జీవిత మింతే…!

బతికినంత సేపూ
బలాబలాలే
ఊపిరాడినంత సేపూ
వ్యూహ ప్రతివ్యూహాలే
కదిలినంత మేర
వ్యామోహ మోహాలే
అర్థం కానిదేమీ లేదు
అంతా తేటతెల్లమే
కళ్లూ, మనసూ మూసుకుపోతే
జ్ఞానోదయాలు తమదారిన తాము
కొట్టుకుపోతూనే వుంటాయి
పునాదులపై వికృత
సమాధులు మొలుస్తూనే వుంటాయి
అడ్డదిడ్డాలు
అంతస్థులుగా ఎదిగిపోతూనే వుంటాయి
ఎవరూ పిలవరు
ఎవరూ అడగరు
బొట్టుకాటుకలెవ్వరూ పెట్టరు
మంగళహారతులెవరూ పట్టరు
చచ్చిపోకుండా బతికుండాలంటే
చొచ్చుకుపోయి తీరాలి
నిశ్శబ్దాలకు శబ్దతడి అద్దాలి
ఆత్మాభిమానం జెండాగా ఎగిరినా
అవస్థలతో అవనతమైనా
స్వయం నిర్ణయమే అది
ఎగబడడం
ఎదగడం
చివరకు మృత్యు స్పర్శకు లొంగిపోవడం
అందుకే కమ్ముకున్న పొరలు తొలగాలి
అప్పుడే అసలు రహస్యం పట్టుబడుతుంది

డా. తిరునగరి శ్రీనివాస్‌,
ఫోన్‌ : 9441 464 764

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *