అయాచితం నటేశ్వరా! శతక వైభవం!!

ఉమ్మడి హిందువు జిల్లా సాహిత్య చరిత్రకు భీష్మాచార్యుల వంటి వారు,
సంస్కృతాంధ్ర పండితులు, అష్టావధాని, దాశరథి పురస్కృతులు, శ్రీమాన్‌
బ్రహ్మశ్రీ డాక్టర్‌ అయాచితం నటేశ్వరశర్మ. వీరి కలం నుండి జాలువారని కవితా
ప్రక్రియ లేదంటే అతిశయోక్తి కానేరదు. చారిత్రక పరిశోధనలో, ఉభయ భాషల్లో
కలిపి ఎన్నో మేలిమి కృతులను వెలువరించారు. ఈమధ్య వారి లేఖిని నుండి జాలువారిన
నూతన రచనయే ఈ నటేశ్వరా! శతకము. ఇది వారి ముద్రిత రచనల యందు 51 వ పుస్తకం.
పద్యం అంటే పరమ ప్రామాణికంగా భావించే నటేశ్వర శర్మ కలం, ఎన్నో శతకములకు,
కావ్యములకు, సిద్ధాంత గ్రంథాలకు ఆయువుపట్టు అయినప్పటికీ, వారి సొంత
దస్తూరి తో వెలువరించిన తొలి గ్రంథం ఈ నటేశ్వరా! శతకము. ఇది దీని యొక్క
ప్రత్యేకత. అందమైన చేవ్రాలు గల నటేశ్వర శర్మ ఏ పద్యమునైనా, కవిత్వాన్ని
అయినా దానికి ఒక జీవం నింపే విధంగా వారి దస్తూరి మనకు కనిపిస్తుంది. అది
వర్తమాన సారస్వత లోకంలో ఎందరికో ఆదర్శంగా నిలిచింది. మునుముందు నిలుస్తుంది
అనడంలో ఎంత మాత్రమూ సందేహం లేదు.
ఆత్మ ప్రబోధాత్మకమైన ఈ కావ్యమునందు రచయిత తనలోని భావనలను, అనుభూతులను,
ఆలోచనలను సమన్వయపరిచి, ప్రతి పద్యము నందు లోక రీతులను, నీతులను అత్యంత
సుందరంగా, మనోహరంగా చెక్కిన తీరు, మనకు ప్రతి పద్యం నందు గోచరిస్తుంది. శివుడి
పట్ల అపార భక్తి ప్రభత్తులు కలిగినటువంటి నటేశ్వర శర్మ తనలోని ‘ఆర్తి’ని,
సంవేదనను శివోహం (తనలోకి పరమేశ్వరుని ఆవహింప చేసుకోవడం) గా మార్చుకున్నారు.
జీవుల పట్ల, సకల ప్రాణుల పట్ల అపార కరుణా పారావార సముద్రుడైన ఆ నటరాజుకు, తన
భక్తి ప్రభక్తులతో ఆ స్వామికి నివేదించడమే ఈ కావ్యము నందలి ప్రతి పద్యం
యొక్క ఆంతర్యం. అట్లే ఆ స్వామి కృపాకటాక్షములే ఈ కావ్య రచనకు
కారణభూతాలని, కావ్యారంభమున రచయిత తన నివేదనలో విన్నవించుకున్నారు.
తనకు తానే విన్నవించుకోవడం (ఆత్మ ప్రబోధాత్మకం) అనేది ఒకరకంగా ఆత్మ
పరిశీలనయే. అంతరాత్మ సాక్షిగా అని కూడా భావించవచ్చు. నటేశ్వరా! అన్న
మకుటంతో సాగిన ఈ శతకమునందలి చెంపకోత్పలములు, అయాచితం నటేశ్వర శర్మ
మనోభావాలకు ప్రత్యక్ష సాక్షిగా నిలిచినాయి. తన మదీయ దైవమైనటువంటి ఆ
పరమేశ్వరుడిని ‘నటరాజు’ గా కీర్తింపబడడం, తన పేరు నటేశ్వరునిగా పిలువబడడం
ఒకరకంగా చెప్పాలంటే, పరోక్షంగా తనలో దాగిన శివునికి విన్నవించడమే. ఇది అందరి
వలన అయ్యే పని కాదు. తన రచనలను, తన అమలిన హృదయమును ఆ పరమేశ్వరుని దివ్య
చరణారవిందములయందు అర్పించడం మరో విధంగా చెప్పాలంటే, తనకు తాను దైవదత్త
మవ్వడం. ఈ భావన దైవం పట్ల ప్రగాఢమైన భక్తి విశ్వాసాలకు తార్కాణం.
నడిచే పద్యం గా కీర్తింపబడిన అయాచితం వారికి, పద్యం అంటే ఎంత ప్రాణమో,
ఎంత అభిమానమో ఈ క్రింది పద్యమును చదివితే గాని తెలియదు.
ప్రొద్దున లేచినంత విరబూయును నామది తోటవాకిటన్‌
పద్దెపు పువ్వు దాని వరభవ్యపరీమళమెల్ల వీచెడిన్‌
హద్దులు లేక విశ్వమును హాయిగా పొద్దున దాటి రమ్యమై
ముద్దులు గొల్పిపాఠకుల ముగ్దుల జేయునురా! నటేశ్వరా!!
సుప్రభాత వీచికలతోనే తనలో పద్య సుమ దళాల పరిమళం తన మది తోటవాకిట వచ్చి,
గుబాళింప చేస్తుందంటారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ పద్యము విన్న వెంటనే
అయాచితం కుసుమ కోమల సమన్వితమైన హృదయం ఎటువంటిదో అవగతం అవుతుంది. తనను
నిద్దుర లేపే పద్యమే తదనంతరం పాఠకుల హృదయాలకు చేరి వారిని ముగ్ధులను
చేస్తుందని సగర్వంగా ప్రకటిస్తారు. ఇది కూడా ఒక కవికి, రచయితకు ఉండవలసిన
ఆత్మవిశ్వాసం. తెలుగు భాష ఔన్నత్యమును, వైశిష్టమును గుర్తెరిగిన అయాచితం
వారు, మాతృభాష గొప్పతనమును కళ్ళకు కట్టినట్టు చూయించే ఈ పద్యమును ఒకసారి
చూడాలి.
వెలుగుల జిల్గులన్‌ విరియు వెల్లడిజేయును సర్వ భావముల్‌
లలితములైన మాటల విలాసములన్‌ దనరంగజేయు,స
మ్మిలితములైన రాగముల మేలనగీతమువోలె శ్రావ్యమౌ
తెలుగును విస్మరించకు సుధీవిభుతన్‌ గనరా నటేశ్వరా!! (11వ)
‘మాతృభాషను విస్మరించడం అనేది మానవాళికి శ్రేయస్కరం కాదు’ అనే సత్యాన్ని
ఈ పద్యము నందు స్పష్టం చేసి,తల్లి భాష పట్ల తనకున్న గౌరవ అభిమానాలను
చాటుతారు. అట్లాగే భాష యొక్క పుట్టు పూర్వోత్తరాలను తెలియజేస్తూ, భాషా
స్వరూప స్వభావాలను కళ్ళకు కట్టినట్లు తెలియజేసే ఈ పద్యమును ఒకసారి
గ్రహించవలసిందే.
భాష సరస్వతీ మయము,భాషయె బ్రహ్మము, నిత్యసత్యమున్‌
భాషయె, భావనల్‌ నిలుపు భాగ్యము, భాషయె జీవమయ్యెడిన్‌
భాషను గౌరవింపవలె, భాషను నేర్వగ బూనుకోవలెన్‌
భాషలుదాల్చి మానవులు భామయులౌదురురా! నటేశ్వరా!!
(13)
అంటూ..భాషను అవహేళన చేసి, భాషను చిన్నచూపు చూస్తున్న కొందరు మనుషులకు
కనువిప్పు కలిగించే విధంగా ఈ శతకమునందలి 14వ పద్యమును కూడా చూడవచ్చు.
శ్రీకరమైన మాట గుణశేఖరమై వెలుగొందుచుండు నని విశ్వసించే రచయిత, శుభమైన,
జనసమ్మతమైన మాటలు (9వ.పద్యం) సంధ్య వేళ, కమనీయ కాంతిమయములై
ప్రభాతవేల దినకరుని వెలుగులవలె అనునిత్యం భాసిల్లుచూ, ఆనంద ఆహ్లాదములను
మనసుకు కలిగించడమే కాకుండా, హృదయానికి హత్తుకుంటాయని అయాచితం చెబుతారు.
అలాగే మానవుడు ఎలా జీవించినా అది పల్లె అయినా పట్టణమైన ఎల్లప్పుడూ
చల్లదనమును సమకూర్చేవి, మానవాళికి వేరుచేసి జీవితముకు సుగమం చేసేవి చెట్లే
కదా! అటువంటి చెట్లను చల్లగా చూడడమే కాదు, వనములను అడవులను సమూలంగా నాశనం
చేయడమే వలన మానవాళి మనుగడ అసాధ్యమననే విషయాన్ని కూడా పరోక్షంగా శతకం
నందలి ఏడవ పద్యం సూచిస్తుంది.
గానకళా ప్రపూర్ణులైన కళారవులకు కమ్మని గానమాధుర్యమే ప్రీతికరమని, కళలచే
మనుజుడు నిత్యం ఆనందోత్సాహాలతో గడుపుతాడని, శతకమునందలి ఎనిమిదవ పద్యంలో
తెలియపరుస్తూ, మంచి కావ్యముల యొక్క పఠనం ఎంత గొప్పదో ఈ క్రింది పద్యం
నందు తెలియపరుస్తారు రచయిత.
కావ్యములన్‌ పఠింపక వికాసమువచ్చునె మాతృభాషలో?
కావ్యములేకదా సృజన కాంతులనిచ్చు కవీంద్రకోటికిన్‌?
దీవ్యదనంతభావనల దీపములై విలసిల్లు కావ్యముల్‌
శ్రావ్యత వానిమూలమయి రంజిలజేయునురా! నటేశ్వరా!!
(24)
సత్కావ్యపఠనం మాతృభాషలో ఒక చైతన్య వాతావరణము ఏర్పాటు చేస్తుందని
అనడమే కాకుండా, కావ్యములు కవిలోని సృజన కాంతులను తెలియపరుస్తాయి. మనిషిలోని
అనంత భావనలకు ప్రతీకలై ప్రతిరూపాలై వెలుగు దివ్వెల వలె పాప తిమిరములను నాశనం
చేస్తాయి. శ్రావ్యమైన భావజాలాన్ని సత్ప్రవర్తనను కలుగజేసి మనిషిని
నిరంతరం పురోగమనములో పయనించే విధంగా దోహదపడతాయని అయాచితం వారు
ప్రకటిస్తారు.
తన మనసుకు నచ్చిన చక్కటి వేదిక, అమృతతుల్యములైన పలుకులను పలికే స్నేహితులు,
వినేందుకు ప్రేమతో ముందుకు వచ్చే ఆత్మీయులు, సన్నిహితులు, వినయ వివేకములకు
ప్రతిరూపాలైన రసహృదయలు ఇంతమంది తన చుట్టూ ఉన్న తర్వాత, మంచి కవిత్వం
వికసించకుండా ఎలా ఉంటుంది? అంటారు నటేశ్వరుల వారు. ఈ పద్యం వినగానే
అల్లసాని పెద్దన గారి ‘నిరుపహతీ స్థలంబు రమణీ ప్రియ దూతిక తెచ్చియిచ్చు’….
అనే పద్యం మనకు స్పురించక మానదు. చిన్నప్పటినుండి అపారమైన గురుభక్తి
తత్పరతను కలిగినటువంటి నటీశ్వరులవారు, ఆ గురువు యొక్క గొప్పతనమును వివరిస్తూ
చెప్పిన ఈ పద్యాన్ని చూడవచ్చు.
ఈ విధంగా మొత్తం 108 మధ్య రత్నములతో అలరారుతు, నటరాజైన ఆ
పరమేశ్వరుణ్ణి కొనియాడబడుతూ, ఆత్మ ప్రబోధాత్మక మైన సద్భావనలతో
రసహృదయుల మనసును రంజింప చేయడమే కాకుండా, ఎల్లరకు వర్తింపజేసేటువంటి
భావనారాశి ఈ శతకము నందు కొదవలేదనేది పరమ సత్యం. ఈ నటేశ్వరా! శతకం, శతక
సాహిత్య చరిత్రకు ఒక మకుటాయమానంగా వెలుగొందుతుంది అనడంలో రవ్వంత కూడా
సందేహం లేదు. వర్తమాన సాహిత్య లోకానికి ఎంతో ఉపయోగకరమైన ఈ శతకరాజమును
ప్రతి ఒక్కరూ చదవవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి మరెన్నో సత్కృతులుగా
భాసిల్లే కావ్య రచనలు గురుతుల్యులు బ్రహ్మశ్రీ డాక్టర్‌ అయాచితం నటేశ్వర
శర్మ గారి కలం నుండి రావాలని కోరుతూ, వారి పాదపద్మములకు శత సహస్ర నమస్సులు.

సుప్పని సత్యనారాయణ
తెలుగు అధ్యాపకులు, బాన్సువాడ.
ఫోన్‌ : 9492626910

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *