కట్టెల మండే

ఎండా కాలం రాగానే
నల్లగుట్టకు నడుముకు
సీరె సింపు నళ్ళు గట్టుకొని…?
మా సొంటి ఎండి పోయిన
బతుకుల కట్టెలకై పోదుము
గా నడిసే తొవ్వ పొంటి
ఒక్కొక్క కట్టే ఏరుకుంటా
మండే జేదుము
గా కట్టెల మోపైన కమాన
మా ముఖం పొద్దుపొడుపు
సూర్యుని లెక్క మెరుస్తుండేది
మాపటి సిట్టెండకు
సెమట వట్టి తొడుక్కున్న అంగీలు
గంజి బట్టిన తెల్లబట్ట లెక్క
బిగిసుకపోయేటివి
నలిగిన మా బతుకులకు
నల్లరోడ్‌ గూడ కమిలేట్టు
సురుకులు బెట్టేది
గప్పుడు మోదుగు ఆకులే రచ్చ
కట్టెలకు సెక్కర్లు కొట్టి
అలసిపోయిన పెయ్యికి
ఒర్రె సెలిమేల నాలుగు దొసిల్ల నీళ్లు
తాగితే గా సల్లటి, కమ్మటి రుసికి
యాట్టంతా చిటికెలో మాయమౌ
సుట్టవట్ట బెట్టుకొని తోక
మోపులు పెట్టుకొని ఒకరిగొకరం
సాయం జేసుకొని
యుద్ధం గెలిచిన వీరుని లెక్క
ఇండ్ల దిక్కు జాడ వడుదుము
మాడ కాకేక్కి దగడు అచ్చినప్పుడు,
బరువైనప్పుడల్లా దారి పొన్న
సెట్టు వార జూసి
దానికి పొడువుగా మోపును ఆనిచ్చి
గొంత దమ్ము దీసుకుందుము
గా మోపు జూసినంక
రెండు తరాలను మోసిన
మా నానవ్వ మా నాయినే,
నా బంగారమే అని మెచ్చుకుంటూ…
మీ తాత లెక్కనే పని
నేర్సినవని సంబరవడేది
నేను దేచ్చిన కట్టెలను
ఇర్సుకుంట పొయ్యిలో పెడుతుంటే
బువ్వ కుతకుత మంటుంటే
నా భవిష్యత్తు ఎట్లుంటదో
అనే ఆలోచనలో గిర్రునా
మా అవ్వ కండ్లల్లకెల్లి
ఎసరు పొంగుతూ అచ్చేది
గిప్పుడు పొయ్యి ఊదుడు లేదు
ఆయిటికి ముందే తెచ్చుకునే
కట్టెల మండేలు లేవు
గీ సిలిండర్‌ పొయ్యి అచ్చినంక
కట్టెల మోపులు కరువయ్యాయి
ఈ సుఖం జూసేతందుకు
కన్నవారు కానరావట్లేదు.

సాహిత్య మణి
ఫోన్‌ : 97041 18352

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *