర్యం ఈ పాటల్లో ప్రధానమైనవిగా
చెప్పుకోచ్చు.
ఇంకా నారాయణరెడ్డి రాసిన ‘‘జీవితం’’ చిత్రంలోని ‘‘మామిడి తోపుల్లోనా మాపటేల
మాటేసి సిక్కుడు పాదుకాడ సీకటేల పట్టేసి సెప్పలేని రుచులెన్నో చిటికెలోన
చూపించి మాయచేసి పోతివిరో నాగులు’’ అనే పాట కూడా ప్రత్యేకమైన జానపద గీతంగా
చెప్పకోవచ్చు. ఇందులో కూడా తెలంగాణ భాషా సౌందర్యం గుబాళిస్తుంది. జానపద
ముద్ర ప్రత్యేకంగా దర్శనమిస్తుంది.
గుండమ్మకథ (1962) చిత్రంలోని పింగళి నాగేంద్రరావు రాసిన ‘‘కోలో కోలోయన్న
కోలో నా సామీ కొమ్మలిద్దరు మంచి జోడు’’ అనే గీతాన్ని కూడా
ప్రత్యేకమైనదిగా పేర్కొనవచ్చు. ఇది జానపద ముద్రతో పింగళి నాగేంద్రరావు
రాసిన గీతాల్లో అణిముత్యం. ఇంకా దసరా బుల్లోడు (1971) సినిమాలో ఆచార్య
ఆత్రేయ రాసిన ‘‘పచ్చగడ్డి కోసేటి పడుచుపిల్లో నీ పైట కొంగు జారిందే
గడుసుపిల్ల’’ అనే పాట శృంగార గీతమైనా జానపద సౌందర్యం ధ్వనించి, ఎక్కడా
అశ్లీలతకు తావివ్వని తీరు కన్పిస్తుంది.
అలాగే ‘ప్రేమనగర్‌’ (1971) సినిమాలోని ‘‘కడవెత్తుకొచ్చింది కన్నెపిల్లా అది
కనబడితే చాలు నా గుండెగుల్లా’’ అనే పాట కూడా నిర్మలమైన జానపదత్వాన్ని
ప్రకాశింపజేసే ప్రణయగీతంగా వినుతికెక్కింది. అలానే మేలుకొలుపు గీతాల్లో
కూడా జానపద ముద్ర ప్రత్యేకంగా కన్పించినవెన్నో ఉన్నాయి. కాని, సినిమాపాట
కోసం కొన్ని మార్పులు కూడా ఇందులో చోటు చేసుకోవడం ఇక్కడ విశేషాంశంగా
చెప్పుకోవచ్చు. జానపదమాతృకనూ సినిమా పాటను ఒకేసారి పాడుకుంటే పోలికలు
స్పష్టమవుతాయి.
‘‘మంగమ్మగారి మనవడు’’ (1984) సినిమాకోసం సి.నారాయణ రెడ్డి రాసిన..‘‘శ్రీ
సూర్యనారాయణా మేలుకో … మా చిలకమ్మ బులపాటమూ చూసిపో’’ అనే పాటకు జానపద
మాతృక…. ‘‘శ్రీ సూర్య నారాయణా మేలుకో హరి సూర్యనారాయణా మేలుకో’’ అనే
పాట. ఇంకా ‘‘తెల్లవారవచ్చె తెలియక నా సామి’’ (చిరంజీవులు), ‘‘ఎల్లమంద కోటయ్య
ఏలుకో ఏలుకో’’ (కన్నెవయసు) మొ॥ గీతాలను మేలుకొలుపు గీతాలుగా పేర్కొనవచ్చు.
తాత్త్విక స్పర్శ కల్గిన జానపదగీతాలు కూడా తెలుగు సినిమాల్లో చోటు
చేసుకున్నాయి. ‘‘ఇల్లు ఇల్లనియేవు ఇల్లు నాదనియేవు నా ఇల్లు యెక్కడే చిలుకా’’
అనే గీతాన్ని ‘‘కన్యాశుల్కం’’ చిత్రంలో ప్రయోగించారు. విశేషమేమిటంటే ఇది
గురజాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాటకంలోని తత్త్వమే. ఇలాంటి
తాత్త్విక స్పర్శ కల్గిన జానపదగేయాలెన్నో మన తెలుగు సినిమాపాటల్లో
కన్పిస్తాయి. అది ఏ స్పర్శ కల్గిన అందులో జానపదముద్ర మాతృకంగా పదిలంగా
కన్పించడం విశేషంగా చెప్పు కోవచ్చు.
అదే విధంగా సంవాదాలు కూడా జానపదగీతాల్లో దర్శన మిస్తాయి. ‘‘మానవుడు
దానవుడు’’ (1972) సినిమాలో ఉషశ్రీ రాసిన ‘‘కొప్పుచూడు కొప్పందం చూడు’’ గీతాన్ని
ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇంకా ‘‘కోడలా కోడలా కొడుకు పెళ్లామా’’ ‘‘ఒకరికి చేతులిచ్చావ్‌ ఒకరికి కాళ్లానిచ్చావ్‌’’ మొ॥ సంవాదయోగ్యంగా రాసిన జానపద
గీతాలుగా చెప్పుకోవచ్చు.
అలానే ‘‘అత్తా ఒకింటి కోడలే’’ చిత్రం కోసం ఆరుద్ర రాసిన ‘‘మాయదారి కీచులాట మా
మధ్య వచ్చింది రాయబారం సెయ్యవే తడికో తడికా’’. ఇది జానపద గేయాల్లో
ప్రసిద్ధి పొందిన ‘‘తడిక రాయబారం’’కు సంబంధించినది. భార్యా భర్తల మధ్య
చిన్న కీచులాట వస్తుంది ఇంట్లో ఇంకెవ్వరూ లేకపోవడంతో వారి మధ్యనున్న
తడికే వాళ్లకు రాయబారి అయింది. ఆ గేయాన్ని కొంత మార్పులతో ఆరుద్ర
సినిమాలో ప్రయోగించాడు. ఇలా భార్యాభర్తల సంవాదాలు, బావా మరదళ్ల
సంవాదాలు, ఆడపడచుల సంవాదాలు మొ॥వి మనకు జానపద గీతాల్లో కన్పిస్తాయి.
ఇంకా ‘‘కాశీకి పోయాను రామా హరే గంగ తీర్థంబు తెచ్చాను రామా హరే’’ అనే
‘‘అప్పుచేసి పప్పుకూడు’’ సినిమాలోని పింగళి నాగేంద్రరావు రాసిన
హాస్యస్ఫోరకమైన గీతం, బాబూ (1969) సినిమాలో ఆరుద్ర రాసిన ‘‘చింత చెట్టు
చిగురు చూడు, చిన్నదాని పొగరుచూడు’’ అనే గీతం, జీవన జ్యోతి సినిమాలో సినారె
రాసిన ‘‘సిన్ని ఓ సిన్నీ’’ అనే గీతం, వెలుగునీడలు (1961) సినిమాలో శ్రీశ్రీ రాసిన ‘‘ఓ
రంగయో పూలరంగయో’’ అనే గీతం, దేవుడు చేసిన పెళ్లి (1975) సినిమాలో దాశరథి రాసిన
‘సూదిలో దారం సందులో బేరం’ అనే గీతం, శుభోదయం (1980) సినిమాలో వేటూరి
సుందరరామ్మూర్తి రాసిన ‘‘కంచికి పోతావ కృష్టమ్మా’’ మొ॥ పాటలన్ని జానపద
సౌందర్యాన్ని పొదుగుకుని పరిమళించినవే అని చెప్పవచ్చు. సాధారణంగానే జానపద
గీతమనగానే గాన యోగ్యమైనది. అది సినీ జానపద గేయమనగానే అందలి గాన
సౌందర్యం మిన్నులందుకుంటుందని చెప్పవచ్చు.
ముత్యాలముగ్గు (1975) సినిమాలో అరుద్ర రాసిన ‘‘ముత్యమంతా పసుపు ముఖమెంతో
ఛాయ’’ అనే సుప్రసిద్ధ గీతం, ఉయ్యాల జంపాల (1960) సినిమాలోని ‘‘కొండ గాలి
తిరిగింది గుండె ఊసులాడిరది’’ అనే పాటలకు మూలాలు జానపదంలోనే ఉన్నవని ఆరుద్ర
స్వయంగా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. గోరింటాకు (1979) సినిమాలో దేవులపల్లి
కృష్ణశాస్త్రి రాసిన ‘‘గోరింట పూచింది కొమ్మా లేకుండా మురిపాల అర చేతా
మొగ్గా తొడిగింది’’ అనే పాటలోని ‘‘మామిడి చిగురెరుపు మంకెన పువ్వెరుపు
మణులన్నింటి లోన మాణిక్యం ఎరుపు’’ అనే పదబంధాలు, జానపద గీతంలోని ‘‘చిక్కుడు
పువ్వెరుపు చిలక ముక్కెరుపు చిగురెరుపు చింతల్లి దోర పండెరుపు’’ అనే పంక్తులకు
దగ్గర పోలికగా ఉండడం విశేషం. మన మహాకవులెందరి మీదో జానపద ముద్ర
ప్రత్యేకంగా ఉందని చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ. ఇంకా ‘‘ఆనంద మానంద
మాయెనే మా అన్నయ్య పెండ్లి కొడుకాయెనే (పంతులమ్మ సముద్రాల) వంటి
పెళ్లి పాటల్లో ‘కాళ్ల గజ్జె కంకాళ్లమ్మ’’ (ఆదర్శ కుటుంబం ` ఆత్రేయ)
‘‘దాగుడుముతా దండాకోర్‌’’ (బండరాముడు- ఆత్రేయ) ‘‘తప్పెట్లోయ్‌ తాళాలోయ్‌
దేవునిగుళ్లో బాజాలోయ్‌ (వాగ్దానం-నార్ల చిరంజీవి) వంటి పిల్లల పాటల్లో
జానపద స్పర్శ కన్పిస్తుంది. మన పల్లెల సౌందర్యం, వృత్తులు, వినోదాలూ,
వేడుకలూ, తిరునాళ్లు, తీర్థాలు. ఆటపాటలు, గారడీలు మొ॥వి అన్ని కూడా మన సినీ
జానపదగీతాల్లో కనిపిస్తాయి. ఇవేకాక హరికథలు, బుర్రకథలు, ఒగ్గుకథలు,
యక్షగానాలు, జంగంకథలు, వీధి భాగోతాలు మొ॥ జానపద కళారూపాల దృష్ట్యా కూడా
ఎన్నో సినిమా పాటలు కన్పిస్తాయి.
నేటి తరం జానపదగీతాల విషయానికొస్తే ‘కుబుసం’ సినిమా కోసం గోరేటివెంకన్న
రాసిన ‘‘పల్లే కన్నీరు పెడుతుందో కనిపించని కుట్రల’’ అనే పాటలో పల్లెల్లో
మరుగున పడిపోతున్న వృత్తులగూర్చి,పల్లె ప్రజల దీనావస్థను గూర్చి
చెప్పబడిరది. ఇంకా సుద్దాల అశోక్‌ తేజ రాసిన భద్రాచలం సినిమాలోని ‘‘ఇదే నా
పల్లెటూరు ఇదే నా తల్లిగారు’’ అనే పాటలో పల్లెని తల్లిగా భావించి సాగిలపడి
మొక్కిన తీరు కనిపిస్తుంది. పల్లె సౌందర్యం భాసిస్తుంది. ఇంకా ‘‘మొండి మొగుడు
పెంకి పెళ్లాం’’ సినిమాలో సాహితి రాసిన ‘‘లాలు దర్వాజ లష్కర్‌ బోనాల్‌ పండగ
కొత్తనని రాకపోతివి’’ అనే పాట ప్రతి హృదయాన్ని కూడా హుషారెత్తించి చిందులేయిస్తుంది. ఇలాంటి జానపదగీతాలెన్నో మన తెలుగు సినిమాల్లో
సందర్భోచితంగా పలికించబడి మన హృదయాల్లో చెరగని ముద్రవేశాయి. విశేషమైన పద
సౌందర్యంతో మనల్ని ఆకట్టుకున్నాయి.
ఇలా జానపదగీతాలు తెలుగు కావ్యసాహిత్యంలోనే కాకుండా సిహిత్యంలో కూడా
విశేషమైన ముద్ర వేశాయని చెప్పవచ్చు. తెలుగు సినిమాల్లో దర్శనమిచ్చిన
మరికొన్ని జానపద గీతాలు ఇక్కడ పరిశీలిద్దాం…

1.కలిసి ఉంటే కలదు సుఖం – కొసరాజు ముద్దబంతి పూలు పెట్టి మొగలిరేకుల జడను చుట్టి, జడను చుట్టి హంసలా నడచి వచ్చే చిట్టెమ్మా.. చిట్టెమ్మా.. మా ఇంటికేమి తెచ్చావమ్మా చెప్పమ్మా..
2. ఏరువాక సాగారో - కొసరాజు రాఘవయ్య కల్లా కపటం కానని వాడ లోకం పోకడ
తెలియని వాడ, ఏరువాక సాగారో రన్నో చిన్నన్న నీ కష్టమంత తీరునురో రన్నో
చిన్నన్న, నవ ధ్యానాలను గంపకెత్తుకొని చద్ది అన్నము మూట గట్టుకొని ముళ్లు
గర్రను చేతబట్టుకొని ఇల్లాలునీ వెంటబెట్టుకొని
3. ఆరుద్ర ..భీష్మ ` హైలో హైలేసా హంస కదా నా పడవ, ఉయ్యాలలూగినది ఊగీస
లాడినది హైలో హైలేసా హంస కదా నా పడవ
4. సి.నారాయణ రెడ్డి.. మంగమ్మ గారి మనవడు ` దంచవే మేనత్త కూతురా.. వడ్లు
దంచవే నా గుండెలదరా.. దంచు దంచు బాగా దంచు.. ఆ…దంచు దంచు బాగా దంచు../ దంచవే
మేనత్త కూతురా.. వడ్లు దంచవే నా గుండెలదరా..
5. సి నా రె.. సూత్ర దారులు ` జొలాజొలమ్మ జేజెల జోల జేజెల జోల, నీలాల కన్నులకు నిత్య మల్లె పూల జోల, నిత్యామల్లె పూల, జోల ల్లొలాలళళలల హాయి హాయే, ల్లోలాలాళ్లలల హాయి హాయే, రేపల్లె గోపన్నా రేపు మరచి నిదరొయె, రేపుమరచి నిదరొయె, యాదగిరి నరసన్న ఆదమరచి నిదరొయె, ఆదమరచి నిదరొయె
6. శ్రీకాంత్‌ మేక …కాలేజ్‌ మాయాదారీ మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా, మాయాదారీ మైసమ్మో మైసమ్మా మనం మైసారం పోదామే మైసమ్మా ఓ మైసమ్మా మైసమ్మా మైసమ్మో మైసమ్మా గాబర బెట్టి
7.సుద్దాల అశోక్‌ తేజ.. శ్రావణ మాసం సైదులా సైదులా నీ కంచెర జుంపాలు చూసి
సైదులా కాపోడనుకున్నా సైదులా, కాపోడనుకున్నా సైదులా, ప్రేమను కాపు
కాయలేకున్నావ్‌ సైదులా.
8.మహాత్మా … సిరి వెన్నెల ` నీలపురి గాజుల ఓ నీలవేణి నిల్చుంటే కృష్ణవేణి
నువ్వు లంగా వోణి వేసుకొని నడుస్తువుంటే నిలవలేనే బాలామణి నడుము చూస్తే
కందిరీగ నడక చూస్తే హంస నడక నిన్ను చూడలేనే బాలికా నీ కళ్ళు చూసి నీ పళ్ళు చూసి
కలిగేనమ్మా ఎదో
9.సర్కస్‌ సత్తి పండు ..సుద్దాల అశోక్‌ సంక్రాంతి పండుగ వచ్చే..సంబరాలు ముందుకొచ్చే వస్తావా జానకి
10.పలాస …ఉత్తరాంధ్ర జానపదం నీ పక్కన పడ్డాదొలేదో చూడవె, పిల్లొ నాది
నక్కిలీసు గొలుసు, నీ పక్కన పడ్డాదొలేదో చూడవె, పిల్లొ నాది నక్కిలీసు గొలుసు,
పక్కన పడ్డాదొలేదో చూడవె, పిల్లొ నాది నక్కిలీసు గొలుసు నీ పక్కన
పడ్డాదొలేదో చూడవె, పిల్లొ నాది నక్కిలీసు గొలుసు
11.పి రఘు …కోట బొమ్మాళి ` తరినాన తరినాన తాని తందన నానా తరినాన తరినాన తాని
తందన నానా, ఆ లింగ్‌ లింగ్‌ లింగ్‌ లింగిడి లింగ్డి కింద జంగిడి జంగ్డి కింద కుసుమిది
కుసుమిది పూరి ఆనంద మల్లెపూలు జల్లంగా శ్రీకాకుళం దండలు హిరమండలం గుర్తులు
12.ఆర్‌ ఆర్‌ ఆర్‌.. చంద్రబోస్‌ ` పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిత్త
దూకినట్టు, పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు, కిర్రు సెప్పులేసుకుని
కర్రసాము సేసినట్టు, మర్రిసెట్టు నీడలోన కుర్రగుంపు కూడినట్టు, ఎర్రజొన్న
రొట్టెలోన మిరప తొక్కు కలిపినట్టు, నా పాట సూడు నా పాట సూడు నా పాట సూడు..

ముగింపు : ఈ విధంగా దాదాపు 80 సంవత్సరాలకు పైగా జానపద గేయాలు తెలుగు
సినిమాలోకాన్ని ఏలుతున్నాయి. జానపద సాహిత్యంలో ఉండేటువంటి సౌందర్యం, అనుకరణ, ప్రాస, పదలాలిత్యం, జీవన సౌందర్యం, మొదలైనవన్నీ సినీ రూపంలో వెండితెర మీదకి ఎక్కి ప్రేక్షకుల్ని రంజింపజేశాయి. ప్రపంచం రోజురోజుకు గణనీయంగా మార్పులు చెందుతుంది. దీంతోపాటే ప్రేక్షకుల అభిరుచి మారుతుంది. అయినప్పటికీ జానపదం తన ఉనికిని, ఔన్నత్యాన్ని ప్రతి దశాబ్దంలోనూ తెలుగు సినీ లోకంలో నిలుపుకుంటూనే ఉంది. దీనిని బట్టి ఎన్ని భాషలు తెలుగు భాషలోకి వచ్చిన, ఎన్ని మోడ్రన్‌ పాప్‌ కల్చర్లు తెలుగు సిని సంగీతంలో ప్రవేశించినప్పటికీ జానపదం మాత్రం ఎప్పటికీ నిరాదరణకు గురికాదని, ఎప్పటికీ నిలిచే ఉంటుందని భవిష్యత్తులోనూ తన ఉనికిని గొప్పగా చాటుతుందని చెప్పవచ్చు.
ఉపయుక్త గ్రంథాలు :

  1. తెలుగు జానపదగేయ సాహిత్యం- డా. బిరుదు రాజు రామరాజు.
  2. పగలే వెన్నెల (సినారె సినీగీతాల సంకలనం) యువభారతి ప్రచురణలు.
  3. Telugu melody lyrics.com
  4. www Google.com
  5. telugu lyricstape.com

యడవల్లి సైదులు,
తెలుగు పరిశోధక విద్యార్థి,
ఉస్మానియా విశ్వవిద్యాలయం,
ఫోన్‌ : 7032188578

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *