ప్రకటమైనవాడు, ప్రకటమైనది అనే అర్థంలో వ్యక్త శబ్దాన్ని ఉపయోగిస్తున్నాం. వ్యక్తమైనవారే వ్యక్తులు. వ్యక్తికి ఉండే ధర్మమే వ్యక్తిత్వం. వ్యక్తం కాని సూక్ష్మాతి సూక్ష్మమైన అణురూపమైనవాడే అవ్యక్తుడు. పదార్థానికి వ్యక్తమయ్యే ధర్మం ఉంటుంది. యథార్థానికి ఉండదు. మూలమైన శక్తి స్పందనలే ఆకాశం, వాయువు, అగ్ని, జలం, భూమి మొదలైన పంచభూతాలు. ఇవన్నీ క్రమంగా వేరు వేరు విధాలుగా వ్యక్తమవుతూ వచ్చి పదార్థాలను ఏర్పరచాయి. పదార్థం మళ్ళీ సూక్ష్మీకృతమై మూలశక్తిగా మారి చైతన్యరూపమవుతుంది. పదార్థం ఏర్పడడం ఎంత కష్టమో, ఏర్పడిన పదార్థం మళ్ళీ మూలంగా మారడం అంతే కష్టం. మట్టి, కుండగా మారడం ఎంత కష్టమో, కుండ మళ్ళీ మట్టిగా మారడం కూడా అంతే కష్టం. మనకు కలగిన జ్ఞానాన్ని అనుసరించి మొదటి దానికన్నా రెండవది కొంత సులువు అవుతూ ఉంటుంది.
వస్తువులన్నీ వ్యక్తమైనవే. విధానాలన్నీ వ్యక్తమైనవే. కనిపించేటట్లు, వినిపించేటట్లు, అనిపించే టట్లు ఎన్నో రూపాల్లో వ్యక్త విధానాలుంటాయి. ఈ విధానం వెనుక చైతన్యం ఉంటుంది. వ్యక్తమైన అన్నింటిలోనూ మనకు అర్థంకాని చైతన్య స్వరూపం ఉండితీరుతుంది. ఆ యా వస్తు, వ్యవహారాలు అందుకే మనకు ఉపకరిస్తాయి. చైతన్య రహితమైన పదార్థం ఏదీ మనకు ఉపకరించదు. అందుకే అవ్యక్తం మూలంగా ఉంటుంది. వ్యక్తం ప్రదర్శితమవుతుంది.
భాషలో మన భావాలను వ్యక్తీకరిస్తాం. సాహిత్య, నాటక వ్యవహారాల్లో స్పష్టంగా తెలియజేసిన విషయాలను ‘అభివ్యక్తి’ అంటాం. వ్యక్తమైన పదార్థ వినియోగం ఎంతో, వ్యక్తం అయ్యే భాష, భావం వల్ల కూడా అంతే వినియోగం. పదార్థం, భాష, భావాల్లో లోపాలున్నా, గుణాలున్నా మూలం మాత్రం అవ్యక్తమే అవుతుంది. వ్యక్తమైన వస్తువు లోకంలో కనిపించినంత కాలం దాని గొప్పతనం చూపించుకునే ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. భావం, భాష ద్వారా వ్యక్తమైన వారు సమాజంలో తమ గొప్ప చూపించుకునే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అయితే వ్యక్తమైనది ఏదీ శాశ్వతంగా నిలిచిపోయే అవకాశం లేదు. ఎప్పటికైనా అది నశించి తీరాల్సిందే. అది మరో రూపాన్ని పొందవచ్చు. అదే రూపంలో మార్పును పొందవచ్చు. దాని స్థితిని మార్చుకోవచ్చు. కాని వ్యక్తమైన విషయంలో మార్పులు సంభవం అవుతూనే ఉంటాయి.
వ్యక్తం కాకుండా మూలచైతన్యం వైపు మళ్ళీ వెళ్ళి అవ్యక్తులం కావాలంటే తగిన జ్ఞానం కావాలి. విషయ, వ్యవహార జ్ఞానాదుల ద్వారా వ్యక్తి క్రమంగా తనను తాను వ్యక్తీకరించుకునే స్థితి నుండి దూరం జరగాలి. వ్యక్తం కావడంలో మొట్టమొదటి వ్యవహారం స్పందన. అణుస్పందన. ఈ స్పందనలు ఎంత ఎక్కువగా ఉంటే అంతగా వ్యక్తమైన పదార్థం మారుతూ ఉంటుంది. రూపం మారుతున్నా కొద్దీ ఇబ్బందులు పెరుగుతూనే ఉంటాయి.
తాము వ్యక్తమైనది అధికమై ఈ ప్రపంచానికి అల్పంగా కనిపించడం కన్నా, తాము తక్కువ వ్యక్తమై ఎక్కువ వ్యాపించడమే సార్థక లోకజీవనం అవుతుంది. పదార్థానికి స్వయం ప్రకాశ శక్తి లేదు. కొద్ది ప్రదేశంలోనే విస్తరిస్తుంది. ఒక దీపం తాను ఉన్న రూపం కన్నా ఎక్కువ ప్రదేశాల్లో విస్తరిస్తుంది. ఈ దీపంలోనూ ఒక చైతన్యం ఉంటుంది. దానిపేరే అవ్యక్తం. ఆ అవ్యక్త వ్యవహారాలు అర్థం చేసుకోవడం మొదలు పెట్టి స్పందనలు, ఆసక్తులు, అనవసర విషయాలతో సంగమాలు క్రమంగా తగ్గిస్తే వ్యక్తి చైతన్య మూర్తిగా మారుతూ క్రమంగా అవ్యక్తుడు, ఆనంద ప్రదుడౌతాడు.