అదిగో క్రోధను పేరుతో భువికి రానే వచ్చె నీ వత్సరం
బిదిjైునం ఇసుమంత మంచితనమున్ బెంచెనో చూడన్వలెన్
ముదమారన్ ప్రభులెల్ల బుద్ధిమతులై మోదాన పాలించి, సం
పదలన్ బెంచుచు సౌఖ్యమిత్తురో కదా బాధించకన్బుద్ధితో
ఆకాశమ్మున సంచరించు గ్రహముల్ ఆనంద సంచారులై
చీకాకుల్ తెగదూడ్చి వైపరితముల్ ఛేదించి చిత్సౌఖ్యముల్
సాకారం బగునట్లు చేయగలవో సత్యమ్ములన్ బంచుచున్
రాకాచంద్ర ప్రశాంచతతల్ వెలయగా రాగమ్ములన్ పంచుచున్
కల్గును గాక సంపదలు కల్గును గాక సమస్త భోగముల్
కల్గును గాక మానవాళికి కల్గను ప్రేమలు కల్గు నెయ్యముల్
కల్గును ధర్మభావనలు కల్గగ జేయును క్రోధి రూపమున్
కల్గును విశ్వశాంతి ప్రజ కల్లలు లేకను సంచరించుగా!
ఆరు రుచులవి మనిషికి ఆశజంపి
స్వార్థ భావన వీడియు సత్యములతొ
ధనము ధనమను పేరుతో తనుకకుండ
బుద్ధి నిచ్చును గావుత సిద్ధి గూర్చి
సత్వ గుణములు మనిషికి సతము నిచ్చి
దానధర్మము జేసెడి జ్ఞానమిచ్చి
శాంత నడవడి నేర్పియు సంభ్రమముగ
దైవ చింతన నేర్పగ తరలు క్రోధి
పేరున క్రోధము లున్న న
పారములౌ శాంతి నింపి భారత భువినే
పేరున పెద్దగ జేయుమ
ధీరుండౌ రాజు నిమ్మ తేజమలరగాన్!
డా. జనమంచి విఠలేశ్వర శర్మ,
ఫోన్. 94928 29083