కొన్ని భావాలు
శీర్షికల దగ్గరే ఆగిపోతాయి,
రాయడానికి ఏమీ లేక కాదు
ఆకాశమంతా హృదయాన్ని
గుప్పిట్లో బంధించలేం కదా!
కొన్ని మాటలు
పెదవుల దగ్గరే ఆగిపోతాయి,
చెప్పడానికి ఏమి లేక కాదు
మనసులో దాగున్నవి
మాటల్లో ఇమడ్చలేం కదా!
కొన్ని కలయికలు
చూపుల దగ్గరే ఆగిపోతాయి,
దగ్గరవడం ఇష్టం లేక కాదు
దూరాన్ని తగ్గించే దగ్గరను
కొలత పెట్టలేం కదా!
కొన్ని బంధాలు
దూరంగానే ఉంటాయి,
వెళ్ళడానికి దారి లేక కాదు
మనసు పయనాన్ని
లెక్కలేసి పట్టలేం కదా!
కొన్ని అనుభవాలు
కాలం వెంబడి నడక సాగిస్తూ
జ్ఞాపకాలై నిలిచుంటాయి!
ఏది, ఎప్పుడు, ఎందుకని
ఎవరిని అడిగినా శూన్యమే,
మనసు పయనం మన చేతిలో లేదు
కాలం చూపే దారిదీపం అది!
పుట్టి గిరిధర్,
9494962080