బి.ఎస్. రాములుగా ప్రసిద్ధిపొందిన బేతి శ్రీరాములుగారు తన బాల్యంనుండి పొందిన, చూసిన జీవిత అనుభవాలనే రకరకాల కథాంశాలుగా పాఠకుల మనసులను చూరగొనేలా తెలుగు కథా సాహిత్యంతో తెలంగాణ సామాజిక నేపథ్యాన్ని రంగరించి అక్షరరూపాన్నిచ్చారు. సందర్భానుసారంగా పెల్లుబిన సామాజిక ప్రజా ఉద్యమ జీవితాలను వైవిధ్యభరితంగా చిత్రించిన కథకుడు బేతి శ్రీరాములు. 1982లో వచ్చిన ‘‘బతుకు పోరు’’ నవల ద్వారా తన రచనల పరంపరలకు శ్రీకారంచుట్టారు . తద్వారా వీరి పేరు బి.ఎస్. రాములుగా పాఠకలోకంలో ప్రచారం ప్రారంభమైంది. ఈయన తాను రాసిన నవలల్లో సామాజికుల కడగండ్లను, వారి జీవన విధానాల బాగోగులను, దోపిడీదారుల దుర్మార్గాలను, వృత్తినైపుణ్యాది అంశాలను, ఆర్థిక పరిణామాలను లోతుగా బి.ఎస్. రాములు ఆవిష్కరించారు. బీడీ కార్మిక కుటుంబాల నుండి ఎంతో శ్రమపడి ఎదిగిన విద్యావంతులు వారి జీవితాలు, పరిణామాలు జీవన యానం నవలలో బతుకుపోరాటంగా కనబడతాయి. దీనికి మొదటి భాగంగా ఉన్న బతుకుపోరు లోని కుటుంబాలు తర్వాత క్రమంలో అభివృద్ధి ఫలాలు అందుకుంటూ కష్టించి ఎదిగిన క్రమమే జీవనయానం నవల కథలోని ఇతివృత్తం. జీవనయానం నవలలో విభిన్న సామాజిక వర్గాల యువతీ యువకుల జీవితాలను వ్యాఖ్యానిస్తూ వారి ఆలోచన, స్వభావాలను విశ్లేషిస్తూ మరొక క్రొత్త కలల ప్రపంచాన్ని రచయిత ఆవిష్కరించారు. దీనికి సమాంతరంగా 1980 కాలపు పిల్లల, తల్లిదండ్రుల- దృక్పథాలను విస్తృతంగా వివరించే ప్రయత్నం చేశారు. అలా జీవనయానం నవల ఆనాటి ఆర్థిక, సామాజిక, రాజకీయ, పరిణామాలు మనిషిని ఎంతగా ప్రభావితం చేసిందో, ఆ వివరాల నేపథ్యంలో కథాంశ నవలయే ఈ జీవన యానం. ఈ నవల కొందరి జీవన గమనాన్ని ఆపలేదు. రేపటి ప్రపంచ భౌతిక, తాత్విక ప్రమాణాదులను నిర్దేశిస్తూ నడుస్తుంది జీవనయానం.
ఈ నవల రచనా కాలం 1998 అయితే, నవలలోని కథ మాత్రం 1985-90 మధ్యకాలంతో ప్రారంభమవుతుంది. ప్రజల సామాజిక జీవితంలోని అన్ని కోణాలు వీరి రచనలో ప్రతిబింబిస్తుంటాయి. బి.ఎస్. రాములు తన చుట్టూ ఉన్న, సమకాలీన సమస్యలను కళ్ళకు కట్టినట్లుగా చిత్రించడంలో సిద్ధహస్తులు. సమకాలీన సమాజంలోని యువతీ యువకుల ఆలోచనలు, సామాజిక పరిణామాలను నవలావస్తువుగా తీసుకొని అక్షరబద్ధం చేశారు. ఎవరి జీవితం వ్యక్తిగతమైన సమస్య కాదన్న సత్యాన్ని కొత్తకోణంలో లోకానికి చాటారు. కాబట్టి సమిష్టిగతమైన ప్రజాజీవన సమస్యల్ని పరిష్కరించే దిశగా, వారి జీవనదశను ఉద్ధరించడానికి రచించే సాహిత్యం కూడా తప్పనిసరిగా సామాజిక శక్తిగా తోడ్పడాలనేది రచయిత సంకల్పం. అలా సాగిన నవలా అక్షరూపతపమే జీవనయానం. తెలంగాణ ప్రాంతానికి చెందిన నలుగురు విద్యావంతులైన యువతీ యువకుల జీవితాల్లో, వారి కుటుంబాల్లో చోటు చేసుకున్న అనుకోని రీతుల్లో జరిగిన వివిధ సంఘటనల పరిణామాల సమాహారంతోపాటు, మరికొన్ని ఇతర పాత్రల జీవనగమనాలకు ప్రాధాన్యం చూపుతూ ముందుకు కదులుతుంది ఈ నవల. జీవనయానం నవల మధ్యతరగతి మనుషులు, వారి జీవితాల కేంద్రంగా పరిభ్రమిస్తున్నట్టుగా కనిపిస్తూనే సమకాలీన, ప్రాపంచిక పరిణామాల చుట్టూ విస్తృతంగా చర్చలను లేవనెత్తుతుంది. ఇదివరకు తెలంగాణ నవల్లో ఉద్యమ చిత్రాణ ఎక్కువగా ఉంటూ, ప్రజా జీవిత ప్రస్తావన నామమాత్రంగానే ఉండేదని విమర్శకుల అభిప్రాయుం. ఈ నవలలు మాత్రం పాత్రల అవసరాలు, ఆలోచనలు, జీవన స్థితిగతుల మధ్య సామాజిక ఉద్యమాల వాదనలకు సంబంధించిన అంశాలు చర్చావస్తువులయ్యయి. తెలంగాణ ఉద్యమ సంబంధి రచనలని వీటిని గౌరవించడం యుక్తియక్తం. కానీ వైయుక్తిక జీవితం, సామాజికం రెంటినీ సమతూకంగా వేటికవే ప్రాధాన్యం సంతరించుకునేలా నైపుణ్యంతో బి.ఎస్. రాములు నవలను మలచారు. జీవనయానంలో సామాజికాంశల ధోరణుల పరిచయాదులను చూడగలము. జీవనయానంలోని రెండు ముఖ్యపాత్రలు అరవింద్, రాధ. నవ యౌవనప్రాయంతో ప్రేమపూరిత భావాలను నింపుకున్న రెండు పాత్రల మధ్య చిగురుస్తున్న ప్రేమను తెలుపుతూ నవల ప్రారంభమవుతుంది. జీవనయానం నవల ప్రారంభంలో ‘‘ప్రఖ్యాత ఫ్రెంచి సామాజిక అర్థశాస్త్రవేత్త ప్రసంగం వినాలని విక్రాంత్ పట్టుపట్టి ఎంతో మేలు చేశాడు. అమర్త్యసేన్ సంక్షేమ అర్థశాస్త్రం కన్నా క్యాపిటల్ – సోషల్ ఎకానమీ (పెట్టుబడి-సామాజిక అర్థశాస్త్రం) ఇంత సమగ్రంగా ఉంద అనిపిస్తుంది. ఇది సోషలిస్టు దృక్పథానికి దగ్గరగా ఉందనిపిస్తుంది’’. (జీవనయానం-పుట.5) అంది ఉస్మానియా మెడికల్ కాలేజీలో మెడిసిన్ చదువుతున్న రాధ అనే అమ్మాయి, తన తోటి విద్యార్థి అరవింద్‌ని చూస్తూ! అలా ప్రారంభమైనంది వారి ప్రేమ. మరునాడు సినిమా చూస్తూ రాధ కళ్ళతో, హృదయాలు కలుపుకున్న ఉత్తేజం, చేతుల్లో వేళ్ళు బిగించి, కాళ్లతో కాళ్ళు తాకించి, అనుభవించిన స్పర్శా సుఖం వంటి అంశాలను యౌవనప్రాయంలో ఉండే వారి ఆలోచన తీరులను రచయిత చిత్రించారు. అలా అరవింద్ అతని మరదలు సావిత్రి, మిత్రురాలు లత, ఆ ఊరి వడ్డీవ్యాపారి నారాయణ సేటు కూతురు నిర్మల అరవిందుని ఇష్టపడినా, తాను మాత్రం వారిని ఏ మాత్రం పట్టించుకోకుండా, రాధ అనే అమ్మాయి ఇష్టపడేవాడు.ఇద్దరి సామాజిక వర్గాలూ సమంకావడం కూడా అరవింద్ మనసుని ప్రేరేపించాయి. కానీ రాధ, అరవింద్ పట్ల ప్రేమ ఉన్నప్పటికీ కూడా తన తల్లిదండ్రులు చూసినటువంటి అమెరికా అబ్బాయిని పెళ్లి చేసుకొని ఆదేశానికి వెళ్ళిపోవడం వంటి సంఘటనలు అరవింద్ మనసును సుంత గాయపరిచాయి. ఈ నవలలో అరవింద్ తల్లిదండ్రులు కొడుకు చదువుకు పెట్టిన డబ్బులు తిరిగి వాని పెళ్లితో సంపాదించాలనే తపనతో సొంత మరదలయిన సావిత్రిని కాదన్నారు. వడ్డీవ్యాపారి నారాయణ సేటు కూతురు నిర్మలతో కుమారుడి వివాహం జరిగితే అప్పులన్నీ తీరుతాయనే ఆలోచించారు. ఈ తరహా ఆలోచనలు మధ్యతరగతి కుటుంబాల్లో ఛిద్రమవుతున్న ఆర్థిక సంబంధాలను రచయిత పాఠకుల గుండెలు పిండేటట్లు చిత్రణ చేశారు. కానీ ఈ ప్రయత్నమంతా అరవింద్ తల్లిదండ్రుల ఆలోచనకే పరిమితం.
నేడు ప్రేమ, పెళ్లి, కుటుంబ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలన్నీ రాజకీయా ప్రాపకాయరూపాలే. వ్యక్తిగత విషయాలు కూడా రాజకీయకోణం, లేదా సామాజిక కోణంలో భాగమవు తున్నాయి. వీటితోపాటు ‘‘ఉద్యమాల, పార్టీల, భావజాలాల, సంస్కృతుల పవర్స్ సెంటర్స్ అన్ని సోషల్ క్యాపిటల్ సంచయాలే. ఇవన్నీ సోషల్ ఎకనామిక్స్ తాలూకు సోషల్ క్యాపిటల్ రూపాలు. ప్రేమ, పెళ్లి, కుటుంబం మొదలైన రూపాల్లో పైసా పెట్టుబడి లేకుండా పురుషాధిపత్యం చలాయించడం పితృస్వామిక సమాజ విలువల వల్ల సాధ్యపడుతున్నది. అలా నేడు ప్రేమ అని చాలామంది ఫీలయ్యేదాన్లో ప్యూడల్ పెట్టుబడి దారిదోపిడి వర్గాల పురుషాధిపత్యవాదుల దృక్పథమే ఉంది. రెండు హోదాల మధ్య, రెండు ఉద్యోగాల మధ్య, రెండు వ్యాపారాల మధ్య, పెళ్లిళ్లవుతున్నాయే తప్ప అవి రెండు హృదయాల మధ్య కాదు. తల్లిదండ్రులు చూసే సంబంధాలు కూడా యివే. కాదంటే కట్నంతో కొందరు, కాస్త పెద్ద హోదాతో పెళ్లి చేస్తారు. అటువైపు నుండి హోదాను ఉద్యోగాన్ని బట్టి కట్నం లాగుతారు. మనిషి ఇష్టాయిష్టాలను మనిషి కాకుండా వ్యవస్థలు, హోదాలు, స్థలకాలాలు, భావాలు, అర్హతలు నిర్ణయిస్తుంటాయి’’. అన్నా సోషలిస్టు మాటల్ని రచయిత తన పాత్రలోని సన్నివేశాలకు తగ్గట్టుగా చిత్రించటం జరిగింది. (జీవనయానం-పుట.30) అలాగే ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్ చెట్లతో, అందమైన భవనాలతో నిటారుగా ఆర్ట్స్ కాలేజ్ భవనం, ల్యాండ్ స్కేప్ గార్డెన్, ఒకపక్క డి హాస్టల్ మొదలైన సుందర దృశ్యాలను జీవన యానం నవలలో చిత్రించారు. అలా వారిద్దరి మధ్య ప్రేమను, సాధారణ ప్రేమ కథా పరంపరలనే దారిలోంచి ఒక్కసారిగా రచయిత అనేక మలుపులు తిప్పాడు. యువతీ యువకుల తల్లిదండ్రులు, వీరి ప్రేమ, వైవాహిక సంబంధాలను గురించి ఏ విధంగా ఆలోచిస్తారు? పిల్లల భవిష్యత్తు గురించిన, తమ తమ నిర్ణయాలను తల్లిదండ్రులు, ఎలా మార్చుకుంటారనే విషయాలపై, వాస్తవిక దృక్పధంతో కూడిన సందర్భాలను, సన్నివేశాలను రాములుగారు జీవనయానంలో పాఠకులకు కనువిప్పు కలిగేలా చిత్రించారు. బి.ఎస్.రాములు గారి విస్తృతమైన లోకానుశీలనం, కార్మికుల సామాజిక జీవనయాన పరిస్థితుల ఆలోచనలు, రచయిత దృష్టికోణంలో మానవ స్వభావాల విశ్లేషణ, పలు సాహిత్య ఉద్యమ భావజాల వాదాల అధ్యయనాల పునాదులకు జీవనయానం నవల ప్రతీక. ఈ నవలలో రకరకాల పాత్రలు అడుగడుగునా పలకరిస్తాయి. ఆయా పాత్రల ఆలోచన ద్వారా మనుషుల్లో నిబిడీకృతమైన సాధారణ సహజ స్వభావాలు, లోక రీతివంటి గుణాలు, వేగంగా పరుగు పెడుతున్నట్లుంది. ఈ కార్మిక దీనుల మానసిక మనోవేదనలు, పాఠకులకు తమగోడులను విప్పి చెప్పే ప్రయత్నం చేశాడు. తమ పిల్లల బాగోగులకోసం కన్నులు కాయలు కాసేలా ఎదురుచూపులు చూసే ముదుసలి తల్లిదండ్రుల ఆర్తిని తీర్చాలనేది రచయిత సందేశం. జీవనయానం నవలలో ఆయా సామాజిక వర్గాల కుటుంబాలు అనుసరించే భిన్న సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు, తదితర సాంస్కృతిక విశేషాలు, శ్రమైకజీవన సౌందర్యాదులు సందర్భోచితంగా అటనట కనిపిస్తుంటుంది. అలాగే సమకాలీన సామాజికాంశాలను చర్చించటంతో పాటు స్థానిక, జాతీయ విషయాలే కాకుండా, అంతర్జాతీయ సంఘటనల సన్నివేశాలు కూడా నవలలో కథాగతికి అనుగుణంగా రచయిత మలచారు. జీవనయానం అచ్చమైన తెలంగాణప్రాంత ప్రజల నవల జీవన స్రవంతి అనే చెప్పడం సబబు. ఆయా పాత్రల సంభాషణలో అడుగడుగునా తెలంగాణ తెలుగు యాస కనబడుతుంటుంది. మనకు తెలిసిన మనుషులతో, ఆ ప్రాంతంలో పుట్టి పెరిగిన పరిచిత వ్యక్తులతో మాట్లాడుతున్నట్లుగా తాదాత్మ్యం చెందుతారు. తెలంగాణ సమాజంలో మధ్యతరగతికి చెందిన యువతీ యువకుల ఆలోచనా ధోరణి, సైద్ధాంతిక దృక్పథం, భావోద్వేగపు అలజడులు, వారి తపించే మనోవేదనలను పట్టుకునే ప్రయత్నం చేసింది నవల. తెలంగాణలో సమకాలీన సమస్యల అవగాహనకు కాల గమనానికి ప్రతిఫలనమే జీవన యానం.
యం. సంతు
పరిశోధక విద్యార్థి,
కాశీహిందూ విశ్వవిద్యాలయం.
ఫోన్ : 709 519 3082