విహారిగా సాహిత్యలోకంలో ప్రసిద్ధులైన శ్రీజె.ఎన్.మూర్తి కవిగా, కథా రచచయితగా, నవలా రచయితగా, విమర్శకునిగా ఎంతో ప్రసిద్ధులు. వారి కలం నుంచి శ్రీపద చిత్ర రామాయణమనే బృహత్ పద్య గ్రంథం వెలువడే వరకూ వారిలో అంత పద్యనిర్మాణ ప్రతిభ ఉన్నదనే విషయం సాహిత్య లోకానికి తెలియదు. ఆ గ్రంథం వచ్చిన తర్వాత దాన్ని గూర్చి ప్రత్యేక సదస్సులు జరిగాయి. డా. వేమూరి సత్యవతి బాలకాండను గూర్చి పరిశోధన చేసి డాక్టర్ పట్టాపచ్చు కున్నారు. ఇంకా మాకినీడి సూర్యభాస్కర్, గుమ్మాసాంబశివరావులు ప్రత్యేక గ్రంథాలు రచించారు. ప్రస్తుతం డా. టి. శ్రీరంగస్వామి విహారి శ్రీపదచిత్ర రామాయణాన్ని గూర్చి ‘కావ్యావలోకనం’ గ్రంథాన్ని వెలువరించటం సంతోషించదగిన అంశం.
డా. టి. శ్రీరంగస్వామి మంచి సాహిత్య కార్యకర్త. బహుగ్రంథ రచయిత. సౌమ్యస్వరూపి. ఎక్కడ ప్రతిభ ఉన్నా గుర్తించే ఉదార గుణ సంపన్నులు. విశ్వనాథ సాహిత్యమంటే ‘ఇంత’ అని చెప్పటానికి వీలులేని అభిమానం గల సహృదయులు. అలాంటి స్వామి విహారి శ్రీపదచిత్ర రామాయణంలోని ‘కిష్కింధకాండ’ను గూర్చి 2015 ఏప్రిల్లో తెలుగు విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన సాహిత్య సదస్సులో ఒక పరిశోధన పత్రాన్ని సమర్పించి, అంతటితో ఆగలేక విహారి రామాయణంలోని అన్కి కాండల్ని అనుశీలనం చేస్తూ ‘కావ్యావలోకనం’ గ్రంథాన్ని వెలువరించటం అభినందనీయం.
శ్రీరంగస్వామి తమ గ్రంథాన్ని ఆరు అధ్యాయాలుగా విభజించారు. బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, విహారి ‘ఇష్టి’ కిష్కింధ, ‘సుందర’ మారుతీయం, ‘యుద్ధకాండము అనే శీర్షికలతో శ్రీపచరిత్ర రామాయణమనే పర్వతాన్ని ‘కావ్యావలోకనము’ అనే అద్దంలో చూపించే ప్రయత్నం చేశారు. శ్రీరంగస్వామి కాలస్వభావాన్ని గుర్తించిన రచయిత. వారు ఎన్నో సదస్సులు నిర్వహించారు. పుస్తకాలు ప్రచురించారు. ఇప్పటితరానికి పెద్దగ్రంథాలు చదివే తీరిక, ఓపిక లేవని అనుభవపూర్వకంగా గ్రహించినవారు కాబట్టి విహారి రామాయణ రచనామహత్త్వాన్ని సంక్షిప్తసుందరంగా సహృదయపాఠక లోకానికి పరిచయం చేశారు. మూల గ్రంథం మొత్తాన్ని చదివిన అనుభూతిని కలిగించారు.
గ్రంథరచయిత శ్రీరంగస్వామిగారు ముందుమాటగా ‘‘చిత్రవర్ణాల పదసోయగం’’ అనే శీర్షికలో తమ అభిప్రాయాల్ని స్పష్టంగా చెప్పారు. ‘‘విశ్వనాథ వారు అన్నట్లుగా ఈ పద చిత్రరామాయణంలో విహారి ‘జీవుని వేదన’ కూడా ఉంది. ఆ జీవుని వేదననే నాతో ఏప్రిల్ 2022 నుండి జులై 2022 వరకు ఈ కావ్యాన్ని అనుశీలనం చేయించింది’’ అని తెలియజేశారు.
శ్రీరంగస్వామి కవి హృదయాన్ని బాగా అర్థంచేసుకోవటం వల్ల కవి కవితాహృదయాన్ని విశేషంగా పసిగట్టటం వల్ల, శ్రీపద చిత్రరామాయణం కావ్య వైశిష్ట్యాన్ని గ్రహించటం వల్ల ‘కావ్యావలోకనము’ గ్రంథ్రాన్ని రచించగలిగారని చెప్పవచ్చు. విహారి పద్యాలు వ్యాఖ్యానం అవసరం లేని సరళసుందరమైన పదాల పోహళింపుతో, స్పష్టమైన భావాలతో ఉంటాయి కాబట్టి స్వామి సందర్భోచితంగా ఆయా పద్యాలను ఉట్టంకించారు. అవసరమైన సందర్భంలో చిన్న చిన్న వివరణలు అందించారు. ప్రతికాంలోను విహారి రచించిన విశిష్ట పద్యాలను పేర్కొనటమే కాకుండా, ఆయా కాండల్లో విహారి ప్రయోగించిన విలక్షణఛందస్సుల పట్టికను కూడా ఇవ్వటం బాగుంది. అంతటితో ఆగకుండా ఆయా కాండల్లో ప్రసక్తమైన తెలుగు నానుడుల్ని, సామెతల్ని ఏర్చి కూర్చటం స్వామి పరిశీలనాశక్తికి, భాషానురక్తికి తార్కాణం.
స్వామి ఆయాకాండల్ని వివరించిన తీరును విపులీకరిస్తే ప్రతిశీర్షిక అంటే ప్రతి కాండమును గూర్చిన పరిశీలన ఒక్కొక్కటి ఒక్కొక లఘుసిద్ధాంత వ్యాసం అవుతుందని చెప్పటంలో అతిశయోక్తి లేదు. రామాయణ కథ అందరికీ తెలిసిందే కావటం, రామాయణ పద్యకావ్యాలు ఎన్నోరావటం కారణంగా స్వామి విహారి రామాయణంలోని పద్యరచనా ప్రతిభానుప్రకటించటానికి మచ్చుకు కొన్ని పద్యాల్ని మాత్రమే ప్రస్తావించారు.
విశ్వనాథ ‘శ్రీమద్రామాయణ కల్పవృక్షము’ కావ్యంతర్వాత ఇన్ని విలక్షణమైన ఛందస్సుల్ని ప్రయోగించిన మరొక కవి లేడని చెప్పటానికే స్వామి విహారి రచించిన వైవిధ్య భరితమైన ఛందస్సుల్ని గూర్చి చెప్పారని భావించవచ్చు. కవి జాతీయాల్ని, నానుడుల్ని ప్రయోగించాలంటే కేవలం బహు గ్రంథ పరిచయం చాలదు. ఆ కవికి విశేషమైన లోకజ్ఞత కూడా ఉండాలి. విహారి లోకజ్ఞుడైన కవి అని నిరూపించటానికే స్వామి అనేక జాతీయాలను, నానుడుల్ని పట్టికగా ఇచ్చారు. దీన్నిబట్టి వారి నిశిత పరిశీలనాశక్తి స్పష్ట మవుతుంది.
విహారి రచించిన శ్రీపదచిత్ర రామాయణమనే జలధిని శోధించి అందులోని పద్య రత్నాల్ని పాఠకులకు అందించిన శ్రీరంగస్వామి అభినందనీయులు. వీరి రచన మరికొంత మందికి ప్రేరణ అవుతుందని భావిస్తున్నాను. స్వామి కలం నుంచి మరిన్ని రచనలు రావాలని ఆశిస్తున్నాను.
డా. గుమ్మా సాంబశివరావు
ఫోన్ : 9849265025