ముఖ్యంగా స్త్రీ చైతన్యం అనే అంశాన్ని మూడు రకాలుగా విభజించవచ్చు. ఒక నిర్దిష్ట కాలంలో వచ్చిన స్త్రీ చైతన్యం అన్నప్పుడు ఆ కాలంలో జీవించిన రచయితల రచనల్లోని స్త్రీ పాత్రల చైతన్యమా, ఆ నిర్దిష్ట కాలంలో పుట్టిన రచయితల చైతన్యమా, ఆ నిర్దిష్ట కాలంలో పుట్టి, రచనలు చేసిన స్త్రీల చైతన్యమా అనే అంశాన్ని పరిగణనలోనికి తీసుకొని ఒక చర్చను ప్రారంభించవచ్చు. అయితే ఈ చైతన్యపు పరిధిని గురించి మనం ఆలోచించి నప్పుడు ఆ చైతన్యపు పరిధి, ఆ చైతన్యపు స్థాయి కొన్ని అంశాలను మన ముందుకు తెస్తుంది. ఈ అంశాన్ని గురించి ఆలోచించినప్పుడు ముందుగా సంఘసంస్కరణ కాలం, ఆ కాలం కన్నా ముందుగా సమాజంలో, సాంఘిక జీవితాల్లో వచ్చిన మార్పులు, ఆ మార్పులతో పాటుగా సాహిత్యంలో ప్రతిఫలించిన చైతన్యం గురించి మనం పరిశీలించాలి. ఆ తర్వాత ఆ కాలంలో పుట్టిన రచయితలు, రచయిత్రులను గురించి తెలుసుకోవాలి. ఆ సమయంలో వచ్చిన రచయితలను పరిశీలించాలి. ఆ రచనల్లోని స్త్రీల చైతన్యాన్ని అంచనా కట్టాలి. ఈ అంచనా కట్టే క్రమంలో ఆ కాలంలో జరిగిన సామాజిక సాహిత్య ఉద్యమాలు, ఆ కాలంలో పుట్టిన రచయితలు, ఆ కాలంలో పుట్టి రచనలు చేసిన వారు, వారి రచనల్లోని సామాజికాంశాలు, సాహిత్యాంశాలు వారివారి రచనల్లోని స్త్రీ పాత్రల చైతన్యము మొదలైన అంశాలన్నిటినీ పరిగణనలోకి తీసుకోవాలి. మనం తొలితరం రచనల గురించి పరిశీలించేటప్పుడు ముఖ్యంగా సంఘసంస్కరణ ప్రభావంతో కూడిన రచనలు ఎక్కువగా కనిపిస్తాయి. సంఘసంస్కరణ ప్రభావం కందుకూరి, గురజాడ వంటి రచయితలను ఎంతగా ప్రభావితం చేసిందో కూడా అర్థమవుతుంది. ఆయా కాలపు రచయితల్లో అభ్యుదయ దృక్పథం కూడా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. మెకాలే విద్యావిధానం కూడా ఈ అభ్యుదయ దృక్పథానికి సమాజాన్ని కొత్త దృష్టితో చూడడానికి అవకాశం ఇచ్చిందన్న వాస్తవాన్ని కూడా మనం గుర్తించక తప్పదు. నిజానికి ఆ కాలంలోనే తొలితరంలోనే మొసలికంటి రమాబాయమ్మ, వెంపటి శాంతాబాయమ్మ ‘‘హిందూసుందరి’’ పత్రికకు సంపాదకత్వం కూడా వహించారని తెలుస్తుంది. ‘‘పాతకొత్తల మేలు కలయిక క్రొమ్మెరుంగులు చిమ్మగా’’ అని పేర్కొన్నట్టు కొత్త సమాజం రూపు సంతరించుకొంటున్న తరుణంలో సాహిత్యం అభ్యుదయశీలంగా ఉండడం అనివార్యం. 1848
-1919 మధ్యకాలంలో జీవించిన కందుకూరి వీరేశలింగం గురించి పాఠక లోకానికి ప్రత్యేకంగా పరిచయం చేయవలసిన అవసరం లేదు. బెంగాల్ రాజారామమోహన్ రాయ్ ప్రభావం ఆంధ్రదేశానికి ప్రసరించి, కందుకూరి వీరేశలింగం వంటి రచయితలు సంఘ సంస్కరణలో భాగంగా విధవా పునర్వివాహాలు చేయడం మూఢనమ్మకాలపై నిరసన తెలపడం వంటి చర్యలతో పాటుగా సాహిత్యాన్ని సృష్టించారు.
వీరేశలింగం సాహిత్యం సంఘ సంస్కరణోద్యమం ప్రచారానికీ, ఆందోళనకూ సాధనంగా ఉపయోగపడగా గురజాడ దానికి అపూర్వమైన కావ్యశిల్పాన్ని అమర్చారు. కందుకూరి వీరేశలింగం 1883 లో స్త్రీల కొరకు ‘‘సతీహిత బోధిని’’ అను మాసపత్రికను ఆరంభించారు. కందుకూరి వీరేశలింగం స్త్రీ నీతిదీపికలో
విద్యవలనను జ్ఞానంబు వెలయుగొన
నవని నిది మంచి నిది చెడ్డ యనుచు
తెలియ బాలురును బోలె దప్పక
బాలికలును నేర్వంగా వలయును
హృద్యంబుగను…. అని స్త్రీ విద్య గురించి చెప్పారు
‘రాజశేఖర చరిత్ర’ వంటి నవలలే కాదు ఎన్నో పత్రికలలో సమాజ సంస్కరణ దిశగా వ్యాసాలను రచించారు. అప్పుడు సమాజ సంస్కరణలో ముఖ్యంగా భాగమైనది స్త్రీ జనోద్ధరణే.
18621915 మధ్యకాలంలో జీవించిన గురజాడ అప్పారావు గారు సాహిత్యం ద్వారా పెను మార్పు తీసుకురావడానికి ప్రయత్నించిన గొప్ప సాహితీ సంస్కర్తగా గురజాడను మనం చెప్పుకోక తప్పదు. ‘‘ఱఅటaఅ్ ఎaతీతీఱaస్త్రవ ఱఅ ఱఅసఱa aఅస వఅటశీతీషవస షఱసశీషష్ట్రశీశీస’’. అనే చిన్న పుస్తకం పార్సీవాళ్ళు ప్రచురించి భారతదేశం నలుమూలలకూ పంపారట. బహుశా దీని ప్రభావం వల్లనే 1887 లో మూడేళ్ళలో జరిగిన బ్రాహ్మణ కన్యాశుల్క పట్టీని తయారు చేయమన్నారు. ఆనందగజపతి రాజావారు బహుశా ఈ మాటలన్నిటి వల్లనే గురజాడ కన్యాశుల్క రచనకు ప్రేరణ కావచ్చు. కన్యాశుల్కం నాటకం ఇతివృత్తం, బాల్య వివాహాలను నిషేధించే దిశగా, వితంతు పునర్వివాహాలను ప్రోత్సహించే దిశగా సాగుతుంది. ఆ ముఖ్యాంశాలే కాకుండా సంఘంలో ఉన్న అనేక అవలక్షణాలను, స్త్రీ పురుషుల సంబంధాలను, సంఘంలోని దురాచారాలను, మానవ ప్రవృత్తిని అన్నిటినీ తన సాహిత్యంలో ప్రతిఫలిస్తారు గురజాడ. గురజాడ కథల్లో స్త్రీ పాత్రలన్నీ చైతన్యంతో ముందుకొచ్చిన పాత్రలే. ముఖ్యంగా దిద్దుబాటు కమలిని, నాంచారమ్మ, సరళ, మెటిల్డా
పాత్ర పరంగా చైతన్యం లేదంటే కథ పరంగా చైతన్యం లేదంటే పురుష పాత్రలతో సమాజ చైతన్యాన్ని అందించడం ఈ రకంగా ఐదు కథల్లో స్త్రీ చైతన్యాన్ని ప్రస్తావించారు గురజాడ.
కవిత్వంలో ముఖ్యంగా ముత్యాలసరాలు, పూర్ణమ్మ, కన్యక వంటి అన్నింటిలోనూ స్త్రీ పాత్ర చైతన్యం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఇక ‘కన్యాశుల్కం’ నాటక విషయానికి వస్తే స్త్రీ చైతన్యం ముఖ్యంగా మధురవాణి పాత్రను మలిచిన తీరు స్పష్టమవుతుంది. మొత్తంగా గురజాడ అందించిన సాహిత్య సంపదంతా ఏదో ఒక రకంగా స్త్రీ చైతన్యానికి, స్త్రీ పురోగమనానికి బాటలు వేసేవిగానే సాగాయని చెప్పవచ్చు. రచయితలు పురుషులైనా వారి చుట్టూ సమాజాన్ని దర్శించడం, సమాజంలోని స్త్రీ పురుష అసమానతలను గ్రహించడం, ఆ అసమానతలపై స్పందించడం, చైతన్యవంతం చేయడం, ముఖ్యంగా ఆ కాలంలో అట్లాంటి రచనలు చేయడం గురజాడ ముందుచూపుగా మనం భావించొచ్చు.
ముఖ్యంగా 150 ఏండ్ల తర్వాత కూడా ‘‘పతియే ప్రత్యక్షదైవం’’ అనే సమాజంలో ఇంకా బ్రతుకుతున్నాం. కానీ ఆ కాలంలోనే స్త్రీ పురుషుల సంబంధం ఎంత గొప్పదో ముఖ్యంగా ఇద్దరూ కలిసి నడపవలసిన కుటుంబం గురించి, ప్రపంచం గురించి వారు చెప్పిన ‘‘మగడు వేల్పన పాత మాటది ప్రాణమిత్రుడ నీకు నేను’’ అన్న వాక్యం లేదా పాదం గొప్ప స్త్రీ చైతన్యానికి ప్రతీక.
స్త్రీలకు ఇంకా చదువే నిషేధమైన ఆ కాలంలో, స్త్రీలు చదువుకుని ముందుకు రావాలనే సంస్కరణ మెల్లమెల్లగా ప్రారంభమవుతున్న ఆ కాలంలో కుటుంబంలో స్త్రీ పురుషుల సమాన ప్రాతినిధ్యాన్ని గుర్తించిన మొట్టమొదటి రచయితగా గురజాడను గుర్తించాలి.
తాపీ ధర్మారావుగారు : ప్యూడలిజం అవశేషమవుతున్న దశలో పూర్వరంగంలో తాపీ ధర్మారావు ప్రవేశించారు. 18871911 మధ్యకాలంలో జీవించిన తాపీ ధర్మారావు తాను స్కూలు చదువులో ఉన్నప్పుడే వీరేశలింగంని చదివారు. ఆయన తన ఇంట్లోంచే సంస్కరణలు ప్రారంభించారని చెప్పొచ్చు. భార్యను పేరుపెట్టి పిలవడం, ఆమెను తన తోడుగా వెంటబెట్టుకుని సభలు, సమావేశాలకు వెళ్ళడం ఇవన్నీ అప్పటికే తనలో ఉన్న అభ్యుదయ భావాలను కార్యాచరణలో పెట్టారు. విజయనగరంలో తాను స్కూలుకు వెళ్ళేదారిలో ఒక 15 ఏండ్ల బాల వితంతువు కనిపించిందట అప్పుడు తాపీ ధర్మారావులో కలిగిన ఆలోచనే ఒక డిబేటింగ్ సంస్థ ఏర్పడడానికి నాంది. ఆ డిబేటింగ్ సంస్థ తన ప్రధాన ఆశయాలుగా రాసుకున్నవి కూడా బాల్యవివాహాల నిషేధం, స్త్రీ విద్య ప్రాధాన్యత, విధవా పునర్వివాహము, వరకట్న వ్యతిరేకత మొదలైన అంశాలు. ధర్మారావు తాను 15 ఏండ్ల వయసులో ఉన్నప్పుడు 10 ఏండ్ల అన్నపూర్ణతో వివాహమైంది. అప్పట్లోనే అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకోవాలనుకోవడం, కట్నకానుకలు వద్దనుకోవడం ఇవన్నీ స్త్రీ చైతన్యాలుగా, మహిళా వికాస మార్గాలుగా చెప్పొచ్చు. ‘‘సత్యవతికి సవాల్’’ అంటూ సత్యవతి పేరుతో ధర్మారావు గారే ప్రశ్నించేవారు. ప్రతి విషయాన్ని హేతుబద్ధంగా ఆలోచించేవారు. పోతం జానకమ్మ రాఘవయ్య 1874లోనే తన లండన్ ప్రయాణపు అనుభవాలను రాసింది. ఒక స్త్రీ విదేశీయాత్ర చేయడమే ఆ కాలంలో ఒక సంచలనం. అయితే అమె అక్కడ పర్యటించిన విశేషాలను, ఇక్కడి స్త్రీల స్థితిగతులను, స్టీమరు ప్రయాణాన్ని కళ్ళకు కట్టినట్టు వర్ణించింది. ఈమెను తొలి ఆధునిక మహిళా రచయిత్రిగా పేర్కొంటారు. ఈమె మద్రాసు నివాసి. కొక్కొండ వేంకటరత్నం పంతులు నడిపే ‘‘శ్రీ ఆంధ్రభాషా సంజీవని’’ లో ఈమె యాత్రా కథనాన్ని 1874 ఫిబ్రవరి, మార్చి సంచికలో ప్రచురించారు. 1874 ఏప్రిల్ ఎధినీయం అండ్ డైలీ న్యూస్లో విపులమైన సమీక్షతో ప్రచురించారు. 1875 అక్టోబరులో ‘‘ ఇంగ్లాండు యాత్ర చరిత్ర’’ ప్రచురించారు. ఇదే తెలుగులో మొదటి యాత్ర చరిత్రగా పోతం జానకమ్మ ఇంగ్లాండు వెళ్ళిన తొలి భారతీయ మహిళగా గుర్తిస్తారు. ఇంగ్లాండు ప్రయాణంలో అనేకమంది ఆంగ్ల మహిళల స్నేహాన్ని కూడా సంపాదించింది. ఆ కాలంలో విదేశీ పర్యటన చేసి, ఆ అనుభవాలను కథనంగా మలిచి పుస్తకంగా ప్రచురించడం అదీ ఒక మహిళ పర్యటన యాత్రాచరిత్రగా రావడం మొట్టమొదటి యాత్రా చరిత్ర స్త్రీదే కావడం ఒక విశేషంగా చెప్పుకోవచ్చు. స్త్రీ చైతన్యానికి పడిన తొలి మెట్టుగా చెప్పవచ్చు. బండారు అచ్చమాంబ (1874
-1905)
మొట్టమొదటి కథా రచయిత బండారు అచ్చమాంబ అని పరిశోధన వల్ల తేలింది. మొట్టమొదటిసారిగా చరిత్ర నుండి స్త్రీలకు సంబంధించిన చారిత్రక విషయాలను, చారిత్రక సంస్థలను గురించి ప్రత్యేకంగా రాసిన ఘనత బండారు అచ్చమాంబదే. 1898 జూలై ‘‘తెలుగు జనానా’’ పత్రికలో ‘‘ప్రేమా పరీక్షణము’’ 1898 సెప్టెంబరు ‘‘తెలుగు జనానా’’ పత్రికలో ‘ఎరువుల సొమ్ము బరువుల చేటు’ మొదలైన కథలు కూడా అచ్చయ్యాయి. ‘‘అబల సచ్చరిత్ర మాల’’ లో రుద్రమ్మ, అహల్యాబాయి, తరిగొండ వేంగమాంబ చరిత్రలు ఉన్నాయి. ఇది 1901లో ప్రచురితమైంది.
బండారు అచ్చమాంబ రాసిన ‘‘దంపతుల ప్రథమ కలహం’’ కథ భార్యాభర్తల మధ్య ఉండవలసిన అన్యోన్యతను, పరస్పర అవగాహనను గురించి చెప్తుంది. అంతే కాదు ఆ కథలోనే ఒకచోట లలిత పాత్ర ‘‘నేను పెండ్లాడిన భార్యను గాని, దాసిని గాను. వివాహమగుట వలన భర్తకు దాసినగుదునా యేమి?’’ అని ప్రశ్నిస్తుంది. అప్పటికే స్త్రీలో ఆ చైతన్యం రావడం ఒక అభ్యుదయ పథానికి నాందిగా చెప్పవచ్చు. ఈ కథ 1903 జూన్ ‘‘హిందూ సుందరి’’ లో ప్రచురితమైంది. అంతకు ముందుగానే 1898 ‘‘తెలుగు జనానా’’లో (జూలై) ప్రేమా పరీక్షణము, ఎరువుల సొమ్ము బరువుల చేటు (సెప్టెంబరు) కథలు కూడా ప్రచురితమయ్యాయి. 1902 లో ‘స్త్రీ విద్య’ కూడా ప్రచురితమైంది.
వేమూరి శారదాంబ (1881-1899) శారదాంబ తండ్రి దాసు శ్రీరాములు గారు. వీరి ప్రోత్సాహంతో చిన్ననాడే సంస్కృతాంధ్ర విద్యలను నేర్చుకుంది. స్త్రీల పట్ల ఉన్న వివక్షను గుర్తించి స్త్రీల పట్ల ఉన్న వివక్ష పోవాలంటే, విద్యాభ్యాసం కచ్చితంగా అవసరమని నమ్మిన స్త్రీ. అత్తింటివారి వ్యతిరేకతను ఎదుర్కొంటూనే ‘మాధవా’ అనే మకుటంతో 101 పద్యాలను రచించింది. శారదాంబ చాలా కొద్ది కాలమే జీవించింది. కానీ ఆ కొద్ది కాలంలోనే స్త్రీ చైతన్యంతో రచనలు చేయడం ముఖ్యమైన విషయంగా చెప్పుకోవచ్చు. 1881లో జన్మించిన ఈమె తన 18వ ఏటనే అంటే 1899లో చనిపోయింది. 16వ ఏటనే ‘‘నాగ్నజితీ పరిణయము’’ అనే కావ్యం రాసింది. స్త్రీల విద్య అవసరాన్ని నొక్కి చెప్పే కావ్యాలను రాసింది. మునుపటి వారలెల్ల తమ ముద్దియలం చదివించ లేదొకో వినయం పతివ్రతాత్యుసువివేకములం జరియించినట్టి యా జనకజం జూడరే మరియుం జంద్రమతిం గనరే యింకెందరో యనుపమ బుద్ది కీర్తిలందిరి విద్యవల్ల మాధవా అప్పటి సమాజంలో స్త్రీలు నాట్యశాస్త్ర మభ్యసించరాదన్న అభిమతాన్ని మార్చుటకు మహాభారతంలోని ఉత్తరను ఉదాహరిస్తుంది. అమరలేక నిచ్చెలు బృహన్నల యొద్దను నాట్య శాస్త్రమున్ విరటుని కూతు దా గరచి వినృత కీర్తి వహింపలేదె ఉత్తర కడు యోగ్యురాలని సదా పొగడంబడ లేదె చూడనా పరమ పతివ్రతామణి శుభాంగు పరీక్షితుంగాంచె మాధవా
అంటూ ప్రశ్నించింది.
కొటికలపూడి సీతమ్మ (1874-1936) కందుకూరి ఆశయముతో ఈమె ‘‘స్త్రీలు విద్య నేర్వ జెడిపోదురను మాట కల్లయనుచు దోప నెల్లరకును’’ అంటూ స్త్రీ విద్యను ప్రోత్సహించింది. 1913 లో జరిగిన ప్రథమాంధ్ర మహిళా సభకు అధ్యక్షత వహించింది. వితంతు పునర్వివాహాల గురించి ఉపన్యసించేది. స్త్రీలకు ఉన్నత విద్య అవసరాన్ని గురించి పుస్తకం రాసింది. ‘‘కుమార సుగుణ బోధిని’’ రచించింది. అమె కూడా కొటికలపూడి సీతమ్మను అనుసరించి వారి శిష్యురాలుగా భావించుకుంది. అప్పటికే కుమారీ నీతులు, స్త్రీ శతకాలు బోధిస్తున్న, రాస్తున్న రచయితలకు విరుగుడుగా స్త్రీలకే నీతులు చెప్పే విధానాన్ని వ్యతిరేకిస్తూ తాను పురుషులకు నీతులు చెప్పే పనికి పూనుకున్నాను అని చెప్తూ
‘‘నీ సతియు నీకు మిత్రము
నీ సతియె నీకు తోడు నిజము సుమీ
రోసమున సతిని దూరిన
మోసము నీ సౌఖ్యమునకు ముందు కుమారా’’ అంటూ పురుషులు ఎట్లా మెలగాలో చెప్పాల్సిన అవసరాన్ని కూడా ఆ కాలంలోనే గుర్తించింది ఆత్మకూరి అన్నపూర్ణమ్మ. ‘‘మగడు వేల్పన పాతమాటది’’ అన్న గురజాడ మాటలను గుర్తు చేస్తాయి ఈ వాక్యాలు.
పుట్టపర్తి కనకమ్మ 1922 ‘దు:ఖిత సీత’’ అంటూ సీత గురించి రాస్తూ చాకలి వాని మాటకయి జనకాత్మజ శీలము పృచ్ఛసేయరా నీకొక యాత్మయున్న గమనింపుమురా బదులేమి వచ్చున్..... అంటూ రాముణ్ణే ధైర్యంగా ప్రశ్నించిన స్త్రీగా కనిపిస్తుంది. సీత మనసు నుంచి అర్థం చేసుకొమ్మని పాఠకలోకానికి చెప్తుంది. దేశిరాజు భారతీదేవి ‘‘కాంతా శతకం’’ రాస్తూ చదివిన పండితులగుదురు విదితము గాకున్న వెర్రులె పురుషుల్ చదివిన చదవక యున్నన్ ముదితలు విద్వాంసురాండ్రు పుట్టువు చేతన్ అంటూ స్త్రీలు ఎప్పుడైనా చదివినా చదవకపోయినా పండితులే నని ఒకింత ఆత్మవిశ్వాసంతో ప్రకటిస్తుంది. కనుపర్తి వరలక్ష్మమ్మ (1896
-1978) :
‘‘శారదాంబ లేఖలు’’ వీరి రచనల్లో చాలా ముఖ్యమైనవి. ముఖ్యంగా స్త్రీల ‘‘లేఖా సాహిత్యం’’ శారద లేఖలతోనే ప్రారంభమైంది. తాను మూడో తరగతిలో ఉండగా తన పక్కింట్లో ఉండే ముసలమ్మలకు వచ్చిన ఉత్తరాలు చదివి వినిపిస్తూ ఉండేది. వాళ్ళు చెప్పే విషయాలు క్రమపద్ధతిలోనే ఉండేవి కావట. ఆ చుట్టు పక్కల వాళ్ళ భాషను ఒక క్రమంలో రూపొందించి ఉత్తరాలుగా రాసేదట ఆ అనుభవమే ‘‘శారద లేఖలు’’ కు ప్రేరణగా చెప్తుంది.
‘‘మూడు దశాబ్దాల ఆంధ్ర జీవిత రేఖలు ఈ లేఖలందు కనపడుచున్నవి’’ అని లేఖలను చదివిన తల్లావరa్జల శివశంకర స్వామి అన్నారట. ఒక్కొక్క లేఖ ఒక్కొక్క మణిపూస.
ప్రతి లేఖలో మూడ విశ్వాసాలు, బాల వితంతువుల బాధలు, వరకట్న దురాచారం, విదేశీ వస్తు బహిష్కరణ ఇట్లా ఏదో ఒక రగులుతున్న సమస్య ముఖ్యంగా స్త్రీల పై జరుగుతున్న అణచివేత సమస్యలన్నీ స్పృశించేవారు వరలక్ష్మమ్మ.
‘‘పండ్లు కండ్లు లేని ముదుసలులకు
పొట్టపొడిచినా అక్షరం ముక్కరాని నిరక్షర కుక్షులకు
గవ్వ గడిరపలేని అప్రయోజకులకు
కన్యాశుల్కం తీసుకుని కన్యల్ని సమకూర్చే నిర్భాగ్యపు దేశం ఇది… అంటూ బాల్య వివాహాల గురించి, అసలు మొత్తంగా వివాహ వ్యవస్థ గురించే ప్రశ్నిస్తుంది.
‘‘వసుమతి’’ అని వీరు రాసిన సాంఘిక నవల తన 14వ ఏట తాను విన్న ఒక అభాగ్యురాలి కథ.
మొదటితరం రచయిత్రుల్లో శ్రీమతి వరలక్ష్మమ్మ గారు అగ్రగణ్యులు అంటారు. బెజవాడ గోపాలరెడ్డిగారు. ‘‘స్త్రీలు అభ్యసించాలి’’ అన్న కొటికలపూడి సీతమ్మ ఉపన్యాసానికి ప్రేరణ పొంది విద్యాభ్యాసం చేయాలనే ధృడ సంకల్పాన్ని పొందారని అర్థమవుతుంది.
కందుకూరి సంస్కార భావాలకు స్పందించి ఆనాటి పరిస్థితులను బట్టి కథలు, వ్యాసాలు, లేఖలు రాసారు. చోరగుడి సీతమ్మగారు త్రిపుర సుందరీ సమాజాన్ని యువతీ విద్యాలయాన్ని నిర్వహించేవారట. ఆ కాలంలో బాలికగా ఉన్న వరలక్ష్మమ్మ వీరందరి వల్ల ఎంతో నేర్చుకున్నారు.
ఆమె తన డైరీలలో రాసుకున్న కొన్ని విషయాలు చదివితే ఆశ్చర్యం కలుగుతుంది. బాల్యంలో ఆమె మీద పడ్డ ప్రభావాల వల్లే ఆమె స్త్రీ చైతన్యంతో రచనలు చేసారని అర్థమవుతుంది.
బాల్యంలో ముఖ్యంగా స్త్రీలు చెప్పులు వేసుకోకుండా నడవాలని, అవసరమైనా కళ్లజోడు ధరించొద్దని నియమాలుండేవట. అవన్నీ గమనించింది కనుకే ఆమె రచనల్లో స్త్రీల గురించిన వికాసం కనిపిస్తుంది. ఆమె ‘‘సావిత్రి’’ మాస పత్రికను కచ్చితంగా చదివేదట.
ఆమె అత్తగారింటికి వెళ్ళేటప్పుడు ఆమె అన్న నరసింహం ఆమెకు ‘‘శబ్దార్థ చంద్రిక’’ను బహూకరించారట. అంటే ఆ కాలంలో చెల్లెలు చదువుకోవాలనే ఆసక్తిని కనబరుస్తూ పెళ్ళి అయిన చెల్లెలికి చదువును ప్రోత్సహిస్తూ పుస్తకాన్ని బహూకరించడం ఒక అపురూపమైన విషయంగా, అపురూపమైన కానుకగా కూడా చెప్పవచ్చు.
తాత్కాలికోల్లాసం కథా ఉద్దేశమైతే ప్రణయ వ్యవహారాలే ముఖ్య వస్తువులైతే, అవే తప్ప పాఠకులకు రుచించక పోతే, ఆ కథలూ, కథకులూ ఆ కథాపాఠకులూ, భ్రష్టుమార్గం పట్టినట్లే అంటుంది ‘కనుపర్తి వరలక్ష్మమ్మ’ ఈ మాటలు అనడంలో ఆ కాలనికే ఎంత చైతన్యం ఉందో తెలుసుకోవచ్చు.
స్త్రీలు విద్యాభ్యాసం చెయ్యడం మాట అటుంచి వీధిలో కనిపించడం, విజ్ఞాన సముపార్జన చేసి కలాన్ని చేపట్టి రచనలు కావించి నారీ లోకాన్ని చైతన్యవంతం చెయ్యడానికి ఎంతటి శక్తి సామర్థ్యాలు కావాలో తలుచుకుంటే ఆశ్చర్యం కలుగుతుంది. అట్లాంటి వ్యక్తుల్లో ఎన్నదగినవారు కనపర్తి వరలక్ష్మమ్మగారు. కందుకూరి సంస్కార భావాలకు స్పందించి ఆనాటి సమకాలీన సమాజ పరిస్థితులను బట్టి కథలు, వ్యాసాలు, లేఖలు రాసిన సాహితీ మూర్తి కనపర్తి వరలక్ష్మమ్మ.
కాళ్ళకూరి నారాయణరావు గారి ‘‘వరవిక్రయము’’ ముఖ్యంగా ఇప్పటికీ కొనసాగుతున్న వరకట్న దురాచారాన్ని ఆనాడే వ్యతిరేకించింది. వీరు వర్ణాంతర వివాహం చేసుకోవడమే కాక చిన్నప్పట్నుంచీ తన సోదరి కష్టాలను కూడా చూసి తండ్రితో ఘర్షణ పడ్డారు. అందులోని కాళింది పాత్ర తండ్రిని ఇట్లా ప్రశ్నిస్తుంది.
మీకు గుణము లేదా
మాకు రూపము లేదా
ఇంత దైన్యమునకు హేతువేమి
కట్నమిచ్చి వరుని గడియించు
కొనుటకంటే చిన్నతన మింకేమున్నదమ్మా….
అంటూ అసలు కట్నం ఎందుకు ఇవ్వాలి అనే మూలమైన ప్రశ్నను లేవదీస్తారు రచయిత.
కట్నము అడుగువారికి పాపభయంబు లేక ఇచ్చువారికి సిగ్గును నెగ్గులేక నడుచుచున్నట్టి వరశుల్క నాటకమున! అకట మనము పాత్రలమగుట తగునె. అంటూ ఇంకా కమల పాత్రతో మరింత ముందడుగు వేయిస్తారు రచయిత.
కట్నమే కోరి వచ్చిన ఖరముతోడ దగుదునని కాపురము సేయు దానికంటే పెండ్లియే మానుకొని మగబిడ్డ వలెనే తల్లిదండ్రుల కడనుండ తప్పిదంబె అని ప్రశ్నిస్తుంది. ఇట్లాంటి చైతన్యం ఆ కాలపు రచనల్లో ఉండేది.
బంకుపల్లి మల్లయ్యశాస్త్రి: (1876-1946) శ్రీకాకుళం జిల్లా పర్లాకిమిడి ప్రాంతానికి చెందినవారు. వితంతు వివాహాలను ప్రోత్సహించారు. తన ఇంట్లో తన కూతురు బాల్యంలోనే భర్తను కోల్పోవడం అన్న విషాదం వివాహ వ్యవస్థలో స్త్రీల స్థితిగతులను గురించి విస్తృత స్థాయిలో అర్థం చేసుకునేట్టు చేసింది. అందుకే తన కూతురు కృష్ణవేణిని ఖమ్మంకు చెందిన వేదులవారితో శాఖాంతర వివాహం జరిపించి కొంత అభ్యుదయ మార్గానికి నాంది పలికారు. ‘‘వివాహతత్వం’’ అనే గ్రంథాన్ని శాస్త్రయుక్తంగా రాసి, అన్ని పీఠాధి పతులను ఒప్పించి శాఖాంతర వివాహాన్ని జరిపించారు. అందుకే బంకుపల్లి మల్లయ్యశాస్త్రిని వీరేశలింగం ఆఫ్ ఉత్తరాంధ్ర అని కూడా అంటారు. పర్లాకిమిడిలో ‘‘రీడిరగ్ రూం’’ అనే ఒక చిన్న సమాజాన్ని ఏర్పాటు చేసి వితంతు వివాహాల్లాంటి సంస్కరణలకు చైతన్యపు దారిని చూపించారు. కులమతాల కతీతంగా అన్ని కులాల వారితో సహపంక్తి భోజనంలో పాల్గొని సంస్కరణలకు నాంది పలికారు. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి (1891
-1961)
ఏ రచయితైనా కథకులైనా తన కళ్ళముందరి జీవితాన్ని, సమాజపు తీరుతెన్నులను చక్కగా ప్రతిబింబించగలుగుతారు. ఆ తోవలోనే స్త్రీ విద్యకు ప్రోత్సాహం, కులాంతర మతాంతర వివాహాల ప్రస్తావన, వితంతు పునర్విహాల వంటి అంశాలను కులంకషంగా తన కథల్లో ప్రస్తావించారు. ముఖ్యంగా వీరి రచనల్లో అగ్రహారపు బ్రాహ్మణ స్త్రీల వెతలు కనిపిస్తాయి.
స్త్రీలకు చదువు, వ్యాయామం ఎంత అవసరమో, ఆ అవసరాన్ని కథలలో ప్రస్తావిస్తారు కూడా. ముఖ్యంగా వీరి కథల్లో వితంతువులు, ఆదర్శ భావాల స్త్రీలు, గృహిణులు, పెళ్ళికాని యువతులు, కొడుకులపై ఆధారపడే తల్లులు, సవతి తల్లులు అందరి జీవితాలు చాలా స్పష్టంగా వివరిస్తారు ఈ కథల్లో ‘‘అరికాళ్ల కింది మంటలు’’ అన్న కథలో రుక్మిణి అక్కలందరికీ చాకిరీ చేసిచేసి విసుగొచ్చి తల్లి కూడా తనను అర్థం చేసుకోకపోవడంతో ‘‘దొడ్లో గేదెతో సమానం నేను’’ అని బాధ పడుతుంది. స్త్రీ ఆవేదనను స్త్రీ మనసు నుంచి ఆలోచించి రచించారు.
‘‘స్త్రీ జీవితాలలోని ఆరాట పోరాటాల చరిత్ర కూడా ఈ నాటిది కాదని సాంప్రదాయ సాహిత్య అధ్యయనం వల్ల నాకు బాగా తెలిసి వచ్చింది’’ అంటారు `కాత్యాయని గారు.
ఈ రకంగా మొదటితరం రచన చేసిన కొద్ది మంది రచయితల్లోని, రచయిత్రుల్లోని స్త్రీ చైతన్య స్ఫూర్తిని ముఖ్యంగా ఆ తొలితరంలో సమాజంలో మార్పుకు దోహద పడిన, సమాజాన్ని చైతన్యవంతం చేయడానికి ఉపయోగపడిన ముఖ్యంగా స్త్రీవిద్యా వ్యాప్తి, బాల్య వివాహాల నిర్మూలన వితంతు పునర్వివాహాలు వంటి సంస్కరణాలను తమ రచనల్లో అందించిన రచయితలను, రచయిత్రులను గురించి వారి సాహిత్యాన్ని గురించి పరిశోధన చాలా అవసరం. ఆ పరిశోధన ఎంత జరిగినా, ఇంకా మిగిలిపోయిన ఖాళీలు ఉండనే ఉన్నాయి. అందువల్లనే ఆ దిశగా ఈ వ్యాసం తోడ్పడుతుందని ఆశిస్తున్నాను.
మహిళా చైతన్యం అనే మాటను విస్తృతార్ధంలో అర్థం చేసుకోవలసిన అవసరం ఉందని భావిస్తున్నాను. సమాకాలీన సమాజంలో పుట్టిన స్త్రీల చైతన్యం, ఆ కాలంలో జీవించిన రచయితల రచనల్లో చైతన్యం వారి రచనలు కలిగించిన చైతన్యం మొత్తంగా తొలినాళ్ళలోని తెలుగు సాహిత్యంలోని స్త్రీ చైతన్యాన్ని అంచనా కట్టవలసిన అవసరాన్ని గుర్తిస్తూ, స్త్రీ చైతన్య పరిధిని అన్ని కోణాల్లోంచి గమనించాలని, గ్రహించాలని కోరుకుంటున్నాను.
ఇంకా నమోదుకాని మొదటితరం స్త్రీల చరిత్రల గురించి కాత్యాయని విద్మహే వంటి సాహిత్యకారులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు. ఇట్లాంటి పరిశోధనకు కొంత సమాచారాన్ని అందించడంతో పాటుగా భావితరం పరిశోధకులకు ఈ వ్యాసం ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తూ, ఇంకా పూరించవలసిన ఖాళీలను వెతికే పనిని భావి పరిశోధకులు చేయాలని ఆశిస్తున్నాను.
ఆధార గ్రంథాలు
- అప్పారావు, గురజాడ. కథానికలు. 1904. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లికేషన్స్.
- అప్పారావు, గురజాడ. కన్యాశుల్కం. 2011. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లికేషన్స్.
- కాత్యాయనీ విద్మహే, తెలుగునాట మహిళల ఉద్యమం విమర్శనాత్మక అంచనా. 2009. న్యూఢల్లీి: సాహిత్య అకాడమీ.
- చంద్రశేఖర్ రెడ్డి, రాచపాళెం. తొలికొత్త తెలుగు కథలు. 1985. అనంతపురం: శిల్పి పబ్లికేషన్స్.
- ధర్మారావు, తాపీ. పెళ్ళీ దాని పుట్టుపూర్వోత్తరాలు. 2006. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
- రాజ్యలక్ష్మి, ప్రోలాప్రగడ. కనుపర్తి వరలక్ష్మమ్మ మోనోగ్రాఫ్. 2000. న్యూఢల్లీి: సాహిత్య అకాడమీ.
- వీరేశలింగం, కందుకూరి. స్వీయ చరిత్ర. 2010. హైదరాబాద్.
- శిలాలోలిత. కవయిత్రుల కవితామార్గం. 2006. హైదరాబాద్: ప్రజాశక్తి డైలీ ప్రింటింగ్ ప్రెస్.
- సుజాతరెడ్డి, ముదిగంటి. శ్రీనివాస్, సంగిశెట్టి (సం.పా). తొలి నాటి కథలు. 2005. హైదరాబాద్: రోహణమ్ పబ్లికేషన్స్.
- సుబ్రహ్మణ్యశాస్త్రి, శ్రీపాద. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి కథలు. 1992. హైదరాబాద్: విశాలాంధ్ర పబ్లికేషన్స్.
డా. ఎన్. రజని
అసోసియేట్ ప్రొఫెసర్, తెలుగుశాఖ,
డా.బి.ఆర్.అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం,
ఫోన్ : 9010501030