కె.వి.శ్వనాథ్ సినిమాల్లోని పాటలు –  సాహిత్యావలోకనం

తెలుగు సినీరంగంలో అగ్రస్థాయికి చెందిన దర్శకుల్లో కె.విశ్వనాథ్ ఒకరు.
సంప్రదాయకత, వినూత్నమైన ఇతివృత్తం, అద్భుతమైన సన్నివేశాల చిత్రీకరణ,
మధురాతి మధురమైన సంగీత సాహిత్యాల సమ్మేళనం మొ.వి ఆయన సినిమాలకుండే
ప్రత్యేక ఆకర్షణలు. మహాకావ్యాలకు, మహానాటకాలకు ఏ మాత్రం తీసిపోని
రీతిలో ఆయన సినిమాలు మనకు కనిపిస్తాయి. అపురూపమైన శిల్పాలుగా సినిమాలను
తీర్చిదిద్దడం ఆయన ప్రత్యేకత. సామాన్యమైన కథను తీసుకుని అసామాన్యంగా
రూపొందించడం ఆయనకున్న విశిష్టత..
ఇక పాటల విషయానికొస్తే ఆయన చూపించే శ్రద్ధాసక్తులు ఎంతో
ప్రశంసనీయమైనవి. కథాంశానికి, సన్నివేశానికి తగినట్లుగా ప్రసిద్ధ సినీకవులతో
పాటలు రాయించుకోవడంలో దిట్ట. యువకవులను, గీతరచయితలను కూడా ప్రోత్సహించి,
వారికి పాటలు రాసే అవకాశమిచ్చి, వారిలో ఉన్న ప్రతిభను వెలికి తీసేవారు. తనకు
నచ్చేవరకు, సినిమాకు ఈ పాట బలాన్ని చేకూరుస్తుంది అని అనిపించేవరకు పాటను
మళ్ళీ మళ్ళీ రాయించుకునేవారు..ఒక పట్టాన ఒప్పుకునేవారు కాదు. అందుకు కారణం
ఆయన ఓ గీతరచయిత కావడమే.. సాహిత్యాభినివేశం మెండుగా ఉన్న కవి కావడమే.
క్రమశిక్షణ గల దర్శకునిగా కూడా ఆయన శైలి అత్యద్భుతమైంది. ఆయన గురించి ఎంత
చెప్పుకున్నా తక్కువే. అయితే.. ఈ వ్యాసం దృష్ట్యా నేను ఆయన సినిమాల్లోని
పాటల్లో గల సాహిత్యాన్ని గూర్చి మాత్రమే వివరిస్తాను.
ప్రముఖ సినీ దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు దగ్గర సహాయ దర్శకునిగా కొంతకాలం
పనిచేసిన విశ్వనాథ్ 1965 లో ‘ఆత్మగౌరవం’ సినిమాతో దర్శకునిగా తన ప్రస్థానం
ప్రారంభించాడు. ఆ సినిమా గొప్ప విజయాన్ని సాధించింది. అద్భుతమైన కథ,
అక్కినేని నాగేశ్వరరావు, కాంచన ల నటనతో పాటు ఆ సినిమాలోని పాటలు కూడా ఆ
చిత్ర విజయానికి దోహదపడ్డాయని చెప్పవచ్చు. ఆ సినిమాలోని అన్ని పాటలు
గొప్ప కవితాత్మకతను కలిగి ఉన్నవే..
అందులో దాశరథి రాసిన, పి.సుశీల పాడిన ఈ పాటను చూద్దాం.
‘అందెను నేడే అందని జాబిల్లి
నా అందాలన్ని ఆతని వెన్నెలలే..
ఇన్నేళ్ళకు విరిసే వసంతములు
ఇన్నాళ్ళకు నవ్వెను మల్లియలు
నిదురించిన ఆశలు చిగురించెలే
చెలికాడే నాలో తలపులు రేపెనులే’.
రష్యన్ బాణీకి దాశరథి రాసిన పాట ఇది. తనను ప్రేమగా లాలించే హృదయం, తనకు నీడగా
నిలబడే ఒక తోడు దొరికిందన్న ఆనందంతో కథానాయిక మనసులో ప్రేమ చిగురించి
పాడుకునే పాట ఇది. అందరాని జాబిల్లి రూపంలో తనకు దొరికిన ఆనందం ఎవరో కాదు
ప్రియుడే. ఆ విషయాన్ని రెండవపంక్తిలో తెలియజేస్తుంది నాయిక. ఇక తన
అందాలన్ని ఆ జాబిల్లి చిందే వెన్నెలలుగానే భావిస్తుంది. దానితో భావకాంతి
మరింత విస్త్రతంగా కనిపిస్తుంది. తొలిప్రేమ చిగురించినపుడు నాయిక తనలో ఇది
వరకు లేని పులకింతలు ఒక్కసారిగా ఉరకలేసిన సందర్భాన్ని వివరిస్తుంది. వసంతం
ఎన్నేళ్ళకో విరిసిందని, మల్లెలు చాలా రోజులకు నవ్వాయని అంటుంది. ఆమె తన

యవ్వనమనే తోటలోని వసంతాల్ని, మల్లెల్ని గూర్చి తెలియజేస్తుందని మనం
ఇక్కడ గమనించాలి. తనలోని ప్రేమ ఆవిష్క్రతమవ్వడం వల్ల వసంతం ఇప్పుడే
చిగురించినట్లుగా, మల్లెలు కొత్తగా నవ్వుతున్నట్లుగా భావిస్తుంది. ఆమె
కళ్ళముందు అంతా కొత్తగా కనబడుతుందన్నమాట. ప్రేయసి వయసులోని
పారవశ్యాన్ని ఈ పాట స్పష్టంగా వివరిస్తుంది.
పిల్లల భవితకు కొత్తబాట వేసేలా ఓ సందేశాత్మకగీతాన్ని దేవులపల్లి
కృష్ణశాస్త్రి రాయగా, పి.సుశీల పాడారు. ఆ పాటను పరిశీలిద్దాం.
‘అడుగడుగున గుడి ఉంది/ అందరిలో గుడి ఉంది
ఆ గుడిలో దీపముంది/అదియే దైవం.
ఇల్లూవాకిలి ఒళ్ళూమనసు/ఈశుని కొలువనిపించాలి
ఎల్లవేళలా మంచుకడిగిన/మల్లెపూవులా ఉంచాలి
తల్లీతండ్రి గురువు పెద్దలు/పిల్లలు కొలిచే దైవం
కల్లాకపటం తెలియని పాపలు/తల్లులు వలచే దైవం
ప్రతి మనిషి నడిచే దైవం/ప్రతి పులుగు ఎగిరే దైవం..’ ( ఉండమ్మా బొట్టు పెడతా-
1968) సినిమాలో కథానాయిక పిల్లలకు ఉత్తమ గుణాలనలవరుచుకోవాలని చెప్పే సందర్భం..
అందరికీ పరమాత్ముడే వెలుగునిచ్చే దీపం వంటి వాడని, తరచి చూస్తే ఈ జగమంతటా
అడుగడుగున గుడి ఉందని, అందరిలో గుడి ఉందని, అంటే దైవం అందరిలో కొలువై ఉన్నాడని
పిల్లల ఉజ్జ్వల భవిష్యత్తుకు బాటలు వేస్తూ ఈ పాటను కథానాయిక
వినిపిస్తుంది. నిర్మలమైన హృదయంతో మెలగాలని, అటువంటి హృదయంలోనే దైవం
కొలువుంటాడని చెబుతున్నాడు కృష్ణశాస్త్రి. అంతేకాకుండా మాతృదేవోభవ,
పితృదేవోభవ, ఆచార్యదేవోభవ, అతిథి దేవోభవ అన్న వేదసూక్తిని పిల్లలకు గుర్తు
చేస్తూనే…అటు పెద్దలకు కూడా పిల్లలలో ఉండే దైవత్వాన్ని గూర్చి చెప్పి
హెచ్చరిస్తాడు. చివరలో.. నడిచే ప్రతి మనిషిలో, ఎగిరే ప్రతి పక్షిలో
దైవత్వాన్ని చూపిస్తాడు. అలా మామూలు నేత్రం చూడగలదో, లేదో గాని
కృష్ణశాస్త్రి మనోనేత్రం కలం మాత్రం చూడగలవనిపిస్తుంది. ఈ సినిమాలోని
అన్ని పాటల్ని కృష్ణశాస్త్రి తోనే రాయించాడు కె.విశ్వనాథ్.
మహాకావ్యాల్లో ఉండే సంస్క్రత సుదీర్ఘమైన సమాసాలు కూడా ఆయన ఎంతో
ఇష్టపడి సినిమాల్లో రాయించుకునేవారు. అందుకు..డా.సి.నారాయణరెడ్డి తో
రాయించుకున్న ఈ పాటే నిదర్శనం..
‘ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా
పతిని కోలుపడి రతీదేవి దు:ఖితమతియై రోదించగా
హిమగిరీంద్ర శిఖరాగ్ర తాండవత్ ప్రమథగణము కనిపించగా
ప్రమథనాధకర పంకజ బాంకృత ఢమరుధ్వని వినిపించగా
ప్రళయకాల సంకలిత భయంకర జలధరార్భటుల
చలిత దిక్తటుల చకిత దిక్కరుల వికృత ఘీంకృతుల
సహస్రఫణసంజనిత పూత్క్రతుల…’ (చెల్లెలి కాపురం – 1971)కథానాయకుని కవితావేశానికి ధీటుగా కథానాయిక నాట్యం చేయడం ఇందులో
కనిపిస్తుంది. కవి కవితాశక్తి విజ్జ్రంభించినపుడు దానికి ధాటికి తట్టుకోలేరన్న
విషయాన్ని కూడా ఈ పాట స్పష్టం చేస్తుంది. శివుని మూడోకంటి నుంచి పుట్టిన
ఆగ్రహజ్వాలలు మన్మథుని దహించినట్లుగా, ఆ మన్మథుని చూసి రతీదేవి
దు:ఖహృదయంతో రోదిస్తున్నట్లుగా, ప్రమథులంతా హిమాలయశిఖరమంచుల
తాండవిస్తున్నట్లుగా, ప్రమథులకు అధిపతియైన శివుని చేతి నుంచి ఢమరుధ్వని
వినిపిస్తున్నట్లుగా, ప్రళయకాలంలో భయంకరంగా వినిపిస్తున్న మేఘాల గర్జన,

దిక్కుల చలనం, దిక్కులనే ఏనుగుల భయంకరశబ్దాలు, వేయి సర్పాలనుంచి వదలబడిన
విషవీచికలు….వంటి శబ్దభావసమ్మేళనానికి తగిన రీతిలో నటించడమనేది కత్తి మీద
సామే. ఈ పాట కవికున్న అనంతమైన కవిత్వబలాన్ని ప్రస్ఫుటంగా వివరిస్తుంది.
ఇలాంటి పాటలను సినిమాల్లో పెట్టి ప్రేక్షకులను, శ్రోతలను మెప్పించడం
మామూలు విషయం కాదు.
క్షణికమైన మనిషి జీవితమే ఒక నటన అంటూ వేటూరి సుందరరామ్మూర్తి రాసిన ఈ
పాటను పరిశీలిద్దాం.
‘తకిట తథిమి తకిట తథిమి తందాన
హృదయలయల జతుల గతుల థిల్లానా
తడబడు అడుగుల తప్పని తాళాన
తడిసిన పెదవుల రేగిన రాగాన
శ్రుతిని లయని ఒకటి చేసి…’ ( సాగరసంగమం – 1983)
తకిట, తథిమి అనేవి సంగీతంలో జతులకి సంకేతాలు. హృదయంలోని లయ, జతులు,గతులు
సంగీతంలోని శబ్దాలు. తడబడిన అడుగులతో (తాగినవాడి నడక కుదురుగా ఉండదు కదా)
తడిసిన పెదవుల రేగిన రాగంతో(మందుతో తడిసిన) శృతిని, లయని ఒకటి చేసి కథానాయకుడు
చెబుతున్న వేదంగా ఈ పాట కనిపిస్తుంది.
మనం చేసే ప్రతి ప్రక్రియ ఆ దేవుడి ఆలోచనలోనుంచి పుట్టుకుని వచ్చిందే. ఆ
రెండు ఘట్టాల మధ్యలో మనకి ఎందుకు ఈ తాపత్రయం? ఇక్కడ తాపత్రయం అనేది
అతని మనసులో ఉన్న బాధ గురించి తెలియజేస్తుంది. అతను ప్రేమించిన ప్రియురాలు
దక్కలేదు. దానికంటే ఎక్కువగా ప్రేమించిన నాట్యం కూడా అతనికి దక్కలేదు.
ఇదంతా ఆ దేవుడు ఆడే ఆటనే కదా అనే చేదునిజాన్ని ఒక్క మందు తాగేవాడు మాత్రమే
ఒక పరిపూర్ణతతో చెప్పగలడు.
ఏటిలోని అలలవి అయోమయమైన కదలికతో కూడిన ప్రయాణం. కంటిలోని కలలు కూడా
ఊహకి అందని సన్నివేశాలను మనకి చూపిస్తాయి. ఈ రెండూ ఒకటే కదా! వాటిని కలిపి
గుండెలోని అలలను కళ్ళకు వేసుకునే అందెలుగా చేసి పాటను పాడుతున్నానంటాడు
కథానాయకుడు. గొప్ప భావుకతతో, లోతైన తాత్త్వికతతో ఈ పాట మనకు
కనిపిస్తుంది. ఈ సాగరసంగమం సినిమాలోని ప్రతీపాట భావుకత తారాస్థాయిలో
ఉంటుంది. సంగీతం, సాహిత్యం, నాట్యం ఈ మూడింటి సమ్మేళనం ‘సాగరసంగమం’.
విశ్వనాథ్ సినిమాల్లోని ప్రతీపాట ఇలాగే అద్భుతమైన మంత్రధ్వానాన్ని
వినిపిస్తుంటుంది.
సరస సంగీత, సాహిత్య సమ్మేళనమై సాగే మరో పాటను చూద్దాం.
సీతారామశాస్త్రి కలం నుండి జాలువారిన ఈ పాట సినిమాకే తలమానికంగా నిలిచింది.
గీతరచయితగా ఆయన దశని, దిశని మార్చివేసింది. చివరికి ఆయన ఇంటిపేరును కూడా
మార్చివేసింది.
‘విధాత తలపున ప్రభవించినది అనాది జీవనవేదం
ప్రాణనాడులకు స్పందననొసగిన ఆది ప్రణవనాదం
కనుల కొలనులో ప్రతిబింబించిన విశ్వరూప విన్యాసం
ఎద కనుమలలో ప్రతిధ్వనించిన విరించి విపంచి గానం
సరసస్వర సురఝరీగమనమగు సామవేదసారమిది..
నే పాడిన జీవనగీతం..ఈ గీతం’ ( సిరివెన్నెల – 1986)
అప్పటికే వేటూరిలాంటి సమున్నత శిఖరం ఒక వెలుగు వెలుగుతున్న తరుణంలో అందరి
దృష్టి సీతారామశాస్త్రి వైపు మళ్ళింది. ఈ పాటతో తెలుగు సినిమాపాటకు
కావ్యగౌరవాన్ని కలిగించిన కవుల జాబితాలో సీతారామశాస్త్రి కూడా
చేరిపోయాడు. బ్రహ్మ తలపుల్లో పుట్టిన సనాతన జీవనవేదాన్ని, ప్రాణనాడులకు
కదలికలిచ్చిన ఓంకారనాదాన్ని, సరసస్వర ప్రవాహ ప్రయాణమై సాగే సంగీతమయమైన
సామవేదనాదాన్ని, జీవనగీతాన్ని ఎలుగెత్తి వినిపించాడు సీతారామశాస్త్రి. సంగీతం గొప్పదనాన్ని సాహిత్యంలో వేయిగొంతుకలతో చాటి చెప్పిన తీరు ఇందులో
కనిపిస్తుంది. ఈ పాటలో వాడిన ‘ప్రాగ్దిశవీణ'(తూరుపు అనే వీణ), ‘దినకర మయూఖ
తంత్రులు'( సూర్యకిరణాలనే తీగెలు), ‘జాగృతవిహంగం'(స్వేచ్ఛ అనే పక్షి) వంటి
పదబంధాలను పరిశీలించినప్పుడు సీతారామశాస్త్రికున్న సంస్క్రతభాషాపటిమ
ప్రస్ఫుటమవుతుంది. ఈ సిరివెన్నెల సినిమాలో మొత్తం 10 పాటలు
సీతారామశాస్త్రి రాసినవే. ప్రతీపాట ఓ అద్భుతమే. కె.విశ్వనాథ్ దర్శకత్వం
వహించిన ‘జననీ జన్మభూమి'(1984) సినిమాతో పాటల ప్రస్థానం ప్రారంభించిన
సీతారామశాస్త్రి సిరివెన్నెల సినిమాపాటలతో ఒక శకాన్ని సృష్టించాడు. ఆ
తరువాత విశ్వనాథ్ దర్శకత్వం వహించిన ‘శృతిలయలు’, ‘ఆపద్బాంధవుడు’,
‘స్వర్ణకమలం’, ‘స్వయంకృషి’ వంటి చాలా సినిమాలకు పాటలు రాశాడు.
‘శృతిలయలు’ సినిమాలో ‘తెలవారదేమో స్వామి’ అనే పాటను అన్నమయ్య కీర్తన అని
భ్రమించే రీతిలో రాశాడు.
ప్రేయసీప్రియుల తీయని ప్రణయాన్ని, వారిద్దరి మధ్య గల అలక సన్నివేశాన్ని
ఆరుద్ర అక్షరీకరించిన తీరు చాలా రమణీయంగా ఉంటుంది.
‘రానని రాలేనని ఊరకే అంటావు
రావాలనే ఆశ లేనిదే ఎందుకు వస్తావు
కొంటె చూపు చూడకు గుండెకోత కోయకు
కోపమందు కులుకుచూపి కోర్కె పెంచకు
వేషమైనా మోసమైనా అంతా నీకోసం..’ ( ఆత్మగౌరవం – 1965)
అలకతో ఉన్న ప్రేయసి తన దగ్గరకు రానని చెప్పి కూడా వచ్చిన సందర్భాన్ని
అక్షరీకరించిన తీరు ఇక్కడ కనబడుతుంది. అలతి అలతి పదాలతో ఎంతో అందంగా ఆరుద్ర ఈ
పాటను కవిత్వీకరించాడు. కొంటె చూపుతో ప్రేయసి ప్రియుని గుండెను కోయడం,
కోపంతో కులుకుచూపి కోరికను పెంచడం ఇక్కడ కనిపిస్తుంది. ప్రియుడు ఎలాంటి వేషం
వేసినా, ఎంత మోసం చేసినా ప్రేయసి ప్రేమను పొందడానికేనన్నది స్పష్టంగా
తెలుస్తుంది. అంటే నిండైన ప్రేమకోసం ప్రియుడు ఆరాటపడిన వైనం, ప్రేయసి
ప్రేమను గెలుచుకోవడం కోసం ప్రియుడు వేసిన వేషం ఈ పాట నిండా కనబడుతుంది.
ఇలాంటి అలకగీతాలు, కులుకుగీతాలు విశ్వనాథ్ సినిమాల్లో కోకొల్లలుగా కనబడుతాయి.
ప్రేయసి నడకలో, నాట్యంలో, అందంలో అపురూప శిల్పసంపదను, లావణ్యాన్ని
దర్శిస్తూ వేటూరి సుందరరామ్మూర్తి రాసిన పాటను పరిశీలిద్దాం.
‘ఝణన ఝణన నాదంలో ఝళిపించిన పాదంలో
జగము జలదరిస్తుంది పెదవి పలకరిస్తుంది
గజ్జె ఘల్లుమంటుంటె గుండె ఝల్లుమంటుంది
గుండె ఝల్లుమంటుంటె కవిత వెల్లువవుతుంది
అమరావతి శిల్పంలో అందమైన కళలున్నాయి
అవి నీలో మిల మిల మెరిసే అరకన్నుల కలలైనాయి
నాగార్జునకొండ కోనలో నాట్యరాణి కృష్ణవేణి
నీ విరుపుల మెరుపులలో నీ పదాల పారాణి’ ( సిరిసిరి మువ్వ – 1978)
నాట్యం చేసే ప్రేయసి పాదంలో ఈ ప్రపంచమే జలదరిస్తుందని, అది చూసి అతని
పెదవి పరవశించి పాడుతుందని, కథానాయకుడు ఆనందంతో, సహృదయంతో పాడే పాట ఇది..
గజ్జె ఘల్లుమన్న శబ్దానికి ప్రతిగా గుండె ఝల్లుమనడం, దానికి ప్రతిగా కవిత
వెల్లువెత్తి సాగడం ఇక్కడ ప్రత్యేకంగా చెప్పదగ్గ విషయాలు. అమరావతి
శిల్పాలలోని అందమైన కళలు ప్రేయసిలో మెరిసే మెరుపులకు సరితూగవని,
నాగార్జునకొండ కోనల్లో ప్రవహించే కృష్ణానది – ఆమె విరుపుల మెరుపులలో
పాదాలకు పారాణి వంటిదని చెబుతాడు. ప్రేయసి రూపసౌందర్యానికి,
నాట్యచాతుర్యానికి ప్రపంచంలోని ఏ సౌందర్యం సాటిరాదని చెప్పడం ఈ
పాటలో కనబడుతుంది. ఈ సినిమాలోని పాటలన్ని వేటూరి రాసినవే. ‘జుమ్మంది నాదం సయ్యంది పాదం’, ‘ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక?’ మొ. సుప్రసిద్ధమైన
పాటలన్నీ ఈ సినిమాలోనివే..
జానపదశైలిలో కె.విశ్వనాథ్ స్వయంగా రాసిన ఓ శృంగారగీతాన్ని ఇపుడు చూద్దాం.
‘పట్టుసీర తెస్తనని పడవేసికెళ్ళిండు మావా!
గట్టుసేరే దాకా అట్టగే ఉండు పట్టపగలల్లే ఓ సందమామా!
తాళిబొట్టు తెస్తనని తాళ్ళరేవు కెళ్ళిండు మావా!
ఆలినయ్యేదాకా వెళ్ళిపోమాకా వెన్నెలమ్మా తోడు ఓ సందమామా!’ (
స్వాతిముత్యం – 1986)
కె.విశ్వనాథ్ స్వయంగా రాసిన అద్భుతమైన గీతమిది. జానపదశైలిలో పరమరమణీయంగా
రాసిన పాట ఇది. పట్టుసీరతెస్తనని పడవమీద వెళ్ళిన మావ కోసం మరదలు వేచి ఉన్న
తీరు ఈ పాటలో కనబడుతుంది. గట్టు చేరే దాకా తన మావ పడవకి వెలుతురులా ఉండి
కాపలా కాయమని చంద్రునికి చెప్పడం ఇక్కడ విశేషం. అలాగే తాళిబొట్టు కోసం
తాళ్ళరేవుకి వెళ్ళిన అతనికి ఆలినయ్యేదాకా ఎక్కడికి వెళ్ళిపోమాకని
వెన్నెలమ్మ సాక్షిగా ఒట్టు వేసిన సందర్భం కనబడుతుంది. పల్లెటూరిలోని
భార్యాభర్తల మధ్య గల ప్రేమానుబంధం, అన్యోన్యత ఈ పాటలో తొంగి
చూస్తుంది. ఇలా చెప్పుకుంటూపోతే కె.విశ్వనాథ్ సినిమాల్లోని ప్రతీపాట ఓ ఆణిముత్యమే.
ఓ అద్భుతమే. నిండైన సాహిత్యంతో, మధురాతి మధురమైన కవిత్వంతో ప్రతీ పాట
తొణికిసలాడుతుంది. ‘శృతిలయలు’, ‘శుభలేఖ’ వంటి సినిమాల్లో ‘ఇన్నిరాసులయునికి’,
‘విన్నపాలు వినవలె’, ‘నెయ్యములల్లో నేరెళ్ళో’ మొ. అన్నమాచార్య కీర్తనలు
కనిపిస్తాయి. ‘శంకరాభరణం’, ‘సప్తపది’, ‘సూత్రధారులు’, ‘శుభోదయం’, ‘శుభసంకల్పం’,
‘శుభప్రదం’, ‘జీవనజ్యోతి’, ‘నేరము-శిక్ష’, ‘స్వాతికిరణం’, ‘జననీజన్మభూమి’ మొ.
సినిమాల్లోని పాటలన్నీ మేలిమి రత్నాలే. ఆయన సినిమాల్లోని పాటలు
వింటున్నప్పుడు అవి అద్భుతమైన సాహిత్యసంస్కారం నిండి ఉన్న పాటలుగానే కాక,
శాస్త్రీయ సంగీతంతో మేళవించుకుని అవి అన్నమయ్య కీర్తనలా?, త్యాగరాజు
కృతులా?, క్షేత్రయ్య పదాలా? అని భ్రమించేంత అందంగా, మధురంగా
రూపుదిద్దుకోవడం విశేషం. విశ్వనాథ్ భౌతికంగా కీర్తిశేషుడయ్యాడు. అయినా తన
సినిమాలతో శాశ్వతంగా కీర్తివిశేషుడయ్యాడు. మరపురాని చిత్రరాజాలను
మనకందించిన దర్శక దిగ్గజం, మహామనీషి, కళాతపస్వి కె.విశ్వనాథ్.

డా. తిరునగరి శరత్ చంద్ర
6309873682

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *