కవుల ఊహలకు కట్టిన వేదిక

‘‘నా మూలమ్‌ లిఖ్యతే కించిత్‌ నానపక్షేతమ్‌ ఉచ్యతే’’ (మూలములో ఉన్న దానిని
ఉన్నట్లే చెప్పెదను. లేని దానిని కల్పించను) అని మల్లినాథుడు చెప్పిన మాట
వ్యాఖ్యాతలకు ఆదర్శ ప్రాయమైంది. ప్రాచీన కాలంలో వ్యాఖ్యానించడమే
విమర్శ. క్రమంగా గుణదోషాలను విచారించడం కావ్య సౌందర్యం, తాత్వికదృక్పథం,
వస్తునిర్మాణము, శిల్పం, ధ్వని విశేషాలు, పాత్ర చిత్రణ, శబ్ద చర్చ, వర్ణనలు,
అలంకారాలు కూలంకషంగా చర్చించడం ఆధునిక విమర్శ లక్షణంగా కొనసాగింది.
ఒక్కొక్కప్పుడు కవి హృదయం కవికి తెలియకపోవచ్చు గాని కవి అభిప్రాయాలు సరిగా
గుర్తించి లోకానికి తెలిపే ప్రజ్ఞాశాలి విమర్శకుడు అని అంటారు. నేటి
అత్యాధునిక విమర్శ ఎన్ని రూపాలెత్తి కొత్త పుంతలు తొక్కి తన పరిధిని
విస్తరించుకుందో తెలుసుకోవాలంటే ఏనుగు నరసింహారెడ్డి రచించిన ఊహల వేదికను
చదవాలి. ముందుమాటలు, సమీక్షలు, వ్యాసాల రూపంలో పాఠకులకు చేరువైన ప్రామాణిక
విమర్శనా వ్యాసాలతో కలిసి రూపుదిద్దుకున్న విమర్శనా గ్రంథమిది.
సాహిత్యము, చరిత్ర, భాషలలో సమాన ప్రతిభా సంపత్తి గల ఏనుగు నరసింహారెడ్డి
వందలాదిమంది కవులు వారి రచనలు, పాశ్చాత్య తత్వవేత్తలు, రచయితలు,
ఉద్యమాలు, పోరాటాలు, చారిత్రక సంఘటనలు, పురాణగాథలు, ఐతిహ్యాలు,
సంస్కరణలను ఈ గ్రంథంలో భాగస్వామ్యం చేసినారు.
కవిత్వాన్ని ప్రధానంగా చేస్తూ పుస్తకాల కవులు, కాలాలు, భౌగోళిక పరిస్థితులు,
సామాజిక స్థితిగతులు, జీవన విధానాలు, వారు ఎన్నుకున్న వస్తువులపై గల ప్రభావాలు
అన్నింటిని కూలంకషంగా చర్చించినారు. ఇందులోని 62 వ్యాసాలలో పాట, పద్యం,
గేయం, గజల్‌, వచన కవిత, యక్షగానం, బుర్రకథ నేటి ఆధునిక కాలంలోని కొత్త రూపాలు.
ఇలా ఏ రూపాన్ని విమర్శించినా ఇందులోని ఏక సూత్రత అన్ని వ్యాసాలు కవితా
ప్రక్రియవై ఉండడమే.
ప్రతి కవితా రూపపు పుట్టుపూర్వోత్తరాలు ఆయా కవితా రూపాలలో ప్రఖ్యాతి
చెందిన ఎందరో కవులను వారి రచనలను విభిన్న రూపాల లక్షణాలను నియమాలను
పూర్తిస్థాయిలో చర్చించడం వలన ఉపయుక్తమైన సాహిత్య గ్రరూవన్ని
చదువుతున్న భావనను కూడా పాఠకుడు పొందుతాడు.
గర్రెపల్లి కవితా మాధురిలో బ్రిటిష్‌ పాలనా కాలంలో హైదరాబాద్‌
సంస్థానములోని తెలంగాణ ప్రజల విద్యను, సంస్కృత ప్రేమను వివరంగా అందించారు.
అదేవిధంగా ఎన్‌.టి.రామారావు అధికారంలో స్థిరపడి ప్రభుత్వోద్యోగుల
ఉద్యోగ విరమణ వయసును 58 నుండి 55 కు తగ్గించగా ఆ వేదనతోనే గర్రెపల్లి
కన్నుమూసాడని తెలుపుతారు. ఆ సమయాలలో దాశరథిని ఆస్థాన కవి పదవి నుండి
అవమానకరమైన పద్ధతిలో తొలగించిన విధానాన్ని తెలిపి సీమాంధ్రులు కవులపై
జరిపిన దాడిని అంచనా వేయిస్తారు. గజ్జెల రామకృష్ణ కవితని విమర్శించే
సందర్భంలో నేతకళలో ఆరితేరిన నేతగాళ్ల మునివేళ్లు బ్రిటిష్‌ వాళ్ళు తమ
వ్యాపారాభివృద్ధి కొరకు నరికివేసిన సంగతిని, నేత వృత్తికారులను దెబ్బ తీసిన
బొంబాయి టెక్స్‌టైల్‌ కార్మికుల సమ్మె పరిణామాలను వుటంకిస్తారు.
పుష్పలత కవిత్వాన్ని విమర్శిస్తూ నిషిద్ధాక్షరం కవయిత్రిలో అటు విప్లవ
సానుభూతి, ఇటు దళితవాదం సమాంతరంగా ప్రయాణం చేస్తున్నాయంటూ కుల పోరాటాలు
వర్గ పోరాటాల మధ్య వైవిధ్యాన్ని తెలుపుతూ 2018లో ‘లాల్‌ నీల్‌’ కూటమిని
ప్రస్తావిస్తారు.
పోరెడ్డి రంగయ్య గారు అందించిన భువన కవనాన్ని విమర్శిస్తూ ఆనాటి మూడవ
సింగభూపాలుడితో ప్రారంభించి 2016 అక్టోబర్‌ 11న ఏర్పాటయిన యాదాద్రి
భువనగిరి జిల్లా వరకు ఇటు చరిత్రను అటు సాహిత్యాన్ని సమాంతరంగా విశ్లేషిస్తూ
పోతన శ్రీనాథుడులతో ప్రారంభమై ఎన్‌. గోపీల వరకు సాహిత్యాన్ని విమర్శించడమే కాకుండా అగ్నిపర్వతాలు నిక్షిప్తం చేసిన రాతి సంపదను
భువనమల్లుడి పేరు మోస్తున్న ఏకశిల ప్రకృతి సౌందర్యాన్ని పోచంపల్లి,
బొల్లెపల్లి, భూదానోద్యమ గాథలను పొందుపరిచిన తీరు ఉద్గ్రంథాన్ని చదివిన
భావనను కలిగిస్తుంది.
రెబ్బ మల్లికార్జున్‌ లోహకాలం ఆర్ద్ర కవిత వ్యాసం నేపాల్‌ రాజు దీపేంద్ర
తన తల్లిదండ్రులతో పాటు 9 మందిని కాల్చి చంపడం, అఫ్ఘనిస్థాన్‌ లో తాలిబన్లు
అధికారం చేపట్టడం, స్పానిష్‌ ఫ్లూ, కరోనాల వాస్తవ గాథలతో అనూహ్యంగా
ప్రారంభమై గగుర్పాటుతో కూడిన ఆసక్తిని కలుగజేస్తుంది.
తనకు తెలిసినంతలో కోమటి కొట్టు పై మడత భాస్కర్‌ దే తొలి కవిత అంటారు.
రిలయెన్సుకూ ఊరికొట్టుకూ ముడిబెట్టడం మన వితండ వాదమని వీటికి నడుమ
సంస్కృతానికి దేశి కవిత్వానికి ఉన్నంత తేడా ఉందంటారు.
పాలడుగు నాగయ్య 1943లో జన్మించి 1982లో మరణించారు. వీరు ‘‘అంబేద్కర్‌
బుర్రకథలో అంబేద్కర్‌ గారు జన్మముతోనే అపరమనువండి సమత భావము కలవాడు
సాంఘిక కర్త యండి’’ అంటారు. దీనిని విమర్శిస్తూ ఈ వస్తువును ఇప్పుడు ఏ దళితవాది
శీంఱ్‌ఱఙవగా చూడలేడు అంటూ కవి ఉపయోగించిన మాటల ఆధారంగా నాటి
సంఘర్షణామయ దళిత జీవితాలను చర్చిస్తారు. 1970 గోదావరి లోయ పోరాటాన్ని
1945 నుండి జరిగిన సాయుధ పోరాటాన్ని వివరిస్తారు.
‘అమ్మ’ కవులకు ఓ భిన్నమైన జ్ఞాపకంలో గ్రీక్‌ కథైన ట్రోజర్‌ వార్‌
సందర్భంలో అలిచిస్‌ అతని తల్లి కథ, దుర్యోధనుడు గాంధారి కథ, పులి చేతికి చిక్కిన
ఆవుకథ, ఉప్పల నరసింహం రాసిన ‘ఇత్తనపు కోడె’ కథలతో సమన్వయ పరుస్తారు. అమ్మ
అనే వస్తువు చుట్టూ అల్లుకున్న కవిత్వాన్ని సమర్థించడానికి ఎన్నుకున్న
కథలలోని వైవిధ్యం గమనింపులోకి వచ్చి తీరుతుంది. ఒక పాశ్చాత్య ఒక పౌరాణిక ఒక
ఐతిహాసిక ఒక ఆధునిక కథలు కాకతాళీయంగా వచ్చి చేరలేదని భౌగోళికదూరాలు యుగాల
కాలాలు ఏవి ఎంత మారినా ‘అమ్మ’ అమ్మనే అన్న భావాన్ని బలపరుస్తూ కవిత్వాన్ని
విశ్లేషించిన తీరు విమర్శకులకు ఆదర్శనీయం కాకుండా ఎలా ఉంటుంది.
చీదెళ్ల సీతాలక్ష్మి, దండమూడి శ్రీ చరణ్‌ కవిత్వాలను విమర్శిస్తూ తనను తాను
నియంత్రించుకోలేక కవిగా పరకాయ ప్రవేశం చేస్తారు. విమర్శంతా కవిత్వమే
అనిపిస్తుంది ‘‘పడవ చేయడానికి కాగితాన్ని మడతలు పెట్టినట్టు మెత్తగా
కవిత్వం చెబుతూ పోయాడు’’అని అంటారు ఇది అభిలషణీయం కూడా.
ప్రధానంగా కవిత్వం ఆవశ్యకత కవుల బాధ్యతలు ఏమిటి కవిత రచన నిర్వహణ ఎలా
ఉండాలో తెలిపే పేరాలు వాక్యాలు పెద్ద మొత్తంలోనే అడుగడుగునా తారస
పడుతుంటాయి. ఈ విషయంలో కొత్త కవులు రచయితలు విమర్శకుల పట్ల
బాధ్యతాయుతమైన అధ్యాపకుడి పాత్రను ఏనుగు నరసింహారెడ్డి పరిపూర్ణంగా
పోషించినారు.
ఒకచోట ‘కవిత్వం వస్తే రాసేదే కానీ రాస్తే వచ్చేది’ కాదంటారు. వాసర చెట్ల
జయంతి కవిత్వాన్ని విమర్శిస్తూ భౌతిక ఉద్యమాలకు కానికాలం దాపురించిన
రోజులివి కాబట్టి నినాదాలు వాక్యాలను ప్రత్యామ్నాయంగా పాఠకుడిని
బాధ్యతాయుతుడిగా తయారు చేయడమే ఇప్పటి కవుల లక్ష్యం. అందుకు గొప్ప
ఊహలు కొత్త ఆలోచనలు తక్షణావసరం అంటారు.
కొలకలూరి ఇనాక్‌ గారి కవిత్వాన్ని విమర్శిస్తూ అపరిమితత్వం సాహిత్య సృజనకు
కావలసిన మూలధనం అని కవిత్వానికి మల్టీ డైమెన్షన్స్‌ ఉండడం గొప్ప లక్షణమనీ
అంటారు.
డాక్టర్‌ రాయరావు సూర్యప్రకాశ్‌ రావు సంపాదకత్వం వహించిన భావదర్పణం
గురించి రాస్తూ కవిత్వం ఒక తీరని దాహం అన్న శ్రీశ్రీ మాటలను వైవిధ్య భరితంగా
సుదీర్ఘంగా చర్చించారు. తాళపత్రంతో ఆరంభమైన సాహిత్యం సాఫ్ట్‌ కాపీ
సృజనతోపాటు సాంద్రకవిత్వం దిశగా కూడా పయనించాలంటారు..ఒక వైపే మొగ్గుచూపని తత్వం నిజమైన విమర్శకుడి సొంతం. సిరివెన్నెల
సీతారామశాస్త్రి సాహిత్యాన్ని విశ్లేషించిన తీరులో అది స్పష్ట మవుతుంది.
అమ్మానాన్న శతక వ్యాసంలో కవయిత్రి శాంతారెడ్డి పాలమూరు కేంద్రంగా
మహిళల కోసం ప్రత్యేకంగా సాహిత్యోద్యమం చేస్తున్న వారుగా
అభినందించబడడం ఆదర్శనీయం.
కవితారచనలో ఎత్తుగడ నిర్వహణ ముగింపులు ఎలా ఉండాలో సీనియర్‌ కవులు విమర్శకులు
అందరూ సర్వసాధారణంగా వివరించే ఉపయుక్తమైన విషయమే. ఇందుకు భిన్నంగా
కవిత్వం రాయాలంటే పూర్వరంగాన్ని ఎలా ఏర్పరచుకోవాలో వ్యక్తిత్వాన్ని ఎలా
నిర్మించు కోవాలో ఏ విధంగా సంసిద్ధులు అవ్వవలసి ఉంటుందో నక్క హరికృష్ణ
కవిత్వాన్ని విమర్శించే వ్యాసంలో ఆసక్తికరంగా వివరిస్తారు. ‘‘కిరీటాలు
తొలగించుకోవాలె భుజకీర్తులు తీసి పక్కన పెట్టాలే…….. సారూప్యమైన ఊహలు
వెతుక్కోవాలె కొత్త అనుభవాలకు మనల్ని మనం అనుసంధానం చేసుకోవాలె. నూర్ల
పాదాల సాహిత్యాన్ని అక్కున చేర్చుకోవాలె. అప్పుడు గాని నూటొక్కటో పాదం
పురుడు పోసుకోదు’’ అంటారు.
ఈ ఊహల వేదికలో జాషువా, సినారె, ఆత్రేయలతో పాటు దాసోజు లలిత, నిజం
శ్రీరామమూర్తి, దొరవేటి, ఎండల నరసింహులు యాదగిరి, ఎడ్లలక్ష్మి, బండికాడి
అంజయ్య గౌడ్‌, డాక్టర్‌ బాలకృష్ణ, నూతక్కి రాఘవేంద్రరావు,
మూర్తిశ్రీదేవి, కర్నాటిలింగయ్య, గులాబీల మల్లారెడ్డి, ఉగ్రగౌడ, అంబల్ల
జనార్దన్‌, దాసరిశ్రీనాథ్‌, మాడభూషి సంపత్‌ కుమార్‌, ఖాజా దామెరరాములు, కే
ప్రభాకర్‌, గడ్డంశ్యామల, నారాయణరెడ్డి, చిగురుమల్ల శ్రీనివాస్‌, డాక్టర్‌
యమ్‌ యస్‌ బృంద, హసేన, కొప్పుల యాదయ్యల కవిత్వం కూడా ప్రామాణికంగా
విమర్శించబడిరది.
తెలంగాణలోని ప్రతీకవి విని గర్వపడే నినాదం ‘‘ఒకప్పటి మాట తెలంగాణలో కవులు
పూజ్యం ఇప్పుడు తెలంగాణ కవుల రాజ్యం’’ ఈ నినాదం సృజనకారులు ఏనుగు
నరసింహారెడ్డి గారు ఊహల వేదికను వేదిక చేసుకొని గ్రంథస్థం చేయడం ఆనందింప
దగినది.
16 గ్రంథాలను రచించిన సుప్రసిద్ధులైన కవి, విమర్శకులు, అనువాదకులు ఏనుగు
నరసింహారెడ్డి. ఈ ఊహల వేదికలో కవిత్వం అంటే దేన్నీ ధిక్కరించడమూ కాదు
దేన్నీ ఆలింగనం చేసుకోవడం కాదు బాధ్యతాయుతమైన జీవనం, హేతువు ఆధారమైన
జీవనం, సత్యాన్వేషణం కూడా’ అని అంటారు. వీరు రచించిన ప్రఖ్యాతి చెందిన
తెలంగాణ రూబాయిలు కూడా ఈ అన్వేషణ కొరకు చేసిన ప్రయాణమే. ఏనుగు
నరసింహారెడ్డి గారి ఈ సత్యాన్వేషణ నిరంతరంగా కొనసాగాలని ఆశిద్దాం.

డా. కాచాపురం దుర్గాదేవి
ఫోన్‌ : 789 309 3495

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *