సాహితీప్రక్రియల్లో గానయోగ్యమైన వాటిలో గజల్ ‘‘ఒక కమనీయ కవితాలహరి, గులాబీల గుచ్చం’’. ఇది ఒక అరబీ పదం. ఎడారిలో పూలు పూయవని అందరికీ తెలుసు, కానీ గజల్ అనే వాడిపోని పువ్వు పూసింది మాత్రం అరేబియా ఎడారిలోనే! శతాబ్దాలుగా ఉర్దూ – పారసీ కవుల గుండె కింది తడిని జీరగొంతుతో వినిపిస్తూ ప్రజల హృదయాలను పరవశింపజేస్తున్న గజల్ ప్రపంచ కవితా వినీలాకాశంలో ఒక వెన్నెల పుష్పం. ఎందరో భాషా ప్రేమికుల్ని కూడా తన కవిత్వ ఇంద్రజాలంతో రసలోకంలో ఓలలాడిస్తోన్న ‘‘గజల్’’ అరబ్బీ, పారసీ భాషల్లోని సంప్రదాయాల సమ్మిళితమై 11వ శతాబ్దం నాటికి ఇప్పుడున్న రూపాన్ని సంతరించుకుంది. అరబీలో ఆవిర్భవించి, రూపుదిద్దుకుని పార్సిలో పరిపూర్ణతను పొందింది. గజల్ ఒక ప్రక్రియ అనడంకన్నా ఒక సంస్కృతి అనడం అతిశయోక్తి కాదు. ప్రస్తుతం ఉన్న గజల్ రూపానికి ఆద్యుడు కవి సాదీ. అరేబియా ఎడారిలో పనిచేసే కార్మికులు రాత్రివేళల్లో తమ నాయకుడిని స్తుతిస్తూ ‘‘కసీదా’’ను పాడేవారు. ఆ కసీదాను పాడబోయే ముందు రెండు వాక్యాలలో ప్రేమను, అనురాగాన్ని సూచిస్తూ పాడే అలవాటు ఉండేది. ఆ రెండు వాక్యాలే కాలక్రమేణా గజల్ ప్రక్రియకు నాంది పలికాయి. కాలక్రమంలో గజల్ కసీదా నుండి విడివడి ఒక ప్రత్యేకమైన కవితా ప్రక్రియ అయ్యింది. ‘‘గజల్’’ అనే పదానికి అరబ్బీభాషలో ‘‘రాగాలాపన’’ అనే అర్థం ఉన్నా ‘‘ప్రియురాలితో సల్లాపం’’ (మాషూ కాసే గుఫ్త్ గూ) అనే భావాన్ని వ్యక్తపరుస్తుంది. 20వ శతాబ్దంలో తెలుగుభాషలోకి ప్రవేశించి అనేక పరిశోధనలు, ప్రయోగాలతో ఎంతోమంది పాఠకుల, శ్రోతల మదిని దోచుకున్న గజల్ వివిధ సాహిత్యప్రక్రియల్లో గానయోగ్యమైన ప్రక్రియగా విలసిల్లి నేడు ప్రపంచవ్యాప్తం అయింది. ఇది తెలుగు సాహిత్యంలోకి 1963లో అడుగు పెట్టింది. అంత పెద్ద వృక్షాన్ని కడుపులో దాచుకున్న మర్రి విత్తనంలాగా గజల్ ఆకాశమంత భావాన్ని తనలో ఇముడ్చుకుంది. బ్రతికినన్నినాళ్ళు ప్రేమ క్షీరసాగరంలోనే మునిగి తేలి, ప్రేమపూరిత కవిత్వాన్నే రాసిన ‘‘గజ్జాల్’’ అనే కవి పేరుతోనే ‘గజల్’ అనే పేరు వచ్చిందని దాశరథి కృష్ణమాచార్య పేర్కొన్నారు. ‘శృంగార రసాత్మక సిసలైన భావ కవిత గజల్’ అని దాశరథి నిర్వచించినా, తెలుగుకవులు మాత్రం దానికి శృంగార రసానికి బదులు సామాజిక దృక్పథాన్ని అద్ది తెలుగు కవిత్వం ఎప్పుడూ ప్రజల వైపే నిలుచుంటుందని చెప్పకనే చెప్పారు. ప్రాథమికంగా గజల్ ‘షేర్’ ల కూర్పు. ఒక షేర్ అనేది 2 పాదాలను కలిగి ఉంటుంది. ఒక గజల్ 5,7,9 ఇలా ఎన్ని షేర్‌లైనా ఉండవచ్చు. కనీసం 5 షేర్‌లైనా ఉంటేనే అది గజల్ అవుతుంది. ఒక గజల్‌లోని అన్ని పాదాలు ఒకే తూగులో ఉండాలి. ఒక పాదం పెద్దదిగా, ఒక పాదం చిన్నదిగా ఉండకూడదు. గజల్ చివరి షేర్ లో కవి పేరు లేదా అతని కలం పేరు ఉండవచ్చు. ఇలా ఉండడాన్ని ‘తఖల్లుస్’ అంటారు. గజల్‌కు అతి ముఖ్యమైనవి ‘కాఫీయా’, ‘రదీఫ్’లు. కాఫీయా అంటే అర్థం ‘‘అంత్యానుప్రాస’’, రదీఫ్ అంటే ‘‘పునరావృతమయ్యే పదం’’. ఒక గజల్‌కి రదీఫ్ లేకుండా ఉండవచ్చు, కానీ కాఫీయా లేనిది గజల్ కాదు. గజల్‌కు శీర్షికలు ఉండవు. కావ్యరచన అనువాదంగా మొదలైనట్టుగానే గజల్ రచన కూడా తెలుగులో అనువాదంతోనే మొదలైంది. ‘‘వలపునై నీ హృదయ సీమలో నిలువవలెనని ఉన్నది పిలుపునై నీ అధర వీథుల పలుకవలెనని ఉన్నది’’ 1965లో వచ్చిన తొలి తెలుగు గజల్‌లోని మక్తా ఇది. ఏప్రిల్ 14, 1965 ఆంధ్రప్రభ సచిత్ర వారపత్రిక లో ‘‘ఉగాది గజల్’’ అనే శీర్షికతో అచ్చయింది. ఇందులో ‘ఉన్నది’ అనేది ‘రదీఫ్’ అయితే, ‘నిలువవలె’, ‘పలుకవలె’ పదాలలోని ‘ఎ’ అనే అచ్చు ‘కాఫియా’. తొలి తెలుగు గజల్ కవి దాశరథి స్వీయ గజళ్ళను రాయడానికి ముందు ‘‘ఖుదాయే గజల్’’ అయిన ‘గాలిబ్’ గజళ్ళను తెలుగులోకి అనువదించారు. 1961లో అవి ‘‘గాలిబ్ గీతాలు’’ పేరిట ఒక సంకలనంగా వెలువడ్డాయి. ఇవే కాక ‘‘మీర్ తకీ మీర్’’ గజళ్ళలోని కొన్ని షేర్లను తెలుగులోకి అనువదించారు. ‘‘రమ్మంటే చాలు కానీ రాజ్యాలు విడిచి రానా నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచి రానా!’’ అనే పేరుతో మొదలయ్యే 5 షేర్‌ల గజల్ 1984లో ‘‘జ్వాలా లేఖిని’’ అనే సంపుటిలోనిది. తొలి తెలుగు గజల్ వాగ్గేయకారులు పి.బి. శ్రీనివాస్. వారు స్వయంగా రాసి, స్వరపరిచి పాడిన గజల్?
‘‘కల్పనలు సన్నాయి ఊదే వేళ చింతలు దేనికి?
కవితలనె అర్పించు కానుక లోక కల్యాణానికి’’ ఇది 1978లో ఆకాశవాణి కడప కేంద్రం నుండి ప్రసారం అయింది.
1967లో దాశరథి రాసిన ‘‘అధరాల వీధిలోన మధుశాల లున్నదాన’’ అనే గజల్ ఈమని శంకరశాస్త్రి సంగీతంలో పి.బి. శ్రీనివాస్ పాడారు. ఈ గజల్‌ను కొలంబియా రికార్డ్స్ వారు విడుదల చేశారు. తెలుగువారందరూ గర్వించదగ్గ విషయం ప్రపంచంలోనే 8 భాషలలో గజళ్ళను రాసిన ఏకైక వ్యక్తి పి.బి. శ్రీనివాస్. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, హిందీ, సంస్కృతం, ఆంగ్లం, ఉర్దూ భాషలలో గజళ్ళను రాశారు. తమిళం, కన్నడ, మలయాళం భాషలలో వారే తొలి గజల్ రాసినట్లు తెలుస్తోంది.
1997లో విడుదలైన ‘ప్రణవం’ అనే తమ అష్టభాషా కవితాసంకలనంలో వివిధ భాషల గజళ్ళను పొందుపరిచారు. పి.బి.శ్రీనివాస్ తెలుగు గజల్‌కు ‘‘వల్లరి’’ అనే పేరు పెట్టారు. వారు ఆ పేరుతోనే తమ తెలుగుగజల్ లను ప్రచురించారు. తొలి తెలుగు గజల్ రికార్డ్ వల్లరి పేరుతోనే విడుదలైంది.
తెలుగులో గజల్‌ను ప్రాచుర్యంలోకి తీసుకువచ్చిన కవి సి.నా.రె. వీరి వల్ల తెలుగు సాహిత్యంలో గజళ్ళకు ఊపు వచ్చింది.
‘‘పరుల కోసం పాటుపడని నరుల బ్రతుకు దేనికని!
మూగ నేలకు నీరందివ్వని వాగు పరుగు దేనికని!
……………………………………………………….
శిశు హృదయానికి కల్లలు లేవు రస రాజ్యానికి ఎల్లలు లేవు
లోపలి నలుపు ‘సినారె’ కు తెలుసు పై పై తొడుగు దేనికని!
ఇందులో ‘దేనికని’ అనే పదం రదీఫ్, బ్రతుకు, పరుగు పదాల్లోని ‘ఉ’ అనే అచ్చు కాఫియా. ‘సినారె’ అనేది ‘తఖల్లుస్’.
1979లో వచ్చిన ఎన్టీరామారావు చిత్రం ‘‘అక్బర్ సలీం అనార్కలి’’ అనే తెలుగు చిత్రంలో సినారె రాసిన గజల్ – ‘‘తానే మేలిముసుగు తీసి ఒక జవ్వని పువ్వులా గా నవ్వుతుంటే ఏం చేయను’’ అనే గజల్ సంగీత సాహిత్య పరంగా ఒక చక్కటి గజల్.
1983లో ‘‘చిరునవ్వు పలికించే స్వర కల్పనలెన్నో, హృదయాలను ఒలికించే మృదు చిత్రణలెన్నో’’ అనే షేర్‌తో మొదలయ్యే సినారె గజల్‌ను ఎం.చిత్తరంజన్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి స్వీయ సంగీత సారథ్యంలో పాడి ప్రసారం చేశారు.
‘‘ఎదురుగా క్షీర సముద్రాలున్నా, హృదయానికి దాహం
కరిగే తొలకరి మేఘాలున్నా గగనానికి దాహం’’ – సినారె
తొలి తెలుగు గాయని పి.సుశీల 1986లో విడుదలైన ‘‘సంసారం ఓ సంగీతం’’ అనే చలనచిత్రంలో పుహళేంది సంగీతంలో ‘‘ఇందరు మనుషులు దేవతలైతే, ఎందుకు వేరే కోవెలలు’’ అన్న సినారె గజల్‌ను ఆమె పాడారు. గాయని శొంఠి పద్మజ 1989లో సినారె గజల్‌ను హైదరాబాద్ దూరదర్శన్ కేంద్రం కోసం పాడారు.
‘‘కొంతకాలమిటులే యేకాంతమ్మున మేలుకొందు
కనురెప్పల కశ్రువులను కావలిగా నిల్పుకొందు’’ అనే మొదలయ్యే రచన రెండవ తెలుగు గజల్. ఇది 1965 డిసెంబర్‌లో విడుదలైన ‘‘అక్షరాల గవాక్షాల’’ సంపుటిలో ‘‘జాగృతుడు’’ శీర్షికతో అయింది.
పి.బి.శ్రీనివాస్, ఏ.సి. వెంకటాచలం, మహమ్మద్ రఫీ, ఎం. చిత్తరంజన్, సినారె ప్రభృతులు తర్వాత గజల్ గానాన్ని చేపట్టింది కేశిరాజు శ్రీనివాస్. గజల్ శ్రీనివాస్‌గా మనమందరము ఎరిగిన వీరు తమ గానంతో తెలుగుగజల్‌ను ప్రచారం చేసారు. ఇతర భాషలతో ఉన్న గజల్ గానానికి భిన్నంగా గజల్ శ్రీనివాస్ మన తెలుగు హరికథ గాన విధానాన్ని తోడు తీసుకుని జానపద ధోరణిలో సాగే గానంతో తెలుగు గజల్ జనరంజకం చేశారు.
1972లో వల్లపురెడ్డి బుచ్చారెడ్డి వంటి కొందరు ఉర్దూ కవుల గజల్‌ల షేర్‌లను తెలుగులోకి అనువదించారు. అవి ‘‘ముక్త గీతికలు’’, ‘‘మధు గీత’’ పేర్లతో వెలువడ్డాయి. 2013లో రామచందర్ దీకొండ కొన్ని గాలిబ్ గజల్ పేర్లను తెలుగులోకి అనువదించి ‘‘గాలిబ్ కవితా కౌముది’’ పేరిట ప్రకటించారు. పి.బి.శ్రీనివాస్ హిందుస్థానీ, రోచిష్మాన్ ఆంగ్లంలో కూడా గజళ్ళను రాశారు. దక్షిణాఫ్రికాలోని పోయెట్రీ మూమెంట్ వారు రోచిష్మాన్ రాసిన ఇంగ్లీష్ గజల్‌ను 2016లో ఒక సంకలనంలో ప్రచురించి దానికి భారతీయ వనిత భరతనాట్యం చేస్తున్నట్టు బొమ్మ వేశారు.
2012 డిసెంబర్లో 28న తిరుపతిలో ప్రపంచ మహాసభల సందర్భంగా ‘‘తొలి తెలుగు గజల్ ముషాయిరా’’ జరిగింది. తెలుగు గజల్ పై వచ్చిన తొలి పరిశోధన ‘‘తెలుగులో గజల్ ప్రక్రియ- సమగ్ర పరిశీలన’’ 2001 లో పిహెచ్.డి అవార్డు పొందింది. ఆచార్య తంగెడ కిషన్ రావు గారి పర్యవేక్షణలో ఉస్మానియా తెలుగు శాఖలో డా.పత్తిపాక మోహన్ ఈ పరిశోధన చేసారు.
ఇలా ఐదున్నర దశాబ్దాల క్రితం తెలుగులోకి అడుగుపెట్టిన ఈ కవితా ప్రక్రియలో ప్రస్తుతం వందలమంది కవులు తమ రచనా కళని ప్రదర్శిస్తున్నారు. ఆ కళ కేవలం కాగితానికో, గాత్రానికో పరిమితం కాకుండా ఆధునికతను సంతరించుకుంది. అందరికీ అందుబాటులో ఉండేందుకు, అందరి మనస్సును కూర్చున్నచోట నుండే తనవైపు ఆకర్షించేందుకు సామాజిక వేదికను అలంకరించింది.
సామాజిక వేదికలకు ఆధారభూతమైన సాంకేతిక పరిజ్ఞానం ఎంతలా అభివృద్ధి చెందింది అంటే అరచేతుల్లో ప్రపంచంగా మారిపోయింది. ప్రపంచంలోని ఏ మూలన ఏం జరిగినా కొన్ని క్షణాల్లోనే ప్రపంచమంతా తెలిసిపోయేలా చేసే సత్వర సమాచార ప్రసార సాధనాలే సామాజిక మాధ్యమాలు. విద్య, వినోదం, రాజకీయం, వైద్యం, సంస్కృతి, సాహిత్యం ఇలా ప్రతిదీ మనం మాధ్యమాల ద్వారా తెలుసుకుంటున్నాం. ఆర్క్యుట్, ఫేస్ బుక్, బ్లాగులు, యూట్యూబ్, గూగుల్, వాట్సాప్, ఇంస్టాగ్రామ్ వంటివి కొన్ని సామాజిక మాధ్యమాలకు ఉదాహరణలు. ఆధునిక సమాచార, సాంకేతిక విప్లవాల ప్రభావంతో సామాజిక మాధ్యమాలలో ఊహించని మార్పు సంభవించింది. సాధారణంగా సామాజిక మాధ్యమాలలో మునిగి యువత తమ అమూల్యమైన సమయాన్ని వృథాగా గడుపుతున్నారు. ఇది కొంత మేరకు నిజం. అయితే ఇవే మాధ్యమాలు జనజాగృతికి, అవగాహనా వ్యాప్తికి, నిరసనకారుల సమీకరణకు, ఉద్యమాల నిర్వహణకు, అన్యాయాలను ఎదుర్కొని ప్రశ్నించడానికి ఆయుధాలుగా ఉపయోగపడతాయి. అటువంటి సామాజిక మాధ్యమాలు సమాజానికి ప్రతిబింబం అయిన సాహితీ విహంగ వీక్షణానికి వినూత్నరీతిలో ప్రధాన ఆకరాలు అవుతున్నాయి అనేది నిర్వివాదాంశం. సామాజిక మాధ్యమాలు సాహిత్యాభివృద్ధిలో కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఒకప్పుడు సాహిత్యం అనేది ప్రజలకు చేరడానికి ఎంతో సమయం పట్టేది. కానీ నేడు సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి వలన సాహిత్యం ప్రజలందరికీ కొన్ని క్షణాల్లోనే చేరిపోతుంది. కరోనా మహమ్మారి కారణంగా ప్రపంచం స్తంభించి పోయింది. ఆ 12 నెలల కాలంలో సామాజిక మాధ్యమాలు సాహిత్య వ్యాప్తికి ఎంతో దోహదపడ్డాయి. కరోనా కారణంగా ప్రజలు పడుతున్న బాధలను కష్టాలను కవితల రూపంలో, పాటల రూపంలో ప్రజల యొక్క పరిస్థితులను ప్రతిబింబించేలా రచనలు చేసారు. వార్తాపత్రికల ద్వారా, వాట్సాప్ గ్రూప్ ద్వారా, టెలివిజన్, రేడియో, యూట్యూబ్ మాధ్యమాల ద్వారా పాఠకుల మరియు శ్రోతల హృదయాలను కదిలేలా రచనలు చేశారు. ఎంతోమంది యువత మాధ్యమాల ద్వారా సాహిత్యం పట్ల స్ఫూర్తిని పొందారు. నూతన కవులు, రచయితలు ప్రపంచానికి పరిచయం అయ్యేలా చేసాయి మాధ్యమాలు.
అభివృద్ధి చెందుతున్న సాంకేతికతతో ఇప్పటికే కాగితం వాడకాన్ని చాలావరకు తగ్గిస్తున్నారు. ఇకముందు పుస్తక ముద్రణ ఉండబోదేమో అనే సందేహమూ కలగక మానదు. ఒకవేళ ఉన్నా చాలా తక్కువగా వాటి ప్రభావం ఉంటుంది. అలాంటి సందర్భాలలో సాహిత్య వ్యాప్తికి అభివృద్ధికి సామాజిక మాధ్యమాల వారధులుగా నిలుస్తాయి. సామాజిక మాధ్యమాలు లేని సమయంలో ఎంతోమంది కవులు వారి రచనలు ప్రపంచానికి పరిచయం కాకుండానే కనుమరుగయ్యారు అనేది వాస్తవం. కానీ నేడు అలాంటి పరిస్థితులు లేవు. నేటి సామాజిక మాధ్యమాలలో ఒక్క శక్తివంతమైన వాక్యం రాసినా అతనిని సాహిత్య లోకానికి పరిచయం చేస్తుంది. అప్పటివరకు అపరిచిత వ్యక్తిగా ఉన్న అతను ప్రజలందరికీ సుపరిచితుడుగా మారిపోతాడు. ఇదే సామాజిక మాధ్యమాలకు ఉన్న శక్తి.
మరుగున పడే పరిస్థితి సాహిత్యానికి రాకుండా మాధ్యమాలు కీలకపాత్ర పోషించాయి అనడంలో అతిశయోక్తి లేదు. ఒక కవి చేసిన రచన ద్వారా అతని ఉద్దేశ్యం ప్రజలకు చేరాలి. అది సామాజిక మాధ్యమాల ద్వారా చురుకుగా అందుతుంది. పాఠకులు ఆ కవి ఉద్దేశ్యాన్ని తిరస్కరించడం లేదా ఆమోదించడం జరుగుతుంది. ప్రజల యొక్క స్పందనను కవి కూడా తెలుసుకునే అవకాశం మాధ్యమాల ద్వారా సులభంగా జరుగుతుంది. అదే కవి తన రచనలను కేవలం పుస్తక ముద్రణకే పరిమితం చేస్తే, ఆ కవి ప్రజల స్పందనను తెలుసుకోలేడు. మాధ్యమాలలో ప్రసారమయ్యే సమాచారం ఎప్పటికైనా, ఎంతకాలమైనా నిలిచి ఉంటుంది. ఒకప్పటి కవులు చేసిన రచనలు మనకు, మన ముందు తరాలకు అందుబాటులో ఉండేలా దోహదం చేసేవి ఈ సామాజిక మాధ్యమాలు మాత్రమే.
సామాజిక మాధ్యమాల వేదికనెక్కిన గజల్ తన గొంతును గట్టిగానే వినిపించింది. జనం జీవితంలోకి అంతర్జాలం ప్రవేశించాక, సాహిత్యం అంతర్జాలంలోను చోటుచేసుకున్నాక తెలుగు గజల్ కూడా అంతర్జాలంలోకి వచ్చింది. 2002లో ‘‘వెబ్ ప్రపంచం.కాం’’ అనే అంతర్జాల పత్రికలో రాసిన గజల్ అంతర్జాలంలో వచ్చిన ‘తొలి తెలుగు గజల్’ గా నమోదయింది. ‘‘నవ్వుతూ నువ్వు ఉండిపోతే నాకు తోడయ్యి ఓ ప్రియా! ఉండిపోదా సౌఖ్యమతా నాకు ప్రేమయి ఓ ప్రియా!’’ అంటూ చిరునవ్వుతో అంతర్జాలన్ని పలకరించింది.
ఫేస్ బుక్ : ఫేస్ బుక్ ను 2004లో ప్రారంభించారు. ఇది ప్రతి ఒక్క సామాన్యుడికి తెలిసిన సామాజిక మాధ్యమం ఇందులో వ్యక్తిగత విషయాలు మిత్రులతో పంచుకోవచ్చు. ఫోటోలు, వీడియోలు, సమాచారాన్ని ఇతరులతో పంచుకోవచ్చు. మన ఆలోచనలను, సలహాలను, అభిప్రాయాలను ఇతరులకు తెలియజేయవచ్చు. ఒక గ్రూపుగా ఏర్పడి చర్చలు సమావేశాలు నిర్వహించవచ్చు. దాదాపు 460 కోట్లమంది దీనిని ఉపయోగిస్తున్నారు. ‘‘కువైట్ యన్ ఆర్ ఐ’’ అనే ఫేస్‌బుక్ పేజీని మన విదేశీ భారతీయులు కలసి ఏర్పాటుచేశారు. ఎల్లలు దాటినా మన మాతృభాషకి ప్రాధాన్యం ఇస్తూ తెలుగులో గజళ్ళను రాయడం అనేది తెలుగువారందరం గర్వించాల్సిన విషయం.
ఫేస్‌బుక్ మాధ్యమంలో ‘‘గజల్ లోగిలి’’ పేరుతో ఒక బృందం తెలుగు గజళ్ళ కోసం మొదలైంది. ఇదే మాధ్యమంలో ‘‘గజల్ సాహిత్యవేదిక’’ పేరిట ఒక పేజీని /గ్రూపుని ఏర్పరిచి, దాదాపు 240 మంది సభ్యులు ఒక బృందంగా ఏర్పడినారు. వారిలో ఉన్న కవిని మేల్కొలిపి అనేక గజళ్ళను రచించారు. ఇప్పటివరకు ఈ పేజిలో 230 గజళ్ళు పోస్ట్ చేయబడ్డాయి. అందులో ఒకటి
‘‘అక్షరాలలో ముత్యాలు…..మెరియునట్టి భాష తెలుగు
పదాలలో తేనియలు….. కురియునట్టి భాష తెలుగు
………………………………………………………
పద్యము అవధానము….. ఏ భాషా సాహిత్యమున లేవు
ఓ దేవా ఈ రెండు వరాలను … పొందినట్టి భాష తెలుగు.’’ -బూర దేవానందం
అంతేకాకుండా వీరు ‘‘గజల్ ముషాయిరా’’ అనే కార్యక్రమం పేరిట జూమ్ మీటింగులు ఏర్పాటు చేశారు. తెలుగులోని గజళ్ళను, తెలుగు గజల్ కవులను, గాయకులను సాహితీప్రియులకు పరిచయం చేయడానికి గజల్ సాహిత్య గౌరవాన్ని పెంచడానికి వీరు ‘‘హైదరాబాద్ బుక్ ఫేయిర్’’ లో తెలుగు గజల్ సాహిత్యానికి తొలిసారిగా ప్రత్యేకంగా ఒక స్టాల్‌ను ఏర్పాటు చేయడం అభినందించదగిన విషయం. ఇరివింటి శర్మ ఇందులో ప్రధానపాత్ర వహించారు. గడ్డం శ్యామల తదితరులు ముందు నిలిచారు.
తానా ప్రపంచ సాహిత్య వేదిక ఆధ్వర్యంలో ‘‘నెల నెలా తెలుగు వెలుగు’’ కార్యక్రమం పేరిట ‘‘తెలుగు సాహిత్యంలో గజళ్ళ స్థానం’’ అనే శీర్షికతో ప్రతి నెల ఆఖరి ఆదివారం అంతర్జాతీయ దృశ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సమావేశానికి సాహిత్య వేదిక సభ్యులు పాలుపంచుకోవడం అభినందించదగిన విషయం.
‘‘పచ్చదనాన్ని ప్రాణవాయువును బహుమతిగా నీకిస్తే నేస్తం
ఎరుగని పచ్చని బ్రతుకుల్లో నిప్పులు పోసావు నేస్తం
…………………………………………………………
కూలిన ఈ దేహం నుండి గూడును కట్టే కలపను ఇచ్చామే
నీ ఆఖరి మజిలీ దాకను నేవస్తే దహనం చేశావు నేస్తం
తరువులమైనను గాని ‘మూర్తీ’ పరువుగా మేము జగతిని బ్రతికామే
ఊరికి ఉపకారులమే మేము ఉసురులు ఎలా తీశావు నేస్తం! – పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి
కొమర్రాజు ఫౌండేషన్ అనే సాహిత్య సామాజిక సాంస్కృతిక సంస్థ గడ్డం శ్యామల ఆధ్వర్యంలో ‘‘డాక్టర్ సినారె గజల్ అవార్డుల’’ ప్రదానోత్సవాన్ని గూగుల్ మీటింగ్ వేదికగా నిర్వహించి అవార్డులను ప్రదానం చేసారు.
‘‘కన్నులు కలుపుతూ మనసు తడిపితే ఎలా ఎలా
నదిగా పొంగుతూ మదినే కుదిరితే ఎలా ఎలా
చూపుల గాలం విసిరిన వైనం ఓహో
ఊపిరి దారం నిన్నే ఊపితే ఎలా ఎలా’’-కందిబండ విజయలక్ష్మి
మరో ఫేస్ బుక్ బృందం ‘‘తెలుగు గజల్ ఘుమ ఘుమలు’’ పేరిట దాదాపు 238 మంది ఒక టీమ్‌గా ఏర్పడి గజల్ పోటీలను నిర్వహిస్తున్నారు. దీన్ని గత ఐదు సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. అందులో ఒక కవి పాప గురించి రాసిన గజల్ ‘‘ఆడపిల్ల పుడితే చాలు మరో అమ్మ పుట్టినట్టే! అవనిపైన ఈ సృష్టికి మరో జన్మ వచ్చినట్టే! … బుట్ట గౌను పాపాయికి అలక నువ్వు తీరిస్తే ఒక్కసారి నవ్వేనంటే పూలకొమ్మ ఊగినట్టే!-సుబ్రహ్మణ్యశర్మ యూట్యూబు : పసికందులు అన్నం తినాలన్నా, ఏడుపు మాన్పించాలన్నా తల్లిదండ్రులు ఆయుధంగా ఉపయోగించే మాధ్యమం యూట్యూబ్. ఇందులో చిన్నపిల్లల గేయాల నుండి ఎన్నో రకాల వీడియోలు ఇందులో ఉంటాయి. సామాజిక అంశాలు, రాజకీయ అంశాలు, విద్యాపరమైన అంశాలు ఇలా ప్రతి ఒక్క విషయం పై ఇతరులకు మనం తెలియజేయవచ్చు. దీనివల్ల సంపాదన కూడా పొందవచ్చు. ఈ రోజుల్లో యూట్యూబ్ లేకుండా ఏ ఒక్క సెల్ ఫోన్ కూడా ఉండటం లేదు. కొన్ని కోట్లమంది దీన్ని వినియోగిస్తున్నారు. యూట్యూబ్‌లో ప్రముఖ కవులు రాసిన గజళ్ళు అందుబాటులో ఉన్నాయి. సినారె రాసిన వివిధ చిత్రాలలోని గజళ్ళు కూడా ఉన్నాయి. బ్లాగులు : ‘‘తెలుగు గజల్.వర్డ్ ప్రెస్.కాం’’ అనే బ్లాగ్‌ను గూగుల్ ద్వారా కొందరు గజల్ ప్రేమికులు ఏర్పాటు చేశారు. ఈ బ్లాగులను వారు గత కొన్ని సంవత్సరాలుగా కొనసాగిస్తున్నారు. తెలుగులో గజళ్ళ కవిత్వాన్ని ప్రోత్సహించడానికి, గజల్ కవితా ప్రక్రియ గురించి అవగాహన పెంచడానికి, తెలుగులో గజల్ కవితలపై చర్చా వేదికగా ఈ బ్లాగ్ ఏర్పడిరది. తెలుగు గజల్ రచయితల గజళ్ళను అందుబాటులో ఉంచడానికి ఏర్పడిన బ్లాగ్. వివిధ కవులు వారి యొక్క గజల్ ఈ బ్లాగులో పోస్ట్ చేయడం ద్వారా లేదా వారు రాసిన గజల్ ఆడియో లేదా వీడియో రూపంలో అందరితో పంచుకోవడం జరుగుతుంది. సందర్భాన్ని బట్టి అంశాన్ని ఎంపిక చేసి ఆ అంశంపై గజళ్ళ పోటీని నిర్వహిస్తూ ముందుకు సాగుతోంది.ఇటువంటి ఆరోగ్యకరమైన పోటీ ఎంతోమంది కవుల మధ్య జరుగుతూ వారిలోని కవి హృదయాన్ని, సృజనాత్మకతను మేల్కొల్పడం చాలా ఆనందించదగిన విషయం.ఈ బ్లాగులో పోస్ట్ అయిన వాటినుండి రెండు గజళ్ళు ‘‘చదువుల కోసం పరుగులు తీసే బాల్యం చూడు..! పంటల కోసం రైతులు చేసే సేద్యం చూడు..! ఏమని చెప్పుదు వేమన ఎవరో తెలియని వారికి… తియ్యగ చరిత్ర పుటలను మూల్గే పద్యం చూడు..! -మాధవరావు కొరుప్రోలు ‘‘నమ్మకమన్నది లేకుంటే మన బ్రతుకు వృథా నమ్మే ఒకమనసుంటే మన బతుకే ఒక కళ …. నిరాశతో అడిగేస్తే ఎప్పటికీ అపజయమే జయమనే విశ్వాసంతో సాగడమే ఒక కళ’’-భారతి కాట్రగడ్డ మాలిక : తెలుగు బ్లాగుల సంకలిని మరియు తెలుగు బ్లాగర్ల వేదిక’’ అనే బ్లాగ్‌లో తెలుగు గజల్ ప్రచురించబడిరది. ‘‘అభిలాషను అందుకునే కవితేమో దొరకలేదు ఎద బాసను పంచుకునే చెలిమేమో మనకు లేదు …వాలుతున్న ‘‘సంధ్య’’లలో మందారం పడమర లో విరాజిల్లే నీవులేక దివికేమో శోభ లేదు’’ సంధ్య సి.హెచ్.
‘‘అంతర్లోచన.వర్డ్ ప్రెస్.కామ్’’ అనే బ్లాగ్లో ‘‘తెలుగులో గజల్ సాహిత్యం’’ అనే శీర్షికతో గజల్ యొక్క చరిత్ర, దాని నియమాలు, గజల్ కవుల గురించి ఈ బ్లాగులో వివరించడం జరిగింది.
వాట్సాప్ : ‘‘తెలుగు గజళ్ళు-రుబాయీలు’’, ‘‘గజల్ సాహిత్య వేదిక’’ అనే వాట్సాప్ గ్రూప్ లు కూడా తెలుగులో గజళ్ళ అభివృద్ధికి దోహదపడుతున్నాయి.
ట్విట్టర్ : ప్రముఖ కవి గజల్ శ్రీనివాస్ ట్విట్టర్‌లో తన ఖాతా ద్వారా ఎన్నో గజళ్ళను ట్వీట్ చేశారు. సమాజంలోని పరిస్థితులకు అనుగుణంగా గజల్‌లను రాస్తూ అందరిని గజళ్ళ వైపు ఆకర్షింప జేస్తున్నారు. గజల్‌లు అంటే ఏమిటో తెలియని ఎంతోమందికి ఇలాంటి బ్లాగులు, పేజీలు, వాట్సాప్ గ్రూపులు, జూమ్ మీటింగ్‌లు నూతన కవులను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఎంతో దోహదపడుతున్నాయి. తెలుగు సాహిత్యాన్ని ఉన్నతంగా నిలబెట్టడంలో తనదైన పాత్రను పోషిస్తున్న గజల్ దాశరథి, సినారె లాంటి వారి చేతిలో కవితాత్మకతను సంతరించుకుని సత్యాన్ని సగర్వంగా సమాజానికి పంచేలా చేసింది. మనసులోని అంతర్మథనాన్ని కవిత్వీకరించి ప్రకటించాలనుకునే కవులకు గజల్ ఒక భావప్రకటనా మార్గం లాంటిది.
గజల్ సాహితీప్రక్రియా వ్యాప్తికి సామాజిక మాధ్యమాలు క్రియాశీలక పాత్రను పోషిస్తున్నాయనడం అతిశయోక్తి కాదు. ఇది ఒక శుభ పరిణామం కూడా! ఇప్పటికీ వందలాది మంది గజల్ కవులు ఇందులో ప్రతిరోజు రాస్తున్నారు. కొత్తతరం గజల్ వైపు ఆకర్షితులై రాయడం నిజంగా శుభ పరిణామమని, అయితే ఉర్దూ గజల్ లక్షణాలు పాటించినపుడు అది పండుతుందని పత్తిపాకమోహన్ అభిప్రాయం. అన్ని మాధ్యమాల్లో, పత్రికల్లో గజల్ ఆ దిశగా రావాలని కోరుకుందాం.
సంప్రదింపు గ్రంథాలు :
- తెలుగులో గజల్ ప్రక్రియ-సమగ్రపరిశీలన,డా. పత్తిపాక మోహన్, అముద్రిత పిహెచ్. డి. సిద్ధాంత వ్యాసం,2001,తెలుగుశాఖ,ఉస్మానియా విశ్వవిద్యాలయం.
- తెలుగు గజల్ (మోనోగ్రాఫ్)… డా. పెన్నా శివరామకృష్ణ, తెలుగు అకాడెమీ, 2017, ప్రపంచ తెలుగు మహాసభల ప్రచురణ.
- తెలుగు సినీ గీతాలలో సాహితీ మూల్యాలు (అముద్రితసిద్ధాంత వ్యాసం), డాక్టర్ టి గౌరీ శంకర్, 1984 ఉస్మానియా విశ్వవిద్యాలయం.
- తెలుగు కవిత లయాత్మకత, డాక్టర్ సి నారాయణ రెడ్డి, యువభారతి, 1995. ఆంధ్రసారస్వతపరిషత్ హైదరాబాద్
- 5.https://www.facebook.com/telugu.ghazal?mibextid=ZbWKwL
- 6.https://telugughazal.wordpress.com/
డా. కె.డి.డి. మృణాళిని
ఫోన్ : 9652241261