సీ. తనువును గాంచుతు తమము జెందకు నీవు
తగులబడువరకె దానియునికి
ఆస్తిపాస్తులనేవి యవసరానికె గాని
సంపదెప్పటికైన సాగిరాదు
సతులు సుతుల జూసి సంతసించుముగాని
వగచి నీతో వచ్చు వారు గాదు
నశ్వరమైనట్టి నర జీవితము నీది
అంతమే లేనిది యాత్మ యొకటె
ఆ.వె. ఆత్మ యెడల నమిత ననురాగమును జూపు
ఆత్మ యెపుడు నిన్ను ననుగమించు
ఆత్మ నీవు, నీవు నాత్మ సత్యమ్ముగ
ఆత్మ యందె నీవు నాశ్రితుడవు
సీ.అంతరంగములోని యరివర్గజాలమున్
ఆమడదూరంబు నదిమి పెట్టు
సోమరితో నీవు సోపతి చేయక
కార్యముల్ జేయంగ కదులుమెపుడు
సమయమ్మునంతయు సంకల్ప దీక్షతో
సంసిద్ధి గావించి సంతసించు
సంకుచితమ్మేది సంపదలీయదు
వికసిత తత్త్వమే విలువలిచ్చు
ఆ. అంతమొందజేయు నత్యాశ నెప్పుడు
పొందబోకు వెతలు పొసగవవియు
దుఃఖమిడు దురాశ దూరమ్ము జేయుము
ఆశ మిగుల జాలు నాప్త మిత్ర!
సీ. కాలమ్ము నెపుడైన కలిసి రాకున్నను
మౌనమొకటి శ్రేష్ఠమౌను నీకు
కోపతాపంబులు కొలువైన గేహాన
శస్త్రమై కాపాడు శాంతగుణము
స్థాన బలము లేక సత్తువంతయు తగ్గ
యధికుడవనకుండ నణగియుండు
వాదోపవాదాలు వాడిగా జరిగితే
ఆవేశ మొక్కటి నదుపు నుంచు
ఆ. దుర్జనులకు నీవు దూరంబు గాకున్న
నడతయంత కూడ నష్టమగును
సజ్జనులకు నీకు సాంగత్యమున్నచో
ఆత్మ యిచ్చును నీకు నతులగుణము.
సీ. ఇహ పరముల యందు యీశ్వర చింతనే
మోక్ష సాధనముగ మోదమిడును
మోహితంబగునట్టి ముక్కంటి వరములె
భక్తాళి కైవల్య భాగ్యమొసగు
నప్రమేయాతీత యణిమాది గుణశోభ
శంకరతత్త్వంబు శక్తులొసగు
సర్వ ప్రాణుల కెప్డు శాశ్వత ముక్తిని
పరమేశు లింగమె ప్రాప్తమిచ్చు.
తే. రాజరాజేశ్వరుండిల పూజ్యసురుడు
సకల కర్మల సృష్టికి సాక్షియతడు
చంద్రశేఖరు కృపపంచు సాత్వికుండు
నాశ్రయించిన వారికి నాత్మ బంధు!!
స్తంభంకాడి గంగాధర్
కరీంనగర్,
ఫోన్ : 738 620 0610