మహాభారతం : ‘ధర్మ’ ప్రశ్నలు ‘భీష్మ’ సమాధానాలు – 6

ధనమేరా అన్నిటికీ మూలం ఆ ధనం విలువ తెలుసుకునుటె మానవ ధర్మం…’ అనేది చాలాసార్లు నిజమే అనిపించే మాట. సమాజం మాత్రం ఎప్పుడైన ధనవంతులనే గౌరవిస్తుంది. ధనం ముందు కొన్నిసార్లు కులం, గుణం, రూపం, జ్ఞానం మొదలైనవి కూడా మోకరిల్లుతాయి. అట్లని అన్నిటిని ధనంతో సాధించలేరు. ధనంతో పరుపుల్ని కొనచ్చు, కానీ నిద్రను కొనలేరు. పుస్తకాల్ని కొనచ్చు, కానీ జ్ఞానాన్ని కొనలేరు. తిండిని కొనచ్చు, కానీ ఆకలిని కొనలేరు. ఇలా ధనంతో కొనలేనివి ఎన్నో ఉన్నాయి. అందుకే అన్నిటికీ ధనమే పరిష్కారం అనుకుంటే పొరపాటు. ధనం జీవితంలో భాగం మాత్రమే. డబ్బుమాత్రమే జీవితం కాలేదు. కాకూడదు. ఈ ధనాన్ని గురించి ధర్మరాజు మూడు ప్రశ్నలు అడిగాడు. వాటికి భీష్ముడు సమాధానాన్ని లౌకికంగా, తాత్త్వికంగా, ఆధ్యాత్మికంగా అందించాడు.
ప్రశ్న : ‘‘ధనవంతులు, పేదవారు ఇద్దరిలో ఎవరు సుఖంగా ఉంటారు’’. (శాంతి.4.32)
దానికి సమాధానంగా శమ్యాకుడు అనే విప్రుడు తనతో చెప్పిన మాటలను భీష్ముడు వివరించాడు. అతడు కడు పేదవాడు. కుటుంబాన్ని వదిలిపెట్టినవాడు. కూడుకు గుడ్డకు కూడా కటకట పడుతున్నాడు. ఒక రోజు భీష్ముడి వద్దకు వచ్చాడు. ప్రసంగవశాన కొన్ని మాటలు చెప్పాడు. అందులో మాటలనే భీష్ముడు ఈ ప్రశ్నకు సమాధానంగా తెలియజేస్తున్నాని విన్నవించాడు.
ధనాన్ని, దరిద్రాన్ని త్రాసులో వేసి చూస్తే దరిద్రంవైపే ముల్లు మొగ్గింది. అదేలా అనుకుంటారు? కాని వాటి గుణదోషాలు కూడా వివరించాడు.
ధనవంతుడు ఎప్పుడు మృత్యువు నోట్లో వున్నట్లు ఉంటాడు. నిప్పు, దొంగలు మొదలగు వాటికి భయపడుతూ ఉంటాడు. అంతేకాదు కోపం, లోభం పెరిగిపోయి ఎప్పుడు చింతలో మునిగి ఉంటాడు. అదంత దుఃఖం కాక, సుఖం ఎలా అవుతుంది?
నిర్ధనుడు ఎక్కడైన స్వేచ్ఛగా ఉంటాడు. అతనికి భయమనేదే ఉండదు. ఉండి లేదని చెప్పుకునే కపటత్వం ఉండడు. మృదువుగా మాట్లాడుతాడు. అట్లాంటి వారిని దేవతలుకూడా మెచ్చుకుంటారు కదా!
లోకం తీరును గమనించాలి. కంటికి కనిపించే ధనాదులు అన్ని కాల ప్రవాహంలో నశించిపోయేవే అని తెలుసుకుని, వాటిని ఎప్పుడైనా, ఎక్కడైనా విడవడం చాలా మంచిది.
‘‘ధనవత్త్వము దుఃఖకరం
బని కని తత్కాంక్ష విడుచు నతని కధనతా
జనితాత్మాధీనత్వం
బనుపమ సౌఖ్యంబు సేయు నక్షీణముగన్‌
’’ (శాంతి.4.38)
ధనవంతులుగా ఉండడం దుఃఖహేతువు. ఇది తెలుసుకుని ధనం మీద కాంక్షను వదిలిపెట్టాలి. పేదరికం వల్ల కలిగే ఆత్మస్వేచ్ఛ అంతులేని సుఖాన్ని కలిగిస్తుంది అనే విషయాలను తెలియజేసాడు.
ఇది బుద్ధి తెలిసిన ప్రతి మనిషికీ అవసరమైన ప్రశ్న. ధనవంతులే సుఖంగా ఉంటారని చాలామంది అపోహ. కొందరు సుఖం పొందడానికి ప్రధాన ఆధారం ధనమే అనుకుంటారు. ఈ సమాధానంలో ధనవంతుడి, పేదవాడి మనత్సత్వాలను కూడా తెలియ జేసాడు. ధనవంతుడు రకరకాల భారీలనుండి తప్పించుకోవడానికి, కోపాన్ని, లోభాన్ని అహాన్ని పెంచుకుంటాడు. బీదవారికి ఈ బాధలేదు. ఎవరితో ఎటువంటి అవసరం పడుతుందో అని వినయంతో ఉంటాడు. మృదువుగా మాట్లాడుతాడు. సత్ప్రవర్తనతో ఉండడానికి ప్రయత్నిస్తాడు.
ఇక్కడ ప్రశ్నకు తగ్గట్టుగా సమాధానాన్ని ఆచీ, తూచి వివరించాడు. కలిమిలేములు ఒక పరిమాణంలో ఉండే వస్తువులు కావు తూచడానికి. వాటి వల్ల కలిగే అర్థ, అనర్థ పరిణామాల్ని అంచన వేసుకోవాలి. ఈ సృష్టిలో కనిపించేది ఏదైనా కరిగిపోవాల్సిందే. అది ప్రకృతి ధర్మం. ధనం కూడా కనిపిస్తుంది, అంటే అది కరిగి పోతది అని తెలుసు. కరగనీయకుండా ఇంకా పెంచుకోవాలనే అందరి ఆశ. అందుకే ఇక్కడ కాపాడుకోవడంలో పడి ధనానికి దాసులుగా మారుతారు. అట్లాంటి వారిని కోపం, లోభం ఆవహిస్తాయి. అటు తర్వాత వారు సాధారణ మనశ్శాంతిని కోల్పోతారు. ఎంతో శ్రమిస్తే తప్పా ధనం రాదు. దానిని అనుభవించడం, లేదా దానం చేయడం సుఖదాయకం, పుణ్యదాయకం. ఈ రెండు చేయనపుడు దానిని కాపాడుకోవడం కోసం సంపాదించినదాని కంటే ఎక్కువ శ్రమపడాల్సి ఉంటుంది. ఈ విషయాన్ని వెన్నెలకంటి సూరన కూడా ఇలా చెప్పాడు.
అర్థ మార్జించునపుడును నది సురక్షి
తంబు గావించునపుడునుఁ దద్వియోగ
మైన యప్పుడు దుఃఖంబెకానియెందుఁ
గలిమి సుఖమని చెప్పుట కానిపలుకు
(వెన్నెలకంటి సూరన.వి.పు.పIII-374) సంపాదించడంలో దుఃఖమే. కాపాడుకోవడంలో దుఃఖమే అయినపుడు అత్యంత ధనం అనారోగ్యకరం.
బధిరయతి కర్ణవివరం, వాచం మూకయతి నయన మంధయతి
వికృతయతి గాత్రయష్టిం, సంపద్రోగోయ మద్భుతో రాజన్‌ (విష్ణుస్మృతి)
ఐశ్వర్యమనే రోగం బహు విచిత్రమైనది. అది సోకిన వారికి చెవులు వినబడవు. నోరు మాటాడ పెగలదు. కళ్ళు మూసుకు పోతాయి. శరీరం వికృతంగా మెలికలు తిరుగుతుంది. ఐశ్వర్య మదరోగమునకు దారిద్రమే మందు అని చెప్పబడిరది సుమా.
సుభాషిత రత్నావళిలో కూడా ధనానికి మూడు గతులు అని చెప్తాడు. అందులో మొదటి రెండు చేయకుంటే మూడవది అప్రయత్నం జరిగిపోతుంది.
దానము భోగము నాశము
పూనికతో మూఁడుగతులు భువి ధనమునకున్‌
దానము భోగము నెఱుఁగని
దీనుని ధనమునకుగతితృతీయమె పొసగున్‌
(ఏ.ల.కవి.సుభా.నీతి.)
వీటిన్నిటిని గమనిస్తే సామాన్యమైన జీవితమే చాలా గొప్పది. అతి ధనవంతుడుగా జీవించాలని అనుకోకూడదు. ధనవంతుడివి కావాలనుకుంటున్నావంటే నీ ఆరోగ్యాన్ని, సుఖాన్ని, మర్యాదని కోల్పోవడానికి సిద్ధపడుతున్నావని అనుకోవాలి. ఉన్నదానిలో నలుగురికి ఉపయోగపడుతు బ్రతకడంలో ఉన్న కమ్మదనం ఎక్కడలేదు. ధనం సంపాదించి దానిని రకరకాల పద్ధతులతో కోల్పోవడం కంటే ధనం లేని జీవితమే చాలా సుఖదాయకమైనది. ఈ సందర్భంగా తిరుపతి వెంకటకవుల పద్యపాదాలను గుర్తుచేసుకోవాలి.
ధనముబాసిన నరు జీవితంబుకంటే
ధనము లేకున్న నరు జీవితంబు మేలు (తిరుపతి వేంకటకవులు.మృచ్ఛకటికము.ప.71)
******
ప్రశ్న: ‘‘ధన దాహంతో ఉన్నవారు ఎలా సుఖపడుతారు?’’ (శాంతి.4.39) అని అడిగాడు.
దీనికి సమాధానంగా భీష్ముడు ‘‘ధనార్జనంబుతోడి విసువుటం బుట్టిన విడుపున సుఖంబు గలుగు.’’ (శాంతి.4.39) అంటే ధనం సంపాదించడంలో విసిగిపోయి విరక్తిచెందినపుడే సుఖపడుతాడు, అని ఏక వాక్యంలో సమాధానం చెప్పాడు. అట్లాగే దానికి సంబంధించిన మరో కథను కూడా తెలియజేసాడు.
మంకి అని ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి అత్యంత ధనదాహం. అతడు పనినేర్పవలసిన వయసులో ఉన్న రెండు కోడెలను కొన్నాడు. అవి బాగా మదించి ఉన్నాయి. వాటికి ఒక కానికట్టి విడిచిపెట్టాడు. అవి పరుగెత్తే దారిలో ఒక ఒంటె పడుకుని ఉంది. దాని మీది నుంచి వెళ్ళబోయాయి. ఒంటె బెదిరి హఠాత్తుగా లేచింది. కోడెలు ఒంటెకు రెండు వైపుల రెండు వేలాడబడ్డాయి. ఉరిపడి చనిపోయాయి. ఏడుస్తూ చుట్టుముట్టిన జనాలతో మంకి ఇలా పలికాడు.
ఆలోచిస్తే పురుషప్రయత్నం కంటే దైవబలమే కార్యసిద్ధికి ముఖ్యం. ఎప్పుడు మనిషి ప్రయత్నం ఫలించినట్లు కనిపించినా అది దైవబలం వల్ల జరిగిందనే అనుకోవాలి. సుఖంకోరే వారు ధనం సంపాదించే అతి వ్యాపారం విడిచిపెట్టడం మంచిది.
కోరికలను వదిలిపెడితే కాని మనసుకు ముక్తిలేదని విచారించడం మొదలుపెట్టాడు. దానికి తగిన చిత్తవృత్తిని కుదుర్చుకున్నాడు. కోరిక మూలాన్ని తెలుసుకున్నాడు. అది సంకల్పం నుండి జనిస్తుందని గమనించాడు. సంకల్ప స్పర్శలేని మనోముద్ర వహించి దానిని నశింపచేస్తానన్నాడు. సుఖం పొందడానికి ధనం మూలం కావచ్చు, కాని అది కోరినంత మాత్రాన రాదు. దానికై ప్రయత్నించాలి. ప్రయత్నించినా సిద్ధించకపోవచ్చు. సిద్ధిస్తే మాత్రం ఆ ధనంతో పాటు అనేక కష్టాలు కూడా వుంటాయి. సిద్ధించక ఓడిపోవడం చావుతో సమానం. ఎటుచూసిన దుఃఖమే కాబట్టి కోరికలు మానుకోవడం మంచిది. కోరికను తిరస్కరించడంలోనే నిజమైన సుఖం ఉంది.
దుఃఖానికి, కష్టానికీ కోరికలె మూలం. కోరికల పాలబడ్డ వారు ఏం చేయ్యాలో తెలుసుకోలేరు. అందువల్ల దానికి దూరంగా ఉండి సుఖపడుతాను. దాని కారణాన తీవ్రంగా కష్టించి సొమ్ము సంపాదించి, దానిని దాచడానికి, రక్షించడానికి కష్టపరంపర పెరుగుతుంది. కాబట్టి కోరికను వదిలివేయడం వల్ల ఎటువంటి విచారమూ, దైన్యమూ ఉండదు.
‘‘సులభమొ దుర్లభంబో యని చూడ నెఱుంగవు గన్నదానిపై
నలముదు కామమా! యిడుమ లందఁగఁ జేయుదు నిండు టేమిటం
గలుగదు నీకు నీ తెఱఁగగాధ రసాతల భంగి నీవు స
న్పొలమునఁ బోవకుండ నినుఁ బుచ్చెద బచ్చెన రూపు పోకలన్‌
’’ (శాంతి.4.51)
‘‘ఓ కామమా! నీ దృష్టి నీది. నీ కన్నుపడిన వస్తువు సులభమో కాదో పట్టించుకొనవు. తృప్తి అన్నమాట లేనేలేదు నీకు. అగాధమైన పాతాళం నీ దారి. నీ దారిని నేను పోను. నిన్ను మాయ బొమ్మను తరిమినట్లు తరుముతావు’’ అని పద్యభావం. ధనం వెంట పరుగెత్తి దైవం ప్రతికూలించిన కారణాన ధననాశం పొంది, విసిగి వేసారి కోరికను సంపూర్ణంగా తిరస్కరించాడు. కామతిరస్కారంతో అతనిలోని కోపం నశించింది. ఇంద్రియ నిగ్రహం కలిగింది. ఓర్పు నెలకొన్నది. ప్రాణులయెడ కరుణ పాదుకున్నది. కాబట్టి ఇకపై అతనిని కోరికల తోబుట్టువలైన లోభం యొక్క గుణాలు కూడా స్పృశించలేవు.
కోర్కెలు ఈడేరటం వల్ల కలిగే సుఖం, స్వర్గంలో లభించే సుఖం ఈ రెండు సుఖాలూ పోల్చిచూసినపుడు కోరికను త్యజించటం వల్ల కలిగే సుఖం ముందు దిగదుడుపే. కాబట్టి కోరికను శత్రువువలె చంపి, బ్రహ్మలోకం చేరుతాను అన్నాడు. కోడెలు హఠాత్తుగా మరణించగా మంకికి ధనాశమీద విరక్తి కలిగి, కామాన్ని మోత్తంగా పరిత్యజించి, సుఖంగా దేవసమానంగా జీవించాడని భీష్ముడు బోధించాడు. ఆ కాలంలో అన్ని వర్గాల వారికి పశుసంపదే ప్రధానమైన ధనం. అందులో రెండు కోడెలను పెంచుకోవడం అనేది గొప్ప ధనవంతుడు అని తెలియజేస్తుంది. వాటిని కొనడానికి, పెంచడానికి, తీర్చి దిద్దడానికి ఎంతో శ్రమ, కాలం, మనసు వెచ్చించి ఉంటాడు. అవే సర్వస్వంగా బ్రతికి ఉంటాడు. మమకారం పెంచుకుని ఉంటాడు. కాని అవి ఒక్క క్షణంలో విగత జీవులు అయ్యాయి. ఏది ఎవరి దగ్గర ఎంతకాలం ఉంటుంది అనేది ఎవరిచేతుల్లో లేనివిషయం. ఇక్కడ ధనాన్ని కోడెల రూపంలో చూపించాడు. కాని ఏదైనా సంపాదించుకోవల్సిందే, కొన్ని రోజులకి అకాలంగానో, సకాలంగానో పోగొట్టుకోవల్సిందే. ఈ కథలో కోడలు చనిపోవడం సహజమే. వాటిని పోగొట్టుకోవడం వల్ల నేర్చుకున్న విషయాలు గమనించ దగినవి. ధర్మరాజు ‘‘ఎలాసుఖపడుతారు?’’ అని అడిగిన ప్రశ్నలో మామూలుగా అయితే సుఖపడే అవకాశం లేదు. కాని ఇంకే విధంగానైన సుఖపడుతారా? అని అర్థం ధ్వనిస్తుంది. భీష్ముడు పలికిన మొదటి వాక్యంలో ధనదాహంలో ఉన్నంత కాలం సుఖపడలేదు. విరక్తులు అయితేనే అది సాధ్యం అని తేల్చేసారు. ఈ ఒక వాక్యం చాలు. అయినప్పటికీ మరో కథ ఆధారంగా వివరించాడు. ధనం మీద వ్యామోహాన్ని పెంచుకుని, దానిని పెంచుకోవడం అనేది తనను తాను దుఃఖానికి గురిచేస్తున్నాడని అనుకోవాలి. సుఖంగా ఉండాలంటే జీవనానికి సరిపోయేంత ధనం సంపాదించు కోవడం మంచింది. ధనం ఎక్కువ సంపాదించుకోవాలనుకోవడం కోరిక. సంకల్పం వల్ల కోరికలు కలుగుతాయి. వీటివల్లనే నచ్చినదానిని, మనసు పడ్డదానిని సాధించుకోవడానికి, తర్వాత దానిని పెంచుకోవడానికి, రక్షించుకోవడానికి పడే ప్రయాస దుఃఖప్రాయమైనది. ముందుగా కోరికలను అరికట్టడం వల్ల కోపం, లోభం, దమం, శమం మొదలైనవి అన్ని వారి చెప్పుచేతుల్లో ఉంటాయి. వీటి తర్వాత పొందే సుఖం స్వర్గ సుఖం కంటే కూడా గొప్పది. ఈ విషయాన్ని నారాయణకవి హితోపదేశం ఇలా తెలియజేస్తుంది. ‘‘ధనం తావదసులభం, లబ్ధం కృచ్ఛ్రేణ రక్ష్యతే లబ్ధనాశో తథా మృత్యుః, తస్మా దేత న్న చింతయేత్‌’’ (హితోపదేశం. నారాయణకవి. 1178)
ధన సంపాదనం చాల కష్టం. సంపాదించిన దానిని రక్షించుట మరీ కష్టం. లభించిన ధనం పోనూవచ్చు, లేదా తానే మృతి నొందను వచ్చు. గాన ధనాన్ని గూర్చి అంతగా వ్యసనపడుట మంచిది కాదు అని భావం. తాను అనుభవించని దాని కోసం జీవితాంత శ్రమించి, పోగుచేసి, కాపలిదారుగా ఉండి కష్టాలు పడడం ఎందుకు?
అర్థమ యనర్థ మూలం
బర్థమ మాయా విమోహనావహము, నరుం
డర్థార్జన దుఃఖమున న
పార్థీకృత జన్ముడగుట పరమార్థ మిలన్‌
(అరణ్య.1.28)
అరణ్యవాసం కాలంలో శౌనకుడు పాండవుల వద్దకు వచ్చి నీతిబోధ చేస్తు చెప్పిన పద్యం ఇది. లోకంలో అన్ని అనర్థాలకు ధనమే మూలం. మాయా మోహాలకు డబ్బే కారణం. మనిషి ధనార్జనలో పడి దుఃఖీభూతుడై వ్యర్థ జన్ముడౌతున్నాడు అని తెలియజేస్తుంది. ఈ విషయం గురించి మంచన కేయూరబాహు చరిత్రలో ‘‘పసిడి మీద నాస పాఱిన మనుజుండు / తనకు వచ్చుకీడు తలప గలడె…’’ (మంచన.కేయూర.Iప.78) ఇలా ఎన్నిటిని తిరిగేసిన అన్ని బోధించేది ఒకటే. ధనం మీద అత్యాశ మంచిది కాదు. అందువల్ల ధనదాహంతో ఉన్నవాడు ఎప్పుడు సుఖపడలేడు అని తెలుసుకోవచ్చు.
ఆయమేవ పరో ధర్మః, ఇయమేవ విదగ్ధతా
ఇద మేవ హి పాండిత్యం, యదాయాన్నాధికో వ్యయః (విష్ణుస్మృతి)
ఆదాయాన్ని మించి వెచ్చించకూడదు అనేదే పరమధర్మం, అదియే గొప్ప పాండిత్యం, జ్ఞానం కూడాను. దీనిని పాటించినవాడు జీవితంలో దుఃఖం నొందడు.
ఙ ఙ ఙ ఙ ఙ
ప్రశ్న: ‘‘వారివల్లనో, ఇతరులవల్లనో సంపదను కోల్పోయి అగచాట్లు పడేవారు వారి బాధను ఎలా దిగమింగుకోవాలి?’’ (శాంతి.3.26)
కోసలదేశపు రాజు క్షేమదర్శి విదేహదేశపు రాజు చేతిలో రాజ్యాన్ని కోల్పోయి చాలా బాధలు పడ్డాడు. అతని దగ్గర పూర్వం మంత్రిగా చేసి ప్రస్తుతం అడవులలో బతుకుతున్న కాలకవృక్షీయుడి దగ్గరకు వెళ్ళి తలదాచుకున్నాడు. ఆ రాజు కాలకవృక్షీయుడిని ఇట్లాంటి ప్రశ్ననే అడిగాడు. అతడు చెప్పిన మాటలు తెలియజేస్తాను అని భీష్ముడు సమాధానం చెప్పడం మొదలు పెట్టాడు.
సమస్త సుఖాలు అనుభవించేటప్పుడు డబ్బు ఎప్పుడు అట్లాగే ఉండదు. అది అనిత్యమైనది. దానికి నేను బానిసను కాకూడదు’ అని అనుకునే వారికి డబ్బు ఉన్నా పోయినా చీకూ చింతా ఉండదు. ఒకొక్కపుడు కాదేమో అనుకున్న పని సులభంగా నెరవేరుతుంది. అయిపోతుంది అనుకున్న పని కాకపోవచ్చు. పని ఫలిస్తే సంతోషం, ఫలించకపోతే విచారం. విజ్ఞానులు ఈ రెండిరటిని ఒకేలాగ చూస్తారు.
జననీ జనకులును సుహృ
జ్జనులును దెగునపుడు గావఁ జనమి దెలియదే
ధనములు వారలకంటెనె
మనుజేశ్వర! వగపు వాని మగిడిరచునొకో!
(శాంతి.3.29)
తల్లిదండ్రులను, ఆప్తులను కాపాడుకోలేని మనిషి ధనాన్ని ఎలా కాపాడుకోగలడు? ఇది కూడా అశాశ్వతమైనదే. ఉపాయం కలిగినవారు, బలంగలవారు లోకంలో చాలామంది ఉన్నారు. ఎట్లాంటివారికైనా సిరి శాశ్వతంగా లేదు. ధీరుడైనవారు ధనం పోయినా దుఃఖపడరు. అనుకోకుండానే సిరి పోతుంది. అలాగే కోరకుండానే సంపద వచ్చి పడుతుంది. మనిషిని సిరి వదిలేస్తుంది. సిరిని మనిషి వదిలేస్తాడు. ఇందులో వింతేమిలేదు. ఇట్లాంటి సమయంలో మనిషి ఫలితాన్ని కోరుకుంటూ మాట్లాడకుండా మౌనంగా ఉండడం సరైనపని.
గతమునకును వగవ కనా
గతమునకును నోరుదెఱచి కడుఁ గోరక దీ
నతఁబొందక దైవం బే
గతిఁ బుచ్చిన దానఁ బోదుఁగా కనవలయున్‌
(శాంతి.3.30)
అయిపోయిన దానిని గూర్చి విచారించి ప్రయోజనం లేదు. కాబోయే వాటిని గూర్చి ఆశ పనికి రాదు. దైన్యాన్ని దరిదాపులకు రానీయరాదు. దైవం ఎట్లా నడిపిస్తే అట్లా నడవక తప్పదు అనే నిశ్చయానికి రావాలి అని భీష్ముడి సమాధానం.
ఈ ప్రశ్న ఇప్పటి సమాజానికి చాలా అవసరయోగ్యమైంది. ఐశ్వర్యవంతులగా జీవించిన వారు ఏవేవో కారణాల వల్ల ధనాన్ని కోల్పోగానే మనస్తాపం చెంది ఆత్మహత్యలకు గురవుతున్నారు. ధన సంపాదనకు ప్రయత్నించి విఫలుడైనవారి కంటే సఫలుడై కొంత కాలానికి అది కోల్పోయినవారే భరించలేని బాధకు గురవుతారు. డబ్బు అశాశ్వతమైనదనే సత్యాన్ని కూడా తెలుసుకోలేక పోతారు. ఈ సమాధానంలో భీష్ముడు చక్కని ఉదాహరణ ఇచ్చాడు. డబ్బు సంపాదించుకోవడం తనను, తనవారిని సుఖపెట్టడం కోసం, రక్షించుకోవడం కోసం. అంటే డబ్బుకంటే తను అయినా తనవారైన గొప్పవారే. స్వయాన తల్లిదండ్రులను, ఆప్తులను కాపాడుకోలేని వారు, డబ్బును ఎలా కాపాడుకోగలడు. ఎన్నిరకాల బలాలు కలిగిన వారైనా ధనాన్ని కాపాడుకోలేరు. డబ్బురావడం పోవడం మనిషి చేతిలో లేనిపని. ఈ విషయాన్ని పంచతంత్రం శ్లోకం చిన్నప్పటినుండి అందరి బోధిస్తూనే ఉంది.
ఆజగామి యదా లక్ష్మీః నారికేళఫలాంబువత్‌
నిర్జగామ యదా లక్ష్మీః గజభుక్తకపిత్థవత్‌ (పంచ.సూ.ము.153)
కొబ్బరికాయలో నీళ్ళమాదిరి ధనం ఎలా వస్తుందో ఎవరికి తెలియదు. ఏనుగు మింగి వదిలిన ఎలగకాయలో మాయమైన గుజ్జుమాదిరి ఏవిధంగా మాయమైపోతుందో కూడా ఎవరికీ తెలియదు. కొన్ని పనులు నెరవేరడం వల్ల డబ్బు వస్తుంది అనుకుంటారు కాని, రాదు. కొన్నిపనుల చేయడం వల్ల ధనం రాదు అనుకుంటారు కాని, ఊహించనంతగా వస్తుంది. ధనం రావడం కూడా మనిషి చేతిలో లేనప్పుడు, పోకుండా ఉండాలనుకోవడం దురాశ.
చివరగా శ్రీకాలహస్తీశ్వర శతక పద్యంతో ముగిద్దాం.
తరగల్‌ పిప్పల పత్రముల్‌ మెఱుగుటద్దంబుల్‌ మరుద్దీపముల్‌
కరికర్ణాంతము లెండమావులతతుల్‌ ఖద్యోత కీట ప్రభల్‌
సురవీధీ లిఖితాక్షరంబు లసువుల్‌ జ్యోత్స్నా పయః పిండముల్‌
సిరులందేల మదాంధులౌదురు జనుల్‌ శ్రీకాళహస్తీశ్వరా!


ఆధార గ్రంథాలు :

  1. అప్పలస్వామి, పురిపండా. ‘వ్యావహారికాంధ్ర మహాభారతం’ (శాంతి పర్వము). 1976. రాజమండ్రి: ప్రాచీన గ్రంథావళి.
  2. రామకృష్ణమూర్తి, తిప్పాభట్ల. శ్రీనివాసులు, సూరం. సంపా. ‘శ్రీమహాభారతము’ (అన్ని పర్వాలు, 7 సంపుటాలు). 2018. గోరఖ్‌పూర్‌: గీతాప్రెస్‌.
  3. విశ్వేశ్వర శాస్త్రి, జన్నాభట్ల. సంపా. ‘మహాభారత వైజయంతి’ (తొమ్మిది సంపుటాలు). 2006. గుంటూరు : భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌.
  4. వెంకటరత్నం, గుంజి. ‘మహాభారత విజ్ఞాన సర్వస్వం’ 2021. హైదరాబాదు : ఎమెస్కో.
  5. సుబ్రహ్మణ్యం, జి.వి. సంపా. ‘కవిత్రయ విరచిత శ్రీమదాంధ్ర మహాభారతము’ (అన్ని పర్వాలు, 15 సంపుటాలు). 2014. తిరుపతి: తి.తి.దే.
  6. హనుమంతరాయ శర్మ, బలభద్రపాత్రుని. ‘మహాభారత విమర్శనము’ (రెండు సంపుటాలు). 1996. గుంటూరు: భారతీ ధార్మిక విజ్ఞాన పరిషత్‌.

డా. అట్టెం దత్తయ్య
సహాయాచార్యులు, ఎస్వీ కళాశాల,
డిల్లీ విశ్వవిద్యాలయం.
ఫోన్‌ : 9494715445

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *