క్రోధి యుగాది


శ్రీమన్మంగళ క్రోధి వత్సరమును సు శ్రేయంబులన్గూర్చుగా
కామాక్షీ కరుణా కటాక్షములతో కాలమ్ము సవ్యంబునై
భూమిన్మెండుగ పాడి పంటలమరున్‌ పొంగంగ జీవాంబువుల్‌
శ్యామాలంకృతమైన సస్యముతో సమృద్ధమౌ నేలలే!


భూమికి రాజు భూ సుతుడు, పొందెనుగా మరి రెండు శాఖలన్‌
స్వామికి యుద్ధమన్న కడు సంతసమౌ గతి యెట్టులున్నదో?!
తామసుడయ్యె మంత్రి మరి దక్కెను మూడు ప్రధాన శాఖలే
సోమరులౌదురేమొ ప్రజ సూర్యకుమారుని పాలనమ్ములో!


గురువు రసాధిపత్యమును గొప్పగ పట్టెను మేలు మేలనన్‌
సరియగు వానలంది పలు సస్యములెల్లడ విస్తరించులే
సరుకులు వెండి కాంచనము చక్కెర వస్త్రములందుబాటులో
దొరకు నిదే ప్రసాదమని తోరపు సంతసమందరే జనుల్‌.


శిశిరమ్మందున శుష్క పత్రములనే చెట్లెట్లు వర్జించునో
కృశియించంగ నసాధ్యమైన తలపుల్‌ కీడంచు వర్జించగా
వశమౌ నూత్న వసంత పల్లవుములే భాసించు నవ్యత్వమే
విశదమ్మౌనిట నూతనత్వమనగా వైజ్ఞానికామోదమే


ఎక్కడ దాగె పికమ్ముల?
వెక్కడ దాగెను కిసలము లీ తరువులలో!
మెక్కియు మధుమాసమ్మున
స్రొక్కగ కూసెదవుగాదె శుభములు కలుగన్‌


శోభకృతునకు సెలవని
ప్రాభవముగ సాగనంపి పంచాంగముగా
వైభవమగు శ్రీ క్రోధిని
లాభక్షేమములు కోరి రమ్మని పిలుతున్‌!


పద్య సుమములెన్నొ పరచి యాహ్వానించి
నూత్న వత్సరమును నుతుల జేసి
సకల జీవ శాంతి సౌఖ్యమభిలషించు
కవుల కంజలింతు గరిమతోడ
పూర్వ సస్యాధిపతి శశిమోదమలర
పండ్లు, పంటల నీ యేడు పరిఢవిల్ల
వృక్షజాతులనెంతయో వృద్ధి సేయు
నమృత వర్షము కురిపించు హర్షమలర
స్వస్తి పలికెద కవిరాజ సహృదయులకు
స్వస్తి పలికెద సుజన సుభాషితులకు
స్వస్తి పలికెద శాస్త్ర విశ్వాసులకును

కటకం వెంకట రామ శర్మ
హైదరాబాద్‌. ఫోన్‌ : 94404 72321

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *