ప్రక్రియల దండలో ‘మణిపూసల’ మెరుపు

ఛందోబద్ధ ప్రక్రియ అనేది సాహిత్యయుగంలో ఈనాటిది కాదు. ప్రపంచ
సాహితీవనంలో అత్యంత ప్రాచీనమైన రచనగా పేర్గాంచింది. ఋగ్వేదంలోని
గాయత్రీ మంత్రంలో 24 అక్షరాలు, పంక్తిలో 28 అక్షరాలు, విరాజ్‌లో 40
అక్షరాలు, త్రిష్టుప్‌లో 44అక్షరాలు, జగతిలో 48 అక్షరాలతో కూడిన ఛందోరచనలు
కనిపిస్తున్నాయి. శుక్ల యజుర్వేదం, కృష్ణయజర్వేదం, సామవేదం, అధర్వణవేదం,
అరణ్యకాలు, ఉపనిషత్తులు ఇలా అనేక గ్రంథాల్లో ఛందోవిధాన రచనలు
తటస్థమౌతూనే ఉన్నాయి.
వేదాంగాలు ఆరు. శిక్ష, కల్పం, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం. ‘‘ఛందః
పాదౌతు వేదస్య’’ అనగా వేదానికి ఛందస్సు పాదం వంటిదని అర్థం. నాటి వైదిక
ఛందస్సు అక్షరగణం మీద ఆధారపడిరది. ఒక్కొక్క పాదానికి ఇన్ని అక్షరాలు అనే
నియమం ఉండేది. ఇలా ఎన్ని పాదాలైనా రాసుకునే అవకాశం నాటి నుండి ఉంది. ఈ
క్రమంలో వేదాల్లో మూడుపాదాల ఛందో విధానం ఎక్కువ కనిపిస్తుంది.
ఖండకావ్యం, ముక్తక కావ్యాలను కలిపి లఘుకావ్యాలు అనవచ్చు. సర్గబంధం,
పంచసంధులు, వర్ణనలతో కూడిన మహాకావ్యాలకు సరి సమాన స్థాయిలో నిలబడ్డ
రచనలు లఘుకావ్యాలు. ఈ లఘుకావ్యాలు గాన యోగ్యతకు ఆమోదయోగ్యమైనవి.
ఇట్లా నాటికాలంలో ఆరంభమైన ఛందోరచన నేటికీ కొనసాగుతూనే ఉంది.
గాలికిపోయే మాటను గాలికే అంకితం చేయాలి. మనసుకు తాకే మాటను మాత్రం తప్పక
అక్షరబద్ధం చేయాలి. అక్షరబద్ధమైన వాక్యం గ్రంథం అవ్వాలి. ఆ గ్రంథం
అన్ని తరాలకు అలరించాలని అనుకున్నాడీ ప్రక్రియా సృష్టికర్త. పాదాలు మనసుకు
అందాలి, మనసుకు లయ దొరకాలి. దొరికిన లయ మణిమాణిక్యం అవ్వాలి. అవే
మణిపూసలై సాగాలని హృదయానికి చెప్పుకున్నాడు. ఆ హృదయం నుండి పుట్టుకు
వచ్చినవే, ఆ ఒంటరితనం నుండి బయటకు లాక్కొచినవే మణిపూసలు.
క్రీ.శ.12,13 శతాబ్దాల నుండి 20 వ శతాబ్దం ఆరంభకాలం వరకు సాహితీ ప్రపంచంలో
అనేకమైన, వైవిధ్యభరితమైన ప్రక్రియలు రాజ్యమేలాయి. వాటిలో అతి
ప్రధానమైనవి శతకాలు, ద్విపదలు, ఉదాహరణలు, ప్రబంధాలు, రగడలు, యక్షగానాలు,
పదకవితల వంటివి కనిపిస్తాయి. తరువాత కాలంలో తెలుగు సాహిత్యంలో ఉద్యమ
కవిత్వాల వికాసం, మినీకవితల వైభవం విలసిల్లి అవసరాల కనుగుణంగా కవితా రూపం
మారుతూ సాగింది. ఈ పరిణామంలో కొత్తపుంతలు తొక్కుతూ అతి తక్కువ కాలంలో తన
ఉన్నతిని నిలబెట్టుకున్న నూతన కవితా ప్రక్రియ మణిపూసలు.
కవిత్వం సామాన్యునికి అర్థమవ్వాలి. కవిత్వం సామాన్యునిలోకి ప్రవేశించాలి.
కవిత్వం ఆలోచన రేకెత్తించాలనే భావన నాడు బద్దెన, వేమన, కంచర్ల గోపన్న
వంటివారి రచనల్లో కనిపిస్తే ఆధునికకాలంలో గురజాడ, పెన్నా శివరామకృష్ణ,
కాళోజీ మొదలగు వారి రచనల్లో దర్శనమిస్తాయి.
21 వ శతాబ్దంలో మినీకవితా ప్రక్రియకు ప్రాచుర్యం, ప్రాధాన్యత, ఆదరణ
ఎంతగానో పెరిగిపోయింది.‘‘అపారే కావ్య సంసారే కవిరేవ ప్రజాపతిః యథాస్మై
రోచతే విశ్వం తదేవం పరివర్థతే’’ అంటారు ధ్వన్యాలోక కర్త ఆనందవర్ధనుడు.
అంటే అనంతమైన ప్రపంచానికి కవియే ప్రజాపతి. కవి ఇష్టానుసారమే కావ్యజగత్తు
నిర్మితమౌతుంది.
ఈ విధానాన్ని అనుసరించి ఆధునిక కవి తన కవితా ప్రపంచంలో నూతన ప్రక్రియలకు,
కవితలకు శ్రీకారం చుట్టాడు. మహాకావ్యం రాయవచ్చు, లఘుకావ్యం రాయవచ్చు.
కానీ వ్యక్తికి వేగంగా, తక్కువ కాలంలో ప్రభావాన్ని చూపగలిగే మార్గమేదన్న
దానిపై అన్వేషణ మొదలైంది. ఈ అన్వేషణ నుండి పుట్టుకు వచ్చిన ప్రక్రియలు

రుబాయిలు, గజళ్లు, నానీలు, హైకులు, రెక్కలు, మొగ్గలు, కైతికలు, నానోలు, చిమ్నీలు,
సిసింద్రీలు, సమ్మోహనాలు వంటివి ఎన్నో. ఇవి సామాన్యుని మెదడును
ఆలోచింపజేశాయి. ఈ మార్గానికి చెందినదే మణిపూసలు. పాఠశాల స్థాయి
విద్యార్థుల నుండి ఉద్దండులైన, మహామహులైన సాహితీవేత్తల వరకు ఆసక్తిని
పెంచి రచనాభిరక్తిని కల్పించాయి. 2018 కాలంలో వికారాబాద్‌ జిల్లా తాండూర్‌
ప్రాంతానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త వడిచర్ల సత్యం మేధస్సు నుండి ఈ
ప్రక్రియకు అంకురార్పణ జరిగింది. నాలుగు పాదాలు కలిగి ఉండి 1,2,4 పాదాలు
అంత్యప్రాస నియమంతో 10 లేదా 11 లేదా 12 మాత్రల్లో ఏదైనా ఒక రూపాన్నే
ధరిస్తుంది. 3వ పాదం మాత్రం 10 నుండి 12 మాత్రల్లో ఎన్నైనా తీసుకోవచ్చు.
మణిపూసలు ఒక ప్రాంతానికి పరిమితం కాలేదు. ఆవిర్భావ కాలం నుండి నిత్యనూతనంగా
కొనసాగుతూ ఉంది. నవ్యాంధ్రలో శ్రీకాకుళం మొదలు అనంతపురం వరకు, తెలంగాణాలో
ఆదిలాబాద్‌ నుండి గద్వాల వరకు మరియు మహారాష్ట్ర, తమిళనాడు మొదలగు
రాష్ట్రాల నుండి ఎందరో పాఠకులు మరెందరో రచయితలు నిత్యం ఈ ప్రక్రియపై
పఠనాసక్తి, రచనాసక్తిని చూపుతున్నారు.
శతకంలో – మణిపూసలు
ూశీవ్‌తీవ ఱం వఞజూతీవంంఱశీఅ శీట ఱఎaస్త్రఱఅa్‌ఱశీఅ అంటారు షెల్లీ అను
ఆంగ్లకవి. అనగా ‘‘భావ వ్యక్తీకరణమే కవిత్వం’’ అని అర్థం. చెప్పే విధానంలో,
రక్తికట్టించే తీరులో కొత్త ప్రయోగం నిత్యం జరుగుతూనే ఉండాలి. మణిపూసల
రచనలో ఈ విశిష్టత స్పష్టంగా కనిపిస్తుంది. శతక వాఙ్మయంలో మకుట నియమం
అనేది నాలుగవ పాదంగా ఉండడం సహజం. కొన్ని శతకాల్లో చివరి రెండు పాదాలు ఉండడం
చూస్తూ ఉంటాం. మణిపూసల్లో రాయబడిన మురళి శతకము, తెలుసుకో ఓ మనిషి శతకం,
మణిపూసల త్రిశతి, మానవత్వ పరిమళాలు శతకం, ఆడపిల్ల శతకం, ఓ నరుడా శతకం,
తెలుసుకో విద్యార్థి వంటివాటిలో మకుట నియమం అనేది మూడవ పాదానికి చేకూర్చి
పాఠకునికి ఆసక్తిని కలిగించాయి.
భగవద్గీతలో- మణిపూసలు
విభిన్న వస్తువులను తీసుకొని అల్పార్థంలో అనల్పార్థాన్ని వ్యక్తం
చేయడమే మణిపూసల ప్రత్యేకత. శ్రీమద్భగవద్గీత అనేది వ్యాస ప్రోక్తం
అన్న విషయం మనకు స్పష్టమే. గీతాసారాన్ని తాగిన వాడికి పునర్జన్మ లేదు.
సాక్షాత్తు భగవంతునిలోకి లీనమవ్వడం తథ్యం అని గీతాచార్యుడే నాడు ఫలశ్రుతి
చేశాడు. అటువంటి భగవద్గీతలోని 18 అధ్యాయాల్లోని 700 శ్లోకాలకు సంబధించిన
సారాంశాన్ని 1300 మణిపూసల్లో కాటేగార్‌ పాండురంగ విఠల్‌ గారు తీసుకువచ్చి
నిశితంగా తెలుగువారికి అందించడం జరిగింది. అందులో ఒక శ్లోకాన్ని తీసుకుంటే `
యదయదాహిధర్మస్యగ్లానిర్భవతి భారత!
అభ్యుత్థానమధర్మస్య తథాత్మానం సృజామ్యహం!!
అనే శ్లోకాన్ని మణిపూసల్లో
ధర్మము క్షీణించినపుడు / అధర్మములు పెరిగినపుడు
పార్థా! నేనవతరిస్త ! / భక్తులు వేడుకున్నపుడు
అంటూ బహుసరళంగా అందించారు. ఈ ఒక్క శ్లోకమే కాదు భగవద్గీతలోని ప్రతీ శ్లోకం
మణిపూసల్లో అపురూపంగా కనిపించి, సామాన్యునికి చేరువయ్యాయి.
రామాయణంలో – మణిపూసలు
సంస్కృతంలో ఆదికావ్యం వాల్మీకి విరచిత రామాయణమే అయినప్పటికి
భారతదేశంలోని వివిధ కాలాల్లో ఎందరో మహానుభావులు స్థల, కాలాలకనుగుణంగా
రామాయణ రచన గావించారు. వీటిలో ప్రధానంగా చూస్తే తమిళంలో కంబడు కంబ
రామాయణం, హిందీలో తులసీదాసు రామచరిత మానస్‌, గోన బుద్ధారెడ్డి రంగనాథ
రామాయణం, హుళక్కి భాస్కరుని ఆధ్వర్యంలోని భాస్కర రామాయణం, మొల్ల
రామాయణం, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, విశ్వనాథ వారి రామాయణ
కల్పవృక్షం వంటివి ఎన్నో దర్శనమిస్తాయి. ఎవరు రాసినా, ఎన్ని రాసినా నిత్య నూతనం రామాయాణం. ఈ పరంపరాగతంలో వచ్చిందే మణిపూసల రామాయణం. రామాయణ
కాండలను విడువకుండా, మణిపూసల నియమాన్ని తప్పకుండా కథా విభాగాన్ని అపురూపంగా
రచించారు రచయిత టీ. ఆశీర్వాదంగారు. శ్లోక సంప్రదాయం లేదు, పద్య కఠినత్వం
లేదు. అలతి పదాలతో సామాన్య పాఠకునికి రామాయణ సారాన్ని సమూలంగా అందించారు.
శ్రీరామ జననం బాలకాండలో ఈ విధంగా వర్ణించారు.
‘‘చైత్రశుద్ధ నవమినాడు / రాముడు జన్మించినాడు
కన్నతల్లి కౌసల్యకు / ఆనందము పంచినాడు’’
పాఠకునికి ఇందులో అర్థం కానీ పదమంటు ఏమి లేదు. తర్కమంత లోతులేదు. చదివిన
వెంటనే మనసుకు ఎక్కే విధంగా పదాల నడక ఉంటుంది. అరణ్య కాండలో లంకేశ్వరుడు
సీతమ్మ తల్లిని అపహరించే వేళలో జటాయువు ఎదిరించి నేలకూలిన ఘట్టాన్ని అతి
తేలిక పదాలతో `
‘‘రావణుడను రాక్షసుడు / సీతనపహరించినాడు
అడ్డుకొని ఎదురించగ / నన్నీగతి చేసినాడు’’
అంటూ శ్రీరాముల వారితో చెప్పుకున్న విధానం అద్భుతంగా కనిపిస్తుంది. ఇలా
మణిపూసల రామాయణం ప్రతీ కాండలో అమృత భాండం వంటి భావాలు కనిపిస్తాయి.
వాటిని తాగి జీర్ణం చేసుకోడమే తప్ప మనం అంతకంటే ఏమీ చేయలేము.
మణిపూసల విశిష్టత
మణిపూసలు ఒక వస్తువు చుట్టూ తిరగలేదు. ఎన్నో రకాల అంశాలు ఇందులో
తటస్థమౌతాయి. కథా విశ్లేషణపై గ్రంథాలు వచ్చాయి. శతకాలపై గ్రంథాలు
వచ్చాయి. ప్రకృతి ఒడిని స్పృశించాయి. వీటిలో ప్రధానంగా రుక్మిణీ కళ్యాణం,
బాల రామాయణం, తిరుప్పావై మణిపూసల ద్విశతి, మణిపూసల త్రిశతి, మణిపూసల
పంచశతి, కౌశికుని చరిత్ర, శ్రీ రాజరాజేశ్వర నమో నమః, రైతు మణిపూసలు,
అంబేద్కర్‌ మణిపూసలు, సర్వలఘు మణిపూసల శతకం అనే హిత సూచక మణిపూసలు,
మానవత్వ పరిమళ మణిపూసలు, విద్యార్థుల అంకురం, ప్రకృతి ఒడిలో, శ్రీ చీకోటి
రామ శతకం, మణిపూసల మంజరి, షిరిడీసాయి చరిత్ర, చెట్లు ఆరోగ్యానికి మెట్లు,
నవరత్నాలు (సంకలనం), బ్రహ్మరాతలు, హనుమాన్‌ చాలీసా, కందగర్భం, స్వప్నవీణ,
నమామి శ్రీకంఠ, దివ్యాంగ మణిపూసలు, మిణుగురులు, నదీ మణిపూసలు వంటివి అనేకం
రాగా, ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన కరోనా మహమ్మరిపై కూడా ‘‘కరుణ లేని
కరోనా’’ అను మణిపూసల పుస్తకం రావడం గొప్ప విశేషం.
‘‘కరోనా నీ ఊరేది / కరోనా నీ జాడేది
ఎవ్వరికి కనబడని / కరోనా నీ రూపేది’’
ఆ అంతరంగ జీవిని కవి ప్రశ్నించడం జరిగింది. కరోనా సమయంలో భయభ్రాంతులతో
జడిరచని వ్యక్తులు లేరు. అటువంటి భయంకర సూక్ష్మ జీవిని కవి గొంతెత్తి
ప్రశ్నించాడు.
మణిపూసలు మనిషి హృదయాన్ని కదిలించే భావతరంగాలుగా జనించాయి. ఇప్పటి వరకు
సాహిత్యంలో అనేక ప్రక్రియల ఆవిర్భావం జరిగింది. అందులో నిలబడేవన్ని
నిలబడ్డాయి నిలబడనివి పక్కకు ఒరిగాయి. కారణం సామాన్య స్థాయి చదువరులకు అవి
చేరలేక పోవడమే అని ఘంటాపథంగా చెప్పవచ్చు. కానీ మణిపూసలు కాలరాత్రిలో
కాంతిరేఖల వంటివి, వెలుగులు విరజిమ్ముతూ సామాన్యుల హృదయాలను అతిమధురంగా
తట్టి కదుపుతున్నాయి. ఇప్పటి వరకు కొన్ని వందల పుస్తకాల ఆవిష్కరణలు జరిగాయి.
ఎన్నో వ్యాసాలు వచ్చాయి. కానీ విశ్వవిద్యాలయ స్థాయిలో చేరకపోవడం కొంత
లోటుగా కనిపిస్తుంది. ఇంకా ఆదరణ రావాలి, పరిశోధనలు జరగాలి. వ్యాసకర్తల నుండి
పరిశోధనాత్మక వ్యాసాలు రావాల్సిన ఆవశ్యకత ఉంది. కనుక
విశ్వవిద్యాలయాల్లో సాగుతున్న పరిశోధనల్లో ఇటువంటి నూతన ప్రక్రియలను
ఆదరించి, పరిశోధనకు అవకాశం కల్పిస్తే, సాహిత్య జగత్తులో ఈ ప్రక్రియ కొన్ని
దశాబ్దాలపాటు బతికి నిలిచే అవకాశం ఉందని పలువురి అభిప్రాయం.
ఆధార గ్రంథాలు :

  1. వడిచర్ల మణిపూసలు (2018) : సత్యం వడిచర్ల, కాగ్నా కళా సమితి, తాండూర్‌
  2. వెన్నెల మణిపూసలు (2018) : సత్యం వెన్నెల, వెన్నెల ప్రచురణలు, షాద్‌ నగర్‌.
  3. శ్రీఘన మణిపూసలు (2019) : పరమేశ్వర్‌ ఘనపురం, సాహితీ సమితి, చేవెళ్ళ.
  4. దశావతారాలు (2019) : శ్రీమతి లక్ష్మి ఎడ్ల, ఎడ్ల భూంరెడ్డి ప్రచురణలు,
    సిద్ధిపేట.
  5. ఆలకించు ఓ మనసా (2019) : నాగమోహన్‌ ఎలిషాల, మణికంఠ అప్సెట్స్‌, ఖమ్మం.
  6. శ్రీ షిరిడి సాయి చరితం (2019) : చరణ్‌ సాయిదాస్‌ వేముల, బటర్‌ ఫ్లై
    గ్రాఫిక్స్‌, సిద్ధిపేట.
  7. రుక్మిణి కళ్యాణం (2019) : మమత ఐల, మమత ప్రచురణలు, హైదరాబాద్‌.
  8. మణిపూసల ద్విశతి (2019) : మాణిక్‌ రావు కరణం, కాగ్నా కళాసమితి, తాండూర్‌.
  9. మణిపూసల త్రిశతి (2019) : వీరారెడ్డి శాడ, బటర్‌ ఫ్లై గ్రాఫిక్స్‌,
    సిద్ధిపేట.
  10. విమల మణిపూసలు (2019) : విమల బొమ్మ, బటర్‌ ఫ్లై గ్రాఫిక్స్‌, సిద్ధిపేట.
  11. సహజకవి మణిపూసలు (2019) : అంజయ్య గౌడ్‌ బండకాడి, సాహిత్య పరిషత్తు,
    సిద్ధిపేట.
  12. ఎదలోయలో (2019) : వీరబ్రహ్మం అవుసలి, ఉమలత ప్రచురణలు, వికారాబాద్‌.
  13. అంబేద్కర్‌ మణిపూసలు (2019) : రవీందర్‌ శివాజీ, సురవి ప్రచురణలు, నల్లగొండ.
  14. మణిపూసల రామాయణం (2022) ఆశీర్వాదం, టీ, కారుణ్య పబ్లికేషన్స్‌,
    హైదరాబాద్‌.
  15. భగవద్గీత మణిపూసలు (2022) : పాండురంగ విఠల్‌, కే, కాగ్నా కళాసమితి, తాండూర్‌.

డా. సుభాష్‌
వికారాబాద్‌,
తెలుగు ఉపాధ్యాయుడు.
ఫోన్‌ : 730 686 4798

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *