కోరిక

కోరికలే అన్ని రకాల సమస్యలకు, బాధలకు మూలం అంటూ ప్రాచ్య పాశ్చాత్యమైన అన్ని రకాల వేదాంత వ్యవహారాలు చెప్తూనే ఉన్నాయి. బౌద్ధం మరీ ప్రత్యేకంగా సామాన్యుని వరకూ ఈ భావాన్ని అందించే ప్రయత్నం చేసింది. కోరికలు లేని మనిషి, వర్గం, వర్ణం ఎవరైనా ఉంటారా? అని ఆలోచనలు కూడా ఉంటున్నాయి. అసలు కోరికలు ఎందుకు ఏర్పడుతున్నాయి? ఎప్పుడు కోరికలు వస్తాయి? ఈ అంశాలను ఒకసారి గమనించాల్సిన అవసరం
ఉంది. లేని వస్తువును, పొందలేని వస్తువును ఆశించడమే కోరికకు మూలం. ఉన్న వస్తువులు, ఉన్న ప్రకృతి, ఉన్న శక్తి, ఉన్న ధనం, కుటుంబం అన్నింటిలోనూ సంతృప్తి పడితే కోరికలే ఉండవు. అయితే కోటిలో ఒక్కరికి కూడా ఇటువంటి గుణాలు ఉన్నాయో లేదో ఈ కాలంలో గమనించాల్సిందే. లోక వ్యవహారంలో ఏ విషయాన్ని చూసినా, ఏ అనుభవాలు తనను ప్రేరేపించినా, వ్యతిరేకంగా గానీ, అనుకూలంగా గానీ స్పందనలు ఏర్పడటమే కోరికలకు మూలం అవుతున్నాయి. మన దగ్గర లేకపోవడమే కోరికకు కారణం. లేనిది ఏమిటి? ఉన్నదంతా అనుభవించే శక్తి కూడా ఉండదు కదా! వ్యక్తికి పెరాలిసిస్‌ వచ్చిన సందర్భంలో కోట్లాది రూపాయలు ఉన్నా అనుభవ యోగ్యం ఉంటుందా ! తాము ఏది అనుభవించాలన్నా తమ శక్తి కన్నా తక్కువ శక్తి గల వానిని మాత్రమే అనుభవించగలరు. తమ శక్తికన్నా అధికమైన శక్తి గల కోరికలను తీర్చుకోవడం కోసమే కృషి అధికంగా చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాదులు కూడా అంతే, తమ శక్తికన్నా తక్కువ శక్తిగల ఉద్యోగాదులు వెంటవెంటనే వస్తాయి. స్థాయి, శక్తి పెరిగితే పై ఉద్యోగాదులకు మనం పంపించబడతాము. లక్ష రూపాయలు చేతిలో ఉన్నప్పుడు ఎనబైవేల రూపాయల టీవీ కొనుక్కోవడం పెద్ద కష్టం కాదు. యాబై వేల రూపాయలు ఉన్నప్పుడు మాత్రం ఎనబైవేల రూపాయల టీవీ కొనుక్కోవడం కష్టం. అప్పుడు అది కోరికగా మిగిలిపోతుంది. దానికోసం శ్రమ మొదలు అవుతుంది. అక్కడే కష్టం కూడా ప్రారంభమౌతుంది. లోకంలో ఏ వస్తువైనా కొనాలంటే దాని వెలకన్నా అధికమైన ధనం మన దగ్గర ఉండాలి. దాన్ని సంపాదించగలిగే శక్తి అయినా మన దగ్గర ఉండాలి. శక్తి ఉన్నవాడే లోకంలో ఏదైనా కొనగలడు, అనుభవించగలడు. శక్తి లేనివానికి కొనుగోలు ఉన్నా అనుభవ శక్తి ఉండదు. అందువల్ల శక్తిని పెంచుకునే ప్రయత్నం మొదలు పెడితే కోరికలు తీరుతూ ఉంటాయి. శక్తి తగ్గుతున్నా కొద్దీ మన దగ్గరి వస్తువుల, వ్యవహారాల అనుభవాలను కోల్పోతుంటాం. కోరికలు రావడానికి మూలం మన దగ్గరి తగిన శక్తి లేకపోవడం. కోరికలు తీరాలంటే శక్తి చుట్టూ మన మనస్సు, శరీరం తిరుగుతూ ఉండాలి. శక్తి హీనమైన లోక వ్యవహారాల చుట్టూ మనస్సు తిరుగుతూ ఉండే వారికి వారిలో ఉన్న కొద్ది శక్తి కూడా డిశ్చార్జ్‌ అవుతూ ఉంటుంది. మనం నివసిస్తున్న భూమి కూడా అత్యంత శక్తివంతమైన సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉంది కదా! దానివల్లనే భూమికి, మనకు శక్తి సంక్రమిస్తూంది. అందుకే మన మనస్సు కూడా శక్తివంతమైన ఆలోచనల చుట్టూ, శక్తి వ్యవహారాల చుట్టూ ప్రదక్షిణం చేస్తూ ఉండాలి. భారతీయ ధర్మంలో అమ్మవారుగా భావించే ఏ దేవత అయినా శక్తికి సంకేతాలే. ఆ శక్తిని మన శక్తిగా మార్చుకునే ప్రయత్నం మొదలు పెడితే కోరికలనేవి మనకు ఉండనే ఉండవు. ఈ మాసం మన భూమి ఆవిర్భావానికి ప్రతీక అయిన లింగ ఉద్భవం… శివరాత్రి. ఈ భూమి, భూమిమీద అందరికీ ఆనందం, ఐశ్వర్యం కలగాలని అందరం కోరుకుందాం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *