అంటు


ఏవైనా రెండు లేదా అంతకన్నా ఎక్కువ విషయాల సంగమానికి ‘అంటు’ అని తెలుగులో పలకడం మన భాషా సంప్రదాయం. మొక్కలకు అంటు కట్టడం అనే పదం వింటుంటాం. ఏవైనా ద్రవాలు లేదా అంటుకునే పదార్థాలు, ఆహార పదార్థాలు చేతిని, శరీరాన్ని పట్టుకుంటే దానిని ‘అంటు’ అంటాం. అంటుపెట్టడం, అంటుకోవడం, అంట్లు, అంటరానితనం, అంటువ్యాధులు మొదలైన పదాలు నిత్యజీవితంలో వినిపించే మాటలే. ఒకరినుండి మరొకరికి సంక్రమించే వ్యాధులను అంటువ్యాధులని అంటారు. అంటు విధానం అనేక రూపాల్లో మనకు కనిపిస్తుంది.
శరీరానికి అంటుకోవడం, మనస్సుకు అంటుకోవడం అనే అంశాలను మనం ఒకసారి పరిశీలిస్తే.. బాహ్య శరీరానికి అంటుకునే వానిని శుద్ధం చేసుకోవడం సులభం అవుతుంది. దానిలోనూ కొంత జాగ్రత్త అవసరం. అంటుకున్నది వాతావరణంలోని ‘దుమ్ము’, ‘మట్టి’ అయితే చిన్న ప్రయత్నంతోనో, ఊదడం వల్లనో అంటు వదులుతుంది. అదే శరీరానికి బురద అంటుకుంటే కడగడానికి కొంత సమయం పడుతుంది. ఇంకా నూనె అంటుకోవడం, రంగులు అంటుకోవడం ద్వారా శుద్ధి చేసుకోవడానికి సమయం అధికమవుతుంది. వేరు వేరు సబ్బులు, లిక్విడ్స్‌ను ఉపయోగించి మాత్రమే ఈ అంటును వదిలించుకోవాలి.
శరీరానికి అంటుకునే మట్టి, నూనె మొదలైన వానిని శుద్ధి చేసుకోవడానికి, ఇంట్లోని వేరు వేరు వస్తువులకు, నేలకు అంటుకునే మలినాలను శ్రద్ధతో వెంటవెంటనే శుద్ధం చేసుకోవడానికి వేరు వేరు మార్గాలుంటాయి. మరి వేరు వేరు విషయాలు మనని ఆలోచింపజేస్తుంటాయి కదా! అవి మన మనస్సును అంటుకుంటాయి. మన చుట్టూ ఉండే చుట్టాలు, బంధంతో కూడుకున్న బంధువులు, బంధనాలు, ఉద్యోగాలు, మిత్రులు, విషయాలు మనని బాగా అంటుకుంటూనే ఉంటాయి. ఇవి అంటుకోకుండా ఉండాలన్నా, అంటుకున్నవి వదిలించుకోవాలన్నా కొంత జ్ఞానం కావాలి. ప్రయత్నమూ తీవ్రం కావాలి. దాన ధర్మాదులు పెరగాలి. జ్ఞానంతోనే అంటుకోకుండా ఉండడానికి తగిన ప్రయత్నం జరుగుతుంది. ఒకసారి అంటుకుంటే మాత్రం దాని బరువు పెరుగుతుంది, అది శుద్ధమైనంతవరకు ఈ లోకంలోకి రావడం, పోవడం తప్పనిసరి అవుతుంది. చూసిన, విన్న, రుచి చూసిన అంశాలతో పాటు, వేరే వాళ్ళు చెప్పడం ద్వారా కొన్ని అంశాలు మన మనస్సును అంటుకుంటాయి. బలీయమైన అంశాలు మనస్సును అంటుకుంటుంటే మానవుని ప్రగతి చాల కుంటుబడుతుంది. భయం, ద్వేషం, కోసం మొదలైన అంశాలన్నీ ఈ అంటుల వల్లనే ఏర్పడుతుంటాయి. ఆ భావాలుగా మనం తయారు అవుతుంటాం.
అంటిన అంట్లను వదిలించుకోవడానికే మనం ఈ లోకానికి వచ్చింది. ఎన్నో బంధాలు, అంట్లు మనం ఈ లోకానికి కట్టుకొని వస్తున్నాం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్నదమ్ములు, బంధువులు, ఉద్యోగాదులు అన్నీ కూడా ఆ అంట్లలోని భాగాలి. వాటిని వదిలించుకోవాలంటే నొప్పి తప్పదు. వాటి గూర్చిన తగిన అవగాహన, జ్ఞానం వస్తే చైతన్యం లాగా, ఆత్మ లాగా నిరంతరం శక్తిగా మారే అవకాశం కలుగుతుంది. మనకు వచ్చే ఆలోచనలన్నీ దాదాపుగా అంటు విషయాలే. శ్రమతో వాటిని దూరం చేసుకోవాలి. ఆలోచనలు అధికంగా చేయకుండా బహుముఖ ఆలోచనలను, ఏకముఖంగా మార్చుకోవడానికి నిరంతర జపధ్యానాదుల అవసరం ఉంటుంది. అంటు వదిలించుకోవడమే శుద్ధి. దేహానికైనా, మనస్సుకైనా. అంటు వదిలిన మనస్సునే చైతన్యం అంటాం. ఏ అంటూ లేని మనస్సే పూర్ణ శక్తి. ఆ శక్తి స్వరూపంగా నిరంతరం చేసేదే ప్రయత్నం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *