‘‘విశ్వగుణాదర్శ చంపూ’’ అనే చంపూకావ్యం సంస్కృత సాహిత్యంలో వెలువడిన విలక్షణమైన కావ్యం. నాణానికి రెండు వైపులున్నట్లే ప్రతీ విషయాన్ని రెండు రకాలుగా చూడవచ్చని తెలియచెప్పే కావ్యమిది. ఈ కావ్యాన్ని సంస్కృతకవి శ్రీ వేంకటాధ్వరి రచించారు. ఈయన గురించి ఎక్కువగా ఎక్కడా తెలియరావడంలేదు. కానీ ఈ చంపూ కావ్యం పరిచయ శ్లోకాల్లో స్వయంగా తనగురించి కొంత చెప్పుకున్నారు కావ్యకర్త. ‘‘కాంచీ మండల మండనస్య మఖిన: కర్నాటభూభృద్గురో స్తాతార్యస్య దిగంతకాంత యశసే యం భాగినేయం విదు: ఆస్తోకాధ్వర కర్తురప్పయ గురోరస్యై విద్వన్మణో: । పుత్ర: శ్రీ రఘునాథ దీక్షిత కవి: పూర్ణో గుణైరేధతౌ ॥ తత్సుత స్తర్క వేదాంత తంత్ర వ్యాకృతి చింతక: వ్యక్తం విశ్వగుణాదర్శం విద్యతే వేంకటాధ్వరీ॥ శ్రీ వేంకటాధ్వర కాంచీపురం సమీపంలోని అరసానిపాలైలో జన్మించారు. ఈయన శ్రీవైష్ణవ కుటుంబంలో పుట్టి, రామానుజ సంప్రదాయానికి చెందిన గొప్ప దార్శనిక పండితుడు. వేంకటాధ్వరి ఈ శ్లోకాలలో తన పూర్వీకుల గురించి చెప్పుకున్నారు. కర్ణాట భూమిని పాలిస్తున్న కృష్ణరాయ యొక్క గురువు తాతాచార్యుల మేనల్లుడు, విద్వన్మణి అయిన అప్పయదీక్షితులు. అప్పయదీక్షితుల కుమారుడ మహాపండితుడైన రఘునాథ దీక్షితులు. ఇతని కుమారుడు తర్కం, వేదాంతం, తంత్రం మీమాంస, వ్యాకరణాల్లో పూర్తి జ్ఞానం ఉన్న శ్రీ వేంకటాధ్వరి. వీరి తల్లి సీతాంబ. వేంకటాధ్వరి నీలకంఠ దీక్షితుల సమకాలికుడుగా చెప్తారు. కాబట్టి ఈయన కాలం క్రీ.శ. 17వ శతాబ్దిగా పండితులు నిర్ణయించారు. శ్రీ వేంకటాధ్వరి మొత్తం 14 కృతులను రచించినట్లు తెలుస్తుంది. వాటిలో శ్రీ రాఘవ యాదవీయం, లక్ష్మీ సహస్రం, విశ్వగుణాదర్శ చంపూ అనేవి లభిస్తున్నాయి. ఇంకా హస్తగిరి చంపూ, యాదవ పాండవీయం, సుభాషిత కౌస్తుభ అనే గ్రంథాలను కూడా రచించినట్లు తెలుస్తుంది. వీరు రచించిన శ్రీ రాఘవ యాదవీయం విలోమ కావ్యం. దీన్ని 30 శ్లోకాల్లో రచించారు. ఇందులోని శ్లోకాలను ముందునుండి చదివితే రామాయణ కథ, వెనకనుండి చదివితే శ్రీకృష్ణుని పారిజాతాపహరణ కథ అవగతమౌతుంది. అనులోమ విలోమ పద్ధతిలో రాయబడిన ఈ కావ్యం వీరి పాండత్యానికి నిదర్శనంగా నిలుస్తుంది. రాఘవ యాదవీయం రచించిన తర్వాత వీరి చూపు మందగించి అంధుడయ్యాడని, తర్వాత లక్ష్మీదేవిని స్తుతిస్తూ లక్ష్మీ సహస్రం చెప్పిన తర్వాత తిరిగి చూపు వచ్చిందని చెప్తారు. ఇట్లా ఎన్నో అద్భుత రచనలు చేశారు వేంకటాధ్వరి. వీరు రచించిన ‘విశ్వగుణాదర్శ చంపూ’ అనేది చంపూకావ్యం. చంపూకావ్యమంటే గద్యం మరియు పద్యం యొక్క మిశ్రమం. ‘‘చంపయతి యోజయతి ఇతి చంపూ’ అనే వ్యుత్పత్తి అర్థం ఉంది. ‘గద్యపద్యమయీ కావ్యం చంపూరిత్యభిధీయతే’ అనేది చంపూకావ్య లక్షణం. విశ్వగుణాదర్శ చంపూ కావ్యంలో విషయానికి అంత ప్రాధాన్యత ఉండదు. బాహ్య సౌందర్యానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వడం జరిగింది. స్వతంత్ర కల్పనలు అధికంగా ఉన్నాయి. ఈ కావ్యంలో కృశాను, విశ్వావసు అనే ఇద్దరు గంధర్వులు విశ్వం యొక్క గుణాలను వివరిస్తుంటారు. అందుకే ఈ కావ్యానికి ‘విశ్వగుణాదర్శ చంపూ’ అనే పేరు పెట్టారు. ఇందులో గంధర్వులిద్దరూ కలిసి విమానంలో తిరుగుతూ అనేక దేశాలు, నదులు, నగరాలు, పవిత్ర స్థలాలు, మార్గాలు, ప్రజల ఆవాసాలు, వారి ప్రవర్తన, జీవన విధానం, మానసిక స్థితిగతులను వివరిస్తూ ప్రతి విషయాన్ని రెండు కోణాల్లో చూపించారు. ఈ కావ్యం ఎక్కువభాగం పద్యరూపంలో ఉంది. ఇందులో ఒక్కో ప్రదేశం ఒక్కో వర్ణన, ఒక్కో విభాగంగా విభజించబడిరది. ఈ చంపూకావ్యంలో 30 ప్రదేశాలు, ప్రజల గురించి వర్ణన చేయబడిరది. మొదటగా సూర్ణ వర్ణనంతో మొదలుపెట్టి వరుసగా భూలోక వర్ణనం, బదరికాశ్రమం, అయోధ్యా నగరం, గంగానదీ, కాశీ, సముద్రం, జగన్నాథక్షేత్రం, గుర్జర దేశం, యమునా నదీ, మహారాష్ట్ర, ఆంధ్రదేశం, కర్ణాటక, వేంకటగిరి, వన వర్ణనం, ఘటికాచలం, వీక్షారణ్యం, శ్రీరామానుజ వర్ణనం, చెన్నపట్టణం (మద్రాస్), కాంచీ వర్ణనం, శ్రీమద్వేదాంత దేశికాచార్య వర్ణనం, కామాసికా నగర నృసింహ వర్ణనం, శ్రీ త్రివిక్రమ వర్ణనం, శ్రీ కామాక్షీదేవి, శ్రీమత్ కామేశ్వర వర్ణనం, క్షీరనదీ వర్ణనం, బాహానది, తుండీర మండం, చించీపురీ (తంజావూరు), పినాకినీ గరుడ శ్రీ దేవనాయక వర్ణనం చేయబడినవి. ఈ కావ్యంలో ప్రదేశాలను వర్ణించే కృశాను, విశ్వావసు అనే గంధర్వులలో కృశాను అన్ని విషయాల్లో, ప్రదేశాల్లో, ప్రజల్లో తప్పులు వెతకడం, వాటిని హేళన చేయడం, దీనిలో ఏం గొప్ప ఉంది అని తక్కువ చేసి మాట్లాడేవాడు. కానీ విశ్వావసు కృశానుకు పూర్తిగా వ్యతిరేకం. అతను అన్నింటిలోను మంచిని చూస్తూ అనుకూలంగా మాట్లాడేవాడు. కృశాను చెప్పేవాటికి వ్యతిరేకంగా సమాధాన మిచ్చేవాడు. కొన్ని విషయాలో అతనితో అంగీకరించినా చాలావరకు నిజాలు చెప్పి వివరించేవాడు ఉదాహరణకు
భూలోక వర్ణనం
గంధర్వులిద్దరూ (కృశాను, విశ్వావసు) సంచరిస్తూ భూలోకానికి వస్తారు. అప్పుడు విశ్వావసు ‘‘మిత్రమా! అన్ని పురుషార్థాలకు అనుష్ఠాన సాధనమైన భూలోకాన్ని చూడు. ఇక్కడ నివసించే పురుషులు నిర్వహించే యజ్ఞాల వల్ల ఉత్పన్నమైన మధుర అమృతం దేవతలచే స్వీకరించబడుతుంది. వేదాల్లో చెప్పబడిన కళ్యాణ పురుషులు, దివ్యాశ్రమాలు, నదులతో కూడుకున్న భూదేవికి నేను నమస్కరిస్తున్నాను’’ అంటాడు. వెంటనే కృశాను ‘‘స్వర్గానికి వచ్చి కూడా భూలోకానికి నమస్కరించకు. ఎందుకంటే భూలోకంలో అందరూ జనన మరణ, మానసిక బాధలు, వ్యాథులు ఇంకా దుష్కర్మలతో లినంగా ఉంటారు. నీచ, అహంకారం కలిగి ఉన్న రాజులు పాలించే ధరిత్రిని స్వర్గంలో నివసించే ఏ బుద్ధిగల పురుషుడు కావాలని కోరుకుంటాడు? బాల్యం నుండి యవ్వనం, వృద్ధాప్యం, వృద్ధాప్యంలో మరనించి యమదూతల పాశానికి గురై అనేక రకాల పీడలు అనుభవిస్తారు. ఇన్ని కష్టాలతో కూడుకున్న జీవితం ఎవరికి సుఖంగా ఉంటుంది. ఏదైనా గ్రామంలో ఎద్దుకి నాగలి నాగడం నుండి విముక్తి ఉంటుందా?’’ అన్నాడు.
అప్పుడు విశ్వావసు ‘‘ఇది కూడా సరైనదే. అయినా మిత్రమా భూమిపై మానవ జన్మ దోషం అనకు. భూమిపై రావణ సంహారం చేసి కళ్యాణం చేకూర్చిన రాముడు మనుజుడే. దేవతాయుద్ధాలలో ఇంద్రునికి సహాయం చేసిన రాముని తండ్రి కూడా మానవుడే. నరరూపంలో ఇంద్రుని గర్వాన్ని అణచిన శ్రీకృష్ణుని గూర్చి వినలేదా? మనుషులు లేకుండా ఏ దేవుడూ లేదా దానవుడు ఉన్నతిని పొందారు? మాంధాత, సగరుడు, పురు, పురూరవుడు, శిబి, జనకుడు, నహుషుడు, యయాతి నలుడు, అర్జునుడు ఇలా చెప్తూ పోతే ఎంతోమంది ఉన్నారని అంటాడు. దానికి కృశాను ఇలా గుణవంతులు, పరాక్రమవంతులు కొంతమంది వేరే యుగాల్లో ఉన్నారు కానీ కలియుగంలో అటువంటి లక్షణాలు ఉన్నవారు ఒక్కరు కూడా లేరు. కామంతో, కలుషిత హృదయంతో, కోపంతో, విచక్షణ లేకుండా అహంకారంతో ఉంటారు. ఇక పూర్వజన్మ పాపాల వల్ల రాజలుగా మారినవారి ముఖాలు చూడడం కూడా దోషమే’’ అని అన్నాడు. విశ్వావసు దానికి సమాధానంగా ‘‘దీనికి కూడా నీవు మనుష్యులకు దోషం అంటగట్టడం సరికాదు. ఎందుకంటే అన్ని యుగాల్లోనూ మంచివారు ఉంటారు. పాపాలు కూడి ఉన్న రాజులు కూడా ఉంటారు. వారే కమల నయనుడి స్వేచ్ఛా విహారం కోసం మందిరాలు నిర్మించాడ. వేదమార్గాలను రక్షించడానికి పుట్టినవారిలో కలియుగంలో కూడా చాలామంది ఉన్నారు. ఒకవేళ నీకు నా మాటలపై నమ్మకం లేకపోతే మనం స్వయంగా ఆ పుణ్యక్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని వద్దామంటాడు. వెంటనే వారిరువురు భూలోక పర్యటనను మొదలుపెడతారు.
బదరికాశ్రమ వర్ణనం
విమానంలో వెళ్తూ విశ్వాసు, కృశానుడికి తన వేలితో ప్రదేశాలను చూపిస్తూ ‘‘ఇది బదరీకాశ్రమం. ఇక్కడ తమ అజ్ఞానాన్ని దూరం చేసుకోవాలని చాలామంది నారాయణుడి కొరకు తపస్సు చేస్తారు. ఇక్కడ నివాసముండే ప్రజలు ప్రకాశవవంతమైన బుద్ధిని కలిగి, దుష్టహర్తా, శిష్టకర్తా అయిన నారాయణుడిని పగలు రాత్రి పూజిస్తారు’’ అని చెప్తుంటే మధ్యలోనే కృశాను ‘‘మిత్రమా ఈ గుణాల వివరణ, వాటి సమర్థన నాకు నచ్చలేదు. ఎందుకంటే స్నానం చేయడానికి భయపడే మనుషులు నిర్మలమైన కర్మలు ఎలా చేయగలుగుతారు’’ అని అంటాడు. దానికి విశ్వావసు ‘నీవు చెప్పిన మాటలతో నేను ఏకీభవిస్తున్నా. చాలా మంచు ఉండడం వల్ల శాంతియుతులు, జ్ఞానులు మాత్రమే ఇక్కడికి ఎక్కువగా వస్తారు. ఇక్కడ స్నానం చేయడం వల్ల రోగగ్రస్థులు కూడా నారాయణుని అనుగ్రహం వల్ల తమ రోగాలనుండి విముక్తి పొందుతారు.
గంగానది వర్ణనం
ఆవిధంగా వారు తిరుగుతూ గంగానది దగ్గరకు వెళ్తారు. నదిని చూపిస్తూ విశ్వావసు ‘‘సంసారంలో ఉండే దు:ఖాలను నాశనం చేసేది, విష్ణు చరణాలను అలంకరించేది, విపత్తులను నివారించేది స్వచ్ఛమైన అలలు కలిగినది, విశాలమైన సముద్రానికి తోడు కలది, సర్వ పాపాలను తొలగింపచేసే ఈ గంగానదిని చూడు’’ అని అంటాడు. కృశాను ‘‘గంగానది జలం నిర్లక్ష్యం చేయదగినవి అంటారు. నీవు ఎందుకు వాటిని చూడమంటున్నావు? హిరణ్యకశిపుని ప్రాణాలను హరించిన విష్ణువు చరణాల నుండి వచ్చిన గంగ బ్రహ్మదేవుని యొక్క శిరస్సును ఖండిరచిన శివుని తలపై ఉన్న చంద్రుని సహవాసి అయి సముద్రంలో కలిసి పోతుంది. దీన్ని నీవు కీర్తి అంటున్నావా? అని అన్నాడు.
విశ్వావసు ‘‘శాంతించు!’’ ఆవిధమైన మాటలు పాపం కలిగిస్తాయి! విష్ణుచరణాలనుండి వచ్చే గంగ శివుని స్పర్శించి పవిత్రమై, సగరుని వారసులకు మోక్షప్రాప్తిని అందించింది. దీనికంటే పవిత్రమైంది వేరొకటి లేదు. అటువంటి గంగను నీవు నిందిస్తావా? సరస్వతీ నదిచే ఆలింగనం చేయబడిన, సూర్యపుత్రి అయిన యమునకు తోడుగా ప్రవహించే గంగ సత్త్వ రజస్తమో గుణాలను కలిగిన ప్రకృతి వలె కనిపిస్తుంది. అన్ని దోషాలను దూరంచేసే సామర్థ్యం కలిగిన గంగానది విశాలమైన ప్రపంచాన్ని శాంతపరుస్తుంది’ అని చెప్పి నమస్కరిస్తాడు.
సముద్ర వర్ణనం
అట్లా విమానంలో ప్రయాణం చేస్తుండగా దూరం నుండి చేతులు జోడిస్తూ విశ్వావసు ‘‘లోక వినాశనం వలన, ఇంద్రుని వజ్రాయుధం వల్ల భయభీతుడైన మైనాకుని ప్రాణాలను రక్షించినవాడు, స్థిరమైన కీర్తి కలవాడు, నృత్యం చేస్తున్నట్టుగా ఉండే అలలు కలిగినవాడు, పూజ్యనీయుడైన మహాసముద్రునికి నా నమస్కారాలు’’ అని అన్నాడు. అది చూసి నవ్వుతూ కృశాను ‘‘అజ్ఞానులైనవారు కూడా తాగడానికి అనర్హుడైనవాడు, నీళ్ళలో నివసించే జీవులకు ఆశ్రయుడైన సముద్రునికి కూడా నాచేత నమస్కారం చేయించాలనుకుంటున్నావా? ఎందుకిలా చేస్తున్నావు? నాకైతే కఠోరమైన గర్జన చేసే సముద్రుడ్ని చూస్తే కోపం వస్తుంది. మహాజలరాశిని కలిగి ఉన్నవాడు, జఠరాగ్ని వలె తనలో బడబానలాన్ని దాచుకునేవాడు, ఎప్పుడూ గర్జిస్తూ అహంకారం కలిగిన సముద్రుడిని చూస్తే క్రోధం కలుగుతుంది. రత్నాలవంటి సంపద కలిగి ఉన్నా, అత్యంత లోభి అవ్వడం వల్ల బుద్ధిమంతుల ఆదరణ పొందలేకపోయాడు. ఈ సముద్రంలో రత్నాలు, బంగారం కోకొల్లలుగా దొరుకుతాయి. నావలతో నిండి ఉన్నా వాటి వల్ల ఉపాధిని పొందలేము. నా దృష్టిలో దీని నిర్మాణమే వ్యర్థం. దీని ఒడ్డున ఉన్న వృక్షాల వల్ల ఎట్లాంటి ఉపయోగం లేదు. కనీసం ఈ నీరు స్నానానికి కూడా పనికి రావు’’ అని అన్నాడు.
దానికి విశ్వావసు ‘‘శ్రమ లేకుండా వచ్చిన సంపత్తిని తగిన విధంగా ఉపయోగించకపోతే, లక్ష్మీ (సీత) కావాలనే కోరికతో ఉంటే వారు గడ్డిపోచతో పోల్చబడి శ్రీరామునిచే బంధింపబడతాడు. ఈ విషయానికి సముద్రుడే సాక్ష్యం. అన్ని గుణాలు కలిగిన నదీపతిని నిందించకు మిత్రమా! ఈ సముద్రం ఇంద్రునికి ఉచ్ఛైశ్రవాన్ని అందించింది. చంద్రుడు పుట్టింది కూడా ఇక్కడే. ఈ సముద్రం దేవతలకు కల్పవృక్షం, కామధేనువు, లక్ష్మీదేవి లను అందించింది. ఇంతకంటే ఉదార స్వభావుడు ఎక్కడ ఉంటాడు’ అని అడుగుతూ విమానాన్ని మరోవైపు మళ్ళించాడు.
కాశీనగర వర్ణనం
‘‘స్వర్గలోకాన్ని తాకుతున్నట్లుగా ఉన్న ఎత్తయిన భవనాలు, గుర్రాలు, ఏనుగులతో నిండిన కాశీనగరం మహాదేవుని శిరస్సుపై ఉన్న చంద్ర కిరణాలతో శూన్యంనుండి వెలుగులోకి ప్రయాణిస్తు న్నట్లుగా ఉంది’’ అని విశ్వావసు అంటుండగా కృషాను మధ్యలోనే ‘‘మిత్రమా ఇది కూడా ప్రశస్తనీయమైన స్థలమేనా? ఈ కాశీలో ఒక రకరకాల రసాలతో భోజనం తినేవారు, గుర్రాలు, ఏనుగులపై స్వారీ చేసేవారు, ముత్యాల మాలలను ధరించేవారు, పెద్ద భవనాలలో యవ్వన స్త్రీలు ఉండగా మరో పక్క అస్తిపంజిరాల్లా కనిపించే మనుషులు ఎద్దుల బండ్లపై తిరుగుతూ, విషాన్ని ఆహారంగా తీసుకుంటూ, స్మశానంలో నివసిస్తూ రాక్షసులతో నాట్యం చేస్తున్నవారు కూడా ఉన్నారు. ఓ కాశీ ఎప్పుడూ రోగాలతో (గంగా ప్రవాహం) ఉండే నీలో రోగం లేని (విష్ణు శంకరులతో కూడిన) భూమి కూడా ఉంది. ఇక్కడ నివసించేవారి శరీరం మరో జన్మలో కూడా రోగరగస్థంగానే ఉంటుంది’’ అని అంటుండగా విశ్వావసు ‘‘ఓ మందబుద్ధిగలవాడా గుణాన్ని కూడా దోషంగా ఎందుకు మారుస్తావు? ఇక్కడ నివసించే విలావసంతులకు, యోగులకు అందరికీ శివుని ఆశీర్వాదం ఉంటుంది. కాశీలో తమ అపవిత్ర శరీరాలను వదిలినవారు స్వచ్ఛమైన శరీరాన్ని కచ్చితంగా పొందుతారు. ఇది ఇక్కడ నివసించేవారి ప్రాముఖ్యత. ప్రతిరోజు ఉదయం గంగాజలంలో భక్తితో స్నానం నచేసి సంధ్యావందనం వంటి నిత్యకర్మలు ముగించుకుని శంకరునికి పూజలు చేసే నిర్మలమైన మనస్సు కలిగిన బ్రాహ్మణులకు నా నమస్కారాలు’’ అన్నాడు.
అప్పుడు కృశాను ‘‘కలి ప్రభావం చేత శాస్త్రీయ ఆచారాలకు దూరమైన గంగానదీతీరంలో నివసించే బ్రాహ్మణులను కూడా పూజిస్తావా?, కాశీవాసుల అనైతికతను చూడు. ఇక్కడి బ్రాహ్మణులు ఆయుధాల వల్ల జీవనోపాధిని పొందుతారు. శాస్త్రాలను వదిలేసారు. శూద్రులు తెచ్చిన నీటితో స్నానం, ఆచమనం చేస్తారు, దేవతలను కూడా అభిషేకిస్తారు. వండిన భోజనాన్ని వ్యర్థం చేయడానికి భయపడరు. అనేక రకాల నీచపు అలవాట్లతో ఉన్నారు. ఈ మూర్ఖులు గంగాస్నానం తర్వాత కూడా రజకులు ముట్టిన వస్త్రాలను ధరిస్తారు. ఎవరూ వేదాధ్యయనం చేయరు అంటూ… పలురకాలుగా కాశీలో నివసించే బ్రాహ్మణులను తూలనాడాడు.. అది విని భరించలేక విశ్వావసు ‘‘కృశాను! బ్రాహ్మణుల నింద విని నాకు కష్టంగా ఉంది, హృదయం కంపిస్తుంది. నువ్వేదైతే అన్నావో అది కలిదోషమే కాని బ్రాహ్మణదోషం కాదు. కలియుగంలో సత్యయుగ ప్రవర్తన ఏవిధంగా కుదురుతుంది? కలి నిజంగా ఓటమి లేనివాడు. ప్రపంచంలో ఉన్న ప్రాణులందరిలో ఏ ఒక్క వ్యక్తి వేదమార్గంలో నడిచినా, వేదాలతో నమ్మకంతో ఉన్నా ప్రశంసనీయమే కదా. ఎడారిలో చిన్న నీటి చెలిమె ఉన్నా అది ఆనందించదగ్గదే కదా. ఈ కాశీలో నివసించేవారు ఎన్ని అధర్మ కార్యాలను చేసినా ప్రపంచంలో వీరికి మించిన ధర్మవంతులు లేరు. ప్రాత:కాలంలో చల్లని నీటిలో స్నానం చేసి దేవతలకు యథావిధిగా పూజిస్తారు. గోమయంతో అలికిన స్థానంలోనే వంట వండుతారు, భుజిస్తారు. ఇంతటి శ్రేష్ఠమైన భోజన నియమం మరెక్కడైనా చూసావా?’’ అని అడుగుతూ తమ ప్రయాణాన్ని కొనసాగించారు.
ఈవిధంగా కావ్యమంతా కూడా కృశాను, విశ్వావసు అనే గంధర్వులు విశ్వమంతా తిరుగుతూ విశ్వం యొక్క గుణాలను వర్ణిస్తారు ఇందులోని ప్రదేశాలను కవి శ్రీ వేంకటాధ్వరి చాలా అద్భుతంగా వివరించారు. భూలోకంలో ఉన్న దాదాపు అన్ని ప్రదేశాల వివరాలు తెలియజేయడం జరిగింది. ఇవన్నీ ఒక వ్యక్తి సందర్శించడం అసాధ్యం. కానీ కవి ఆ ప్రదేశాలను అన్నిటినీ ప్రత్యక్షంగా చూసినట్టే వర్ణించారు. ఆ ప్రదేశాలను, అక్కడి అనుభూతులను, పరిస్థితులను అనుభవించిన విధంగా చాలా హృద్యంగా కావ్యరూపంలో వెలువరించారు.
ఇలా అన్ని ప్రదేశాలను గూర్చి వర్ణిస్తూ చంపూకావ్యం రచించడం చాలా అరుదు. ఇది ఒక యాత్రా చరిత్ర. ఇలాంటి రచన సంస్కృతంలో ఎవరూ చేసి ఉండలేదేమో. కవి కల్పించి రచించినప్పటికీ వాటిలో చాలా వరకు సత్యం గోచరిస్తుంది. వీరి రచనా శైలి పండితులకు మాత్రమే అర్థమయ్యేవిధంగా ఉంది. సామాన్యులకు అంత సులభంగా అర్థం కాదు కానీ ఈ కావ్యాన్ని చదవడం వల్ల ఎన్నో కొత్త విషయాలు తెలుస్తాయి. అన్ని ప్రదేశాల్లో ఉండే మంచి, చెడు అంశాలపై అవగాహన ఏర్పడుతుంది. ఈ చంపూకావ్యం శ్రీ వేంకటాధ్వరి కల్పనాశక్తికి, రచనాశక్తికి, పాండిత్యానికి నిదర్శనం.
సాగి తేజశ్రీ
ఫోన్ : 80082 80140